[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో పౌరాణిక కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘మణిద్వీపవాసిని! మహిషాసురమర్దిని!!’. రచన పాణ్యం దత్తశర్మ.]
దానవ వంశమునకు మూలపురుషుడైన ‘దనువు’ రాజ్యమది. ఆయనకు ఇద్దరు కుమారులు. రంభుడు, కరంభుడు. ఒకనాడు రాజసౌధంలో, ఏకాంత మందిరంలో దనువు తన కుమారులను సమావేశపరచి ఇట్లా చెప్పాడు.
“నాయనలారా! నా సుకృతం వలన మీరిరువురూ నాకు కుమరులుగా జన్మించినారు. మీకు అనుకూలవతులైన కన్నెలను, సుశీలలను, సర్వ శుభలక్షణ శోభితలను తెచ్చి వివాహము చేసినాము. కాని ఏండ్లు గడుచుచున్నవి. కోడండ్ల కడుపు పండుట లేదు. మీతోనే మన దానవ వంశం ఆగిపోతుందేమోనని భయమగుచున్నది. మీరు సత్సంతానమును పొంది మన వంశమును సుసంపన్నము గావింపవలయును.”
అప్పుడు రంభాసురుడు ఇట్లా అన్నాడు – “పితృదేవా! నేను అగ్నిదేవుని గూర్చి ఘోర తపమొనరించి, ఆయనచే వరము పొంది, మీకు పితామహా పదమును సంపాదించెదను.”
తమ్ముడు కరంభుడు, “తండ్రీ! నేను కూడా అగ్రజుని వలె తపస్సు చేసి, సంతాన వరమును పొందెదను. నన్ను దీవింపుడు” అన్నాడు.
అప్పుడు దనువు ఎంతో సంతోషించి కుమారులను దీవించి, పంపినాడు.
రంభాసురుడు మహోగ్ర కాననమును ప్రవేశించినాడు. అచట వృక్షములు అంబరమును చుంబించుచున్నవి. సెలయేరులు ప్రవహించుచున్నవి. క్రూరమృగములు యథేచ్ఛగా సంచరించుచున్నవి. ఒక తటాకము ఒడ్డున, సహజముగా ఏర్పడిన ఒక శిలా వితర్దిక గలదు.
‘ఇదియే నా తపస్సునకు సరియైన ప్రదేశము!’ అని తలచినాడు రంభాసురుడు. మొదట కేవలము జలమును ఆహారముగా స్వీకరించుచూ అగ్నిదేవుని గురించి తపము చేయసాగినాడు. తన భూషణములన్నింటిని విసర్జించి, తాపసి వేషము దాల్చినాడు. శాంతమే అతని ఆభరణమైనది. ఘనజటా వల్కలాజిన విలక్షణుడైనాడు రంభాసురుడు. మనస్సునందు అగ్నిదేవుని నిలిపి, అగ్ని మంత్రమును జపింపసాగినాడు.
‘ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిమధ్యాయ
ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్’
ఆ మంత్రము లోని బీజాక్షరాల తరంగాలు అరణ్యమంతా వ్యాపించాయి. పంచాగ్ని మధ్యలో, మునివేలిపై మేను నిలిపి, మంత్రాన్ని జపిస్తున్నాడు. సూర్యునిపై తన దృష్టిని కేంద్రీకరించాడు. వడిగా వేడిగాలులు వీస్తున్నా, శరీరం మీద నిప్పురవ్వలు పడుతున్నా రంభుడు చలించుట లేదు. నిశ్చలమైన ధ్యాన యోగంలో లీనమైనాడు. ఆకాశము నుండి ఉరుతరములైన ఉల్కలు అతని మీద పడుతున్నాయి. దేహాభిమానాన్ని పూర్తిగా త్యజించినాడా దైత్యుడు. వర్షము అతని మేనిపై పడి, దాని తాపమున ఇంకిపోయింది.
తర్వాత స్థిరమైన పద్మాసనమున కూర్చొండి తపమును కొనసాగించినాడు. పక్కన ఉన్న తటాకము లోని కలువలు పూర్తిగా వికసించి ‘అసురుని తపస్సును అమితమైన శ్రద్ధతో చూచుచున్నవేమో’ అనిపించినవి. తర్వాత గాలిని, తేలికమైన తూండ్లను ఆహారంగా తీసుకుంటూ తపమును కొనసాగించినాడు.
ఏండ్లు గడచినవి. దేహం చుట్టూ పుట్టలు ఏర్పడి, వానిలో ఉరగములు చేరినవి. శరీరమంతా ఎముకలు తేలినవి. ఐననూ, తన పూనిక తప్పక, ఇడుములను లెక్కచేయక, నిష్ఠతో నిలిచినాడు.
చిత్తశుద్ధితో, నిశ్చల నిరీహుడై రంభుడు చేసిన తపము హుతాశనునికి సంతసము కలిగించినది. అగ్నిదేవుడు అతని మ్రోల ప్రత్యక్షమైనాడు. ఆయన మేషవాహనుడు. ఆయన శిరముపై సప్తజిహ్వలు ప్రకాశిస్తున్నాయి. ఆయన ముఖము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. ఆయన ప్రసన్నుడై,
“రంభాసురా! లెమ్ము! నీ తపమునిక చాలించుము. నీ తపము నా మనమును చూరగొన్నది. ఓ ధీరమనస్కా! నీ ఘనత, అంకితభావము చూసి అచ్చెరువగు చున్నది. నీ దేహమును అడవి లోని కీటకములు తినివేసినను, చెదరక, కేవలము నీ శల్యములలో నీ జీవశక్తిని నిలుపుకున్నాము. నిశ్చలమైన యోగనిరతిని ప్రదర్శించినావు. ఆత్మధృతిలో, కిల్బిష మోహములను పరిహరించినావు నిన్ను అనుగ్రహించుటకు వచ్చితిని. చూడుము!” అని పలికినాడు.
రంభాసురుడు కనులు తెరిచి చూచినాడు, ఒక పరమాద్భుత తేజోమండలము కట్టెదుట! దాని మధ్య అగ్నిదేవుడు. రంభుడు గద్గద స్వరముతో, అగ్నిదేవుని మ్రోల సాష్టాంగపడినాడు. ఆయనను ఇట్లు స్తోత్రము చేసినాడు –
“పింగాక్ష! లోహితగ్రీవ! కృష్ణవర్ణ! హుతాశన!
త్రాహిమాం సర్వదోషేభ్యం సంసారా దుద్ధరేహమాం
తండ్రీ! హుతవహా! నా మీద కరుణ చూపి ఏతెంచినావా? నా జన్మ ధన్యమైనది. జగదాధారా! సర్వతాపహరా! నమోనమః”
“నాయనా, నీ కామితార్థమేదియో చెప్పుము. దానిని ఒసంగెదను”
“సప్తజిహ్వ! తమకు తెలియని దేమున్నది! మా వంశము సంతు లేక నిర్వంశమగునను భయము మమ్ము పీడించు చున్నది. నాకు సంతానమును ప్రసాదించు యజ్ఞేశా!”
అగ్నిదేవుడు చిరునవ్వు నవ్వినాడు. “తథాస్తు!” అని దీవించి అంతర్హితుడైనాడు. అప్పుడు, ఆయన అనుగ్రహముతో, శిథిలమైన రంభుని దేహము పుష్టిగా, పూర్ణమై తోచింది. పుటముల నుండి తీసిన హేమము వలె ప్రకాశించినాడా దైత్యుడు.
***
రంభుడు తన నగరమునకు తిరుగు ప్రయాణం అయినాడు. అతని ఎదలో కోరికలు కదం తొక్కుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఇల్లు చేరి తన భార్యను సంగమింతునా యని తహతహలాడుచున్నాడు! కామము ఎంత బలీయమైనది! అది ఉచితానుచితములను చూడదు. దారిలో రంభునికి ఒక మహిషి ఎదురువచ్చింది. అది ఎదకు వచ్చియున్నది. తనతో జతగూడు మహిషము కొరకు వెదకుచున్నది. రంభుడు దానిని చూచినాడు. కామోద్రేకము అతనిని వివేకహీనుని చేసినది.
ఆ మహిషితో ఆ దైత్యుడు సంగమించినాడు! మహిషీ సంపర్కంతో అతని మనస్సు వశము తప్పినది. దాని తోనే నివసించుట ప్రారంభించినాడు
కొంత కాలము తర్వాత మహిషి, రంభుని వీర్యము ధరించి, గర్భవతి అయినది. రంభతో దాని పట్ల అనురాగం పెంచుకున్నాడు. కాని, ఒక మహా మహిషం, తన జాతి మహిషి ఒక అన్య జాతివానితో కలసి ఉండుట సహించలేకపోయింది. రంభునిపై దాడి చేసింది. రంభుడు ఆ మహిషముతో భీకరయుద్ధము చేసినాడు. పశు సంగమం వల్ల అతని శక్తి క్షీణించి, అతడు ఆ మహిషము చేత నిహతుడైనాడు.
అప్పుడు ఆ మహిషం, చూలుతోనున్న ఆ మహిషిని బలవంతంగా సంగమించడానికి ప్రయత్నించింది. కొందరు యక్షులు అది చూసి, ఆ మహిషిని కాపాడినారు. మహిషి, మనసా వాచా, కర్మణా రంభాసురుని తన భర్తగా భావించి యున్నది. అందుకే సతీసహగమనము చేసినది. ఆ చితిమంటలలో నుంచి ఉద్భవించినవాడే మహిషాసురుడు!
***
మహాపతివ్రతయైన తన తల్లి, మహిషి ఆశీస్సు లతో మహిషాసురుడు అత్యంత శక్తి సంపన్నుడైనాడు. జగద్విజేత యైనాడు. కాని అతడు తన అమేయ బలపరాక్రమములను లోక పీడనమునకై ఉపయోగించసాగినాడు. సకల జగములు అతనికి పాదాక్రాంతములైనవి. ఐనా అతనికి తృప్తి కలుగలేదు. మరణమే లేకుండా, చిరకాలము భువనములను శాసించవలెనని అత్యాశ పడినాడు. దానిని సాధించుట ఎట్లు? తపస్సు మాత్రమే దానిని సంక్రమింప చేయునని నిర్ణయించుకొన్నాడు. పరమేష్టి యైన బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయవలె. అతని అలోచన ఇట్లా సాగింది.
కం॥
తపమే యింద్రపదంబును
తపమే ఘనీభోగవిభవ ధారణమును, తా
దపమే సాధన మంతకు
తపమును యొనరింతు ధాత తన కృప జూపన్
తన తండ్రి రంభాసురుడు అగ్నిదేవుని మెప్పించుటకు చేసిన ఘోరతపమునకు మిన్నగా మహిషాసురుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయసాగినాడు. వారిధులు ఘూర్ణిల్లినవి. దిగ్గజములు గతులు తప్పినవి. పర్వతములు కదలినవి. అంతట హిరణ్యగర్భుడు మహిషాసురుని తపమునకు ప్రీతుడై, ఆతనిని అనుగ్రహింప, హంసవాహనుడై అరుదెంచెను. ఆయనను చూచి ఆ దైత్యుడు భక్తి పరవశుడై, గద్గద స్వరముతో బ్రహ్మదేవుని యిట్లు స్తోత్రము చేసెను.
“జగద్విధాతా! ధాతా! పాహి ! పాహి! సకలసృష్టిని యొనరించు శాశ్వతుడవు నీవు. పరమాత్ముడైన నారాయణునికి అనుంగు కుమారునివి. సరస్వతివదన పంకజ భాస్కరునివి. నుదుటి వ్రాతల లిఖియించి, సర్వజీవుల భవిష్యత్తును నిర్ణయించు పరమ బ్రహ్మవు. నాలుగు ముఖములతో ప్రకాశించు నలువవు, సర్వధర్మంబులకు నీవే శరణమవు. దేవా! నీవే కదా సకల వేదోపనిషత్సార భూతుడవు. నారదమహర్షికి నాన్నవు – నన్ను కరుణించు. నశ్వర ప్రభావా! శరణు!”
మహిషాసురుని స్తుతివచనములకు కడుంగడు సంతసించిన వాడై, చతుర్ముఖుడు ఇట్లు పలికినాడు – “అసురోత్తమా! భావి, వర్తమాన, గతములతో, నీవంటి తాపసిని చూడలేదు. నీ నిశ్చల యోగనిష్ఠ అనన్యము. నీ యభీష్టమేదియో కోరుకోనుము. ఇచ్చెదను.”
అప్పుడా దైత్యుడు – “లోక కారకా! నీకు తెలియనిదేమున్నది? స్థూల, సూక్ష్మ శరీరములను, ఇహమును, పరమును, ఇంద్రియములను గుణములను పాలించునది నీవే కదా తండ్రీ! నాకు సమస్త లోకములను, ఇంద్రాది దేవతలను జయించు శక్తి నొసంగుము. నన్ను ఎవరైనను సంగరములో గెలువకూడదు. నాకు మరణము ఉండకూడదు. నాకు చావన్నదేలేని యఖండ దివ్యవరమును ప్రసాదించి అనుగ్రహింపుము.”
దైత్యుని మాటలు విని, విధాత ముఖమున మందస్మితము మెరసినది. ఇటుల సెలవిచ్చినాడు.
“ఓరీ! మీ దైత్యులందరకు ఇదేమి విచిత్ర దృక్పథమురా? అనాది నుండి మీ వారందరు మరణ రాహిత్యమునే అభిలషించుచున్నారేమి? అది అసాధ్యమని నీకు తెలియదా? నీవును యెఱుక గలవానివే గదా! వినుము.
‘ఉత్పన్నస్య ధృవం మృత్యుః ధృవం జన్మమృతస్యచ
సర్వధామరణోత్పత్తి సర్వేషాం ప్రాణినాంకిల!’
కావున ఏదైన అన్య వరము కోరుకొనుము.”
“అయినచో తండ్రీ ! నాకు శాంబరీ విద్యను ప్రసాదింపుము. యుద్ధములో నా శరీరము నుండి చిందిన ప్రతి రక్త బిందువు నుండి నా వైన అనేక రూపములు ఉద్భవించునట్లు అనుగ్రహింపుము. నేను అప్రతిద్వంద్వౌడను కావలె. సర్వజీవులపై నాకే ఏకాధిపత్యముండవలె. అణిమాది సిద్ధులు అన్నియు నా వశము గావలె. పురుషులు ఏ జాతివారైనను, వారి చేతిలో నేను వధింపబడనట్లు వరము నొసంగుము పరమేష్టీ! ఏలయన, అబలలైన స్త్రీలు నన్ను చంపుట పరిహాసాస్పదము, మరియు అసంగతము.”
బ్రహ్మదేవుని వదనమున ఒక దరహాసవీచిక! ‘దైత్యులందరి వలె వీడును తన చావును ఎలా వుండతగునో నిర్ణయించుకొనుచున్నాడు!’ అనునది ఆ దరహాసమునకు అర్థము.
“మంచిది. నీవడిగిన యభీష్టము నిదిగో ప్రసాదించుచున్నాను. కానీ, వరగర్వమున, లోకములను చీకాకు పరుచక, విశ్వకల్యాణముకై ఈ వరములనుపయోగించి, ధన్యుడవు కమ్ము!” అని నలువ యానతిచ్చి అంతర్హితుడయ్యెను. ‘నా ఈ హితవచనములను ఇంతదనుక ఏ దైత్యుడూ వినలేదు. బుద్ధి కర్మానుసారిణి!’ అనుకొన్నాడు సృష్టికర్త.
***
బ్రహ్మదేవుని కృపతో శాంబరీ విద్యను సాధన చేసినాడు మహిష దైత్యుడు. విశేష శక్తులు సంపాదించినాడు.
“చకారాశు తదా దైత్యా మాయాం మోహ కరీం కిల
శాంబరీం సర్వలోకఘ్నీం మునీనామపి మోహినీం
కోటిశో మహిషాస్తత్ర తద్రూపాః తత్పరాక్రమాః
దదృశుః సాయుధాః సర్వే నిఘ్నంతో దేవవాహినీమ్.”
మొదట ఇంద్రలోకమును ముట్టడించినాడు మహిషాసురుడు. ఇంద్రుడితో, ఇతర దేవతలతో ఘోర యుద్ధము జరిగింది. కానీ శాంబరీ విద్యా ప్రభావం వల్ల, అతని శరీరము నుండి వెలువడు ప్రతి రక్త కణమునుండి, కోటానుకోట్ల మహిష దైత్యుల రూపాలు ఉద్భవిస్తున్నాయి. కేవలం రూపములోనే కాదు, పరాక్రమంలో కూడా ఆ రూపములు అసలు మహిషునికి ఏమి తీసిపోవుట లేదు. దేవసైన్యావాహిని వారి భీకర అట్టహాసములకే గుండెలు పగిలి కకావికలై పలాయితమైనది.
తర్వాత విష్ణువుపైకే యుద్ధమునకు వెడలినాడు మహిషుడు. నారాయణుడు తప్పక వీనిని సంహరించునని లోకములన్నీ భావించినవి. కాని వాడు స్త్రీలకు తప్ప, ఎవరికైనను అజేయుడు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రమును మహిషునిపై ప్రయోగించినాడు. అది ఆ దైత్యుని పట్ల వమ్ము అయినది. మహిషుని అవక్ర పరాక్రమము ఎల్లరకును తేరిచూడరానిదై ప్రకాశింపసాగినది.
దేవతలందరు, ఈ మహాసుర శక్తి నుండి తమను కాపాడమని బ్రహ్మదేవుని ప్రార్థించినారు. త్రిమూర్తుల ఆధ్వర్యమున ఒక సమావేశము జరిగినది. అందరూ కలిసి దీనికి పరిష్కారమును కనుగొనుటకు తీవ్రంగా ఆలోచింపసాగినారు. అప్పుడు బ్రహ్మ ఇట్లనెను.
“నేను అతనికి వరములనిచ్చునపుడే, మరణ రహిత్యము అసాధ్యమని సృష్టము చేసినాను. అతడు విచక్షణాహీనుడై, ‘స్త్రీలతో తప్ప’ తనకు ఎవరితోనైనను మరణము వాటిల్లకూడదని కోరినాడు. దానినీ మనము ఇప్పుడు ఉపయోగించుకోవలెను. వాని వ్రేలితో వాని కన్నే పొడవవలయును.”
అప్పుడు నారాయణుడు ఇట్లు చెప్పినాడు
“కేవలము స్త్రీశక్తి మాత్రమే మహిషుని చంపగలదు కావున, మన అందరి తేజోంశలతో ఒక స్త్రీమూర్తికి రూపకల్పన గావించవలె.”
అప్పుడు మహేశ్వరు డిట్లన్నాడు. “నేను ఆ స్త్రీ వదనమునకు తెలుపు రంగు తేజస్సు నిచ్చెదను”
యమధర్మరాజు “నేను ఆమె కేశముల నయ్యెదను నలుపు రంగు తేజస్సు సమకూర్చెదను.”
“నేను ఆ స్త్రీమూర్తికి త్రినేత్రములనిచ్చెదను. అవి ఎరుపు రంగులో ప్రకాశించును” అన్నాడు అగ్నిదేవుడు.
వాయువు తాను ఆ నారీమణికి కర్ణములను కల్పించెదననియెను.
“నేను నువ్వు పువ్వు స్నిగ్ధత కల నాసికను దేవికి సమకూర్చెదను” అన్నాడు కుబేరుడు.
ప్రజాపతియైన బ్రహ్మ”నా తేజస్సు ఆ తల్లి దంతములుగా రూపొందగలదు” అని నుడివినాడు.
చంద్రుడు “నా తేజోంశము ఆమె వక్షోజములుగా మారగలదు” అన్నాడు.
ఇంద్రుడు “అస్తినాస్తి విచికిత్సా హేతువైన ఆమె నెన్నడుము నా తేజస్సు వలన ఏర్పడగలదు” అన్నాడు
వరుణ దేవుడు అమ్మ కాళ్లుగా, పృథ్యి ఆ స్తీ మూర్తికి జఘనంగా నిలుస్తామన్నారు.
చివరగా విష్ణువు “నా అనల్ప తేజోరాశి ఆమెకు అష్టాదశ బాహువులుగా ఏర్పడగలదు” అన్నాడు. “మనమందరము మన మన ఆయుధములను ఆ శక్తి స్వరూపిణికి ఇవ్వవలయును.”
అంతట విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, నందకము అన్న ఖడ్గాన్ని, కౌమోదకి అన్న గదను ఆమెకిచ్చాడు. బ్రహ్మ తన బ్రహ్మస్త్రాన్ని ఆమెకు సమకూర్చాడు. శివుడు తన త్రిశూలాన్ని ఆమెకు ఆయుధాన్ని చేసినాడు. గణపతి తన పాశాన్ని, కుమారస్వామి తన శక్తిదండాన్ని సమర్పించినారు దేవికి. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చాడు.
ఇవి కాక, ముక్కోటి దేవతలు బాణము, ధనువు, పరిఘము, ముద్గరము, ఖిండివాలము, ముసలము, దండము, క్రకచము, పరశువు, బల్లెము మున్నగు అనేక ఆయుధములను ఆ మహిళాముర్తికి సమర్పణము చేసినారు.
అప్పుడు దేవతలందరి తేజస్సును, శక్తిని, ఆయుధములను, అంశలను తనలో ఆవహింప చేసుకొని, మహిషాసురమర్దిని అవతరించినది! శివుని నుంచి తమస్సును, హరి నుంచి సత్త్వమును గ్రహించిందామె. పద్దెనిమిది భుజములతో, మహా తేజస్వినిగా, విశ్వమోహినిగా దేవి సాక్షాత్కరించింది.
“అష్టాదశ భుజా దేవీ సహస్ర భుజమండితా
సంభూతాసుర నాశాయ తేజోరాశి సముద్భవా!”
తేరిపార చూడరాని ఆ తల్లి విశ్వరూపమును చూచి దేవతలు విస్మయానంద భరితులైనారు. ఆ తల్లిని ఈ విధంగా స్తుతించారు.
“నమఃశివాయై కల్యాణ్యై శాంత్యై పుష్ట్యై నమోనమః
భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యైతే నమోనమః.”
“కాళరాత్ర్యై తథాంబాయై ఇంద్రాణ్వైతే నమోనమః
సిద్ధ్యై బుద్ధ్యై తథా వృద్వై, వైష్ణవ్యైతే నమోనమః”
మహిషాసురమర్దిని వారి పట్ల ప్రసన్నురాలయింది. మనోహర దరహాసాన్ని వెలువరించింది. అది దేవతలకు. తర్వాత ఆమె దిక్కులు పిక్కటిల్లేలా వికటాట్టహాసం చేసింది! అది రాక్షసులకు. అప్పుడు భూమి కంపించింది. పర్వతాలు కదిలాయి. సముద్రాలు ఘూర్ణిల్లాయి. మేరుపర్వతం గడగడ వణకింది. దేవతలు జయజయ ధ్యానాలు చేస్తే రాక్షసులు హాహాకారాలు చేశారు. నరసింహావిర్భావ సమయంలో జరిగినదే ఇక్కడ జరిగింది. దీనినే అన్నమాచార్యులవారు తమ ‘సింగారాల మించీ నరసింహ దేవుడు’, అన్న కీర్తనలో, “సురలు జయపెట్ట, అసురులెల్ల మొరవెట్ట” అన్నాడు.
ఆ తల్లి భీషణాట్టహాసం మహిషాసురుని చేరింది!
***
మహిషాసురుని దూతలు అమ్మవారిని చూశారు. వారి గుండెలు అవిసిపోయాయి. అదే సమయంలో ఆమె జగన్మోహన సౌందర్యం కూడా వారిని ఆకర్షించింది. వారు వెళ్లి మహిషునితో ఆమె శౌర్యమును, సౌందర్యమును గురించి చెప్పారు. అప్పుడు మహిషుని మంత్రి ఆమె వద్దకు రాయబారమునకు వెళ్లినాడు. ఆమెతో ఇట్లా చెప్పినాడు –
“కః శ్రమః కరిరాజస్య మాలతీ పుష్పమర్దనే
మారణే తవవామోరు మహిషస్యతథా రణే”
“ఓ నారీమణీ! ఏనుగు పూల తీగను ధ్వంసం చేసినట్లు మహిషుడు నిన్ను యుద్ధములో నలిపివేస్తాడు. ఆతడు మహోగ్ర పరాక్రముడు. నిన్ను గురించి విని, నిన్ను వివాహమాడి, తన ‘పట్టమహిషి’ ని చేసుకుంటానన్నాడు. నీవు అంగీకరిస్తే, నీకు శుభం జరుగుతుంది.”
అప్పుడు మహశక్తి స్వరూపిణియైన ఆ దేవి పకపక నవ్వి, ఇట్లా చెప్పింది –
“ఓరీ! దైత్యాధమా!
‘విపరీతం యదా దైవం తృణం వజ్ర సమం భవేత్
విధిశ్చేత్యుముఖః కామం కులిశం తూలవత్తదా!’
దైవము మనకు వ్యతిరేకమైతే. గడ్డిపరక కూడా వజ్రాయుధం అవుతుంది. అదే సమయంలో, విధి మనకు అనుకూలంగా ఉంటే, కులిశం (ఆయుధం) కూడా దూది వలె మారుతుంది. వెళ్లి నీ ప్రభువుతో చెప్పు. చావు వానికి మూడిందని.”
మొదట, మహిషాసురుడు, తన సైన్యాధిపతియైన తామ్రాసురుని దేవిపై యుద్ధానికి పంపినాడు. వాడు కూడా తల్లి సౌందర్యానికి విభ్రమము చెందినవాడై, ఇట్లా అన్నాడు –
“ఓ లలనామణీ! నీవు మా దైత్య శేఖరునకు సరియైన జీడీవి. నా మాట విని అజేయుడైన మా రేని నీవు వరించి సుఖించు.”
అప్పుడు శక్తి స్వరూపిణి వికటాట్టహాసము చేసింది. “మూర్ఖుడా! ఇంద్రాదులనే వరించను. వీడెంత? పైగా మీ రాజు గేదెకు పుట్టినాడు. వాడు పశువు. వాడినెలా వరిస్తానురా?” అని భీకరంగా పలికింది. అమ్మవారు సింహవాహినియై ఉన్నది. సింహమునకు కూడా కోపం వచ్చి, దారుణంగా తామ్రుని గుండెలవిసే విధంగా గర్జించింది. తామ్రుడు పలాయనం చిత్తగించాడు.
పిదప, బాష్కల, దుర్ముఖాసురులు దేవితో యుద్ధానికి వచ్చారు. తరువాత చిక్షురాసురుడు. వారందరు మహశక్తితో ఘోర యుద్ధం చేశారు. ఆమె చేత సంహరింపబడినారు.
మహిషుడు కోపోద్రిక్తుడైనాడు. ఆమెపైకి జడాలుని, అసిలోముని పంపాడు. వారు మహావీరులు. కాని, వారు దేవి చేతిలో నిహతులైనారు.
చివరికి మహిషుడే యుద్ధానికి బయలుదేరాడు. సౌందర్యరాశియైన ఆ అతివ మనసు చూరగొనటానికి, తన మహిష రూపమును విసర్జించి, సుందరాకారముతో వచ్చాడు. ఆమె చక్కదనాన్ని చూసి ముగ్గుడైనాడు. మృదువుగా ఇట్లా అన్నాడు.
“లతాంగీ! ఏమి నీ మనోహర లావణ్యము! నేను నీ సౌందర్యానికి బానిసను అయినాను. నన్ను వరించి ధన్యుని చేయి.”
అప్పుడా మహాశక్తి అత్యంత సుందరరూపుడైన ఆ రాక్షసేశ్వరుని చూచింది. నిర్వికారంగా ఇట్లా అన్నది. ఆమె ముఖంలో ఒక ఎగతాళతో కూడిన చిరునవ్వు మెరిసింది.
“ప్రహస్య సస్మితం వాక్యం ఉవాచ వరవర్ణినీ
నాహం పురుష మిచ్ఛామి పరమం పురుషం వినా”
“తస్య చౌచ్ఛాస్మ్యహం దైత్య సృజామి సకలం జగత్
సమాంపశ్యతి విశ్వాత్మా తస్యాహం ప్రకృతిః శివా!”
“యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ!
తదా తేషాంచ రక్షార్థం దేవం సంధారయామ్యహం”
“ఓరీ దానవా! నేను పరమపురుషుని తప్ప అన్యులను వరించను. నేను ప్రకృతిని. పరమాత్మ సంయోగం వల్ల నాలో శాశ్వత చైతన్యం వెల్లివిరుస్తూ ఉంటుంది. నాకు తుచ్ఛమైన శరీర సుఖాలు ఎందుకు? కేవలం ఇచ్ఛామాత్రమున ఈ సకల చరాచర జగత్తును సృష్టిస్తాను. ఎప్పుడు సాధుసత్పురుషలకు, నీ వంటి దుర్మార్గుల వల్ల దుఃఖం వాటిల్లుతుందో, అప్పుడు వారిని రక్షించడానికి దేహం ధరిస్తాను. నీకు మరణమాసన్నమయినది.”
మహిషాసురుడు నిజరూపం ధరించాడు. కొండంత రూపం. తోక ఝాడించి, గిట్టలతో భూమిని మట్టగించి, రంకెలు వేయసాగాడు. జగములన్నీ వాని బీభత్సమునకు కకావికలయినాయి. మహాపన్నగమువలె నోటి నుండి నురగలు కక్కుతున్నాడు మహిషాసురుడు. తన కొమ్ములే బల్లెములుగా, ముట్టెను వంచి, అమ్మవారిపై దూసుకు వస్తున్నాడు. అతని కాలి గిట్టల వల్ల రేగిన దుమ్ము మేఘమండలమంతా వ్యాపించింది.
మహాదేవి ద్రాక్షాసవాన్ని గడగడ త్రాగింది. ఆమె నేత్రములు అగ్నికణాలను వర్షిస్తున్నాయి. త్రిశూలం ధరించి రక్కసునికి ఎదురు వెళ్లింది. కొమ్ములు పట్టుకుని ఆ భీకరాకారాన్ని ఆపి, ఆ కొమ్ములను ఫెళఫెళా విరిచి వేసింది. త్రిశూలంతో తల మీద పొడిచింది.
మహిషాసురుడు భయభ్రాంతుడైనాడు. ఎవరీ అనన్య సామాన్యశక్తి? అప్పుడాతనికి తాను బ్రహ్మను ‘మహిళలు తప్ప’ తనను ఎవరూ చంపలేనట్టు వరమడగడం గుర్తుకు వచ్చింది. ప్రాణభయంతో.. వణకుతూ ఆ వికృతరూపుడు పరుగు తీశాడు. మహిషాసురమర్దిని వాడిని తరిమి తరిమి శూలంతో పొడిచింది. చండిక వాడిపై సుదర్శనాన్ని ప్రయోగించింది. తాటిపండు వలె, వాని శిరస్సు, శరీరము నుండి వేరై, నేల మీద పడింది. వాడి వేడి వేడి రుధిరం చివ్వున చిమ్మింది. అమ్మవారి వాహనమైన సింహము భీకర గర్జనలు చేస్తూనే ఉంది.
అవతార ప్రయోజనం సిద్ధించింది! అమ్మవారు ప్రశాంత వదనగా మారింది. ఆమె చిరునవ్వు లోకాలను వెలుగుతో నింపింది. ఆమెలో ఈషణ్మాత్రము అలసట కానరాలేదు. చెమట చుక్క కూడా మేన చిందలేదు.
తరువాత మహాదేవి మణిద్వీపానికి వెళ్లింది. ఆమెకు అత్యంత ప్రియమైన స్థానమది. సుధాసముద్ర మధ్యంలోని మణిద్వీపంలో జగదంబిక విహరిస్తూ ఉంటుంది. ఆ మణిద్వీపం ఎంత విశిష్టమైనదంటే,
“సర్వదో నిజవాసార్థ ప్రకృత్యా మూలభూతయా।
కైలాసాదధికో లోకో వైకుణ్ఠాదపి చోత్తమః॥
గోలోకాదపి సర్వస్మాత్సర్వలోకోధికః స్మృతః।
నైతత్సమం త్రిలోక్యాం తు సుందరం విద్యతే క్వచిత్॥”
మొదటే, దేవి, మూలప్రకృతి భగవతి, తన నివాసం కొరకు మణిద్వీపాన్ని ఏర్పరచింది. ఇది కైలాసం కన్న, వైకుంఠం కన్న, గోలోకం కన్న మహోత్తమమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విశ్వంలో దీనికంటే గొప్పది లేదు.
మహిషుడు సగం మనిషి, సగం మృగం పాశవికతత్వానికి ప్రతీక. మహిషాసుర సంహారం, మనిషిలోని పశుపువృత్తిని అంతమొందించడానికి ప్రతీక. పుంసత్వం, స్వభావసిద్ధంగా, ప్రవృత్తిని అనుసరించి జీవిస్తుంది. సరీనృపాల మెదడు, గట్టి పిడికిలిలా ఉంటుంది. లోపలికి స్త్రీత్వం ప్రవేశించినపుడు అది తెరుచుకుంటుంది. అప్పుడు పశుస్వభావం ఆమె పాదాల వద్ద దాసోహమంటుంది. దేవీ, మహిపాసురుల ప్రతీక ఇదే! అమ్మవారు మహాశక్తిగా ఎదిగి, వాడి మృగత్వాన్ని మర్ధించింది.
ఇందులో మరో కోణం, ‘స్త్రీవాదం’ కూడా ఉంది. స్త్రీల పట్ల తేలిక భావంతో మహిషుడు, తనను ఆడవాళ్లు ఏం చేయగలరులే అన్న గర్వంతో, తన వరంలో ఆ మినహాయింపుని అడిగాడు. అదే వాడి కొంప ముంచింది. స్త్రీ మహాశక్తి స్వరూపిణి అని మహిషాసురమర్ధని నిరూపించింది. స్త్రీలో మహత్తర సౌందర్యమే కాదు, బృహత్తర శత్రు భీకర పరాక్రమం కూడా ఉంటుందని అమ్మవారి తత్త్వం చాటింది.
స్వస్తి:
శ్రీవిద్యాం పరిపూర్ణ మేరు శిఖరాం బిందుత్రికోణే స్థితాం
వాగీశాది సమస్త భూత జననీం మంచే శివాకారకే
కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంక స్థితాం
కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మవిద్యాం భజే!
(సమాప్తం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
