Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనిషి మాయమయ్యాడు

[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘మనిషి మాయమయ్యాడు’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]

ఇంటింటికీ నాలుగు గోడలు పెరిగాయి,
మనసు మనసుకూ మైళ్ల దూరమైంది.
ఎవరి గది వారిది, ఎవరి ఫోను వారిది,
ఎవరి లోకం వారిది, ఎవరి నరకం వారిది.

అమ్మ ఒడిలో పలకని పిల్ల,
నాన్న భుజం ఎక్కని పిల్ల.
స్కూలు బ్యాగులో మార్కులే కానీ,
మానవత్వం పాఠం మాయమైంది.

ఐదేళ్ల పాప బొమ్మతో ఆడాలి,
కానీ భయంతో వెనక్కి చూస్తోంది.
ఎనభై ఏళ్ల అవ్వ దేవుడి పేరు చెప్పాలి,
కానీ తలుపు గడియ వేసుకుంటోంది.
ఎవరిని నమ్మాలి? ఎక్కడ దాక్కోవాలి?
ఇల్లు కూడా అడవైపోయింది.

పిల్లల చేతిలో పుస్తకం లేదు,
స్క్రీను ఉంది, విషం ఉంది.
ఆట లేదు, పాట లేదు,
అమ్మమ్మ కథ లేదు, అయ్య సద్ది మాట లేదు.
గదులు బంగ్లాలయ్యాయి,
కానీ హృదయాలు శూన్యమైనాయి.

తల్లిదండ్రులు డబ్బు వెంట పరిగెత్తారు,
పిల్లల్ని ఒంటరిగా వదిలేశారు.
బడులు ర్యాంకుల వేటలో పడ్డాయి,
బుద్ధి మాట, గుణం మాట మరిచిపోయాయి.
లోపం ఎవరిదని అడిగితే,
అద్దం ముందు నిలబడాలి అందరం.

పశువుకైనా ఒక ధర్మం ఉంది,
కడుపు నిండితే కన్నెత్తి చూడదు.
మనిషికే మనసు చచ్చింది,
కన్ను కామంతో, కడుపు కసితో నిండింది.
వావి వరస మరిచాడు,
వయసు తేడా మరిచాడు.
వాడు మనిషి కాదు, మృగం కంటే హీనం.

కలువాయి సన్నాల పొలంలో
ఇప్పుడు పంట కంటే భయం పండుతోంది.
పోలేరమ్మ గుడి ముందు
దీపం కంటే కన్నీళ్లే ఎక్కువ.
జానకమ్మ లాంటి అవ్వలు
ఇంటి గడప దాటాలంటే వణుకుతున్నారు.

ఎవరి గది వారిదైన రోజు,
ఎవరి బాధ వారిదైపోయింది.
కలిసి అన్నం తినడం మానేశాం,
కలిసి ఏడవడం మరిచిపోయాం.
విలువలు చెప్పే పెద్ద గొంతు మూగబోయింది,
వినే చిన్న చెవి చెవిటైపోయింది.

ఇంకెన్నాళ్లు ఈ చీకటి?
ఇంకెన్ని పాపలు బలి కావాలి?
ఇంకెన్ని అవ్వలు కుమిలిపోవాలి?
ఇంటి తలుపు కాదు,
మనసు తలుపు తెరవాలి.
ఫోను పక్కన పెట్టి,
పిల్లల కళ్లలోకి చూడాలి.
మార్కులు కాదు,
మానవత్వం నేర్పాలి.

నేల తల్లి క్షమిస్తుంది,
కానీ ఈ పాపాన్ని కాలం క్షమించదు.
మనిషిగా బతకాలంటే,
ముందు మనిషిని ప్రేమించాలి.
చిన్న పాపలో అమ్మను చూడాలి,
ముసలి అవ్వలో దేవతను చూడాలి.

లేకపోతే రేపు
గోడల మధ్య శూన్యం తప్ప
గుండెలు ఉండవు.
ఇళ్లు ఉంటాయి,
ఇంటివాళ్లు ఉండరు.

Exit mobile version