Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనిషి – మనసు

[ఎస్. ముంతాజ్ బేగం గారు రచించిన ‘మనిషి – మనసు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

‘మ్యారేజ్ డే’ పార్టీకి పిలిచిన అతిథులందరు ఒక్కొక్కరు వస్తుంటే వారిని సాదరంగా ఆహ్వానిస్తూ హుషారుగా తూనీగలా తిరుగుతుంది రాధ.

తనకిష్టమైన నీలిరంగుచీరలో దేవకన్యలా మెరిసిపోతుంది.

ఎప్పటిలా చెరగని చిరునవ్వు మోముపై. అయితే ఈ రోజు ఆ నవ్వుకు ఆనందం కూడా తోడైనట్లుంది, అందుకే మరింత మెరిసి పోతుంది.

ఆ ఆనందానికి కారణం లేకపోలేదు. పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతున్నా ఎప్పుడు తన భర్త మాధవ్ తన అభిప్రాయాలూ అభిరుచులు ఇష్టాల గురించి మాట్లాడటమే కాని.. ఏ రోజు తన ఇష్టాల గురించి అడిగింది లేదు పట్టించుకొన్నది లేదు.

అలాంటిది రెండు రోజుల క్రితం ఆఫీసు నుండి ఇంటికి త్వరగా రావడమే కాదు.. “షాపింగ్‌కు వెళ్దాం పద” అంటూ బయటకు తీసుకెళ్లి “నీకు ఇష్టమైన కలర్ చెప్పురాధ.. ఈసారి మన మ్యారేజ్ డేకి ఇద్దరం అదే కలర్ తీసుకోందాం” అంటుంటే నమ్మబుద్ధి కాలేదు తనకు.

రెండు రోజుల నుండి ఇదే విధంగా ప్రవర్తిస్తూ తన అనురాగంతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే చాలా అంటే.. చాలా ఆనందంగా వుంది రాధకు. అదే ఆనందం మోముపై ఇప్పుడు తాండవమాడుతుంది.

మాధవ్ చూపులన్ని రాధ వైపే వున్నాయి.

పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరు మాధవ్‌ని చూసి జోక్స్ వేయసాగారు.

“ఏంట్రా ఇంట్లో నువ్వు చెప్పిందే వేదమా..! నీ ఇష్టాలే ఆమె ఇష్టాలా..! నువ్వు కన్నెర్ర చేస్తే గజగజలాడిపోతుందా..! ఆఫీసులో ఏదేదో కోతలు కోస్తూవుంటావు.. ఇప్పుడు ఆమె వెనకెనకే తిరుగుతున్నావు” అంటూ ఫక్కుమంటుంటే.. తన ప్రవర్తన గుర్తుకు తెచ్చుకొని సిగ్గుపడ్డాడు మాధవ్.

“ఎప్పుడు ఒకేలా వుంటే ఏం బాగుంటుంది. మనలోని లోటుపాట్లను సరిదిద్దుకొని మారాలి కదా” అంటూ నవ్వేసాడు.

***

డబ్బుకు లోటు లేని ఇంట్లో పుట్టాడు మాధవ్.

తను ఆడింది ఆటగా పెరిగాడు. పెరిగే క్రమములో అహంభావాన్ని కూడా పెంచుకొన్నాడు గుండెల నిండా. ఎక్కడ వున్నా ఎలా వున్నా తన మాటే నెగ్గాలి అనుకొనేవాడు. తల్లిదండ్రులకు కూడా బాధ అనిపించేది ఒక్కోసారి ఆతని ప్రవర్తన. అందం చదువు వున్న అమ్మాయిని చూసి పెళ్లిచేసుకోమని తల్లిదండ్రులు చెప్తే తమ అంతస్తుకు తగినట్లు ఉందని.. లేదు అనడానికి కారణం కనిపించక ‘ఊఁ’ అన్నాడు. కాని రాధ ఉద్యోగం చేయకూడదని కండీషన్ విధించాడు. రాధ ఇష్టాయిష్టాల గురించి ఏనాడు పట్టించుకోలేదు. అందరి ముందు భార్య గురించి కూడా చులకనగా మాట్లాడేవాడు. “వంటింటి కుందేలు నేను చెప్పినట్లు వినాల్సిందే” అంటూ.. ఇంట్లో ఉన్నంత సేపు పరిగెత్తించేవాడు రాధను “అది చెయ్.. ఇది చెయ్” అంటూ.

అది రాధకు బాధ అనిపించినా సహనం వహించేది.

***

తరచూ ఆఫీస్‌లో వున్న కొలీగ్స్‌కి పార్టీ ఇచ్చేవాడు మాధవ్.

అప్పుడు తన గురించి గొప్పలు చెప్పుకోవడమే కాదు, “మనం ఏం చేసినా.. భరించేదే భార్య” అంటూ భార్యను గురించి చులకన చేసి మాట్లాడేవాడు.

వూరికే వచ్చే ఆనందం కదా..

తను ఇచ్చే పార్టీని..

తను చెప్పే కబుర్లను విని అందరు చక్కగా ఎంజాయ్ చేసేవారు. తన వెనక నవ్వుకునేవారు.

ఆడవాళ్లు మాత్రం ‘అహంభావి’ అంటూ తిట్టుకునేవారు

ఆఫీస్‌లో వున్న ఒక్క ఆనంద్ మాత్రం ఎవ్వరితో కలిసేవాడు కాదు. ఆఫీస్‌కి రావడం తన పని తాను చూసుకోవడం, వెళ్లిపోవడం చేసేవాడు. అందరు తన చుట్టూ వుంటే ఆనంద్ అలా వెళ్లిపోవడం మాధవ్‌కి మాత్రం నచ్చేది కాదు. ఎలాగైనా ఆనంద్‌ను తమ గ్యాంగ్‌లో కలుపుకోవాలనుకున్నాడు. తన ‘పెళ్ళి రోజు’ ఇంట్లో జరుపుకోనే పార్టీకి పిలవాలని ఆనంద్ ఇంటికి వెళ్ళాడు మాధవ్.

***

తలుపు తీసిన ఆనంద్..

ఎదురుగా నిలబడి వున్న మాధవ్‌ని చూసి ప్రసన్నంగా నవ్వి లోపలికి ఆహ్వానించాడు. అంత చక్కగా ఆహ్వానం పలుకుతాడని అనుకోని మాధవ్ సంతోషంగా ఇంటిలోపలికి అడుగు పెట్టాడు.

ఇల్లంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా వుంది. చాలా అందంగా, చక్కగా సర్దబడి వుంది. ఇల్లు చిన్నదే అయినా చాలా బాగుంది. మనసులోనే మెచ్చుకొన్నాడు మాధవ్.

“మంచినీళ్లు తీసుకోండి” అంటూ నీళ్లు అందించాడు.

“టీ, కాఫీ, జ్యూస్ ఏం తీసుకొంటారు.. మొదటిసారి మా ఇంటికి వచ్చారు” నిజాయితీగా అభిమానం ఉట్టిపడే స్వరంతో అడిగాడు ఆనంద్.

“ఇప్పుడు ఏమి వద్దు ఆనంద్. మీకెందుకు శ్రమ.. సిస్టర్ కూడా ఇంట్లో లేనట్లున్నారు” అంటూ ఇల్లంత కలియచూస్తూ అన్నాడు మాధవ్.

లోపల మాత్రం ‘ఆమె బయటికి కూడా రాదేమో.. అదే తనైతే ఈ పాటికి ఎవరైనా వస్తే రాధా అంటూ ఒక్క కేక పెట్టేవాడు’ అనుకోసాగాడు.

“లేదు మాధవ్ గారు ఇందులో శ్రమ ఏముంది? మా అతిధి మీరు. శాంతికి కొంచెం హెల్త్ బాగా లేదు. అందుకే రెస్ట్ తీసుకొంటుంది. ఉండండి మీకు మంచి కాఫీ కలుపుకొని వస్తాను” అంటూ వెళ్ళి 10 నిమిషాల్లో కాఫీ కప్పుతో తిరిగి వచ్చాడు ఆనంద్.

ఆశ్చర్యంగా చూస్తున్న మాధవ్‌ని ఉద్దేశించి నవ్వుతూ.. “ఏం ఫరవాలేదు నేను కాఫి చక్కగా పెడతాను. భయపడకుండా తాగండి. తరువాత మీకు నా భార్యను పరిచయం చేస్తాను” అన్నాడు.

మాధవ్ కాఫీ తాగి “నిజంగా చాలా బాగుంది కాఫీ. థాంక్ యు” అన్నాడు.

“రండి” అంటూ పడక గదివైపు తీసుకెళ్లాడు ఆనంద్.

తను గదిలోపలికి వెళ్ళాడు. మాధవ్ మాత్రం గడప దగ్గరే ఆగిపోయాడు

కడిగిన ముత్యంలా వుంది ఆమె. మోముపై ఏదో తీవ్ర అలసటతో బెడ్‌పై పడుకొని ఏదో పుస్తకం చదువుకుంటోంది. అలికిడి విని పుస్తకం పక్కన పెట్టి చిరునవ్వు నవ్వింది. ‘ఎవరు?’ అన్నట్లు చూసింది.

“నా కొలీగ్ మాధవ్ గారు..” అని భార్యకి చెప్పి, “మాధవ్ గారు.. ఈమె నా భార్య శాంతి” ఇద్దరిని ఒకరికొకరిని పరిచయం చేసాడు ఆనంద్.

“నమస్తే సర్” అంటూ చేతులు జోడించి చెప్పింది శాంతి .

అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించాడు మాధవ్. ‘ఏమైంది..?’ అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసాడు. “రండి” అంటూ హాల్లోకి దారి తీసాడు ఆనంద్.

“మాది ప్రేమ వివాహం. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. అందుకే అందరూ వదిలేశారు. మూడు నెలల క్రితం మాకు కార్ యాక్సిడెంట్ అయింది. ఆక్సిడెంట్‌లో శాంతి వెన్నెముక బాగా దెబ్బతిన్నది. కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు డాక్టర్లు. మమ్మల్ని ఓదార్చడానికి కానీ ఆదుకోవడానికి కాని మావాళ్ళు ఎవరూ రాలేదు. ఏది ఏమైనా మా బతుకును మేమే చక్కదిద్దుకోవాలనుకున్నాము.

నా కోసం అందర్నీ వదిలేసి వచ్చిన శాంతి కోలుకుని మామూలు మనిషి అయ్యేదాకా తనకు ఏ కష్టం కలగకుండా, చంటి పాపలా చూసుకోవాలనుకున్నాను. చూసుకుంటున్నాను కూడా. నాకు తను తనకు నేను. నాలో సగభాగమైన ఆమె తరువాతే ఎవరైనా. అందుకే నా డ్యూటీ అయిపోయిన తర్వాత నాకు ఉన్న ప్రతి నిమిషాన్ని ఆమె కోసమే వినియోగిస్తూ ఆమెతోనే ఉంటాను. ఇందులో నాకు ఇబ్బంది కానీ బాధ కానీ లేదు. తను నా అర్ధాంగి. తను ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను. తను బాధపడితే నేను బాధపడతాను. అందుకే ఆఫీస్ అయిన తర్వాత మీ అందరితో కలిసి కూర్చోవడానికి నిరాకరిస్తూ వచ్చేవాడిని.. అంతే కాని మిమ్మల్ని బాధపెట్టాలని కాదు” అంటూ ముగించాడు ఆనంద్.

“అన్నట్లు మీరు ఎందుకొచ్చారో చెప్పలేదు..” అంటూ మాట మార్చాడు.

“రెండు రోజుల తరువాత సండే మా మ్యారేజ్ డే పార్టీ వుంది. అందుకే పిలుద్దామని వచ్చాను” అన్నాడు మాధవ్.

“సారీ మాధవ్ గారు. శాంతి కోలుకొన్న తరువాత మీ ఇంటికి మేమిద్దరమూ కలిసి తప్పక వస్తాము” అంటూ రాలేనని సున్నితంగా తిరస్కరించిన ఆనంద్ వైపు చూసి “తప్పకుండా ఆనంద్ గారు” అంటూ వెనుదిరిగిన మాధవ్‌తో “రాధమ్మకు అన్నయ్య ఆశీర్వాదం పంపడానికి చెప్పండి. భార్య గౌరవమే భర్త గౌరవం.. భర్త ఆనందం భర్యకు ఆనందం అని మరవకండి ఎప్పుడూ” అన్నాడు ఆనంద్ నవ్వుతూ మాధవ్‌కు కరచాలనం చేస్తూ..

చెంప చెళ్ళుమనిపించినట్లు అనిపించింది ఆనంద్ మాటలతో మాధవ్‌కు.

“అవును ఆనంద్” అంటూ బయటికి వచ్చాడు మాధవ్. ఆతని మనసంతా బాధతో నిండిపోయింది. ఎంత ఉన్నతమైన ఆలోచనలు ఆనంద్‌వి. ‘వారికి అలా జరిగివుండాల్సింది కాదు’ అనుకున్నాడు మనసులో.

మళ్ళీ రాధ గుర్తుకు వచ్చింది. ‘చాలా నిర్లక్ష్యం చేసాను. అందరిముందు చులకనగా మాట్లాడాను. అందుకేనేమో ఆనంద్ చివరలో భార్య గౌరవమే మన గౌరవం అని చెప్పాడు’ అనుకున్నాడు. అపరాధ భావంతో అతని మనస్సు కుంచించుకుపోయింది. ‘ఇకపై ఆనంద్‌లా నేను ఒక మంచి భర్తలా ఉండాలి’ అనుకొంటూ గట్టిగా నిర్ణయించుకొని ఇంటికి బయలు దేరాడు మాధవ్..!

***

వచ్చిన అతిథులందరూ వెళ్ళిపోయిన తరువాత..”పార్టీ చాలా బాగా జరిగింది కదా” అన్నాడు మాధవ్ రాధతో..

“అవును ఈ పార్టీ నాకు మా ఆయన ప్రేమను కానుకగా ఇచ్చింది. దానికి ధన్యవాదములు తెలియజేస్తాను జీవితాంతం” అంటూ హాయిగా నవ్వుతున్న భార్యను గుండెలకు హత్తుకొన్నాడు మాధవ్ ప్రేమగా.

‘నేను మాత్రం – ఒక మంచి భర్తయైన ఆనంద్‌కు ధన్యవాదాలు చెప్పాలి’ అనుకొన్నాడు మాధవ్ మనసులో..!!

Exit mobile version