[నేపాల్ లోని మనోకామన భగవతి ఆలయం సందర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డా. మజ్జి భారతి.]
మనోకామన భగవతి ఆలయం మన పొరుగునే ఉన్న నేపాల్ దేశంలోని, గోర్ఖాజిల్లాలో, గండకి ప్రోవిన్సులో, మనోకామన గ్రామంలో, సముద్ర మట్టానికి 4200 అడుగుల ఎత్తులో, ఎత్తైన పర్వతాల మధ్యలో ఉంది.
మనో (మన్) కామన అంటే మనసులో కలిగిన ధర్మబద్ధమైన కోర్కెలు – వాటిని తీర్చే అమ్మవారిగా మనోకామనాదేవి పూజలు అందుకుంటారు.
మనోకామన ఆలయం
నేపాలీలు ఎక్కువగా దర్శించే ఆలయమిది. గూర్ఖారాజుల కుల దైవమీమె. ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో నిర్మించారు. అమ్మవారి గురించి ఆసక్తికరమైన కథను చెప్పారిక్కడి గైడ్. 17వ శతాబ్దంలో నేపాలి రాజు, రామ్ షా భార్య భగవతి అవతారమని, ఆ విషయం అక్కడి పూజారి లఖన్ తాపాకు మాత్రమే తెలుసని (అమ్మవారి వాహనం సింహం, లఖన్ తాపా రూపంలో జన్మించిందని చెప్పారు).. గాని ఒకరోజు, రాజు తన భార్యను అమ్మవారి రూపంలో చూసి, వెంటనే మరణించాడని, అతనితో పాటు రాణి సహగమనం చేసిందని.. ఇది జరిగిన కొంత కాలానికి ఒక రైతు తన పొలాన్ని దున్నుతుంటే, నాగలికి తగిలిన రాయి నుండి రక్తం, పాలు కారుతుంటే.. ఆ విషయం తెలుసుకున్న లఖన్ తాపా ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారని కథనం. అందుకే ఇక్కడ లఖన్ తాపా వంశస్తులే పూజార్లుగా ఉంటారు.
ఆలయం దగ్గర వ్యాస రచయిత
ఈ ఆలయాన్ని నేను రెండుసార్లు దర్శించాను. ఏప్రిల్ 2015 లో నేపాల్‌లో వచ్చిన భూకంపం వలన ఆలయం కొద్దిగా దెబ్బతినడంతో, జూన్ 2015 నుండి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు మొదలుపెట్టి, సెప్టెంబర్ 2018కి పూర్తి చేశారు. మేము ఏప్రిల్ 2018లో మొదటిసారి వెళ్ళాం. అప్పుడు, పక్కనే ఉన్న చిన్నషెడ్డులో అమ్మవారినుంచారు. అక్కడ అమ్మవారు పిండి (రాయి) రూపంలో దర్శనమిచ్చారు.
2018 లో నిర్మాణంలో ఉన్న ఆలయం
ఆలయానికి వెళ్లాలంటే నాలుగైదు గంటలు కొండల మధ్యలో జీపులో గాని, లేదా కేబుల్ కారు మీద (పదిహేను నిమిషాలు పడుతుంది) గాని చేరుకోవాలి. మనోకామన కేబుల్ కార్ స్టేషన్, ఖాట్మండు నుండి సుమారుగా 110 కిమీ, పోఖరా నుండి 95 కిమీ దూరముంటుంది. ప్రయాణం ఆసాంతం మనకి పర్వతాల వరుసలు, దూరంగా చూస్తే మంచుతో కప్పబడిన పర్వతాలు దర్శనమిస్తాయి. కేబుల్ కార్ స్టేషనుకు ఒకటి, ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ ప్లేసుంటుంది. అక్కడి నుండి మెట్ల ద్వారా క్రిందకి దిగితే కేబుల్ కార్ పాయింటుకు చేరుకుంటాం. ఆ ప్రదేశాన్నంతా చక్కని పార్కులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ నుండి, లోయలో ప్రవహిస్తున్న త్రిశూల్ నది కనిపిస్తుంది.
త్రిశూల్ నది
1998లో నేపాల్ రాజు దీపేంద్ర వీర్ విక్రమ్ షా 2.8 కిలోమీటర్ల పొడవైన రోప్ వే (కేబుల్ కారు) ను నిర్మించారు. కురింతర్ అనే ప్రాంతంలో కేబుల్ కార్ స్టేషనుంది. మన ఇండియన్ కరెన్సీని ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు.
కేబుల్ కార్ స్టేషన్
కేబుల్ కార్ టైమింగ్స్ 8am – 5pm. మధ్యలో 12pm- 1.30pm బ్రేక్. చాలా పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. 15 కేజీల వరకు లగేజీ అలో చేస్తారు. పెద్దవాళ్ళకి 670 రూపాయలు, చిన్నవాళ్ళకి 400 రూపాయలు రానూ, పోనూ టికెట్టు. క్యూలైన్లను స్ట్రిక్టుగా మెయింటైన్ చేస్తారు. కేబుల్ కారును చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. పొరపాటున విద్యుత్తులో అంతరాయమేర్పడినా, ప్రత్యామ్నాయ మార్గాలతో నడిచేలా దానిని రూపొందించారు. అందుకని ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. కేబుల్ కార్ గ్రౌండ్ స్టేషన్లో, తినేందుకు సదుపాయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో జంతుబలిని అనుమతించడంతో, జంతువులను తీసుకువెళ్లడానికి కార్గో కేబుల్ కార్లు కూడా ఉన్నాయి.
కేబుల్ కార్ నుండి వ్యూ
త్రోవ పొడవునా ఎత్తైన పర్వతాలను దాటుకుంటూ వెళ్తుంది కేబుల్ కార్. ప్రయాణం చేస్తున్నప్పుడు అమ్మయ్య వచ్చేసామనుకునేలాగా, ఇంకొక పర్వతమొస్తుంది. పర్వతాలెంత ఎత్తులో, ఎంత నిటారుగా ఉంటాయంటే, పైకి చూస్తుంటే భయమేస్తుంది. కేబుల్ కారు ఇక్కడాగిపోతే పరిస్థితేమిటన్న ఊహ మనసులోకొస్తే, శరీరంలో వణుకు పుడుతుంది. గాని, మన చుట్టూ ఉన్న అందాలను ఆస్వాదిస్తుంటే మాత్రం, వావ్ అనిపిస్తుంది. క్రిందనెక్కడో త్రిశూల్ నది చిన్న గీతలా కనిపిస్తుంది. మధ్య మధ్యలో చిన్న గ్రామాలు. కొండలపైన టెర్రస్ ఫార్మింగ్ చేస్తున్నారు. అలా 15 నిమిషాల పాటు ప్రయాణం చేస్తే, కేబుల్ కారు ఆగే ప్రదేశమొస్తుంది. ఇక్కడ కూడా క్యూలైన్లు ఉన్నాయి. క్యూలైన్లను చక్కగా పాటిస్తారు నేపాలీలు. వారి దగ్గర మనం ఆ విషయాన్ని నేర్చుకోవాలి. కేబుల్ కార్ స్టేషన్ చుట్టూ పార్కు, కొద్ది ముందుకెళ్తే వ్యూ పాయింట్. అక్కడనుండి క్రిందకి చూస్తే ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది.
అక్కడనుండి నడుచుకుంటూ సుమారు కిలోమీటర్ ముందుకెళ్తే (కొన్నిచోట్ల మెట్లున్నాయి), మనోకామన ఆలయమొస్తుంది. మార్గమధ్యంలో మనకి రెస్టారెంట్లు, బొమ్మలు, పూజ సామాన్లమ్మే షాపులు, లాడ్జిలు, అక్కడున్న వారి నివాస గృహాలుంటాయి. షాపు యజమానులు యాత్రికుల్ని వారి షాపుల్లో కొనమని మనల్ని ఆహ్వానిస్తూ ఉంటారు.
నేవారి నిర్మాణశైలిలో ఉన్న రెండంతస్తుల పగోడా అమ్మవారి ఆలయం. క్రింద ఇటుకతో, పైభాగం చెక్కతో నిర్మించబడింది. పైకప్పుపై చెక్కతో నవదుర్గలను చెక్కారు. పగోడాల పైభాగం, బంగారు తాపడం చేయబడి దూరం నుండి మనల్ని ఆకట్టుకుంటుంది. ఆలయం ముందు, ఎత్తైన ధ్వజస్తంభం, అక్కడ ఎత్తులో నిలబెట్టిన బంగారు తాపడం చేయబడిన సింహం కనిపిస్తుంది. ఆలయం చుట్టూ విశాలంగా ప్రదక్షిణకు అనువుగా ఉంటుంది. ఆలయ సమీపంలో కూడా వ్యూ పాయింట్ ఉంది. ఈ ఆలయంలో జంతుబలులను అనుమతిస్తున్నారు. ఆలయానికి ఒక ప్రక్కనున్న, మెట్లెక్కి పైకెళ్తే, అష్టమాతృకల ఉపాలయాలు ఉంటాయి. అక్కడెక్కువగా సిద్ధులు, తాంత్రికులు ఉపాసన చేస్తుంటారు.
దసరా ఉత్సవాలను, నాగపంచమిని వైభవంగా జరుపుతారిక్కడ. నేపాలీలకు శనివారం సెలవు కావడంతో, ఆ రోజు భక్తులతో రద్దీగా ఉంటుంది. పూజాసామాగ్రి ఉన్న బుట్టలో – సింధూర్, కేసరి, ఎరుపురంగు వస్త్రం, ఆకు చెక్క, గాజులు ఉంటాయి. మనం ఆలయానికి వెళ్లే మార్గంలో, సామాన్లు కొనమని మనల్ని పిలుస్తారక్కడి వ్యాపారులు. కొండపైన పెద్ద గ్రామమే ఉంది. మేము మొదటిసారి వెళ్లినప్పటికి, రెండవసారి వెళ్ళినప్పటికీ భక్తులకు సౌకర్యాలు మెరుగవ్వడం గమనించాం. ఆలయం వెలుపల దీపారాధన చేసుకునే వీలుంది.
ఆలయం నుండి వ్యూ పాయింట్
ఆలయం వెనుక భాగాన ఉండే వ్యూ పాయింట్ నుండి చూస్తే, క్రింద లోయ, చుట్టూ వరుస వరుసలుగా వృక్షాలతో కప్పబడిన పర్వతాలు, ఇంకా దూరంగా మంచుతో కప్పబడిన పర్వతాలు, పర్వతాలను ముద్దాడుతున్న మేఘాలు, నీలి ఆకాశం.. వర్ణచిత్రాన్ని చూస్తున్న అనుభూతినిస్తుంది. సాయంకాలమైతే సూర్యాస్తమయ రంగులు అద్భుతంగా కనిపిస్తాయి.
మొదటిసారి నేపాల్ టూర్‌లో భాగంగా వెళ్తే, రెండవసారి కైలాస మానస సరోవర్ టూర్‌లో భాగంగా వెళ్ళాం. రెండుసార్లూ, కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం నిర్వాహకులు శివానంద ప్రభువుతో వెళ్లడం జరిగింది. మొదటిసారి బస్సులో వెళ్తే, రెండవసారి టాక్సీ బుక్ చేసుకుని వెళ్లాం. త్రోవ పొడవునా కొండలు, లోయలు ఉండడంతో రోడ్డు సౌకర్యం ఎంత బాగున్నా, కొండ చరియలు విరిగిపడే ప్రమాదముండడంతో, కొన్ని కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ స్తంభించే సమస్యను దృష్టిలో పెట్టుకోవాలి. వాహనదారులంతా ట్రాఫిక్ రూల్సును చాలా నిబద్ధతతో పాటించడం మెచ్చుకోవాల్సిన విషయం. ట్రాఫిక్ క్లియరయినంత వరకు చాలా ఓపికతో వేచి చూస్తారిక్కడి ప్రజలు. మేము రెండు సార్లు వెళ్లినప్పుడు కూడా, రోడ్డు బ్లాక్ అయ్యి, గంటలు రోడ్డుమీదే వేచి ఉండాల్సిన పరిస్థితి కలిగింది. యాత్రికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
మనసులో కోరుకున్న కోర్కెలు తీర్చే, మనోకామనాదేవి దర్శనం మనల్ని అలౌకిక ఆనందానికి గురి చేస్తుందంటే అది అబద్ధం కాదు. అంత ఎత్తులో ఉన్న, అమ్మవారిని దర్శనం చేసుకున్నామన్న భావన, మనల్ని పులకాంకితుల్ని చేస్తుంది. ఒక సాహస యాత్ర చేశామన్న భావనను కూడా మిగులుస్తుంది. నేపాలీలకు అతి ముఖ్యమైన దర్శనీయ స్థలం కాబట్టి, అంత ఎత్తులో ఉన్నా కూడా భక్తులెప్పుడూ ఉంటారు. నేపాల్ వెళ్తే మాత్రం మనోకామన ఆలయాన్ని దర్శించడం మాత్రం మరవద్దు. అమ్మవారి దర్శనాన్ని చేసుకుని, ఎన్నో అనుభూతులను మూట కట్టుకొని, పునర్దర్శన భాగ్యాన్ని ఆకాంక్షిస్తూ, తిరుగు ప్రయాణమయ్యాం.

