Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరణ వస్త్రం

[శ్రీ కంచరాన భుజంగరావు రచించిన ‘మరణ వస్త్రం’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

చిదుగులైపోయే అంగవస్త్రం మార్చి
కొత్త బట్టలు వేసుకోగలం గానీ
పాడుబడిపోయే దేహవస్త్రాన్ని
ఏ అవతార్ ల్యాబ్ లోకి చేర్చినా
బ్యాక్ టు ఫ్యాక్టరీ సెట్టింగ్స్
మార్పిడి చేసుకోగలమా?

చిలకెగిరిపోయిన శిథిల గూటిని
ఏ సమాధి మెరకలోనో
వొళ్లకాటి బీడులోనో
భద్రపరుచుకోకపోతే
కంకాళాల కోటలా మిగిలే భూమికి
కాపలా ఉండేదెవరూ..?

ఆఖరు శ్వాస విడిచిన తరువాత
నిసర్గ వాయువుల్లోకి
ఊపిరి ఉనికిని మలుపుకొని తీరాలి
పురమెత్తిన తరువాత
గడప మూల ఫోటో ముందు వెలిగే
నిశ్చల దీపపు నిశ్శబ్ద ఉద్వేగంలోకి
ఉనికి రాహిత్యం ఉడిగిపోవాలి

వత్తులై వెలిగే తనువులన్నీ
ఏ మంటి చమురును శ్వాసిస్తుంటాయో
ఏ మొక్కల నాడుల్లో జీవిస్తుంటాయో
ఏ కుమ్మరి సారెల మీద
కుండలై రూపుదిద్దుకుంటాయో
అక్కడ కూడా ఆ స్థావరం
శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి
ఇంకో కొత్త స్థావరం ఎక్కడో వెదుక్కోవాలి

ఎక్కడైతే అసువులు
బుగ్గి పోగులై మిగులుతాయో
ఆ పొలిమేరల వెలుపలే
కట్టుకథలూ.. కలవరింతలూ..
ఇంకేవేవో పలవరింతలూనూ..!
మట్టి పరుపులో పవళించినోళ్ళకు
మహిమలూ మంత్రాలు పట్టనే పట్టవు

ఆరడుగుల నేలమంచంలో
నిశ్చింతగా నిదురించినోళ్ళు
ఏడుకట్ల సవ్వారి ఎక్కినోళ్ళు
భస్మసింహాసనంపై రాచరికం ఏలినోళ్ళు
అక్కడెంత ప్రశాంతంగా కనుమరుగౌతారో..

అందుకే అగ్నిస్నానం చేసినోళ్ళు
మంటి గోతిలో మునిగినోళ్ళు
మింటి చుక్కలై వెలుగుతుంటారు
ఆ పెద్దనిద్ర నుండి ఎన్ని యుగాలైనా
ఏ ఒక్కరూ తిరిగి లేచిరారు

అసలు మరణ వస్త్రమన్నది కప్పకపోతే
ఏ దేహానికైనా నిర్మలమైన నిద్ర,
ఏ ప్రాణానికైనా బంధ విముక్తపు హాయి
ఎప్పుడు దొరుకుతాయి..!

Exit mobile version