Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనసుకు శాంతి

[బాలబాలికల కోసం ‘మనసుకు శాంతి’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

గోవిందరావు ధనవంతుడు. ఆయనకి బోలెడు వ్యాపారాలు ఉన్నాయి. ఇంకా కొన్ని వ్యాపారాలు ప్రారంభించలానుకుంటున్నాడు.

అతనికి అలా ఎన్నో ఆస్తులు ఉన్నా మనశ్శాంతి లేదు. ఎప్పుడూ ఏదో తెలియని గిలి, భయం అతనికి కలుగుతుంటాయి!

ఒక రోజు తన మానసిక పరిస్థితిని గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడే లోపలికి గిరి అనే తన గుమాస్తా వచ్చాడు.

“గిరీ నాకు అన్నీ ఉన్నా మనశ్శాంతి ఉండటం లేదు. ఆ శాంతిని ఎలా పొందాలి? నీకు ఏమైనా తెలుస్తే చెప్పగలవా?” అని బేలగా అడిగాడు.

తన యజమాని అనవసరమైన బాధలో ఉన్నాడని గ్రహించాడు గిరి.

“అయ్యా నేను చెబితే మీకు అంత అర్థం కాకపోవచ్చు మీకు సమయం ఉంటే నాతో రండి. మీకు కొంతమందిని చూపిస్తాను మనశ్శాంతి విషయం అర్థం అవుతుంది” చెప్పాడు గిరి.

“నాకు పనులున్నా నీతో వస్తాను నాకు మనశ్శాంతి ముఖ్యం” అని గిరితో బయలు దేరాడు.

గిరి ఆయనను ఒక ఉద్యానవనానికి తీసుకవెళ్ళి అక్కడ ఒక పాలరాతి బల్లమీద కూర్చో బెట్టాడు. పచ్చని చెట్లు రంగుల పూలు, కోకిల అరుపు, పక్షుల కిలకిలలు ఆయనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి.

“ఇన్నాళ్ళూ నేను వ్యాపారాల్లో మునిగి పోయి ఇటువంటి ఆనందాల సంగతే మరచి పోయాను” అన్నారు గోవిందరావు.

ఆయన మాటలకు గిరి చిరునవ్వు నవ్వుకుని ఆయనను మరోచోటికి తీసుకవెళ్ళాడు. ఒక చోట ఒక వ్యక్తి బుట్టలు అల్లుతూ చిన్నగా పాట పాడుకుంటున్నాడు.

అతన్ని చూసి గోవిందరావు ఆశ్చర్య పోయి “బాబు నీవు బట్టలు అల్లుకుంటూ సంతోషంగా ఉంటున్నావా” అడిగాడు.

“అయ్యా చేతిలో విద్య ఉంది నేను అల్లిన బుట్టలు బాగా అమ్ముడుపోతాయి. ఒక్కొక్కసారి నా బుట్టలకు రంగులు వేస్తాను, కొత్తరకంగా కూడా అల్లుతాను. వాటిని చూసుకున్నప్పుడు నా గుండె ఆనందంతో నిండుతుంది” అని చెబితే అతను చేసే పనిలోనే ఆనందం, సంతృప్తి వెతుక్కుంటున్నాడని అర్థం చేసుకున్నాడు గోవిందరావు తన వ్యాపారం బాగున్నా తన వ్యాపారం నుండి ఆనందం సంతృప్తి పొందలేక పోతున్నాడు.

గిరి ఆయనను మరో చోటుకు తీసుక వెళ్ళాడు.

అక్కడొక వ్యక్తి ఓ రాయిమీద కూరచుని ఎండలో కూర్చుని నిలబడి సూర్య నమస్కారాలు చేస్తున్నాడు. అతని వద్దకు వెళ్ళి అతని ఆనందాన్ని గురించి అడిగితే అతను “చూడండి ప్రకృతే మనకు నిజమైన ఆనందం ఇస్తుంది. చెట్లు, సూర్య రశ్మి, నిద్ర, ఆరోగ్యాన్ని కాపాడుతాయి” చెప్పాడు ఆ వ్యక్తి.

ఇవన్నీ చూసి ఆయా వ్యక్తులు చెప్పినవి విన్న తరువాత గోవిందరావుకి సంతోషానికి చిరునామా దొరికింది. డబ్బు ఒక్కటే ఆనందానికి మార్గం కాదని తృప్తి, నిద్ర, సూర్యరశ్మి, పచ్చని ప్రకృతి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేవని తెలుసుకుని తన జీవన విధానాన్ని మార్చుకుని ఆనందం పొందాడు. అన్ని మంచి విషయాలు చూపించిన గిరికి జీతం పెంచాడు.

Exit mobile version