[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘మంచీ – చెడూ!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“అమ్మ ఒక్కతి ఇండియాలో ఎందుకు! ఇక్కడ వరుణకి తోడుగా ఉంటుంది. టీనేజ్‌లో మంచీ-చెడూ చూసుకుంటుంది. గ్రీన్ కార్డుకి అప్లయి చేస్తాను. ఏమంటావ్ భార్గవ?” అంది భర్తతో వసుధ.
“ఏమో, అదంతా నువ్వే చూసుకో” అన్నాడు భార్గవ.
వెంటనే ఫోన్ చేసి గాయత్రిని అమెరికా రమ్మని టిక్కెట్టు బుక్ చేసింది.
వరుణతో చెప్పింది, “ఇక అమ్మమ్మ మనతోనే వుంటుంది. హ్యాపీనా?” అని.
“ఓకే..” అంది వరుణ, ఏదో మామూలు విషయమే అన్నట్టు.
గాయత్రి ఇండియాలో అన్ని సర్దుకుని, బంధువులకి ఇరుగుపొరుగువారికి “అమెరికా వెళ్లిపోతున్నా, మనవరాలు అడుగుతోంది వచ్చి ఉండమని” అని చెప్పి వచ్చేసింది.
కొద్ది రోజులు కబుర్లు, కథలు, పాటలు విహారాలు బాగానే గడిచిపోయింది వరుణతో.
ఇంటిపని, వంటపని చూసుకుంటున్న గాయత్రి నీడలో వసుధ-భార్గవ సంతోషంగా వున్నారు.
ఒకరోజు వరుణ ఆలస్యంగా ఇంటికివచ్చింది. పైగా ఎవరో అబ్బాయి దిగబెట్టివెళ్ళేడు.
వరుణ వచ్చేదాకా రాత్రి మేలుకుని వుంది గాయత్రి.
అందరి దగ్గిరా ఇంటి తాళాలు ఉంటాయి కనుక ఎవరికివాళ్లు వచ్చివెడుతూ వుంటారు.
గాయత్రి వాకింగ్‍కి వెళ్లినా లాక్ చేయక్కరలేదు. అక్కడే చుట్టూ పక్కల వాకింగ్ చేస్తుంది.
వరుణకి టీనేజ్. మంచీ-చెడూ చూస్తానని కదా నన్ను పిలిచారు అనుకుని గాయత్రి వరుణని నిలదీసింది.
“అదేమిటీ ఇంత లేటయింది? ఆ పిల్లాడు ఎవరు? తెల్లాడా నల్లవాడా, ఇండియన్నా..” అని గట్టిగా అడిగింది.
వరుణకి కోపమొచ్చి “నీకెందుకే అమ్మమ్మ! వాళ్ళు అందరూ నా ఫ్రెండ్స్” అంది.
“చూడమ్మాయి. ఇలాంటి స్నేహితులు వెంట తిరగడం బాగాలేదు. రేపటినుంచి త్వరగా వెళ్లి, త్వరగా ఇంటికిరావాలి అంతే! తెలిసిందా.” వార్నింగ్ ఇచ్చింది గాయత్రి.
వరుణ ‘ఇంతవరకు మాం డాడ్ ఎవరూ అడగలేదు. ఈ అమ్మమ్మ ఏమిటి న్యూసెన్స్?’ అనుకుంది.
ఇంకా కోపం వచ్చినా అర్ధరాత్రి గొడవ ఎందుకని, తన రూములోకివెళ్ళి విసురుగా తలుపు మూసుకుంది.
“పెద్ద చిన్నా లేదు నీకు? అడిగినదానికి జవాబు చెప్పకుండా వెడతావా! ఏదో గారం చేశాను ఇన్నాళ్లు. ఇప్పుడు నీకు వయసు పెరిగింది. అలా ఆడా-మగా తేడా లేకుండా స్నేహాలు కుదరవు. అమెరికాలో పుడితే వాళ్ళలా ఉండాలా? తప్పు” అంటూ వరుణ రూము తలుపు దగ్గిర చెప్పి వెళ్ళిపోయింది.
ఆ రోజుకి వరుణ ఊరుకుంది. ‘ఏదోలే ఓల్డ్ ప్యాషన్ ఇండియన్ గ్రాండ్మా. అక్కడ అందరూ ఇంతే. పోనీలే’ అని.
ఇక మరొక రోజు డైనింగ్ టేబుల్ దగ్గిర గొడవ వచ్చింది.
“ఇంట్లో వండిన వంట తినవేమీ వరుణ! రోజూ బయట ఫుడ్డే. చిన్నప్పుడు నా దగ్గిర, మీ నాయనమ్మ దగ్గిర చేరి ఏది పెట్టినా ఇష్టంగా తినలేదా?” అని గాయత్రి మందలించడం.. వరుణ కోపంతో టేబుల్ దగ్గిరనుంచి లేచిపోవడం చూసి వసుధకే తల్లిమీద కోపమొచ్చింది.
“అమ్మా! వరుణ చిన్నపిల్ల కాదు. ఒక వయసు దాటితే వాళ్ళ ఇష్టాలు మారుతాయి. అందులోను ఇక్కడికి ఇండియాకి తేడా వుంటుంది. నువ్వలా ప్రతీదానిలోను కలుగచేసుకోకు.” అని విసుక్కుంది.
“ఆడపిల్ల. మంచీ చెడూ చెప్పమని నన్ను పిలిచావు. అదే చెప్పేను. నీదాకా ఎందుకని ఊరుకున్నాను. మొన్న వారంక్రితం మగ పిల్లలతో కలిసి అర్ధరాత్రి ఇంటికి వచ్చింది.”
“వస్తే వచ్చిందిలే. మేము ఏమి అనం. ఇక్కడ అందరికి ఇది మామూలే. నువ్వు చదువుకున్నావు. జాబ్ చేసావ్. ఇక్కడికి చాలాసార్లు వచ్చావు. అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలు మాట వినరు. ఏమైనా అంటే ఇల్లువిడిచి వేరే వెళ్ళిపోతారు. మాకు ఒక్క డాటర్. దాన్ని వదిలి ఉండం. ఏమి అనవద్దు.” అని గాయత్రికి చెప్పింది.
వేసవికాలం వచ్చింది. వరుణ డ్రెస్ మారింది. పొట్టి దుస్తులు వేసుకుంటుంది. స్విమ్మింగ్‌క్ వెడుతుంది. అదీ అబ్బాయిలతో.
మళ్ళీ నోరు ఊరుకొని గాయత్రి మొదలుపెట్టింది.
“నువ్వు ఏమను వసుధ! ఆ పొట్టిబట్టలు నాకు అస్సలు నచ్చలేదు. అబ్బాయిలతో పూసుకుని తిరుగుతోంది. నువ్వేనా చెప్పవేమి. నీకు బాగుందా అలా చేయడం? మొన్న శనివారం నువ్వు అల్లుడు ఏదో పెళ్ళికి వెళ్ళేరు కదా.. దాని ఫ్రెండ్సట పదిమంది ఆడా-మగా వచ్చారు. ఇక చూసుకో చెవులు చిల్లులుపడే మ్యూజిక్, సాంగ్స్ డాన్సులు. గోల గోల చేసిపోయారు. నేను వెనక వీధిలో పంకజం గారింటికి వెళ్ళిపోయాను భరించలేక.”
తరచుగా గాయత్రి ఏదో ఒకటి వరుణమీద చెప్పడం వినలేక కూతురును ఏమి అనలేక సతమతం అయిపోయింది వసుధ.
‘అమ్మ ఇంకా పాతకాలం, తన రోజులు అనుకుంటోంది. ఇప్పటితరం ఇండియాలోకూడా ఇలానే వున్నారని అనుకోవడం లేదు. అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ వున్నంత మాత్రం తప్పు పట్టాలా! వాళ్లకి ఆ తేడా ఉండదు. కొంత వయసు దాటితే వాళ్ళే మారతారు. అందులో ఒక్కళ్ళే వుంటారు ఇంట్లో. మా తరం ముగ్గురు నలుగురం అన్నతమ్ములు అక్క చెల్లి అని ఉండేవాళ్ళం కనుక బయట వారితో ఇంతగా దగ్గిర అయేవాళ్ళం కాదు. అమ్మ ఎందుకిలా ఆలోచిస్తుంది? నేను అమ్మని పిలిచింది వరుణతో కలిసిపోతుందని, దాని భావాలు సంతోషాలు పంచుకుంటుందని. కానీ ఇక్కడ జరుగుతోంది వేరు. ఈవేళ వరుణని తప్పుపట్టింది. రేపు భార్గవ పార్టీలో డ్రింక్ ఇస్తాడని ఆడ-మగా స్నేహితులు నాన్వెజ్ తింటారని గొడవ చేస్తుంది. అమ్మని ఇండియా పంపించడమే బెటర్. ఇంకా నయం గ్రీన్ కార్డుకి అప్లై చేయలేదు. నాలుగు రోజులు ఓపికపట్టి పంపిస్తాను. ఈ కారణం చెప్పాలి? ఇక్కడే వుందుగాని. అని చెప్పెను. ఇప్పుడు ఇండియా వెళ్ళిపో అని చెప్పడం ఎలా? బాధపడుతుందేమో!’ అని వసుధ ఆలోచించింది.
ఒకరోజు బయటకు తీసికెళ్ళినపుడు అడిగింది..
“అమ్మా! నువ్వు కూడా కాలేజీలో చదివేవు. నీ క్లాస్‌మేట్స్ ఇంటికి రావడం, నువ్వు వాళ్ళ ఇంటికివెళ్ళడం, బ్రదర్స్‌తో మాటాడటం జరగలేదా! అప్పటి విశేషాలు చెప్పు” అంటూ.
“నేను వెళ్లడం నా ఫ్రెండ్స్ రావడం ఉండేది. ఐతే ఇంట్లో నాయనమ్మ తాతగారు తిట్టేవారు. అమ్మ-నాన్నలు కూడా ఆ పెత్తనాలు ఏమిటి? వాళ్ళింట్లో అబ్బాయీలు వున్నారా? అని అడిగేవారు. అబద్ధాలు చెప్పేదాన్ని. ఎవరూ లేరని. ఒకసారి అందరం కలిసి సినిమాకి వెళ్ళేము. వరుసగా ఒకే వీధిలో సినిమా థియేటర్లు ఉండేవి కాకినాడలో. మా నాన్నమ్మ, అత్తా పక్కనే వున్న థియేటర్‌కి వచ్చి నన్ను చూసారు. ఇంకా చూసుకో ఆ రోజు నుంచి నన్ను ఫ్రెండ్ ఇంటికి పొనీలేదు.” అంటూ ఆనాటి సంఘటన గుర్తు రెచ్చుకుని చెప్పింది.
“మరి ఇప్పుడు.. ఎలా వున్నారో చూస్తున్నావుగా. కాలం మారింది. అన్న పిల్లలు మన బాబాయి పిల్లలు అప్పటిలా వున్నారా లేరు కదమ్మా. అంటే పెద్దవాళ్ళు మారారు. వాళ్లకి ఆ మాత్రం ఫ్రీడమ్ ఇచ్చారు. అంతమాత్రం ఏమి నష్టం జరిగింది? వాళ్ళే ఎవరితో ఎలాంటి చనువు తీసుకోవాలో తెలుసుకునే విచక్షణ వస్తుంది. మనం కంట్రోలు చేయాలి అనుకుంటే వాళ్ళు మొండిగా తయారు అవుతారు. రేపు వరుణ పై చదువులకు హాస్టల్లో చేరుతుంది. అప్పుడు ఇల్లంతా బోసిపోతుంది.” అంది.
మళ్ళీ తనే మాట్లాడుతో, “అయ్యో వరుణ లేకపోతే తోచదు. ఇల్లు సర్దడం ఉండదు. వచ్చే వెళ్లే స్నేహితులు సందడి ఉండదు. మా ఇంటికి వచ్చే వాళ్ళు వరుణ స్నేహితుల తల్లి తండ్రులే కొందరు వున్నారు. ఆలోచించు. మనం కూడా మారాలి. నీకు ఇండియా బాగుంది. ఆ పద్ధతులే ఆనాటి కట్టుబాట్లు నచ్చుతాయి అంటే ఇక్కడ ఉండలేవు.” అంది వసుధ.
“నువ్వు చెప్పేది నిజమే. అప్పుడు – ఇప్పుడు తేడా వుంది. కానీ, మా తరంవాళ్ళం ఈనాటి అతి స్వేచ్ఛను అంగీకరించలేం. ఇండియాలో కొన్ని కుటుంబాలు మారలేవు. అంతే! నాకు నువ్వు ఒక్కదానివే కాదు. ఇద్దరు కొడుకులు వున్నారు. మరచిపోకు.” అంది ఉక్రోషంగా గాయత్రి.
“వున్నారు. నువ్వు నాతోనే ఏకీభవించకపోతే ఎక్కడినుంచో వచ్చిన కోడళ్లతో సరిపెట్టుకోగలవా? నీకు ఇప్పుడు పెద్ద వయసేమికాదు. ఒంటరిగా నీకు నచ్చినట్టే ఉండగలవు. నాన్నగారు కొన్న ఇల్లు వుంది. నీ పెన్షను వుంది. డబ్బు అవసరమూ లేదు” అంది వసుధ.
అర్థం చేసుకున్న గాయత్రి మౌనంగా వుండిపోయింది.
చిన్నకొడుకు కూతురికి పెళ్ళి కుదిరింది. “నువ్వు దగ్గిరుండి అన్నీచూడాలి. రా అమ్మా” అంటూ ఫోన్ చేసాడు.
‘సమస్య తీరింది. థాంక్స్ రా బ్రదర్’ అనుకుంది వసుధ.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్‌చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.
