Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనలోని మాయ

[బాలబాలికల కోసం ‘మనలోని మాయ’ అనే కథని అందిస్తున్నారు డా. మామిడాల శైలజ. సంచిక నిర్వహించిన బాలల కథల పోటీ 2026లో బహుమతి పొందిన కథ.]

పాఠశాల గంట మోగగానే పిల్లలంతా ఆనందంగా బయటకు పరుగులు తీశారు. తొందరగా ఇంటికి వెళ్లి అమ్మ పెట్టే అల్పాహారం తిని ఆడుకోవాలని తొందరగా ఉంది అందరికీ.

ఆది మాత్రం నెమ్మదిగా నడుస్తున్నాడు. చేతిలో ప్రోగ్రెస్ కార్డు ఉంది. అందులో ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులే ఉన్నాయి. కానీ మొదటి ర్యాంక్ మాత్రం కాదు.

ఇంటికి చేరగానే బ్యాగ్‌ను మూలలో పెట్టి నిశ్శబ్దంగా కూర్చున్నాడు.

వంటగదిలో ఉన్న తల్లి అది గమనించింది.

“ఏమైంది బాబూ? ఈ రోజు ఇంత మౌనంగా ఉన్నావే!” అంటూ దగ్గరకు వచ్చింది.

ఆది ప్రోగ్రెస్ కార్డు ఆమె చేతిలో పెట్టాడు.

“చూడమ్మా.. మళ్లీ రెండో ర్యాంకే.”

తల్లి కార్డు చూసి చిరునవ్వు నవ్వింది.

“ఇందులో బాధపడాల్సింది ఏముంది? ఇవి కూడా మంచి మార్కులే కదా!”

“అదే అమ్మా.. మంచి మార్కులు వస్తున్నాయి. కానీ ఎప్పుడూ ఎవరో ఒకరు నాకంటే ముందు ఉంటారు. రాహుల్ చదువులో ఫస్ట్.. విజయ్ పరుగుపందెల్లో ఫస్ట్.. సుమ చిత్రలేఖనంలో ఫస్ట్.. నేను అన్నింటిలో బాగానే ఉంటాను. కానీ దేనిలోనూ బెస్ట్ కాను.”

అతని గొంతు కొద్దిగా వణికింది.

“నేను ఎంత కష్టపడినా ఎందుకు ఇలా జరుగుతోంది?”

తల్లి కాసేపు మౌనంగా అతని ముఖం చూసింది.

“బాబూ.. మామిడి చెట్టు తీపి పండ్లు ఇస్తుంది. కొబ్బరి చెట్టు చల్లని నీళ్లు ఇస్తుంది. రెండింటిలో ఏది గొప్పది?”

ఆది కాసేపు ఆలోచించాడు.

“రెండూ గొప్పవే.”

“అదే కదా! ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ దాన్ని కనుక్కోవడానికి ఓపిక కావాలి. ఇతరులతో పోల్చుకుంటూ ఉంటే మనలో ఉన్న వెలుగు కనిపించదు.”

ఆ మాటలు ఆది మనసులో మోగుతూనే ఉన్నాయి.

మరుసటి రోజు పాఠశాలకు వెళ్తూ ఒక చిన్న సందులోకి తిరిగాడు. అక్కడ రోడ్డుపక్కన పాత చెట్టు కింద అందంగా చెక్కిన చిన్న చెక్క పెట్టె కనిపించింది.

దాని మీద దుమ్ము ఉన్నా, ఏదో విచిత్రమైన ఆకర్షణ ఉంది.

“ఇది ఎవరిదో?” అని చుట్టూ చూసాడు.

ఎవరూ కనిపించలేదు.

పెట్టె మీద ఒక చిన్న కాగితం అంటించి ఉంది.

“ఈ పెట్టెను తెరవొచ్చు. కానీ ఇందులో ఉన్నదాన్ని స్వార్థం కోసం ఉపయోగించకూడదు.”

ఆది గుండెల్లో ఆసక్తి మొదలైంది. నెమ్మదిగా మూత తెరిచాడు. లోపల మృదువైన ఎర్రటి వస్త్రంలో చుట్టి పెట్టిన చిన్న గుండ్రని అద్దం ఉంది.

“అద్దమా?” అని ఆశ్చర్యపోయాడు.

దాన్ని చేతిలోకి తీసుకుని తన ముఖం చూసుకున్నాడు. ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదు.

‘ఇదేనా జీవితాన్ని మార్చేది?’ అని నవ్వుకున్నాడు.

అయినా ఆ పెట్టెను అక్కడే ఉంచి, అద్దాన్ని మాత్రం జాగ్రత్తగా బ్యాగులో వేసుకున్నాడు.

దూరంగా ఎక్కడో గాలి ఒక్కసారిగా వీచింది.

ఆది వెనక్కి తిరిగి చూసాడు. చెట్టు కింద పెట్టె మాత్రమే ఉంది.

కానీ క్షణం క్రితం అక్కడ ఎవరో నిలబడి చూసినట్టుగా అతనికి అనిపించింది.

మళ్లీ జాగ్రత్తగా చూసేసరికి ఎవరూ లేరు.

‘భ్రమ అయి ఉంటుంది..’ అనుకుని పాఠశాల వైపు నడిచి వెళ్ళాడు.

ఆ రోజు నుంచి ఆది జీవితంలో చిన్న చిన్న మార్పులు కనిపించడం మొదలైంది.

ప్రతి ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు అతను ఆ అద్దంలో ఒక్కసారి తన ముఖం చూసుకునేవాడు.

ఆ ప్రతిబింబాన్ని చూస్తున్నప్పుడల్లా తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చేవి.

“ఇతరులతో పోల్చుకోకు.. నీలో ఉన్న మంచిని నువ్వే వెతుకు.”

ఆ మాటలే అతనిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపేవి.

కొన్ని రోజుల తర్వాత గణితంలో చిన్న పరీక్ష జరిగింది.

మునుపులా ప్రశ్నాపత్రం చూసి భయపడకుండా, ఒక్కో ప్రశ్నను నెమ్మదిగా చదివాడు.

“నేను చేయగలను..” అని మనసులో అనుకున్నాడు.

ఆశ్చర్యంగా, ఇంతకు ముందు కష్టంగా అనిపించిన రెండు ప్రశ్నలు ఈసారి సులభంగా అర్థమయ్యాయి.

పరీక్ష పత్రాలు ఇచ్చిన రోజు..

“ఈసారి పూర్తి మార్కులు సాధించిన వాళ్లలో ఆది కూడా ఉన్నాడు,” అని గణిత ఉపాధ్యాయుడు ప్రకటించారు.

తరగతి మొత్తం చప్పట్లు కొట్టింది.

రాహుల్ చిరునవ్వుతో,

“శభాష్ రా!” అంటూ అతని భుజం తట్టాడు.

ఆది కూడా సంతోషంగా నవ్వాడు.

ఆ సాయంత్రం ఇంటికి వెళ్లి అద్దంలో చూసుకుంటూ మెల్లగా అన్నాడు..

“నిజంగానే ఇందులో ఏదో ఉంది అనుకుంటా..”

కానీ అతనికి తెలియదు. మారింది అద్దం కాదు..ఆలోచన అని.

***

ఆ తర్వాత అతను మరింత కష్టపడటం ప్రారంభించాడు. ప్రతిరోజూ గంటసేపు అదనంగా చదివేవాడు.

పరుగుపందెం కోసం ఉదయాన్నే లేచి సాధన చేసేవాడు.

చిత్రలేఖనంలో బాగా వచ్చే సుమ దగ్గర కొత్త పద్ధతులు నేర్చుకునేవాడు.

ఎవరిని చూసి అసూయపడకుండా.. వాళ్ల దగ్గర నుంచి నేర్చుకోవడం ప్రారంభించాడు.

***

నెల రోజుల తర్వాత పాఠశాలలో ప్రతిభా వారోత్సవాలు జరిగాయి.

గణిత క్విజ్‌లో రెండో స్థానం.. పరుగుపందెల్లో మూడో స్థానం.. వ్యాసరచనలో మొదటి స్థానం..

ఒకే పోటీలో కాదు.. వేర్వేరు రంగాల్లో అతని పేరు వినిపించడం మొదలైంది.

ప్రధానోపాధ్యాయులు సభలో అన్నారు –

“ఆది విజయం ఒక్కరోజులో రాలేదు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ప్రతి విద్యార్థి ఇలా ఎదగగలడు.”

ఆ మాటలు విని ఆది గర్వంగా కాకుండా ఆనందంగా నవ్వాడు.

కానీ.. సభ ముగిసిన తర్వాత ఇద్దరు చిన్న విద్యార్థులు మాట్లాడుకుంటున్న మాటలు అతని చెవిలో పడ్డాయి.

“ఆది అన్నయ్య ఇప్పుడు అన్నింట్లో గెలుస్తున్నాడు.”

“అవును.. ఆయనలా అయితే ఎంత బాగుంటుందో!”

ఆ మాటలు అతని మనసులో ఒక కొత్త భావాన్ని నాటాయి.

“అంటే.. ఇప్పుడు అందరూ నన్నే ఆదర్శంగా చూస్తున్నారా?”

***

ఆ రాత్రి మళ్లీ అద్దం ముందుకు వెళ్లాడు. ఈసారి తన ప్రతిబింబాన్ని కాసేపు అలాగే చూస్తూ నిలబడ్డాడు.

తన ముఖంలో ఇంతకు ముందు కనిపించని ధైర్యం కనిపించింది.

అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది.

“ధన్యవాదాలు..” అని అద్దాన్ని చూస్తూ మెల్లగా అన్నాడు.

“నువ్వు నా జీవితాన్ని మార్చేశావు.” అద్దం మాత్రం ఎప్పటిలాగే నిశ్శబ్దంగానే ఉంది. అది ఏమీ మాట్లాడలేదు..

కానీ ఆది మనసు మాత్రం ఒక చిన్న పొరపాటు చేసింది. అదేంటంటే తను పడిన కష్టాన్ని మరిచి.. విజయానికి కారణం అద్దమే అని నమ్మడం ప్రారంభించింది.

అదే పొరపాటు.. తన జీవితాన్ని మరో మలుపు తిప్పబోతోందని అప్పుడతనికి తెలియదు.

ప్రతిభా వారోత్సవాల తర్వాత ఆది పేరు పాఠశాలలో అందరికీ తెలిసిపోయింది.

“ఆది వస్తున్నాడు..”

“అదిగో వ్యాసరచనలో ఫస్ట్ వచ్చిన అబ్బాయి..”

“మ్యాథ్స్‌లో కూడా ఫస్ట్ మార్కులు అతడికేనట!”

అని చిన్నపిల్లలు మాట్లాడుకుంటుంటే అతనికి సంతోషంగా అనిపించేది.

మొదట్లో ఆ ప్రశంసలు అతనిలో మరింత కష్టపడాలనే ఉత్సాహాన్ని పెంచాయి.

కానీ.. కొన్ని రోజుల తర్వాత అవే ప్రశంసలు నెమ్మదిగా అతని మనసులో మరో భావాన్ని పెంచసాగాయి.

“నేను నిజంగానే అందరికంటే ప్రత్యేకమేమో..”

***

ఒక రోజు గణితంలో కొత్త పాఠం చెప్పారు. రాహుల్‌కు ఒక సమస్య అర్థం కాలేదు. మధ్యాహ్న విరామ సమయంలో ఆది దగ్గరకు వచ్చాడు.

“ఆది.. ఈ లెక్క ఎలా చేయాలో చెబుతావా?”

మునుపైతే ఆది వెంటనే పుస్తకం తీసి వివరించేవాడు. ఈసారి మాత్రం తన నోట్‌బుక్ మూసేశాడు.

“సార్ క్లాస్‌లో చెప్పారుగా.. శ్రద్ధగా విని ఉంటే ఇప్పుడు అడగాల్సిన అవసరం వచ్చేది కాదు.”

రాహుల్ ఒక్క క్షణం మౌనంగా నిలబడ్డాడు.

“నేను విన్నాను.. కానీ చివరి స్టెప్ మాత్రమే అర్థం కాలేదు.”

“అయితే నువ్వే చూసుకో.”

అని చెప్పి ఆది అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

రాహుల్ ఏమీ మాట్లాడలేదు. కానీ అతని కళ్లలో కనిపించిన నిరాశను ఆది గమనించలేదు.

***

మరుసటి వారం చిత్రలేఖన పోటీ జరిగింది. సుమ వేసిన బొమ్మను చూసి ఒక ఉపాధ్యాయురాలు,

“చాలా బాగా వేశావమ్మా!” అని మెచ్చుకున్నారు.

అది విన్న ఆది చిరునవ్వు నవ్వాడు.

“రంగులు బాగున్నాయి.. కానీ బొమ్మలో ప్రాణం లేదు.” అన్నాడు.

ఆ మాట సుమకు బాధ కలిగించింది. ఆమె ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా తన బొమ్మ మడతపెట్టి బ్యాగులో పెట్టుకుంది.

దూరం నుంచి ఆ దృశ్యం చూసిన తెలుగు ఉపాధ్యాయుడు కాసేపు ఆలోచనగా ఆది వైపు చూశాడు.

***

ఆ సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆది అద్దం ముందే నిలబడ్డాడు.

‘చూశావా.. ఇప్పుడు అందరూ నన్నే గుర్తిస్తున్నారు.’ అని నవ్వుకున్నాడు.

ఆ ప్రతిబింబం ఎప్పటిలాగే ప్రశాంతంగానే ఉంది.

కానీ.. ఈసారి అతనికి తన కళ్లలో ఏదో కొత్తదనం కనిపించింది. అది ఆత్మవిశ్వాసమా? లేక అహంకారమా? అతనికి తేడా తెలియలేదు.

***

రోజులు గడిచాయి.

ఒకప్పుడు ఆటల సమయంలో అందరితో కలిసి నవ్వే ఆది..

ఇప్పుడు ఒంటరిగా కూర్చుని చదువుకోవడం మొదలుపెట్టాడు.

ఒకప్పుడు స్నేహితులు గెలిస్తే చప్పట్లు కొట్టే ఆది..

ఇప్పుడు తనకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిలో చిన్న చిన్న తప్పులు వెతకడం ప్రారంభించాడు.

ఒకప్పుడు అందరికీ ఇష్టమైన ఆది.. ఇప్పుడు అందరూ గౌరవించే విద్యార్థి అయ్యాడు.

కానీ.. అతనితో మనస్ఫూర్తిగా మాట్లాడే స్నేహితులు మాత్రం తగ్గిపోయారు.

***

ఒక రోజు పాఠశాల ముగిశాక రాహుల్ అతని వెంట నడిచాడు.

“ఆది.. ఒక మాట అడగనా?”

“అడుగు.”

“నీకు ఇప్పుడు గెలవడం చాలా ముఖ్యం అయిపోయింది. కానీ.. గెలుస్తూ గెలుస్తూ నువ్వు ఏదో కోల్పోతున్నావని అనిపించడం లేదా?”

ఆది కనుబొమ్మలు ఎత్తాడు.

“ఏమి కోల్పోయాను?”

రాహుల్ చిరునవ్వు నవ్వాడు.

“ముందు నువ్వు గెలిస్తే మేమంతా సంతోషపడేవాళ్లం. ఇప్పుడు నువ్వు గెలుస్తున్నావు కానీ నీతో కలిసి నవ్వే వాళ్లు తగ్గిపోతున్నారు.”

ఆది భుజాలు ఎగరేశాడు.

“విజయం సాధించాలంటే ఇలాంటివి పట్టించుకోకూడదు.”

రాహుల్ తల వంచాడు.

“కాదు ఆది.. నిజమైన విజయం మనల్ని మనుషుల నుంచి దూరం చేయదు.” అంతే చెప్పి నెమ్మదిగా ముందుకు నడిచిపోయాడు.

ఆ మాటలు ఆది చెవుల్లో పడినా.. మనసులోకి మాత్రం దిగలేదు.

ఆ రోజు అద్దంలో అతని ప్రతిబింబం వెనుక గోడపై ఒక సన్నని చీలిక కనిపించింది. ఆది వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. గోడపై ఎలాంటి చీలిక లేదు. మళ్లీ అద్దంలో చూశాడు. చీలిక మాత్రం అలాగే కనిపిస్తోంది..

అతని గుండెల్లో మొదటిసారిగా ఒక తెలియని ఆందోళన మొదలైంది.

***

ఆ రాత్రి అద్దంలో కనిపించిన ఆ సన్నని చీలిక ఆది మనసును వదల్లేదు.

‘బహుశా నా భ్రమే అయి ఉంటుంది..’ అని తనను తాను సమాధానపర్చుకున్నాడు.

కానీ మరుసటి రోజు కూడా అద్దంలో చూసినప్పుడు ఆ చీలిక అలాగే కనిపించింది. అద్దాన్ని చేతిలోకి తీసుకుని జాగ్రత్తగా పరిశీలించాడు.

ఎక్కడా పగులు లేవు.

‘వింతగా ఉంది..’ అనుకున్నాడు.

అయినా దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా పాఠశాలకు వెళ్లిపోయాడు.

***

ఆ రోజు విజ్ఞానశాస్త్ర ప్రాజెక్టుల ఎంపిక జరిగింది. ప్రతి బృందంలో ముగ్గురు విద్యార్థులు ఉండాలి.

రాహుల్ ఆది దగ్గరకు వచ్చి అడిగాడు.

“ఈసారి మనిద్దరం కలిసి చేద్దామా?”

ఆది తల అడ్డంగా ఊపాడు.

“క్షమించు. నేను ఒక్కడినే చేస్తాను.”

రాహుల్ ఆశ్చర్యపోయాడు.

“కానీ ఇది బృంద ప్రాజెక్ట్ కదా!”

“నాతో ఉంటే మీకు మార్కులు వస్తాయి. కానీ మీ వల్ల నా మార్కులు తగ్గకూడదు.”

ఆ మాట విన్న రాహుల్ ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేకపోయాడు.

దూరంగా నిలబడి ఉన్న తెలుగు ఉపాధ్యాయుడు ఆ మాటలన్నీ విన్నాడు.

అతను ఏమీ అనలేదు. కేవలం ఆది వైపు ఒకసారి నిశ్శబ్దంగా చూశాడు.

***

కొన్ని రోజుల తర్వాత జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శన జరిగింది. ఆది తన ప్రాజెక్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నాడు. వేదికపైకి వెళ్లే ముందు అద్దంలో ఒకసారి చూసుకున్నాడు.

“ఈరోజు కూడా నేను గెలుస్తాను.” అని చిరునవ్వు నవ్వాడు.

న్యాయనిర్ణేతలు ప్రశ్నలు అడగడం ప్రారంభించారు.

మొదటి రెండు ప్రశ్నలకు ఆది బాగా సమాధానం చెప్పాడు. మూడో ప్రశ్నకు వచ్చేసరికి కాసేపు ఆగిపోయాడు. సమాధానం తెలుసు.. కానీ మాటలు తడబడిపోయాయి. తనను తాను అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నించాడు.

అంతలో మరో ప్రశ్న వచ్చింది.

ఈసారి పూర్తిగా గందరగోళానికి గురయ్యాడు. అతి ఆత్మవిశ్వాసంతో చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడం వల్ల చేసిన పొరపాట్లు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.

ఫలితాలు ప్రకటించినప్పుడు.. ఆది పేరు విజేతల జాబితాలో లేదు. అతని గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది.

***

వేదిక దిగుతుండగా రాహుల్ ఎదురయ్యాడు.

“బాధపడకు ఆది. వచ్చేసారి ఇంకా బాగా చేస్తావు.” అని ఓదార్చాడు.

ఆది మాత్రం కోపంగా అన్నాడు.

“నాకు ఓదార్పు అవసరం లేదు.” అని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. రాహుల్ నిశ్శబ్దంగా నిలబడి చూశాడు.

అతనికి ఓటమి బాధ కంటే.. స్నేహితుడు ఇలా మారిపోవడం ఎక్కువ బాధగా అనిపించింది.

***

ఆ రాత్రి.. ఆది ఎప్పటిలాగే అద్దం ముందు నిలబడ్డాడు. అద్దంలో తన ముఖం మసకగా కనిపించింది.

“ఏమైంది?” అని ఆశ్చర్యపోయాడు. కళ్లను తుడుచుకుని మళ్లీ చూశాడు. ఈసారి చీలికలు ఒకటి కాదు.. చాలా కనిపించాయి. తన ప్రతిబింబం చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయినట్టుగా అనిపించింది.

“ఇది ఎలా సాధ్యం?”

అతని చేతులు వణికాయి. అద్దాన్ని కిటికీ వెలుగులోకి తీసుకెళ్లి చూశాడు. అది మాత్రం మామూలుగానే ఉంది. ఎలాంటి పగులు లేవు. మళ్లీ అందులో చూసేసరికి.. విరిగిపోయింది అద్దం కాదు.. తన ప్రతిబింబమే.

ఆది గుండెల్లో మొదటిసారిగా ఒక ప్రశ్న మెదిలింది.

“మారిపోయింది నిజంగా అద్దమా? లేక నేనా?”

ఆ ప్రశ్న అతన్ని వెంటాడుతూనే ఉంది.

ఆది గుండె బలంగా కొట్టుకుంటోంది.

అప్పుడే అతని చూపు చదువుకునే బల్లపై ఉన్న ప్రోగ్రెస్ కార్డుపై పడింది.

ఒకప్పుడు రెండో ర్యాంక్ వచ్చినప్పుడు కూడా తాను నవ్వేవాడు. ఇప్పుడు.. ఒక్కసారి ఓడిపోగానే ప్రపంచమే కూలిపోయినట్టుగా ఎందుకు అనిపిస్తోంది?

అతను మెల్లగా కుర్చీలో కూర్చున్నాడు. అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

“ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకత ఉంటుంది బాబూ. దాన్ని కనుక్కోవాలి.. ఇతరులతో పోల్చుకుంటూ ఉంటే నీ గొప్పతనం కనిపించదు.”

ఆ తర్వాత రాహుల్ మాటలు వినిపించినట్టు అనిపించాయి.

“నిజమైన విజయం మనల్ని మనుషుల నుంచి దూరం చేయదు.”

తెలుగు సార్ నిశ్శబ్దంగా తనవైపు చూసిన చూపు కూడా గుర్తొచ్చింది. ఆది తల వంచుకున్నాడు.

“నేను గెలుపును వెంబడిస్తూ.. మంచి మనిషిగా ఉండడమే మరిచిపోయానా?”

అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడే అతని చూపు మళ్లీ అద్దంపైనే పడింది.

“అసలు నిజం తెలుసుకోవాలి.” అద్దాన్ని చేతిలోకి తీసుకున్నాడు.

“నువ్వు నిజంగానే నాకు శక్తి ఇచ్చావా?” అని ప్రశ్నించాడు. జవాబు రాలేదు.

“లేదా.. నేను నిన్ను నమ్మానని, నన్ను నేనే నమ్మడం మొదలుపెట్టానా?”

అతని చేతులు స్వల్పంగా వణికాయి. అద్దం జారిపోయింది.

చట్!

నేలపై పడిన అద్దం చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోయింది. ఆది ఉలిక్కిపడి ముక్కలు ఏరడం ప్రారంభించాడు. అప్పుడే పెట్టె అడుగున చిన్నగా మడిచిన కాగితం కనిపించింది.

ఆశ్చర్యంగా దాన్ని విప్పి చదివాడు.

“ఈ అద్దంలో ఎలాంటి మాయ లేదు. నిన్ను నువ్వు నమ్మినప్పుడు నీలోని శక్తి మేల్కొంటుంది. ఆ నమ్మకం అహంకారంగా మారినప్పుడు, ఆ శక్తిని నువ్వు కోల్పోతావు. ఈ అద్దం నీ ముఖాన్ని కాదు.. నీ మనసును చూపిస్తుంది.”

ఆది చేతిలోని కాగితం వణికిపోయింది. ఒక్కసారిగా అంతా అర్థమైంది. మొదట అద్దంలో కనిపించింది ఆత్మవిశ్వాసం. తర్వాత కనిపించింది అహంకారం.

చివరికి కనిపించిన చీలికలు.. అద్దంలో కాదు. తన మనసులో ఏర్పడినవే. అతని కళ్ల నుంచి కన్నీళ్లు జారిపోయాయి.

“నేను ఓడిపోయింది పోటీలో కాదు.. నా మంచితనంలో.”

అని మెల్లగా అనుకున్నాడు.

***

మరుసటి రోజు పాఠశాలకు వెళ్లగానే నేరుగా రాహుల్ దగ్గరకు వెళ్లాడు.

“రాహుల్..”

అతని గొంతు కంపించింది.

“నన్ను క్షమించు.”

రాహుల్ ఆశ్చర్యంగా చూశాడు.

“నేను గెలవడం నేర్చుకున్నాను.. కానీ స్నేహాన్ని నిలబెట్టుకోవడం మరిచిపోయాను.” రాహుల్ కళ్లలో చిరునవ్వు మెరిసింది.

“అయితే నువ్వు మళ్లీ మా పాత ఆది అయ్యావు.” అని చెప్పి అతన్ని హత్తుకున్నాడు.

ఆ దృశ్యం చూసిన తెలుగు ఉపాధ్యాయుడు చిరునవ్వుతో అన్నారు.

“గుర్తుంచుకోండి పిల్లలూ.. మార్కులు తెలివిని చెబుతాయి. మంచితనం మనిషిని చెబుతుంది.”

ఆది తల వంచి నమస్కరించాడు. ఆ రోజు అతను గెలిచింది బహుమతి కాదు. తనలోని మనిషిని.

రోజులు గడిచాయి.

ఆది మళ్లీ మునుపటిలా నవ్వడం మొదలుపెట్టాడు.

కానీ ఈసారి అతని నవ్వులో గెలుపు గర్వం లేదు.. మనసు ప్రశాంతత ఉంది.

చదువులో ఎవరికైనా సందేహం వస్తే ఓపికగా చెప్పేవాడు. పోటీలో గెలిచిన వారిని హృదయపూర్వకంగా అభినందించేవాడు.

ఓడిపోయిన వారితో..

“ఈసారి కాకపోతే మరోసారి. ప్రయత్నం ఆపకు,” అని ధైర్యం చెప్పేవాడు.

పూర్తిగా మునుపటిలా మారిపోయాడు.

కానీ ఈసారి ఒక తేడా ఉంది. గెలవడం కోసం కాదు.. నేర్చుకోవడం కోసం చదివేవాడు.

ఒకరోజు తెలుగు ఉపాధ్యాయుడు తరగతిలో విద్యార్థులను అడిగారు.

“విజయం అంటే ఏమిటి?”

ఎవరో.. “మొదటి ర్యాంక్ రావడం.” అన్నారు.

మరొకరు.. “పోటీలో గెలవడం.” అన్నారు.

ఆది నెమ్మదిగా లేచాడు.

“సార్.. నిన్నటి కంటే ఈ రోజు మంచి మనిషిగా మారితే.. అదే విజయం.”

తరగతి గది నిశ్శబ్దంగా మారింది.

తెలుగు ఉపాధ్యాయుడు చిరునవ్వుతో తల ఊపారు.

“చాలా గొప్ప సమాధానం ఆది. మార్కులు మన తెలివిని చూపిస్తాయి. మన ప్రవర్తన మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది.”

***

ఆ సాయంత్రం ఆది తన గదిని శుభ్రం చేస్తూ ఉండగా ఆ చెక్క పెట్టె కనిపించింది. అద్దం లేదు. పగిలిపోయిన కొన్ని చిన్న ముక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పెట్టెను చేతిలోకి తీసుకుని చాలాసేపు చూస్తూ నిలబడ్డాడు.

“ఇది నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. ఇది ఇంకొకరికి కూడా ఉపయోగపడితే బాగుంటుంది.” అని అనుకున్నాడు.

మరుసటి రోజు పాఠశాలకు వెళ్లే దారిలో.. తనకు ఆ పెట్టె దొరికిన అదే పాత చెట్టు దగ్గరకు వెళ్లాడు.

అక్కడ పెట్టెను మెల్లగా ఉంచబోతుండగా..

వెనుక నుంచి ఓ మృదువైన స్వరం వినిపించింది.

“అది అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు బాబూ.”

ఆది వెనక్కి తిరిగాడు.

తెల్లని జుట్టు.. ప్రశాంతమైన చిరునవ్వు.. చేతిలో కర్ర.. ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు.

“ఎందుకు తాతయ్య?” ఆది ఆశ్చర్యంగా అడిగాడు.

వృద్ధుడు ఆ పెట్టెను ఒకసారి చూసి చిరునవ్వు నవ్వాడు.

“ఆ పెట్టెను వెతికితే ఎవరికీ దొరకదు. కానీ.. తమను తాము వెతకడం మొదలుపెట్టిన వారికి మాత్రం.. అది ఎప్పుడూ కనిపిస్తుంది.”

ఆది ఆశ్చర్యంగా వృద్ధుడి ముఖంలోకి చూశాడు.

“అంటే.. ఆ పెట్టె..”

వృద్ధుడు మాట మధ్యలోనే ఆపేశాడు.

“మాయ పెట్టెలో లేదు బాబూ.. మనసులో ఉంది.”

అని చెప్పి నెమ్మదిగా ముందుకు నడిచాడు.

ఆది ఒక్క క్షణం కిందికి చూసి.. చేతిలో ఉన్న పెట్టెను మళ్లీ చూశాడు. మళ్లీ తలెత్తి చూసేసరికి.. ఆ వృద్ధుడు ఎక్కడా కనిపించలేదు.

రోడ్డు నిశ్శబ్దంగా ఉంది.

చెట్టు ఆకులు మాత్రమే గాలికి మెల్లగా కదులుతున్నాయి.

ఆది పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది.

పెట్టెను అక్కడ ఉంచలేదు. గుండెలకు హత్తుకున్నాడు. ఎందుకంటే.. తనలోని మాయను వెతికే ప్రయాణం ఇక జీవితాంతం కొనసాగుతుందని అతనికి అర్థమైంది.

ఆ రోజు నుంచి ఆది ప్రతి అద్దంలో తన ముఖాన్ని కాదు.. తన మనసునే చూడడం నేర్చుకున్నాడు.

–అయిపోయింది–

Exit mobile version