[శ్రీ పాణ్యం దత్తశర్మ వ్రాసిన ‘మరణం మధురం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]
“అహంకార విమూఢేషు
సత్సుపాపాను వర్తుషు
లాభపూజార్థయత్నేషు
కృష్ణ ఏవ గతిర్మమ”
శ్రీ వల్లభాచార్యులచే రచించబడిన ‘శ్రీ కృష్ణాశ్రయ స్తోత్రం’ లోని ఈ శ్లోకాన్ని శ్రావ్యంగా చదువుతూ, అర్చన చేయించుకున్న భక్తలందరికీ శఠగోప స్పర్శ చేయించారు కేశవాచార్యులు, శ్రీవేణుగోపాల స్వామి వారి ఆలయ పూజారి.
తుంగభద్రానదీ తీరం. మంత్రాలయం నుంచి మంద్రమంద్రంగా ప్రవహిస్తూ, జోగుళాంబా దేవి పాదస్పర్శ కోసం వెళుతూ ఉన్నది తుంగభద్రా మాత.
సమయం పది గంటలు దాటుతూ ఉంది. ముఖమంటంపం లోనే ఒక స్తంభాన్ని ఆనుకొని కూర్చొని, ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించే డి.యస్.సి పరీక్షకు తయారవుతున్నాడు వనమాలి.
“నాయనా! వనమా! ఇంటికి వెళ్లి స్వామివారికి ఆరగింపు సేవ కోసం నైవేద్యం తెస్తాను. అంతవరకు గుడి చూచుకో” అని పిలిచారు కేశవాచార్యులు కొడుకును.
డి.యస్.సి ప్రశ్నలనిధిని మూసి, గరుత్మంతుని కంచు విగ్రహం ఉన్న పీఠం మీద పెట్టాడు వనమాలి.
“ఇదిగో, వస్తున్నా నాన్నా” అన్నాడు. గుడిలో ఒక మూల కొయ్యకు తగిలించిన ఎరుపురంగు ధోవతి ధరించాడు. అనాచ్ఛాదితమైన అతని తెల్లని వక్షం, బాహువులు, యవ్వన శోభతో మెరిసిపోతున్నాయి. కొడుకును అపురూపంగా చూచుకున్నారు కేశవాచార్యులు.
“తండ్రీ! వేణుగోపాలా! ఈ సారైనా వీడికి ప్రభుత్వ ఉపాధ్యాయుని ఉద్యోగం లభించేలా అనుగ్రహించు మాధవా!” అని మొక్కుకున్నాడాయన మనసులో.
వనమాలి గర్భగుడి లోనికి వెళ్లాడు. శ్రీకృష్ణపరమాత్మ విగ్రహం కుడికాలిపై ఎడమకాలును తీసుకొని కూర్చొని ఉన్న భంగిమలో ఉంది. దీపారాధనల వెలుగుతో నల్లని ఆ అపురూప శిల్పం ప్రకాశిస్తూ ఉంది. స్వామివారి మెడలోని తులసిమాలలను, పూలమాలలను సర్దాడు వనమాలి. ‘స్వామిని ఎంత సేపు చూసినా తనివి తీరదు. అందుకే ఆయనను జగన్మోహనుడన్నారు’ అనుకున్నాడు భక్తితో.
కాటమరెడ్డి, ఆయన భార్య శేషారత్నమ్మ గుడి లోకి వచ్చారు.
“అయ్యవారు! ఈ రోజు మా పాప పుట్టినరోజు. అర్చన చేయాల” అన్నాడు రెడ్డి.
“పాప బాగుందా రెడ్డి గారూ! విజయవాడ శ్రీచైతన్యలో కదూ చదివేది? కనీసం పుట్టిన రోజుకైనా ఇంటికి పంపలేదా వాండ్లు?” అన్నాడు వనమాలి.
“అదేదో అయ్యయిటి సదువంట అయ్యవారు. సెలవుల్లో గూడ పంపించరు. తోముతున్నారు పిల్లను” అన్నది తల్లి. ఆమె గొంతులో విచారం కంటే గర్వమే ఎక్కువగా ధ్వనించింది.
వారి చేతుల్లో నుండి ప్లాస్టిక్ కవరును అందుకొన్నాడు.
“ఈ టెంకాయ బయట కొట్టుకొని రాండి” అని చెప్పి, మిగతా పూజాద్రవ్యాలు తీసుకొని “పాప పేరు?, గోత్రం?” అని అడిగాడు.
“భారతి అయ్యవారు. ‘చెలగంటి’ గోత్రం.”
వారితో సంకల్పం చెప్పించి, అర్చన చేయసాగాడు. సాధారణంగా అర్చకులు 108 నామాలను పూర్తిగా చదవరు. కొన్నే చదువుతారు.
“అట్లా చేస్తే మన వృత్తికి, ఆ భగవంతునికి ద్రోహం చేసినట్లే నాయనా” అంటాడు తండ్రి.
అర్చన జరుగుతుండగా ఆలయంలో ఒక తటిల్లత మెరిసింది. ఆ తటిల్లత పేరు విభావరి. కాటమరెడ్డి దంపతులు తీర్థప్రసాదాలు తీసుకోని వెళ్లేంతవరకు ఒక పక్కగా నిలబడింది.
ఆ అమ్మాయి వైపు పరిశీలనగా చూశాడు వనమాలి. అప్రయత్నంగా మనసులో అనుకున్నాడు – ‘ఎంత ముగ్ధమనోహరంగా ఉందీ పిల్ల!’.
“రండి! చెప్పండి! అర్చన చేయమంటారా?” అనడిగాడు. అతని గొంతులో సభ్యత – అతని మోములో సంస్కారం ఉట్టిపడుతు ఉండడం గమనించింది విభావరి.
“అవునండి! మా నాన్నగారి పేర” అని చెప్పింది. “నాగభూషణశర్మ, మంగళగౌరి, ‘భారద్వాజస’ గోత్రం.”
అతడు పూజ చేసే విధానం ఆమెకు నచ్చింది. ఉచ్చారణ స్పష్టంగా ఉంది. గొంతు కూడ శ్రావ్యంగా ఉంది.
పూజ ముగిసింది. హరతి, తీర్థప్రసాదాలు, శఠగోప స్పర్శ పూర్తయ్యాయి.
“వెళ్లొస్తానండి. స్వామివారికి పూజ చక్కగా చేయించారు” అన్నదామె.
ఆమె విశాలనేత్రాలు ప్రశంసతో మరింత విచ్చుకున్నాయి.
“కనులు కావవి వెన్నెల గనులు” అన్న ఎవరో కవి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వనమాలికి. తేరుకుని..
“అంతా మా నాన్నగారి శిక్షణ అండీ!” అన్నాడు వినయంగా. వినయం అతని చక్కదనాన్ని మరింత శోభింప చేసింది.
ఆమెతో బాటు గుడి బయటికి నడిచాడు అనుకోకుండానే. ఎందుకో ఆమె సమక్షంలో ఇంకా ఉండాలని అతని మనసు కోరుకొంటోంది. గుడి బయట మెట్లకు ఆనుకుని ఉన్న గట్టు మీద ఆమె కాసేపు కూర్చుంది. కొంచెం దూరంగా అతడూ కూర్చున్నాడు.
“మీరు.. ఈ ఊర్లో ఎప్పుడూ చూడలేదు?” అన్నాడు. అతని గొంతులో కుతూహలం. “ఎవరింటికి వచ్చారు?”
“ఎలిమెంటరీ స్కూలు హెడ్ మాస్టర్, పద్మనాభ రావు గారు మా పెదనాన్నగారేనండి. వారింటికే వచ్చాము నిన్న” అన్నది విభావరి.
“వారు మా గురువుగారండి, ఐదో క్లాసు వరకు. మీరెక్కడ ఉంటారు?”
“మేము మా నాన్నగారి ఉద్యోగ రీత్యా రాయచూరులో ఉంటామండి. నాన్న అక్కడ రైల్వేస్‌లో పని చేస్తారు. ట్రాక్ ఇన్‍స్పెక్టర్. ఇంతకు ముందు పి.డబ్ల్యు.ఐ. అని అనేవారు.”
“అంటే?”
“పర్మనెంట్ వే ఇన్‍స్పెక్టర్. ఇప్పుడు ‘ట్రాక్ ఇన్‍స్పెక్టర్’ అని మార్చారండి. త్వరలో ‘అసిస్టెంట్ ఇంజనీర్’ అని అంటారట” అన్నది నవ్వుతూ. నవ్వినప్పుడు తీరైన ఆమె పలువరస తళుక్కుమంది.
‘సుపక్వదాడిమీబీజ రదనాయై నమో నమః’ అన్న లలితాదేవి నామం గుర్తొచ్చింది వనమాలికి.
“అలాగా, ‘ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి’ అన్నట్లు, పేరు ఏదైనా, పని అదే కదా” అన్నాడు చనువుగా. తర్వాత, తాను కొంచెం హద్దు మీరాడేమోననుకున్నాడు. లేకపోతే, ఆ అమ్మాయి నాన్నగారి ఉద్యోగం గురించి కామెంట్ చేయడం ఎందుకు?
విభావరి మామూలుగానే ఉంది. “మీరు మంచి పండితుల్లా ఉన్నారే?” అంది పైగా.
“అబ్బే! అదేం లేదండి! ఏదో మా నాన్నగారి దయ వల్ల..” అన్నాడు మొహమాటంగా. మొహమాటంలో మరింత అందంగా కనిపించాడా అర్చక యువకుడు ఆమెకు. పైన ఏమీ కప్పుకోని అతని శరీరాకృతిని ఒకసారి చూచింది.
ఇంతలో, ఒక చేతిలో ఇత్తడి బేసిన్‌లో నైవేద్యం, దాని మీద అరిటాకు కప్పుకుని, మెట్లెక్కి వస్తూన్న తండ్రి కనపడ్డాడు.
లేచి నిలబడ్డాడు వనమాలి “స్వామివారి కైంకర్యానికి వేళయింది. అదిగో, మా నాన్నగారు! ఉండండి. ప్రసాదం తీసుకొని వెళుదురు గాని” అన్నాడు.
“తప్పకుండా” అన్నదామె.
తండ్రీకొడుకు లిద్దరూ గర్భాలయంలోకి వెళ్లారు. స్వామివారు కనపడకుండా తెర వేశారు. ఈ తెర మీద శంఖచక్రాలున్నాయి.
విభావరితో బాటు, అక్కడ ఉన్న కొందరికి విస్తరాకు దొన్నెల్లో పులిహోర ప్రసాదం పెట్టారు. ఇంగువ దట్టించారేమో, ఘుమఘుమలాడుతూంది.
ఒక చోట కూర్చొని పులిహోర తిన్నది విభావరి. ఖాళీ దొన్నె బయట ఉన్న పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వేసి, కొళాయి వద్ద చేయి కడుక్కుని వచ్చింది.
“ప్రసాదం చాలా రుచిగా ఉందండి” అన్నది
“అమ్మాయి, నీవెవరోగాని, పెరుమాళ్లుకు నివేదనం చేసిన అనంతరం మాత్రమే ఈ దివ్యమైన రుచి వస్తుంది తల్లీ! అది మనం ఇంట్లో వండుకుంటే రాదు” అన్నాడు కేశవాచార్యులు.
“ఈ అమ్మాయి మన పద్మనాభ రావు సార్ తమ్ముని కూతురట నాన్నా!” చెప్పాడు వనమాలి.
“అలాగా అమ్మా! వాడూ నేను బాల్యమిత్రులం. మావాడికి గురువు కూడా. ఈ నెలాఖరులో పదవీవిరమణ చేయబోతున్నాడని విన్నాను..” అన్నాడాయన విభావరి వైపు వాత్సల్య భావంతో చూస్తూ..
“అవునండి. ఆ ఫంక్షన్‌కే మేము వచ్చింది” అన్నదామె. వంగి కేశవాచార్యుల పాదాలకు మ్రొక్కింది.
“శీఘ్రమేవ కల్యాణవతీ భవ!” అన్నాడాయన ఆమె తలపై చేయిపెట్టి.
“వస్తానండి” అని ఆయనతో, కళ్లతోనే వనమాలితో చెప్పి, గబగబ మెట్లు దిగి వెళ్లిపోయింది విభావరి; జఘనము చాటిన ఆమె నీలవేణి లయబద్ధంగా ఊగుతుండగా.
***
ఆ రోజంతా వనమాలి కళ్లల్లో మెదులుతూనే ఉంది విభావరి. ‘అనన్యసామాన్యమైన అందం, అందానికి తగ్గ అణకువ, ముఖ్యంగా చెంపకు చేరెడేసిగా ఉన్న ఆ కళ్లు, సంస్కారం ప్రతిఫలించే ఆ వదనం’ – అతనికి మాటి మాటికీ గుర్తుకురాసాగాయి.
అక్కడ విభావరి కూడా ఇంచుమించు అదే పరిస్థితి. ‘ఎంత మ్యాన్లీగా ఉన్నాడు? ఎంత చక్కగా మంత్రాలు చదివాడు? పచ్చని అతని దేహ సౌష్టవం ఎంత స్పృహణీయంగా ఉంది!’ అనుకుందా యువతి.
రెండు రోజుల తర్వాత మళ్లీ గుడికి వెళ్లింది. గుడి లోని వేణుగోపాలుని, ఆయనను అర్చించే ఆ అందమైన యువకుడిని చూడాలని. హెడ్ మాస్టారు గారింటికి ఏదో ఒక వంక పెట్టుకుని వెళ్లి విభావరిని చూడాలనుకున్నాడు గాని, సభ్యతగా ఉండదని మిన్నకున్నాడు వనమాలి.
సాయంత్రం 6 గంటలు కావస్తుంది. అక్టోబరు నెల. ఇంకా చలి మొదలవలేదు. కాని వాతావరణం హాయిగా ఉంది. గుడిలో కేశవాచార్యుల వారున్నారు. భక్తులెవరూ లేనందున, ఆయన వ్యాసపీఠం ముందు – క్రింద కూర్చుని, ఆదిశంకరులు రచించిన ‘అచ్యుతాష్టకము’ను పఠిస్తున్నారు. ఆయన శ్రావ్యగాత్రం గుడిలో ప్రతిధ్వనిస్తూంది –
“అచ్యుతం కేశవం సత్యభామాధవమ్
మాధవం శ్రీధరం రాధికా రాధితమ్।
ఇందిరా మందిరం చేతసా సుందరమ్
దేవకీనందనం నందజం సందధే॥”
విభావరిని చూచి, మందహాసం చేశారాయన. కూర్చోమని కళ్లతోనే సైగ చేశారు. ఎనిమిది శ్లోకాలూ పాడడం పూర్తి కాగానే, స్వామివారికి హారతి ఇచ్చి, విభావరి వద్దకు తెచ్చారు. ఆమె హారతి కళ్లకద్దుకొంది.
“ఏమ్మా! మా పద్మనాభుని పదవీవిరమణ ఉత్సవం దగ్గరకొచ్చేస్తుందే! ఎక్కడ చేద్దామని?”
“స్కూలు ఆవరణలోనే నండి” అన్నదా అమ్మాయి. ఆమె కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి. అది గమనించి, నవ్వుతూ – “మా వనమాలి ఇప్పుడే నది ఒడ్డుకు వెళ్లాడు. నీవూ వెళ్ళు తల్లీ! ఈ సమయంలో తుంగభద్రమ్మ చాలా అందంగా ఉంటుంది. చీకటి పడకముందే వచ్చేయండేం!” అన్నారాయన.
విభావరి సిగ్గుపడింది. ‘నా మనసులో విషయాన్ని ఈయన ఎలా తెలుసుకున్నారబ్బా!’ అని ఆశ్చర్యపోయింది.
మెట్లు నది వరకున్నాయి. స్నానాల ఘాట్ అది. ఒడ్డున మహావృక్షంగా ఎదిగిన ఒక రావిచెట్టు తన ఆకుల గలగలలతో నదీమతల్లి అలల శబ్దాన్ని సమన్వయం చేస్తూంది. ముందు ఒక యాభై గజాల వరకు ఇసుక తిన్నెలు. తర్వాత ప్రవాహం. నీటికి కొంచెం దూరంగా, ఇసుకలో కూర్చొని ఉన్నాడు వనమాలి. పక్కన మూసిన పుస్తకం ఉంది. వెలుతురు బాగా ఉన్నంత వరకు చదువుకుని, పక్కన పెట్టినట్లున్నాడు.
దగ్గరకు వస్తున్న పట్టీల చప్పుడు విని తల ఎత్తి చూశాడు. చదవడానికి కుదరదు గాని, ఇంకా వెలుగు బాగానే ఉంది. సూర్యుడస్తమించాడు కాని ఆయన తేజస్సు ఇంకా ప్రపంచాన్ని ఆవరించుకునే ఉంది. విభావరి! విభావరిని చూసి సంభ్రమంగా లేచాడు.
“రండి! రండి!” అన్నాడు ఆదరంగా. అతని తండ్రి ద్వారా అప్పుడు ఆమెకు ఆ యవకుని పేరు తెలిసింది. ‘మనిషి లాగే పేరు కూడా చక్కనిదే’ అనుకుంది. కృష్ణుని పేరు! ఆమెకు ‘శివశ్రీ స్కందప్రసాద్’ అన్న ప్రముఖ గాయని గానం చేసే
“వనమాలీ వాసుదేవ! మన మోహన రాధారమణ
శశివదనా సరసిజనయనా జగన్మోహన రాధారమణ”
అన్న భజన్ గుర్తుకు వచ్చింది. శివశ్రీ ఆమెకు అభిమాన సింగర్. అదే పాటను పాడుతూ ఆ యువకుని సమీపించిందామె. అతనికి కొంచెం దగ్గర గానే కూర్చుంది.
“చక్కగా పాడుతున్నారే!” అన్నాడు.
“గుడిలో మీ నాన్నగారు, మీ పేరు ‘వనమాలి’ అని చెప్పినప్పుడు, ఎందుకో ఈ భజన్ నాకు గుర్తొచ్చిందండి” అన్నది నవ్వుతూ.
“అయితే నా పేరు తెలిసిపోయిందన్నమాట! మరి మీ పేరు తెలుసుకోవచ్చా?” అన్నాడు ఆసక్తిగా.
“లక్షణంగా తెలుసుకోవచ్చు. నా పేరు విభావరి!”
“అమ్మవారి పేరు. లక్ష్మీఅష్టోతర శతనామావళిలో వస్తుంది!” అన్నాడు.
“అవును. దానినుండే తీసిపెట్టారట మా నాన్నగారు.”
“దానికర్థం తెలుసు కదా?”
“తెలుసు కాని, మీరు చెప్పండి. పండితులు కదా!” అన్నది కొంటెగా నవ్వుతూ.
ఇద్దరికీ తెలుస్తూ ఉంది, దగ్గర అవుతున్నామని.
“విభావరి అంటే ప్రకాశమానమైనది అని! కరెక్టనా?”
“అనే నాన్నగారు కూడా చెప్పారు.”
“మీరు పాడిన భజన్ మరొకసారి ఆలపించండి, ప్లీజ్!” అన్నాడు.
ఆమె సంకోచించకుండా పాడింది. తన పేరు ఆమె గొంతుతో పలుకుతూ ఉంటే అతనికి బాగుంది.
“శివశ్రీ స్కందప్రసాద్ గారు పాడితే ఇంకా అద్భుతంగా ఉంటుందంది. మనల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకుని వెళుతుందామె.”
“శివశ్రీ.. అంటే ఆ మధ్య బి.జె.పి యువ ఎంపీ ‘తేజస్వీ సూర్య’ వివాహం చేసుకున్నాడు..”
“అవును ఆమే! ఆమె గానం నచ్చి, పెళ్లి చేసుకున్నాడట.”
“మరి ఆమెకు అతనిలో ఏం నచ్చిందో?”
“అందగాడు. మంచి హోదా. ఉజ్జ్వలమైన రాజకీయ భవిష్యత్తు.”
“ఎవరు, ఎవరికి, ఎప్పుడు, ఎందుకు నచ్చుతారో కదండి” అన్నాడు.
“నిజమే వనమాలిగారు!” అన్నది విభావరి. “మాకు డిగ్రీలో ‘ఒథెల్లో’ నాటకం ఉండేది ఇంగ్లీషులో! షేక్‌స్పియర్ రాసింది. డెస్డిమోనా అసాధారణ సౌందర్యరాశి. ఒథెల్లో అందగాడు కాదు. ఇద్దరివీ వేర్వేరు జాతులు. రాజుగారి వద్ద పంచాయతీ. ‘ఎందుకమ్మాయి, నీవు మా సైన్యాధిపతిని ప్రేమించావు?’ అంటాడు రాజు. ‘ఐ లవ్డ్ ది డేంజర్స్ హీ హాడ్ పాస్డ్’ అంటుందామె. ‘మన దేశం కోసం ఆయన ఎదుర్కొన్న ప్రమాదాలను చూసి ప్రేమించాను’. రాజు ‘మరి నీవెందుకు ప్రేమించావు ఈమెను?’ అని ఒథెల్లోను అడుగుతాడు.”
“ఉండండి, నేను చెబుతాను” అని అడ్డు తగిలాడు వనమాలి. ‘ఐ లవ్డ్ హర్ బికాజ్ షి లవ్డ్ మీ’ అంటాడు. ఆమె నన్ను ప్రేమించింది కాబట్టి.”
“వండర్‌ఫుల్!” అంటూ చప్పట్లు కొట్టింది విభావరి. ఇద్దరి మధ్య జెండర్ సహజమైన సంకోచాలుంటే అవి పటాపంచలయిపోయాయి. శారీరిక ఆకర్షణ కాకుండా మానసిక పరిపక్వత తమనిద్దర్నీ దగ్గర చేస్తూందని గ్రహిస్తున్నారిద్దరూ.
“మాకు డిగ్రీ ఇంగ్లీష్‌లో ఆ నాటకం ఉండింది లెండి” అన్నాడు.
“మీరు ఏం చదువుకున్నారు?” అనడిగింది.
“నేను గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బి.యస్.సి. చేశానండి. తర్వాత కర్నూలు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‍లో బి.ఎడ్. చేశాను. ప్రస్తుతం డి.ఎస్.సి.కి ప్రిపేరవుతున్నాను.”
ఆశ్చర్యంగా చూసింది విభావరి. “మరి అర్చకత్వం..?” అంది.
“అది సహజంగా వచ్చిందేనండి. పౌరోహిత్యం పనులు కూడా వచ్చు. ఒకవేళ టీచరుద్యోగం రాకపోయినా, బ్రతుకు తెరువుకేమీ ఇబ్బంది లేదు. అర్చకవృత్తి ఉంది. మాకు ఈ ఊళ్లో మూడెకరాల పొలం కూడా ఉంది. స్వంత యిల్లు.”
“ఇంకేం అయితే. కాని మీకు టీచర్ జాబ్ తప్పక వస్తుంది లెండి” అన్నది విభావరి మనస్ఫూర్తిగా.
“థాంక్స్ విభావరిగారు! మరి మీరు..?”
“నాన్నగారికి మేమిద్దరం. నేను కూడా డిగ్రీ చేశాను, గుంతకల్‌లో.. అప్పుడు నాన్న అక్కడ పనిచేస్తున్నారు. తమ్ముడు రాయచూర్‌లో ఇంటర్ ఫస్టియర్. అమ్మ మంగళగౌరి గృహిణి. నాది బి.కామ్ కంప్యూటర్స్, వనమాలిగారు!”
“సూపర్! పదండి వెళదాం! చీకటి పడబోతోంది” అన్నాడు. లేచి నిలబడి ఆమెకు చేయి అందించాడు. ఆమె ఏ మాత్రం సంకోచించకుండా అతని చేయి అందుకుని లేచింది. ఆ స్పర్శ వల్ల ఇరువురిలో ఏ మనోవికారాలు కలుగలేదు. అతి సహజంగా జరిగిందది.
“మిమ్మల్ని హెడ్ మాస్టారు గారింటి వరకు దిగబెడతాను” అన్నాడు.
“విత్ ప్లెజర్” అన్నదా ముగ్ధ. ఇద్దరూ పక్కపక్కన నడుస్తున్నారు.
తుంగభద్రమ్మ వద్ద నుంచి వీచే మారుతం ఆహ్లాదకరంగా ఉంది.
“ఈ నది, ఈ వేణుగోపాలుని గుడి, ఈ ఊరు నాకు బాగా నచ్చాయండి, వనమాలిగారు!” అన్నది విభావరి.
“అవును. మంత్రాలయం వద్ద నదిలో పెద్ద పెద్ద బండరాళ్లుంటాయి. మా ఊరి వద్ద ఉండవు. ప్రశాంతంగా పారుతుంది నది. వరద వస్తే మటుకు ఉగ్రరూపం ధరిస్తుంది. మన గుడి మెట్ల వరకు వస్తుందండి ప్రవాహం!”
“అమ్మో! అంత నీరా!” అని గుండెల మీద చేతులు వేసుకుందా అమ్మాయి.
“తుంగభద్రా నది అలంపురం వద్ద విశాలం అవుతుంది. రామాయణ కాలంలో ‘పంపానది’గా పిలువబడింది ఇదేనంటారు తెలుసాండి! పంచగంగలుగా కీర్తించబడిన ఐదు నదుల్లో తుంగభద్రమ్మ ఒకటి. మన జిల్లాలో గుండిమల్ల గ్రామం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.”
“అయితే డైరెక్ట్‌గా సముద్రంలో కలవదన్నమాట.”
“అవును. మా వేణిసోంపురం గ్రామానికి కూడా చాలా చరిత్ర ఉందండి.”
“క్లుప్తంగా చెప్పండి ప్లీజ్!”
“మీ ఇల్లు వచ్చేసింది! రేపు గుడికి వస్తారు కదా! మాట్లాడుకుందాం!”
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
