Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మంచి మిత్రుడు కాకి

[బాలబాలికల కోసం ‘మంచి మిత్రుడు కాకి’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీ కొండూరి కాశీవిశ్వేశ్వర రావు.]

ది దట్టమైన అడవి ప్రాంతం. అక్కడ ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టు మీద రకరకాలైన పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తున్నాయి. అదే చెట్టుపై ఒక కాకి కూడా గూడు కట్టుకుని, ఇతర పక్షులతో హాయిగా జీవిస్తోంది.

ఆ కాకి ప్రతి రోజు ఉదయం ఐదుగంటలకే నిద్ర లేచి “కావ్! కావ్!” అని అరుస్తుంటే అక్కడున్న పక్షులు మరియు జంతువులూ కూడా నిద్ర మేల్కొంటాయి. అలాగే ఆ కాకికి ఒక మంచి అలవాటు కూడా ఉంది సుమా! కాకి ఉదయాన్నే లేచి చెట్టు క్రింద పడిన ఎండిపోయిన పుల్లలనూ, చెత్తా-చెదారమును కూడా శుభ్రం చేస్తూ ఉంటుంది.

అంతే కాకుండా ఇరుగుపొరుగున ఉన్న పక్షులకూ జంతువులకూ అంతో ఇంతో సహాయం చేస్తూ, ఒక మంచి మిత్రుడిగా పేరు తెచ్చుకుంది.

ఒక రోజు మేత కోసం ఆకాశంలో ఎగురుతూ ఉండగా ఒక పొదలో నుండి ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించింది. అసలే కాకిది జాలి, దయ గల స్వభావం కాబట్టి, ఏదైనా సహాయం చేద్దానుని ఆ పొద దగ్గరకు వెళ్లి చూసింది. అక్కడ ఒక లేడి పిల్ల, కాలికి గాయమై నొప్పితో బాధపడతూ, ఏడుస్తూ కన్పించింది. కానీ ఆ లేడిపిల్ల తల్లి మాత్రం అక్కడ లేదు. ‘ఓహో! తల్లి ఆహారం కోసం వెళ్లి వుండవచ్చును’ అని భావించిన కాకి తన స్నేహితులైన ఉడతలను, కోతులనూ పిలుచుకు వచ్చింది.

“స్నేహితుల్లారా! మన లేడిపిల్ల కాలికి గాయమయ్యింది.. దానికి మనం ఏదైనా వైద్యం చేయాలి” అని వివరంగా చెప్పింది కాకి. వెంటనే కొన్ని కోతులు ఔషధ గుణాలున్న ఆకులను తీసుకువచ్చి, వాటిని పసరుగా తయారుచేసి, లేడిపిల్ల యొక్క గాయమైన కాలికి కట్టు కట్టాయి. అలా కడుతూ ఉండగా బాధ భరించలేని లేడిపిల్ల మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది.

ఈ లోపల దగ్గరలోనున్న కొలను నుండి ఉడుతలు నీటిని తీసుకొచ్చి లేడిపిల్లతో త్రాగించాయి. అదే సమయానికి లేడిపిల్ల తల్లి కూడా అక్కడకు చేరుకుంది. క్రమంగా లేడిపిల్లకు నొప్పి తగ్గుతున్నది.

“ఓ కాకి మిత్రమా! నీకు కృతజ్ఞతలు. నీవు, నీ మిత్రబృందముతో కలసి నా బిడ్డకు వైద్యం చేసి, దానిని కాపాడావు”, అని అక్కడున్న కోతులకూ, ఉడుతలకు నమస్కరించింది లేడిపిల్ల తల్లి. అప్పటి నుండి కాకి మరియు లేడి కుటుంబం మంచి స్నేహితులయ్యారు.

అడవిలోని జంతువులన్నీ కాకి చేసిన మంచి పనిని మెచ్చుకున్నాయి. మాకు ‘మంచి మిత్రుడు’ దొరికాడని కాకిని అడవిలోని జంతువులన్నీ గౌరవించేవి.

ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనం కూడా సాధ్యమైనంత సహాయం చేయాలి. అలాగే ఇతర జంతువుల పట్ల కూడా దయాగుణం కల్గి ఉండి, సహాయం చేయాలి అనేది ఈ చిన్న కథ లోని నీతి.

Exit mobile version