Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనస్సును విశ్లేషించిన సిగ్మండ్ ఫ్రాయిడ్

[బాలబాలికల కోసం ‘మనస్సును విశ్లేషించిన సిగ్మండ్ ఫ్రాయిడ్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

ఇప్పుడు మనం డిప్రెషన్, యాంగ్జెటీ న్యూరోసిస్, ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ అని రకరకాల మానసిక రుగ్మతల గురించి వింటున్నాము, చూస్తున్నాము. ఒకప్పుడు కేవలం శరీరానికి మాత్రమే జబ్బులు వస్తాయని అనుకునేవారు. మనస్సు అతిగా స్పందించినపుడు, విపరీతంగా బాధపడినపుడు దానికి కూడా జబ్బులు వస్తాయని ఫ్రాయిడ్ కు ముందు ప్రపంచానికి తెలియదు. మనస్సు అనుభవించే సంతోష దుఃఖాలు శరీరాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయని ఫ్రాయిడ్ కనుక్కున్నారు.

సిగ్మండ్ ఫ్రాయిడ్ 1856వ సంవత్సరం, మే 6వ తేదీన ఆస్ట్రియాలో జన్మించారు. ఫ్రాయిడ్‌ను తల్లిదండ్రులు ఎంతో ముద్దుగా చూసుకునేవారు. ప్రతి తరగతిలోనూ మొదటి స్థానాన్ని సంపాదిస్తూ, మెడిసిన్ పూర్తి అయిన వెంటనే థియోడార్ మెనర్ట్ సైకియాట్రిక్ హాస్పిటల్‌లో చేరారు. ఆ తరువాత పై చదువుల కోసం ఆయన ఫ్రాన్స్ వెళ్ళారు. అక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన న్యూరాలజిస్ట్ అయిన చార్కాట్ దగ్గర పనిచేశారు.

మానసిక సమస్యల వల్ల వచ్చే రుగ్మతలు చేతబడుల వలన వస్తాయని భావించేవారు. లేదా దేవుడి పూనకాల వల్ల సంభవిస్తాయని అనుకునేవారు. ఈనాటికీ హిస్టీరియా వంటి మానసిక జబ్బుల్ని దేవుడి పూనకంగా భావించేవారు ఎందరో ఉన్నారు. జబ్బులు రెండు రకాలు. ఒకటి శరీరానికి వచ్చే బాధలు. రెండు మనసుకు వచ్చే బాధలు. మనసుకు వచ్చే జబ్బులకు చికిత్స కూడా మనసులోని ఆలోచనల్లోనే ఉన్నది. శరీరానికి వచ్చే జబ్బుల్ని నిర్ధారణ పరీక్షల ద్వారా కనుక్కోవచ్చు. ఇవి శారీరక జబ్బులు. మరి కొన్నింటిలో ఏ జబ్బు లక్షణమూ కనిపించదు కానీ జబ్బు తగ్గదు. ఇటువంటి వాటిని ‘ఫంక్షనల్ డిసీజెస్’ అంటారు. ఫ్రాయిడ్ ఇలా మనస్సును విశ్లేషించి అచేతనను ఆవిష్కరించారు.

మనస్సు మంచి, చెడుల మధ్య సంఘర్షణకు గురైనపుడు హిస్టీరియా లక్షణాలుగా బయటపడతాయి. రోగిలోని ఘర్షణనూ, దుఃఖ జనితమైన సన్నివేశాలనూ, రోగి చేత మాట్లాడించడం ద్వారా రోగకారక లక్షణాలు మాయమైపోయాయి. ఇలా చేయడాన్ని ‘టాకింగ్ క్యూర్’ అంటారు. ఫ్రాయిడ్ తన భావాలకు ‘మనో విశ్లేషణ’ అని పేరు పెట్టారు.

ఫ్రాయిడ్, స్వప్నాల ద్వారా మనసు మూలల్లోని విషయాలను కనుక్కునే పద్ధతి కనిపెట్టాడు. మనిషిలోని తీరని కోరికలే కలలని, ఫ్రాయిడ్ కలలను విశ్లేషించాడు. ఫ్రాయిడ్ 1899వ సంవత్సరంలో ‘ఇంటర్ ప్రెటేషన్ ఆఫ్ డ్రీమ్స్’ అనే గ్రంథాన్ని వెలువరించారు. మనిషి యొక్క బాల్యం సక్రమంగా ఉంటే జీవితం కూడా సక్రమంగా ఉంటుందని ఫ్రాయిడ్ సిద్ధాంతీకరించారు. ఫ్రాయిడ్, ఐన్‌స్టీన్‌తో కలసి ‘వై వార్’ అనే పుస్తకాన్ని వ్రాశారు. ఫ్రాయిడ్ ఆ తరువాత లండన్ వెళ్లిపోయారు. 1939వ సంవత్సరం సెప్టెంబరు 23వ తేదీన క్యాన్సర్ వ్యాధితో ఫ్రాయిడ్ మరణించారు.

Exit mobile version