Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనిషి ఎప్పుడు ఒంటరే!

[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘మనిషి ఎప్పుడు ఒంటరే!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

చీకటి నిండిన అమ్మ జానెడు
పొట్టలో నిద్రాహారాలు లేక
నవమాసములు
రక్త మాంసాలలో ఓలలాడుతూ
ఒంటరి పోరాటం సాగించి
తెలియని బంధాలు బంధుత్వాలతో
పెనవేసుకున్న ఆనందాల మధ్య
ఈ భూమ్మీదకు వచ్చాను
ఏవేవో వరసలు పెట్టి పిలిచారు
నాకు తెలియని వాళ్ళందరూ
నన్ను లాలించి బుజ్జగించారు
ఎత్తుకుని ముద్దు చేశారు
అమ్మ కడుపులో
ఎంత హాయిగా ఉన్నానో
ఇలా ఇలపైకి వచ్చానో లేదో
ఏదో తెలియని స్వార్థం
నాలో పెరిగింది
స్నేహితులు తోడయ్యారు
అపార్థాలు ప్రేమల సాన్నిహిత్యంతో కలిసి ప్రయాణం సాగించాను
నిరంతర పోరాటమే బ్రతుకని అర్థమైంది
కాలచక్రం పరుగులు పెడుతున్నది
సంవత్సరాలు గడిచిపోయాయి
వయోభారంతో కంటిచూపు తగ్గింది
ఒంట్లో ఓపిక సన్నగిల్లింది
అందరూ నా చుట్టూ ఉన్నా
ఒంటరితనం నన్నావహించింది
అప్పుడు పరమాత్మ తలపుకు వచ్చాడు
గడచిదంతా మాయే కదా అనిపించింది
ఈ ప్రపంచ రంగస్థలంలో
నా పాత్ర ముగిసింది
ఇక ప్రయాణానికి సిద్ధం కావాలి
నాడు ఆనందంతో స్వాగతించిన
బంధువులు బంధుత్వాలు వదులవుతున్నాయి
ఒంటరిగానే భూమ్మీద పడ్డాను
అయిన వారి ఆశలు తీర్చడానికి
ఒంటరిగా పోరాడాను
పెనవేసుకున్న బంధాల లతలను
ఒక్కొక్కటిగా తెంచుకుంటూ
ఒంటరిగానే పోతున్నా
ఎవరు వచ్చినా ఏం చేసినా
ఎవరు మోసినా ఎందరు వచ్చినా
ఎక్కడో అక్కడ ఆగిపోయేవారే కదా!
కడదాకా వచ్చే వారెవరు లేరు
మనిషి ప్రయాణము
ఎప్పుడు ఒంటరిగానే
ఆసత్యం తెలిసేటప్పటికి
తిరుగు ప్రయాణ సమయం
ఆసన్నమైనది కదా!

Exit mobile version