[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
వ్యక్తిగత, బాంధవ సంబంధాలు – భారతం, రామాయణం:
కుటుంబంలో అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ళ, తండ్రీ కొడుకుల సంబంధాలు నిర్వచించాయి మన పురాణాలు, ఇతిహాసాలు. భారతంలో ధర్మరాజు వ్యక్తిత్వ వికాసానికి రోల్ మోడల్. ‘అజాత శత్రువు’ ఆయన. దుష్ట చతుష్టయం కూడా భీమార్జునలను నిందిస్తారు. తీవ్ర శత్రుత్వం వారితో వహిస్తారే తప్ప, ధర్మరాజు నేమీ అనరు. ఇక ఆయన తమ్ముళ్ళకు ఆయన మాటే వేదవాక్కు. దానిని జవదాటరు. ‘పితృ సమో జ్యేష్ఠః’ అన్న నానుడికి లోబడి, ఆయనను తమ తండ్రిగా గౌరవించారు. భీముడు అప్పుడప్పుడు ఆయన మీద కోపం తెచ్చుకుంటాడు గాని, ఆయన తమ్ముడిని పల్లెత్తు మాట అనడు. కౌరవులు తమకు అంత చేసినా, యుద్ధం సర్వ వినాశ కారణమని, సంధికే మొగ్గు చూపుతాడు. ద్రౌపది భీమునితో ఒకసారి ధర్మజుని గొప్పతనాన్ని గురించి చెబుతుంది.
“ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు” అంటూ, “కేవల మర్త్యుడే ధర్మసుతుడు” అని ముగిస్తుంది. ఇక స్నేహ ధర్మం కర్ణదుర్యోధనుల రూపంలో మనకు వ్యక్తిత్వ పాఠాలను నేర్పుతుంది. వారి దుష్ట స్వభావాలను అటుంచితే, వారి స్నేహం అజరామరం.
Francis Bacon స్నేహితుడి గురించి ఇలా అన్నారు – “The real remedy for one’s flattery is the liberty of a friend”.
“ఒకరి ఆత్మస్తుతికి సరియైన విరుగుడు, వారి స్నేహితుని స్వాతంత్ర్యమే”. మనం గొప్పలు చెప్పుకోబోతే, “చాల్లేరా! ఆపు! నీ సంగతి తెలియనిదెవరికి?” అనగలిగేవాడు స్నేహితుడొక్కడే. కృష్ణార్జునులు కూడా చక్కని స్నేహితులు. కుచేలోపాఖ్యానం వ్యక్తిత్వ వికాసంలో ఒక మార్గదర్శి. బంధువులతో, చివరికి జీవిత భాగస్వామితో చెప్పుకోలేని విషయాలను సైతం స్నేహితులతో చెప్పుకోగలం.
రామాయణంలో మానవ సంబంధాల పరిమళాలు గుబాళిస్తాయి. రేపు పట్టాభిషేకం అనగా కైకేయి రాముడిని పిలిపించి, “నీవు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి, ఇది తండ్రిగారి ఆదేశం” అని చెబితే, ఆయన ఎందుకు? అని కూడా అడగడు. నాన్న చెప్పాడు, చేయాలి. అంతే! పితృవాక్య పరిపాలన అంటే అది.
సరే, ఆయనకు తప్పదు. సీతమ్మ వారికేం పని? ఆమెను వెళ్ళమనలేదుగా! కానీ భర్త వెంటే భార్య. కష్టాలలోనైనా సుఖాలలోనైనా ఇద్దరూ కలిసే ఉండాలి. ఆమె కూడా రడీ! రాముడెంత చెప్పినా ససేమిరా! ఓ.కె. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. లక్ష్మణుడికేం పని? మా అన్నయ్య వదినె అరణ్యవాసం చేస్తున్నారు. వారికి, అడవుల్లో, దగ్గరుండి అన్నీ చూసుకోవాలి అంటూ ఆయన కూడా తయారు. వీళ్ళందరి కంటే సుమిత్రాదేవి నాలుగాకులు ఎక్కువే చదివింది. లక్ష్మణుడు ఆమెకు వెళ్ళొస్తానని చెప్పటానికి వెళ్ళినపుడు, ఆమె కొడుకుతో ఇలా చెబుతుంది.
“రామం దశరథం విద్ధి
మాం విద్ధి జనకాత్మజాం
అయోధ్యాం అటవీం విద్ధి
గచ్ఛ తాత! యథాసుఖమ్!”
“నాయనా, వెడుతున్నావా? మంచింది. రాముడిని నీ తండ్రి దశరథుడనుకో. సీతను నేననుకో. అడవినే అయోధ్య అనుకో. వెళ్ళిరా కన్నా!”
ఎంత సౌజన్యం? ఎంత విశాల హృదయం? సుమిత్ర వ్యక్తిత్వం అనన్య సామాన్యం. ఇక భరతుడేమీ తక్కువ తినలేదు. లెజిటిమేట్‍గా రాజ్యాధికారం అన్నయ్యది, దానికి నేను గార్డియన్‍గా వ్యవహరిస్తానని, ఆయన పాదుకలు తెచ్చుకుని సింహాసనం మీద ఉంచి, పరిపాలన సాగిస్తాడు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’. ధర్మము రూపుదాల్చితే రాముడవుతాడు. అన్ని కష్టాలు పడతాడు. ఏనాడు మహిమలు చూపలేదు. ‘ఆత్మానం మానుషం మన్యే’ అని స్వయంగా చెప్పుకున్నాడు. ఒక perfect human being ఎలా ఉండాలో లోకానికి చూపాడు. దురదృష్టవశాత్తు రామాయణానికి దుర్వ్యాఖ్యలు చేసే కుక్కమూతిపిందెలు పుట్టుకొస్తున్నాయి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ లాగా సోదరుడు చి. కోవెల సంతోష్ కుమార్, ఈ స్వయం ప్రకటిత మేధావులందరికీ తాను వ్రాసిన ‘రామం భజే శ్యామలమ్’ అనే గ్రంథంతో, జవాబిచ్చాడు. అది అందరూ తప్పక చదవవలసిన గ్రంథం.
మాట్లాడే విధానం:
మనం మాట్లాడే విధానం కూడా మన వ్యక్తిత్వానికి దర్పణం పడుతుంది. ఎక్కడ, ఎలా, ఎంత వరకు మాట్లాడాలనేది వ్యక్తిత్వ వికాసంలో అతి ముఖ్యమైనది. రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం దరిదాపుల్లో సంచరిస్తూ ఉంటారు. వారిని గమనించి సుగ్రీవుడు తనను చంపడానికి వాలి పంపిన వీరులేమో అని భయభ్రాంతుడవుతాడు. ఆంజనేయుడు అతన్ని కంగారు పడవద్దని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి, వారి గురించి ఆరాతీస్తాడు. అప్పుడు రాముడు తమ్మునితో ఇలా అంటాడు:
“నాయనా లక్ష్మణా, చూశావా! ఈయన ఎవరో మహా పండితుని వలె ఉన్నాడు. భావ దారిద్య్రం అతని మాటల్లో లేదు. అలా అని ఒక్క అదనపు మాట లేదు. ఏ మాట ఎక్కడ ఉపయోగించాలో ఈయనకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు.”
Eloquence (అతి భాషిత్వం), Reticence (మితభాషిత్వం) రెండూ శ్రుతి మించకూడదు. ఉషశ్రీ గారు తమ ప్రవచనాల్లో తరచూ ఈ విషయాన్ని ప్రస్తావించేవారు. కాబట్టి, balanced speech ను మనం అలవర్చుకోవాలి. అనవసరైన repetitions (పునరుక్త దోషాలు) మన సంభాషణలో ఉండకూడదు. Pause (మాటల మధ్యలో, చెప్పడానికి రాక ఆగిపోవడం) ఉండకూడదు. అట్లే వినడం కూడా ఒక కళే. Patient hearing అని ఉన్నది. ఎదుటివాడు చెప్పేది ఓపికగా వినాలి. అతడు పూర్తి చేసేంత వరకూ ఆగాలి. మధ్యలో interruption (అంతతాయం) కలిగించకూడదు. వాదోపవాదాలు ఎదుటివాడిని డామినేట్ చెయ్యడానికి కాదు, గెలవడానికి కాదు. మన point of view ను సమర్థవంతంగా project చేశామా లేదా అనేది ముఖ్యం. ఈరోజు communication skills నేర్చుకోవడానికి వేలకు వేలు తగలేస్తున్నారు యువత. LSRW Skills అంటారు వాటిని. వినడం, మాట్లడడం, చదవడం, వ్రాయడం. మొదటి రెండూ oral skills. వాటి మీద పట్టు సాధిస్తే విజయం తథ్యం. ఉద్యోగ నియామకాల్లో group discussions అని పెడతారు. అభ్యర్థులందరినీ కూర్చోబెట్టి ఒక టాపిక్ ఇచ్చి చర్చించమంటారు. అందరి మాటలను నిశితంగా గమనిస్తూ ఉంటారు.
‘Brevity is the soul of wit’ అన్నారు విలియం షేక్‍స్పియర్. చెప్పదలచుకున్నది క్లుప్తంగా, ప్రభావవంతంగా చెప్పగలిగితే అది మన వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతుంది.
భగవద్గీత – కొన్ని వ్యక్తిత్వ సూత్రాలు:
వ్యక్తిత్వ వికాసానికి పాఠ్యగ్రంథం భగవద్గీత. అందులో లేని అంశం లేదు. ఎంతో నిగూఢమైన, విశ్వ సత్యాలను అతి క్లుప్తంగా చెబుతాడు శ్రీకృష్ణుడు.
‘సంశయాత్మా వినశ్యతి’:
ఏ విషయంలోనూ మన మనస్సులో సందేహం పెట్టుకోకూడదు. విజ్ఞుల దగ్గర దానినిని నివృత్తి చేసుకోవాలి. నిరంతరం అనుమానాలతో కూడి ఉండేవారు నశిస్తారని పరమాత్మ చెబుతున్నాడు. ‘అనుమానం పెనుభూతం’ అన్న నానుడి మనకుంది. ఇలాంటి వారిని ఇంగ్లీషులో ‘Doubting Thomas’ లంటారు. సందేహ నివృత్తి అయితే మన అనసు తేలిక పడుతుంది. జ్ఞానం సమగ్రమవుతుంది. ఒక్కోసారి మన అంతఃకరణమే మనకు మార్గనిర్దేశనం చేస్తుంది. దీన్నే sixth sense అనవచ్చునేమో! దాన్ని అనుసరిస్తే మరీ మంచిది. అది మన మీద, మన వ్యక్తిత్వం మీద మనకున్న ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది.
కాళిదాసు – అభిజ్ఞాన శాకుంతలం:
దుష్యంత మహారాజు కణ్వాశ్రమంలో శకుంతలను చూస్తాడు. వెంటనే ఆయన మనసు ఆ స్నిగ్ధ సౌందర్యానికి దాసోహమంటుంది. ఆమెను ప్రేమిస్తాడు. కానీ, ఆయనకు ఒక సందేహం! ‘ఈమె కణ్వమహాముని కుమార్తె అంటున్నారు, అంటే బ్రాహ్మణ కన్య. బ్రాహ్మణులకూ క్షత్రియులకు వివాహం ధర్మ విరుద్ధం, శాస్త్ర విరుద్ధం కదా! మరి నా మనసు ఆమె వైపు లాగుతున్నదేమి?’ అని పరిపరి విధాలుగా ఆలోచిస్తాడు. చివరకు ఆయన అంతఃకరణం ఆయనకు సరైన పరిష్కారం చూపుతుంది.
ఆ సందర్భంలో మహాకవి ఇలా అంటారు:
“సతాంహి సందేహపదేషు వస్తుషు
ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః”
“సత్పురుషులకు ఏ విషయంలోనైనా సందేహం పొటమరించినపుడు దాన్ని నివృత్తి చేసుకునే ప్రమాణం వారి అంతఃకరణ సూచనలే!”
అప్పుడాయనకు క్లారిటీ వస్తుంది – ‘నా మనసు అధర్మం వైపు వెళ్ళదు. వెళుతూందంటే ఈమె జన్మలో ఏదో రహస్యం ఉండి ఉంటుంది. కాబట్టి నేను సరిగ్గానే ఆలోచించాను’. చూశారా? ఆయనకు తన వ్యక్తిత్వం మీద ఎంత విశ్వాసమో! నిజమే కదా మరి! శకుంతల క్షత్రియుడైన విశ్వామిత్రుని కూతురు.
సర్వత్ర సమదర్శనమే యోగం:
అందర్నీ సమానంగా చూడగలిగినవారే నిజమైన యోగులు అని భగవానుడు సెలవిచ్చి యున్నాడు. పేడపురుగులోనూ, రాజహంసలోనూ దైవాన్ని చూడగలగాలి. ‘ఆత్మవత్ సర్వభూతాని’ అంటుంది వేదం. నిన్ను నీవు ఎలా చూసుకుంటావో అందర్నీ అలా చూడాలి. దీన్నే బైబిల్ ‘love thy neighbour as thyself’ అంటుంది. అన్ని మతాలు చెప్పే ultimate Truth ఒక్కటే. కాని పండితులు దానిని రకరకాలు వ్యాఖ్యానిస్తారు. ‘ఏకం సత్, విప్రాః బహుధా వదన్తి’.
యోగః కర్మసుకౌశలమ్:
‘నీవు చేసే పనిలో నిజాయితీ, నేర్పు, అంకితభావమే యోగము’. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ మానవాళికి చేసిన అత్యుత్తమ ఉపదేశమిది. వ్యక్తిత్వ వికాసానికి ఇంతకంటే మంచి మార్గం లేదు. మహాత్మాగాంధీ గారికి అభిమాన రచయిత ఐన టాల్‌స్టాయ్ మహాశయుడు ఒక చక్కని కథ వ్రాశాడు. అందులో ఒక చెప్పులు కుట్టేవాడి కొడుకు, చిన్నపిల్లవాడు, చనిపోతాడు. సహజంగానే ఆ తండ్రి దుఃఖంతో కుమిలిపోతుంటాడు. తన వృత్తిని మానేసి ఉంటాడు. ఒక క్రైస్తవ సన్యాసి ఆ ఊరికి వస్తాడు. ఇతన్ని చూసి మందలిస్తాడు. “నీ కొడుకు చనిపోయాడని నీవు నీ వృత్తిని వదిలేస్తావా? అది చాలా తప్పు. నీ వల్ల సమాహానికి జరిగే మేలు సంగతేమిటి?” అని ప్రశ్నిస్తాడు. “చెప్పులు కుట్టే అతి సామాన్యుడిని నేను. నా వల్ల సమాజానికి ఒరిగేదేముంది?” అంటాడతడు. అప్పుడా క్రైస్తవ సన్యాసి ఇలా వివరిస్తాడు:
“భగవంతుడు జార్ చక్రవర్తిని రష్యాని ఏలమని ఆదేశించాడు. నిన్ను చెప్పులు కుట్టమన్నాడు. ఆయన దృష్టిలో ఈ రెండు పనులూ సమానమే. దేవుని ఆదేశాన్ని కాదనడానికి నీకు అధికారం లేదు. పద! నీ వృత్తిని కొనసాగించు.”
ఆయన దృష్టిలో రాకెట్ సైంటిస్టు ఐనా, మురికి కాలువ శుభ్రం చేసేవాడైనా ఒకటే. దీన్నే ఇంగ్లీషు వాళ్ళు dignity of labour అన్నారు. ఈ భావాన్ని నేను నా ఖండకావ్యంలో ఒక పద్యంలా వ్రాశాను, ‘మోక్షాకాంక్ష’ అనే ఖండికలో.
“పరగ మేదిని నేలు భూపాలుడైన
మనగ చెప్పులు కుట్టు సామాన్యుడైన
నొకటె పరమాత్మ దృష్టిలో, నుర్వినెల్ల
సమత జూడగ గనిపించు సత్యపథము”
ఒకసారి ప్రధానమంత్రి నెహ్రూ గారి కాన్వాయ్ రోడ్డు వెంట వెళుతూందట. లెవెల్ క్రాసింగ్ వద్ద రైల్వే గేటు మూసి ఉన్నది. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శి దిగి వెళ్ళి గేట్‍మ్యాన్‍కు విషయం చెప్పి, “గేటు తీస్తే త్వరగా వెళ్ళిపోతాము, ప్రధానికి సమయం లేదు” అన్నాడట. గేట్‍మ్యాన్ సంభ్రమాశ్చార్యాలకు లోనై, “ఒక్కసారి నెహ్రూ గారి దర్శనం చేసుకుంటాను” అన్నాడట. సరే, ప్రధాని కారు దిగారు. ఇతను వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. “ఈరోజు నా జన్మ ధన్యమైంది” అన్నాడు. నెహ్రూ సంతోషించి, “ఇక గేటు తియ్యి, మేం వెళ్ళిపోతాం” అన్నారట. “అది మాత్రం కుదరదు” అన్నాడట గేట్‌మ్యాన్. “దేశ ప్రధాని మీరే ఇలా అడగవచ్చా? ఒకవేళ రైలు దూసుకువస్తే? ఎంత ప్రమాదం! దయచేసి నన్ను క్షమించండి. గేటు తీసే ప్రసక్తే లేదు” అన్నాడట ఆ యోగి! యోగః కర్మసుకౌశలమ్ అనే సూక్తికి నిలువెత్తు తార్కాణం ఆ గేట్‍మ్యాన్. మనం చేసే పని చిన్నదైనా, పెద్దదైనా, దాని హీదా, అంతస్తుతో నిమిత్తం లేకుండా, మన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తే అదే యోగం. వ్యక్తిత్వ వికాసంలో అది saturation point. అంటే పరాకాష్ఠ.
మానవ ప్రయత్నం, విధి:
విధి (fate)ని నమ్ముకోవడం కొంత వరకు సమంజసమే. కాని అది జడత్వానికి (inertia) దారితీయకూడదు. ‘Accept life as it is’ అన్న సూక్తిని గుడ్డిగా అనుసరించకూడదు. Human effort అనేది ముఖ్యం. గాలిలో దీపం పెట్టి ‘దేవుడా, ఆరిపోకుండా చూడు’ అంటే సరిపోతుందా? హితోపదేశంలో దీని గురించి ఒక చక్కటి శ్లోకం ఉంది. పురుషార్థం అనేది ఎంత ముఖ్యమో అందులో వివరించారు.
“కాకతాళీయవత్ ప్రాప్తం
దృష్ట్యాపి నిధి మగ్రతః
న స్వయం దైవమా దత్తే
పురుషార్థ మపేక్షతే!”
“కాకతాళీయంగా ఎదుట నిధి ఉందై తెలిసినా, దేవుడు దానిని తెచ్చి మీ ఇంట్లో పెట్టడు. దానికి మానవ ప్రయత్నం ఎంతో కావాలి. నిధిని కాపాడుతున్న సర్పాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేయాలి. ఇలా బోలెడు తతంగం ఉంది. అప్పుడు గాని నిధి నీ ఇంటికి చేరదు”. ఇంగ్లీషులో ఒక సామెత ఉంది – ‘Success is 40% inspiration and 60% perspiration’ అని. గెలుపును కైవసం చేసుకోవాలంటే నలభై శాతం ప్రేరణ, అరవై శాతం కృషి ఉండాలి. Perspiration అంటే చెమటపోయడం. అంటే శ్రమపడడం.
పాశ్చాత్య, భారతీయ దృక్పథాలలో తేడాను గమనించండి.
“Where there is a will, there is a way” అన్నారు వారు. ‘మనసుంటే మార్గం ఉంటుంది’ అని దానర్థం. కాని కేవలం తలంపు మాత్రమే సరిపోదు, మార్గం సుగమం కావడానికి. మనవాళ్ళు ఏమన్నారో చూడండి!
“ఉద్యమే నహి సిధ్యంతి కార్యాణి న మనోరథైః
నహిసుప్తస్య సింహస్య ప్రవిషంతి ముఖేమృగాః”
“కార్యములు కేవలం మనోరథములతో సిద్ధించవు. తీవ్రమైన ప్రయత్నముతోనే అవి సాధ్యమవుతాయి. నిద్రిస్తూన్న సింహం నోట్లోకి, జంతువులు అవంతట అవే వచ్చి పడవు కదా!”
ఎంత హృద్యంగా చెప్పారో చూడంది. ఇది హితోపదేశం లోనిదే. అందులో లేని వ్యక్తిత్వ వికాస సూత్రం లేదు. పశుపక్ష్యాదులు పాత్రలుగా, చిన్న చిన్న నీతి కథల ద్వారా (fables) మానవ జీవితానికి మార్గనిర్దేశనం చేసిన గ్రంథమిది. Practical approach కు పెద్దపీట వేశారు మన సంస్కృతిలో.
జ్ఞానం, అజ్ఞానం, వివేకం:
రజనీకాంత్ సినిమా ‘బాబా’లో ఒక ట్యాగ్‌లైన్ ఉంటుంది. ‘తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత’. ఎంత గొప్ప వాక్యం! జ్ఞానం infinite. అంటే అనంతం. దాంట్లో కొంత భాగం సంపాదించటానికే ఒక జీవితకాలం సరిపోదు. మన విద్యావిధానంలో పిహెచ్.డి. డిగ్రీ అత్యున్నతమైనదని అనుకుందాం. ఒక వ్యక్తి రసాయనశాస్త్రంలో పిహెచ్.డి. చేశాడనుకుందాం. అంటే అతనికి ఆ శాస్త్రమంతా కరతలామలకం అయినట్లేనా? కాదు. కేవలం ఒక అంశాన్నే అయన పరిశోధించి సిద్ధాంత గ్రంథం (thesis) వ్రాస్తాడు. కెమిస్ట్రీలో ఆయనకు తెలియనిది ఇంకా బోలెడు! ఒక్క శాస్త్రాన్నే పరిపూర్ణంగా గ్రహించలేని మానవుడు, అన్ని ధర్మ శాస్త్రాలను అధ్యయనం చేయగలడా? లేడు.
కాబట్టి ఒకరిని ‘జ్ఞాని’ అంటే, కేవలం ఒక పార్శ్వంలోనే అని తెలుసుకోవాలి. జ్ఞానం మనకు శక్తినిస్తుంది. అది ఇవ్వగలిగినంత శక్తిని మరేదీ ఇవ్వలేదు.
‘Knowledge is power’. జ్ఞానానికి పరాకాష్ఠ వినయమే.
Bertrand Russel ఇలా అన్నారు – “The real knowledge lies in realising our ignorance”.
“మనకేమీ తెలియదని తెలుసుకోవడమే జ్ఞానం”. “సర్వజ్ఞత్వాన్ని ప్రదర్శించడమే అజ్ఞానం”. “Claiming omniscience is ignorance itself”.
స్వామి చిన్మయానంద ఒక కథ చెప్పారు. చాలా ఆసక్తిగా ఉంటుంది.
“జనక మహారాజు రాజర్షి. శుకునికే ధర్మసూత్రాలు బోధించినవాడు. ఆయన ఆస్థానానికి ఒక మహాతపస్వి, ఋషి విచ్చేశాడు. జనకుడు ఆయనకు అర్ఘ్యం, పాద్యం, ఇతర protocol అంతా నిర్వర్తించి ‘మహాత్మా, మీరెక్కడి నుంచి వచ్చినారు? మమ్ము అనుగ్రహించండి’ అని వేడగా, ఆయన ‘హిమాలయాలలో ఘోర తపస్సు చేసి ‘పరిపూర్ణ జ్ఞాన సముపార్జన’ చేసినాము చక్రవర్తీ! ఆ జ్ఞానాన్ని మీకు ఇవ్వాలని వచ్చినాము’ అన్నాడు.”
రాజులకు యోగులకు తమను తాము బహువచనంలో చెప్పుకునే పద్ధతి ఉంది. ‘నేను’కు బదులు ‘మేము’ అని. ఇది ఒక రకంగా అహంకార ప్రదర్శన తప్ప ఇంకొకటి కాదు. లేదా దీనిలో ఆధ్యాత్మిక లోతులేవయినా ఉంటే, అవి తెలిసినవారు క్షమించండి. ఇక కథలోకి వద్దాం.
“జనకుడు ఒక్క క్షణం మౌనం వహించాడు. తర్వాత వినయపూర్వకమైన చిరునవ్వుతో అన్నాడు ‘యోగిపుంగవా! మీ సంకల్పం మమ్ములను ధన్యులను చేసింది. కానీ, ఒక్క సంవత్సరం పాటు మీరు మా అతిథి గృహంలో ఉండండి. మీకు ఆశ్రమం, అన్ని సౌకర్యాలు సమకూరుస్తాను. తర్వాతే మీ నుండి జ్ఞానాన్ని గ్రహిస్తాను’.
సరే అని యోగి తనకు ఏర్పాటు చేసిన చోటకి వెళ్ళిపోయాడట. కానీ ఆయన ‘అహం’ దెబ్బతిన్నది. తనంతటి వాడు ‘జ్ఞానభిక్ష’ పెడతానంటే ‘సంవత్సరం తర్వాత’ అంటాడా? సరే, కానీ! అనుకుని ఉండిపోయాడు. సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్ళీ జనకుని వద్దకు వెళితే, మళ్ళీ అదే డైలాగు! ఇలా మూడేళ్ళు గడిచాయి.
మహా తాపసికి ఉన్నట్లుడి బుర్రలో లైటు వెలిగింది! దీన్నే సభ్యంగా చెప్పాలంటే జ్ఞానోదయమయింది! ‘ఈ జనకుడు నిస్సందేహంగా నా కంటే జ్ఞాని. నేను పరిపూర్ణ జ్ఞానాన్ని పొందానని చెప్పడమే నా అజ్ఞానమని ఆయన తెలుసుకున్నాడు. అందుకే నన్ను తిప్పుతున్నాడు’ అనుకుని మిన్నకున్నాడు.
మర్నాడు జనక చక్రవర్తి రకరకాల కానుకలు, ఫలపుష్పాదులు మోయించుకొని పోయి, ఆ యోగి శ్రేష్ఠుని పాదాముల వద్ద ఉంచి, ‘మహాభాగా, నాకు అమూల్యమైన జ్ఞానం ఇవ్వవలసినది’ అని ప్రార్థించాడట.
యోగిరాజు చిరునవ్వు నవ్వి, ‘నాయనా, నీవు నిజమైన జ్ఞానివి. సర్వజ్ఞుడనని విర్రవీగే నా అజ్ఞానాన్ని గ్రహించినవాడవు నీవు’ అంటూ, నీకు జ్ఞానమిచ్చేదేమి, పొమ్మన్నాడట.
అప్పుడు జనకుడు ‘స్వామీ! మీరు నిస్సందేహంగా జ్ఞానులే. నిన్నటితో మీ జ్ఞానం సంపూర్ణమయింది. నన్ను క్షమించండి. జ్ఞానాన్ని అనుగ్రహించండి’ అన్నాడట! చూశారా! జ్ఞానం అంటే వినయం. జ్ఞానం అంటే విధేయత. జ్ఞానం అంటే తన కొలదిని యెఱుగుట!”
జ్ఞానం, వివేకం (Knowledge, Wisdom):
ఈ రెండూ ఒకటి కాదు. రెండింటికీ హస్తి (ఏనుగు) మశాకం (దోమ)తరముంది. బెర్ట్రాండ్ రస్సెల్ మహాశయుడు దీని మీద ఒక చక్కని వ్యాసం రాశారు. ఒక విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం. దానిని ఎలా ఉపయోగించాలనే ఎఱుక వివేకం. దీనినే విచక్షణ అని కూడా అనవచ్చు. వ్యక్తిత్వ వికాసంలో, ఈ తేడాని గ్రహించడం అత్యంత ఆవశ్యకం. వివేకం లేని జ్ఞానం సమాజానికి ప్రమాదహేతువంటారు రస్సెల్. జ్ఞానం కత్తి లాంటిది. దానిని ఎలాగైనా ఉపయోగించవచ్చు. నా ఖండకావ్యంలో ‘సామాజిక మాధ్యమ వధ్యశిల’ అనే ప్రకరణంలో నేను ఇలా వ్రాశాను:
“కత్తియె కూరల దరుగును
కత్తియె కుత్తుకలు దరుగు కావున దానిన్
మొత్తము ననుకూలంబుగ
నిత్తరినుపయోగమంద నేర్చుట తగుగాన్!”
ఒక వ్యక్తి యొక్క integrity (ఔన్నత్యం) అతని జ్ఞానంలో కంటే, వివేకం లోనే ఎక్కువ బయటపడుతుంది. ఉదాహరణకు, మన శాస్త్ర విజ్ఞానాన్ని విదేశాలకు అమ్ముకునే శాస్త్రవేత్తలూ, నార్మల్ డెలివరీలకు సిజేరియన్లు చేసి, లేనిపోని టెస్టులన్నీ చేయించి, లేని రోగాలకు వైద్యం చేసి, డబ్బు కట్టలేకపోతే శవాన్ని ఇవ్వమని బ్లాక్‌మెయిల్ చేసే భిషగర్వులకు medical knowledge అయితే ఉంది గాని wisdom లేదు. ఆ విధంగా వారు సమాజ ద్రోహులు.
కంట్రాక్టర్లతో కుమ్ముక్కయి, నాసి రకం సిమెంటు, ఇసుక, ఇనుము వాడడానికి ఒప్పుకుని, లంచాలు మింగి, కట్టడాలు కూలిపోవడానికి కారణమయ్యే ఇంజనీర్లకు సాంకేతిక జ్ఞానం ఉంది. కానీ wisdom లేదు. అలా వారు ఆత్మద్రోహం, సంఘద్రోహం చేసుకుంటున్నారు. ఇలా ఎన్నైనా తార్కాణాలు మనం ఇవ్వవచ్చు. కాబట్టి జ్ఞానం, వివేకంతో కూడినప్పుడే ఫలిస్తుంది. వ్యక్తిత్వ వికాసంలో professional ethics ని పాటించడం ముఖ్యం. అంటే వృత్తిపరమైన నైతికత. అది అతి చిన్న హోదా గల వృత్తిలోని వారిలో ఉండవచ్చు. పెద్ద హోదాగల వారిలో లేకపోవచ్చు.
ఒకసారి రైతుబజారులో, ఒక పండుగ రోజు, అరటాకులు కొన్నాను. పూలు, పళ్ళు, కూరయాగలు కూడా. ఒక ఆటోలో ఇంటికి వచ్చాను. పూజ ముగించి, భోజనాలకు కూర్చోవాలనుకుంటే, అరిటాకుల కట్ట కనబడలేదు. ఆటోలో మరిచిపోయినాను! అయ్యో! పండగ పూట అరిటాకుల్లో భోజనం చేద్దామనుకుంటే, ఇలా అయిందే! అని బాధ పడుతున్నాను. నవీ ముంబయి నుంచి మా అమ్మాయి, అల్లుడు వచ్చి ఉన్నారు.
ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. వెళ్ళి చూస్తే ఆటో డ్రైవర్. అరిటాకుల కట్టను నాకు అందిస్తూ “సార్, దీన్ని మరిచిపోయారు. పండగ కదా! ఇవి ముఖ్యం అని వెనక్కు వచ్చాను. దాదాపు నాగోల్ వరకు వెళ్ళాను. ప్యాసెంజర్‍ని డ్రాప్ చేసి వెనక్కు చూస్తె కనపడింది. భోజనాలు చేసేశారా సార్?” అని అడిగాడు. అతని గొంతులో ఒక వ్యగ్రత.
నేను కదిలిపోయాను. లోపలికి పిలిచి కూర్చోబెట్టాను. నా శ్రీమతి అతనికి కొంచెం పులిహోర, రెండు గారెలు, కొద్దిగా హల్వా ఒక ప్లేటులో పెట్టి ఇచ్చింది. మొహమాటపడుతుంటే, “దేవుని ప్రసాదం బాబూ, తిను, పరవాలేదు” అంటే తిన్నాడు. నాగోల్ మా యింటికి ఐదు కిలోమీటర్లు పైనే ఉంటుంది. అతనికి మూడు వందలివ్వబోతే, నొచ్చుకుని, సున్నితంగా తిరస్కరించాడు. “సార్! డబ్బు కోసం నేను అరిటాకులను వెనక్కి తేలేదు! క్షమించండి!” అని సెలవు తీసుకుని వెళ్ళిపోతున్న అతనికి, వెనక నుండి, చేతులు మోడ్చి నమస్కరించాను.
వ్యక్తిత్వమంటే అదే! వివేకం గలవాడతను! వృత్తిపరమైన నైతిక విలువలు మెండుగా గుండె నిండా ఉన్నవాడు!
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.