Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనుషుల్ని చదివే మనసు

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘మనుషుల్ని చదివే మనసు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నాకు మనుషులంటే చచ్చేంత ఇష్టం
నవ్వేవాళ్లు నిశ్శబ్దంగా వెళ్లిపోయేవాళ్లు
చివరి అంకం దగ్గర ఆగిపోయిన వాళ్లు కూడా
ప్రతి మనిషీ నా చేతిలోకి వచ్చిన
ఒక చిన్న పుస్తకం లాంటి వాడు
అందులో కొన్ని పేజీలు చిరునవ్వులతో
మరి కొన్ని కారని కన్నీళ్లతో నిండినవి

నేను ప్రయాణం చేస్తున్నప్పుడు
ఎవరో మెట్రోలో నా పక్కన కూర్చుని
ఫోన్‌లో ప్రపంచాన్ని చూస్తుంటారు

ఇంకెవరో ఫుట్‌పాత్ మీద
తమ ప్రపంచాన్నే మోస్తుంటారు
మరింకేవరో హై అంటారు
ఇంకొకరు ‘నేను బాగున్నాను’ అంటారు
ఆ మాట వెనుక మోస్తున్న ఎంత పెద్ద
భారం ఉందో వాళ్లకే తెలుసు
నేను వాళ్ల జీవితాల్లో కొంతసేపు మాత్రమే ఉంటాను
అయినా వాళ్ల మాటల్లోంచి ఒక వాక్యం
వాళ్ల నిశ్శబ్దంలోంచి ఒక కవిత
వాళ్ల నవ్వులోంచి ఒక వెలుగు తీసుకుని
అట్లా వచ్చేస్తాను
కానీ మనిషిని అర్థం చేసుకోవడం అంటే
అతని కథ వినడమే కాదు
ఒక్కసారి అతని చెప్పుల్లో
మన పాదాలను పెట్టి చూడాలి
అతని భయంతో ఒక రాత్రి మేలుకోవాలి
అతని ఆశతో ఒక ఉదయం లేవాలి
అప్పుడే తెలుస్తుంది –
ప్రతి మనిషీ తనతో తాను
ఒక కనిపించని యుద్ధం చేస్తూనే
మన ముందుకొచ్చే ఒక చిరునవ్వు అని
మనం అందరం ఒకరికి ఒకరం
పూర్తిగా తెలియని వాళ్లమే
అయినా ఒక చిన్న పలకరింపు
ఒక క్షణం వినడం ఒక నిజమైన చిరునవ్వు
మన మధ్య ఉన్న ఆ తెలియని దూరాన్ని
కొంచెం తగ్గిస్తుంది
అంతే కదా
మనిషిగా ఉండటం అంటే
ఇంకొకరి జీవితంలో
కొంచెమైనా కలిసిపోవడం
వాళ్ళ దుఃఖంలో కరిగిపోవడం
మిగిలిపోవడం.

Exit mobile version