[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘మంచు మనసు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

మంచులో వెన్నెల
మంచిగా నవ్వుతూ
తడిసిపొతూనే వేడినిస్తోంది
చెప్పకుండానే ఏదో చెబుతోంది
ప్రకృతికి సైతం చలి పుట్టిస్తోంది
పూలు సైతం మంచు బారిన పడి
సోలిపొతున్నాయి
దేనికోసమో ఎదురుచూస్తూ
వాలిపోతున్నాయి
చిరు చమటలు కూడా
హిమ బిండువులైపోతున్నాయి
విరహపు వదనాన
సిందూరాలైపొతున్నాయి
మంచుతో ముంచిన
మనసు చల్లగా ఉంది
మించిన ఆనందం ఇంతకంటే
వేరే లేదని అంటోంది
మంచులా కల్మషం లేని
హృదయంలా వికసించాలని
మంచి సందేశం ఇస్తోంది
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
