[శ్రీ మోదుగుల రవికృష్ణ రచించిన ‘మనసు పలుకులు’ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ఉపాధ్యాయుడు, రచయిత, పరిశోధకుడు శ్రీ మోదుగుల రవికృష్ణ గారు 2014-20 మధ్య కాలంలో కొన్ని పుస్తకాలకు వ్రాసిన ముందుమాటలు, కొన్ని పత్రికలకు వ్రాసిన వ్యాసాలతో ‘మనసు పలుకులు’ అనే పుస్తకం వెలువరించారు.
“సాహిత్య సాగరంలో నిత్యం మునకలేస్తూ, దొరికిన మణిమాణిక్యాలని తెలుగు వారికివ్వటమే లక్ష్యంగా పెట్టుకుని సాగుతున్నారు రవికృష్ణ” అని ప్రచురణకర్త శ్రీ బలరామ్ పేర్కొన్నారు తమ ముందుమాటలో.
~
డా. రొంపిచర్ల భార్గవి గారు విశ్వకవి రవీంద్రుని ‘గీతాంజలి’కి చేసిన అనువాదానికి వెనుకమాట వ్రాస్తూ, ఆ పుస్తకం ప్రచురణ వెనుక ఉన్న కథనీ, డా. భార్గవి గారితో తనకున్న ఆత్మీయతని వివరించారు రవికృష్ణ. ఎటువంటి ఉద్విగతాస్థితిలో భార్గవిగారు గీతాంజలిని అనువదించారో తెలిపారు. ఆత్మీయులు గిరిధర్ గారి బొమ్మలు లక్కాబంగారం లాగా చక్కగా తాపడం అయిపోయాయి అనువాదానికి అని వివరించారు.
శ్రీ సంజీవ్ దేవ్ గారి ‘తేజో రేఖలు’ పునర్ముద్రణ సందర్భంగా చక్కని ముందుమాట వ్రాశారు రవికృష్ణ. కానీ ఎందుకనో అది ఆ పుస్తకంలో చేరలేదట. అయినా పాఠకులకి లోటేమీ కలగదు. ఈ పుస్తకంలో ఆ ముందుమాట ఉంది. సంజీవ్ దేవ్ సాహిత్యం గొప్పదా, ఆయన జీవితం గొప్పదా అన్న సందేహానికి రవికృష్ణగారు తనకు తానే చెప్పుకున్న సమాధానం గొప్పది.
తెలుగు, సంస్కృత నిఘంటువుల రూపకల్పనలో మామిడి వెంకయ్య గారి కృషిని అద్భుతంగా వివరించారో వ్యాసంలో. అమరకోశం, తెలుగు పద్య నిఘంటువులు, బ్రౌన్ నిఘంటువు, ఆంధ్ర దీపిక, సూర్యారాయాంధ్ర నిఘంటువు, వంటి వాటి గురించి చక్కని వివరణలున్నాయీ వ్యాసంలో.
గుంటూరులోని అన్నమయ్య గ్రంథాలయం స్థాపకులు శ్రీ లంకా సూర్యనారాయణ గారి గురించి వ్రాసిన వ్యాసం ఎంతో ఉపయుక్తమైనది. ఒక సాధారణ వ్యక్తి యొక్క అసాధారణ కృషికి నిదర్శనంగా నిలిచిన అన్నమయ్య గ్రంథాలయం స్థాపకుడి జీవితం, వ్యక్తిత్వం తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
డా. కంపల్లె రవిచంద్రన్ గారి ‘అంతా రామమయం’ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో భద్రాచల రామాలయం గురించి, అక్కన మాదన్నల గురించి, రామదాసు గురించి, కబీరు దాసు గురించి చక్కని సమాచారమిచ్చారు రవికృష్ణ. భద్రాచలంలో రామదాసు ధ్యానమందిరం నిర్మాణానికి శ్రీ నీలంరాజు వేంకట శేషయ్యగారు సల్పిన కృషి గురించి చదువుతుంటే అబ్బురమనిపిస్తుంది.
స్వధర్మ సేవా సంస్థ బాపుగారికి సన్మానం చేయదలచి, ఆ సందర్భంగా ఓ ప్రత్యేక సంచిక వెలువరించాలనుకుంది. ఆ సన్మాన కార్యక్రమం అనుకున్నట్టుగా జరగలేదు. ఆ ప్రత్యేక సంచిక కోసం ఉద్దేశించిన వ్యాసాన్ని ఈ పుస్తకంలో చేర్చారు రవికృష్ణ. బాపుగారితో తన పరిచయం, వారు గీసిన బొమ్మ ఒక దానిలో తనకు కనబడిన తప్పుని సూచించగా, ఆయన దాన్ని ఒప్పుకోడం, కొద్ది రోజుల తర్వాత రాసిన ఉత్తరంలో, అదెందుకు సరైనదో వివరించడం వంటి సంగతులు ఆసక్తిగా ఉంటాయి. మధ్యతరగతి జీవుల బాపు చిత్రించిన విధానానికి తానెంతో అబ్బురపడేవాడినని రవికృష్ణ పేర్కొన్నారు. 2006లో వి.ఎ.కె. రంగారావు గారితో కలిసి బాపు గారింటికి వెళ్ళటం, అప్పుడు ఆయనకు కలిగిన అనుభూతిని వర్ణించలేం.
డా. ఈమని శివనాగిరెడ్డి గారి ‘చరిత్ర శకలాలు’ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో కార్యక్షేత్రంలో శివనాగిరెడ్డిగారి వ్యవహారశైలి ఎలా ఉంటుందో వివరించారు. నిజంగా ఆ దృశ్యం కళ్ళకు కడుతుంది. ఆ సంపుటిలోని వ్యాసాలలో క్లుప్తత, సరళత, ఆప్తత, విషయనిష్ఠత అద్భుతంగా అమరాయని రవికృష్ణ గారంటారు.
‘గ్రంథాలయ గాంధీ వెలగా వెంకటప్పయ్య’ అనే పుస్తకానికి వ్రాసిన ముందుమాట/వ్యాసంలో – వెలగా వెంకటప్పయ్య గారికీ, తనకీ ఉన్న అనుబంధాన్ని పేర్కొన్నారు. వారు ఏదైనా సమాచారం కావాలని అడిగేటప్పుడు వారి పద్ధతి ఎలా ఉండేదో వివరించారు. తానెన్నడూ అర్థం చేసుకోలేని మహామూర్తి వెలగా వెంకటప్పయ్య గారు అని వ్యాఖ్యానించారు.
జూలై 2017లో మిసిమి పత్రికలో వ్రాసిన ఒక వ్యాసంలో సాహిత్య బంధువు జి. వెంకటేశ్వర రావు గారి గురించి సమగ్రంగా తెలిపారు. ఆయనది సాహిత్యాభిరుచి కాదనీ, సాహిత్యోపాసన అని రవికృష్ణ పేర్కొన్నారు. విశ్వనాథ సత్యనారాయణగారంటే అమితమైన అభిమానం ఉన్న వెంకటేశ్వరరావు గారు రామాయణ కల్పవృక్షం సారాన్ని పూర్తిగా జీర్ణించుకున్న వ్యక్తి అని వ్యాఖ్యానించారు రవికృష్ణ.
‘పానుగంటి కంఠాభరణం’ అనే పుస్తకానికి వ్రాసిన ముందమాటలో పానుగంటి పంతులు గారు వ్రాసిన పూర్తి హాస్యభరిత నాటకం ఇదని తెలిపారు. పిఠాపురం జమీందారు రావు వేంకట సూర్యారావు మహీపతి బహద్దూర్ గారు అడిగి మరీ వ్రాయించుకున్న నాటకం ఇదని, అందుకే పానుగంటి వారి సాహిత్యంలో ఈ పుస్తకానికి విశేష స్థానం ఉందని వ్యాఖ్యానించారు రవికృష్ణ. నాటకం కథని సంక్షిప్తంగా పరిచయం చేశారు.
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి ఆత్మకథ ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో, శ్రీకాంతశర్మగారు ‘పండితపుత్రుడ’నే జాతీయానికి చేటు తెచ్చారు అని వ్యాఖ్యానించడంలో – అటు వారి తండ్రిగారు హనుమచ్ఛాస్త్రిగారినీ, ఇటు శ్రీకాంతశర్మగారినీ ఏకకాలంలో గౌరవించినట్లయింది. సాధారణంగా ఆత్మకథల్లో కానవచ్చే ఒక లోపం, వీరి ఆత్మకథలో లేదని అన్నారు రవికృష్ణ.
‘జావళీల ప్రచురణ నేపథ్యం’ అనే వ్యాసంలో, ‘జావళీలు’ అనే పుస్తకం ప్రచురణకై తాను పడిన శ్రమనీ, శ్రీ వి.ఎ.కె. రంగారావు గారి సూచనలని వివరించారు. ఆ పుస్తకం ముద్రణలో దొర్లిన ఒక పొరపాటుని హుందాగా అంగీకరించారు.
‘ఆన’ అనే అనువాద నవల గురించి వ్రాసిన వ్యాసంలో – పాఠకులలో ఒక రకమైన ఉత్కంఠతను కలిగించటంలో రచయిత సఫలమయ్యారని వ్యాఖ్యానించారు. నవల నాయకుడైన డాక్టరుగారికీ, ఒథెల్లోకీ ఓ విషయంలో పోలిక చూపారు. అనువాదకులు శ్రీ పిన్నమనేని మృత్యుంజయరావు గారి గురించి చెప్తూ, వారిలోని విమర్శక శక్తి, ఆయన సృజనశక్తిని అడ్డుకుంటోందని పేర్కొన్నారు.
బెంగుళూరు నాగరత్నమ్మ జీవితంపై వచ్చిన అనువాదాన్ని గుంటూరుకు చెందిన సంస్కృతి సంస్థ ‘త్యాగరత్న’ అనే పేరుతో ప్రచురించింది. ఆ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో – కన్నడంలో ఆ పుస్తకానికి పెట్టిన పేరు ఎంత సార్థకంగా అమరిందో తెలిపారు. ఈ పుస్తకాన్ని కన్నడంలో ప్రొ. మలెయూరు గురుస్వామి వ్రాయగా, తెలుగులో శ్రీ రంగనాథ రామచంద్రరావు అనువదించారు.
‘మహాస్వప్నతో కాసేపు..’ అనే వ్యాసంలో, కందుకూరుకు సమీపంలోని తిమ్మసముద్రం అనే ఊరిలో ఆయనతో జరిపిన సంభాషణా సారాన్ని అందించారు. ఒకప్పుడు దిగంబర కవిత్వాన్ని వెలువరించి, ఆ పై ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళిన మహాస్వప్న – తనలో కలిగిన మార్పులను రవికృష్ణకి వివరించారు.
‘తెలుగు వెలుగు’ పత్రిక ఆగస్టు 2019 సంచికలో వ్రాసిన ఒక వ్యాసంలో జాతీయోద్యమానికి తెలుగు కవులు చేసిన సాహితీసేవ గురించి తెలియజేశారు రవికృష్ణ. తమ కవిత్వం ద్వారా ఉద్యమానికి ఎలా ప్రేరణినిచ్చారో కొన్ని ఉదాహరణల ద్వారా తెలిపారు.
నేతి సూర్యనారాయణ శర్మ గారి ‘శంకర విజయం’ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో శంకరాచార్యుల వారిలో హాస్యశీలత ఉందని తనకెలా తెలిసిందో తెలిపారు. తత్సంబంధిత శ్లోకాన్ని అందించారు. రచన శైలి విషయంలో శర్మగారు జాగ్రత్తగా ఉన్నారనీ, శంకర స్తోత్రాలను చాలా సందర్భ శుద్ధితో ఉపయోగించుకుని వివరించారని అన్నారు రవికృష్ణ.
~
ఈ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో రవికృష్ణ గారి మిత్రులు ఆయన గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు నూటికి నూరు శాతం సరైనవేనని పాఠకులు ఏకీభవిస్తారు ఈ పుస్తకం చదివాకా.
***
రచన: మోదుగుల రవికృష్ణ
ప్రచురణ: అనల్ప బుక్ కంపెనీ, సికింద్రాబాద్
పేజీలు: 160
వెల: ₹ 170.00
ప్రతులకు:
అనల్ప బుక్స్,
మొదటి అంతస్తు,
జికె కాలనీ బస్ స్టాప్,
నేరేడ్‌మెట్ క్రాస్ రోడ్స్ దగ్గర,
సికింద్రాబాద్ – 500094, తెలంగాణ.
ఫోన్: 070938 00303
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/Manasu-Palukulu-Modugula-Ravikrishna/dp/8194751837
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
