పౌర్ణమి రోజులేమో ఆకాశమంతా వెన్నెల వేడుక. ఇంటిముందు మొక్కల మధ్య అరుగు పై బైఠాయించిన నాకు కదలాలనిపించటంలేదు. చందమామ అందరినీ చల్లగా పలకరిస్తూ అలా అలా తరలిపోతున్నాడు. వెన్నెలను చూస్తుంటే హఠాత్తుగా నాకు ఉదయం స్పందన చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. “మేడమ్! నాకు ఈ రోజు సూపర్ మార్కెట్‌లో ‘వెన్నెల’ కనిపించింది. మిమ్మల్ని గుర్తుచేసింది. ఇద్దరు పిల్లలు. అందమైన అమ్మాయికి కాస్తంత పెద్దరికం వచ్చింది” అంటూ నవ్వింది. నేను “ఫోన్ నంబర్ తీసుకున్నావా?” అనడిగాను. “లేదు మేడమ్. తనేదో ఫోన్ వస్తే హడావిడిగా వెళ్లిపోయింది. మా ఏరియాలోనే ఉంటారట. మళ్లీ కలుద్దామంటూ వెళ్లింది. మా ఏరియా కాబట్టి ఈసారి కలిస్తే నంబర్ తీసుకుంటాను” అంది. ‘వెన్నెల’ ఆషామాషీ ఆడపిల్ల కాదు. ప్రేమించిన అతణ్ణి అందరినీ ఎదిరించి సాహసించి పెళ్లి చేసుకుని, ఐఎఎస్ చదువుతున్న అతడికి అండగా నిలిచింది. వారి ప్రేమ కలే కాదు, ఆశయమైన ఐఎఎస్ కూడా ఫలించింది. ప్రేమ ఫలించాలంటే ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎంతో అవసరం అనుకుంటుంటే ‘మొఘలే ఆజమ్’ లోని పాట గుర్తొచ్చింది..
‘ఇన్సాన్ కిసీ సే దునియా మే.. ఏక్ బార్ మొహబ్బత్ కర్తా హై
ఇస్ దర్డ్ కో లేకర్ జీతా హై.. ఇస్ దర్డ్ కో లేకర్ మర్తా హై
ప్యార్ కియాతో డరనా క్యా.. జబ్ ప్యార్ కియా తో డర నా క్యా
ప్యార్ కియా కో యి చోరీ నహీ కీ.. చుప్ చుప్ ఆహే భర్ నా క్యా…
షకీల్ బదయుని రాసిన పాట అది. మధుబాల నర్తనం, హావ భావాలు, గీతంతో పోటీపడతాయి. గొప్ప సినిమా అనుకుంటుంటే మెల్లగా నా ఆలోచనలు అలా ప్రేమాకాశంలో విహరించసాగాయి.
‘ప్రేమ’ విశ్వజనీనమైనది, ప్రేమకు ఎన్నో పార్శ్వాలున్నాయని చెప్పుకున్నా ‘ప్రేమ’ అనగానే ముందుగా యువతీ యువకుల మధ్య ఉన్న రాగ బంధంగానే గుర్తిస్తుంటారు. ‘ప్రేమ’ భావన గురించి ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చే పేరు బసవరాజు అప్పారావుగారు. తొలి భావకవి అయిన ఆయన ప్రేమ గురించి విస్తృతంగా రాశారు. ‘ప్రేమ తత్త్వము’ కవితలో ఇలా అంటారు.
వలపెరుంగక బ్రతికి.. కులికి మురిసేకన్న
వలచి విఫలమ్మొంది.. విలపింపమేలురా
ప్రేమకన్నను యెక్కు.. వే ముందిరా యెల్ల
కామ్య పదవులకన్న.. ప్రేమ యెక్కువరా
ప్రేమించు సుఖముకై.. ప్రేమించు ముక్తికై
ప్రేమించు ప్రేమకై… యేమింక వలయురా!
ప్రేమను మించింది యేదీ లేదన్న అప్పారావుగారు ప్రేమకు గల కారణాన్ని ఇలా చెప్పారు…
‘ప్రేమకుంగలు కారణంబేమనగల?
మింతిరో నిన్ను జూడ ప్రేమించుట సుమి!
ఇంతియేగాని వేర్వేర నెంచి చూచి
అందపుం దళ్కులనె ప్రేమమందగలమె?
తెలియమాత్మను ఆత్మను కలిపి కుట్టు
దారమే నాదు ప్రేమకు కారణమని‘
అచ్చమైన ప్రేమను ఎంత అందంగా చెప్పారు!
ప్రేమించి, ప్రేమకోసమే జీవించి, ప్రేమకోసమే మరణించిన వారెందరో.
ఇక రాయప్రోలు సుబ్బారావుగారు ఉదాత్త ప్రేమను ప్రకటిస్తూ నూతన యుగానికి నాంది పలికారు. ఆయన ‘తృణ కంకణం’ పేరిట ఓ ఖండకావ్యాన్ని రచించి అందులో అమలిన శృంగార తత్త్వాన్ని ఆవిష్కరించారు. ప్రేమించుకున్న ఓ యువజంట తమ ప్రేమ, పెళ్లికి దారితీయక పోవడంతో స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకోవడం ఇందులోని ఇతివృత్తం. రాయప్రోలు ఈ కావ్యంలో ఇలా అంటారు..
మనసుచే, వాక్కుచేత, కర్మంబుచేత
కలుషితములు కాదగిన వీవలపులవని
తపసుచే, తాల్మిచే, ధ్యానధారచేత
లీనమై యైక్యమీయజాలినది ప్రేమ.. అంటూ ఇంకా
వలపు నశియించియును ప్రేమ నిలువగలద
యేని, కలనైన కలుషముగాని స్నేహ
మృదుమధు రసానుభూతిని పొదలి, మనము
నీడలట్టుల నైక్యమందెదము గాత! అంటారు.
ప్రేమ భావన ఈనాటిది కాదు.. నాడు రుక్మిణి, శ్రీకృష్ణుడిని మనసా, వాచా వలచింది. పెళ్లంటూ చేసుకుంటే అతణ్ణే చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు చూసిన సంబంధం తప్పించుకోవాలంటే సత్వరం కృష్ణుడు తనను చేపట్టాలి. ధైర్యంగా తన గాఢ ప్రేమను తెలుపుతూ, తనను చేపట్టవలసిందిగా కోరుతూ లేఖ రాసి, భూసురుడి ద్వారా పంపింది. ఆ భూసురుడు తిరిగి వచ్చేలోపల రుక్మిణి పడే ఆదుర్దాను పోతనగారు తమ భాగవతంలోని ‘రుక్మిణీ కల్యాణం’లో రుక్మిణి మనసులోకి దూరారా అన్నంత అందంగా రాశారు ఓ పద్యం. అది.. ‘ఘనుడా భూసు రుడేగెనో? నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో?, విని కృష్ణుండిది తప్పుగా దలచెనో? విచ్చేసెనో? యీశ్వరుం, డనుకూలింప దలంచునోతలపడో? యార్యామహాదేవియున్, నను రక్షింప నెరుంగునోయెరుగదో? నా భాగ్యమెట్లున్నదో?’ రుక్మిణి ధైర్యంతో ప్రేమ విజయం సాధించింది. రాధాకృష్ణుల ప్రేమ మరోకోణం. రాజుల కాలంలో ప్రేమించిన స్త్రీని చేపట్టడం వీరత్వంగా భావించేవాళ్లు. అమ్మాయి పెళ్లికి స్వయంవరాలు.. వచ్చినవారికి అర్హత పరీక్షలు.. షరా మామూలే. శ్రీరాముడు శివధనుస్సు నెక్కు పెట్టడం, అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించటం వగైరా కథలు ఇతిహాసాల్లో చదువుతాం. మహాభారతంలో రురుడు, తాను ప్రేమించిన ప్రమద్వర కోసం, తన ఆయుషులో సగం ఆమెకిచ్చి బతికించుకున్నాడు. ఇక చరిత్రలోనూ ఎన్నో ప్రేమ ఉదంతాలు. పృధ్వీరాజు, సంయుక్త తండ్రి తనకు స్వయంవరానికి ఆహ్వానం పంపకున్నా వెళతాడు. అక్కడ రాణి సంయుక్త తండ్రి పృధ్వీరాజును అవమానించే ఉద్దేశంతో అతడి విగ్రహాన్ని ద్వారపాలకుడిగా ఉంచుతాడు. రాణి సంయుక్త వరమాలను ఆ విగ్రహం మెడలో వేయగానే దాని వెనుకే ఉన్న పృధ్వీరాజ్ ఆమెను వీరోచితంగా తీసుకెళ్లిపోతాడు. చరిత్రలో ఎందరో అమర ప్రేమికులు.
లైలా మజ్నూ, సలీమ్ అనార్కలి.
యువరాజైన సలీమ్‌ను ప్రేమించిన అనార్కలి
‘జీవితమే సఫలమూ.. ఈ జీవితమే సఫలమూ
రాగసుధా భరితము, ప్రేమకథా మధురము…
హాయిగా తీయగా ఆలపించు పాటలా
వరాల సోయగాల పైన వలపు గొలుపు మాటలా
అనారు పూలతోటలా.. ఆ.. ఆ.. ఆ.. ఆశదెలుపు ఆటలా..
జీవితమే‘.. అంటూ ఆనందగానం చేస్తుంది.
కానీ చివరకు ఆమె సజీవసమాధి కావడం విషాదాల్లోకెల్లా విషాదం. లైలామజ్నూ ప్రేమకథా విషాదాంతమే. ఆ చిత్రంలో మజ్నూ, ‘పయనించే ప్రియతమా నను మరచిపోకుమా’ అని మనోవ్యథ చెందితే, ‘ప్రేమే నేరమౌనా, నాపై పగేలా, వేదనగానే జీవితమంతా వేసారునా.. ప్రేమే – నేరమౌనా’ అంటూ లైలా వేదన వెళ్లబోసుకుంటుంది. శరత్ నవల ‘దేవదాసు’ను మళ్లీ మళ్లీ సినిమాలుగా తీయడం తెలిసిందే. దేవదా, పారు ప్రేమకు ప్రతిరూపాలు. ధనిక, బీద తేడాలే వారి మధ్య అడ్డుగోడలవుతాయి. అందునా అభిమానవతి అయిన పార్వతి పెద్దలు చూసిన వృద్ధుడినే పెళ్లాడి, తన ఈడు పిల్లలకు సవతి తల్లి అయింది. ఆ తర్వాత ‘అంతా భ్రాంతియే నా, జీవితాన వెలుగింతేనా’.. అని ఆమె, ‘జగమేమాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయా, ఈ వింతేనయా’ అని అతడు పాడుకోవలసివస్తుంది. ఆమెను మరువలేక తాగితాగి అతడు కన్నుమూస్తే, ఆ వార్త తెలిసి ఆమె ప్రాణమూ ఎగిరిపోతుంది. విశ్వనాథ వారి ‘ఏకవీర’ విభిన్న ప్రేమకథ. మిత్రులైన సేతుపతి, వీరభూపతి విధి బలీయమై పరస్పరం ఒకరు వలచిన అమ్మాయిని మరొకరు పెళ్లాడుతారు. ఫలితంగా జీవితాలు విషాదాలే అవుతాయి. విలియం షేక్‌స్పియర్ రచించిన ప్రపంచ ప్రసిద్ధ విషాద నాటకం ‘రోమియో అండ్ జూలియెట్’. తెలుగు నాట ‘రోడ్ సైడ్ రోమియో’ అనే మాట తరచు వింటాం. దాన్నిబట్టే ‘రోమియో అండ్ జూలియెట్’ గొప్పదనాన్ని అర్థంచేసుకోవచ్చు. ఆ నాటకంలో రెండు వంశాల మధ్య బద్ధవైరం గాఢ ప్రేమికులైన వారికి ప్రతిబంధకంగా నిలిచి, వారి ప్రాణాలనే బలిగొంటుంది. ఇలా ఫలించని ప్రేమకు ఆనవాళ్లుగా ఎందరినైనా, ఎన్నికథలనైనా చెప్పుకోవచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా చాలామంది జీవితాల్లో పెళ్లయ్యాక ఆ ప్రేమ ఇంకిపోతుంది. పెద్దలు చేసిన పెళ్లయినా సిసలైన ప్రేమికులుగా ఉండే జంటలూ ఉన్నాయి. పెళ్లయినా వాడని ప్రేమకు రుజువుగా మొగల్ పాదుషా షాజహాన్, తన భార్య ముంతాజ్ బేగమ్ స్మృతి చిహ్నంగా అద్భుతమైన ‘తాజ్ మహల్’ను నిర్మింపజేశాడు. అది ఇప్పటికీ ప్రపంచమంతటినీ అబ్బుర పరుస్తూనే ఉంది, అలరిస్తూనే ఉంది. ప్రేమ విషయంలో ఎవరి అనుభవం వారిది. తొలిచూపులోనే ప్రేమానుభూతి చెందేవారు కొందరయితే, పరిచయం పెరిగి, మాటామాటా కలిసి, మనసు మనసు కలిసి ప్రణయంలో పడేవారు మరికొందరు. ప్రేమలో పడిన ఓ అమ్మాయి మనస్థితి గురించి ఎన్నెన్నో చిత్రగీతాలు ఉన్నాయి.
‘లక్షాధికారి’ చిత్రంలో ఆరుద్రరాసిన ఆహ్లాదకరమైన పాట…
‘ఎలాగో ఎలాగో ఎలాగొ ఉన్నది
ఇలాగే ఉంటుందా తొలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది…‘
‘ప్రియమైన నీకు’ చిత్రంలో సిరివెన్నెల కలం నుంచి వెలువడినపాట.
‘మనసున ఉన్నది చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా?
మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా?’ ..
నాయిక ప్రేమావస్థకు అందమైన, అర్థవంతమైన అక్షరరూపం.
‘గులాబీ’ చిత్రంలో నాయిక అతగాణ్ణి తలచుకుంటూ
‘ఈవేళలో నీవు ఏంచేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నాగుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నావైపు రానంది
దూరాన ఉంటూనే ఏంమాయ చేశావో..
నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము..
పగలైన కాసేపు పనిచేసుకోనీవు
నీమీదనే ధ్యానము‘..
అంటూ బెంగపడుతుంది. సిరివెన్నెల రాసిన ఈ మధురగీతం సునీత మృదుగానంతో మరింత మధురమయింది.
ప్రేమకోసం ఎన్ని పాట్లు పడడానికైనా సిద్ధపడతారు కుర్రకారు. జానపద చిత్రాల్లో అయితే ఎంతటి సాహసాలకైనా సై అంటారు.
‘పాతాళ భైరవి’ చిత్రంలో ‘ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు.. అయ్యో పాపం పసివాడు’ ఎంతో పాపులర్. ప్రేమించిన హృదయాలకు యెడబాటు అశనిపాతమే.
‘మల్లీశ్వరి’ చిత్రం అసాధారణ ప్రేమ దృశ్యకావ్యం.
‘ఏడతానున్నాడో బావా.. జాడ తెలిసిన పోయిరావా
నీలాల ఓ మేఘమాలా.. ఆ చందాల ఓ మేఘమాల‘
అని మల్లీశ్వరి మేఘాలను వేడుకొంటే.. నాగరాజు..
‘గగనసీమల తేలు ఓ మేఘమాల
మా ఊరు గుడి పైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైన నాతో, మనసు చల్లగ చెప్పిపోవా…‘
అని బతిమాలుకుంటాడు. చిరంజీవి నటించిన ‘ఆరాధన’ చిత్రానికి ఆచార్య ఆత్రేయ ఓ చక్కని గీతం అందించారు. అది..
‘అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలింది
కలగాని కలయేదో కళ్ల యెదుటే నిలిచిందీ
అది నీలో మమతను నిద్దుర లేపింది…‘
ప్రేమ సఫలమై ఒక్కటైన జంట ఆలపించే మధుర గీతాలెన్నెన్నో.
‘వలపు తేనె పాట.. తొలి వయసు పూలతోట పరువాల చిన్నెల
సయ్యాట వలపించి వలచుతోట, నీ ప్రేమ పసిడి పాట
కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట… నిలవాలిలే
హమేషా, ఈనాటి ప్రేమ భాషా ప్రేమ, పెళ్లి ముచ్చటలంటే
కాదులే తమాషా…‘ అని ఓ జంట ఆలపిస్తే.. మరో జంట..
‘ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే
వలదన్న వినదీ మనసు, కలనైన నిన్నే తలచు
తొలి ప్రేమలో బలముందిలే అది నీకు ముందే తెలుసు‘.. అని పాడుకుంటారు.
మనసున్న మనిషి ఆంతర్యానికి అద్దంపట్టే పాట ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాలోని
‘మనసున మనసై… బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము..
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నింపుటకు
నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన
అదే భాగ్యము, అదే స్వర్గము‘..
జానపదరీతిలోనూ, హాస్యయుతంగాను ఉండే ప్రేమగీతాలు కూడా ఉన్నాయి.
‘గుత్తొంకాయ కూరోయి మావా, కోరి వండినానోయ్ మావా
కూరలోపల నా వలపంతా కూరి పెట్టినానోయ్ మావా
కోరికతో తినవోయ్ మావా‘ అంటుందో పల్లె పడుచు.
మరో మరదలు..
‘ఓ అందమైన బావా, ఆవుపాల కోవా
విందుగా, పసందుగా ప్రేమనందుకోవా…‘ అంటుంది.
కొంతమంది ప్రేమలో అసూయ మిళితమై ఉంటుంది. తాను పేమిస్తున్న అమ్మాయి లేదంటే తాను ప్రేమించి పెళ్లాడిన అమ్మాయి ఇతరులతో నవ్వుతూ మాట్లాడినా సహించలేరు. అమ్మాయిలు కూడా కొందరు డిటో డిటో.
ప్రేమ ఏకపక్షమైనప్పుడే చిక్కంతా. తాను ప్రేమిస్తే చాలు, అవతలి వ్యక్తి తన ప్రేమను ఆమోదించాలి, తానూ ప్రేమించాలి అని నిర్బంధించటం నిజమైన ప్రేమ కానేకాదు. నిర్బంధిస్తేనో, శాసిస్తేనో కలిగేది కాదు ప్రేమ. ఓ పూవును బలవంతంగా వికసింపజేయలేం కదా. ప్రేమ కూడా అలాంటిదే.
ప్రేమించిన అమ్మాయి కరుణించకపోతే అతడి మనసు..
‘ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీరసాగరమథనం, మింగినాను హలాహలం..‘ అనో,
‘నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది, నీ హృదయం కరగనిది‘ అనో పాడుకోవటం సహజం.
అమ్మాయి మనసిచ్చి, పుచ్చుకొని ఆ పైన ముఖం తిప్పుకుంటే..
‘హృదయంలేని ప్రియురాలా….
వలపును రగిలించావు, పలుకక ఊర్కున్నావు
ఏంకావాలనుకున్నావు.. వీడేం కావాలనుకున్నావు..‘ అని ఆ ప్రేమికుడు రగలిపోవటంలో వింతేముంది.
‘మరోచరిత్ర’ సినిమాకు ఆత్రేయ రాసిన పాట ప్రేమను అర్థవంతంగా వినిపిస్తుంది. అది..
‘ఏ తీగ పూవును ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏవింత అనుబంధమౌనో,
తెలిసీ తెలియని అభిమాన మవునో,
మనసు మూగది, మాటలు రానిది..
మమత ఒకటే అది నేర్చినది,
భాషలేనిది బంధమున్నది..
మన ఇద్దరినీ జతకూర్చినది..
ఎల్లలు ఏవీ ఒల్లనన్నది, నీదీ నాదొక లోకమన్నది..
తొలిచూపే నను నిలవేసినది, మరుమాపై అది కలవరించినది
మొదటి కలయికయే ముడివేసినది, తుదిదాకా ఇది నిలకడైనది…‘
అయితే కొంతమంది పెద్దలు పిల్లల్ని ‘ప్రేమిస్తే ప్రేమించావు, మంచి స్టేటస్ ఉన్న వాళ్లను ప్రేమించ’ మని చెప్పడం చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థంకాదు. కొంతమంది యువత కూడా అన్నీ లెక్కలు వేసుకొని, ఆ తర్వాత ప్రేమించడం కద్దు. ఇవన్నీ ప్రేమకు ద్రోహాలే. నేటికాలంలో ఆకర్షణే ప్రేమగా భ్రమపడుతూ, ప్రేమాయలో పడి, ప్రేమోసాల పాలై, ప్రేమరణాలకు గురవుతున్న వారెందరెందరో. చాలావరకు ఇప్పటి ప్రేమ తీరులు.. దారులు మూడ్నాళ్ల ముచ్చట్లు. ప్రేమ ఇప్పుడు కామన్ మాట. హైస్కూలు స్థాయి నుంచే లైన్ వేయడాలు, పటాయించడాలు.. అంతేకాదు, పత్రికల్లో, ఛానెల్స్‍లో సినీ కళాకారులు వగైరాలను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ‘మీ ఫస్ట్ క్రష్’ ఎప్పుడు అని అడగటం ఫ్యాషన్ అయిపోయింది. కొంత మంది క్రీడారంగం, నాట్య రంగం, తదితర రంగాలలో విజేతలుగా నిలిచిన అమ్మాయిలను సొంతం చేసుకోవాలని అర్జెంటుగా ప్రేమించేస్తారు. వారిని పెళ్లాడాలని ఊహలల్లేసుకుంటారు. విజేతలై, ప్రసిద్ధులైన వారిని అభినందించవచ్చు, అభిమానించవచ్చు గాని ప్రేమ, పెళ్లి అంటూ వారిని డిస్టర్బ్ చేయడం, వేధించడం, మోసగించడం.. ఇలా ఎన్నెన్నో.. ఇక ‘ప్రేమోసా’ల ఉదంతాలెన్నో. చివరకు అత్యాచారాలు, హత్యలు ఆత్మహత్యలుగా పరిణమించడం రోజువారీ వార్తలయ్యాయి. ప్రేమ విషాదాలను నేటి సోషల్ మీడియా మరింత పెంచేస్తోంది. ప్రేమ విఫలమైతే ఆత్మహత్యకు పాల్పడుతున్న వారెందరో. వారు ఆత్మహత్యకు పాల్పడేముందు పుట్టకముందు నుంచే ఎనలేని ప్రేమను చూపిన అమ్మ, తమకోసం నిరంతరం కష్టపడే నాన్న, తోబుట్టువులు, ప్రాణ స్నేహితుల గురించి ఒక్కక్షణం ఆలోచించినా ప్రాణాలు తీసుకోలేరు. జీవితం ఎంతో విలువైంది. కొందరి విషయంలో ప్రేమ ఫలించకపోవచ్చు. అంతమాత్రాన జీవితాన్నే తుంచేసుకోవాలా? తమ జీవితాన్ని సార్థకం చేసుకునే మార్గాలెన్నో ఉన్నాయే.. దేశమును ప్రేమించుమన్నా అన్నాడు గురజాడ. ఎందరెందరో నిర్భాగ్యులు, నిస్సహాయంగా.. వారికి చేయూత నివ్వవచ్చునే. ‘జగమంత కుటుంబం నాది’ అనే భావన పెంచుకోవచ్చునే.. మనిషి బేసిక్‌గా మంచిని, మానవత్వాన్ని ప్రేమించగలగాలి. గుండె గుప్పెడే.. ప్రేమ అనంతం … ప్రపంచానికి పర్యావరణం పదిలంగా ఉండటమెంత అవసరమో, ప్రేమావరణం స్వచ్ఛంగా ఉండటం కూడా అంతే అవసరం’ అనుకుంటుంటే ఆనందాతిరేకంతో నవ్విన మధురమైన నవ్వులు అలలు అలలుగా గాలిలో తేలివచ్చాయి. దాంతో నా ప్రేమాలోకనానికి బ్రేక్ పడి, నవ్వుల ధ్వని దిశగా నా చూపు.. ఎదురింట్లో జంట ఉయ్యాలలో కూర్చుని ఊసులాడుకుంటున్నారు. అతడి మాటలకు ఆమె నవ్విన నవ్వులవి. ‘ప్రేమోహనం’ అనుకుంటూ టైమ్ చూసి ఉలిక్కి పడ్డాను ‘ఖుషీఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ, హుషారుగా ఉందాములే హమేషా మజాగా’.. కూనిరాగం తీస్తూ లేచాను, నిద్రమీద ప్రేమ ముంచుకొస్తోంది మరి.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.