[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘మనోభావాల దర్పణం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మనోభావాలకు అక్షర దర్పణం ఉత్తరం
కన్నీళ్లు కష్టాలు సుఖదుఃఖాల మేలుకలయిక
దూరానఉన్న మనుషులను మనసులను
చేరువులో చేర్చి చూపించేది ఉత్తరం.
ఒకనాటి ఉత్తరాలే మహాకావ్యాలయ్యాయి
వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే జ్ఞానబోధకాలయ్యాయి
మనసులను సేదతీర్చే ఓదార్పులవుతాయి.
చీకటిలో వెలుగును పంచే కరదీపికలు
సందేశాన్నిచ్చే కాంతిరేఖలు లేఖలు
మనోభావాలకు వెలిబుచ్చే భావసంపద
కాకీచొక్కా కాకీప్యాంటు వేసుకొని
చిన్న సంచి చంకన పెట్టుకున్న
తపాలా బంట్రోతు కోసం ఒకనాడు
పదహారేళ్ల ప్రాయపు కన్నెపిల్లల నుండి
పది పదులు దాటిన ముదుసలుల వరకు
కళ్ళల్లో ఒత్తులేసుకుని నిరీక్షించేవారు.
ఒకరివి కన్నెమనస్సు కలలు
మరొకరివి కన్నకడుపు తీపి గురుతులు
ఉద్యోగానుమతి లేఖ చేతికందుకునేదాకా
నిరుద్యోగులకు ఆశలను పెంచేవి
ఇంద్రజాలికుడు తీసే మాయావస్తువులాగా
ఎవరి చేతికి ఏ సమయాన ఏమిస్తాడో
ఆశలు ఆవేశాలు ఆనందాలు కలలు
సుఖదుఃఖాల మూటలను మోసుకొస్తాడు.
అందుకునే దాకా అందరికీ
తెలియని ఆతృత అంతులేని ఆరాటం
ఆపుకోలేని ఆ నిరీక్షణలో ఆనందమున్నది
తీయని జ్ఞాపకాల గుర్తులే ఉత్తరాలు
నేటి ఆధునిక సాంకేతికత మూలంగా
పొడిఅక్షరాల రూపాన రూపుదిద్దుకుని
యస్.యం.యస్., ఈ-మెయిల్ లాగా
రూపాంతరం చెంది ఆ ఆనందమంతా
క్షణకాలంలో మాయం అయిపోతాయి.
చిరకాలం దాచుకోవాల్సిన జ్ఞాపకాలే ఉత్తరాలు
మంచిచెడులను ముందు తరాలకు
అందించే కరదీపికలు లేఖలు
మనిషి మేధస్సుకు మారు రూపమైన
లేఖా సంపద కనుమరుగవకుండా కాపాడుకుందాం
మన సంస్కృతిని భావితరాలకు అందిద్దాం
మన భాషాసంస్కృతిని భావసంపదను
కలకాలం నిలిచేలా పాటుపడదాం.
