Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనో సంయమన స్థితి

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘మనో సంయమన స్థితి’ అనే రచనని అందిస్తున్నాము.]

మనోనిగ్రహం అంటే చంచలమైన మనస్సును ఎటువంటి ఆటంకాలు లేదా అశాంతి కలిగించని స్థిరమైన ప్రదేశంలో నిలిపి ఉంచడం. ఇది అంతరంగ శాంతి మరియు సమాధి (నిశ్చలమైన స్థితి) పొందడానికి పునాదిగా చెప్పబడుతుంది. మన మనస్సును అదుపులో ఉంచుకోవడం, తద్వారా మన ప్రవర్తనను నియంత్రించడం ఈ ఉన్నత ప్రక్రియలో ముఖ్య భాగాలు.

మనసు సహజంగానే కోతి లాగా చంచలంగా కదులుతూ ఉంటుంది. ఒక విషయంపై స్థిరంగా నిలవకుండా, నిరంతరం ఆలోచనల మధ్య పరిగెడుతూంటుంది. ఇటువంటి చలనాన్ని ఆపి, మనసును కేవలం ఒకే విషయంపై స్థిరంగా నిలిపి ఉంచడమే నిజమైన మనోనిగ్రహం. మనసును ఇంద్రియాల వశం కాకుండా కాపాడుకోవాలి. నిబద్ధత, సత్సాంగత్యంతో దాన్ని అదుపులో పెట్టుకోవాలి.

మనోనిగ్రహాన్ని కేవలం ఒక రోజులో సాధించలేము; దీన్ని నిరంతర అభ్యాసం మరియు అకుంఠిత ధైర్యంతో మాత్రమే సాధించగలం.

ఈ విధంగా మనోనిగ్రహం సాధించిన వారు స్వార్థ భావాలను వదిలి, తమ వ్యక్తిగత పరిమితులను అధిగమించి, ఆత్మిక మహత్తరానికి చేరుకుంటారు. ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, సమగ్రమైన ఆధ్యాత్మిక వికాసానికి మార్గం చూపుతుంది.

ప్రతీరోజు కొంత సమయం నిర్ధిష్టంగా దైవ చింతనకు కేటాయించడం ఎంతో అవసరం. దైవ చింతన వలన మనసులో ఆందోళనలు తొలిగి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కోరకలనే గుర్రాలు మనస్సును అతలాకుతలం చేస్తున్నప్పుడు దైవ చింతన మనోనిగ్రహానికి తోడ్పడుతుంది. ఇందుకు సంబంధించిన ఒక అద్భుతమైన శ్లోకం భగవద్గీతలో వుంది

“నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా।
నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్॥”
(భగవద్గీత 2-66)

శాంతి అందుకోలేకపోయేవాడికి, బుద్ధి యుక్తి లేని వారు, ఆలోచనలు చేయలేరు. శాంతి లేకపోయినవారి ఆనందం మట్టుకు పోతుంది. అంటే మనశ్శాంతి కోసం మనోనిగ్రహం అత్యంత ముఖ్యమైందని పై శ్లోకం భావం.

మరొక శ్లోకం:

“అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్‌।
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే॥”
(ధ్యాన యోగము-35)

అంటే ‘మనసు నిస్సందేహంగా చంచలమైనదే! నిగ్రహించడానికి కష్టసాధ్యమే అయినా అభ్యాస వైరాగ్యాలతో దాన్ని సులభంగా నిగ్రహించవచ్చు’ అని అర్జునుడికి ఉపదేశించాడు శ్రీకృష్ణ భగవానుడు. మనోనిగ్రహాన్ని సాధించడానికి సులభమైన మార్గం భక్తిపథంలో నడవడమే అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు.

మహాభారతంలో విదురుడు మనోనిగ్రహం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ, అది మహా దుర్లభం అయినప్పటికీ, ప్రతి ఒక్కరికీ అత్యవసరం అని నొక్కి చెప్పాడు. స్వార్థం, అహం, అసూయ వంటి చెడు గుణాలే కాకుండా, పరోపకార బుద్ధి, త్యాగం వంటి మంచి గుణాలు కూడా వ్యక్తిని నిగ్రహం కోల్పోయేలా చేస్తాయి. చెడు గుణాల వల్ల ఇతరులకు నష్టం కలిగితే, మంచి గుణాల వల్ల మనమే మోసపోయే ప్రమాదం ఉంది.

అందుకే, మనిషి ఏ సమయంలోనైనా మానసిక నిగ్రహం కలిగి ఉండాలి. స్వార్థ ప్రలోభాలకు, అమాయకత్వానికి లోను కాకుండా, సముచితమైన దానినే ఆచరించాలి. ఇతరుల స్వార్థానికి మనం ఉపయోగపడకుండా అప్రమత్తులై ఉండాలి. నిగ్రహం అలవరచుకున్నవారు పొరపాట్లు చేయరు. అట్టివారి జీవితం ఎటువంటి ఒడిదొడుకులకు లోను కాకుండా సాఫీగా సాగుతుంది.

ఇక పతంజలి యోగ సూత్రాలలో (యోగ సూత్రం 3.1)  ‘దేశబంధశ్చిత్తస్య ధారణా’ అని వుంది. అంటే ధ్యానం అనగా మనసును ఏకదృష్టితో ఏదో ఒక వస్తువుపై నిలిపి ఉంచడం లేదా అటు కేంద్రీకరించడం చేయాలి. మనశ్శాంతి కోసం, మన మాటలు, ఆలోచనలు, భావాలు ఒక చోట స్థిరపడి ఉండాలి. ఇది సాధనతో సాధ్యమవుతుంది. దాన్ని శాస్త్రీయ పరిభాషలో ‘ధారణా’ అంటారు. దీని వలనే మనో నిగ్రహం అలవడుతుంది.

మనోనిగ్రహం అలవడేందుకు నిరంతర సాధన అవసరం. సమయం కుదిరినప్పుడల్లా భనలు పాడడం, నామ జపం,సగ్ద్రంధ పఠనం లేహ ధ్యానం చేయడం మంచిది. ఈ రకమైన సాధన మనలను క్రమక్రమంగా సాధన మెట్లను అధిరోహించేలా చేస్తుంది. వివేక వైరాగ్యాలు అలవడతాయి. అప్పుడు భగవంతుని దర్శించాలన్న తీవ్ర తపన ఏర్పడి జీవితకాలమంతా భగవత్ సేవకే వినియోగించాలన్న ఆసక్తి కలుగుతుంది.

Exit mobile version