Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మన భారత అవని-8

[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[శ్రీరామ్, గంగ విమానంలో చైన్నై చేరుతారు. అక్కడ్నించి మరో విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. శ్రీరామ్ మిత్రుడు దినకర్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి వాళ్ళని తమ ఇంటికి తీసుకువెళ్తాడు. దినకర్ భార్య స్వప్న, కొడుకు సుందర్‍లకు శ్రీరామ్‌ను, గంగను పరిచయం చేస్తాడు. స్నానం చేసి భోజనాలు తిని, తన లండన్ జీవితానుభవాలను దినకర్‍కు, స్వప్నకు వివరిస్తాడు. రోజ్ మరణవార్త విని వారు బాధపడతారు. భవిష్యత్తు ప్రణాళికలు ఏంటని దినకర్ అడిగితే, విద్యాసంస్థలు స్థాపించి, భావి భారత పౌరులకు చక్కని విద్యని అందిస్తానని చెప్తాడు శ్రీరామ్. మర్నాడు ఉదయం బయటకు రాగానే శ్రీరామ్ తమ్ముడు చలపతి ఎదురవుతాడు. అన్నని, గంగని ఆప్యాయంగా పలకరిస్తాడు. మర్నాడు, మహేంద్రా కారులో వైజాగ్ నుంచి నెల్లూరు బయల్దేరుతారు చలపతి, శ్రీరామ్, గంగ. సాయంత్రం ఐదు గంటలకు కావలి చేరుకుంటారు. కావలి నుంచి నెల్లూరు వెళ్ళే దారిలో ఒక కారు ఆగిపోయి కనబడుతుంది, దాని పక్కన ఓ స్త్రీ నిలబడి ఉంటుంది. ఆమెకు సాయం చేయాలనే ఉద్దేశంతో కారుని పక్కకి ఆపి ఆమె దగ్గరకు వెళ్తాడు శ్రీరామ్. ఆమె ఒకప్పటి తన కాలేజ్ మేట్ వసంత అని గుర్తిస్తాడు. వసంత కూడా శ్రీరామ్‌ని గుర్తుపడుతుంది. పలకరింపులు అయ్యాకా, ఎక్కడికి వెళ్తున్నావని ఆమెని అడిగి తెలుసుకుని, తానూ నెల్లూరు వెళ్తున్నానని, తాను దింపుతానని చెప్తాడు. ఆమె కారుని బాగు చేయించుకుని రమ్మని తన డ్రైవర్‌కి చెప్పి, శ్రీరామ్ కారెక్కుతుంది. ఆమెకు తన తమ్ముడిని, కూతురుని పరిచయం చేస్తాడు. ఆమె గురించి అడిగితే, తాను వైజా‌గ్‌లో రాజమహేంద్ర డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేసున్నానని, తనకి పెళ్ళి కాలేదని, బంధువుల అమ్మాయి పెళ్ళికి నెల్లూరు వస్తున్నానని చెబుతుంది వసంత. ఆమెని ఆత్మకూరు బస్టాండ్ వద్ద దించి, కారుని బుచ్చిరెడ్డిపాళెం వైపు పోనిస్తాడు శ్రీరామ్. – ఇక చదవండి.]

అధ్యాయం-9

సాయంత్రం ఆరుగంటలకు శ్రీరామ్ కారు వారి ఇంటి కారు పోర్టికోలో ఆగింది.

ఆ సమయంలో శ్రీరామ్ బావ ఆనందరాయుడు; అక్క శాంతి కూతురు భారతి ఇంట్లో లేరు. ఇంట్లో వున్నది శాంతి, కొడుకు నరసింహరాయుడు అతని భార్య కవిత.

కారు హారన్ వినగానే ఆ ముగ్గురూ వరండాలోనికి వచ్చారు.

చలపతి మహా సంతోషంగా కారు నుండి దిగి..

“అక్కా!.. ఎవరొచ్చారో చూడు! ..” అన్నాడు.

శ్రీరామ్ కారు నుండి దిగాడు. గంగ దిగి తండ్రి ప్రక్కన నిలబడి వరండాలోని వారినంతా చూచి.. “నాన్నా!.. వీరంతా..” మెల్లగా పలికి ఆగిపోయింది.

“మన వాళ్ళే తల్లీ!..”

“అన్నయ్యా రా!..” శ్రీరామ్ చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు చలపతి.

సగం నెరసి, సగం నెరవని జుట్టుతో శాంతి, తమ్ముణ్ణి చూచి ఆశ్చర్యంతో నిలబడిపోయింది.

శ్రీరామ్, గంగ, చలపతి, శాంతిని సమీపించారు.

“అక్కా!.. నా అన్నయ్య..” చిరునవ్వుతో చెప్పాడు చలపతి.

శాంతి శ్రీరామ్ ముఖంలోకి పరిశీలనగా చూచింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు..

“అక్కా!..” ప్రీతిగా పిలిచాడు శ్రీరామ్.

గంగ వారిరువురి ముఖాలని మార్చి మార్చి చూచింది.

“రామా!..” బొంగురుపోయిన కంఠంతో పలికింది శాంతి.

శ్రీరామ్ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొన్నాడు. “బాగున్నావా అక్కా!..” ప్రీతిగా పలకరించాడు.

ఏడుస్తూ శాంతి శ్రీరామ్ ఛాతిని తన తలతో తాకింది.

శ్రీరామ్ మనస్సున ఆవేదన కళ్ళు మూసుకొన్నాడు.

“ఈ జన్మలో నిన్ను చూస్తాననుకోలేదురా!..” గద్గద స్వరంతో పలికింది శాంతి. ఆమె భుజాలను పట్టుకొని తలను పైకి లేపి ఆమె కళ్ళల్లోకి చూచాడు శ్రీరామ్.

ఆమె కళ్ళనుండి కన్నీరు చెక్కిళ్ళపైకి దిగజారాయి.

తన చేతి రుమాలుతో అక్క శాంతి కన్నీటిని తుడిచాడు శ్రీరామ్.

“మన రక్త సంబంధం నన్ను మన భారత్‌కు లాక్కొని వచ్చింది అక్కా!..” చిరునవ్వుతో చెప్పాడు. శ్రీరామ్.

“అక్కా!..” అన్నాడు చలపతి.

“ఏందిరా!..

“తమ్ముణ్ణి చూచుకొంటూ మరో అతి ముఖ్యమైన వారిని నీవు గమనించనే లేదు. ఈమె పేరు గంగ. అన్నయ్య కూతురు” నవ్వుతూ చెప్పాడు చలపతి.

క్షణం తర్వాత..

“అమ్మా గంగా!.. ఈమె మీ నాన్నగారి అక్క. నీకు అత్తయ్యరా..” అన్నాడు.

“అత్తయ్యా!.. నమస్కారం” చేతులు జోడించింది గంగ నవ్వుతూ.

శాంతి గంగను దగ్గరకు తీసుకొంది. కొన్ని నిముషాలు ఆమె ముఖాన్ని పరీక్షగా చూచింది.

“అంతా ఈమె మన తల్లి పోలికరా!..” ఆనందంగా నవ్వుతూ అంది. నొసటన ముద్దు పెట్టుకొంది శాంతి.

నరసింహరాయుడు అతని భార్య కవిత జరుగుతున్న సన్నివేశాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు.

“రామ్!.. నీ అల్లుడు నరసింహరాయుడు. వాడి భార్య కవిత” ఆ ఇరువురినీ పరిచయం చేసింది శాంతి.

“నమస్తే మామయ్యా!..” నవ్వుతూ చేతులు జోడించాడు నరసింహరాయుడు. “అత్తయ్యా!.. వారు నాకు ఏమౌతారు?” అడిగింది కవిత.

“నీకు బాబాయ్ అవుతాడే!..” నవ్వుతూ చెప్పింది శాంతి.

“బాబాయ్ గారు!.. నమస్కారాలు” చేతులు జోడించింది కవిత.

“నాన్నా!.. వారు నాకు ఏమౌతారు?” అడిగింది గంగ.

“అమ్మడూ!.. వారు నీకు అక్కా, బావా అవుతారు తల్లీ!..” నవ్వుతూ చెప్పాడు చలపతి.

క్షణం తర్వాత..

“ఆఁ.. ఇక పదండి లోపలికి” అన్నాడు నవ్వుతూ చలపతి.

అందరూ ఇంట్లోకి ప్రవేశించారు.

“రామ్!..”

“అక్కా!..”

“ముందు మీరు స్నానాలు చెయ్యండి. ప్రయాణ బడలిక తీరుతుంది. భోజనం చేసి అన్ని విషయాలు మాట్లాడుకుందాం” అంది శాంతి.

“అలాగే అక్కా!..”

“అత్తయ్యా..”“

“ఏం తల్లీ!..”

“నేనూ స్నానం చెయ్యాలి!” అంది గంగ.

“గంగా!.. రా స్నానం చేద్దువుగాని” గంగ చేతిని తన చేతిలోనికి తీసుకొంది కవిత.

వారిరువురూ ఒక రెస్ట్ రూము వైపుకు వెళ్ళారు..

“అన్నా!..”

“ఏం చలపతి!”.

“రా.. నీవూ స్నానం చేద్దువుగాని!..”

“నీవు చేయవా!..”

“ముందు నీవు నా రూములో చెయ్యి అన్నా, నేను నరసింహ గదిలో చేస్తాను.”

“త్వరగా రండి భోజనం చేద్దురుగాని!” అంది శాంతి. ‘

శ్రీరామ్ చలపతి గదిలోనికి, చలపతి నరసింహరాయుడు గదిలోనికి ప్రవేశించారు.

పావుగంటలో అందరి స్నానాలు అయినాయి.

పనిమనిషి ముత్యాలు వండిన పదార్థాలనన్నింటినీ శాంతి చెప్పినట్లు డైనింగ్ టేబుల్ మీదకు చేర్చింది.

అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు.

ముత్యాలు అందరికీ వడ్డించసాగింది.

“అక్కా!..”

“ఏం రామ్!..”

“బావ ఎప్పుడు వస్తాడు. కాంట్రాక్టు వ్యాపారం ఎలా వుంది?”

“అన్నా!.. బావగారి వ్యాపారం ఇప్పుడు కోట్లలో సాగుతూ ఉంది.” నవ్వుతూ చెప్పాడు చలపతి.

“బావ ఎప్పుడు వస్తాడో నీకు తెలుసా!..” అడిగాడు శ్రీరామ్.

“ఆఁ.. రేపు ఉదయం పదిగంటల కల్లా వస్తాడు” చలపతి జవాబు.

“నాన్నా!.. బావ ఎవరు?” అడిగింది గంగ.

“మీ శాంతి అత్తయ్యగారి భర్త, వారు నాకు మీ బాబాయికి బావగారు” నవ్వుతూ చెప్పాడు శ్రీరామ్.

“ఓహో!.. అలాగా!..” అంది గంగ నవ్వుతూ.

“రామా!.. గంగకు ఇంత స్పష్టంగా మన తెలుగు మాట్లాడటం ఎవరు నేర్పారు?”

“తనే నేర్చుకొంది అక్కా!.. చాలా పట్టుదల!.. ఇంట్లో ఎప్పుడు తెలుగే మాట్లాడుకొంటాం. పైగా వాళ్ళ అమ్మమ్మ మన తెలుగు వారు” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.

అందరి భోజనాలు ముగిశాయి.

“రామా!..”

“ఏం అక్కా!..”

“చాలాదూరం కార్లో వచ్చారు కదా!.. పడుకొని విశ్రాంతి తీసుకోండి” అంది శాంతి.

“అలాగే అక్కా.. అవునూ.. భారతి ఎప్పుడు వస్తుంది?”

“ఢిల్లీకి వెళ్ళింది కదా, రెండు రోజుల్లో రావచ్చు. ఫోన్ చేస్తుందిలే!..”

“భారతి ప్రసంగాలను నేను టి.విలో విన్నాను. అద్భుతమైన వాగ్ధాటి. నిజం చెప్పాలంటే, ఆమె ప్రసంగాలను విన్న తరువాతే, నాకు భారత్‌కు తిరిగి రావాలనే సంకల్పం కలిగింది” చిరునవ్వుతో చెప్పాడు శ్రీరామ్.

చలపతి మేడపైకి వెళ్ళి తన రూములో శ్రీరామ్‌కు పడకను అమర్చాడు. క్రిందికి వచ్చి..

“అన్నా!.. పైకి పదండి.. పడుకొందురు గాని!..” అన్నాడు.

“గంగా!..”

“ఏం అత్తయ్యా!..”

“నీవు నా దగ్గర పడుకొంటావా!” అడిగింది శాంతి.

“అలాగే అత్తయ్యా!.. నాన్నా!.. ఓకేనా!..” తండ్రి వంక చూచి అడిగింది.

“అలాగే తల్లీ!..” అన్నాడు శ్రీరామ్.

“అక్కా!.. ఒకసారి ఇంటి చుట్టూ తిరిగి వస్తాను.”

“సరే రామా!..”

శ్రీరామ్ అతని వెనకాల చలపతి వరండావైపు నుండి ఇంటి దక్షిణపు భాగంలో నడవసాగారు.

ఆ దక్షిణపు వైపు, వాస్తు శాస్త్ర రీత్యా వరుసగా పన్నెండు టెంకాయ చెట్లను నాటాడు శ్రీరామ్ ఇరవై మూడు సంవత్సరాల క్రింద.

“అన్నా!.. నీకు గుర్తుందా!.. ఈ టెంకాయ చెట్లను నాటింది నీవే. చూడు ఎంత పెద్దగా ఎదిగిపోయాయో” చిరునవ్వుతో చెప్పాడు చలపతి.

శ్రీరామ్ ఒక్కో చెట్టును పరీక్షగా చూచాడు.

“అన్నా!..ఈ వైపుకు నేను వచ్చి ఈ చెట్లను చూచినప్పుడల్లా నీవు నాకు గుర్తుకు వచ్చేవాడివి” చిరునవ్వుతో చెప్పాడు చలపతి.

శ్రీరామ్ తమ్ముడి ముఖాన్ని, చెట్లకు వున్న టెంకాయ గెలలను చూచాడు.

“చలపతీ!..”

“అన్ని చెట్లు బాగా ఎదిగాయి కదూ!..”

“అవునన్నా, చాలా బాగా ఎదిగాయి..”

శ్రీరామ్ మనస్సున ఆ చెట్లను తాను నాటిన రోజు గుర్తుకు వచ్చింది. సమయం ఉదయం పదిగంటలు. చెట్లు నాటేదానికి తాను తమ్ముడూ గుంటలు చేస్తున్నారు. వారి తల్లి గంగాదేవి ఆ వైపుకు వచ్చింది. ఎండ విపరీతంగా వుంది.

“నాన్నా శ్రీరామ్! ఎండలో ఏమిటయ్యా ఆ పని. పాలేర్లకు చెబితే వారు నాటుతారు కదా!.. ఇద్దరూ ఇంట్లోకి రండి” అంది తల్లి గంగాదేవి ఆప్యాయంగా.

“అమ్మా!.. రాజమండ్రి నుంచి ఈ చెట్లను తెప్పించానమ్మా. వీటిని నా స్వహస్తాలతో నాటితే, అవి పెద్దవై కాయలు కాస్తే, వాటిని చూచినప్పుడల్లా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది కదా అమ్మా!.. మన పని మనం చేసుకోవడంలో మనస్సుకు ఎంతో ఆనందం వుంటుందమ్మా!..” నవ్వుతూ చెప్పాడు. శ్రీరామ్.

“అమ్మా!.. అన్నయ్య అన్నమాటలు పచ్చినిజాలు. త్వరగా నాటి వస్తామమ్మా!..” అన్నాడు చలపతి. “అమ్మా!.. నీవు ఇంట్లోకి వెళ్ళమ్మా!” అభ్యర్థనగా చెప్పాడు శ్రీరామ్.

“అంతా ఆ తండ్రి బుద్దులే. తలచుకొన్నది సాధించే వరకు ఎవరు ఏం చెప్పినా వినిపించుకోరు!” విచారంగా అంది గంగాదేవి.

ఇద్దరు అన్నాదమ్ములు నవ్వుకొన్నారు.

“మీరు నా మాట వినరుగా!.. త్వరగా నాటి లోనికి రండి.” చెప్పి గంగాదేవి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇరవైమూడేళ్ళనాటి ఆ తల్లి మాటలు శ్రీరామ్‌కు గుర్తుకు వచ్చాయి. అతని కళ్ళల్లో కన్నీరు. చలపతి శ్రీరామ్ కళ్ళల్లోని నీటిని చూచాడు.

“అన్నా!.. ఏడుస్తున్నావా!” విచారంగా అడిగాడు.

“అవునురా!. అమ్మ గుర్తుకు వచ్చింది” చేతిగుడ్డతో కన్నీళ్లను తుడుచుకొంటూ చెప్పాడు శ్రీరామ్.

ఇరువురూ పడమర, ఉత్తరం వైపున్న మందారం, సంపంగి, జాజి, మల్లె చెట్లను, తీగలను చూచి ఇంట్లోకి ప్రవేశించారు.

చలపతి శ్రీరామ్‌కు, అతను పడుకొనవలసిన గదిని చూపించాడు. “అన్నయ్యా!.. ప్రశాంతంగా పడుకో!..” అన్నాడు.

“అలాగే!..”

శ్రీరామ్ లుంగీ కట్టుకొని, టీ షర్ట్ తొడుక్కొని మంచంపై వాలాడు.

“చలపతీ!..”

“అన్నా!..”

“నీవు ఎక్కడ పడుకొంటావ్?”

“హాల్లో అన్నయ్యా!”

“గంగ అక్క రూములో పడుకొంది కదూ!..”

“అవునన్నయ్యా!..”

“ఒకసారి చూచి వస్తాను.”

శ్రీరామ్ మంచం నుండి దిగి వేగంగా క్రిందికి నడిచాడు. చలపతి అతన్ని అనుసరించాడు.

ఇరువురూ శాంతి రూములో ప్రవేశించారు.

గంగ.. ప్రయాణ బడలికతో మంచంపై వాలగానే నిద్రపోయింది. శ్రీరామ్ గంగ మంచాన్ని సమీపించాడు. గంగ ముఖంలోకి వంగి చూచాడు.

ఆ క్షణంలో శ్రీరామ్‌కు గంగ ముఖంలో ఎంతో ప్రశాంతత కనిపించింది. చిరునవ్వుతో వెనుదిరిగి గదికి వెళ్ళిపోయాడు.

చలపతి హాల్లో ఓ మూల కర్టెన్ చాటున వున్న మంచంపై పడుకొన్నాడు.

మంచంపై వాలిన శ్రీరామ్ మనస్సున తనవారు, అక్క, ఆమె కొడుకు, కోడలు చలపతి, తనను పలకరించిన విధం, తన పట్ల గంగపట్ల వారు చూపించిన అభిమానం గుర్తుకు వచ్చాయి. మనస్సుకు ఆనందం. అదే సమయంలో గతించిన తల్లి, తండ్రి గుర్తుకు వచ్చారు. వారి నిర్యాణ సమయంలో తను వారి వద్ద లేనిదానికి, తాను ఎవ్వరికీ చెప్పకుండా మాట పట్టింపుతో ఇల్లు విడిచిననాడు, తన తల్లి ఎంతగా బాధపడి వుంటుందో.. ఆ ఆలోచనలతో కళ్ళు మూసుకొన్నాడు శ్రీరామ్.

సమయం రాత్రి పదకొండున్నర..

పడుకొన్న శ్రీరామ్‌కు నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకొని తన తల్లి, తోబుట్టువులను, వారితో తాను గడిపిన రోజులను, ఆ రోజుల్లో వారి మధ్యన వున్న పరస్పర ప్రేమాభిమానాలను తలచుకొంటున్నాడు. అతని మస్తిష్కం నిండా తన వారి జ్ఞాపకాలు.

శాంతి పడుకొంది. కానీ.. ఆమెకూ నిద్రపట్టలేదు. శ్రీరామ్, ఆమె తల్లి తండ్రుల జ్ఞాపకాలు. మనస్సునిండా ఆ గత స్పృతులు. తనవల్లనే శ్రీరామ్ ఇంటినుండి వెళ్ళిపోయాడనే బాధ.

తన ప్రక్కలో పడుకొన్న గంగ మూలంగా తెలుసుకొంది. గంగ తల్లి రోజ్ కవలలను కని హాస్పిటల్లో చనిపోయింది. పుట్టిన కొద్దిరోజుల్లో ఆ కవలలు ఆడ, మగ కూడా చనిపోయారని. తన తాతయ్య థామస్, అమ్మమ్మ దుర్గ ఎలా చనిపోయారనే విషయాలను శాంతి అడగ్గా గంగ చెప్పింది. ఆ కథను గంగ చెప్పి ముగించాక, గంగ కళ్ళల్లో కన్నీరు. గంగను దగ్గరకు తీసుకొని శాంతి ఆమె కన్నీటిని తుడిచింది. ఆమెను తన హృదయానికి హత్తుకొంది. గంగ ప్రశాంతంగా నిద్రపోయింది.

శాంతికి శ్రీరామ్ ఏం చేస్తున్నాడో చూడాలనిపించింది. మెల్లగా మంచం దిగి మేడమీద శ్రీరామ్ పడుకొనియున్న గదిని సమీపించి, తలుపును నెట్టింది. గడియ బిగించని కారణంగా తలుపు రెక్క తెరుచుకొంది. శాంతి గదిలోకి ప్రవేశించింది.

శ్రీరామ్ మంచాన్ని సమీపించింది. వంగి అతని ముఖంలోకి చూచింది. శ్రీరామ్ కళ్ళు మూసుకొని వున్నాడు.

‘నిద్రపోతున్నాడు, రేపు మాట్లాడుకోవచ్చులే!’ అనుకొని వెనుదిరిగింది శాంతి. ఆమె చేయి మంచానికి తగిలింది. గాజుల శబ్దం.

శ్రీరామ్ కళ్ళు తెరిచాడు. వెనుతిరిగి వెళుతున్న అక్క శాంతిని చూచాడు. “అక్కా!..” పిలిచాడు.

ఆ పిలుపు వున్న శాంతి వెనుతిరిగింది. శ్రీరామ్ ముఖంలోకి చూచింది. “రా అక్కా!.. కూర్చో” శ్రీరామ్ మంచంపై కూర్చున్నాడు.

శాంతి ఆ మంచంపై కూర్చుంది. “నీతో మాట్లాడాలని వచ్చాను రామ్!..”

“ఏ విషయం అక్కా!..”

“నీకు సంబంధించిన లండన్ కథను గంగ చాలావరకు తనకు తెలిసిన విషయాలు చెప్పింది. తన వయస్సు పదేళ్ళని చెప్పింది. నేను విషయాన్ని అర్థం చేసుకొన్నాను” విచారంగా చెప్పింది శాంతి. శ్రీరామ్ ఆమె ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు.

“రామ్!..”

“చెప్పు అక్కా..”

“మన అమ్మా నాన్నల గురించి నీకు చెప్పాలి!..”

“చెప్పక్కా!..”

“ముందు చనిపోయింది అమ్మ!.. ఆమె చివరి క్షణాల్లో నన్ను పిలిచి తన ప్రక్కన కూర్చొనబెట్టుకొని.. ‘అమ్మా!.. శాంతి!.. ఏనాటికైనా శ్రీరామ్ తిరిగి వస్తే, వాణ్ణి దూషించకుండా, ప్రేమగా అభిమానించమ్మా, వాడు ఆవేశపరుడు, పట్టుదల గలవాడు. ఆ కారణంగానే వాడు మనందరికీ దూరమై ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. కానీ.. వాడి మనస్సు చాలా మంచిదమ్మా!.. వాడు మంచి మనిషిగా బ్రతికేలా, ఏ స్థితిలో ఇంటికి తిరిగి వచ్చినా, జాగ్రత్తగా చూచుకోవలసిన బాధ్యత నీదే తల్లీ!.. చూచుకొంటానని నాకు మాట ఇవ్వు!..’ చెప్పి అమ్మ తన చేతిని సాచింది. నేను నా చేతిని అమ్మ చేతిలో వుంచాను. అమ్మ ఆనందంగా కళ్ళుమూసింది.” శాంతి కళ్ళల్లో కన్నీరు. శ్రీరామ్ చేతిని తన చేతిలోకి తీసుకొని తన చేతిని అతని చేతిలో వుంచి..

“తమ్ముడూ!.. నా కారణంగా నీవు ఇంటికి దూరమైపోయావు. నన్ను క్షమించయ్యా!..” దీనంగా కన్నీటితో పలికింది శాంతి.

శ్రీరామ్ నయనాల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి.

“అక్కా!.. నేను నిన్ను క్షమించడం ఏమిటక్కా!.. మాట పట్టింపు జరిగింది నాకు నాన్నకు. ఆయన మాటలను ఇష్టపడని నేను ఆవేశంతో ఇంటినుండి రాత్రి సమయంలో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయాను. అంతా దైవ నిర్ణయం అక్కా. అలా జరగాలని వుంది అలా జరిగిపోయింది. నాకు నీ మీద, ఎవ్వరి మీద ద్వేషం లేదక్కా..” ఎంతో అనునయంగా చెప్పాడు శ్రీరామ్.

“రామా!.. నాన్న తన చివరి దశలో నాతో ఏం చెప్పాడో, ఏం చేశాడో చెప్తా విను. వారు నీవు ఏదో ఒకనాడు తిరిగి ఇంటికి వస్తావని చెప్పారు. ఆయన సంపాదించిన దానిలో మూడవ వంతు భూములు, తోటలు నీ పేరున వీలునామా వ్రాసి, వాడు వచ్చిననాడు వీలునామాను నీకు ఇవ్వమన్నారు. ఆ పత్రాలు నా దగ్గర భద్రంగా వున్నాయి. నాన్నకు నీ గురించి ఎంతో బాధరా!.. నీవు ఇంటినుండి వెళ్ళిపోయేదానికి తనే కారణం అని ఎంతగానో బాధపడ్డారు. ఆ ఆవేదనతోనే గుండె ఆగి ఒకరోజు రాత్రి చనిపోయారు. అమ్మ చనిపోయి పది సంవత్సరాలు. నీ గంగ మన అమ్మేరా. నాన్న పోయి నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. వారి జ్ఞాపకాలు నా మదిలో నిలిచిపోయాయి. ఇప్పుడు నీవు వచ్చావు. నాకు చాలా ఆనందంగా వుంది రామా!.. చాలా ఆనందంగా వుంది.” ఆవేశంతో చెప్పుకొచ్చిన శాంతి ఆగిపోయింది.

శ్రీరామ్ పరీక్షగా శాంతి ముఖంలోకి చూచాడు కొన్ని క్షణాలు..

“రామ్!.. ఏమిట్రా అలా చూస్తున్నావ్?” అడిగింది శాంతి.

“ఈ మన మానవ జీవితం బంధాలతో ముడిపడింది. కారణాల వలన ఒకనాడు ఆ దేశంలో తెంచుకొన్న బంధాలు.. కాలగతిలో జరిగే మార్పులు, వ్యక్తుల నిర్యాణాదులతో ఏనాడో త్రెంచుకొన్న బంధాలు ఆ స్థితిలో మనస్సున మరలా చేరుతాయి. దూరంగా ఉన్నవారిని కలవాలని మనస్సు ఆరాటపడుతుంది. అక్కా!.. నా విషయంలో జరిగింది అదే. నా భార్య రోజ్, అత్తయ్య దుర్గ, మామగారు థామస్ నిర్యాణంతో నా మనస్సున అదే సంచలనం కలిగింది. భారత్‌కు వచ్చేశాను” నెమ్మదిగా ఏదో ఆలోచనలతో చెప్పాడు శ్రీరామ్.

“అదే రక్తసంబంధానికి వున్న మహిమ. నీ విషయంలోనే కాదు, నా విషయంలో కూడా అదే జరిగింది. అమ్మా నాన్నలు పోయాక నాలో నిన్ను చూడాలనే ఆరాటం ప్రబలింది. దేవుడిని వేడుకొనేదాన్ని. ‘తండ్రీ!.. నా తమ్ముడిని ఇంటికి తిరిగి వచ్చేలా చెయ్యి స్వామి’ అని. ఆ పరంధాముడు నా వేడుకోలును మన్నించాడు. నీవు ఇంటికి తిరిగి వచ్చావు. ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా వుంది రామా!.. ఇక ఎక్కడికీ వెళ్ళకు. మంచి అమ్మాయిని చూచి నీకు పెండ్లి చేస్తాను. హాయిగా ఆనందంగా అందరం కలిసి వుందాం రా!..” ప్రాధేయపూర్వకంగా చెప్పింది శాంతి.

శ్రీరామ్ విరక్తిగా నవ్వాడు.

“ఎందుకురా నవ్వుతున్నావ్? నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా!..” అడిగింది శాంతి.

“లేదక్కా!.. ఒక అక్కగా నాకు చెప్పవలసిన మాటలే నీవు చెప్పావు. నా మనస్సున మనదేశం పట్ల కొన్ని భావాలున్నాయి. వాటిని ఆచరించి మన సముదాయ ప్రగతిని సాధించాలనేది నా ఆకాంక్ష. ఆ కారణంగా నేను కొంతకాలం వైజాగ్‌లో వుండాలక్కా!.. నన్ను వారించకు. పొద్దుపోయింది. వెళ్ళి పడుకో అక్కా!..” అనునయంగా చెప్పాడు శ్రీరామ్.

శాంతి లేచి మౌనంగా వెళ్ళిపోయింది. శ్రీరామ్ తలుపు మూసి మంచంపై వాలిపోయాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version