[బాలబాలికల కోసం ‘మంచిగా చేస్తే మంచి పేరు’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]
వసంతపురంలో గంగాధరం ఓ మిఠాయి దుకాణం ప్రారంభించాడు. తొందరగానే అతని వ్యాపారం మూడులడ్లు ఆరు జిలేబీలుగా వృద్ధి చెందింది.
అతని వ్యాపారం చూసి దానయ్య అనే వ్యక్తి మిఠాయి దుకాణం గంగాధరం మిఠాయి దుకాణానికి కొద్ది దూరంలో ప్రారంభించాడు. ప్రారంభం రోజు గంగాధరం దానయ్య దుకాణానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపాడు.
ఆకర్షణీయంగా ఉండే ఎన్నెన్నో మిఠాయిల్ని తన అద్దాల బీరువాల్లో పెట్టాడు. వ్యాపారం బాగా సాగుతోంది.
కానీ నెల రోజుల్లో వ్యాపారం రోజు రోజుకు తగ్గిపోసాగింది! ఎందుకు తన వ్యాపారం తగ్గిపోతోందో తెలుసుకోలేక పోతున్నాడు. కానీ గంగాధరం దుకాణంలో వ్యాపారం బాగా జరుగుతోంది.
ఒక రోజు కాశయ్య అనే మిఠాయి ప్రేమికుడు దానయ్య దుకాణానికి వచ్చి, “ఏం దానయ్యా వ్యాపారం బాగుందా?” అని అడిగాడు.
“ఏం చెప్పమంటావు కాశయ్యా, ఈ మధ్య నా వ్యాపారం తగ్గిపోయింది. ఎందుకో అర్థం కావడం లేదు” చెప్పాడు దానయ్య.
“ఎందుకో తెలుసా? నీ దుకాణంలో మిఠాయిలు తిన్నవారికి ఆరోగ్యాలు చెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ గంగాధరం కొన్న చోటే మిఠాయిలు చేయడానికి సరుకులు కొంటున్నావా? ఎందుకంటే ఆయన దుకాణంలోని మిఠాయిలు తిన్నవారికి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయట!” చెప్పాడు కాశయ్య.
“లేదు పక్క ఊరిలో అతి తక్కువ ధరలకు సరుకులు అమ్మే రత్నం అంగడిలో కొంటున్నాను. ఎందుకంటే నాకు మంచి లాభం రావాలి కదా!”
“అదే నీవు చేస్తున్న పొరపాటు. రత్నం అన్నీ కల్తీ సరుకులు అమ్ముతాడని తెలుసుకో, లాభం కోసం కక్కుర్తి పడితే నీ మిఠాయిల వలన జనం ఆరోగ్యాలు పాడవుతాయి. మొదట్లో కొంత లాభం వచ్చినా నీ దుకాణం మీద నమ్మకం పోయి నీకు చెడ్డ పేరు, నష్టాలలో మునిగిపోతావు. అందుకే ఏ వ్యాపారం చేసినా ఏ పని చేసినా న్యాయంగా చేయాలి. మొదట్లో కొంత తక్కువ లాభం వచ్చినా క్రమేపీ వ్యాపారం పుంజుకుని లాభాలు వస్తాయి” చెప్పాడు కాశయ్య.
“నిజమే లాభాల కోసం అడ్డదారిలో కక్కుర్తి పడకూడదు. న్యాయంగా వ్యాపారం చేస్తే మంచి పేరు వస్తుంది మంచి లాభాలు వస్తాయి. ఇక మీదట మిఠాయిలు చేయడానికి సరుకులు మంచి దుకాణాల్లోనే కొంటాను” అని చెప్పి తాను మిఠాయిలు చేయడానికి ఉపయోగించే నాణ్యమైన సరుకుల వివరాలు కూడా వివరంగా వ్రాయించి దుకాణం ముందు పెట్టించాడు. క్రమేపీ అతని వ్యాపారం కూడా వృద్ధి పొందింది.
