Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రమదాక్షరి, డా. మంథా భానుమతి గారి మినీ నవలల పోటీ విజేతలు, నవలల పరిచయాలు

ప్రమదాక్షరి, డా. మంథా భానుమతి గారి సంయుక్త నిర్వహణలో తెలుగు మినీ నవలల పోటి, 2026 విజేతలు వీరే..

***

గెలుపొందిన నవలలపై న్యాయనిర్ణేతల అభిప్రాయాలు.

న్యాయ నిర్ణేత శ్రీ పెయ్యేటి రంగారావు గారికి, సహకరించిన శ్రీమతి జ్యోతి వలబోజు గారికి కృతజ్ఞతలు.

1. కర్కాటకం:

నవలకు పెట్టిన పేరు సముచితంగా ఉంది. ఎంతో సామాజిక ప్రయోజనాలున్న కథాంశం. క్యాన్సర్ గురించి ఎక్కడా సుదీర్ఘమైన ఉపన్యాసాలు లేవు. అవసరమైన పాత్రలు ప్రవేశ పెట్టి, ఎక్కడా లాగుడు లేకుండా, విసుగు కలగనివ్వకుండా కథను నడిపిన తీరు చాలా బాగుంది.

2. అమ్మెవరు?:

నవలలో ప్రథానమైనవన్నీ మంచితనం మూర్తీభవించిన పాత్రలు. పనిమనిషిని తక్కువగా చూడని దంపతులు, ఆమె కూతురిని తమ ఖర్చుతో చదివించడం, ఆ దంపతులకు సంతానం లేకపోతే పనిమనిషి కూతురు సరోగసీ ద్వారా వారికి సంతానప్రాప్తి కలిగించడం, కథ చక్కగా నడిపారు. కథాంశం, కథను నడిపిన తీరు బాగున్నాయి. కథలో పాత్రల చిత్రణ బాగుంది.

3. భద్ర:

సామాజిక ప్రయోజనాలున్న కథాంశం. చేనేత కార్మికుల కష్టాలు హృదయాలకు హత్తుకునేలా చూపించారు. నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టిన బాలిక, ఆత్మవిశ్వాసంతో, స్వయంకృషితో కీర్తి శిఖరాలను అధిరోహించడం, తమ తోటి చేనేత కార్మికులకు భుక్తి కల్పించడం, వారి జీవన ప్రమాణాలు మెరుగు పరచడం బాగుంది. కథను నడిపిన తీరు, పాత్రల చిత్రణ చాలా బాగుంది.

4. గెలుపు పిలుపు వినిపిస్తుంది:

కథను ప్రారంభించిన విధానం, నడిపిన తీరు ఆసక్తికరంగా ఉన్నాయి. దివ్యాంగులు ఎదుర్కొనే దైనందిన సమస్యలు విపులంగా, వివరంగా చిత్రీకరించారు. శైలి చాలా బాగుంది. సమస్యలకు పరిష్కారాలను కూడా చక్కగా చెప్పారు. ఎంతో సామాజిక ప్రయోజనాలున్న కథాంశం.

5. సంగీతారాధ్య:

సంగీతం ప్రధానాంశంగా ఉన్న కథ. నాదోపాసన చేసిన సరస్వత్యం, శివాంశ సంభూతులైన వివాహిత స్త్రీలకు భర్తల నుండి, సాటి కళాకారుల నుండి ఎదురయ్యే హృదయ విదారకమైన సమస్యలను బాగా చిత్రీకరించారు. సమాజంలో ఎంతో పేరున్న గాయనీమణులకు కూడా ఇటువంటి సమస్యలు ఎదురవడం అందరికీ తెలిసిందే. నవల ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. ముగింపు బాగుంది.

6. పల్లె పిలిచింది:

అగ్రహారానికి చెందిన యువకుడు తన కుటుంబ వృత్తి మాని ఇంగ్లీషు చదువులు చదవడానికి చూపించిన ఆసక్తి, అతని ధ్యేయం నెరవేర్చుకోవడానికి ఇంట్లో వచ్చిన వ్యతిరేకత, కుటుంబ సభ్యుల మానసిక సంఘర్షణ బాగా చూపించారు. తండ్రి మాట కాదని విదేశాలకు వెళ్లడం, వర్ణాంతర వివాహం చేసుకోవడం.. అన్నీ ఆధునిక సమాజంలో జరుగుతున్న సంఘటనలే. మనవడికి వేదం మీద, వైదిక ఆచారాల మీద కలిగిన ఆసక్తి ప్రోత్సహిస్తూ వెనక్కి తిరిగి వచ్చిన కొడుకును చూసి, అతని లాగా తన కొడుకుకు అతను కోరుకున్న చదువుకు ప్రోత్సాహం ఇవ్వలేక పోయిన తండ్రి విచారించి కొడుకుని ఆదరిస్తాడు.

7. మా తోటి అడివి నవ్వింది:

నిండు గర్భిణీగా ఉన్న అక్కకు తోడుగా వెళ్ళిన చెల్లెల్ని బావా, అతని స్నేహితులు కల్సి రేప్ చేయటం; ఆ రేప్‌కి గురయిన అమ్మాయ్ ఆ ట్రామాలోంచి బయటకు వచ్చి పెళ్ళి చేసుకుని పిల్లాడ్ని కనటం తన బ్రతుకు తను బ్రతకాలనుకున్నా, ఆ బావా, అతని తల్లీ వేధించటం; ఆ అమ్మాయ్, ఆమె తల్లీ, అత్తా కల్సి విలన్స్ ముగ్గుర్నీ చంపటం! ఇదే అన్ని చోట్లా పరిష్కారం అనుకోలేం. అనుకోకూడదు కూడా!

మంచి ఉత్కంఠతతో సాగింది. సినిమా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. చెయ్యి తిరిగిన సినీ రచయిత కదా? కథనం చదివింపచేస్తుంది.

***

రచయితల పరిచయం:

1. ప్రథమ బహుమతి – ‘కర్కాటకం’. రచన కె. రామ్ మోహనరావు.. 9849345060

రచనా వ్యాసంగం 2015 నుంచి ప్రారంభం అయింది. మొదటి కథ ‘చిరునామా చేరని ఉత్తరం’ స్వాతి మాసపత్రిక లో ప్రచురించబడింది. అదే ఏడాది ఒక కథకు మూడో బహుమతిగా రంజనీ అవార్డ్, 2016 లో ‘డాక్టర్ సాబ్’ కథకు స్వాతి వారపత్రిక పోటీలో 10 వేల రూపాయల బహుమతి, తర్వాత సుకథ కథల పోటీలో మొదటి బహుమతి 15000 రూపాయలు, ఆ తర్వాత రమ్యభారతి కథల పోటీలో ప్రథమ బహుమతి… ఇలా అనేక బహుమతులు లభించడమే కాక స్వాతి, ఈనాడు ఆదివారం అనుబంధం లో అనేక కథలు ప్రచురించబడ్డాయి. ఇప్పటివరకు 110 కి పైగా కథలు వివిధ ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి.

2024లో నా కథ ‘Women’s Era’ అనే ప్రముఖ ఇంగ్లీష్ మేగజైన్ లో పబ్లిష్ అయినది.

నా నవల ‘ఎదురు లేని ఏడు’ కు ఆన్వీక్షికి సంస్థ ద్వారా 10 వేల రూపాయల బహుమతి లభించింది.

నా కథలు రెండు కన్నడంలో కి అనువాదం అయ్యాయి. వీటితో పాటు ఈనాడు లో ప్రచురితమైన ఏడు కథలు, బహుమతుల కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చాయి.

నా విద్యార్హతలు – MSc, M.Phil.. Anakapalle AMAL. కాలేజీలో కెమిస్ట్రీ HOD గా 2011లో రిటైర్ అయినా స్థానిక డా. హిమశేఖర్ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫేకల్టీ గా పనిచేస్తూ, ఇప్పటివరకు కెమిస్ట్రీ పరిజ్ఞానం తో 251 కేన్సర్ అవగాహన సదస్సులు నిర్వహించాను. ఆ అవగాహన విస్తృత పరచడానికి కర్కాటకం నవల రాసాను.

3 ఏళ్ల క్రితం అనకాపల్లి తెలుగు భాషా పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 135 కార్యక్రమాలు చేసాను.

2. ద్వితీయ బహుమతి – ‘అమ్మెవరు’. తోట సుభ్రహ్మణ్యం –99088 93669

ప్రచురితమైన మొదటి కథ ‘ఆటా’ లో ఎంపికైన ‘మూడు లేఖలు’ అనే కథ. (2005లో ఆంధ్రభూమి దినపత్రిక). మొదటి కవిత ‘వానపాములు మిన్న!’ (ఆంధ్రభూమి దినపత్రిక). మొదటి వ్యాసం, ‘రిజర్వేషన్లతో సమస్య సమసిపోతుందా!’ (నా డిగ్రీ అయిన తర్వాత 1993-94 కాలంలో రిజిస్ట్రేషన్ వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రభ దినపత్రిక). కరోనాకు ముందు ‘వార్త’ ఎడిటోరియల్ పేజీలో పదికి పైనే నా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 2022, జనవరి 26న ‘విలువలెందుకు?’ అనే నా 20 కథల సంపుటి ఆవిష్కరణ జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సలీం గారు, గంటి భానుమతి గారు ముందు మాటలు రాశారు. నా పూర్తి పేరు తోట వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు, కలం పేరు తోట సుబ్రహ్మణ్యం. స్వగ్రామం కోనసీమలోని మురమళ్ళ గ్రామం. తల్లిదండ్రులు తోట రామకృష్ణారావు, సత్యవతి. భార్య భారత స్వరాజ్యలక్ష్మి. నాకు ఇద్దరు కుమారులు. నేను మా ఊర్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఓ ప్రైవేట్ స్కూల్‌ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాను.

3. తృతీయ బహుమతులు-

1. ‘భద్ర’. మీనాక్షి శ్రీనివాస్ – Ph. 9492837332, 9110723232

స్వస్థలం కాకినాడ. జననీ, జనకులు… కీ.శే శ్రీమతి మహీధర వేంకట దుర్గాంబ, కీ.శే శ్రీ మహీధర వేంకటరామ దీక్షితులు.

జీవితభాగస్వామి శ్రీయుతులు శ్రీనివాస్. ఇద్దరు కుమారులు, కోడళ్ళు, మనుమరాలు, మనుమడు.

కథల ప్రయోజనం సమాజపరంగా, ఉన్నత విలువలతో కూడిన వ్యక్తిత్వం పెంపొందించేవిగా ఉండాలన్నదే నా నమ్మకం, ఆశ. ఆంధ్ర బ్యాంక్ (యూనియన్ బ్యాంక్) విశ్రాంత అధికారిణిని. విశాఖ రేడియో కేంద్రంలో, డ్రామా ఆర్టిస్ట్ గా ఎంపికయి, కొన్నేళ్ళపాటు కొనసాగి, బదిలీల కారణంగా విరమించడం జరిగింది. ఏడు రేడియో నాటికలు, సుమారు 330 పైగా కథలు అన్ని పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్నింటికి బహుమతులు వచ్చాయి. 22 కథల సంపుటి ‘నిశీథిలో నక్షత్రం’ అక్టోబర్ 2016 లో వెలువడింది. నా రచనలు కొన్ని కథానిలయంలో (కోడ్ 2295) చోటు కల్పించిన కారా మాష్టారికి నా నివాళి.

మరచిపోలేని అనుభూతి, 03 ఏప్రిల్ 2024 న లేఖినీ సంస్థవారు, డాక్టర్ వాసా ప్రభావతి గారి పేరిట, వారి అమ్మాయి జఠావల్లభుల మీనాక్షిగారిచే పొందిన మాతృవందన పురస్కారం.

ఇప్పటికి 19 నవలలు చతుర, ఆంధ్రభూమి, స్వాతి మొదలగు పత్రికలలో ప్రచురితం అయ్యాయి. వీటిలో ఐదు అపరాధ పరిశోధక నవలలు. బహుమతి పొందిన ‘భద్ర’ నా తొలి మినీ నవల (20).

రెండవ సంపుటి తపస్వీ మనోహరం కథల పోటీలో విజేతగా, బహుమతి కథలు ఏడింటితో బాటు నా కథలు మరో పద్దెనిమిది కలిపి ‘బహుమతి’ 2024 నవంబర్ లో ప్రచురించడం జరిగింది.

వారు నా అపరాధ పరిశోధక నవల ‘రామాపురం బంగ్లా’ డిసెంబర్ 2025 లో ప్రచురించారు.

పద్యరచనలో ఓనమాలు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి గారు, శ్రీ గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారి వద్ద దిద్దాను. క్లుప్తంగా ఇది నా సాహితీ ప్రస్థానం.

2. ‘గెలుపు పిలుపు వినిపిస్తుంది’. డా. చెళ్లపిళ్ల సూర్యలక్ష్మి – 94451 84363

2015లో శ్రీ రాజేష్ యాళ్ల స్ఫూర్తితో తెలుగు భాషలో మొదలైన నా సాహితీ ప్రస్థానంలో ఎనభై కథలు, ఈ నవల కాకుండా “అపజయాలు కలిగిన చోటే…”, “మార్పు మన(సు)తోనే మొదలు,” అనే రెండు నవలలు ప్రచురింపబడ్డాయి.

సమాజానికి ఉన్నత విలువలుండే సాహిత్యాన్ని అందించడం కోసమే నేను రచనలు చేస్తాను. ఆఖరికి నేను హాస్య కథ వ్రాసినా సరే, దానిలో ఒక విలువ పొంచి ఉంటుంది. నా రచనలలో స్త్రీకి ఉన్నతమైన స్థానం, తనదంటూ ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటాయి. నా కథలు ‘చినుకు’, ‘ఆంధ్ర భూమి’, ‘నవ్య’, ‘స్వాతి’, ‘నెలవంక-నెమలీక’, ‘చైతన్య మానవి’ వంటి అచ్చు పత్రికలలోనూ, ‘మాలిక’, ‘గో తెలుగు డాట్ కాం’. ‘తెలుగు తల్లి కెనడా’, ‘కౌముది’, ‘సహరి’, ‘సంచిక’ వంటి వెబ్ పత్రికలలోనూ ప్రచురింపబడ్డాయి. కొన్ని కథలు, “అపజయాలు కలిగిన చోటే..” ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం ద్వారా ప్రసారమయ్యాయి.

4. చతుర్థ బహుమతులు –

1. ‘సంగీతారాధ్య’. శ్రీపతి లలిత – 94408 29441

స్వస్థలం హైదరాబాద్. శ్రీవారు శ్రీపతి కృష్ణమూర్తిగారు. నేను ఆంధ్రాబ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పదవీ విరమణ చేశాను.

నా సాహితీ ప్రయాణం,అరవై ఏళ్ళ వయసులో మొదలు పెట్టి, శ్రీపతి లలిత పేరుతో కథా రచన మొదలుపెట్టి, సుమారు వంద కథలపైనే వ్రాసాను.

ఈనాడు ఆదివారం అనుబంధం లో ఇప్పటివరకు ఏడు కథలు ప్రచురించడం, నాకు గుర్తింపునిచ్చింది.

ఫేస్ బుక్ గ్రూప్ లో, వార్త, తరుణి, సహరి, రవళి, సంచిక, మన తెలుగు కథలు, సుమతి,తెలుగుతల్లి కెనడా పత్రికల వంటి అనేక అంతర్జాల పత్రికలలో నా కథలు వచ్చాయి. ఇరవై అయిదు కి పైగా కథలకు బహుమతులు వచ్చాయి.

నేను రాసిన చాలా కథలు వేరు, వేరు యూట్యూబ్ ఛానల్ లో కూడా చదివారు.

సంగీతారాధ్య నా మొదటి నవల. నా మొదటి ప్రయత్నంలో బహుమతి పొందడం చాలా ఆనందంగా ఉంది🙏🏻

2. ‘పల్లె పిలిచింది’. సుధాలక్ష్మి చిట్టా

స్వస్థలం హైదరాబాద్. ప్రస్తుతం ఉండేది బెంగళూరు.

2019 లో నేను కథలు రాయడం మొదలు పెట్టాను. నా మొదటి కథ ‘నకిలీ మనిషి’. 2020లో నా మొదటి ధారావాహిక ‘విధి’ 45 భాగాలు రాసి ఫేస్బుక్ లో సాహితీ సమూహాల్లో పోస్ట్ చేసాను. చాలా మందిని ఆ నవల ఆకట్టుకుంది. అప్పటి నుంచి కథలు ధారావాహికలు వ్రాస్తున్నాను.

2023లో వ్రాసిన ‘ఆనందమయి’, 2025లో రాసిన ‘అందం’ ధారావాహికలు చాలామందిని ఆకట్టుకున్నాయి. 2021లో భావుక సమూహం నిర్వహించిన ఆరు వారాల కథల పోటీలో నేను రాసిన ‘దత్తత’ అనే ధారావాహికకు బహుమతి లభించింది. 2025 లో అదే సమూహం నిర్వహించిన గొలుసు నవలా ప్రక్రియ లో పాలు పంచుకుని, 25 మంది రచయితలతో కలిసి నేనూ ఒక భాగం వ్రాయడం జరిగింది.

ఇప్పటివరకు నేను 15 దాకా కథలు, 7 ధారావాహికలు వ్రాశాను. నా కథలు రవళి అంతర్జాల మాసపత్రిలోనూ, తెలుగుతల్లి కెనడా అంతర్జాల పత్రికలోనూ, లీడర్ పత్రికలోనూ ప్రచురణకు నోచుకున్నాయి. నేను వ్రాసిన కొన్ని కథలు, ధారావాహికలు వివిధ చానల్స్ ద్వారా ఆడియో కథలుగా వచ్చాయి.

ప్రమదాక్షరి, శ్రీమతి మంథా భానుమతి గారు సంయుక్తంగా నిర్వహించిన మినీ నవల పోటీలో నా మినీ నవల ‘పల్లె పిలిచింది’ కి ప్రోత్సాహక బహుమతి లభించడం చాలా ఆనందదాయకం గా ఉంది. పోటీ నిర్వాహకులకు పెద్దలకు నా ధన్యవాదాలు.

3. ‘మా తోటి అడవి నవ్వింది’. డాక్టర్ ప్రభాకర్ జైనీ.

అసిస్టెంట్ కమీషనర్, కమర్షియల్ టాక్సెస్ (రి)

‘నంది’, ‘గద్దర్’, ‘కీర్తి పురస్కార’, ‘ఇండియన్ అచీవర్ అవార్డుల’ గ్రహీత

దర్శకుడు, నవలా రచయిత.

పబ్లిష్ అయిన నవలలు.. 1. లక్ష్యం 2. చోర్ బజార్ 3. గమ్యం 4. రూపాయలొస్తున్నాయ్ జాగ్రత్త! 5. నా సినిమా సెన్సార్ అయిపోయిందోచ్! 6. I GOT ‘U’. 7. సినీవాలి

~

ఈ నవలలు త్వరలో సంచికలో ప్రచురితమవుతాయి.

Exit mobile version