[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[సాయంత్రం ఆరు గంటలకు తమ ఇంటికి చేరుతాడు శ్రీరామ్. ఆ సమయంలో బావ ఆనందరాయుడు, వారి కూతురు భారతి ఇంట్లో ఉండరు. ఉన్నది శ్రీరామ్ అక్క శాంతి, ఆమె కుమారు నరసింహరాయుడు, అతని భార్య కవిత. కారు హారన్ వినగానే ముగ్గురూ బయటకు వస్తారు. చలపతి శ్రీరామ్‌ని చూపిస్తూ అన్నయ్య వచ్చాడని శాంతితో చెప్తాడు. శ్రీరామ్ గంగకి అందరినీ పరిచయం చేస్తాడు. దాదాపు పాతికేళ్ళ తరువాత పెద్ద తమ్ముడిని చూసినందుకు శాంతి తన ఉద్వేగాన్ని అణచుకోలేకపోతుంది. గంగని పరిచయం చేయగానే, అమ్మ పోలిక అంటుంది. వారంతా తనకి ఏమవుతారని అడిగి తెలుసుకుని ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తుంది గంగ. స్నానాలు చేశాకా, ఇల్లంతా చుట్టి వస్తాడు. చిన్నప్పుడు తాను నాటిన కొబ్బరి మొక్కలు చెట్లయి, ఇంకా కాపు కాయడం చూసి ఆనందిస్తాడు శ్రీరామ్. తర్వాత భోజనాలు చేసి విశ్రమిస్తారు. గంగ శాంతి గదిలో నిద్రిస్తుంది, గంగ ద్వారా శ్రీరామ్‌కి జరిగినదంతా తెలుసుకుంటుంది శాంతి. శ్రీరామ్ చలపతి గదిలో పడుకుంటాడు. శాంతికి నిద్రపట్టక, తమ్ముడి గదిలోకి వస్తుంది. శ్రీరామ్ నిద్రపోతుండడం చూసి వెనుదిరుగుతుంది. ఆ క్రమంలో ఆమె చేయి మంచానికి తగిలి గాజులు చప్పుడు చేయడంతో శ్రీరామ్‌కి మెలకువ వస్తుంది. లేచి, అక్కని ఆగమంటాడు. రోజ్, దుర్గ, థామల్ల గురించి గంగ చెప్పిందని చెప్పి బాధపడుతుంది. తన వల్లే శ్రీరామ్ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందని బాధ పడుతుంది. తర్వాత తమ తల్లిదండ్రుల గురించి చెప్తుంది. శ్రీరామ్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాకా, తల్లి బాధపడుతుంది. ఆమె చనిపోయే ముందు శాంతిని పిలిచి, శ్రీరామ్ ఎప్పుడు తిరిగి వచ్చినా, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కన్ను మూస్తుంది. ఆమె చనిపోయి పదేళ్ళు, నాన్న చనిపోయి నాలుగేళ్ళు అయిందని చెప్తుంది. తండ్రి ఆస్త్రిలో ఒక వాటాని శ్రీరామ్ పేరు మీద రాశాడని చెప్తుంది. శ్రీరామ్ భారత్‌కు తిరిగి రావాలని ఎంతో ప్రార్థించానని అంటుంది. ఇక ఎక్కడికీ వెళ్ళవద్దనీ, మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేస్తానని అంటుంది. అప్పుడు శ్రీరామ్ తన ప్రణాళికలు చెప్పి, ఆమెని వెళ్ళి పడుకోమంటాడు. – ఇక చదవండి.]
అధ్యాయం-10
శ్రీరామ్ కారు సాంబశివం మాష్టారు ఇంటిముందు ఆపాడు. దిగాడు. మెల్లగా వీధిగేటు తెరుచుకొని వరండాను సమీపించాడు. మాస్టారు ఇంట్లో పిల్లలకు చరిత్ర పాఠాలను చెబుతున్నారు. శ్రీరామ్ వరండాలోని బెంచీపై కూర్చున్నాడు. మాష్టారు చెప్పేది వినసాగాడు.
“మన సువిశాల భారతదేశం, యుగయుగాలుగా, తరతరాలుగా ఎంతో ప్రశస్తమైన సుచరిత్రకు నిలయం.
మన సనాతన అద్వైత హైందవ మతం ప్రపంచ మతాలన్నింటికన్న కడు ప్రాచీనమైనది. ఇప్పటివరకు జరిగిపోయిన యుగాలు మూడు. 1. కృత (సత్య) యుగము 2. త్రేత్రా యుగము 3. ద్వాపర యుగము 4. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగము.
ధర్మ రక్షణకు దుష్ట శిక్షణకు ప్రతి యుగంలోనూ, పంతం, పోరు. అంతిమ విజయం ఎప్పుడూ ధర్మానికే!!..
అందుకే మన పూర్వులు పెద్దలు అన్నారు, ‘ధర్మో రక్షితి రక్షతహః’. నీవు ధర్మాన్ని రక్షించి, గౌరవించి, పాలించితే (ఆచరిస్తే) నిన్ను ఆ ధర్మం రక్షిస్తుందన్నది వేదవాక్యపు అర్థం అది.
కానీ.. కాలగతిలో ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతూనే ఉంది. దానికి కారణం మానవులలోని స్వార్థం, అమానుషత్వం, పరులను ద్వేషించడం, పగ, ఆశ, పంతాలను పెంచుకోవడం, ధన కాంక్ష, రాజ్య కాంక్ష, పదవీ కాంక్ష, పై మూడు రజో గుణాలు కలిగిన కొందరి వ్యక్తుల కారణంగా, దేశంలో అనేక యుద్ధాలు, ప్రాంతీయ బేధంతో జరిగాయి. పోరులో గెలుపు న్యాయానిది కాదు. కుట్ర కుతంత్రం, మూక బలమున్న మూర్ఖులదే, వారి ఆ గెలుపు ఓడిన వారిని, వారిని ఆశ్రయంగా బ్రతికేవారిని, నిర్వీర్యులను చేస్తుంది. గెలుపొందిన వారికి శత్రువులుగా బందీలుగా బ్రతుకు జీవుడా అంటూ మారిపోవలసిన విషయ పరిస్థితి ఓడిన వర్గీయుల పాలైంది. బానిసలుగా మారిపోవలసి వచ్చింది.
కైబర్ బోల్టన్ కనుమల గుండా రాజ్య కాంక్షతో ఆఫ్ఘన్ నుండి సున్ని ఘజ్నవిద్ సామ్రాజ్య సుల్తాన్ అయిన అబూఅల్-ఖాసి మహ్మద్ ఇబ్న్ సబుక్తగన్ 971 సంవత్సరం నవంబరు 2వ తేదీ నుండి 1030 సంవత్సరం ఏప్రిల్ వరకు పదిహేడు సార్లు దండయాత్ర చేసి మన భారతావనిలో మహమ్మదీయ బీజాన్ని నాట ప్రయత్నించిన ఘనచరితుడు. చివరగా రాజపుత్ర రాజు మూల రాజా (2) గజనీ మహమ్మద్ ను అబు ప్రాంతంలో ఓడించి తరిమివేశాడు.
గజనీ తర్వాత 1192లో మహమ్మద్ ఘోరి, మన దేశపు రాజైన పృద్వీరాజాను ఓడించి, వారి పాలనను ప్రారంభించాడు. ఆ వంశం పేరు బానిస వంశం. వీరి పాలనా కాలం 98 సంవత్సరాలు.
వారి తర్వాత ఖిల్జీ రాజవంశం. వీరి పాలనా కాలం ముఫ్ఫై సంవత్సరాలు. వారి తర్వాత తుగ్లక్ రాజులు. వీరి పాలనాకాలం తొంభై సంవత్సరాలు. తరువాత సయ్యద్ రాజు వంశం. వీరి పాలనా కాలం ముఫ్ఫె ఏడు సంవత్సరాలు. తరువాత లోడీ రాజవంశం. వీరి పాలనా కాలం డెబ్బై ఐదు సంవత్సరాలు. తరువాత మొఘల్ వంశం. వీరి పాలనాకాలం పదమూడు సంవత్సరాలు. తరువాత సూరి రాజవంశం, (హైందవులు ఒరిస్సా ప్రాంతం) వీరి పాలనా కాలం పదహారు సంవత్సరాలు. మరలా మొగల్ రాజవంశం. వీరి పరిపాలనా కాలం 335 సంవత్సరాలు. మొత్తం ముస్లిం రాజులు పరిపాలనా కాలం 680 సంవత్సరాలు.
ముస్లిం పాలకులు వారి ప్రాబల్యంలో పేద హైందవులను భయపెట్టి మతమార్పిడి చేశారు. మన హైందవత పట్ల ద్వేషంతో అనేక మన పురాతన దేవాలయాలను కూల్చి మసీదులుగా మార్చారు.
| క్ర. సం. | నగరము | కూల్చివేసిన ఆలయము | నిర్మించిన మసీదు పేరు |
| 1. | వారణాసి | కాశీ విశ్వేశ్వరనాథ్ ఆలయం | గ్యానవాపి మసీద్ |
| 2. | వారణాసి | బిందుమాధవ్ ఆలయం | ఆలంగిర్ మసీద్ |
| 3. | అజ్మీర్ | బ్రహ్మ ఆలయం | అధామ్ దిసజోప్రా మసీద్ |
| 4. | ఢిల్లీ కుతూబ్ మీనార్ | జైన్ హిందు ఆలయం | కువ్వాట్ – అవ్- ఇస్లాం మసీద్ |
| 5. | భోజ్షాల | సరస్వతీ ఆలయం | కమల్ మాల మసీద్ |
| 6. | అయోధ్య | రామాలయం | బాబ్రీ మసీద్ |
| 7. | సోమనాథ్ | శివాలయం | ఆలయాన్ని తిరిగి నిర్మించారు. |
| 8. | సిద్ధపూర్ | రుద్రమహాలయం | జామీ మసీద్ |
| 9. | మాల్దా | ఆదినాద్ దేవాలయం | ఆదినా మసీద్ |
| 10. | బోధన్ జైన్ | హిందూ ఆలయం | దేవల్ మసీద్ |
| 11. | శ్రీనగర్ | కాళీమాత ఆలయం | కాన్ ఖాహ్ – ఇ- మాలా మసీద్ |
| 12. | బీజాపూర్ | సిద్దేశ్వర ఆలయం | కరిమా దిన్ మసీద్ |
| 13. | జాన్పూర్ | అటలదేవి మందిరం | అటల్ మసీద్ |
| 14 | మధుర | కృష్ణాలయం | ఇద్గాహ్ మసీద్ |
| 15. | 400 ఆలయాలు భారత్‌లో.. వేరు వేరు ప్రాంతాల్లో మసీదుల నిర్మాణం | ||
| 16. | 200 + ఆలయాలు కాశ్మీర్లో.. మసీదుల నిర్మాణం | ||
ఇవి కాక, దేశ వ్యాప్తంగా సుమారు చిన్నా పెద్ద ముఫ్ఫై వేలకు పైగా ఆలయాలను కూల్చి మసీదులుగా నిర్మించారు ముస్లిములు.
ఆనాడు మన దేశ వనితలు కొందరు విద్యావంతులు, వివేకవంతులు, దేశభక్తి పరులు, పరాక్రమవంతులు. అతివ అబల కాదు సబల అని నిరూపించిన ఘన చరితలు.
సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, సహనం, అభిమానం, సౌభాతృతం, మన హైందవ జాతి యొక్క మహోన్నత గుణాలు. మన పూర్వీకులందరూ ఆ మహోన్నత లక్షణాలను ఆదరించి అభిమానించి పాటించి, వారి మనుగడను పరస్పరమైత్రీ, సోదర భావంతో సాగించారు. వారిలోని ఆ అతి మంచితనం వలన తొలుత ముస్లిములు, తరువాత ఆంగ్లేయులు మన దేశంలో ప్రవేశించారు. ముస్లిములు పాలకులను గురించి చెప్పాను. ఇప్పుడు ఆంగ్లేయులను గురించి వివరిస్తున్నాను.
1497వ సంవత్సరం పోర్చుగీస్ దేశానికి చెందిన వాస్కోడిగామా మన భారత దేశానికి సముద్ర మార్గాన వచ్చాడు. వారు తినే మాంసాహారాలను నిలువ చేసుకొనే లవంగాలు, ఏలకులు, చెక్క, సొంపు, జాపత్రిల కోసం కేరళలోని కాలికట్ నగరానికి చేరాడు. కాలికట్ మహారాజు జమేరిన్ను కలిసి, పరిచయం చేసుకొని తనకు కావలసిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్ళిపోయాడు. మరలా 1502 లో రెండవ పర్యాయం వచ్చాడు.
పోర్చుగీసు వారు భారత్‌కు సముద్ర మార్గాన్ని కనిపెట్టారన్న విషయాన్ని తెలుసుకొన్న బ్రిటీషర్స్ కూడా భారత్‌కు సముద్ర మార్గాన వచ్చారు. దేశం అన్నివైపులా తిరిగి అప్పటి రాజులను సందర్శించి, వ్యాపార నిమిత్తం ఈస్టిండియా కంపెనీ 1611లో మచిలీపట్నంలో ఫ్యాక్టరీని స్థాపించి, తర్వాత సూరత్‌లో 1615లో రెండవ ఫ్యాక్టరీని స్థాపించారు. తర్వాత బాంబే, కలకత్తా, మద్రాసు నగరాల్లో కూడా స్థాపించారు. గుమస్తా (అకౌంటెంట్) హోదాలో రాబర్ట్ క్లైవ్ 1744 సంవత్సరంలో భారతకు వచ్చాడు. దేశాన్నంతా తిరిగి చూచిన అతనికి, అప్పటి మన రాజుల మధ్యన సఖ్యత లేదన్న విషయాన్ని గ్రహించిన అతని మనస్సున, రాజ్యాకాంక్ష కలిగింది.
ప్రప్రధమంగా లండన్‌లో ఎలిజబెత్ (రాణి) థామస్ స్మిత్, జాన్ వాట్ కలిసి ఈస్టిండియా కంపెనీని 1600 సంవత్సరంలో డిశంబర్ 31వ తేదీన కంపెనీ పేర ఒక కార్యాలయాన్ని స్థాపించారు. ఆసియా ఖండ దేశాలతో వ్యాపారం నిమిత్తం.
ప్రియ శిష్యులారా!.. ప్రతి భారతీయునికి మన దేశ చరిత్రను గురించిన అవగాహన ఎంతో అవసరం. రాజ్య కాంక్ష, పగ, ద్వేషం, స్వార్థం, ప్రతీకార వాంఛలు మానవ సముదాయాన్ని కష్ట నష్టాల పాలు చేస్తాయేకాని, అభ్యున్నతిని ప్రగతిని సాధించలేవు. పూర్వం మనదేశ పాలకులైన రాజులు ఆ తత్వాలతో సఖ్యతారహితంగా వ్యవహరించిన కారణంగా ఆఫ్ఘనిస్థాన్ నుండి ముస్లిములు మన దేశంలోనికి రాగలిగారు. బలహీనులను ఓడించి, బలవంతుల పక్షాన చేరి, వారిని తమ గుప్పెట్లో పెట్టుకొని, వారే పాలన పెత్తనాన్ని సాగించారు. ఆవేశ ఆ క్రమంతో జరిగిన గొప్ప యుద్ధాలు పది..
- కళింగ యుద్ధం క్రీ.పూ. 261 లో జరిగింది. అశోక్ చక్రవర్తి కళింగ దేశంపై దాడి సలిపి, చేసిన యుద్ధం. యుద్ధంలో ఎందరో చనిపోయారు. మౌర్య సామ్రాజ్యానికి, కళింగ సామ్రాజ్యానికి జరిగిన యుద్ధం ఇది. మౌర్యులు గెలిచారు. కళింగను ఆక్రమించారు.
- క్రీ.శ. 1191 లో జరిగిన మొదటి తరైనా యుద్ధము. మహమ్మద్ ఘోరికి పృధ్వీరాజ్ చౌహాన్‌కి జరిగింది. గెలుపు చౌహాన్‌ను వరించింది.
- క్రీ.శ. 1192లో రెండవ తరైనా యుద్ధము. పృద్వీరాజ్ చౌహాన్‌కు మహమ్మద్ ఘోరికి జరిగింది. మహమ్మద్ ఘోరి గెలిచారు.
- క్రీ.శ. 1194 లో చాంద్ (వార్) యుద్ధము. జయచంద్ర అంతర్వేది (గంగానది తీరాన వుండినది) రాజుకు మహమ్మద్ ఘోరికి జరిగినది. ఘోరి విజయం పొందారు.
- క్రీ.శ. 1426లో మొదటి పానిపట్టు యుద్ధము, ఇబ్రహీమ్ లోడీకి బాబర్‌కు జరిగింది. బాబర్ విజయాన్ని పొందినాడు.
- క్రీ.శ్ 1527లో కాణ్యాయుద్ధం. రాణా సంగ్రామ సింగ్, బాబర్ మధ్య జరిగింది. గెలుపు బాబర్ వశం అయింది.
- క్రీ.శ. 1528లో మేధినీరాయ్ రాజపుత్ర వీరుడు, తూర్పుమాళ్వరాజు కలిసి, బాబర్‌తో పోరాడారు. గెలుపు బాబర్‌దే అయింది.
- క్రీ.శ. 1556లో హేము విక్రమాదిత్యన్కు (వీరి రాజధాని పానిపట్టు హర్యానా) అక్బర్‌కు రెండవ పానిపట్టు యుద్ధం జరిగింది. విజయం అక్బర్ కైశవం.
- క్రీ.శ. 1757లో ప్లాసీ యుద్ధం. బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి. బెంగాలు, నవాబ్, అతని ఫ్రెంచి మిత్రులు కూటమిపై 1557 జూన్ 23న జరిగిన యుద్ధం విజయం ఆంగ్లేయులది. వారు బెంగాల్‌ను, నవాబ్‌ను గెలిచారు.
- క్రీ.శ. 1764లో బాక్సర్ యుద్ధం, బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి మొఘల్ బెంగాల్ నవాబ్, అవధ నవాబ్‌ల మధ్యన జరిగింది. గెలుపు బ్రిటీష్ వారిది. బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వారు సాగించిన నిరంకుశ పాలన.
పిల్లలూ!.. పోయిన క్లాసులో నేను చెప్పాను. మన పూర్వీకులలో కొందరు స్వాతంత్యం కోసం ముస్లిం రాజును ఎదిరించి పోరాడారని, వారు మహోన్నతులు. చరిత్ర నాయకీ నాయకులు, కీర్తిశేషులు. వారిని గురించి వివరిస్తాను. వారిలో పురుషులే కాక స్త్రీలూ గణనీయులు.
1. మహారాణి రుద్రమదేవి (1263-1289.. పరిపాలనా కాలం):
కాకతీయ వంశానికి చెందినవారు. తండ్రిగారి పేరు గణపతి దేవుని పెద్ద కుమార్తె. ఆమె చెల్లెలు జనపమాదేవి. గణపతి దేవుడు రుద్రమను చిన్నతనం నుండి మగవానిలా సహాయువరాజు రుద్రదేవుడుగా పెంచారు. 1259/60లో యువరాజుగా నామినేట్ చేయబడ్డారు. సామ్రాజ్యంలోని ప్రజలు స్త్రీ వారసత్వానికి వ్యతిరేకతను వ్యక్తం చేశారు. యువరాజుగా (రాణిగా) అనర్గళంగా మాతృభాషను మాట్లాడి ప్రజలను మెప్పించి తండ్రి తదనంతరం రాణిగా పరిపాలనను ప్రారంభించింది. వీరభద్ర చాళుక్యుడు నిడదవోలు యువరాజు. అన్నిరంగాల్లో శిక్షణ పొంది వివిధ అంశాలను నేర్చుకొన్నాడు. రుద్రమదేవికి వీరభద్రకు 1240లో వివాహం గణపతిదేవుడు జరిపించారు.
1268-70లో యాదవరాజు మహాదేవ కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తాడు. అతని ప్రయత్నాలు నిరుపయోగమై, ఆ దాడి వలన ఏమీ పొందలేకపోయాడు. 1280వ సంవత్సరంలో రుద్రమదేవి మనవడు యువరాజుగా నియమితుడైనాడు. వారి పేరు ప్రతాపరుద్రదేవుడు. 1285లో ఏంజీలు, యాదవులు, మరియు హోసైలలు కలిసి కాకతీయ రాజ్యాన్ని స్వాధీనం చేసుకొన ప్రయత్నించారు. రాజకుమారుడైన ప్రతాపరుద్ర దేవుడు పరిస్థితిని సామర్థ్యంతో ఎదుర్కొని విజయవంతంగా పరిష్కరించారు. స్త్రీలు రాజ్యాన్ని వారసత్వంగా పొందలేరన్న ప్రజల విశ్వాసాన్ని తప్పని భావించారు. ఎందుకంటే రుద్రమదేవి యొక్క పరాక్రమం మరియు ధృడ సంకల్పం స్త్రీలు, పురుషుల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపించాయి. ఆ మహారాణి నిర్యాణం 1289. యుద్ధ భూమిలో తన సైన్యాధ్యక్షుడు కాయస్తా రాజు అంబదేవ్ వారిని వరంగల్ ప్రాంతపు చందుపటేల్లో చంపారు. 27-11-1289న.
2. మహారాణి పద్మిని పద్మావతి (1303 – 1400):
చిత్తూరు మహారాణి పద్మావతి గారి జననం శ్రీలంక. తండ్రిగారు గంధర్వసేన్. చిత్తూరు రాజపుత్ర. పాలకుడు రతన్ సేన్ (రత్నసింహుడు) ప్రస్తుత రాజస్థాన్‌లో వున్న మొహర్ రాజ్యానికి రాజు, పాలకుడు. హరీయన్ అనే పేరున పిలువబడే మాట్లాడే చిలుక వలన పద్మావతి అందచందాలను గురించి విని.. సాహసోపేత అన్వేషణతో చేరికతో వారు ఆమెను వివాహం చేసుకొన్నారు. చిత్తోర్ఘర్కు తీసుకొని వచ్చారు. రతన్ సేన్ మొదటి భార్య నాగమతికి, పద్మావతికి మధ్యన శత్రుత్వం ఏర్పడింది. ఆ స్థానంలో వున్న బ్రాహ్మణ న్యాయవాది రాఘవ్ చేతన్ మోసం చేశాడని అతనిని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. రతన్ సేన్. రాఘవ చేతన్ ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ వద్దకు వెళ్ళి పద్మావతి యొక అనూహ్యమైన అందచందాలను గురించి చెబుతాడు. పద్మావతిని పొందాలని అల్లావుద్దీన్ చిత్తూరు మీద దాడి చేస్తాడు. పద్మావతి అందాన్ని చూచి ఎంతగానో ఆకర్షితుడౌతాడు. మరో రాజ్యం రాజు, కుంభాల్నర్ డెప్పాల్తో జరిగిన యుద్ధంలో రతన్ సేన్ చంపబడతాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరును పట్టుకొనుటకు ముందు, మహారాణి పద్మావతి, ఆమె సహచరులు (ఔహర్) (స్వీయ ఆత్మహుతి) తో తమ ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని కాపాడుకొంటారు. అసాధారణ అతివా శిరోమణి.
3. మహారాణా ప్రతాప్ సింగ్:
వీరి జననం 1540 మే 9వే తేదీన.. వీరు ప్రస్తుత రాజస్థాన్ రాష్ట్రంలోని వాయువ్య భారతదేశంలోని మేవార్ రాజ్యానికి రాజు. వీరు శ్రీరామచంద్రమూర్తిగా సూర్యవంశపరంపర. వీరి జననం 9- 4 – 1540, నిర్యాణం 19-01-1597 (47 సంవత్సరాలు). వీరికి రాజ్యపట్టాభిషేకం 28-02-1572న జరిగింది. వీరి తండ్రి ఉదయ సింగ్, తల్లి జైవంత బాయి సోంగారా. వీరు మొదటి స్వాతంత్ర్య సమరయోధులు. వీరి పట్టాభిషేక అనంతర కాలంలో చిత్తోడ్, నలువైపులా శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువు వద్ద అపార ధనం, ఇతర యుద్ధ సాధనాలు ఉండేవి. లక్షల సంఖ్యలో సైనికులు వుండేవారు. ఆ సమయంలో చిత్తోడ్‌ను స్వతంత్రం చేసేవరకు బంగారు పళ్ళెంలో భోజనం చేయనని, మెత్తని పరుపులపై నిద్రించనని, మహారాణా ప్రతాప్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. మొగలు షాదుషా అక్చర్ గుండెల్లో నిద్రించిన ధీశాలి. రాణాప్రతాప్ మేవార్ సిసోడియా రాజవంశమునకు చెందినవారు. తండ్రి ఉదయ సింగ్. వీరి తల్లి మహారాణి జైవంతబాయి. జన్మస్థలం కుంభాల్‌గర్. రాజస్థాన్. ముస్లిం చక్రవర్తి అక్బర్‌ను ఎదిరించిన మొట్టమొదటి రాజపుత్ర యోధుడు మహారాణా ప్రతాప్. వీరి భార్యపేరు మహారాణి అజబ్దే. ఇద్దరు మగపిల్లలు. అమర్ సింగ్, భగవాన్ దాస్. ఆ మహావీరుని నిర్యాణం 1597 జనవరి 29వ తేదీ. ముస్లిములతో పోరాటంలో చావంద్ అనే ప్రదేశంలో జరిగింది.
4. చత్రపతి శివాజీ (జననం 1630 ఫిబ్రవరి 19న – మరణం 1680 ఏప్రిల్ 4వ తేది):
చత్రపతి శివాజీగారి తల్లి జిజియాభాయి. తండ్రి షాహాజ్. వీరు నిజాం షాహీలకు మిత్రుడుగా వుండేవారు. షాజహాన్ దండయాత్ర సమయంలో నిజాం జాదర్రావ్ అనే మరాఠా యోధుని నిజాం షాహి ప్రభువు హత్య చేశాడు. అది నచ్చని షాహజీ నిజాంపై తిరుగుబాటు చేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని సుస్థిరం చేశాడు. హిందూరాజులకందరికీ ఆదర్శంగా నిలిచాడు. మూడువారాలు తీవ్రజ్వరంతో బాధపడి రాయఘడ్ కోటలో మరణించారు. వీరి పెద్ద కొడుకు శంభాజీ, వీరి తరువాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను ఎదుర్కొని రాజ్యాన్ని సమర్థవంతంగా సుపరిపాలనను చేశారు. ఛత్రపతి శివాజీ గొప్ప దేశభక్తిపరుడు. శత్రువుల పాలిట సింహస్వప్నం. వారి యుద్ధ పద్ధతి గోరిల్లా. తనయుడు ఆ తండ్రి మార్గంలోనే నడిచి వైరులతో పోరాడి తన దేశభక్తిని నిరూపించాడు. తండ్రి కొడుకులు చరిత్ర నాయకులైనారు.
5. శ్రీహర్ష చక్రవర్తి:
శ్రీహర్షుడు లేక హర్షవర్ధనుడు రాజు జననం 4 జూన్ 590, నిర్యాణం 647 వీరు కన్నౌజీ చక్రవర్తి (పరిపాలనాకాలం 606 నుండి 647 CE వరకు) వీరి తండ్రి ప్రభాకరవర్ధన (తానే సర్ రాజు) తల్లి యసోమతి. మతం శైవిజం/ బౌద్ధమతం. వారు రాజ్యాన్ని ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలో చాలావరకు విస్తరింపజేశాడు. నర్మదానది రాజ్యానికి దక్షిణ సరిహద్దుగా ఉండినది. హర్ష తన సామ్రాజ్యాన్ని భారతదేశంలో దక్షిణ ద్వీపకల్పంలోకి విస్తరించడానికి ప్రయత్నించినప్పుడు, నర్మదా యుద్ధంలో చాళుక్య రాజవంశానికి చెందిన చక్రవర్తి పులకేశన్ చేతిలో ఓడిపోయాడు. చైనా యాత్రికుడు జువాన్ జాంగ్ హర్ష యొక్క ఇంపీరియల్ కోర్టును సందర్శించాడు. అతని న్యాయ నిరతిని, ధాతృత్వాన్ని ప్రశంసిస్తూ వారిని గురించి చాలా గొప్పగా ప్రశంసిస్తూ వారి వృత్తాంతం రాశాడు. సంస్కృత కవి బాణబట్టచే ‘హర్ష చరిత’ వ్రాయబడింది. హర్షవర్థనుడు పుష్యభూతి వంశానికి చెందినరాజు. స్థానేశ్వర సింహాసనాన్ని అధిష్టించి హిందూ స్థానాన్ని పాలించిన ఆఖరి హిందూ చక్రవర్తి. వీరికి సిలాదిత్య అనే మరో పేరు కలదు. వారి సామ్రాజ్యం పంజాబ్. పశ్చిమ బెంగాల్ మరియు ఒరిస్సా, హిమాలయాలతో సహా నర్మదా నదికి ఉత్తరాన ఉన్న మొత్తం ఇండో గంగా మైదానాన్ని కలిగియుండినది. హర్ష అంటే సంతోషం. వర్ధన శ్రీ వృద్ధి చేయునది.
అంటే తరువాత కాలంలో.. విదేశీయుల దండయాత్రలను మన రాజులు స్వార్థము, భయము, పిరికితనముతో.. తమ శత్రువుల కోసం రాజరికపు హోదా కోసం, సఖ్యతలేని ఆనాటి రాజులు ఇంగ్లీషువారి సైన్యాన్ని తమ రక్షణకు నియమించుకొన్నారు. రాజు/నవాబ్ నామమాత్రులుగా మారిపోయారు. పరిపాలన విధానం ఆంగ్లేయుల ఆధీనం అయింది.
దేశ సంపదను కొల్లగొట్టి ఓడలలో నించి లండన్‌కు తరలించారు ఆంగ్లేయులు. ప్రపంచంలో విలువకట్టలేని మన కోహినూర్ వజ్రాన్ని లాహోర్ ఒప్పందంలో (1846) ఆంగ్లేయులకు/క్వీన్ విక్టోరియాకు మహారాజా దిలీప్ సింగ్ లొంగిపోయాడు. దాని కట్ బరువు: 105.60, రంగు: రంగులేనిది (తెల్లనిది) కత్తిరించని బరువు: 793 గ్రా. మూలం వున్న దేశం మన భారతదేశం.
లాహోర్ ఒప్పందం:
లాహోర్ డిక్లిరేషన్తో గందరగోళం : 9వ తేది మార్చి 1846 లాహోర్ ఒప్పందం మొదటి ఆంగ్లా సిక్కు యుద్ధ ముగింపుకు గుర్తుగా శాంతి ఒప్పందం సాకుతో జరిగింది. సంధి షరతుల ప్రకారం, మహారాజ దులీప్ సింగ్ వద్దనుండి ఆంగ్లేయులు కోహినూర్ వజ్రాన్ని హస్తగతం చేసుకొన్నారు. దాన్ని క్వీన్ విక్టోరియా మహారాణి తన కిరీటంలో పొందుపరుచుకొంది.” చెప్పడం ఆపారు సాంబశివం మాస్టారు.
కొన్ని క్షణాల తర్వాత..
“ప్రియ బాలికలారా!.. సమయం ఏడు. ఇక మీరు ఇండ్లకు వెళ్ళండి. రేపు కలుద్దాం.” చిరునవ్వుతో చెప్పాడు గురువులు సాంబశివం మాస్టారు.
ఆరుగంటలకు గురువుల ఇంటికి చేరిన శ్రీరామ్.. వారు విద్యార్థులకు చరిత్ర పాఠాలను చెబుతున్నందువలన, వారికి అంతరాయం కలిగించకుండా, వారికి కనబడకుండా అరుగుమీద కూర్చొని, వారు పిల్లలు చెప్పిన చరిత్రను తనూ శ్రద్ధగా విన్నాడు.
పిల్లలు లేని హాల్లోనుంచి ఒకరి వెనుకాల ఒకరు ఇరవైమంది బయటికి వచ్చారు. గృహ ప్రాంగణంలో ప్రవేశించి వీధివైపుకు నడవసాగారు.
సాంబశివం మాస్టారు వరండాలోకి గొంతు సవరించుకొంటూ వచ్చారు. శ్రీరామ్‌ను చూచారు. ఆశ్చర్యంతో..
“మీరు ఎవరు సార్!..” అడిగాడు.
“సార్!.. నేను మీ శ్రీరామ్‌ని సార్!.. నమస్కారములు” చిరునవ్వుతో చేతులు జోడించాడు శ్రీరామ్. సాంబశివం మాస్టారు ఆశ్చర్యంతో శ్రీరామ్ ముఖంలోకి పరీక్షగా చూచారు.
“సార్!.. మీరు నన్ను గుర్తుపట్టలేదా!” చిరునవ్వుతో అడిగాడు శ్రీరామ్.
“శ్రీరామ్!.. నీవా?”
“అవును సార్!..”
“ఇంతకాలం ఎక్కడ వున్నావయ్యా!..” ప్రీతిగా అడిగాడు సాంబశివ మాస్టారు.
“లండన్‌లో సార్!..”
“ఉద్యోగమా!..”
“అవును సార్, యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా దాదాపు ఇరవై సంవత్సరాలు పనిచేశాను. మొన్ననే భారత్‌కు వచ్చాను.”
“రారా కూర్చో!..” మాస్టారుగారు వరండాలోని కుర్చీలో కూర్చున్నారు.
“కూర్చో శ్రీరామ్!..”
వారి ఎదురుగా వున్న కుర్చీలో శ్రీరామ్ కూర్చున్నాడు.
“వివాహం అయిందా !..”
“ఆఁ.. ఒక అమ్మాయి పేరు గంగ, మా అమ్మ పేరు. పది సంవత్సరాలు. కానీ..”
“కానీ!.. ఏం ఆగిపోయావే శ్రీరామ్..!”
“నా ఇల్లాలు గతించింది సార్!..” విచారంగా చెప్పాడు శ్రీరామ్.
“అయ్యో!.. పాపం!..”
“అంతా దైవ నిర్ణయం సార్!..”
“లండన్‌కు తిరిగి ఎప్పుడు వెళతావు?”
“ఇక వెళ్ళను, మన దేశంలోనే ఉంటాను.”
“మన దేశం అంటే, ఈ వూర్లో వుండవా?”
“విశాఖపట్నంలోనూ, ఇక్కడా వుంటాను సార్!..”
“ఏం చేయాలనుకొంటున్నావు శ్రీరామ్?”
“కాలేజీలు స్థాపించాలనుకొంటున్నాను సార్!..”
“ఎక్కడ?”
“విశాఖలో!.. నెల్లూరులో కూడా!..”
“ఆఁ.. మంచిది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది కదా శ్రీరామా!..”
“అవును సార్!.. మిమ్మల్ని చూడాలని వచ్చాను. చూచాను. రిటైర్ అయినా, మీరు ఇంకా పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. నాకు చాలా ఆనందం సార్. నేను వచ్చి దాదాపు గంట కావస్తూ ఉంది. మీరు ఏకాగ్రతతో పిల్లలకు మన దేశ చరిత్రను గురించి వివరంగా వివరిస్తూ వున్నారు. మీరు చెప్పిన అన్ని విషయాలూ నేను విన్నాను సార్. నాకు నా బాల్యం గుర్తుకొచ్చింది. మీ వాగ్దాటి, చరిత్ర వివరణా పటిమలో, ఎలాంటి మార్పు లేదు. గత జ్ఞాపకాలతో మనస్సుకు ఎంతో ఆనందం కలిగింది సార్!..” ఎంతో ఆనందంగా చెప్పాడు శ్రీరామ్.
“శ్రీరామ్!.. నేటి విధ్యావిధానం సవ్యంగా లేదు. ఇంగ్లీషు మీడియం కారణంగా మన గత దేశ చరిత్ర మరుగున పడిపోయింది. పోతూ ఉంది. భావితరాల వారికి తప్పని సరిగా మన మహోన్నత చరిత్ర, ఆనాటి మన చరిత్ర నాయకుల జీవిత జీవన విషయాలు సవ్యంగా తెలియాలి. అంటే అధ్యాపకులు పిల్లలకు సక్రమంగా విశదీకరించాలి. తేనియలూరే మన తెలుగు భాషలో మన ఈ భారత అవనిపై జన్మించి, దేశం కోసం, మన హైందవ సముదాయాభివృద్ధి కోసం, ప్రగతి కోసం పాటుబడి, తమ జీవితాలను తృణప్రాయంగా భావించి దేశ దాస్య విముక్తికి పాటుపడిన మహనీయులు ఎందరో!.. వారి కథనాలను మన భావి భారత పౌరులైన విద్యార్థులందరూ తెలుసుకొనడం ఎంతైనా అవసరం. ఆ ఉద్దేశ్యంతో నేను ఒక చిన్న పుస్తకాన్ని ‘మన భారత అవని’ అను పేర వ్రాశాను. దాన్ని ప్రచురించి ప్రతి స్కూల్లో వున్నత తరగతుల విద్యార్థులకు పంచాలన్నది నా అభిలాష. తప్పుగా అనుకోకు. ఆ విషయంలో నీవు నాకు సాయం చేయగలవా!.. నేను ఒక వంద పుస్తకాలను అచ్చు వేయించాను. నా ముఖ్య శిష్యులలో కొందరికి పంచాను. ఒక్కక్షణం..” మాస్టారు వేగంగా ఇంట్లోకి వెళ్ళి చేత ఒక పుస్తకాన్ని పట్టుకొని వచ్చి శ్రీరామ్ చేతికి అందించాడు.
“ఈరోజు నేను పిల్లలకు చెప్పిన విషయాలు ఈ పుస్తకంలోని తొలి పదిపేజీలు. నీవు పూర్తిగా ఒకసారి ఈ పుస్తకాన్ని చదివి నా భావనలు నీకు నచ్చితే, నీవు కొన్ని పుస్తకాలను అచ్చు వేయించి కొందరికి పంచితే బాగుంటుంది. ఇందులో కేవలం మన దేశ విషయాలే కాదు చివరన ప్రపంచ విషయాలు ఉన్నాయి. పూర్తిగా చదివి నీ అభిప్రాయాన్ని నాకు తెలియపరచగలవా?” అభ్యర్థనగా అడిగారు సాంబశివం మాస్టారుగారు.
“తప్పకుండా సార్!.. చదువుతాను. నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తాను. పుస్తకాన్ని అచ్చువేయించి విద్యార్థులకు పంచుతాను.”
మాస్టారుగారి ముఖంలో ఎంతో ఆనందం.
“వస్తాను మాస్టారు గారు..” చేతులు జోడించి నమస్కరించి శ్రీరామ్ కారువైపుకు నడిచాడు.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 26 నవలలు, 230 కథలు, 21 నాటికలు/నాటకాలు, 85 కవితలు రాశారు. ప్రస్తుతం 27వ నవల ‘అపర చాణుక్య’ వ్రాస్తున్నారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.
