[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘మానవతకు మరో రూపు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
చీకటి దుప్పటి తొలగించుకొని
లోకానికంతకు వెలుగులు పంచుతూ
సహస్రకిరణుడు తూర్పుదిక్కు చూస్తున్నాడు
జనమంతా ఉరుకులు పరుగులతో
ప్రవాహంలా సాగిపోతున్నారు
అందరూ కలిసే నడుస్తున్నారు
కానీ ఎవరికి వారే
ఎవరి దారి వారిదే
దారిపక్కనే పడి ఉన్న ముసలివాడిని
విశాల నయనాలతో వీక్షించారందరూ
మనకెందుకులే అని కొందరు
పోలీసులతోతంటా అని మరికొందరు
ఎందుకు వచ్చిన జంజాటమని ఇంకొందరు
అందరూ అతన్ని దాటి పోతున్నారు
ఒక్కరు కూడా శిరస్సు తిప్పరు
కన్నెత్తి చూడరు
ఒక్కరి మనసునుకూడా తాకలేదు
ఆ వృద్ధుని బాధ
వారందరూ మేధావులే
డాక్టర్లు లాయర్లు నీతిని
బోధించే ఉపాధ్యాయులు
జన సంక్షేమమే ధ్యేయమనే
రాజకీయ నాయకులు
కాని వారెవ్వరికి మనసు రాలేదు
అసలు మనుషులేనా వీళ్ళు
మానవతోలు కప్పుకున్న మరో జీవులా
కానీ
ఆ దారినే పోతున్న గోమాత
జాలి చూపులతో అతనిని చూసింది
చూసింది చూసింది లేవలేదు
పడిన ఆ మనిషిని లేపితే
తనకేమైనా పెడతాడేమోనని
కదలని
ఆ శరీరాన్ని కదిలించింది
అప్పటికే విగత జీవియైన
అతని శరీరం కదలలేదు
గోమాత ప్రయత్నాన్ని తిలకించిన
సహృదయులు కొందరపుడు
ఆ కళేబరాన్ని చూసి
అయ్యో! అన్నారు అందరు
పాపం అన్నారు ఇంకొందరు
రామ! రామ! అన్నారు మరి కొందరు
పశువులో దాగిన దయాగుణం
మనకు లేదేయని వగచారందరూ
మానవదేహం ముసుగేసుకున్న
మనుషులా మరెవ్వరు.
