Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మానసిక శుద్ధి

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘మానసిక శుద్ధి’ అనే రచనని అందిస్తున్నాము.]

భగవద్గీత 15వ అధ్యాయం, 11వ శ్లోకం
యతంతో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్
యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః

శ్రమతో సాధనలో నిమగ్నమైన యోగులు శరీరంలో నివసిస్తున్న ఆత్మను సాక్షాత్కారంగా గ్రహించగలుగుతారు. కానీ మనస్సు శుద్ధి పొందనివారు, ఎంత ప్రయత్నించినా, ఆ అనుభూతిని చేరుకోలేరు అని పై శ్లోకం భావం.

ఈ శ్లోకం ద్వారా భగవానుడు మానసిక శుద్ధి యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నాడు. మానసిక శుద్ధి లేని సాధకులు, ఆధ్యాత్మికవేత్తలు ఎన్ని శాస్త్రాలు చదివినా, పాండిత్యాలు ప్రదర్శించినా, యోగం, ధారణ, ధ్యానం వంటి ఎన్ని సాధలను చేసినా అవన్నీ వ్యర్థం అని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాన్ని మహర్షి పతంజలి కూడా తన యోగసూత్రాల ద్వారా తెలియజేసారు.

యోగసూత్రం 1.2 లో యోగశ్చిత్తవృత్తి నిరోధః అని వుంది అంటే యోగం అనేది మనస్సులో ఉద్భవించే వృత్తులను నియంత్రించడం. మనస్సు శుద్ధి లేకపోతే, ఆత్మసాక్షాత్కారం సాధ్యం కాదు అన్న విషయాన్ని మహర్షి పరోక్షంగా ఇక్కడ స్పష్టం చేస్తున్నారు.

మరొక యోగ సూత్రంలో (యోగసూత్రం 1.3) లో తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం

అంటే చిత్తవృత్తులు నియంత్రితమైనప్పుడు, దర్శించినవాడు తన స్వరూపంలో నిలుస్తాడు.

శుద్ధమైన మనస్సు గల యోగి మాత్రమే ఆత్మను గ్రహించగలడు అని ఇది స్పష్టం చేస్తుంది.

మహర్షి పతంజలి సూత్రాల ప్రకారం శరీరంలో ఉన్న ఆత్మను గ్రహించేది సాధన కాదు, శుద్ధమైన చిత్తం అంటే మనస్సు. శ్రమతో కూడిన సాధనతో చిత్తశుద్ధి కలిస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కాబట్టి సాధనలో తొలి మెట్టు నుండి మానసిక శుద్ధి యొక్క ఆవశ్యకత ఎంతైనా వుంది.

యోగి వేమన సైతం ఈ అంశాన్ని తన పద్యంలో బహు చక్కగా చెప్పాడు:

పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు
మాటకన్న నెంచ మనుసు దృఢము
కులముకన్న మిగులు గుణము ప్రధానంబు,
విశ్వదాభిరామ వినురవేమ.

ఎప్పుడూ పూజలు చేయుట కంటే మంచి బుద్ధి, పవిత్రమైన మనసు, మానసిక శుద్ధి కలిగిఉండుట మంచిది. ఎవరినీ నొప్పించక పవిత్రమైన మనస్సుతో తన ఆరాధనలను, భగవంతుని పూజలను చేసుకోవడం అంతకంటే మంచిది. ఇచ్చిన మంచి మాట మీద నిలబడడము వలన మంచి ఫలితము కలుగును. పుట్టిన కులము కంటే మంచి గుణము చూసి గౌరవించవలెను. మంచి గుణమే ముఖ్యమైనది అని వేమన భావం.

ఈ అంశానికి సంబంధించి ఒక మంచి కథ ప్రచారంలో వుంది. ఒక గ్రామ పొలిమేరలో ఉన్న తన చిన్న ఇంట్లో రామయ్య ప్రతిరోజూ క్రమం తప్పకుండా దీపారాధన చేస్తూ ఉండేవాడు. అతను మంత్రోచ్చారణలు, జపతపాలు అన్నీ శాస్త్రోక్తంగా చేసేవాడు కానీ, అతని మనస్సులో మాత్రం ఇతరుల పట్ల అసూయ, చిన్న విషయాలకే వచ్చే కోపం గూడు కట్టుకుని ఉండేవి. చీటికీ మాటికీ అందరిపై అరుస్తూ వుండేవాడు. అంతేకాక పిల్లికి సైతం బిచ్చం పెట్టని లోభి మనస్తత్వం రామయ్యది.

ఒకరోజు మండుటెండలో అలసిపోయి అతని ఇంటి ముందరి మెట్లపైకి ఒక పేద వృద్ధుడు వచ్చి దాహానికి కొన్ని నీళ్లు అడిగాడు. తన భక్తికి ఆటంకం కలిగిందన్న అసహనంతో రామయ్య విసుగు చెందుతూనే అతనికి నీళ్ల గిన్నెను అందించాడు. ఆ వృద్ధుడు ఆ నీటిని తాగి, రామయ్య ముఖంలోకి ప్రశాంతంగా చూసి నిశ్శబ్దంగా నవ్వుతూ, “నాయనా! నువ్వు నీ ఇంట్లో దీపం వెలిగించి వెలుగును నింపావు కానీ, నీ అంతరంగంలో పేరుకుపోయిన చీకటిని మాత్రం ఇంకా చూసుకోలేదు” అని వ్యాఖ్యానించాడు. ఆ మాటలు రామయ్య గుండెల్లో బలంగా తగిలి, అతనిలో ఆత్మపరిశీలన మొదలైంది. ఆ క్షణం నుండి అతను కేవలం యాంత్రికంగా చేసే జపాలను తగ్గించి, సాటి మనుషులకు అవసరమైన సేవ చేయడంపై దృష్టి పెట్టాడు. తనలోని అహంకారాన్ని, ద్వేషాన్ని క్రమంగా వదిలిపెట్టి అందరినీ ప్రేమించడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే రామయ్య ముఖంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రశాంతత, తేజస్సు మెరిసింది. అప్పుడు అతనికి అర్థమైంది – దైవం ఎక్కడో బయట వెతకాల్సిన శక్తి కాదని, అహంకారం లేని స్వచ్ఛమైన మనస్సులోనే దేవుడు నివసిస్తాడని.

Exit mobile version