[మౌనశ్రీ మల్లిక్ గారి ‘మంటల స్నానం’, ‘చలన కాంక్ష’ అనే కవితాసంపుటులని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
మౌనశ్రీ మల్లిక్ కవిగా, సినీ గేయరచయితగా ప్రసిద్ధులు. ఇటీవల ఆయన తన నాల్గవ ఐదవ కవితాసంపుటులను వెలువరించారు. ‘మంటల స్నానం’ వారి నాల్గవ కవితాసంపుటి, ‘చలన కాంక్ష’ ఐదవది.
“మౌనశ్రీ కవిత్వంలో భావుకత, మానవత, దేశియత ముప్పేటలుగా అల్లుకొని కనిపిస్తాయి. శైలి సరళ సుందరంగా ఉంటూనే గాంభీర్యాన్ని సంతరించుకుంటుంది” అని ‘మంటల స్నానం’ సంపుటికి వ్రాసిన ముందుమాటలో ఆచార్య ఎన్. గోపి వ్యాఖ్యానించారు.
~
కవిత్వం తన ఒంటరితనాన్ని ఓదార్చిందని అంటారు మౌనశ్రీ మల్లిక్.
‘మంటల స్నానం’ సంపుటిలో 81 కవితలున్నాయి. ఇందులో ఉద్వేగాల కవితలున్నాయి, ఆగ్రహ ప్రకటనా కవితలున్నాయి. భావుకత నిండిన కవితలున్నాయి. మనిషిగా మిగలమనే హృద్యమైన కవితలున్నాయి.
‘జీవలక్షణం’ కవితలో తన తండ్రిని తలచుకుంటారు. తమ కోసం ఆయనెంతలా శ్రమించారో చెప్తారు. ఆయన ఎంత చలనశీలియంటే, ఆయన సేద తీరే కుర్చీ కూడా ముందుకు వెనక్కి కదిలేదని అంటారు. బిడ్డలు సంపాదనాపరులు కాగానే తనువులు చాలించే తండ్రులను తలచుకుని బాధపడతారు. ఆర్ద్రమైన కవిత. ఓ అంతర్జాతీయ పోటీలో ప్రథమ బహుమతి పొందింది.
కళ్ళజోడుని ఇంట్లో మరచిపోతే ఇబ్బందులు తప్పవు. కానీ ‘కళ్లజోడు’ అనే కవితలో కళ్ళద్దాలు మరచిన ప్రతిసారీ, బ్రతుకు విలువ తెలుస్తుందనీ, ముగింపు వైపు సాగుతున్న అడుగుల సవ్వడి మనసుకు వినిపిస్తుందని అన్నారు కవి.
ప్రపంచమంతటా ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. శాంతికాముకులు యుద్ధాలు వద్దంటారు. కానీ ఈ కవి మాత్రం యుద్ధం చేయాల్సిందేనంటున్నారు. దేని మీద చేయాలో ‘యుద్ధం జరగాల్సిందే..!’ కవిత చెబుతుంది. చెయ్యాల్సిన, యుద్ధం, గెలవాల్సిన యుద్ధం అది!
“మాటే కదా/నీ వ్యక్తిత్వ జెండాను/ఎగరేసే గెలుపు సూత్రం” అని అంటారు ‘మాట’ కవితలో. చిన్న చిన్న పదాలలో గొప్ప సందేశాన్ని ఇముడ్చుకున్న కవిత ఇది.
చిన్నప్పుడు ఎప్పుడైనా జాతరలో తప్పిపోయారా? అప్పటి ఆ బెంగ గుర్తుందా? ఒకవేళ మర్చిపోయుంటే, ‘బెంగ’ అనే కవిత జ్ఞాపకం చేస్తుంది. “మనల్ని మనం చూడకపోతే/మనతో మనం మాట్లాడకపోతే” ఆ బెంగ కలుగుతుందట! ఎంత చక్కని అభివ్యక్తి కదా!
ఈ సంపుటిలోని మరొ రెండు చక్కని కవితలు ‘పాత అద్దె ఇల్లు’, ‘మనసులో దీపం’. ఈ కవితల్లోనివి కవి వైయక్తిక అనుభూతులే అయినా సమహృదయులని సైతం రంజింపజేస్తాయి, పురాస్మృతులలోకి నడుపుతాయి.
భర్త మనసులోని అలజడిని భార్య ఎలా తొలగిస్తుందో చెప్పిన ‘కరణేషు మంత్రి’ కవితలో చాలామంది తమని తాము చూసుకుంటారు. భార్యని మించిన నేస్తం మరొకరుండరు అనిపిస్తుంది – “ఎలా కనిపెడుతుందో/నా అనురాగ గంగ/సడిలేని అడుగులతో వచ్చి/తన కౌగిలి కవచాన్ని/రక్షణగా తొడుగుతుంది” ఈ వాక్యాలు చదివాక.
స్పందించే గుణం ఉండాలే కాని, ప్రకృతిలోని దేని నుంచైనా నేర్చుకోవచ్చని చెప్తారు ‘ఈక’ కవితలో. జడత్వాన్ని వదిలించుకుని, సాకులు మానుకుని జీవితాన్ని చైతన్యవంతం చేసుకోమంటుంది.
‘జాలి పాట’ కవితలో, మనిషిని చెట్టుని పోల్చి, మనిషెందుకు నవ్వులపాలవుతున్నాడో చెప్పిన తీరులో సముచిత పరిశీలన ఉంది.
వివేకానికీ అవివేకానికీ మధ్య తేడాని రెండే వాక్యాలలో చెప్పినప్పటికీ, రాటుదేలిన జీవితానుభావల సారమది. ‘మనోవర్ణం’ మంచి కవితగా నిలుస్తుంది.
‘నేను నేలను’ అనే కవితలో కవి భూమిగా మారుతాడు, ఒక్కో రకం నేలలో తన స్వభావాన్ని చాటుతాడు. విధ్వంసం కన్నా వికసించడమే ఇష్టమని ప్రకటిస్తాడు.
పుస్తకానికి మకుటంగా నిలిచిన ‘మంటల స్నానం’ సందేశాత్మకమైన కవిత. ఈ కవిత ఎప్పుడో చదువుకున్న “Fire represents a transformative force that is essential for development and progress. It symbolizes passion, purification, illumination, inspiration” అన్న వాక్యాలు గుర్తొచ్చాయి.
♡♡♡
‘చలన కాంక్ష’ సంపుటిలో 62 కవితలున్నాయి.
“ప్రకృతిలోకి ప్రవేశించి/పరవశించడం నేర్చాకా/మహా కావాల్యను/చదవాల్సిన పనేముంది?” అని ప్రశ్నిస్తారు ‘మననం’ కవితలో.
‘కిందకు’ గొప్ప ప్రతీకాత్మకమైన కవిత. మెట్లని ప్రతీకగా నిలిపి మన ఎదుగుదలకి తోడ్పడినవాళ్ళను గుర్తుచేసుకోమంటారు. “In poetry, stairs are a powerful and versatile metaphor symbolizing life’s journey, personal growth, social hierarchy, and the transition between different states of being. They represent the effort required for progress and the different perspectives gained along the way.”
కరోనా కాలపు కాలినడకల వ్యథని అంతే పెయిన్‍ఫుల్‌గా వ్యక్తీకరించింది ‘పాదగీత’ కవిత! గుండె తడిని నిలుపుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తుందీ కవిత.
కొడుకుని హాస్టల్‍లో వదిలి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తండ్రికి కలిగే బాధని ‘ఉద్విగ్నం’ కవిత ప్రదర్శిస్తుంది. అసలైన కవిత్వం అంటే ఏమిటో ‘కవిత్వం’ అనే కవిత చెబుతుంది.
“ధనానికి దగ్గరై/మనుషులకు దూరమయ్యాను” అంటూ ఆంతరిక అన్వేషణను వెల్లడిస్తుంది ‘పరివ్రాజక పరాగం’ కవిత.
‘నిజరూప దర్శనం’ మనలోకి మనల్ని చూసుకోమనే కవిత. “నువ్వెన్ని అత్తరులు చల్లుకుంటే ఏం లాభం? చెమట విలువ తెలియనప్పుడు” అనే వాక్యాలు అక్షర లక్షలు.
‘సత్యం ఏంటంటే..’ కవిత చదువుతూంటే అప్రయత్నంగా శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ పుస్తకంలోని ‘ఆః!’ కవిత గుర్తొస్తుంది.
“అప్పుడప్పుడు../ఓడిపోతూ ఉండు/జీవితం తాలూకు/విలువలు తెలుస్తాయి” అంటారు ‘ప్రబోధం’ కవితలో. “Why don’t we see what good failure can do to us,/It teaches you how to lift yourself,/When there is no hand offered to help lift you up” అంటూ Sujona Chatterjee వ్రాసిన ‘The Beauty of Failure’ కవిత స్ఫురించింది మౌనశ్రీ గారి ఈ కవిత చదివాక.
~
ఈ రెండు పుస్తకాలలో భార్యల మీద చక్కని కవితలున్నాయి. ‘ఇల్లాలి పాదాలు’, ‘కరణేషు మంత్రి’, ‘నీతో సెల్ఫీ’, ‘రాత్రి జావళి’, ‘దిగులు జ్వరం’, ‘ఒకే ఆలాపన’, ‘చలికాలం గొడవ’, ‘కందర్ప జ్వరం’; ‘ఓ పగటి పూట’, ‘ఓ ప్రభాత సమయాన’, ‘నేత్రపర్వం’ వంటి కవితలు భార్యని ప్రేమించేవారి మనసుని చాటుతాయి. “నాకు భార్య పాత్ర మీద కవితలు రాయడం చాలా ఇష్టం” అని మౌనశ్రీ మల్లిక్ సంచిక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎందుకన్నారో ఈ కవితలు చదివితే అర్థమవుతుంది.
***
రచన: మౌనశ్రీ మల్లిక్
ప్రచురణ: సృజన స్వప్నం, హైదరాబాద్
పేజీలు: 108
వెల: ₹ 100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
మౌనశ్రీ మల్లిక్. ఫోన్: 8919338546
♣
రచన: మౌనశ్రీ మల్లిక్
ప్రచురణ: సృజన స్వప్నం, హైదరాబాద్
పేజీలు: 108
వెల: ₹ 100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
మౌనశ్రీ మల్లిక్. ఫోన్: 8919338546
~
మౌనశ్రీ మల్లిక్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-mounasri-mallik/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
