Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

లోతైన భావాలకు సొగసైన అక్షర రూపం ‘మనస్వినీయం’ కవితాసంపుటి

[డా. కొవ్వలి గోపాలకృష్ణ గారి ‘మనస్వినీయం’ కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

వృత్తి రీత్యా ఔషద రంగంలో పరిశోధకులైన డా. కొవ్వలి గోపాలకృష్ణ ప్రవృత్తి రీత్యా కవి. మాటల మాలలల్లడం సేదదీరే సరదా అని చెప్పుకున్నారు. అనుభవాలను, అనుభూతులను గుదిగుచ్చి కవితాసుమాలుగా మాలకట్టారు.

మనిషికి ఏ భావమైనా మెదిలేది మనసులోనే. అన్ని అనుభూతుల నెలవూ మనసే. కాబట్టి తనలో కలిగిన ఆలోచనలకూ, అనుభూతులకు, ఉద్వేగాలకూ, ఉల్లాసాలకూ కవితా రూపం కల్పించి ఆ పుస్తకానికి ‘మనస్వినీయం’ అని పేరు పెట్టడం ఎంతో సముచితంగా ఉంది.

83 కవితలున్న ఈ సంపుటిలో కొన్ని భక్తి కవితలు, ఆత్మాన్వేషణాపూర్వక కవితలు కొన్ని, సాంకేతికత పెచ్చరిల్లి మనిషితనం వెనుకబడుతున్నందుకు వేదన నిండిన కవితలు కొన్ని, పకృతి పరిరక్షణ కవితలు కొన్ని ఉన్నాయి.

తొలి కవితలో అష్టలక్ష్ములను ప్రార్థించారు.

‘స్వీయం’ అన్న కవితలో తన గురించి చెప్పుకుంటూ “నేనొక మాటసారిని/మనసున్న మనిషిని, మనస్వినిని” అన్నారు. “నా జీవనమొక ఋక్కు/నా జీవితమొక బుక్కు/నా వాక్కొక చమక్కు” అంటూ ప్రాసలో ఒదిగించిన పదాలలో – కవి ఏమిటో, వారి అంతరంగమెటువంటిదో పాఠకులకు అవగతమవుతుంది.

‘సప్తస్వర రామం’, ‘రామగానం’, ‘నగుమోము’, ‘శరణాగతి’, ‘రాముడొక్కడే’ అనే కవితల్లో కవి రామభక్తి వెల్లడవుతుంది. సర్వజన శ్రేయస్సుకై ఆర్తినిండిన కవి ప్రార్థన ఫలించాలని పాఠకులు కోరుకుంటారు. కృష్ణుడిని ఉద్దేశించి, ‘భావవీచిక’, ‘మురళీ రవము’, ‘కృష్ణార్చన’, ‘వెన్నల దొంగ’ అనే కవితలు వ్రాశారు. శివును గురించి ‘కార్సినోజగం’, ‘తత్వం’, ‘దిగంబర సత్యం’ కవితలు వ్రాశారు.

విఘ్నేశ్వరునిపై తెలంగాణ యాసలో అల్లిన ‘నయ దునియ’ చక్కని కవిత. కష్టాలను తొలగించి అందరికీ సుఖమైన జీవితం ప్రసాదించమని వేడుకోవడం ఎంతో ఔచితీమంతంగా ఉంది.

ఎల్లప్పుడు ఎదుగుతూనే ఉండాలని మనిషి ప్రయత్నిస్తాడనీ, అది అతని నైజమని అంటారు ‘గతి – ప్రగతి’ కవితలో. “నిన్న ప్రగతికి కొలమానం/రేపు ఆశకి ఆలంబన, భవితకి బాట” అంటూ వర్తమానం విలువని చాటుతారు కవి ఈ కవితలో.

భయమంటే ఏమిటో, అదెలా ఉంటుందో ‘భయం’ అనే కవితలో చెప్పారు. దాన్ని పోగొట్టుకుని నిర్భయతని అలవర్చుకోడానికి ఏం చేయాలో సూచించారు.

కర్తవ్య నిర్వహణలో సూర్యుడెలా ప్రేరణిస్తాడో ‘అరుణోదయం’ కవితలో గొప్పగా చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గారికి అద్భుతంగా నివాళులు అర్పించారు ‘కలాం, శతస్సలాం’ కవితలో.

అన్నిటికీ వెలకట్టి అమ్మేస్తున్న వైనం పట్ల బాధని వ్యక్తం చేస్తారు కవి ‘దర్పణం’ కవితలో. ప్రస్తుత సమాజపు పెడధోరణులకు అద్దం పడుతుందీ కవిత.

‘మనిషి-జీవితం’ కవిత ఒక జీవితసత్యాన్ని మళ్ళీ మన ముందుకు తెస్తుంది. “మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ ఎవరూ లేరు/అంతా మనుషులే/అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి/పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తారు” అంటారు.

‘కార్డు’, ‘వాట్సప్ లివింగ్’ అనే కవితలు మన జీవితాల్లోకి టెక్నాలజీ ఏ మేరకు చొచ్చుకువచ్చేసిందో చెబుతూ, మానవీయ స్పందనలను కోల్పోకూడని గుర్తు చేస్తాయి.

‘నేనేవరు?’ అని ప్రశ్నించుకుని, దానికి అనుబంధంగా మరికొన్ని ప్రశ్నలు వేసుకుని, చివరికి తానెవరో తెలుసుకుంటారు కవి. మనకీ పరిచయం చేస్తారు. ‘నేను నేనా..?’ కవితలో తానెవరో గ్రహించే ప్రయత్నం చేస్తారు. ఈ కవితల్లో ఆత్మాన్వేషణ స్పష్టమవుతుంది.

తన తల్లిదండ్రులెలాంటి వారో ‘అమ్మా, నాన్న’ కవితలో చెప్తారు. అమ్మ మమతల మాత, సన్మంగళకరి, సదా శుభకరి అయితే, నాన్న సత్యం, శివం, సుందరమంటారు. తల్లిదండ్రులను అత్యున్నత స్థానంలో నిలిపిన కవిత ఇది.

ఆధునిక జనాల జీవన సారాన్ని కళ్ళకు కడుతుంది ‘మానవ నైజం’ కవిత. “నవయుగ జీవితం ఆస్వాదనారహిత ఆరాటాల సమాహారం” అంటారు కవి.

‘ఎన్నికలొచ్చాయి’, ‘చాలిక’ – కవితల్లో సమాజంలోని లోటుపాట్లని ప్రస్తావించి, వాటిని సరిదిద్దుకోవాలని సూచిస్తారు.

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ దుష్ప్రభావాలను ప్రదర్శిస్తూ, వాటినుంచి కొంతవరకైనా ఎలా తప్పించుకోవచ్చో ‘కృతిమ జగత్’ కవితలో చెప్పారు కవి.

~

ఈ కవితలలో కవి తన అంతరంగపు లోతులలోని ఆలోచనలనూ, భావాలనూ, ఉద్దేశాలను, బాధలను ప్రదర్శించారు. నిరాశావాదపు నైజాన్ని వీడి ఆశావాద దృక్పథాన్ని అలవర్చుకోమని చాలా కవితలు సూచిస్తాయి. లోతైన భావాలకు సరళమైన సొగసైన అక్షరరూపం ఈ కవితాసంపుటి.

“నచ్చితే మళ్ళీ మళ్ళీ చదవండి. నచ్చకపోతే, మీకు కిట్టనివాళ్ళతో కొనిపించి చదివించి ఆనందించండి” అని సరదాగా వ్యాఖ్యానించినా, ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే పైకం ధర్మకార్యాలకు వెళ్తుందని వివరించారు డా. కొవ్వలి గోపాలకృష్ణ.

***

మనస్వినీయం (కవిత్వం)
రచన: డా. కొవ్వలి గోపాలకృష్ణ
ప్రచురణ: గురజాడ ఫౌండేషన్ (అమెరికా, భారత్)
పేజీలు: 116
వెల: ₹ 200/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.

ఫోన్: 9000413413
~
డా. కొవ్వలి గోపాలకృష్ణ:
editor@prakasika.org
~

ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/manasweeneeyam?

Exit mobile version