Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మందు లేని వ్యాధి

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘మందు లేని వ్యాధి’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

స్కూటర్ మీద వెళుతూ, అటూ ఇటూ దీర్ఘంగా చూస్తూ, ప్రతి గేటు వంక పరీక్షగా చూసి కొంచెం, కొంచెంగా ముందుకు వెళుతున్నాడు మధు. కానీ ఏ ఇంటి ముందు కూడా టూలెట్ బోర్డు కనిపించడం లేదు.

ఓసారి ఆకాశం వైపు చూసి, ‘దేవుడా, అద్దిల్లు కనిపిస్తే, నీ గుడికి వచ్చి దర్శనం చేసుకుని కొబ్బరికాయ్ కొడతాను స్వామి’ అని ఆ కాలనీలో ప్రతి సందునీ, గొందునీ తెగ తిరిగేస్తున్నాడు. అసలు కారణం ఏంటంటే, ఆ గల్లీలో ఇల్లు దొరికితే, అతని ఆఫీస్‌కి దగ్గరవుతుందని ఇలా తన కాలికి బలపం కట్టుకోవడం. ఈమధ్యే వేరే ఆఫీస్ బ్రాంచి నుంచి, ఈ ఏరియా ఆఫీస్‌కి మధుని ప్రమోషన్ మీద బదిలీ చేసి పారేశారు. సరే తప్పుతుందా అని, ఇలా కాళ్ళు కాయలు కాచేలా ఇల్లు వెతకడం మొదలుపెట్టాడు. వాళ్ళ అమ్మానాన్న ఊళ్ళో ఉంటున్నా, కేవలం ఉద్యోగం కోసం ఇక్కడ ఒక్కడే పట్టణంలో ఉంటున్నాడు. ఇది వరకు పని చేసే చోట నుంచి, ఇంకో చోటికి విసిరేశారు. అక్కడి నుంచి ఇక్కడికి ఓ నలభై  కిలోమీటర్ల దూరం. ఎందుకు రోజూ అప్ అండ్ డౌన్ చేసి ముప్పుతిప్పలు పడిపోవడం అని, దగ్గర్లో ఇల్లు చూసుకుందామని ఈ పాట్లు.

సరే అని ముందుకు వెళుతుండగా, ఎవరో పిలిచినట్టు అనిపించడంతో ఒక్కసారిగా బండి బ్రేక్ కొట్టి ఆపి, అటు ఇటు బుర్రని తిప్పి, తిప్పి చూసేశాడు. తర్వాత  అరుపు వెనకనుంచి వచ్చిందని తెలియడంతో, గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు. పిలిచింది ఎవరో కాదు, అతని స్నేహితుడు గిరి.

మధు వైపుకి పళ్లికిలిస్తూ నడిచి వచ్చి “ఏమిటిరా స్కూటర్ మీద అంత పరధ్యానంగా అటు ఇటు దిక్కులు చూసి ముందుకు వెళ్లిపోతున్నావు. నేను మధు, మధు అని వరద బాధితుడు సహాయం కోసం అరిచినట్టు ఆర్తనాదాలు చేస్తున్నా కనీసం ఇటు తెప్పి చూడలేదే” అడిగాడు.

“ఏమోరా, నాకు సరిగా వినిపించలేదు. నా ధ్యాస అంతా టూలెట్ బోర్డులు వెతకడం మీదే ఉంది” అన్నాడు నవ్వుతూ.

“అదేమిటి? నీకు ఇపుడు ఇల్లు అద్దెకి కావాలా” అడిగాడు గిరి.

“అవును కావాలిరా. ఈమధ్య వేరే బ్రాంచ్ నుంచి ఇక్కడికి దగ్గరలోని ఆఫీసు బ్రాంచ్‌కి వేశారు. ఆ బ్రాంచి నుండి ఇక్కడికి నలభై కిలోమీటర్లు ఉంటుంది. కప్పలా అటు ఇటు గెంతి, అప్ అండ్ డౌన్ చేయడం ఇష్టం లేక, ఇదిగో ఈ ఏరియాలో ఇల్లు దొరుకుతుందేమో అని చూస్తున్నాను” అన్నాడు మధు.

“అయితే నువ్వు లక్కీరా. నేను ఇప్పుడు ఉంటున్న పెంట్ హౌస్‌లో నా రూమ్మేట్ ఖాళీ చేసేసాడు. ఆ పెంట్ హౌస్‌లో ఇద్దరు వరకు ఉండొచ్చు. కాబట్టి నువ్వు వస్తే ఇద్దరం కలిసి ఉందాం. రెంట్ కూడా షేర్ చేసుకుందాం. రెంట్ కూడా తక్కువే” చెప్పాడు.

“ఆహా ఆహా, ఎంత మంచి మాట చెప్పావురా నాయనా, నీ మాటలు విన్నాక, నా రెండు చెవుల్లోనూ నాలుగు తేనె చుక్కలు పోసినట్టు హాయిగా ఉంది” అన్నాడు కాస్త తేలిక పడి నవ్వుతూ.

“విషయం పూర్తిగా వినకుండా, ముందుగానే అంత మాట అనేయకు. ఇందులో కూడా ఒక చిన్న మెలిక ఉంది.” అన్నాడు మొహం కాస్త ఇబ్బందిగా పెట్టి పైకి చూస్తూ.

“మెలికా, ఏమిటది? కొంపదీసి మీ ఇంట్లోకి వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలా” అడిగాడు ఆశ్చర్యంగా చూస్తూ

“అబ్బే, అలా అని కాదు. మా ఇంటి ఓనర్‌కి కులపిచ్చి ఎక్కువ. తన కులపు వాళ్ళకి మాత్రమే ఇల్లు అద్దెకి ఇస్తాడు.

నేనేం చేయాలో తెలియక, నేను వాడి కులమే అని  అబద్ధం చెప్పేసాను. దాంతో నన్ను హాయిగా ఉండనిస్తున్నాడు. మా రూమ్మేట్ వెళ్లిపోయాడన్నాను చూసావా, వాడిది కూడా వేరే కులం. కానీ  అబద్దం చెప్పి, మా ఓనర్‌ని, వాడి కులాన్ని పొగిడేసి, వాడి మీద పడి తెగ తినేసాడు. నేను కూడా. ఏం చేస్తాం తప్పడం లేదు. ఒక పక్క ఉద్యోగం, ఇంటికి ఎక్కువ డబ్బులు పంపించాలంటే ఇలాంటి కులగజ్జి గాళ్ళని జోకర్లని  చేయడమే మరి. అందుకనే వాడి కులపు హీరోని పొగిడేస్తాను. వాడి కులపు రాజకీయ నాయకులే గొప్పని నెత్తికెత్తుకుంటాను. దాంతో ఇన్ని నెలలుగా హాయిగా ఇంటికి, తిండికి లోటు లేకుండా గడిచిపోతోంది. నువ్వు కూడా వాడి కులం అనేసి అబద్ధం చెప్పి, మన కులం గొప్పది, మన కులానికి సాటి ఇంకో కులం లేదు అని నువ్వు కూడా హాయిగా నాతో రూమ్‌లో ఉండొచ్చు. ఏవంటావ్” అడిగాడు.

 “అబద్ధమా, వింటేనే అదోలా ఉంది. అబద్దాలు చెప్తే ఎలా. పైగా కులం తప్పు చెప్పమంటున్నావ్. అయినా ఈ ఏ.ఐ. రోజుల్లో కూడా ఇంకా కులపిచ్చి ఏంటిరా బాబు. అయినా ఈ కులపిచ్చిగాళ్ళందరూ ఎలా తయారవుతారు? వాళ్ల పెంపకలోపమా, లేదంటే వీళ్ళంతట వీళ్ళే  అలా తయారవుతారా. లేదా బలహీన మనస్తత్వం అంటావా. అంటే, ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ వల్ల వీళ్లు మన వాళ్ళు అని, వాళ్ళ బలగాన్నే బలంగా ఫీలవుతారు. కాబట్టి  కులాన్ని అడ్డుపెట్టుకుంటారా. నాకేమీ అర్థం కాదురా. ఈ కుల పిచ్చి ఈ కాలంలో కూడా ఎందుకు? నా బొంద” విసుగ్గా అన్నాడు

 “అబ్బబ్బా మధు, అవన్నీ మనకెందుకురా. నువ్వు ఆ ఒక్క అబద్ధం ఆడతావా ఆడలేవా” సూటిగా అడిగాడు గిరి.

“సరే చస్తానా, అబద్ధం ఆడతాను, మన కులం గొప్పది, జై మన కులం” అన్నాడు కాస్త ఇబ్బందిగా.

“పర్వాలేదులేరా.  నువ్వు ఈ అబద్ధం గురించి ఓ బాధపడిపోకు. మందు లేని ఈ కుల పిచ్చి వ్యాధితో బాధపడేవాళ్ళకి,  మనలాంటి వాళ్లే మందు”  అని గిరి చెప్పడంతో,

“సరే అయితే పద” అన్నాడు మధు ఉత్సాహంగా.

Exit mobile version