[డా. సత్యసాయి కొవ్వలి రచించిన ‘మన పోతన’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
ముందుగా..
పోతన పేరు వినగానే తెలుగు వారి గుండెలో వేయి తంత్రులు మోగుతాయి. ఈ తరంలో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లాటి నర్సరీ రైము రాని వారున్నారేమో కానీ గత తరాలలో తెలుగునాట పోతన పద్యాలు రాని వారెవరూ లేరని నా ప్రబల విశ్వాసం. మనందరికీ సుపరిచితమైన ఈ క్రింది పద్యం చూడండి.
కం.
పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామభద్రుండట
నే పలికిన భవహరమగునట
బలికెద వేరొండు గాథ పలుకగనేల!!
ఈ పద్యం భాగవతాన్ని తెనుగించడానికి ముందు బమ్మెర పోతన చెప్పినది. ఇంకా “కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ”, “అలవైకుంఠపురములో”, “సిరికింజెప్పడు”, ఇలా అనేక పోతనపద్యాలు జనాల హృదయాలలోమార్మోగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఈయన రచనలలో హృదయానికి ప్రాధాన్యం ఇవ్వడం.
ఎవరైనా చెప్పాల్సిందంతా చెప్పేసి ఆనక నాదేం లేదు అని తప్పించుకోదలిస్తే “పలికించు విభుండు రామభద్రుండట” అని ఛలోక్తిగా అనడం కద్దు. ఇలాంటి కొన్ని పద్యాలు తెలుగువారి నిత్యజీవితంలో భాగమయి పోయాయి. వాటి పాదాలు జాతీయాలలాగా స్థిరపడిపోయాయి కూడా. అన్నిచోట్లా నేనున్నానని తమ తమ ఉనికిని ప్రదర్శిస్తోంటే “ఇందుగలఁ డందు లేఁ డని సందేహము వలదు” అనడం, జీవితంలో త్వరత్వరగా ఎదుగుతున్న వారి గురించి “ఇంతింతై వటుడింతై” అనడం, ఉపకారం కోరి ఎవరిదగ్గరకైనా వెళ్ళితే మీరు కాక నాకెవరూ లేరని నమ్మకంగా పలకాలంటే “నీవే తప్ప నితఃపరంబెరుగ” అని ప్రాధేయపడడం కొన్ని ఉదాహరణలు.
ఈ చిన్నవ్యాసంలో పోతన కవిత్వసొబగులని నాశక్తి మేరకు మీతో పంచుకోవాలని పేరాశ. ఈవ్యాసరచనకి అంతర్జాలంలో ఉన్నవనరులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారి పోతనభాగవతం ఎనిమిది భాగాల ప్రచురణలు ఉపయోగపడ్డాయి. ఈ సందర్భంలో https://telugubhagavatham.org గురించి చెప్పాలి. దీని కర్త అయిన ఊలపల్లి సాంబశివరావు గారు విద్యుత్ శాఖలోఇంజనీయరుగా పదవీ విరమణ చేసిన తర్వాత ఈ వెబ్‌సైటుని ప్రారంభించారు. ఈయన చేసిన కృషికి నిత్య ప్రాతఃస్మరణీయులు. ఇంత గొప్ప పని చేసి కూడా అంతా నల్లనయ్య చేయించాడు అని చెప్పగలడం ఆయనకున్న పరిణతి. కృష్ణుడు బోధించిన నిష్కామకర్మ యోగం. నేను ఇక్కడ మీతో పంచుకునే విషయాలకు మూలం ఆయన తెలుగువారికి అందించిన వనరులు. నాకు ఉపయోగపడిన, అగుపడిన మరికొన్ని వనరుల పట్టిక ని ఈవ్యాసం చివరలో ఇచ్చాను.
కవి, కావ్య విశేషం
వ్యాసప్రోక్తమైన భాగవతాన్ని తెలుగులోకి ద్వాదశ స్కంధాలుగా అనువదించిన మన బమ్మెర పోతన తారకమంత్రోపాసకుడు. కేసన, లక్కమ్మ దంపతుల కుమారుడు. 15వ శతాబ్దం వాడు. బమ్మెర గ్రామంలో పుట్టినవాడు. సాహితీ క్షేత్రాన్నికలంతో, వ్యవసాయ క్షేత్రాన్ని హలంతో సమసామర్థ్యంతో దున్ని, తెలుగువారి పంట పండించిన సహజకవి. భోగినీ దండకం, వీరభద్రవిజయం కూడా రచించాడు.
లేతవయస్సులోనే తన కవితా పటిమవల్ల జితానందయోగి వద్ద గురూపదేశం పొంది రామాజ్ఞగా శ్రీకృష్ణుడి చరిత్ర వ్రాసిన చరితాత్ముడు, పోతన. విశ్వనాథ వారన్నట్లు “పోతన్న తెలుగుల పుణ్యపేటి.” కరుణశ్రీ గారి మాటల్లో తెలుగునాట భక్తి సామ్రాజ్యాన్ని ఏలిన ముగ్గురు రాజుల్లో ఒకడు.
తే.
గుడులుకట్టించె కంచర్ల గోపరాజు
రాగములుకూర్చె కాకర్ల త్యాగరాజు
పుణ్యకృతిచెప్పె బమ్మెర పోతరాజు
రాజులీమువ్వురును భక్తిరాజ్యమునకు
మన కవులలో అన్నమయ్య, త్యాగరాజు మొదలైన వారిలాగానే పోతన కూడా ఎవరినీ ఆశ్రయించలేదు. తన భాగవతాన్ని “ఇమ్మనుజేశ్వరాధములకు” ఇవ్వనని, రామాజ్ఞగా వ్రాసిన భాగవతాన్ని శ్రీహరికే అంకితమిచ్చిన ధన్యుడు. “ధనమదాంధుల కొలువేల తాపసులకు?” అన్న భావనతో నిరాడంబరంగా జీవించినట్లు మనకి తెలిసిన కథలద్వారానే కాక ఆయన కవిత్వం వల్ల కూడా వ్యక్తమవుతుంది.
ఏ భాషలో వ్రాయాలో అన్న సందిగ్ధం వచ్చినప్పుడు
క.
కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ, గొందఱకును సంస్కృతంబు గుణమగు, రెండుం
గొందఱికి గుణములగు నే, నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్
అని తేల్చాడు. అన్నట్లే ఆయన సంస్కృత పదాలని కూడా తెలుగు పదాల మాదిరి వాడి అటు సంస్కృత పండితులనీ, ఇటు పామరులనీ కూడా మెప్పించాడు. ఇక్కడొక విచిత్రం గమనించాలి. భాగవతం ఆంధ్రీకరించినవాడు శైవుడు. వ్రాయబడినది విష్ణుచరిత్ర. అంకితమిచ్చింది రాముడికి.
భాగవత మహిమ గురించి అనేక పురాణాలు మనకి తెలియచెప్పాయి. అది పోతన మాటలలో చెప్పాలంటే
ఆ.
వేదకల్పవృక్షవిగళితమై, శుక
ముఖసుధాద్రవమున మొనసి యున్న,
భాగవతపురాణఫలరసాస్వాదన
పదవిఁ గనుఁడు రసికభావవిదులు. (1-37)
వేదాలూ, పురాణాలు, భారతం వ్రాసినా కూడా వ్యాసుడు అసంతృప్తిగా.. “యాత్మ సంతస మంద దాత్మలో నీశుండు సంతసింపక యున్న జాడ దోఁచె” అనుకున్నసందర్భంలో, నారదుడు వ్యాసుడి అసంతృప్తికి కారణం చెప్పాడు. వ్యాసుడు అనేక రచనలు జేసినప్పటికీ, హరిని నుతింపలేదు. హరినామ స్తుతి లేని కావ్యం శ్రీకరమై ఉండదు, విష్ణువే విశ్వము, ఆయన పరాక్రమాన్ని వర్ణించే కావ్యరచనవల్ల ఈ అసంతృప్తి పోతుందని, కాబట్టి భాగవత కావ్యాన్ని రచించమని చెప్తాడు. అట్టి మహత్తర కావ్యపు తెలుగు అనువాదంలో 12 స్కంథాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.
| స్కంధ సంఖ్య | విషయము (సారాంశం) | పద్యాల సంఖ్య (సుమారు) |
| 1 | భాగవత మహిమ, ఋషుల ప్రశ్నలు, శుక మహర్షి ఉపదేశ ప్రారంభం | 530 |
| 2 | సృష్టి, విశ్వరూప దర్శనం, భక్తి మార్గం | 288 |
| 3 | సృష్టి వివరాలు, కపిల మహర్షి ఉపదేశాలు | 1055 |
| 4 | ధ్రువుని కథ, రాజవంశాల వివరాలు | 977 |
| 5 | భువన కోశం, జడభరతుని కథ | 352 |
| 6 | అజామిలుని కథ, భక్తి మహిమ | 531 |
| 7 | ప్రహ్లాదుడు చరిత్ర, నరసింహ అవతారం | 483 |
| 8 | గజేంద్ర మోక్షం, వామన అవతారం | 745 |
| 9 | రాజవంశాలు, శ్రీరాముని కథ సంక్షిప్తంగా | 736 |
| 10 | శ్రీకృష్ణుడు జననం, లీలలు | 3135 |
| 11 | ఉద్ధవ గీత, భక్తి తత్త్వాలు | 127 |
| 12 | కలియుగ లక్షణాలు, భాగవత ముగింపు | 54 |
| మొత్తం పద్యాలు | 9013 | |
| సీసపద్యాల కిందివాటితో | 10061 | |
| వచనం | 2680 | |
| కందం | 2610 | |
| సీసం | 1047 | |
| తేటగీతి – సీసం తో /విడిగా | 772 /290 | |
| ఆటవెలది -సీసంతో / విడిగా | 276 /427 | |
| మత్తేభం | 587 | |
| చంపకమాల | 486 | |
| ఉత్పలమాల | 475 | |
| మూలం: https://telugubhagavatam.org/?stats&Branch=tartamalu&Fruit=ChandassuGananaPattika | ||
ఇక్కడ కొన్ని వింతలూ, విడ్డూరాలు గమనించాలి.
- పోతన మూలానికి మక్కికి మక్కీ అనువాదం చేయలేదు. తన ప్రతిభనీ, ఊహనీ జోడించాడు. ఆయన చేసినది అనుసృజన.
- 2.సుమారు 9000 పద్యాలున్న భాగవతంలో మూడోవంతు దశమ స్కంథంలో ఉన్నాయి. దీన్ని పూర్వ, ఉత్తర భాగాలుగా విభజించాడు, పోతన. ఈస్కంథంలో కృష్ణుడి జననం, లీలలూ వర్ణించాడు. అతి తక్కువ పద్యాలున్నవి ఏకాదశ (127), ద్వాదశ (54) స్కంథాలు. ఏకాదశస్కంథంలో ఉద్ధవగీత, భక్తి తత్వాలు ఉంటే, కలియుగ లక్షణాలు, బాగవత ముగింపు ద్వాదశ స్కంథంలో ఉన్నాయి.
- పోతన శిష్యుడైన వెలిగందల నారయ 11 మరియు 12వ స్కంధాలను పూర్తి చేశాడు. ఆ కారణంగా వాటిని త్వరగా తక్కువ పద్యాలతో రచించి ఉండవచ్చు. భాగవతాన్ని పూర్తి చేయడానికి, శిధిలభాగాలను పూరించడానికి సహకరించిన వారు ఇంకో ఇద్దరున్నారు. వారే బొప్పరాజు గంగయ (లేదా గంగన్న) – ఇతను 5వ స్కంధాన్ని రచించాడు, ఏర్చురి సింగన్న– ఇతను 6వ స్కంధాన్ని పూర్తి చేశాడు.
- సంస్కృతంలో చంపూ కావ్యం అనే ప్రక్రియ ఉంది. దానిలో పద్యం, గద్యం కలిసి ఉంటాయి. తెలుగులో నన్నయ పెట్టిన ఒరవడి ప్రకారం చంపూ కావ్యశైలిలో తెలుగు పద్య కావ్యాలు ప్రత్యేకంగా లేవు. పోతన కూడా ఆశైలి ననుసరించాడు. భాగవతంలో ఉన్నసుమారు 10000 పద్యగద్యాలలో 2680 వచనాలు (గద్యం) కూడా ఉన్నాయి. పోతన వ్రాసిన గద్యం కూడా పద్యమంత అందంగా ఉండడం విశేషం.
- తెలుగు వారికి కందా బచ్చలి కూర చాలా ఇష్టం. పోతనకి కంద పద్యం ఇష్టం. భాగవతంలో సుమారు 2610 కంద పద్యాలు ఉన్నాయి. అంటే భాగవతంలో ఉన్న పద్యాలలో మూడో వంతు కందాలే. ఆమేరకందమైన పద్యాలే. తర్వాతి స్థానం సీస పద్యాలది. అవి 1047 ఉన్నాయి. సీసపద్యాల కింద ఉండే అనుబంధ పద్యాలలో నాలుగింట మూడొంతులు తేటగీతులే. మిగిలిన పావు వంతు ఆటవెలదులు. అంటే, మొత్తం భాగవతంలో వెయ్యి దాటి తేటగీతులు, 700 దాకా ఆటవెలదులు ఉన్నాయి. ఇతర వృత్తాలలో ముఖ్యమైనవి మత్తేభం, చంపకమాల, ఉత్పలమాలలు.
పోతన భాగవతంలో సాహితీ సొబగులు-సొగసులు
అ. పోతన రచనలో ప్రధాన వస్తువు భక్తి
పోతన భక్తికి పెద్దపీట వేసాడన్నది స్వభావోక్తి. ఈ క్రింది పద్యాలే దానికి మచ్చు.
తే.
చేతులారంగ శివునిఁ బూజింపఁడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ, గలుగ నేటికిఁ దల్లుల కడుపుచేటు (1-14)
క.
నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయునుఁ
దాపసమందార! నాకు దయచేయఁ గదే (10.1-1272)
ఆ. మెండైన రసపోషణ – ఔచిత్యప్రదర్శన
పోతన తన పద్య, గద్యాలలో అనుపమాన ఔచిత్యప్రదర్శన, రసపోషణ చేసాడు. నృసింహవతార వర్ణనలో “ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును”, అని మొదలయ్యే గద్యంలో ఆయన వాడిన పదగాంభీర్యానికి, ఉచిత శబ్దాడంబరానికి మనకి “బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీరరస సంయుతుండును, మహాప్రభావుండును నయిన శ్రీనృసింహదేవుండు” కళ్ళకి కట్టక మానడు. మన రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. హిరణ్యకశిపుడు స్తంభాన్ని బద్దలు కొట్టినప్పుడు వచ్చిన ఛటచ్ఛట స్ఫటస్ఫట ధ్వనులు మన చెవులను తాకుతాయి. కేవలం ఈ గద్యం చదివినంతనే, నృసింహుని ప్రత్యక్షంగా చూసిన హిరణ్యకశిపుని పరిస్థితి అవగతమవుతుంది.
ఇ. వర్ణనా పటిమ
పోతన పద్యాలలో వర్ణనలు జరుగుతున్న ఘట్టాన్ని కళ్ళకి కట్టినట్లు చూపిస్తాయి. ఉదా..
శా.
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. (8-622)
బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే, వామనుడు చూస్తుండగానే విపరీతంగా, ఆకాశం, మేఘాలకన్నా పైకి ఎదిగి, పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు. ధ్రువ నక్షత్రం కూడ దాటేసి, మహర్లోకం, సత్యలోకాలు దాటి మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు. ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు. ఒక్కసారి కళ్ళు మూసుకుని పద్యం మననం చేస్తే ఆలోకాలన్నీ మనం కూడా తిరిగి రావచ్చు- అంత దృక్పటిమ ఉన్న వర్ణనలు పోతనవి.
ఈ. అలంకారభూషితం పోతన కవిత్వం
విష్ణుమూర్తి అలంకారప్రియుడు అంటారు. అందుకేనేమో పోతన ఆ విష్ణులీలలు నుతించిన భాగవతంలో అడుగడుగునా సాహితీ అలంకారాలు ఇబ్బడిముబ్బడిగా గుప్పించాడు.
శబ్దాలంకారం (శబ్దాన్ని అనుసరించి కలిగే కావ్యసౌందర్యం), అర్థాలంకారం (అర్థం వల్ల కలిగే కావ్యసౌందర్యం) అని అలంకారాలు ప్రధానంగా రెండు రకాలు. శబ్దాలంకారాలలో ఒకే హల్లు మరల మరల వేస్తే వృత్యనుప్రాస, రెండు అంతకన్న ఎక్కువ హల్లులు అర్థబేధంతో అవ్యవధానంగా వేస్తే ఛేక. శబ్ద బేధం లేకుండా అర్థ బేధంతో మరల మరల వేస్తే యమకం. అవ్యవధానంగా రెండు అంత కన్నా ఎక్కువ హల్లులు అర్థబేధం శబ్దబేధం లేకుండా తాత్పర్య బేధంతో వేస్తే లాటనుప్రాస. పోతన అన్నిరకాల శబ్దాలంకారాలని అలవోకగా, అలవాటుగా ఉపయోగించాడు. ఏవో కొన్ని ఉదాహరణలు ఇవ్వజూపడం సరికాదు. ఎందుకంటే పోతనగారి ప్రతి పద్యం అలంకారసమ్మిళితమే. ఇందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు.
శబ్దాలంకార ప్రయోగం
క:
వారిజలోచనుఁ బాడుచు
వారిజలోచనలు వారివారికి వేడ్కన్
వారివిహారము సలిపిరి
వారి విహారములు జగతివారికిఁ గలవే?
పై పద్యంలో ‘వారి’ అనేక సార్లు రావడం వల్ల వృత్యనుప్రాస, ‘వారిజలోచను’ అర్థభేదంతో మరల రావడం వల్ల యమకం ఉన్నాయి. క్రింది పద్యంలో ‘హరి’, ‘సిరి’ పలుమారులు వచ్చి అర్థభేదం లేకపోవడం వల్ల వృత్యనుప్రాస కనిపిస్తుంది.
8-285 క.
హరి చూచిన సిరి చూడదు
సిరి చూచిన హరియుఁ జూఁడ సిగ్గును బొందున్
హరియును సిరియునుఁ దమలో
సరిఁజూపులఁజూడ మరుఁడు సందడి పెట్టెన్.
విష్ణుమూర్తి తన కేసి చూస్తే లక్ష్మి చూసేది కాదు. లక్ష్మీదేవి తనని చూస్తే విష్ణువు చూడటానికి సిగ్గు పడేవాడు. లక్ష్మీ విష్ణువు ఒకరినొకరు సరిసమానంగా చూసుకునేలా మన్మథుడు తొందరలు పెట్టాడు అని లేని మన్మధుడిని ఉన్నట్లుగా నిర్ధారించి చెప్పడంలో ఉత్ప్రేక్ష (అర్థాలంకారం) కనిపిస్తుంది.
ఇంకో పద్యం చూద్దాం. అందులో అలంకార వైభవం ఎంతబాగుందో. (1) హరిహరి – అయ్యో, ఔరా వంటి పదం, (2) హరి అంటే విష్ణువు, (3) హరిహయుడు అంటే ఇంద్రుడు. యమకం ఉంది. అర్ధాంతరన్యాసమనే అర్థాలంకారం కూడా ఉంది. సాక్షాత్తూ లక్ష్మీపతి బిచ్చమెత్తుకోవడమేమిటి. ఇంద్రుడి కోసం ఆపని చేయడాన్ని గొప్పవారికి ఉండే పరోపకారగుణం అనే లక్షణం చూపించి సమర్థించాడు కవి.
క.
హరిహరి; సిరి యురమునఁ గల
హరి హరిహయుకొఱకు దనుజు నడుగం జనియెన్;
బరహితరత మతియుతులగు
దొరలకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్. ( 8-526)
‘లేమా’ అన్న రెండక్షరాల పదాన్ని అత్యంత సొగసుగా వాడడం పోతనకే చెల్లిందనిపిస్తుంది, క్రింది పద్యం వింటే. పద సౌందర్యాన్ని మించిన అందంగా ఉన్నది, కృష్ణుడు సత్యభామతో యుద్ధానికి ముందు విల్లందుకోమని పలికిన తీరు.
క.
“లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్. (10.2-172)”
యుద్ధానంతరం, ప్రశంసిస్తూ “కొమ్మా! దానవ నాథుని” అన్నపద్యం పై పద్యానికి ప్రతిబింబంలా ఉంటుంది. అక్కడ కూడా యమకం సొగసుగా వాడాడు కవి.
వామనావతారం సందర్భంలో వామనుని రాకతో సభలో కలిగిన కలకలాన్ని వర్ణించిన పద్యం “గుజగుజలు పోవువారును..” (8-534) వింటే మనం కూడా ఆనాటి సభికులలాగా గజిబిజి అవడం సహజం. అంబరీషోపాఖ్యానంలో “పెటపెట పండ్లు గీటుచును..” (9-102) అన్నపద్యంలో దూర్వాసుడి పళ్ళ పటపట, ఆయన కోపాగ్ని వల్ల వచ్చిన పొటపొట వినిపిస్తే, సముద్రమధన ప్రయత్నంలో విడువిడుమన్న వాసుకి అరుపులు, క్రింద కుదురు లేకపోవడం వల్ల మందరపర్వతం మునుగుతున్న బుడబుడ శబ్దం, దేవ రాక్షస గణాలు వడవడ వణకడం అనుభవంలోకి వస్తాయి.
ఈ క్రింది పద్యంలో పోతన వాడిన ఛేకానుప్రాసాలంకారం ఛేకులనే (పలుకు కమ్మదనం ఎరిగిన విద్వాంసులు) రంజింపచేయగలదు. దురదుర, నిలునిలు, మురముర, మెరమెర అనుప్రాసల అందాలు పద్యానికి అందాన్నిచ్చాయి.
క.
దురదురఁ బరువిడి బిరుసున
హరి హరి! నిలు నిలువు మనుచు నసురయుఁ గదిసెన్
మురముర! దివిజుల హృదయము
మెరమెర యిదె యడఁగు ననుచు మెఱసెన్ హరియున్. (10.2.161)
పోతన కవిత సౌందర్యానికి ఇంకొక మచ్చుతునక, షష్ఠీ విభక్తి ప్రత్యయాలు.. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ వాడి షష్ఠ్యంతాలతో వ్రాసిన నాలుగు పద్యాలలో ఒకటి ఈక్రిందిది.
ఉ.
హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం
హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్. (1-29)
పై పద్యంలో వృత్యనుప్రాస వాడితే, మనకు బాగా పరిచయమైన కమలాక్షు నర్చించు కరములు కరములు-శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ.. (7-169) అన్న పద్యంలో లాటానుప్రాస. కరములు మొదలైన పదాలను రెండుసార్లు అవ్యవధానంగా ఒకే అర్థంలో వాడినా, తాత్పర్యభేదం చూపించాడు.
“పాలిండ్లపై నున్న పయ్యెద జాఱించు-
జాఱించి మెల్లన చక్క నొత్తు
దళ్కు దళ్కను గండఫలకంబు లొలయించు-
నొలయించి కెంగేల నుజ్జగించుఁ….” (8-303)
అన్న పద్యంలో ముక్తపదగ్రస్తము కనిపిస్తుంది. ఒకపాదం చివరి పదం (ఉదా. జాఱించు)తో తర్వాతి పాదం మొదలవడం ముక్తపదగ్రస్తం.
పోతన భాగవతంలో చిత్రాలంకారం ప్రయోగం కూడా ఉంది. పద్యాన్ని ఒక చక్రం, కమలం, సర్పం లాంటి చిత్రాల్లో ఇమడ్చడం చిత్రాలంకారం.. శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు సెలవిచ్చిన పద్యం, సంబంధిత చిత్రం చూద్దాం.
క.
హరిసుతుఁ బరిచరుఁగాఁ గొని
హరిసుతుఁ దునుమాడి పనిచె హరిపురమునకున్;
హరివిభునకు హరిమధ్యను
హరిరాజ్యపదంబు నిచ్చె హరివిక్రముఁడై. (2-165)
చిత్ర మకుటం – చక్రబంధం – భాగవతం- 2 స్కం. 165 వ పద్యం- శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారి కూర్పు
మూలం: https://telugubhagavatam.org/?grammer&Branch=Alamkaramulu&Fruit=Alamakaramulu
చిత్రకవిత్రంలో సర్వలఘుప్రయోగం ఒక పోకడ. అలాంటి ప్రయోగంతో కవి ఒక పద్యాన్ని ఎంత సుందరంగా మలచగలడో అని ఆశ్చర్యపరిచే పద్యం ఇదిగో.
క.
అడిగెద నని కడువడిఁ జను;
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్;
వెడవెడ సిడిముడి తడఁబడ
నడుగిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్. (8-103)
విష్ణుమూర్తి గజేంద్రుడి రక్షణకోసం పరుగెట్టినప్పటి పద్యం. లక్ష్మీదేవి కూడా వెళ్తూఉన్న వైనం. లక్ష్మీదేవి భర్తను అడుగుదామని వేగంగా అడుగులు వేసేది. అడిగితే మారు పలుకడేమో అని అడుగుల వేగం తగ్గించేది. చీకాకుతో తొట్రుపాటుతో అడుగులు వేసేది. మళ్ళీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబాటుతో నడిచేది. నడకలోనే తడబాటును రకరకాలుగా చూపిన బహు చక్కని ఆణిముత్యం ఈ పద్యం.
అర్థాలంకారాలు
ఉపమాలంకారం అర్థాలంకారాలలో తలమానికం. భాగవతంలో 440 చోట్ల ఉపమ కనిపిస్తుంది. ఒక వస్తువును మరొక వస్తువుతో మనోహరంగా పోలిస్తే ఉపమాలంకారం. పోతన ఉపమ వాడడంలో నిష్ణాతుడు. నారదుడు వ్యాసుని అసంతృప్తికి కారణం చెప్తూ హరినామ స్తుతి చేసే కావ్యాన్ని బంగారుతామరపూలూ, హంసలతో ప్రకాశించే మానససరోవరంతోనూ, అట్టి స్తుతిలేని కావ్యాన్ని దుర్గంధపూరిత, కాకులనిలయమైన నీటి గుంటతో పోల్చడం ఒక ఉదాహరణ. ఈకింది పద్యంలో పోతన పూర్ణోపమ సాధించాడు.
మ.
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై. (1-227)
ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవచ్చినట్లే, తాను సృష్టించిన ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు నారాయణుడు ఉంటాడని కవి వర్ణన.
ఇంకొక ప్రధాన అర్థాలంకారం రూపకం. ఇందులో విషయానికి (ఉపమేయం), విషయికి(ఉపమానం) అభేదం ఉంటుంది. భాగవతమహిమ వర్ణించిన క్రింది పద్యంలో వేదమనే కల్పవృక్షానికి కాసిన మహాఫలం భాగవతం అని అభేదం కల్పించాడు.
ఆ.
వేదకల్పవృక్షవిగళితమై, శుక
ముఖసుధాద్రవమున మొనసి యున్న,
భాగవతపురాణఫలరసాస్వాదన
పదవిఁ గనుఁడు రసికభావవిదులు (1-37)
కూర్మావతారం ఎత్తడానికి కారణం మునుగుతున్న మందరపర్వతానికి ఆధారం అవడం అయితే, పోతన వీపుతీట శమియింప చేయడానికి (2-144) అని చమత్కరించి. హేతువు కాని దానిని హేతువుగా చూపి ఉత్ప్రేక్షించాడు. లలితస్కంథము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు (1-22) అన్న పద్యంలో అద్భుతంగా శ్లేషాలంకారం ఆవిష్కరించాడు పోతన. ఈపద్యాన్నిభాగవతం, కల్పవృక్షాల పరంగా అన్వయించవచ్చు. ఉదాహరణకి, కల్పవృక్షానికి కొమ్మలతో మనోజ్ఞంగా ఉంటే, భాగవతం 12 స్కంథాలతో లలిత మనోహరం. కల్పవృక్షానికి నల్లని వేళ్ళుంటే, భాగవతానికి నల్లనయ్య మూలం. కల్పవృక్షం చిలకల పలుకులతో మనోహరంగా ఉంటే, భాగవతం శుకమహర్షి తీపి మాటలతో మనోహరంగా ఉంది. అతిశయోక్తి (విషయాన్ని ఉన్నదానికంటే అధికం చేసి వర్ణించడం), దృష్టాంతం (ఉపమాన, ఉపమేయాలకి బింబప్రతిబింబ భావం ఆపాదించడం), స్వభావోక్తి (ఉన్నది ఉన్నట్లు మనోహరంగా వర్ణించడం), వ్యాజస్తుతి (స్తుతిని నిందగాను, నిందని స్తుతిగాను వ్యక్తపరచడం) వంటి ఇతర అర్థాలంకారాలు కూడా మనకి పోతన పద్యాలలో కనిపిస్తాయి. మునుపే చెప్పినట్లు, పోతన ప్రతి పద్యమూ అలంకారయుక్తమే. ప్రతీ పదమూ సుందరమే.
తెలుగువారికిష్టమైన ఘట్టాలు
తెలుగువారికి మొత్తంగా పోతనా, భాగవతమూ అంటే ప్రీతి ఉన్నాకూడా, గజేంద్రమోక్షణము మరియూ రుక్మిణీకళ్యాణ ఘట్టాలు అత్యంత యిష్టమైనవి. ముఖ్యంగా పెళ్ళికాని ఆడపిల్లలు రుక్మిణీకల్యాణం వింటే లేక చదివితే త్వరలో పెళ్లవుతుందని నమ్ముతారు. గజేంద్రమోక్షణ పారాయణ ఈతిబాధలనుండి కాపాడుతుందని నమ్మకం. కాబట్టి ఈరెండు ఘట్టాలగురించి కొంత మాట్లాడుకుందాం.
గజేంద్రమోక్షణం
ఒక గజరాజు తన గుంపుతో జలక్రీడకి వెళ్ళి మొసలి నోటికి చిక్కడం, నానా బాధలూ పడి చివరికి నారాయణుడిని శరణువేడగా ఆయన వచ్చి మొసలి బారినుండి ఏనుగును రక్షించడం ఇతివృత్తం. దీనిలో పద్యాల స్థాయి గొప్పగా ఉంటుంది. మామూలుగా శరణు వేడడం కాకుండా, శరణు ఇచ్చేవాడి గొప్పతనాన్ని ముందు చెప్పడం ఎవ్వనిచే జనించు పద్యంలో కనిపిస్తుంది. అమృత తుల్యమైన ప్రార్ధనగా ఉపయోగపడగల పద్యం.
ఉ
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ (8-73)
గజేంద్రుడికి సమస్త లోకాలకు ఆవల పెను చీకట్లను దాటి వెలుగు రూపంలో ఉండే ప్రభువు గురించి అవగాహన ఉంది. ఆయన లీలల గురించిన ఎరుక ఉంది. కానీ ఆపద వచ్చినప్పుడు ఆ ఎరుక ధైర్యమివ్వలేదు. పైగా
క.
కలఁ డందురు దీనుల యెడఁ,
గలఁ డందురు పరమయోగి గణముల పాలం,
గలఁ డందు రన్నిదిశలను,
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో? (8-86)
అని సంశయం. బీద, గొప్ప భేదం లేకుండా దీనులను రక్షించి, సజ్జనులకు సాయపడి, అండగా ఉండే ప్రభువు తన గోడు “వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?” (8-87.1) అన్న నిస్పృహ. చివరకి, సంపూర్ణ శరణాగతితో నీవే తప్ప నితఃపరంబరగనన్న స్పృహకలిగింది. ఇదొక అద్భుత పద్యం.
శా.
లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా! (8-90)
గజేంద్రుడు సంపూర్ణంగా శరణువేడినప్పుడు,, విష్ణుమూర్తి, వైకుంఠంలో, ఒక మూలగా ఉన్న మేడ పక్కనున్న అమృతసరస్సు పక్కన ఉన్న చంద్రకాంతశిలలతో కట్టిన అరుగు మీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు.
మ.
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహిపాహి” యనఁ గుయ్యాలించి సంరంభియై (8-95)
గజేంద్రుడి మొర విన్న తత్క్షణమే లక్ష్మీదేవికి చెప్పకుండా. అలంకారాలూ, ఆయుధాలూ లేకుండా ఉన్నపళాన ఉరుకున బయలుదేరాడు. చివరికి పట్టుకున్న లక్ష్మీదేవి పమిటచెంగు కూడా వదలలేదుట. ఈసందర్భంలో చెప్పిన పద్యం ఇంకొక రసగుళిక. మనకి కావల్సిన వారికి ఆపదొచ్చిందంటే మనం కూడా అలాగే అనాలోచితంగా పరుగెడతాం కదా.
మ.
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై. (8-96)
ఈ ఘట్టంలో విష్ణుమూర్తి ఉన్నపళంగా ఏనుగును రక్షించడానికి ఆయుధాలు కూడా లేకుండా పరిగెత్తడాన్నిఅసంబధ్ధమని గేలి చేసిన శ్రీనాథుడిని పోతన తగురీతిని సమాధాన పరచాడని కథ. శ్రీనాథకవి భోజనం చేస్తూంటే పోతన కొడుకు ఒక బండరాయి నూతిలో పడవేసి శ్రీనాథుడి కొడుకు నూతిలో పడ్డాడని అరుస్తాడు. శ్రీనాథుడు అలాగే ఉన్నపళంగా నూతి దగ్గరకి పరిగెడతాడు. అప్పుడు, కొడుకుని కాపాడడానికి కావాల్సిన తాడు తేకుండా వట్టిచేతులతో ఎలా వచ్చావని ఆయన్ని అడుగుతాడు. అప్పుడు శ్రీనాథుడికి భక్త రక్షణకోసం విష్ణుమూర్తి పడ్డ ఆత్రం అనుభవంలోకి వస్తుంది. దేని కైనా డెమో (demo) కావాల్సిందే!
మనమందరం ఆపద కలిగినప్పుడు గజరాజు లాగే బాధపడతాం, పోరాడుతాం, ప్రార్థిస్తాం. పోరాడుతూ ప్రార్థిస్తాం, ప్రార్థిస్తూ పోరాడుతాం. చివరకి మనవల్ల కాదని తెలిసాక భగవంతుడిని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ఏ కొంతమందిమో గజేంద్రుడిలాగా సంపూర్ణ శరణాగతి కోరగలుగుతాం. ఎందుకంటే గజేంద్రుడికి భగవంతుడి స్వభావమూ, శక్తి, విభూతుల పైనున్న అవగాహన మనలో చాలా తక్కువ మందికి ఉంటుంది. గజేంద్రుడు మనందరికీ ప్రతీక. ఈ ఘట్టాన్నుండి మనం నేర్చుకోవల్సిందేమిటంటే మన శక్తియుక్తులమీద ఆధారపడి ఆపదలనెదుర్కొనడం మంచిదేకానీ, మొదటి నుండే శరణాగతి కోరడం ఉత్తమమని. ఎంత త్వరగా మన అహంకారాన్ని, గర్వాన్ని వదిలి సంపూర్ణంగా మామేకం శరణం వ్రజ అన్న కృష్ణుడి ఉపదేశాన్ని పాటిస్తామో, మోక్షయిష్యామి మా శుచః అని ఆయన కూడా వెంటనే స్పందిస్తాడు. అంతే త్వరగా మన కష్టాలు తొలుగుతాయి.
రుక్మిణీ కల్యాణం
మానవసహజ చిత్తవృత్తులని అతి సొగసుగా, సహజంగా చిత్రించిన మరియొక ఘట్ఠం రుక్మిణీకల్యాణం. రుక్మిణి కృష్ణుడిని ఇష్టపడుతుంది. ఆమె అన్నగారు రుక్మి మాత్రం ఆవిడని ఛేదిరాజు శిశుపాలుడికిచ్చి వివాహం చేయనిశ్చయించాడు. తనకిష్టమైన కృష్ణుడికి ఒక బ్రాహ్మణుడి ద్వారా సందేశం పంపి, ఆయన వచ్చి తీసికెళ్ళి వివాహం చేసుకునేదాకా జరిగి నాటకీయ పరిణామాలలో రుక్మిణి అంతరంగాన్ని అతి హృద్యంగా చిత్రించాడు పోతన. ఈ ఘట్టం విన్నా, చదివినా మన ఇంటి ఆడపిల్ల పడుతున్న వేదనలాగా అనిపించేంత సహజచిత్రణ కనిపిస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణికి మన అనుభవంలో ఉన్నఒక సాధారణ ఆడపిల్లకి కలిగే భావోద్వేగాలను ఆపాదించడంతో మనందరమూ కథలో భాగమైపోతాము. రుక్మి మీద కోపం, శిశుపాలుడిపైన ప్రతికూలత మనలో ఒక్కసారిగా కలుగుతాయి.
రుక్మిణి కృష్టుడిని వివాహమాడ కోరి, ఒక బ్రాహ్మణుడి ద్వారా “నూఱుజన్మంబులున్ నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు, ప్రాణేశ్వరా” (10.1-171) అని సందేశం పంపుతుంది.. రుక్మిణి భక్తిభావం గొప్పది. తన తనువు, సౌందర్యం, మనసు, ఇంద్రియాలూ అన్ని భగవానుడికేనని, ఆయనకి దాస్యం చేయని జన్మ వ్యర్ధమన్న సమర్పణభావం ఆమెది.
కృష్ణుడు తానువచ్చి రుక్మిణిని చేపడతానని, అడ్డువచ్చిన శత్రువులను హరిస్తానని బ్రాహ్మణుడికి భరోసా ఇస్తాడు. కానీ అక్కడ రుక్మిణి మనసులో అనేక భయాలూ, సంశయాలూ. ఒక పక్క పార్వతీ దేవి తో “హరిం బతిఁ జేయుమమ్మ! నిన్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!” అంటూ గౌరీపూజ సమయంలో ఆర్తిగా ప్రార్థిస్తోంది. మరో పక్క, పంపిన బ్రాహ్మణుడు కృష్ణుడిని కలిసాడో లేదో, కృష్ణుడు తనని తప్పుగా అర్థం చేసుకున్నాడేమో, శివాజ్ఞ ఎలాఉందో, పార్వతీదేవి నన్నుకాపాడాలనుకుంటోందో లేదో, నా అదృష్టం ఎలా ఉందో అన్న ఊగిసలాటలో ఉంది. ఆ పరిస్థితిలో ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు కదా.
మ.
ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో?
విని, కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో? యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో? (10.1-1727)
ఆహా. మానవసహజ భావోద్వేగాలను సరిగా ప్రతిబింబింపచేసి, సందర్భోచిత పదప్రయోగం, రసపోషణలతో మన మనస్సులను ఆయాపాత్రలతో అనుసంధానింప గలవాడే కదా, అసలైన కవి. అట్టి కవి పోతన్నకి తెలుగువారు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలరు.
చివరికి కృష్ణుడు వచ్చాడు, ఎదిరించిన వారిని ఓడించి, రుక్మిణిని వివాహమాడాడు. కథ సుఖాంతమయింది.
మ.
ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం
ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్ (10.1-1784)
రుక్మిణీదేవి మహోన్నత గుణాలు కలిగి, సకల సంపదలు కలిగిస్తుంది. మంచి ప్రవర్తనతో, పుణ్య కర్మలు చేసేదైన, సుగుణాల నారీ శిరోమణి, మనోహారి యైన రుక్మణిని వివాహమాడాడు కృష్ణుడు. ఆవిడని చేపట్టి, శాశ్వతమైన యశస్సు పొందాడు. ఇక్కడ గొప్పదనం రుక్మిణికే ఆపాదించాడు పోతన.
మనం చేయగలిగినది
అనేక మంది మహానుభావులు పోతన భాగవతప్రచారానికి తగు ప్రయత్నంచేస్తున్నారు. అందులో ఒకరైన ఊలపల్లి సాంబశివరావుగారిని ముందుగానే స్మరించాం. కరుణశ్రీ గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎనిమిది భాగాలుగా ప్రచురించారు. అవి అంతర్జాలంలో తి.తే.ది. వారి జాలగృహంలో దిగుమతికి వీలుగా అందుబాటులో ఉన్నాయి (https://ebooks.tirumala.org)
కొందరు ప్రవచనకారులు కూడా పోతన భాగవతంలోని భక్తిని, మాధుర్యాన్ని మనకి పరిచయం చేసారు. 2006వ సం. ఫిబ్రవరి 2న తమ ప్రవచనం మొదటి రోజు ఆరంభిస్తూ బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారు ఇలా అన్నారు “ శ్రీమాన్ బమ్మెర పోతనామాత్యుల కృతమైన శ్రీమదాంధ్రమహాభాగవత పద్యాలన్నీ ముత్యాలే. కొన్నైతే ఆణిముత్యాలే. కనీసం అవైనా నేర్చుకొని కంఠతా పట్టి రోజు పఠిస్తూ ఉండటం ఎంతో మంచి అలవాటు”. అంతేకాకుండా “జీవితంలో ఒచ్చే ఒడుదుడుకు సమయాలలో భాగవత పద్యాల పఠనం అనే అలవాటు మనిషికి వలసిన మానసిక బలాన్ని, రక్షణను, ధైర్యాన్ని ఇస్తుంది. పైగా ఒడుదుడుకులను దాటే చక్కటి ఓదార్పును, దైవసహాయాన్ని అందిస్తుంది. ఇది తథ్యం” అని కూడ శలవిచ్చారు. దీన్ని స్ఫూర్తిగా మల్లిక్ పుచ్చా గారు తమ ఆధ్వర్యంలోని ఐబిఎఎమ్ (అంతర్జాల భాగవత ఆణిముత్యాలు) భాగవతం ఆణిముత్యాలు https://bhagavatamanimutyalu.com/index.html ద్వారా 504 ఆణిముత్యాలని మనకి అందించారు. అంతేకాక 2021 లో ప్రపంచవ్యాప్త పద్యాల పోటీలు నిర్వహించారు. గాయకులు శ్రీ నేమాని పార్థసారథి కూడా దీనిలో భాగస్వాములు.
మరికొన్ని ఇతర వనరులు
- యామిని గారి బ్లాగు Potana bhagavatam padyala samudayam – important poems of potana bhagavatam (https://potana-bhagavatam-poems.blogspot.com),
- యూట్యూబు ఛానల్ https://www.youtube.com/@sahithiparimalam
- కొండల్ రెడ్డి గారి https://www.youtube.com/@Padyaparimalam
- మాడుగుల నాగఫణి శర్మ గారు
https://www.youtube.com/@MadugulaNagaphaniSarmaofficial
- కర్నె కృష్ణమూర్తి భాగవతారు https://www.youtube.com/@shavlogs24x7
- తెలుగు ప్రవచనాలు http://www.youtube.com/@TeluguPravachanams
- పలికెద భాగవతము – నేమాని పార్థసారథి – youtube.com/@KeerthanaAcademy
- కె. వి. గిరిధరరావు గారి రచన, ఆరు భాగాలలో ఈమాట లో
- పోతన భాగవతంలో దృశ్యీకరణం – 1 -అగస్టు 2025
(https://eemaata.com/em/issues/202508/38589.html)
-
- పోతన భాగవతంలో దృశ్యీకరణం – 2 అక్టోబరు 2025 (https://eemaata.com/em/issues/202510/39733.html)
- పోతన భాగవతంలో దృశ్యీకరణం – 3 – ఢిసెంబరు 2025 (https://eemaata.com/em/issues/202512/40621.html)
- పోతన భాగవతంలో దృశ్యీకరణం – 4 – జనవరి 2026 (https://eemaata.com/em/issues/202601/41205.html)
- పోతన భాగవతంలో దృశ్యీకరణం – 5 – ఫిబ్రవరి 2026 (https://eemaata.com/em/issues/202602/41309.html)
- పోతన భాగవతంలో దృశ్యీకరణం – 6 – ఏప్రిల్ 2026 (https://eemaata.com/em/issues/202604/42414.html)
- చీమలమర్రి బృందావనరావు గారి, నాకు నచ్చిన పద్యం: పోతనామాత్యుని జీవన దృక్పథం (https://eemaata.com/em/issues/200807/1280.html)
- ఆంధ్రభారతి https://andhrabharati.com/itihAsamulu/bhAgavatamu/index.html
- Aditi Shah Pothana: Jewel of Telugu Literature, (https://www.livehistoryindia.com/story/people/pothana), 5 అక్టోబరు 2020
పైన చెప్పినవి కేవలం కొన్ని మాత్రమే. ఇంకా ఎందరో ఈ విషయంలో కృషి చేస్తున్నారు. వీరందరూ ఒక నెట్వర్క్ గా ఏర్పడి ఇంటింటా పోతన ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. పిల్లలకు పోతన పద్యాలు రుచి చూపించడం చాలా ముఖ్యం. కొంతమంది తమిళ శాస్త్రీయ సంగీత గాయకులు వారి కచ్చేరీలలో కొన్ని కీర్తనలకు ముందు వృత్తాలు (శ్లోకాలు) రాగయుక్తంగా రాగాలాపనతో పాటుగా కాని, దాని బదులుగా కాని పాడడం కద్దు. ఒక్కోసారి కొన్ని పద్యాలని రాగమాలికగా కూడా పాడతారు. మన తెలుగు గాయకులు కూడా పోతన పద్యాలని కచ్చేరీలలో జొప్పిస్తే మన సంస్కృతికి ఎనలేని సేవ చేసిన వారవుతారు. భక్తి, అక్షరరమ్యతలతో కూడియుండడం వల్ల పోతన పద్యాలు కచ్చేరీలలో బాగా ఇముడుతాయని నా విశ్వాసం.
స్వస్తి.
మంగళం కోసలాంద్రాయ మహనీయగుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం

