[శ్రీ సముద్రాల హరికృష్ణ గారి ‘మంగళకైశికి!’ అనే రచనని అందిస్తున్నాము.]
Image By Author
చమురు తాకిన తోలు చొక్కా, శంఖ చక్ర ఆకారాలతో చెవులకు ఇత్తడి పోగులు, మొగలి ఆకు గొడుగు, సొరకాయ బుర్ర తో చిన్న ఏకతార, చిరు తాళాలు, తులసి పేర్లు, తిరునామాలు — ఇదీ ఆ దాసరి అవతారం!
ఆది దేవుని కొలిచిన అంత్యజుడు, మాల దాసరి!
మనిషి మాసినట్టున్నా, గుణం మాత్రం రత్నమే!
మసి బట్టలో కట్టిన మాణిక్యమనే చెప్పాలి అతనిని!
ప్రతి రోజూ వేకువ జామున బయలుదేరి దగ్గరలోని విష్ణ్వాలయం బయట నిలబడి తన చిట్టి వీణ మీటుతూ శ్రీహరిని కీర్తించడం, నామభజన చేయటం అతనికి అలవాటు.
ఆనంద పరవశంతో ఒక్కొక్కప్పుడు నృత్యం లాంటిది చేస్తూ పాటకు తగ్గ అడుగులు వేయడం కూడా ఉన్నది. వైకుంఠనాథుడైన శ్రీహరే సర్వరక్షకుడని అతని ప్రగాఢ విశ్వాసం!
ఎండెక్కే సమయం వరకు ఈ గాన కైంకర్యం చేసి, ఊరికి దూరంగా ఉన్న తన గుడిసెకు మరలేవాడు!
గర్భాలయం కడిగినప్పుడు పారే నీళ్ళు బయట తొట్టె నుంచి జారితే, వాటిని ఇంకొక భక్తుడి ద్వారా తీర్ధంగా తీసుకునేవాడు!
ఎవరైనా దయ తలచి ఇచ్చిన ప్రసాదాన్ని, నా దైవమే పంపించాడు నా కోసం అన్నట్టు భక్తిగా కళ్ళ కద్దుకొని ఆరగించేవాడు!
***
ఒకనాడు రాత్రి పూట ఒక పిల్లి ఆ దాసరి గుడిసెలో దూరింది సద్దులేకుండానే. అయినా అది చూసి, అక్కడున్న కోళ్ళు భయంతో అరిచినై!
ఆ కోడికూత విని, తెల్లవారిందేమో అని తన తంబూర మొదలైనవి తీసుకుని, గుడికి బయలుదేరాడు, దాసరి.
అంతా చీకటి.
నిద్రమత్తులో ఉన్నాడు, పైగా మర్లు తీగె తొక్కినట్టున్నాడు!
అటూ ఇటూ తిరిగి, దారి తప్పి, అటవీ ప్రాంతంలో, ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండే మర్రి చెట్టు దగ్గరకు చేరాడు. దాని కొమ్మలు ఆమడ దూరం వ్యాపించి ఉన్నాయి. ఆ ప్రదేశం అంతా కంకాళాలు, పుర్రెలతో భయంకరంగా ఉంది.
దాసరి నిజం గ్రహించే లోపలే, నడకొండ లాంటి రాక్షసుడు ఎర్రటి కళ్ళతో చూస్తూ, తన వైపే రావటం గ్రహించాడు.
ప్రేవుల మాలలు, చేతిలో కపాలంతో, కుండల్లాంటి మోకాళ్ళతో ఉన్నాడు, సార్ధకమైన ‘కుంభజానువు’ అనే పేరుగల ఆ రాక్షసుడు!
మొదట్లో భయపడినా, తమాయించుకున్నాడు దాసరి.
కుస్తీ పట్లతో కొంత ప్రతిమటించినా, ఆ భయంకర బలుడైన రాక్షసుడి ముందు నిలువ లేక పోయాడు.
రాక్షసుడు రెచ్చిపోయి, “నిన్ను చిత్రహింసలు పెట్టి చంపి మింగేస్తాను”, అని బెదిరిస్తుంటే, ధైర్యం కూడగట్టుకొని ఇట్లా అన్నాడు:
“రాక్షస రాజా! నేనేమిటి నీతో పోరుకు సిధ్ధమవటమేమిటి, అవివేకం! ప్రాణ రక్షణ ప్రయత్నం చేయకుండా ఉండటం దోషం కాబట్టి కొంత నీకు ప్రయాస కల్గించాను, అంతకు మించి ఏ అపోహలూ లేవు నాకు.
నేను నీకు ఆకులో ఉన్న అన్నం లాంటి వాడినే కదా, ఇప్పటి పరిస్థితిలో! కానీ నీవేమైనా పులి లాంటి క్రూరజంతువువా,.. కాదేఁ!? విచక్షణా, వివేకం ఉన్నవాడివి కదా, అందుకని ఈ తుచ్ఛ ఆహారం కోసం ఆశ పడవు అనుకుంటున్నాను. ఒక వేళ కాదు నేను నీకు ఆహారం కావాల్సిందే అంటే, నేను సిద్ధమే! చావు అనేది ఇవాళో రేపో ఎటూ తప్పదు. కనుక ఇవాళే పోయినా ఏమీ దుఃఖించేది లేదు దీంట్లో! పైగా నీలాంటి వాడి ఆకలి తీర్చి, పోవటానికి – నాకెట్టి అభ్యంతరమూ లేదు. నాకు ఈ పరోపకారం, ముక్తి కారణం కూడా కాగలదు. కాకపోతే నాదొక చిన్న విన్నపం.
నాకు ఇక్కడికి దగ్గరలోని తిరుక్కురంగడి విష్ణు దేవాలయం దర్శించి గానకైంకర్యం చేసే వ్రత మొకటి ఉన్నది చాలా ఏళ్ళ నుంచి. నువ్వు కాస్త అనుమతి ఇస్తే, నేను వెళ్ళి నా స్వామిని దర్శించి, ఆ పని పూర్తి చేసుకుని తిరిగివస్తాను. నీకు ఆనందంగా ఆహారం అయిపోతాను అప్పుడు! నా విన్నపం మన్నించవలసినది”, అన్నాడు.
దానికి రాక్షసుడు కహకహా నవ్వి, “ఓరి బుడతా నాకు చదువు చెప్తావురా, నేను చదవని శాస్త్ర మేమున్నదిరా.?! నా పద్ధతి సరియైనదే, ఇది మాకు విహితాహారమే కూడా. మా పూర్వీకులు చేసిందీ ఇదే పని. జాత్యన్నము అమృత సమానంరా, అవివేకీ! నీ టక్కులు నా దగ్గర చెల్లవు, నిన్ను ఈ క్షణమే భక్షించేస్తాను”, అన్నాడు.
దాసరి బతిమాలుతూ, “నువ్వు, నేను మళ్ళీ వచ్చి నీకు ఆహారమవుతానంటే నమ్మటల్లేదు కదా, నేను రాకపోతే, ‘ఇతర దేవతలు మా శ్రీహరితో సమానము’, అనేవాడు పోయే నరకానికి పోతాను!” శపథం చేసినట్టు అన్నాడు దాసరి ఆవేశంగా!
ఆ శపథ వాక్యం వినగానే, రాక్షసుడికి నమ్మకం ఏర్పడ్డది, దాసరిని గుడికి వెళ్ళి రావటానికి ఒప్పుకున్నాడు.
దాసరి కూడా చెప్పినట్టే శ్రీహరి గుడికి వెళ్ళి, ఆనందంగా తన ఇష్టదైవం గుణగానం చేసి, అన్న మాట చొప్పున రాక్షసుడి దగ్గరకు వచ్చి ఎదుట నిలుచున్నాడు.
“రాక్షస రాజా, నీ ఔదార్యం మరువలేను. నా శ్రీహరిని ఈ కాయం వదిలే ముందు ప్రార్థించే అవకాశం ఇచ్చావు, ఇంక నేను నీ అధీనుడను, అన్ని అవయవాలతో సహా! వెళ్ళిన వాడిని వెళ్ళినట్లే తిరిగి వచ్చాను, నీ సముఖానికి! ఇక నీ ఇష్టం” అన్నాడు .
దానికి ఆ బ్రహ్మరక్కసి ఆశ్చర్యపోతూ, దాసరి కాళ్ళమీద పడి, “అయ్యా మహానుభావా, దేవతలు, రాజులు, మానవులు ఎవ్వరైనా ఏ విషయంలోనైనా మాట నిలబెట్టుకుంటారేమో కానీ, ప్రాణం విషయానికి వస్తే జారిపోతారు! ప్రాణాపాయం అని తెలిసీ నువ్వు మళ్ళీ వచ్చి ఈ విధంగా లొంగిపోవడం అపూర్వం! నా తప్పిదాన్ని మన్నించాలి మీరు”, అని బ్రతిమాలాడు.
దానికి దాసరి, “నాకర్థం కావట్లేదు, రాక్షసా, నీ కాహారంగా అవటానికి నేను ఎదురుగా ఉంటే ఈ తాత్సారం ఏమిటి!? ఎంత ఆలశ్యం అయింది ఇప్పటికే, ఆకలి దహించి వేస్తుండాలి నీకు, ముందు నీ పని కానివ్వు” అన్నాడు.
దానికి రాక్షసుడు, “నాకు, ఆకలి కాదు భాగవతోత్తమా తీరవలసినది, ఈ శాపజన్మమే. ఆకతాయినై మునులను బాధించి ఈ వికృతజన్మం, రూపం తెచ్చుకున్నాను, అజ్ఞానినై! నీవు శ్రీహరి సమక్షాన పాడిన గాన ఫలం నాకు ధారపోస్తే, నా పాపం పటాపంచలౌతుంది, నాకీ రాక్షసజన్మ అనే నరకం తప్పుతుంది, నన్ననుగ్రహించు” అన్నాడు.
దానికి దాసరి ఆశ్చర్యపడి, “ఇదేమి కోరికయ్యా నా శ్రీహరికి అంకితం చేసినదాని ఫలం ఇవ్వడానికి నేనెవరను?! అసలు అది ఇచ్చేదే కాదు, ఆ వైకుంఠనాథునికి తప్ప అన్యులకు ఇచ్చే ఆలోచనే చాలా విడ్డూరంగా ఉన్నది”, అన్నాడు.
“ఎన్ని జన్మలో రావచ్చు కానీ విష్ణువును ఆరాధించే బుద్ధి గల జన్మ మళ్ళీ రావటం దుర్లభం. కనుక ఆ ఫలం పూర్తిగా కాదు, సగమూ, పావు కాదు కదా, వీసమెత్తు కూడా ఇవ్వజాలను. కర్పూరం లాంటి పుణ్యం అమ్ముకుని ఉప్పు లాంటి ఈ శరీరం మిగుల్ఛుకుంటానని భ్రమ పడుతున్నట్టున్నావు – రాక్షసా! అది అసంభవం” అన్నాడు నిశ్చయాత్మకంగా!
దానికి రాక్షసుడు కన్నీరు పెట్టుకుంటూ, “భక్తుడవైన నీకు ఇంత నిర్దయ న్యాయమా, నన్ను కాపాడగలిగేది నీ వంటి భాగవతుని ఆశీర్వాదమే, నీ శరీరము కాదు! అందుకే ఇంత ప్రాధేయ పడుతున్నాను, కనీసం ఈనాడు ఆలపించిన ఒక్క గీత ఫలాన్ని నాకు ధారపోసినా నేను గట్టెక్కుతాను, ఈ బ్రహ్మరక్షస జన్మ అనే చెర తప్పుతుంది నాకు” అన్నాడు.
దాసరికి జాలి కలిగి, “సరే ఇవ్వాలన్నా నాకు ఆ ఫలం ఏ రూపంలో, ఎట్లా ఉంటుందో తెలియదు. ఎట్లా ధారపోయాలో అసలే తెలియదు. హరిసేవా ఫలం ఇంత ఉంటుంది అని కొలత ఏమున్నది, ఇంత నీవు తీసుకో అనకలగటానికి. నీ పశ్చాత్తప్త అంతరంగం ఎరిగి, నిన్ను ఆ శ్రీహరే తప్పక కాపాడుతాడు. ధైర్యంగా ఉండు”, అన్నాడు.
అన్న మరుక్షణమే, ఆ పరమ భాగవతుని నోటి మాట ఫలితంగా, రాక్షసుడి రూపం పోయి, శుద్ధ శ్రోత్రియమైన, అతని అసలు స్వరూపమైన సోమశర్మ అవతారంలో నిండు తేజస్సుతో వెలిగిపోతూ,నించున్నాడు దాసరి ఎదురుగా!
దాసరికి ప్రదక్షిణ చేసి, నమస్కరించి, “మహాభాగా! నీ దయ వల్ల ముక్తుడనైనాను, ఇక నాకు ఈ లౌకిక జీవనం పట్ల రుచి లేదు. నేను భగవత్సేవలో తరిస్తాను, తమరే నా ఆదర్శం. ముందుగా తీర్థయాత్రలకు బయలుదేరుతాను, సెలవిప్పించగలరు” అని చెప్పి వెళ్ళిపోయాడు.
***
ఆ దాసరి యథా పూర్వం జగన్మంగళాకారుడైన శ్రీహరి గుణగానం, శ్రావ్యమైన మంగళకైశికీ రాగంలో ప్రతి దినమూ తన శేష జీవితంలో చేసి, కాలక్రమాన శ్రీహరిలో ఐక్యమై పోయాడు.
***
పరమ భాగవత స్థానీయుడైన ఆ మాలదాసరి హరి కీర్తనము, ఆ శుభంకర మంగళకైశికీ రాగమూ అందరినీ దీవించు గాక!
ఓం నమో నారాయణాయ!

