[ఇటీవల ప్రముఖ కవి, కథకులు, అనువాదకులు శ్రీ కల్లూరు జానకిరామరావు వెలువరించిన ‘మంకుతిమ్మన కగ్గ’ అనే పుస్తకానికి కొల్లూరి సోమ శంకర్ వ్రాసిన ముందుమాటను పుస్తక పరిచయంగా అందిస్తున్నాము. – సంచిక టీమ్.]
కన్నడ సాహిత్యంలో డివిజిగా పేరుపొందిన శ్రీ దేవనహళ్లి వేంకటరమణయ్య గుండప్ప ఋషితుల్యులు. వారు రచించిన గ్రంథాలలో ‘మంకుతిమ్మన కగ్గ’ (1943) ముఖ్యమైనది. తిమ్మన అనే పాత్ర ద్వారా డివిజి అమాయకంగా అనిపించే ప్రశ్నలు అడిగించి, విశ్వం యొక్క మూలం నుండి – జీవితానికి అర్థం, నైతికత, సౌందర్యాల అర్థాలు, దేవుడంటే ఎవరు, అంతిమ సత్యం ఏది వంటి వాటి వరకు పలు జటిలమైన అంశాలను అన్వేషిస్తారు. ఈ రచన లోతైనది, కవితాత్మకమైనది, తరతరాలుగా సమతుల్యమైన జీవితాన్ని గడపడానికి మార్గనిర్దేశం చేస్తోంది.
ఇందులో జీవితం గురించి చెప్పే సరళమైన నాలుగు పాదాల కగ్గలు ఉన్నాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి మొదలైన వాటి గురించి అరటిపండు ఒలిచిపెట్టినంత సులువుగా చెప్తుందీ పుస్తకం. ఈ కగ్గలలోని సందేశం చాలా శక్తివంతమైనది కాబట్టి దీనిని ‘కన్నడ భగవద్గీత’గా పరిగణిస్తారు.
ఇది నడతని దిద్దుకోమనే సామాన్యుడి గీత. రాత మార్చుకోమనే హృద్గీత. ఆప్తమిత్రుడిచ్చే సలహాలాంటి సుబోధ! జీవన సాగరంలో పెద్దల మార్గదర్శనం లాంటి చుక్కాని! బతుకుబాటలో నడిపే గురువు.
ఈ కగ్గలు సామాన్యులకు, ఆధ్యాత్మిక సాధకులకు ఎలా ఉపకరిస్తాయో చూద్దాం.
***
వ్యక్తిగత మేలు:
వ్యక్తులుగా మనం మనల్ని మార్చుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తాయి కొన్ని కగ్గలు. ఎలా నడుచుకుంటే మన జీవితం ఏ అడ్డంకులు లేకుండా సాగిపోతుందో కొన్ని కగ్గలు చెబుతాయి. కొన్ని కగ్గలు మంచిని చెబుతాయి, జీవన పద్ధతులని మార్చుకుని, మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని చెబుతాయి. ఉదాహరణ 14, 25, 123, 175, 195, 208, 224 కగ్గలు. జీవితంతో విసిగిపోకూడనీ, కష్టమో నష్టమో – బ్రతుకుని కొనసాగించాలని చెప్తాయి 249, 258, 263 కగ్గలు. తన అంతటివాడు లేడని విర్రవీగకూడదని, బలం చూసుకుని మిడిసిపడకూడదని 316 కగ్గ చెబుతుంది. కష్ట కాలం తాత్కాలికమేననీ, మంచి కాలం మళ్ళీ త్వరలోనే వస్తుందనే ఆశాభావాన్ని నింపుతుంది 422 కగ్గ.
~
మెరుగైన సంఘజీవనం:
మనిషిలో ఎన్నో జంతువులున్నాయనీ, వాటిని శమింపజేసి, పశుస్థాయి నుంచి విశ్వనరుడి స్థాయికి ఎదగాలని సూచిస్తారు డివిజి (కగ్గ 197). అప్పుడే మెరుగైన సంఘజీవనం సాధ్యమవుతుంది. కగ్గ 200 కడుపుమంటలు ఎంత ప్రమాదమో చెప్తుంది, అసూయా ద్వేషాలు వదుల్చుకోవాలని, అందరూ అసూయాద్వేషాలను పరిహరిస్తే, సమాజం మెరుగవుతుందనే సూచన ఉందీ కగ్గలో. అందరి కోసం ఒకడు, ఒకరి కోసం అందరూ ఎలా నిలవాలో కగ్గ 270 చెబుతుంది.
~
ప్రాపంచిక నడవడి:
ఈ భూమిపై మానవుల జీవనం సక్రమంగా సాగాలంటే, ప్రకృతి పరిరక్షణ ఎంతో అవసరం. ఎక్కడో ఓ దేశంలో చేసిన పొరపాటు మరో దేశానికి ముప్పుగా పరిణమించవచ్చు. అందుకే విశ్వవ్యాప్తంగా ప్రకృతిని గౌరవించాలి. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే, ఎటువంటి సమస్యలు ఉండవు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం గురించి 239, 248 కగ్గలు గొప్పగా చెబుతాయి.
~
భాషా సొబగులు:
కొన్ని కగ్గలలో చక్కని తెలుగు పదాలను వాడారు అనువాదకులు. ఉదాహరణకి 120 లో పగిది (విధము, రీతి), 215లో ఛలము (నెపము, మిష), 231 లో వెరగు (ఆశ్చర్యము), 232లో తక్రము మొదలైనవి.
వాడుకలో లేని పదాలను ఉపయోగించడం ద్వారా కగ్గలకి సొబగుని కల్పించటమే కాకుండా ఆయా పదాలను నేటి తరంవారు గ్రహించి, ఉపయోగించేలా ప్రేరేపించారు కల్లూరు జానకిరామరావు గారు.
~
ఆధ్యాత్మిక అవగాహన:
నిజానికి ఈ కగ్గల నిండా ఉన్నది ఆధ్యాత్మికతే. మొదటే చెప్పుకున్నట్టు ఈ కగ్గలు ఆత్మాన్వేషణకి ప్రేరేపిస్తాయి. దైవమంటే ఏమిటి? పరమాత్మ ఉనికి, ఆత్మ పరమాత్మల భేదం తదితర అంశాలు అనేక కగ్గలలో చర్చించారు డివిజి. ఉదాహరణకి 107, 142. 204 కగ్గలను చెప్పుకోవచ్చు. కోరికలెంత ప్రమాదమో కగ్గ 371 హృద్యంగా చెప్తుంది.
***
లోతుగా ఆలోచిస్తే, మంకుతిమ్మ అంటే ఎవరో కాదు, మనలోని అజ్ఞానమే. అర్థం చేసుకుని, సాధన చేస్తే ఈ కగ్గలు గురువులై, అజ్ఞానాన్ని తొలగిస్తాయి. అజ్ఞానం తొలగిపోతే మిగిలేది జ్ఞానం. కానీ మనిషి మనీషిగా మారడానికి ఇది మాత్రమే సరిపోదు. అజ్ఞానం తొలగిన మందుడు జిజ్ఞాసువై – జ్ఞానం నుంచి విజ్ఞానం వైపు, విజ్ఞానం నుంచి సుజ్ఞానం వైపు, సుజ్ఞానం నుంచి ప్రజ్ఞానం వైపు సాగాలి!
ఈ పదాలన్నిటికీ అర్థం ఒకటే కద అని అనిపించవచ్చు. కానీ పూర్తిగా కాదు, పెద్దలు, పండితులు చెప్పిన ప్రకారం జ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం – పదాలలో సూక్ష్మభేదాలున్నాయి. దేనిమీదైనా విషయ పరిజ్ఞానం కలగడం జ్ఞానం. మనకు తెలిసిన విషయం గురించి మరింత పరిశీలన చేసి దాని మంచిచెడులు తెలుసుకున్నప్పుడు అది విజ్ఞానం. మనకు తెలిసిన విషయాలపై పరిశోధన చేసి, సంపూర్ణంగా అవగాహన చేసుకుని, అనుభవంలోకి తెచ్చుకోవడం సుజ్ఞానం. మనం పొందిన అనుభవాన్ని హృదిలో సుస్థిరం చేసుకుని, క్రమంగా ఆ అనుభవమే మనంగా మారడం ప్రజ్ఞానం. తికమకగా అనిపించినా – శ్రద్ధతో అనుశీలన చేస్తే ఈ పదాలలోని subtleties అవగతమవుతాయి. ఆధ్యాత్మిక బాటలో నడిచేవారికి, సమర్థులైన గురువులకి సంపూర్ణ శరణాగతి చేసినవారికి వారికి ఈ ప్రక్రియలన్నీ సులభసాధ్యాలవుతాయి.
ఈ కగ్గలు పాఠకులని ఆలోచింప చేస్తాయి. ఆసక్తి కల్గిన పాఠకులను సాధకులుగా మారుస్తాయి, ప్రజ్ఞానం దిశగా నడుపుతాయి!
గొప్ప పుస్తకాన్ని పాఠకులకు అందించిన మూల రచయితకి, అనువాదకులకు ప్రణామాలు!
***
కన్నడ మూలం: దేవనహళ్లి వేంకటరమణయ్య గుండప్ప (డివిజి)
తెలుగు అనువాదం: కల్లూరు జానకిరామరావు
ప్రచురణ: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం, అనంతపురం జిల్లా.
పేజీలు: xxvi+84
వెల: ₹ 150/-
ప్రతులకు:
కల్లూరు జానకిరామరావు,
నెం. 307, ఎ బ్లాక్,
దీపిక పాలెస్, ఎల్.జి. ఎన్‍క్లేవ్,
నంజప్ప సర్కిల్
విద్యారణ్య (పోస్టు)
బెంగుళూరు. 560097
ఫోన్: 97408 49084
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
