[శ్రీ పాణ్యం దత్తశర్మ వ్రాసిన ‘మరణం మధురం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]
[మర్నాడు సాయంత్రం విభావరి ముందు గుడికి వస్తుంది. తండ్రి ఏదో పని మీద వెళ్ళడంతో, పూజాదికాలు నిర్వహిస్తుంటాడు వనమాలి. ఆమెను చూసి, ఆలయంలో ఉన్న పదహారు చేతుల నరసింహస్వామి దర్శనం చేయిస్తాడు. వేణుగోపాల స్వామి విచిత్ర భంగిమ గురించి అడిగితే, వివరిస్తాడు వనమాలి. ఆమె అడిగిన మీదట తమ వంశ పారంపర్య అర్చకత్వం గురించి చెప్తాడు. ఆమె వెళ్ళేటప్పుదు మెట్ల దాకా వచ్చి సాగనంపుతాడు. వేణిసోంపురం ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో హెడ్ మాస్టారు పద్మనాభ రావుకి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. వనమాలి, అతని స్నేహితుడు సుగుణాకర్ మాట్లాడుకుంటారు. సుగుణాకర్ ప్రస్తుతం పెబ్బేరులో ఎమ్.డి.ఓ.గా చేస్తున్నానని చెప్తాడు. తాను డిఎస్సికి ప్రిపేరవుతున్నానని అంటాడు వనమాలి. అక్కడే ఉన్న విభావరిని సుగుణాకర్కి పరిచయం చేస్తాడు. మర్నాడు ఉదయం తాము తమ ఊరికి వెళ్ళిపోతున్నామని చెప్తుంది విభావరి. తనకి అభ్యంతరం లేకపోతే ఫోన్ నంబర్ ఇవ్వమంటాడు వనమాలి. ఇస్తుంది. ఆరు నెలలు గడుస్తాయి. వనమాలి డిఎస్సిలో సెలెక్ట్ అవుతాడు. పెబ్బేరు మండలం లోని అయ్యవారిపల్లె గ్రామం లోని జెడ్.పి. ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ వస్తుంది. వెళ్ళి జాయినవుతాడు. పెబ్బేరులో సుగుణాకర్ గదినే షేర్ చేసుకుంటాడు. ఆ పూటకి బయట తినేసి వచ్చి నిద్రకి ఉపక్రమిస్తారు. మాటల్లో విభావరి ప్రస్తావన వస్తే, ఆ అమ్మాయిని వదులుకోవద్దని అంటాడు సుగుణాకర్. – ఇక చదవండి.]
ప్రతి వీకెండ్ వేణిసోంపురం వెళ్లి, అమ్మానాన్నలను, వేణుగోపాలుని చూసుకుని వస్తున్నాడు వనమాలి. పెబ్బేరులో కర్నూలు వైపు వెళ్లే ఏదో ఒక ఎక్స్‌ప్రెస్ బస్ ఎక్కి గద్వాల్ చౌరస్తా వద్ద దిగుతాడు. అక్కడున్న ఊరును ‘ఎర్రవల్లి’ అంటారు. అక్కడికి కర్నూల్ 34 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడనుంచి రాయచూరు వైపు వెళ్ళే బస్ పట్టుకొని ‘అయిజ’లో దిగుతాడు. అక్కడనుంచి యింటికి షేర్ ఆటో. అదొక పది కిలోమీటర్లు ఉంటుంది. శనివారం సాయంత్రం హెడ్ మాస్టారు గారి వద్ద ఒక గంట పర్మిషన్ తీసుకొని బయలుదేరతాడు. మళ్లీ సోమవారం ఉదయం వేణిసోంపురంలో బయలుదేరి, డైరెక్ట్‌గా అయ్యవారిపల్లె లోని స్కూలుకు వెళ్లిపోతాడు వనమాలి. పెబ్బేరు లోని రూముకి ఇక వెళ్లడు. సెకండ్ సాటర్ డే, పండగలు వస్తే, దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటాడు. సుగుణాకర్కు అంత తీరుబాటు దొరకదు. అతని ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నది.
పెబ్బేరు, ఎర్రవల్లి, గద్వాల, అలంపూరు ప్రాంతాలు తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌లో ఉన్నా, ఆ ప్రాంతం ప్రజలందరికీ కర్నూలు నగరంతోనే అనుబంధం ఎక్కువ. రాష్ట్ర సరిహద్దు కదా! ఏ పనికైనా కర్నూలుకే వెళతారు. అలంపూరు చౌరస్తా నుంచి శ్రీ బాలబ్రహ్మేశ్వర, జోగుళాంబాదేవి దేవస్థానం 13 కిలోమీటర్లు ఉంటుంది. దేవస్థానం వారి స్వాగతపు ఆర్చి హైవే మీదే ఉంటుంది. అక్కడ ఫ్లై ఓవర్ వచ్చింది. అలంపూరు నుంచయితే, తుంగభద్రలో బాగా నీళ్లుంటే పడవల మీద కర్నూలు చేరవచ్చు. పది నిమిషాలు, లేదా పావుగంట అంతే. కర్నూలు సాయిబాబా గుడి ఘాట్ వద్ద దిగి సిటీలోకి వెళ్లవచ్చు. అక్కడే సాయిబాబా థియేటర్ ఉంటుంది. బహుశా ఇప్పుడు దాన్ని కూల్చి వేసి మల్టీప్లెక్స్‌గా మార్చి ఉంటారేమో? అక్కడి నుండి కొండారెడ్డి ఋరుజు సెంటర్ – అర కిలోమీటరు. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలను వేరు చేసేది తుంగభద్ర నది మీద బ్రిడ్జ్ మాత్రమే!
ఆ వీకెండ్లో రెండవ శనివారం, సోమవారం ఏదో ముస్లిముల పండుగ కలిసి వచ్చాయి. అంటే మూడు రోజులు సెలవు. వనమాలి వేణిసోంపురంలో ఉన్నాడు. వనమాలి వాళ్లమ్మ మీనాక్షమ్మ కొడుకు వచ్చినపుడు అతనికిష్టమైనవన్నీ చేసి పెడుతుంది. పెబ్బేరులో అన్నంలో వేసుకోవడానికి రకరకాల పొళ్లు, పచ్చళ్లు చేసి ఇస్తుంది.
ఆ రోజు సోమవారం. మీనాక్షమ్మ కొడుక్కు ఇష్టమని వాంగీ బాత్ చేసింది. పొట్లకాయ బజ్జీలు, మెంతికూర పప్పు, పొదీనా పచ్చడి. కర్నూలు జిల్లా ప్రభావం వల్ల వాళ్లు పచ్చడిని ‘ఊరుమిండి’ అంటారు. తండ్రీ కొడుకులు భోజనం చేస్తున్నారు.
“నీవు వచ్చినపుడేరా నాకూ జిహ్వకు రుచులందేది. మిగతా రోజుల్లో పప్పు చేస్తే కూర చేయదు, కూర చేస్తే పప్పు చేయదు మీ అమ్మ!” అన్నాడు కేశవాచార్యులు నవ్వుతూ.
“చూడరా వనమా! మీ నాన్నగారి మాటలు! ఉన్నది ఇద్దరం. రాత్రి ఎలాగూ ఫలహారమే. నాలుగు రకాలు చేసినా తినే నాథుడేడి? మిగిలిపోయి పారబోయడం తప్ప!” అన్నది మీనాక్షమ్మ. భర్త హాస్యానికంటున్నాడని ఆమెకు తెలుసు.
వనమాలి, పప్పులో పొట్లకాయ బజ్జీ నంచుకొని తింటూ నవ్వాడు!!
“పోనీ నాన్నకు కూడా రోజు ఇలా చేసి పెట్టమ్మా! పాపం!” అన్నాడు. ముగ్గురూ నవ్వుకున్నారు.
మగనికి సైగ చేసిందామె, తామనుకున్న విషయం కొడుకుతో కదపమని. “నాయనా! ఆ వేణుగోపాలుని కృప వల్ల నీకో ఉద్యోగం కూడా వచ్చింది. నీకు వివాహం చేద్దామనుకుంటున్నాం, నేను, మీ అమ్మ” అన్నాడాయన.
“ఎన్నాళ్లు అని పచ్చళ్లు, పొడులతో ఆ పెబ్బేరులో అవస్థ పడతావురా? వేడి చేస్తుంది. చూడు, ఈ నాలుగైదు నెలల్లో ఎలా చిక్కిపోయావో! నల్లబడినావు కూడా!” అన్నది తల్లి దిగులుగా.
‘భోజనం కోసమే పెళ్లి’ అన్నట్లుగా మాట్లాడుతున్న అమ్మ వైపు చూసి నవ్వాడు కొడుకు. కానీ అసలు కారణం అది కాదని అతనికి తెలుసు. తననొక యింటివాడిని చేసి, మనుమడినో, మనుమరాలినో ఎత్తుకోవాలని వాళ్ల ఆశ. అది సమంజసం కూడా.
ముందే తరిగి పెట్టుకున్న మామిడి పండ్ల ముక్కలు పెరుగన్నంలోకి వేసిందామె. కొడుకు మౌనంగా తింటున్నాడు.
“ఇప్పుడు నా పెళ్లి కేమంత తొందర వచ్చిందమ్మా!” అని అనలేదు వనమాలి.
“మొన్న మక్తల్ నుంచి ఒక సంబంధం వచ్చింది. పిల్ల తండ్రి కురువపురం (కూర్మగడ్డ) లోని శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో అర్చకుడట. కృష్ణానదికి ఇటు వైపునే వల్లభాపురం దేవస్థానంలో పని చేస్తాడట. ఆయన పేరు దేశికాచార్యులట. వారికి కొడుకు, కూతురు. కొడుకు పెద్దట. వాడికి పెళ్లయింది. వాడు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఈ పిల్ల మహబూబ్‌నగర్‌లో చదువుకుందట వాళ్ల చిన్నాన్న వాళ్లంట్లో ఉండి. డిగ్రీ పాసయిందన్నారు. వీళ్లు నివాసం మక్తల్‌లో. ఆయన స్కూటరు మీద రోజూ వల్లభాపురం పోయి వస్తాడు. మక్తల్‌లో సొంత యిల్లు. కొంచెం భూవసతి కూడ ఉందన్నారు. మరి అమ్మాయి అందంగా ఉంటుందట. వైఖానస సంప్రదాయాన్నే పాటిస్తారట. కాబట్టి ఆచారవ్యవహారాలలో తేడా ఉండదు. జాతకం కూడా ఇచ్చి వెళ్లాడు సంబంధం తెచ్చిన జనార్దనాచార్యులు.”
“నాన్న మీ రెండు జాతకాలు గుణించారు రా వనా! 22 గుణాలు వచ్చాయి. గ్రహమైత్రి కూడా బాగా కుదిరింది నాయనా! నీవు సరినంటే, ముందుకు పోదాము” అన్నది తల్లి.
“మరి, మనది మధ్వాచార్య సంప్రదాయం కదా!” అన్నాడు వనమాలి, తనకా విషయాల మీద అంత పట్టింపు లేకపోయినా.
“అందరం ఆ విష్ణువును పూజించేవారిమే కదరా! అట్లా అని, మనవాళ్ళల్లో కొందరిలాగా మనకు శివుడంటే వ్యతిరేకత కూడా లేదు” అన్నాడు తండ్రి.
“మరి, ఎందుకు నాన్నా, ఒక వైష్ణవ స్వామి శివుడంటే గిట్టనట్లు, ఆయన్ను ఎగతాళి చేస్తూ మాట్లాడతాడు? సోషియల్ మీడియాలో దీని మీద చాలా దుమారమే చెలరేగింది!” అన్నాడు కొడుకు.
తల్లిదండ్రులు సెల్‌ఫోన్ వాడరని వనమాలికి తెలుసు.
“పెద్దవారి ప్రసక్తి మనకెందుకు లేరా? సంబంధం విషయం మాట్లాడుతూంటే, ఏదేదో చెబుతావెందుకు?” అని విసుక్కున్నాడు తండ్రి.
“మీరు అమ్మాయి వివరాలు చెబుతూంటే అసలు సరిగ్గా విన్నట్టు అనిపించ లేదండీ నాకు” అన్నది మీనాక్షమ్మ.
“నాన్నా, అమ్మా! మీ దగ్గర నాకు దాపరికం ఎందుకు? నా మనసులో మాట చెపుతున్నా వినండి. అప్పుడు, పద్మనాభరావు సార్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్‌కు వచ్చారే, వారి తమ్ముని కుటుంబం? సార్ తమ్ముని కూతురు, విభావరి, తరచూ మన గుడికి వచ్చేది..!”
“అవును. బంగారుతల్లి ఆ పిల్ల!” అన్నాడు కేశవాచార్యులు. ఆయన వదనం ప్రసన్నమయింది. కొడుకు మనసు అర్థమయింది ఆ తండ్రికి.
కానీ బయటపడకండా, “ఆ, చెప్పు, ఆ విభావరి..?” అన్నాడు.
తల్లి ఆసక్తిగా ఇద్దరి మాటలూ వింటూ ఉంది. విభావరితో ఆమె మాట్లాడలేదు గాని, భర్త చెప్పగా విన్నది.
“ఆ అమ్మాయంటే నాకు చాలా యిష్టం నాన్నా!” అన్నాడు తల వంచుకుని.
“మరి యిప్పుడా చెప్పేది? పద్మనాభుడు రిటైరై ఐదారు నెలలు కాలేదా? ఆ అమ్మాయికి పెళ్లయిపోయిందో ఏమో?” అన్నాడాయన కొడుకును ఆట పట్టిద్దామని.
“ఇంకా కాలేదు” అన్నాడు తలెత్తి ఇద్దర్నీ చూస్తూ.
“నీకెలా తెలుసురా?” అన్నది తల్లి.
“ఇద్దరం ఫోన్లలో అప్పుడప్పుడూ మాట్లాడుకుంటుంటాము” అన్నాడు వనమాలి. ఎందుకో గాని, అతనికి కొంచెం గిల్టీగా అనిపించింది.
“మరి ఆ అమ్మాయికి కూడా ఇష్టమో కాదో అడిగావా నాయనా?” అన్నది తల్లి.
“అడగలేదమ్మా! నీవు నాన్న వెళ్లి అడగండి.”
కొడుకు తమకిస్తూన్న గౌరవానికి, పెద్దరికానికి, వారిద్దరూ గర్వపడ్డారు. ఇంత బుద్ధిమంతుడైన కొడుకును తమకిచ్చినందుకు మనసులోనే జోతలు అర్పించారు, ఆ వేణుగోపాలునికి.
“ముందు మన పద్మనాభునితోనే విషయం కదుపుతా. వాడు తమ్మునితో మాట్లాడుతాడు. తర్వాత ఇద్దరం వెళ్లి మాట్లాడతాము. వాళ్లు ఎక్కడ ఉండేదన్నావు?”
“రాయచూరులో!” అన్నాడు ఠక్కున. “విభావరి వాళ్ల నాన్నగారు నాగభూషణశర్మగారు. అమ్మగారు మంగళగౌరి. ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో ట్రాక్ ఇన్స్పెక్టర్.”
“సరే, సరే. ఈ మహాలయ పక్షాల్లో శుభప్రస్తావన ఎందుకు తేవడం? అమావాస్య వెళ్లిన తర్వాత, మంచిరోజు చూసుకోని వెళుదురుగాని” అన్నది మీనాక్షమ్మ.
లేచి వెళ్లి అమ్మానాన్నలనిద్దరినీ కౌగిలించుకున్నాడు వనమాలి.
విభావరితో ఫోన్లో మాట్లాడినపుడల్లా, వాచ్యంగా చెప్పకపోయినా, ఆమెకూ తనంటే ఇష్టమని అతనికి తెలుస్తూనే ఉంది. తానే డైరెక్ట్ అడగవచ్చు. కానీ, పెరిగిన సంస్కారం అలా చేయనివ్వలేదు. సంప్రదాయం ప్రకారమే వెళదామనుకున్నాడు.
మీనాక్షమ్మ “అయినా, మగ పిల్లవాడి తరపున మనం వెళ్లి అగడమేమిటి? వాళ్లు వచ్చి మనల్నడగాలి గాని” అన్నది, కొడుకును ఆట పట్టించడానికి. వారిద్దరికీ అటువంటి అహాలు లేవు.
“పిచ్చిదానా! రత్నాన్ని మనం అన్వేషించుకుంటూ వెళ్లాలి గాని, రత్నం మనలను అన్వేషించుకుంటూ రాదే! ఆ విభావరి రత్నం. మనం వెళ్లి అడిగితేనేం?” అన్నాడాయన.
“అయితే. నా బంగారు తండ్రి రత్నం కాదా?” అన్నదా తల్లి, కొడుకు తల నిమురుతూ.
వనమాలి, తనపై వారికి గల వాత్సల్యాన్ని భావించి, కళ్ళు చెమర్చుకున్నాడు.
***
ఇంటిముందు వసారాలో ఎవరిదో శవం పడుకోబెట్టి ఉంది. కాలి రెండు బొటనవేళ్ళనూ దగ్గరికి లాగి, పురికొసతో కట్టేశారు. ఇద్దరు పెద్ద వయసువాళ్ళు శవంపై పడి హృదయ విదారకంగా రోదిస్తున్నారు. ఇంటి బయట ఇద్దరు పాడెను సిద్ధం చేస్తున్నారు.
వనమాలికి అంతా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రెండు వెదురు బొంగులు నిలువుగా పడుకోబెట్టి, అడ్డంగా చీల్చిన దబ్బలను కొబ్బరితాళ్లతో కట్టి బిగించారు. పైన కొత్తది ఈతచాప పాడె వెడల్పుకు సరిపోయేట్లు కత్తిరించి పరిచారు.
ఊర్లో చాలామంది వచ్చారు. అందరి ముఖాల్లో విచారం. కొందరు ఆడవాళ్లు ఐతే కన్నీరు కారుస్తున్నారు.
“పాపం చిన్నవయసు. నిండా పాతికేళ్లు కూడా ఉండవు. ఈ మధ్యనే గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కూడా వచ్చింది పాపం” అంటున్నాడొకాయన. నిద్రలోనే ఉలిక్కిపడ్డాడు వనమాలి!
‘ఇదేమిటి? నా గురించేనా చెబుతున్నాడు?’ అనుకొన్నాడు.
“ప్రతివారం వచ్చి అమ్మానాన్నలను చూసిపోయేవాడు”
“నవ్వు ముఖం. అందర్నీ ఆప్యాయంగా పలకరించేవాడు”
“గుడిలో పూజలు కూడా శ్రద్ధగా చేసేవాడు”
“ఈ వయసులో ఎలా తట్టుకుంటారో పాపం!”
అందరి మాటలూ సృష్టంగా వినబడుతున్నాయి వనమాలికి. తల్లి గుండెలు బాదుకుంటూ రోదిస్తూ ఉంది. ఆమె ముఖం సృష్టంగా కనబడుతుంది.
“నాయనా, నా కడుపులో చిచ్చు పెట్టి వెళ్లిపోయావా? ఇక నాకెవరురా దిక్కు? వనమా! ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా నాయనా!” కేశవాచార్యులు ఏడ్చీ ఏడ్చీ సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయన ముఖం కూడా స్పష్టంగా కనబడుతుంది వనమాలికి.
ఎవరో ఒకాయన “కానివ్వండి, వర్షం వచ్చేలా ఉంది. ‘దహనం’ కష్టమవుతుంది. అమ్మా! మీనాక్షమ్మ తల్లీ! మీరు గుండె దిటవు చేసుకోవాలి. వాడు చూడండి ఎలా స్పృహ తప్పి పడిపోయాడో! ఆ వేణుగోపాలుడు తీరని అన్యాయం చేశాడు మీకు! ‘జాతస్యహి ధృవో మృత్యుః’ అన్నదే ఆయన! కాని ఇంత చిన్నవయసులో, అకాలమరణమా! దేవుడా! నీవెంత నిర్దయుడవయ్యా! ఇదిగో నాగరత్నమ్మా! మీనాక్షమ్మను పక్కకు లాగు. శవానికి స్నానం చేయించాలి.”
ఎవరా ఆయన అని చూశాడు వనమాలి. హెడ్ మాస్టరు పద్మనాభ రావు గారు. తన తండ్రిని వాడు అనగలిగింది ఆయన ఒకరే.
శవం ముఖం సరిగ్గా కనపడడం లేదు. కాని అది తనదేనని అర్థమైంది. శవాన్ని ఇద్దరు పట్టుకోని బయట ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. తనే!
‘తనకెందుకు దుఃఖం రావటం లేదు? పైగా సంతోషంగా ఉందేమిటి? తన తల్లిదండ్రులు గుండెలు పగిలిలే ఏడుస్తూ తన మంచితనాన్ని పొగడుతూ ఉంటే మనసుకు హాయిగా ఉందెందుకు?’
శవానికి స్నానం చేయిస్తున్నారు. తల్లీతండ్రీ చెంబుతో తల మీద నీళ్లు పోస్తూ బావురుమన్నారు. కొత్త పంచె కట్టించారు. నుదుట కుంకుమ పులిమారు.
‘ఎంత అందంగా ఉంది తన శవం?!’
ముందురోజు రాత్రి శవజాగరణ కోసం పిలిపించిన భజన బృందం వారు హార్మోనియం, డోలక్ సర్దుకుని, తన శవానికి నమస్కరించి వెళ్లిపోతున్నారు. తన ఆత్మశాంతి కోసం వాళ్లు రాత్రంతా నామసంకీర్తనం చేశారు. పద్మనాభ రావు గారు వారికి ‘సంభావన’ ఇవ్వబోతే వారు తీసుకోలేదు.
“బంగారమంటి పిల్లోడు సారు! పాపం ఆ ముసలివాండ్లు ఏమయి పోతారో ఏమో?” అంటున్నాడు భజన బృందంలో ఒకాయన. ఆయన పేరు కృష్ణయ్య. అతన్ని గుర్తుపట్టాడు వనమాలి.
శవాన్ని పాడె మీద పడుకోబెట్టి, గట్టిగా తాళ్లతో బిగించారు. శవం నోరు కొంచెం తెరుచుకుని ఉంది. కొందరు నోట్లో బియ్యం వేసి శవానికి 3 ప్రదక్షిణలు చేస్తున్నారు.
నలుగురు నాలుగు వైపులా పాడెను భుజాన ఎత్తుకున్నారు, “నారాయణ! నారాయణ!” అంటూ. కేశవాచార్యులు మట్టి పిడతలో నిప్పు తీసుకుని, దాన్ని ఒక ఉట్టిలో పెట్టుకుని, శవం ముందు నడుస్తున్నాడు.
మీనాక్షమ్మ తానూ శ్మశానానికి వస్తానని. కొందరు ఆడవాళ్లు ఆమెను గట్టిగా పట్టుకున్నారు. ‘ఏడు కట్ల సవారి’ బయలుదేరింది. దోవ పొడవునా జనం. అందరిలో దుఃఖం!
వనమాలికి మళ్లీ గర్వంగా అనిపించింది!
శ్మశానంలో అప్పటికే కట్టెలతో చితి పేర్చి ఉంది. పురోహితుడు ఇంటి వద్ద, ఇక్కడ కూడా కొంత తంతు నిర్వహించాడు. ఆయనను గుర్తించాడు వనమాలి. ఆయన పేరు ఆదివరాహమయ్య. ఆయన ‘అయిజ’లో అపర కర్మల స్పెషలిస్టు. క్లుప్తంగా ‘ప్రాయశ్చిత్త హోమం’ కూడా చేశాడాయన.
మధ్యలో ‘దింపుడు కళ్లం’ వచ్చింది. కేశవాచార్యులును పిలిచాడు ఆదివరాహమయ్య. పాడె క్రిందికి దింపమన్నాడు. ఆయనను శవం చెవి దగ్గర నోరు పెట్టి ముమ్మారు పిలవమన్నాడు.
“నాయనా! వనమా! లేరా!” అంటూ కేశవాచార్యులు కొడుకు చెవిలో పిలిచారు. శవం పలకలేదు. ఇంతవరకు ఏ శవమూ పలికిన దాఖలాలు లేవు.
వనమాలికి చాలా వినోదంగా ఉంది ఇదంతా! ‘తాను చచ్చిపోయాడు కదా! తెలిసి పిలవడం ఎందుకో?’ అనుకున్నాడు.
“దీన్నే ‘దింపుడు కళ్లం ఆశ’ అంటారు!” అంటున్నారెవరో. ఆయన ఎవరా అని చూశాడు వనమాలి. ఆయన వేణిసోంపురం గ్రామ సర్పంచ్ శేషశయనా రెడ్డి!
సర్పంచ్ కూడా తన అంత్యక్రియలకు హాజరైనందుకు వనమాలికి ‘గర్వం’గా అనిపించింది.
నీళ్లు కుండ భుజాన మోసుకొని, చితి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేశాడు కేశవాచార్యులు. దుఃఖాన్ని, అతి కష్టమ్మీద అదుపు చేసుకుంటున్నాడాయన
ఎవరో ఒక కొరివిని అంటించి ఆయనకిచ్చారు. ఆయన కుండను అలాగే వెనక్కు వదిలేయగా అది భళ్ళున పగిలింది.
దాన్ని ఆసక్తిగా గమనించాడు వనమాలి. ఆ శబ్దం శతని చెవులకు హాయిగా అనిపించింది!
చితిని ముట్టించాడు కేశవాచార్యులు. అగ్ని దేవుడు క్రమంగా చితినంతా అలుముకుంటున్నాడు. పెద్ద పిడకనొకదాన్ని శవం ముఖానికి అడ్డంగా ఉంచారు. మంటలు బాగా రావడానికి కాటికాపరి చితి మీద కిరసనాయిలు చల్లాడు. మంటలు పెల్లుబికి శవాన్ని దహించసాగాయి:
“దహ్యతే ఇతి దేహం! అని అన్నారందుకే” అంటున్నారెవరో!
“నాకు తలకొరివి పెట్టవలసిన నీకే నేను తలకొరివి పెట్టవలసివచ్చిందా నాయనా!’’ అంటూ హృదయవిదారకంగా విలపిస్తున్నాడు కేశవాచార్యులు. చాలామంది వెళ్లిపోతున్నారు. ఎందుకో అసంతృప్తిగా అనిపించింది వనమాలికి. ‘అయినా, తాను చచ్చిపోయాడు కదా! ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి?’ అన్న ఆలోచన వచ్చిందతనికి. బహుశా తను ‘అత్మ’గా మారాడేమో!
కొంత సేపటి తరువాత ‘కపాలమోక్షం’ జరిగినట్లు పుర్రె పగిలిన ధ్వని! అది కూడా చెవికింపుగా ఉంది వనమాలికి.
“పదండి. వెళదాం. అస్థి సంచయనానికి నేను వస్తాను కేశవాచార్యులు గారు. బాబు అస్థికలను బీచుపల్లి వద్ద ‘కృష్ణ’లో కలుపుదాం. అపరకర్మలన్నీ అక్కడే చేద్దాం. మనకు అన్ని వసతులూ ఉన్నాయక్కడ” అంటున్నాడు ఆదివరాహమయ్యగారు.
“వద్దు! వద్దు! నా అస్థికలను మన గుడి పక్కన తుంగభద్రలోనే కలపాలి. అపరకర్మలన్నీ అక్కడే చేయాలి” అని గట్టిగా అరుస్తున్నాడు వనమాలి! పెద్ద పెద్ద కేకలు! ఎవరూ వినిపించుకోలేదు!
వనమాలి కేకలు విని లేచి పరుగున బయటికి వచ్చారు కేశవాచార్యులు, మీనాక్షమ్మ. అతని ఒంటినిండా చెమటలు! దీవాన్ కాట్ మీద ఫ్యాన్ తిరుగుతూనే ఉంది.
“నాయనా! వనమా! ఏమయ్యింది రా ! ఎందుకలా నిద్రలో అరుస్తున్నావు?” అంటూ కొడుకును కుదిపి లేపారు.
వనమాలికి మెలకువ వచ్చింది. నోరు ఎండిపోయింది. అమ్మానాన్నల వైపు అయోమయంగా చూస్తున్నాడు.
“నీవు వెళ్లి మంచినీళ్లు తీసుకురా పో” అన్నాడు తండ్రి.
తల్లి తెచ్చిన గ్లాసెడు నీళ్ల గటగట తాగేశాడు. క్రమంగా తేరుకున్నాడు.
“ఏమయిందిరా! భయపడ్డావా?” అన్నది తల్లి అతన్ని దగ్గరగా పొదువుకొని.
‘అంటే తను చచ్చిపోలేదా? కలా ఇదంతా?’ అనుకున్నాడు.
“అమ్మా! చాలా పెద్ద పీడకల వచ్చిందే!” అన్నాడు బేలగా.
కేశవాచార్యులు లోపల దేవుని గూడు దగ్గరకు వెళ్లి, నరసింహ స్వామి వెండి విగ్రహం వద్దనున్న కుంకుమ తెచ్చి కొడుకు నుదుట పెట్టాడు.
“నమస్తే నారసింహయ నమస్తే మధువైరిణే
నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖహారిణే”
అనే శ్లోకాన్ని బిగ్గరగా చదివాడు.
కలలో తాను చూసిందంతా చెప్పాడు వాళ్లకు.
తండ్రి నవ్వి అన్నాడు. “కలలో మనం చనిపోయినట్లు వస్తే మంచిదేనంటారు మన పెద్దలు!”
“తెల్లవారు ఝామున వచ్చే కలలు నిజమవుతాయంటారు కదా నాన్నా!” అన్నాడు వనమాలి!
గోడకున్న గడియారం రాత్రి ఒంటిగంట చూపిస్తుంది. దాన్ని చూపించి చెప్పాడు తండ్రి – “ఇది తెల్లవారు ఝాము ఏమీ కాదు లేరా!”
“గదిలో మా దగ్గర పడుకుందువు గాని రా నాయనా!” అన్నది తల్లి.
“వద్దమ్మా! అయినా కలే గదా! మీరు వెళ్లి పడుకోండి” అన్నాడు ఆవలిస్తూ.
ఇద్దరూ వెళ్లిపోయారు. తన చావు, అంత్యక్రియలు అన్నీ సృష్టంగా కలలో కనబడటం ఒక చిత్రమైతే, అదంతా, కలలోనే అయినా, మనసుకు సంతోషంగా ఉండటం మరింత చిత్రంగా అనిపించిందతనికి. తర్వాత మళ్లీ నిద్రపట్టింది. కలలేవీ రాలేదు.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
