[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ గారి ‘మన సినిమాల్లో కైకమ్మ పాత్ర చిత్రణ’ అనే రచనని అందిస్తున్నాము.]
దశరథ మహారాజు భార్యలలో ప్రముఖురాలు కైకేయి. ఆమె లేకపోతే ఇంత రామాయణమూ జరిగేదే కాదు. దశరథ మహారాజు వీరాధివీరుడు. ఎంతటి వీరుడు అంటే రాక్షసులతో యుద్ధం సంభవించినప్పుడు దేవేంద్రుడు కూడా దశరథుడి సాయం కోరేవాడు. అలా ఒకసారి శంబరాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం వచ్చినప్పుడు ఇంద్రుడికి సాయంగా యుద్ధానికి వెళ్ళాడు దశరథుడు. అప్పుడు ఆయనతో పాటు కైక కూడా రథ సారథ్యం చేస్తానంటూ వచ్చింది. రాక్షసులకూ దేవతలకూ రాత్రింబవళ్ళు యుద్ధం జరిగింది. రాత్రి పూట రాక్షసులకు బలం ఎక్కువ. దశరథుడు వారి ధాటికి తట్టుకోలేక మూర్చపోతాడు. అప్పుడు కైక ఆయన రథాన్ని యుద్ధరంగానికి దూరంగా తీసుకువెళ్ళి సేద తీరుస్తుంది. అలా రెండుసార్లు చేస్తుంది. “రెండుసార్లు నా ప్రాణం రక్షించావు గనుక నీకు రెండు వరాలు ఇస్తాను” అని అంటాడు దశరథుడు. “అవి మీ దగ్గరే ఉంచండి. అవసరం అయినప్పుడు కోరుకుంటాను” అని చెబుతుంది. శ్రీరామ పట్టాభిషేక సమయంలో ఆ వరాలు కోరుకుంటుంది.
కైక రెండు వరాలు కోరుకోవటానికి కారణం ఇది. సరే! సినిమాల విషయానికి వస్తే కైక పాత్ర వరకూ తీసుకుంటే మొదటగా చెప్పవలసినది ‘పాదుకా పట్టాభిషేకం’ (1966) చిత్రం. ఇందులో కైకమ్మగా కన్నడ నటి లీలావతి అత్యున్నతమైన నటన ప్రదర్శించింది. మొదట కౌసల్య వచ్చి కైకకి రామపట్టాభిషేకం వార్త చెప్పి “భరత శత్రుఘ్నులను రప్పించటానికి కూడా వ్యవధి కూడా లేకుండా పోయింది” అంటుంది. “దానికేముంది అక్కా! ముహూర్తం అలా కుదిరినప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే ఎలా?” అంటుంది కైక. ఆ వార్తకి మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నట్లు నిర్మలమైన మనసు ముఖంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది లీలావతి ముఖంలో. కౌసల్య వెళ్ళిన తర్వాత మంధర మాటలకు మొదట కోపం తెచ్చుకుంటుంది. “మా తల్లి నిన్ను అరణంగా పంపింది కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను. ఆపు నీ వాచాలత!” అంటుంది కోపంగా.
అక్కడ సత్యలోకంలో భూదేవి బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి రావణాది రాక్షసుల వలన పెరిగిపోతున్న భూభారం తొలగించవలసినదిగా కోరుకుంటుంది. బ్రహ్మ సరస్వతి వంక చూసి “ముల్లోకాలకు శ్రేయోదాయకమైన ఈ కార్యం నీవు వహించవలసి ఉన్నది” అని అంటాడు. అంగీకరిస్తున్నట్లు తల వంచి అభివాదం చేస్తుంది వాణి.
సరస్వతీదేవి కైకమ్మను ఆవహించగానే తనలో ఏదో మార్పు జరిగిపోతున్నట్లుగా తల్లడిల్లిపోతూ రెండు చేతులతో తల పట్టుకుని పడిపోతుంది. తేరుకున్న తర్వాత మంధర వచ్చి దుర్భోధ చేస్తూ ఉంటే ఆమె మాటల ప్రభావానికి లొంగిపోతున్నట్లుగా మౌనంగా వింటూ ఉంటుంది. క్రమక్రమంగా ఆమె స్వభావంలో మార్పు చోటు చేసుకుంటుంది. ముఖంలో కఠినత్వం వస్తుంది.ఈ సన్నివేశంలో కైక పాత్రకు సంభాషణలు లేవు. సహనటి చెప్పే సంభాషణలకు అనుగుణంగా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి. ఇలాంటి సందర్భాల్లోనే ఆయా నటీనటుల నటనా ప్రతిభ వ్యక్తం అవుతుంది.
దశరథుడు వచ్చి అంతక్రితం ఇచ్చిన వరాలు ఇస్తాను కోరుకోమంటాడు. అయన వైపు ఓరగా చూస్తూ, వగలు పోతూ, నవ్వుతూ, అయన మెడ చుట్టూ రెండుచేతులు వేసి “రేపటి ఈ ముహూర్తంలో రామునికి బదులుగా భరతునికి పట్టాభిషేకం చేయాలి” అంటుంది గోముగా. తన మెడ చుట్టూ ఉన్న ఆమె చేతులను విడదీసి నాగుపాముని విదిలించినట్లు విదిలించి కొడతాడు ఆగ్రహంగా. ఆమె వదనంలో నవ్వు మాయమౌతుంది. తోక తొక్కిన త్రాచులా లేచి “రాముడు పదునాలుగేండ్లు అరణ్యవాసం చేయాలి. ఇది నా రెండవ వరం” అంటుంది కఠినంగా. దర్శకుడు డైలాగ్స్ మాత్రమే చెబుతాడు. అవి ఏ ఉచ్చారణతో పలకాలి, ముఖకవళికలు ఎలా ఉండాలి అనేవి నటీనటుల మీద ఆధారపడి ఉంటాయి. సంభాషణలో భావాన్ని బట్టి ఆ మాటలు పలికే విధానంలో కూడా తేడా కనిపిస్తుంది. అయన విదిలించి కొత్తగానే ఆమె ముఖ కవళికలు మారిపోయి నవ్వు స్థానంలో కాఠిన్యం చోటుచేసుకుంటుంది. స్వర స్థాయి పెరుగుతుంది.
ఆమెను కన్విన్స్ చేయటానికి చాలాసేపు బ్రతిమిలాడుతాడు. అయన మాటలు వినిపించుకోనట్లు విసురుగా తల తిప్పుకోవటం, అవతలకి వెళ్ళటం వంటివి చాలా బాగా అభినయించింది లీలావతి.
“అడిగేవరకూ ప్రాణాలు తీసారు. తీరా అడిగిన తర్వాత ఆగ్రహిస్తున్నారు. ఇది మీకు న్యాయమేనా చెప్పండి” అంటుంది మళ్ళీ ప్రసన్నుడిని చేసుకోవటానికి. “మీవంటి వారు మహారాజులైనప్పుడు ఇనవంశ కీర్తి ప్రతిష్ఠలు అంతరించక ఏమౌతాయి?” అని ముందరి కాళ్ళకు బంధాలు వేస్తుంది. చివరకు “మీతో నేను వాదించలేను. ఆడి తప్పుటయో, మాట నిలుపుటయో బాగా ఆలోచించండి” ఇక నామాటకు తిరుగులేదు అన్నట్లు చెప్పి విసవిసా వెళ్ళిపోతుంది.
ఈ సన్నివేశంలో దశరథుడిగా ధూళిపాళ, కైకేయిగా లీలావతి ఆయా పాత్రల్లో జీవించారు.
‘సంపూర్ణ రామాయణం’ (1972) లో దశరథుడు, కైకేయి పాత్రల్లో గుమ్మడి, జమున నటించారు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత పిలుచుకు రావటానికి భరతుడు తల్లులతో, గురువులతో వెళతాడు. ఆ సమయంలో కైక “రామా! స్వార్థబుద్ధి నన్ను అంధురాలిని చేసింది. నా కంటివెలుగును నిన్ను దూరం చేసుకుని, నా బిడ్డకూ దూరమయ్యాను. అయోధ్యను అరాచకం చేసాను. శిక్షించటానికి కూడా అర్హత లేదని అందరూ నాపై క్షమ చూపుతున్నారు. అది నన్ను అగ్నిలా దహించి వేస్తున్నది. నేను కోరిన వరాలు పంచ భూతాల సాక్షిగా ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నాను. నువ్వు రాజ్యానికి వచ్చి మాకు మనశ్శాంతి ప్రసాదించు రామా!” అంటుంది.
అప్పటిదాకా నెత్తికెక్కి స్వారీ చేసిన దెయ్యం ఏదో దిగిపోయినట్లు, వాస్తవానికి వచ్చి నిజం గ్రహించినట్లు, పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నట్లు జమున చాలా బాగా నటించింది. జమున నటించిన పాత్రల్లో వైవిధ్యమైన పాత్ర ఇది. ఆమె ‘సీతాకల్యాణం’ (1976) లో కూడా కైకమ్మగా నటించింది. అందులో వరాలు కోరుకునే ఘట్టం లేదు. సీతారాముల కళ్యాణం చూసి ఆనందించినట్లుగా అంతవరకే ఉంది కథ.
సీతాకల్యాణం కథకు కొనసాగింపు ‘సీతారామ వనవాసం’ (1977) దాదాపు ప్రధాన పాత్రలు అందరూ సీతాకల్యాణంలో నటించిన వారే ఇందులో కూడా నటించారు. కైకగా విజయలలిత నటించింది. “ఈ కైక వరాలకు నీవు అంగీకరించవద్దు. నీవు లేకుండా నేను జీవించలేను రామా!” అన్న దశరథుడి మాటలకు “మళ్ళీ మొదటికి వచ్చాడే!” అన్నట్లు చూస్తుంది కైక. సీతారాములు అడవులకు బయలుదేరుతుంటే స్వయంగా నారచీరలు ఇచ్చి సాగనంపుతుంది కైక. “ఓ! మా పెద్దకోడలు సీతమ్మ. పతి ననుసరించే ఇల్లాలివి. నీవూ నారచీరలు ధరించాలని వేరే చెప్పనక్కరలేదు. ఇవిగోమ్మా!” అని అందిస్తుంది. విజయలలిత ముఖంలో గడుసుతనం చూస్తుంటే కోపం, నవ్వు రెండూ వస్తాయి ప్రేక్షకులకు.
చిత్రకూటంలో అందరికీ దూరంగా నిలబడి ఉన్న కైక దగ్గరకు వచ్చి రాముడు “ఇలా ఒంటరిగా ఇక్కడెందుకు ఉన్నావమ్మా!” అని అడుగుతాడు. “పదిమందిలో తలెత్తుకు తిరిగే గౌరవం ఇక నాకెక్కడిది నాయనా! ఒక్కపూటయినా నిన్ను చూడకపోతే తల్లడిల్లి పోయే నేను పదునాలుగేళ్ళు అడవికి పొమ్మని ఎలా అన్నాను? ఏ స్వార్థ పిశాచం నన్ను ఆవహించిందో? చేజేతులా వైధవ్యం తెచ్చుకున్న దురదృష్టవంతురాలిని” అంటూ కన్నీరుమున్నీరు అవుతుంది.
క్లబ్ డాన్సర్‌గా, జానపద చిత్రాల్లో కూడా వాంప్ తరహా పాత్రలలో ఎక్కువగా నటించే విజయలలితకు నటనను ప్రదర్శించటానికి అవకాశం ఉన్న చక్కటి పాత్ర కైకమ్మ. అప్పట్లో విజయవంతం కాకపోయినా ఇప్పుడు చూస్తే కళాఖండం అనిపిస్తుంది ‘సీతారామ వనవాసం’ చిత్రం.
‘శ్రీరామ పట్టాభిషేకం’ (1978) లో కైకమ్మ గా కాంచన, దశరథుడిగా ప్రభాకర రెడ్డి నటించారు. దశరథుడు నేల మీద పడి ఉండటం చూసి రాముడు కారణం అడుగుతాడు. “వారు పూర్వం నాకు రెండు వరాలు ఇచ్చారు. వాటిని నేను కోరాను. అన్నమాట నిలబెట్టుకోలేక, అసత్యమాడలేక బాధ పడుతున్నారు. వారి సత్యవ్రతం సంరక్షించే బాధ్యత నీపై ఉంది రామా!” అని చెబుతుంది. “నిస్సంకోచంగా సెలవివ్వండి. చెల్లిస్తాను” అంటాడు. “ఈ పట్టాభిషేక సంబరాలలో నీకు మారుగా నీ తమ్ముడు భరతుడికి పట్టం కట్టాలి. నీవు పదునాలుగేండ్లు జటావల్కల ధారివై వనవాసమున కేగవలె! ఇంతియే!” అంటుంది. “ఇంతియేనా! ఈ మహాసామ్రాజ్యాన్ని మా సోదరులలో ఎవరు ఏలుకున్నా ఒకటే!” అని చెబుతాడు.
ఈ ఘట్టంలో కైకేయిగా కాంచన, రాముడుగా యన్.టి.ఆర్., నటించారు. కాంచన కనురెప్పలు ఎత్తి చూడటం లోనూ, నడక లోనూ, చేతులు కదిలించటం లోనూ రాజసం ప్రదర్శించింది. నటనా పరంగా ఇద్దరిలోనూ లోపం లేకున్నా వయసు రీత్యా చూస్తే, కాంచన ఆయన ముందు చాలా చిన్నవయసుగా కనిపించింది. వారిద్దరూ తల్లీకొడుకులు అంటే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
‘శ్రీరామాంజనేయ యుద్ధం’ (1975) లో రాముడు సీతకు కొన్ని చిత్రపటాలు చూపిస్తూ ఉంటాడు (బాపు బొమ్మలు). అందులో ఒక పటం చూస్తూ “శ్రీవారి బాల్యం అంతా మా పిన్నత్త గారు కైకమ్మ ఒడిలోనే గడిచినట్లుందే!” అంటుంది సీత. “అవును సీతా! నన్ను కన్నతల్లి కౌసల్యాదేవి అయినా, నా గారాల తల్లి మా పిన్నమ్మ కైకాదేవి. ఆనాడు ఆమె వరాలు కోరకుంటే రావణాది రాక్షసుల సంహారం జరిగేనా? అసూయాపరురాలు అనే నింద తాను భరించింది. అసుర సంహారకుడన్న కీర్తి నాకు దక్కేటట్లు చేసింది” అని చెబుతాడు. ఈ చిత్రంలో సీతారాములుగా యన్.టి.ఆర్., సరోజాదేవి నటించారు. కైక పాత్ర లేకపోయినా ఆ పాత్ర అంతరార్థం ఈ ఒక్క మాటలో చెప్పేశారు సంభాషణా రచయిత ముళ్ళపూడి వెంకటరమణ.
ఇంకా శ్రీరామకథ, వాల్మీకి, భూకైలాస్ వంటి చిత్రాల్లో కైక పాత్రలు ఉన్నా, అవి కొన్ని సెకన్లు కనబడి వెళ్ళిపోతాయి. వాటి గురించి చెప్పుకోవల్సినంత ప్రత్యేకతలు ఏమీ లేవు.
గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.

