నిశ్శబ్ద తరంగాలలో
ఉబికి వస్తున్న
అవినీతి బుడగలతో
క్షీరదాలన్నీ కలుషితమై
మనోమృగాల హస్తగతమవుతున్నాయి!
ఆకలి కేకల ఆరాటంలో
పచ్చని చేలు
విషపూరితాలై కాలుష్యపు
మంత్రాలేవో జల్లుతూ
పొరలు పొరలుగా
పుత్తడిని తొలుస్తూ
భూ బకాసురుల
నోటిలో
కబ్జాల వశీకరణమవుతున్నాయి!
పురోగమనంలో
తిరోగమించే
తిమింగలాలకు
విలువల వలువలు
ఆహారమై
సమాజాన్ని అపస్మారకంలోకి
నెట్టేస్తున్నాయి!
మన నిర్లిప్తతను
నిద్దుర బంతిలోకి
విసిరేసి
మనోనేత్రాలతో
మనుగడ కోసం
రేపటి తరానికి
నవ జీవన సంద్రానికి
ఆటుపోటుల సమరంలో
అవినీతి సంహారక క్షేత్రంలో
అజ్ఞాన విపత్తులను
సంహరించే
పాంచజన్యపు
పార్శ్వాన్ని
ప్రాంగణాలన్నీ
పిక్కటిల్లెలా
వివస్వంతుడై
విసర్జించాలి!!
విశ్వవ్యాప్తమయ్యేలా
విశృంఖల ఖడ్గాన్ని చేత పట్టాలి!!