Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనిషిగా కొత్త జన్మ

[యన్. సురేంద్రనాథ్ గారు రచించిన ‘మనిషిగా కొత్త జన్మ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

వందేళ్లలో ఎప్పుడూ చూడనటువంటి వరదలతో నారాయణ గుట్ట, సముద్రంలో లంక లాగా కనిపిస్తూంది. ఎన్ని మట్ల లోతుతో వరద ప్రవాహం సాగుతుందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ఊరిని బాహ్య ప్రపంచంతో కలిపే యాభై అడుగుల వంతెన గుట్టపై నుండి చూస్తే కనిపించడం లేదు. ఆ గుట్ట వెనుక వైపు వంకను దాటితే అన్నీ ఆకాశాన్నంటే కొండలే! అంతా అటవీ ప్రాంతమే తప్ప వేరే ఊరే లేదు. ఆ వంక కూడా వరదలో ఉధృతంగా ప్రవహిస్తూంది.

గుట్టపై సంసారాలు, గుట్ట క్రింద వ్యవసాయం ఆ ఊరి నైసర్గిక స్వరూపం! మొత్తానికి ఆ ఊరు జల దిగ్బంధనంలో ఉండి నేటికి మూడు రోజులయ్యింది. ఊరికి కరెంట్ సరఫరా కూడా ఆగిపోయింది. కిరసనాయిలు బుడ్లను వాడే అలవాటు తప్పి పోవడమూ, ఇళ్లలోని బ్యాటరీలకు ఛార్జింగ్ లేకపోవడంతో రాత్రి వేళలో ఆ ఊరు గాఢాంధకారంలో మునిగిపోయింది, ఎక్కడో ఓ చోట మిణుకుమంటున్న వెలుగు తప్ప!

“మామా, వరద ఎప్పుడు తగ్గుతుందో ఏమైనా సమాచారం తెలిసిందా” అని అడిగాడు వెంకటేశ్వర్లు, ఉదయాన్నే మిద్దెపై నిలబడి ఆందోళనగా వరదను గమనిస్తున్న డెబ్బై ఏళ్ల వీరభద్రాన్ని.

“లేదురా, నాకేం చేయాలో తోచడం లేదు. మీ అత్త శవాన్ని పంచలో ఇట్లా ఎన్ని రోజులు ఉంచుకోవాలో తెలీడం లేదు” అన్నాడు ఆవేదనగా. ఆయన భార్య చనిపోయి నేటికి మూడు రోజులవుతుంది. శవం నుండి దుర్వాసన రావడం మొదలైంది. అంత్యక్రియలు జరపలేని పరిస్థితి.

“వందెకరాల ఆసామివి. ఇప్పుడు దహనానికి ఆరడుగుల భూమి లేకపాయే! ఎంత కష్టమొచ్చింది మామా నీకు” అంటూ సానుభూతి చూపాడు. గుట్ట క్రింద జలధిలా కనిపిస్తున్న ఆ ప్రదేశంలో ఊరందరి భూములు మునిగిపోయాయి. అందులో తన వందెకరాలు ఎక్కడో కూడా అర్థం కావడం లేదు.

“మామా, చివరి చూపు కోసం మన కులపోళ్ళు తప్ప ఊర్లో ఎవరూ రాలేదు కదూ?” అంటూ అడిగాడు. ఆ ప్రశ్నలో కాస్త వ్యంగ్యం ధ్వనించింది. రాలేదంటూ తలూపాడు.

“నీ ఇద్దరు కొడుకులూ విదేశాల్లో గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. నువ్వా లక్ష్మీ పుత్రుడివి! ఊరందరికి వడ్డీకి పరపతులు ఇచ్చినావు. ఊరోళ్ల పావు భాగం భూమి నీ ఆయకంలోనే ఉంది. ఇక పుస్తెలు తాకట్టు పెట్టి నీ దగ్గర డబ్బులు తీసుకున్న వారి సంఖ్య లెక్క పెట్టలేం. ఇంత పెద్ద ఆసామివే ఎంత కష్టమొచ్చింది మామా నీకు! సాయానికి మనుషులే లేకపోయిరి” అంటూ నిట్టూరుస్తూ వెళ్ళిపోబోయాడు.

“రేయ్ కాస్త ఆగు. ఓ పని చేస్తావా?” అన్నాడు, వీరభద్రం.

“చెప్పు మామా” అన్నాడు.

“మన కులపోళ్ళతో ఇప్పుడే సమావేశం ఏర్పాటు చెయ్యి” అన్నాడు, గంభీరంగా.

అధ్యాయం 2

వీరభద్రం ఆ ఊరికి కామందు లాంటి వాడు. అతనిది రాబందు స్వభావం. తన ఇరుగు పొరుగు వారి భూముల్ని భయపెట్టో, మోసం చేసో, లాక్కున్నాడు. అలాగే చాలా మందివి అతని దగ్గర తాకట్లలో నలిగిపోతున్నాయి. పోలీస్ శాఖలో, రాజకీయంగా పై స్థాయిలో పరిచయాలు, పలుకుబడి దండిగా ఉండటంతో గత 30 ఏళ్లుగా ఆ ఊరికి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఉన్నాడు. బలహీనుల మీద దౌర్జన్యం చేయడానికి అతనికి మంది మార్బలం కూడా ఉన్నారు.

ఈ మధ్యనే పంట కూలీల తరుపున నిలబడి ఎదురు తిరిగాడని దళిత యువకుడైన నరసింహపై కక్ష సాధించే ప్రయత్నంలో, ఊరికి దూరంగా, వంకకు దగ్గరగా ఉన్న అతని పెంకుటిల్లును, దాని వెనుకనున్న ఖాళీ స్థలాన్ని నాదంటూ, పాత తనఖా పేపర్లు చూపించి దౌర్జన్యంగా ఆక్రమించుకోబోయాడు. వాస్తవానికి నరసింహ తండ్రి ఎప్పుడో ఆ తనఖా విడిపించుకున్నాడు. కానీ ఆ దౌర్జన్యానికి నరసింహ భయపడలేదు. తన దగ్గరున్న ఆధారాలతో కోర్టులో వాజ్యం వేసాడు. ఇన్నేళ్లలో వీరభద్రంపై కోర్టులో కేసు వేసిన మగాడే లేడు.

వీరభద్రం పట్ల సాటి కుల సంఘంలో కూడా వ్యతిరేకత ఉంది. కానీ, అతని కక్షపూరిత స్వభావానికి భయపడి ఎవరూ ఎదురు చెప్పరు. నిజం చెప్పాలంటే ఊరంతా నరకాసురుడి లాంటి అతడి పీడ విరగడయ్యే రోజు కోసం ఎదురు చూస్తూంది. ఇంతలో అనుకోకుండా ఉత్తమురాలైన ఆయన ధర్మపత్ని కన్నుమూసింది. కొడుకులకు, బంధువులకు వార్త తెలిపేందుకు ఫోన్లు పనిచేయడం లేదు. ఒకవేళ తెలిసినా వారు ఈ పెను వరదలో వచ్చే వీలు లేదు. చేతి కింద పనిచేసే కొందరు అనుచరులు తప్ప, సాయంగా నిలిచే తన వారంటూ ఎవరూ లేని దుస్థితి! ఇంట్లో కీడు జరిగితే పరామర్శకు వేరే కులం వాళ్లు ఒక్కరంటే ఒక్కరైనా రాలేదంటే దానికి కారణం అతని మితిమీరిన కులపిచ్చి!

మరో రెండు గంటల తర్వాత వీరభద్రం కులస్తులంతా సమావేశమయ్యారు.

“మీ అందరికి మా ఇంట్లో పరిస్థితి తెలుసు. నేను ఒక్కడినైపోయాను. ఏమీ తోచడం లేదు, ఏదైనా సలహా చెప్పండి” అన్నాడు వీరభద్రం.

“పెద్దాయనా, నీకు సలహా చెప్పేంతటి వాళ్లమా! నువ్వే ఏదైనా ఆలోచన చేసుంటే చెప్పు. వింటాము” అన్నాడు ఆ సమావేశానికి వచ్చిన ఒకాయన.

“మా అక్క పుణ్యాత్మురాలు! పసుపు కుంకుమలతో పోయినందుకు సంతోషించాలో, చిక్కుల్లో పెట్టినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు” అంటూ వాపోయాడు అతనికి బావమరిది వరసైన ఓ వ్యక్తి.

“నిజమే! మన కులపోళ్ల శ్మశానం నీళ్లలో మునిగిపోయింది. ఇక కాల్చడానికి కాసింత చోటైనా లేని పరిస్థితి! దానికి తోడు తగ్గకుండా కురుస్తున్న ఈ దరిద్రపు వాన!” అన్నాడు, వెంకటేశ్వర్లు.

“దీనికి ఓ పరిష్కార మార్గం ఆలోచించాను. అది చెప్పడానికే మీ అందరిని ఇక్కడ సమావేశపరిచాను” అన్నాడు వీరభద్రం.

“చెప్పు మామా” అన్నాడు వెంకటేశ్వర్లు.

“వేరే గత్యంతరం లేదు కాబట్టి నా ఇంటి ఖాళీ జాగాలోనే దహనం చేస్తామనుకున్నాను” అన్నాడు, అందరి ముఖాల వైపు చూసి.

“మామా ఇదేం పద్ధతి? సంసారాలుండే చోట శవాన్ని కాలుస్తావా? ఏం మేమంతా ఇళ్లలో ఉండాల్నా వద్దా?” అంటూ కాస్త ఆవేశంగా అడిగాడు వెంకటేశ్వర్లు. ఎందుకంటే పక్క ఇల్లు అతనిదే. నిజమేనంటూ అందరూ తలూపారు.

“ఏంరా అది నా స్థలం! నా ఇష్టం! అడ్డు చెప్పడానికి మీరెవరు? ఇరుగు పొరుగనే గౌరవంతోనే మీకు ముందుగా చెప్తున్నాను” అన్నాడు పొగరుగా.

“ఇల్లు నీదే కావొచ్చు. వీధంతా నీది కాదు. కట్టుబాటు ప్రకారం పోయి శ్మశానంలో కాల్చుకో” అన్నాడు ఓ యువకుడు ఆవేశంగా.

“ఏరా బలిసిందా? మీ నాయనే నా ముందు నోరెత్తడు! పిల్ల నాయాలా, ఎముకలిరుగుతాయి జాగ్రత్త” అన్నాడు పటపట పళ్ళు కొరుకుతూ.

“రా చూస్తా, ఏం చేస్తావో!” అంటూ కోపంగా ముందుకు వచ్చాడు. దాంతో నలుగురు వీరభద్రం మనుషులు మీదికి వచ్చారు. ఇంతలో ఆదిశేషయ్య రెండు వర్గాలను వారించి, శాంతింప చేశాడు. ఆయన వీరభద్రానికి చిన్నాయన. ఎనభై యైదేళ్ల వయసున్న ఆయన మాటే వీరభద్రం కాస్తో కూస్తో వింటాడు.

“వీరభద్రా, నేను చెప్పేది కాస్త విను. నువ్వే చెప్పు మనం అడవిలో జంతువులమా? లేక పదిమందిలో బ్రతికే మనుషులమా? సమాజంలో ఉంటూ కట్టుబాట్లు మర్చిపోతే ఎట్లా? అలా పదిళ్లు ఉన్న చోట కాల్చడం, పూడ్చడం సాంప్రదాయం కాదు. అర్థం చేసుకో” అన్నాడు. ఆ మాటలకు వీరభద్రం అందరి వైపు కోపంగా చూస్తూ బుసలు కొట్టాడు.

“ఓ మామా, నా ఇల్లు.. నా ఇష్టమని ఎగిరెగిరి పడ్తాన్నావే! కాల్చడానికి నీ దగ్గర కట్టెలూ, నెయ్యి ఇంట్లో ఉన్నాయా? కనీసం కిరసనాయిల్ అయినా ఉందా?” అంటూ హేళనగా నవ్వాడు వెంకటేశ్వర్లు. ఆ మాటలకు అతడు ఆలోచనలో పడ్డాడు. నిజమే! ఆ సరంజామ అతని దగ్గరే కాదు, అక్కడున్న ఎవరి దగ్గరా లేదు. సమావేశం అలా రసాభాస కావడంతో వచ్చిన వారంతా వెళ్లిపోయారు.

సాటి కులపోళ్లకు ఇబ్బంది పెట్టే పని చేయాలనుకోవడమే కాకుండా, వారిపై దౌర్జన్యానికి దిగడంతో వారందరూ అంత్యక్రియల విషయంలో సహాయం చేయకూడదని మూకుమ్మడిగా నిర్ణయించుకున్నారు. దాదాపుగా ఆయనను వెలి వేసారు.

అధ్యాయం 3

“ఇప్పుడెలా చేస్తావురా వీరభద్ర? మనకు సాయమొచ్చే వారే లేరు!” అంటూ వాపోయాడు ఆదిశేషయ్య. శవం నుండి వస్తున్న దుర్వాసనకు ఆయనతో పాటు వీరభద్రం కూడా తట్టుకోలేకున్నాడు. తన అసహాయతను, తన భార్య దుస్థితిని తలుచుకొని బొటబొట కన్నీళ్లు కార్చాడు. డబ్బు, పరపతి ఉంటే చాలనుకుని వాటిపై యావతో, స్వార్థంతో, ఊర్లో నా అనే వాళ్ళను ఎందరినో కోల్పోయాడు.

“కాల్చేదానికి జాగా లేదు, సరుకులూ లేవు! అంతా ఆయమ్మి ఖర్మ! శవం దగ్గర నలుగురు మనుషులకూ దిక్కు లేదు! ఏం జన్మరా నీది” అంటూ అదిశేషయ్య తిట్టి వెళ్ళిపోయాడు. చివరికి పనివాళ్లు కూడా వాసన భరించలేక జారుకోవడంతో, అంత పెద్ద ఇంట్లో ఇద్దరే మిగిలారు. ఒకరు శవమైన మనిషి, మరొకరు శవం లాంటి మనిషి! ఒకరు కుళ్ళిన పోతున్న దేహంతో! మరొకరు కుళ్ళి పోయిన మనసుతో!

వసారాలో కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చిన వీరభద్రం, కాసేపటికి కళ్ళు తుడుచుకొని, వేరే గత్యంతరం లేక శవాన్ని ప్రవాహంలో వదిలెయ్యాలనుకున్నాడు. అహంకారాన్ని ప్రక్కన పెట్టి, తన అసమర్థతను క్షమించమంటూ భార్య పాదాలకు తల తాకించాడు. ఆమెను అతి కష్టంపైన భుజాన వేసుకున్నాడు. పెద్ద వయసు కావడంతో అంత బరువుతో అడుగు వేయలేక తూలాడు. క్రింద పడబోతున్న అతన్ని ఎవరో గట్టిగా పట్టుకున్నారు. తల త్రిప్పి చూస్తే ఆ వ్యక్తి నరసింహ! అతని వెనుక సాయం చేయడానికి వచ్చిన మరికొందరు.

అధ్యాయం 4

“అయ్యా, కులం పట్టింపు లేదంటే కార్యం నేను జరిపిస్తాను” అన్నాడు నరసింహ. కష్టాలు తీర్చడానికి వచ్చిన ఇంటి ఇలవేల్పులా తన కంటికి నరసింహ కనిపించాడు. సరేనంటూ తలుపుతూ మనస్ఫూర్తిగా నమస్కరించాడు. ఓ మూలనున్న తడిచిన పాత వాసాలతో పాడె కట్టారు. దాన్ని మోస్తూ, వీరభద్రాన్ని వెంటబెట్టుకుని బయలుదేరారు. నేరుగా పోయి నరసింహ ఇంటి దగ్గర నిలిపారు.

వీరభద్రం కన్నేసింది ఆ స్థలాన్నే!

కాల్చడానికి కట్టెలు లేవు. వాడ వాడంతా ఇంటికి ఒకటో, రెండో కట్టె పేడ్లను తమ వంతుగా సాయం చేసారు. అవి వారు ఈ వర్షంలో వంట చెరుకుగా దాచుకున్నవి. బాడుగలకు ట్రాక్టర్‌తో సేద్యం చేసి సంసారం నడుపుకునే నరసింహ, తన ఇంటిలో నుండి ఇరవై లీటర్ల డీజిల్ క్యాన్ పట్టుకొచ్చాడు.

తాను ఏ స్థలాన్నైతే ఆక్రమించి, పేదవాడైన నరసింహ పొట్ట కొట్టాలనుకున్నాడో, అదే స్థలంలోనే తమ సొంత కొడుకులాగా, గొప్ప మనసుతో పేదవాడైనా, అంత్యక్రియలు జరిపించడానికి పూనుకున్నాడు. ఇప్పుడు వీరభద్రానికి తన ఇద్దరు కొడుకుల కన్నా మిన్నగా నరసింహ కనిపించసాగాడు. అతనితోనే కొరివి కూడా పెట్టించాడు.

“కొడకా నరసింహ.. నిన్ను ఇలా పిలుస్తున్నందుకు ఏమీ అనుకోకు. ఇలారా నాయనా” అంటూ కన్నీళ్లతో, మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు. కార్యక్రమం ఎలాగో పూర్తి కావడంతో అందరి కళ్ళలో సంతోషం!

“నా లాంటి ద్రోహికి ఎందుకంత సాయం చేసావు?” అని అడిగాడు, అశ్రు నయనాలతో.

“అయ్యా, నేను గుండెలో ఎదుటి మనిషిని దాచుకోవాలనుకుంటాను. మీరు దోచుకోవాలనుకుంటారు. అదే మన మధ్య గొడవకు కారణమయ్యింది” అన్నాడు.

“నా లాంటి పాపాత్ముడి కోసం నీకున్న ఒక్కగానొక్క స్థలాన్ని వల్లకాడుగా మార్చుకున్నావా!” అంటూ నరసింహ చేతులు పట్టుకొని రోదించాడు.

“మనిషి కంటే స్థలం ఎప్పుడూ ఎక్కువ కాదు! ఇప్పుడు మనుష్యుల్లో స్వార్థం పెరగడంతో దానికి విలువిస్తున్నారంతే” అన్నాడు, విషాదంగా నవ్వుతూ.

“మీరంతా చేసిన సాయానికి రుణమెలా తీర్చుకోవాలో దయచేసి చెప్పండి” అంటూ, వేడుకోలుగా అడిగాడు.

“అయ్యా, మా దృష్టిలో ఊరంటే మనుషులతో అనుబంధం! మీ దృష్టిలో మనుషులతో వ్యాపారం! ఇకనైనా మీలో మార్పొస్తే అదే చాలు” అన్నాడు నరసింహ.

కొద్ది రోజుల తర్వాత మనిషిగా కొత్త జన్మెత్తిన వీరభద్రం, తన దగ్గరున్న తాకట్టు బంగారాన్ని, భూములు ఆయకం పెట్టుకున్నవి, ఆక్రమించుకున్నవి, ఎవరివి వారికి ఇచ్చేసాడు. తన కోసం స్థలాన్ని త్యాగం చేసిన నరసింహకు పదెకరాల భూమిని రాయించాడు. మిగిలిన భూమిని పట్టాలు చేసి ఆ వాడలోని పేదలకు పంచాడు.

ఎంత తాపత్రయపడినా చివరికి కలిసిపోయేది మట్టిలోనే అనే సత్యాన్ని ఆలస్యంగా అర్థం చేసుకొని, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా, వైరాగ్యంతో ఊరొదిలి వెళ్ళిపోయాడు.

(సమాప్తం)

Exit mobile version