Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరణం మధురం-2

[శ్రీ పాణ్యం దత్తశర్మ వ్రాసిన ‘మరణం మధురం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తుంగభద్రానదీ తీరంలోని వేణిసోంపురం అనే ఊరిలోని శ్రీవేణుగోపాల స్వామి వారి ఆలయంలో అర్చకులు కేశవాచార్యులు. ఆలయానికి వచ్చిన భక్తలందరికీ శఠగోప స్పర్శ చేయిస్తారు. ముఖకండపంలో కూర్చుని చదువుకుంటున్న కొడుకు వనమాలితో, కాసేపు గుడి చూసుకోమని చెప్పి, ప్రసాదం తేవడానికి ఇంటికి వెళ్తారు. కాసేపయ్యాకా, ఊరిపెద్ద కాటమరెడ్డి, శేషారత్నమ్మ దంపతులు వచ్చి, విజయవాడలో చదువుకుంటున్న వారి కూతురు పుట్టినరోజు అనీ, ఆ పాప పేరు మీద వనమాలితో అర్చన చేయించుకుంటారు. ఇంతలో విభావరి అనే యువతి ఆలయానికి వస్తుంది. కాటమరెడ్డి, శేషారత్నమ్మ దంపతుల పూజ అయ్యేవరకు ఆగి, తన తల్లిదండ్రుల పేర్లు, గోత్రం చెప్పి, అర్చన చేయించుకుంటుంది. ఆమె పద్ధతీ, మాటతీరు వనమాలిని ఆకట్టుకుంటాయి. ఇక భక్తులెవరూ లేకపోవడంతో, ఆమెతో పాటు నడుస్తూ బయట మెట్ల వద్దకు వస్తాడు. ఆమె ఊరిలో తన పెదనాన్న పద్మనాభరావుగారింటికి వచ్చిందని తెలుసుకుంటాడు, ఆయన తన గురువుగారని చెప్తాడు. తమ ఊరు, తండ్రి ఉద్యోగం తదితర వివరాలు చెప్తుంది. ఇంతలో కేశవచార్యులు ప్రసాదంతో తిరిగి రావడంతో, ప్రసాదం తీసుకుని వెళ్ళమని విభావరికి చెప్పి, ఆమెను తండ్రికి పరిచయం చేస్తాడు. పద్మనాభరావుగారి తమ్ముడు కూతురు అని చెప్పగానే, కేశవాచార్యులు ఆప్యాయంగా మాట్లాడుతారు. పద్మనాభరావుగారు తన మిత్రుడని చెప్తారు. ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతుంది విభావరి. రెండు రోజుల తర్వాత ఓ సాయంత్రం మళ్ళీ అలయానికి వస్తుందామె. గుడిలో కేశవాచార్యులొక్కరే ఉండి, ‘అచ్యుతాష్టకము’ను రాగయుక్తంగా చదువుతూంటారు. ఎనిమిది శ్లోకాలూ పాడడం పూర్తి కాగానే, స్వామివారికి హారతి ఇచ్చి, విభావరి వద్దకు తెస్తే, ఆమె హారతి కళ్ళకు అద్దుకుంటుంది. ఆమె తన కొడుకు కోసం వెతుకుతున్నట్టు గ్రహించి, తుంగభద్ర తీరంలో ఉన్నాడని చెప్తారు. వెళ్ళి కలుస్తుంది. కాసేపు సంగీతం గురించి, చదువుల గురించి, తుంగభద్ర నది గురించి మాట్లాడుకుంటారు. చీకటి పడడంతో, మళ్ళీ కలుద్దామని చెప్పి, ఇళ్ళకు చేరుతారు, – ఇక చదవండి.]

మర్నాడు సాయంత్రం గుడికి వచ్చింది విభావరి. లేత పసుపురంగు చుడీదార్‌లో ఉంది. ఎరుపుగళ్ల దుపట్టా. విశాల నేత్రాలు వెలుగు లీనుతున్నాయి. బింబాధరాలు సుధను చిలుకరిస్తున్నాయి. కేశవాచారి గారు పనిమీద ‘అయిజ’కు వెళ్లారు. స్వామివారి పూజలను వనమాలే నిర్వహిస్తున్నాడు. ఆ రోజు భక్తుల సంఖ్య తక్కువగా ఉంది.

విభావరిని చూచి నవ్వాడు. ఆమె కూడా ప్రతిహాసం చేసింది. “రండి! అన్నట్లు మీరు నరసింహస్వామి దర్శనం చేసుకోలేదు కదూ! పదండి వెళదాం” అన్నాడు. ఆమె అతన్ని అనుసరించింది.

“ఈ ఆలయంలో నరసింహుడు కూడా ఉన్నాడా అండీ!” అన్నది దారిలో.

“అవును. అద్భుతమైన దర్శనం చేయబోతున్నారు. స్వామి పదహారు చేతులు, 16 ఆయుధాలతో షోడశ బాహు నరసింహమూర్తి!”

విభావరి స్వామి విగ్రహాన్ని చూసి పరవశురాలైంది. ఎనిమిదడుగుల నల్లరాతి విగ్రహం. ఎడమ తొడమీద ఆదిలక్ష్మి అమ్మవారు. అన్ని చేతుల నిండా అన్ని ఆయుధాలు ధరించి ఉన్నా, శాంతస్వరూపం!

‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం

నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం’

అని మూల మంత్రం చదివాడు. స్వామికి అర్చన చేసి, హారతి ఇచ్చాడు వనమాలి. ఇద్దరూ మళ్లీ వేణుగోపాలుని సన్నిధికి వచ్చారు.

“వనమాలిగారు! నృసింహ మూలమంత్రంలో చివర ‘మృత్యుం మృత్యుం’ అని వచ్చింది కదా! దానర్థం ఏమిటి?” అనడిగింది.

“నృసింహ ప్రభువు ‘మృత్యువుకే మృత్యువు’ అని అర్థం!” అన్నాడు చిరునవ్వుతో. ఎందుకో ఏదో ఆలోచనలోకి వెళ్లిపోయాడు.

“ఏమిటండీ ఆలోచిస్తున్నారు?” అన్నది.

“చావు చాలా దుస్సహం కదండీ! ఆత్మీయులందర్నీ విడిచి వెళ్లే ఆ ఆత్మ ఎంత క్షోభిస్తుందో కదా! వారెంత దుఃఖానికి గురి ఔతారో పాపం!” అన్నాడు.

“ఏమిటండోయ్! ఇంత చిన్న వయసులో ఈ వేదాంతం? సహజంగా అందరికీ తప్పని దాని కోసం ఎందుకీ నిర్వేదం?” అన్నది నవ్వుతూ.

వనమాలి కూడా నవ్వేశాడు.

“వేణుగోపాలుని విగ్రహం ఇక్కడ చాలా విశేష భంగిమలో ఉంది; కుడికాలిపై ఎడమకాలు వేసుకుని..” అంది

“మీరు వింటానంటే ఈ గుడి ప్రాశస్త్యం గురించి చెబుతాను” అన్నాడు.

“అంతకంటే భాగ్యమా! చెప్పండి!” అన్నది ఆసక్తిగా.

ఇద్దరూ శేషవాహనం దగ్గర కూర్చున్నారు. భక్తులెవరూ రాలేదు.

“ఈ అనువంశిక అర్చకత్వానికి మేము తొమ్మిదవ తరం వారసులం విభావరిగారు. 17వ శతాబ్దంలో ఇక్కడ నిజాం నవాబుగారి సైనిక విడిది ఉండేదట. మా పూర్వీకులు వెంకట నరసింహాచార్యులు. వారి కుమారులు వేంకట రామాచార్యులు. వారు వెళ్లి గద్వాల సంస్థానం రాజావారిని కలిసి సైనిక విడిది అక్కడనుంచి తొలగించేలా నవాబుగారికి చెప్పమని కోరారట. గద్వాల రాజావారి మాట అంటే నిజాం నవాబు గారికి గౌరవం. ఆయన అంగీకరించారు. రాజావారి కోరికపై మా పూర్వీకులకు ఈ వేణిసోంపురం గ్రామాన్ని, అగ్రహరంగా మార్చి ఇచ్చారు.” అని చెప్పి, “వేంకట రామాచార్యుల వారే తర్వాత వ్యాసతత్త్వజ్ఞ తీర్థులయ్యారు.” అన్నాడు.

“అంటే, సన్యసించారన్నమాట” అన్నది విభావరి

“అవునండి. వారు బీచుపల్లికి వెళ్లి, కృష్ణానది ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉండగా, ఆంజనేయస్వామివారు కలలో ప్రత్యక్షమై, ‘నాయనా! నీ తపస్సు ఫలవంతమైంది. నీవు వేణిసోంపురం వెళ్లి- అక్కడ తుంగభద్రానదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకొని, శిష్యులకు వేదం బోధించు’ అని ఆదేశించారట. వారే తర్వాత శ్రీవాసుదేవ విఠల పేరు మీద వేణుగోపాలుని మీద కృతులు రచించారు. తర్వాత మంత్రాలయం రాఘవేంద్రయతీంద్రుల తర్వాత మఠాధిపతి భువనేంద్ర తీర్థులవారి వద్ద ఆయన సన్యాసం స్వీకరించారు. వ్యాసతత్త్వజ్ఞతీర్థులుగా మారారు.”

“కథనం అటూ ఇటూ అయినట్లుంది..” అన్నది విభావరి నవ్వుతూ.

“అమ్మో! మీతో జాగ్రత్తగా ఉండాలి అయితే!” అన్నాడు వనమాలి.

“మాది అంతా మధ్వాచార్యుల సాంప్రదాయమండీ. వ్యాసతత్త్వజ్ఞతీర్థుల వారు ప్రవచనకారులు కూడా. ఒకసారి ఆయన ‘వల్లూరు’ అనే గ్రామంలో ఆధ్యాత్మిక ప్రవచనం చేసి, రాత్రి అక్కడే బస చేశారు. కలలో శ్రీ వేణుగోపాలస్వామివారు కనబడి, ‘ఈ గ్రామం కుంట తూము దగ్గర నా విగ్రహం, నేలలో కప్పబడి ఉంది. దాన్ని వేణిసోంపురంలో ప్రతిష్ఠించు’ అని ఆనతిచ్చి, అదృశ్యమయ్యారు. ఆ విగ్రహమే ఇది.” అని చెప్పాడు.

“ఇటువంటి మహాన్నత వారసత్వానికి ప్రతినిధులైన వీరు ధన్యులు వనమాలిగారు” అన్నది విభావరి, అతన్ని అబ్బురంగా చూస్తూ.

“అంతా ఆ వేణుగోపాలుని కృప” అన్నాడు చేతులు జోడించి.

“పెదనాన్నగారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఎల్లుండి కదా! నేను వచ్చి మా గురువు గారికి నా వంతు గౌరవ సత్కారాలు చేసుకుంటాను.”

“పెదనాన్నగారి వద్ద చదువుకున్న చాలామంది, ఇప్పుడు ఉన్నత స్థానాలలో ఉన్నారట. వారు ఫంక్షన్‌కు వస్తారట” అన్నదా అమ్మాయి. “మరి వెళ్లిరానా?” అని లేచి నిలబడింది. “చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను ఈ రోజు” అన్నది.

మెట్ల క్రింది వరకు వచ్చి సాగనంపాడామెను. వారి స్నేహం ఆ రోజు మొగ్గ తొడిగింది. త్వరలో కుసుమించాలి మరి!

***

వేణిసోంపురం ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూలు ప్రాంగణం. ఆవరణ అంతా శుభ్రం చేశారు. రంగు కాగితాల తోరణాలు కట్టారు. స్కూలు వరండా లోనే హెడ్ మాస్టారు గారి గది ఎదుట నాలుగు కుర్చీలు రెండు టేబుళ్లు వేసి, వాటి మీద శుభ్రమైన తెల్లని క్లాత్ పరచారు. ఒక వేస్‌లో తాజా పువ్వులు కాడలతో సహా పెట్టారు. వెనక గోడకు ఒక ఫ్లెక్సీని కట్టారు. దాని మీద పద్మనాభ రావు దంపతుల ఫొటో ఉంది.

“మాన్య గురువర్యులు శ్రీమాన్ పద్మనాభ రావు గారి పదవీ విరమణోత్సవ సభ”

అని పెద్ద అక్షరాలతో వ్రాసి ఉంది. ఆ ప్లెక్సీని వనమాలే గద్వాలకు వెళ్లి వ్రాయించుకు వచ్చాడు. ఉదయం పది గంటలవుతూంది. బడి పిల్లలందరు క్రమశిక్షణతో కూర్చున్నారు. ఊరిపెద్దలందరు వచ్చారు. గ్రామ సర్పంచ్ శేషశయనారెడ్డి గారు వచ్చి ఉన్నాడు. అందరూ ఎం.ఎల్.ఎ. గారి కోసం ఎదురుచూస్తున్నారు. వేణిసోంపురం గ్రామం అలంపూరు నియోజకవర్గంలోకి వస్తుంది. దాని శాసనసభ్యులు వీరభద్రస్వామిగారు పద్మనాభరావుగారికి శిష్యులట. ఆయన మునగాల గ్రామంలో ఉపాధ్యాయులుగా పని చేసేటప్పుడు ఆయన వద్ద చదువుకొన్నారట శాసనసభ్యులవారు.

పదకొండు గంటలకు ఎమ్.ఎల్.ఎ.గారి కారు వచ్చింది. ముందు సీటు లోంచి గన్‌మ్యాన్ దిగి, వెనక డోరు తెరిచి పట్టుకున్నాడు వినయంగా. వీరభద్రస్వామిగారు దిగి వేదిక వైపు నడుస్తూ ఉండగా, చాలామంది కార్యకర్తలు ఆయనను అనుసరించారు. పద్మనాభ రావు గారు ఎదురు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఎమ్.ఎల్.ఎ.గారు ఆయనకు అక్కడే పాదాభివందనం చేశారు.

సభ మొదలైంది. ‘ప్రార్థనాగీతం కుమారి విభావరి!’ అని మైకులో ప్రకటించారు. విభావరి కాగిన పాల రంగుమీద కాఫీరంగు పువ్వులున్న చీర, మ్యాచింగ్ జాకెట్ ధరించింది. ఆమె మైకు వద్దకు వచ్చి సరస్వతీ దేవిపై ఈ స్తోత్రాన్ని భూపాలరాగంలో శ్రావ్యంగా పాడింది. అది బ్రహ్మకృత సరస్వతీస్తవము లోనిది.

“శుక్లాం బ్రహ్మవిచార సారపరమా మాద్యామ్ జగద్వ్యాపినీమ్

వీణాపుస్తకధారిణీ మభయదాం జాడ్యాంధకారాపహామ్

హస్తే స్ఫాటికమాలికాం చ దధతీమ్ పద్మాసనే సంస్థితామ్

వందే తాం పరమేశ్వరీం భగవతీమ్ బుద్ధిప్రదాం శారదామ్”

విద్యకు, జ్ఞానానికి అధిష్టాన దేవత ఐన వాణి కృపాతరంగాలు ఆ స్కూలు ఆవరణ అంతా వ్యాపించాయి. ‘దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయునిగా ఎన్నో వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన గురువర్యులు శ్రీ పద్మనాభ రావు గార’ని ఎమ్.ఎల్.ఎ. గారు గురువుగారిని ప్రశంసించారు. హెడ్ మాస్టారు గారికి శాలువలు, పూలమాలలు లెక్కకు మిక్కిలిగా వచ్చి ఆయన కంఠసీమను అలంకరించాయి. వనమాలి మాట్లాడుతూ “మా సార్‌ను చూస్తే ఇప్పటికీ నాకు భయమే. మూడవ తరగతిలో దస్కం తీసివేతలు నేర్పేటపుడు ఆయన పెట్టిన ‘తొడపాశాలు’ ఇంకా మరచిపోలేదు” అనగా అందరూ నవ్వారు. సారు పూర్వవిద్యార్థులు కొంతమంది వచ్చారు. అందరూ కలసి సార్‌కి బంగారపుటుంగరం చేయించారు. ఆయన వేలికి తొడిగారు. సార్‌కు అమ్మగారికి పట్టువస్త్రాలు పెట్టారు. వారిలో సుగుణాకర్ అనే యువకుడిది వేణిసోంపురమే.

ఎమ్.ఎల్.ఎ. గారు వెళ్లిపోయారు. అందరికీ పులిహర, బూరెలు, మసాలా వడలు వడ్డించారు. ఈ విందు పద్మనాభ రావు గారే ఏర్పాటు చేశారు.

భోజనాల తర్వాత అందరూ విశ్రాంతిగా ఒక క్లాసురూములో కూర్చున్నారు. సుగుణాకర్, వనమాలి, సహధ్యాయులే.

“ఏరా! గుణా! ఇప్పుడెక్కడ ఉండేది?” అనడిగాడు వనమాలి.

“పెబ్బేరులో ఎమ్.డి.ఓ. గా చేస్తున్నానురా! పోయిన ఏడే భూత్‌పూర్ నుంచి బదిలీపై వచ్చాను. మరి నీవు?”

విభావరి ఇద్దరినీ ఆసక్తిగా గమనిస్తుంది

“ఏముంది? డి.ఎస్.సి.కి ప్రిపేరవుతున్నా. నీవేమో గ్రూప్ టు. బి.లో సెలెక్టయి పోయావు! లక్కీ ఫెలోవి!” అన్నాడు. అతని గొంతులో అసూయ లేదు. అభిమానమే ఉంది.

“ఈసారి నీకు జాబ్ వస్తుందిలేరా వనా!” అన్నాడు సుగుణాకర్.

విభావరి వనమాలి పక్కనే కూర్చుని ఉంది, కొంచెం ఎడంగా. “వీరు?” అని అర్థోక్తిలో ఆగాడు సుగుణాకర్.

“సారీ! ఈమెను నీకు పరిచయం చేయలేదు కదూ! ఈ అమ్మాయి పేరు విభావరి. సరస్వతీ ప్రార్థన ఎంత బాగా పాడిందో విన్నావుగా! అన్నట్లు, మన పద్మనాభ సార్ తమ్ముని కూతురే. వీళ్లు రాయచూర్‌లో ఉంటారు. బి.కాం కంప్యూటర్స్ చేసింది. ఈమధ్య నాకు మంచి స్నేహితురాలైంది” అన్నాడు.

“నమస్తే అండీ! వీడికి ఫ్రెండ్ అంటే నాకూ ఫ్రెండ్ క్రిందే లెక్క! ఏరా? అంతేనా?” అన్నాడు సుగుణాకర్.

“నీవనుకుంటే సరా? ఆ అమ్మాయి అనుకోవాలి కదా! మనిద్దరం అంటే సరే. త్వమేవాహం న సంశయః!” అన్నాడు వనమాలి నవ్వుతూ.

“అయ్యో! అదేం లేదండీ! వనమాలి గారికి మీరు స్నేహితుడంటేనే తెలిసిపోయింది. మీరు కూడా ఆయన లాగా సంస్కారవంతులేనని” అంటూ సుగుణాకర్‌కి షేక్‌హ్యాండ్ ఇచ్చింది విభావరి.

సుగుణాకర్ ఇద్దరికీ చెప్పి వెళ్లిపోయాడు. వనమాలి, విభావరి మిగిలారు.

“రేపు ఉదయం మేం రాయచూరుకు బయలుదేరుతున్నాం. ఈ ఊరు, వేణుగోపాలుడు, తుంగభద్రమ్మ, మీ స్నేహం మరచిపోలేను” అన్నదామె.

“నాకు కూడ మా స్నేహం ఒక చక్కని అనుభూతినిచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నంబర్..?”

“తప్పకుండా!” అంటూ తన సెల్ నుంచి అతని సెల్‌కు ఒక మిస్డ్ కాల్ ఇచ్చింది.

“అప్పుడప్పుడూ వస్తూండండి” అన్నాడు. ఇద్దరిలో ఏదో తెలియని విచారం. కళ్లతోనే వీడ్కోలు పలికి వెళ్లిపోయింది విభావరి.

***

ఆరునెలలు కాలం తనలో కలుపుకుంది. కలుపుకోవడమే కానీ, నిలిపి ఉంచడం కాలానికి తెలియదు కదా. నిరంతర గమనశీలమే కాలం.

వనమాలికి వేణుగోపాలుని దయ వల్ల డి.యస్.సి.లో సెలెక్షన్ వచ్చింది. భగవత్కృపకు కఠిన కృషి కూడా తోడయింది. అతన్ని పెబ్బేరు మండలం లోని అయ్యవారిపల్లె గ్రామం లోని జెడ్.పి. ఉన్నత పాఠశాలకు స్కూలు అసిస్టెంటుగా వేశారు. కేశవాచార్యులు, ఆయన భార్య మీనాక్షమ్మగారల ఆనందం వర్ణనాతీతం.

వెళ్లి జాయినయ్యాడు వనమాలి. అతని బోధనా విషయాలు మ్యాథ్స్, సైన్సెస్. హెడ్ మాస్బారు షేక్ పీరా గారు. ఆయన మంచివారు. వనమాలిని ఆదరంగా రిసీవ్ చేసుకున్నారు.

“తమ్మీ! ఈ ఊర్ల ఉండనీకి మంచి మకాన్‌లు గిట్ల ఉండవి. మేమందరం పెబ్బేరు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తమన్నట్లు. నీవు గూడ గట్ల చెయ్యవడ్తది మల్ల” అన్నాడాయన.

పెబ్బేరులో తన ఫ్రెండ్ సుగుణాకర్ ఎం.డి.వో.గా పని చేస్తున్నట్లు గుర్తుకు వచ్చింది వనమాలికి. అదే హెడ్ మాస్టారు గారితో చెప్పాడు. తన స్నేహితునికి కూడా తనలాగే ఇంకా పెళ్లి కాలేదని, కాబట్టి తాను అతనితో కలిసి ఉంటానని అన్నాడు.

“ఇంకేం మల్ల? పోరగాండ్లిద్దరు మస్తు ఎంజాయ్ చెయ్యుండ్రి” అన్నాడాయన నవ్వుతూ.

ఆ రోజు సాయంత్రం స్కూలు వదిలిన తర్వాత షేర్ ఆటోలో పెబ్బేరుకు వెళ్లాడు వనమాలి. మండల ఆఫీసులన్నీ ఒకే క్యాంపస్‌లో ఉన్నాయి. సుగుణాకర్ ఇంకా ఆఫీసులోనే ఉన్నాడు. వనమాలిని చూసి ఆశ్చర్యపోయాడు.

“వాట్ ఎ సర్‌ప్రైజ్! ఇదేనా రావడం?” అంటూ స్నేహితుడిని కౌగిలించుకున్నాడు సుగుణాకర్. వనమాలికి డి.యస్.సి.లో సెలెక్షన్ వచ్చిందని, అయ్యవారిపల్లె హైస్కూలుకు వేశారని తెలుసుకుని ఆనందించాడు.

“ఒరేయ్! ఆ ఊర్లో ఏ సౌకర్యాలూ సరిగ్గా ఉండవు. నేనూ బ్యాచిలర్‌నే కాబట్టి, నాతోనే  ఉండు. బస్సులు అరకొరగా ఉంటాయి ఆ ఊరికి. కానీ షేర్ ఆటోలు బోలెడు. హ్యాపీగా వెళ్లి రావొచ్చు. నిదానంగా ఒక బండి కొనుక్కుంటే సరి!” అన్నాడు.

“ఏ బండిరా? ఎద్దుల బండేమిటి?” అన్నాడు వనమాలి నవ్వుతూ.

సుగుణాకర్ కూడా నవ్వి, “అదేమిటోరా, కారును కారంటారు, బస్సును బస్సంటారు. ఆటోను ఆటో అంటారు. కాని టూ వీలరును మాత్రం ‘బండి’ అనే అంటారు. అదేమిటో” అన్నాడు.

“కొన్ని ప్రయోగంబులు యథాతధంబుగ గ్రాహ్యంబులు” అన్నాడు వనమాలి.

“వనా! నీవు సైన్స్ చదివినా, తెలుగు పట్ల మమకారం పోలేదురా!”

“పుట్టిన ఊరునూ, కన్న తల్లిదండ్రులనూ, మాతృభాషనూ వదులుకుంటే ఎలా రా గుణా?”

ఇద్దరూ సుగుణాకర్ బైక్ మీద అతని ఇంటికి బయలుదేరారు. పెబ్బేరు పూర్వం ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలో, పస్తుతం వనపర్తి జిల్లాలో ఉన్న పెద్ద మండల కేంద్రం. సుమారైన టవున్. మున్సిపాలిటీ కూడా. హైదరాబాద్ – బెంగుళూరు జాతీయ రహదారి నెంబర్ 44 పైనే ఉంటుంది. రహదారిని నాలుగు లేనులుగా విస్తరించిన తర్వాత, ఊరు లోపలికి ఉండిపోయింది. కాని కర్నూలు వైపు నుండి హైదరాబాదుకు వెళ్ళే ఎక్స్‌ప్రెస్ బస్సులన్నీ ఊర్లోకి వస్తాయి. సూపర్ లగ్జరీలు, గరుడలు, ఇంద్రలు, వెన్నెలలు రావు. బైపాస్‌లో వెళ్లిపోతాయి.

“ఈ ఊరు పరవాలేదురా వనా! అన్నీ దొరుకుతాయి. హోటళ్లలో టిఫిన్స్ పరవాలేదు గాని, భోజనం బాగుండదురోయ్! అందుకే నేను టిఫిన్ బయట చేసి, భోజనం మాత్రం స్వయంపాకమే” అన్నాడు సుగుణాకర్.

“ఇంకేం? నేను కూడా గరిటె తిప్పగలను” అన్నాడు వనమాలి .

బైక్ గాంధీనగర్ లోని విద్యానగర్ కాలనీలోకి ప్రవేశించింది. అక్కడ ‘సాయిరామ్ హాస్పిటల్స్’ అన్న పెద్ద ప్రయివేట్ హాస్పిటల్ ఉంది. దాని పక్కసందులోనే ఉంది సుగుణాకర్ ఉంటున్న ఇల్లు. క్రింద ఇంటి ఓనర్లున్నారు. పైన ఒకటి పెద్ద గది. డాబాకు ఒక మూల బాత్రూం, టాయిలెట్ ఉన్నాయి. పెద్ద వేప చెట్టు కొమ్మలు గది మీద పరుచుకుని ఉన్నాయి.

గదిలో గోడ కానించి ఒక సింగిల్ కాట్, ఒక మూల 32 అంగుళాల శాంసంగ్ కలర్ టి.వి. గోడకు బిగించి ఉంది. గది బయట పదడుగుల ఖాళీ స్థలం వదిలారు. దానికి గ్రిల్స్ ఉన్నాయి. ఒక వైపు వాష్ బేసిన్. గదిలో ఒకమూల పెద్ద చెక్క టేబుల్ ఉంది. దాని మీద ఒక ఎలక్ట్రిక్ కుక్కరు, ఒక ఇండక్షన్ స్టవ్, కొన్ని వంటపాత్రలు ఉన్నాయి. టేబుల్ పైన షెల్ఫ్‌లో డబ్బాలు, సీసాలు!

“చిన్న సంసారమే సెటప్ చేశావు గదరా!” అన్నాడు వనమాలి అంతా కలయ చూస్తూ.

“తప్పదు కదరా! ‘కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపః’ అన్నట్లు, ఒకటీ ఒకటీ వచ్చి చేరాయి. పద, స్నానం చేద్దువు గాని” అన్నాడు సుగుణాకర్. స్నానాలు చేసి, పంచెలు కట్టుకున్నారిద్దరూ.

“ఈ రాత్రికి బయట తినేద్దాం లే” అన్నాడు వనమాలి. టేబుల్ పక్కన, గోడకు చెక్క ప్లేట్ ఒక దాన్ని స్టాండుకు బిగించారు. దాని మీద ఏడుకొండలవాడు ఫ్రేములో కొలువై ఉన్నాడు. ఒక దీపారాధన సెమ్మె, అగరువత్తుల పాకెట్, చిన్న కర్పూరం డబ్బా, నూనె సీసా.

“రోజూ ఉదయం, రాత్రి, వేంకటేశునికి దీపారాధన చేస్తా. ఉదయం అష్టోత్తరం చదివి, హారతి ఇస్తా. ఎంత బిజీగా ఉన్నా ఇది మాత్రం మానవద్దని మా అమ్మ ఆర్డర్” అన్నాడు సుగుణాకర్.

“మన అమ్మానాన్నల పెంపకమే మనకు చక్కని సంస్కారాన్ని నేర్పింది” అన్నాడు వనమాలి.

రాత్రి ఎనిమిదిన్నరకు, మెయిన్ రోడ్ మీదున్న శ్రీగురు రాఘవేంద్ర టిఫిన్స్‌కు బయల్దేరారు మిత్రులిద్దరూ. సుగుణాకర్ బైక్ తీయబోతుంటే వద్దన్నాడు వనమాలి. “నడుద్దాం రా హయిగా” అన్నాడు

“నీకు అయ్యవారిపల్లెలో పోస్టింగ్ రావడం, ఈ పెబ్బేరులో నాతోపాటు ఉండడం ఎంత హ్యాపీగా ఉందో తెలుసా?” అన్నాడు సుగుణాకర్.

“నీవు ఇక్కడ ఉండడం నాకూ హ్యపీ. కాని రెంట్, ఖర్చులు అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ! అలా అయితేనే ఉంటాను.”

“సరే లేరా! అదో పెద్ద విషయం కాదు!”

శ్రీగురు రాఘవేంద్ర టిఫిన్స్ కిటకిటలాడుతుంది జనాలతో. టోకెన్లు తీసుకున్నాడు సుగుణాకర్. సింగిల్ ఇడ్లీ, వడ, ఒక ఆనియన్ రవ్వ, అలా రెండు సెట్లు.

తింటూ అన్నాడు వనమాలి “టిఫిన్ బాగుందిరా.”

“సరేగాని, ఏమంటుంది నీ స్నేహితురాలు వరూధిని? ఫోన్లలో టచ్‌లో ఉన్నారా?” అనడిగాడు సుగుణాకర్.

“వరూధిని కాదురా విభావరి! వారానికొకసారైనా ఫోన్ చేస్తుంది. నేను చేస్తాను. నాకు జాబ్ వచ్చిందని తెలిసి అభినందనలు తెలిపింది.”

విభావరి ప్రసక్తి రాగానే వనమాలి కళ్లల్లో ఒక రకమైన వెలుగును గమనించాడు సుగుణాకర్.

“స్నేహం వరకేనా, ఇంకొంచెం ప్రొసీడయ్యారా?” అనడిగాడు నవ్వుతూ.

“లేదురా, నీకు చెప్పకుండా ఉంటానా, అలాంటిదేమయినా ఉంటే! మా ఫోన్ సంభాషణలు సభ్యతా పరిధిని దాటి ఎప్పుడూ వెళ్లలేదు.” అన్నాడు వనమాలి.

“ఎంత అందం! అందానికి తగ్గ మ్యానర్స్! నీవేం చేస్తావో తెలియదు గాని, ఆ అమ్మాయిని మాత్రం వదులుకోకురోయ్! ఆమె ఎవరి జీవితం లోకి వచ్చినా, వారి జీవితం పండు వెన్నెల మయమే!”

“అవును. షి ఈజ్ రియల్లీ ఎ జెమ్ ఆఫ్ గర్ల్స్!” అన్నాడు వనమాలి.

(ఇంకా ఉంది)

Exit mobile version