[శ్రీ పాణ్యం దత్తశర్మ వ్రాసిన ‘మరణం మధురం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ప్రతీ వారాంతం ఊరికి వెళ్ళి అమ్మానాన్నలతో గడిపి వస్తుంటాడు వనమాలి. ఈసారి సోమవారం కూడా సెలవు రావడంతో, మరో రోజు ఇంట్లో గడిపే వీలు చిక్కుతుంది. ఆ సందర్భంగా వనమాలి పెళ్ళి ప్రస్తావన వస్తుంది. అప్పటికే ఒక సంబంధం వచ్చిందనీ, ఆ వివరాలు చెప్తాడు కేశవాచార్యులు. జాతకాలు కుదిరాయని అంటుంది తల్లి. ఇక అప్పుడు, తాను విభావరిని ఇష్టపడుతున్నట్టు చెప్తాడు. కాసేపు కొడుకుని ఆటపట్టించి, ఆ తరువాత ఆ అమ్మాయంటే తమకీ ఇష్టమేనని చెప్తాడు తండ్రి. వాళ్ళ పెదనాన్న అయిన పద్మనాభరావుతో మాట్లాడుతాని అంటాడు. అమావాస్య వెళ్ళాకా మాట్లాడమని చెప్తుంది మీనాక్షమ్మ. ఆ రాత్రి తాను చనిపోయినట్టు, అందరూ దుఃఖిస్తున్నట్టు, తాను పక్కనే నిలబడి తన శవాన్ని చూసుకుంటున్నట్టు కల వస్తుంది వనమాలికి. అయితే తనకి దుఃఖం రాకుండా, సంతోషం కలగడం చూసి ఆశ్చర్యపోతాడు కలలోనే. అంత్యక్రియలు కూడా జరిగిపోతాయి. అస్థికలను ఎక్కడ నదిలో కలపాలన్న చర్చ జరుగుతున్నప్పుడు – మన గుడి పక్కన తుంగభద్రలోనే కలపాలి – అంటూ నిద్రలోనే గట్టిగా అరుస్తూంటాడు వనమాలి. తల్లీదండ్రీ గాభరా పడుతూ వచ్చి, కుదిపి లేపి, ఏమైందని అడుగుతారు. కాసేపటికి అంతా గుర్తు చేసుకుని, కలలో తాను చూసిందంతా చెప్తాడు. కలలో మనం చనిపోయినట్లు వస్తే మంచిదేనంటారు మన పెద్దలు అని చెప్తాడు తండ్రి. కాసేపటికి మళ్ళీ నిద్రపడుతుంది. ఈసారి కలలేవీ రాలేదు. – ఇక చదవండి.]
మర్నాడు ఉదయం ఆలస్యంగా నిద్రలేచాడు వనమాలి. టైం ఎనిమిది దాటింది. గబగబ తయారై బయలుదేరినా స్కూలుకు సకాలానికి చేరుకోలేడు. దూరం 60 కిలోమీటర్లే గాని, మూడంచెల ప్రయాణం! హెడ్మాస్టర్ గారికి ఫోన్ చేశాడు. వేణిసోంపురంలో సిగ్నల్స్ సరిగ్గా రావు. బి.ఎస్.ఎన్.ఎల్. అయితే మరీను. అతనిది ఎయిర్ టెల్. ఐనా, కాల్ వెళ్లకుండా బెక్కుతూంది. డాబా మీదికి వెళ్లి ప్రయత్నించాడు. రింగ్ వెళుతూ ఉంది. అటు నుంచి షేక్ పీరా గారు లిఫ్ట్ చేశారు.
“ఏమి సైన్సు సారు? ఊర్నించి బయలుదేరి ఎంతసేపాయ?” అనడిగాడాయన. ఆయన గొంతులో వనమాలి పట్ల ఉన్న కన్సర్న్ అంతా పలికింది.
“సారీ సార్! రావడానికి లేటవుతుంది. దయచేసి హాఫ్ డే సి.ఎల్. గ్రాంట్ చేయండి ఈ పూటకు!” అన్నాడు వినయంగా.
అటు నుంచి ఫెళ్లున నవ్విన శబ్దం! “అరె పాగల్! ఏదో ఒక టైంకు రారాదె? వచ్చి సైంజేసి రెండు క్లాసులు చెప్పు. ఖతమ్! నీకెందుకు నేను చూసుకుంటా గదనే!” అన్నాడాయన.
“థాంక్యూ సార్!” అన్నాడు వనమాలి. గబగబ తయారైనాడు. కొన్ని జతల బట్టలు ఇక్కడ కూడా ఉంచుకుంటాడు కాబట్టి, బ్యాగ్ అవసరం ఉండదు. నాన్న పొద్దున్నే గుడికి వెళ్లిపోయినట్లున్నాడు.
మీనాక్షమ్మ వరి నూకతో ఉప్మా చేసింది, కంచుగిన్నెలో. దానికి పుట్నాల పొడి, ఎండుకొబ్బరితో కలిపి కొట్టింది. నేతితో పోపు వేసి చేసిందేమో ఘుమఘుమ లాడుతూ ఉంది.
బాదం ఆకులతో కుట్టిన విస్తరిలో రెండు హస్తాల ఉప్మా వడ్డించింది ఆమె. దాని మీద పుట్నాల పొడి వేసి, నెయ్యి వేసింది.
“అమ్మా! సూపర్!” అన్నాడు తింటూ. అమ్మ నవ్వింది! అమ్మలు అందరూ అట్లే నవ్వుతారు, పిల్లలు తృప్తిగా తింటుంటే.
“మామిడికాయ, గంగవాయలాకు పప్పు, మటిక్కాయల మిరప్పొడి చేశాను మీ ఇద్దరి కోసం. మధ్యాహ్నం ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం పెట్టుకోండి. పెరుగు తెచ్చుకోవడం మర్చిపోకండిరా” అన్నదామె. కర్నూలు జిల్లా ప్రభావం వల్ల గోరుచిక్కుడును మటిక్కాయలంటారు వాళ్లు. రెండు చిన్న హాట్ బాక్సులలో పప్పు, కూర పెట్టి, చిన్న సంచిలో పెట్టి యిచ్చింది. అమ్మను కౌగిలించుకోని, పాదాలకు మొక్కాడు వనమాలి. “గుడికి వెళ్లి నాన్నకు చెప్పి వెళతా” అన్నాడు.
గుడిలో భక్తులెవరూ లేరు. ఒకాయనకు తన కూతురిని ఒడిబియ్యం పెట్టడానికి పిల్చుకురావడానికి మంచిరోజు చూస్తున్నాడు కేశవాచార్యులు, పంచాంగంలో.
హడావిడిగా మెట్లు ఎక్కి వెళ్లి “నాన్నా, వెళ్లొస్తాను.” అంటూ పాదాలకు మొక్కాడు.
“మంచిది నాయనా! ఏమయినా తిన్నావా?” అన్నాడాయన.
“ఆ లక్షణంగా. అమ్మ బియ్యపు నూక ఉప్మా చేసిందిలే. మధ్యాహ్ననికి పప్పు, కూర కూడా కట్టిచ్చింది.”
“సరే అయితే! జాగ్రత్త! చేరగానే ఫోన్ చెయ్యి.” అన్నాడు.
షేర్ ఆటోలో ఒకే సీటుంది డ్రయివర్ ప్రక్కన.
గబగబా వెళ్ళి ఎక్కాడు “అయిజ” అన్నాడు డ్రయివర్‍తో.
“తెలుసు సామి” అన్నాడతడు నవ్వుతూ.
ఎర్రవల్లి (గద్వాల చౌరస్తా) లో బస్సులు ఆపడం లేదు. అన్నీ రష్‌గా ఉన్నాయి. కర్నూలు నుంచి ఏదో తూఫాన్ వ్యాన్ వచ్చింది “హైద్రాబాద్! ఆరామ్ ఘర్ చౌరస్త” అని అరుస్తున్నాడు క్లీనరు. వనమాలి డ్రైవర్ దగ్గరకు వెళ్లి “నన్ను పెబ్బేరులో దింపవా! ప్లీజ్” అన్నాడు. “ఎక్కుర్రి. గయితే జడ్చర్ల టికెట్ ఇయ్యాల” అన్నాడు.
“సరే!” అని ఎక్కి కూర్చున్నాడు. దానికి ‘తూఫాన్’ అని ఎందుకు పేరుబెట్టారో గాని, వాయువేగ మనోవేగాలతో వెళుతూంది. నిండా జనం. ఈ వ్యాన్లు కర్నూలు, బళ్లారి చౌరస్తా నుండి హైదరాబాదు లోని ఆరాంఘర్ చౌరస్తాకు తిరుగుతుంటాయి. ఎక్స్‌ప్రెస్ బస్ ఛార్జీ తీసుకుంటారు. అడపాదడపా ఇన్నోవాలు కూడా ఉంటాయి కాని, వాటికి బస్ ఛార్జీ కంటే రెట్టింపు.
పావు గంటలో పెబ్బేరులో దింపాడు. సార్ ఎలాగూ నిదానంగా రమ్మన్నాడు కదా అని, రూమ్‌కు వెళ్లాడు. సుగుణాకర్ ఇంకా ఆఫీసుకు వెళ్లలేదు. వనమాలిని చూచి, “వచ్చేశావా? ముఖం కొంచెం డల్‌గా ఉందేమిటి?” అనడిగాడు.
“అమ్మ ఏవో పంపే ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం అన్నం వండుకుంటే చాలు మనం. ఎలాగూ లేటయింది. నీవు కుక్కరు పెట్టి, లంచ్ చేసిపో” అన్నాడు. తయారై ఉన్నాడు అప్పటికే. బైక్ తీసుకొని వెళ్లిపోయాడు. వనమాలి కూడా భోజనం చేసి, మధ్యాహ్నం అయ్యవారిపల్లెకు వెళ్లిపోయాడు.
***
రాత్రి ఇద్దరూ రూం బయట ప్లాసిక్ కుర్చీలు వేసుకొని కూర్చున్నారు.
“చెప్పు, ఏమిటి ఊరి విశేషాలు?” అనడిగాడు సుగుణాకర్.
“ముందు నీవు చెప్పు.”
“ఏముంది? పెళ్లి చేసుకో అంటారు. ముందు చెల్లెలికి కావాలి, తర్వాతనే నా పెళ్లి! అని చెప్పాను.”
“ఒరేయ్, మీ చెల్లెలు నీకంటే ఐదేళ్లు చిన్నదన్నావు. ఆ పాప కోసం నీవు ఆగడం ఎందుకు?” అన్నాడు వనమాలి.
“ఇంట్లో వయసులో ఉన్న అమ్మాయిని పెట్టుకొని, నేను నా భార్యతో సరదాగా ఉండగలనా చెప్పు. అది తప్పు కదా!”
“నిజమేరా! నాకు తోచలేదు. అయామ్ ప్రౌడ్ ఆఫ్ యు. నాకు అక్క చెల్లి ఎవరూ లేరు కాబట్టి సమస్య లేదు.”
“మీవాళ్లేమంటున్నారు?”།
“మక్తల్ నుంచి ఏదో సంబంధం వచ్చిందట. అమ్మాయి చాలా బాగుంటుందట. నాన్న, అమ్మ ఒత్తిడి చేశారు.”
“మరి నీవేమన్నావు?”
“విభావరి గురించి చెప్పాను. ఆమె అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను. ఈ మహాలయ పక్షాల తర్వాత, పద్మనాభ రావు సార్‌తో ముందు విషయం కదిపి, ఆయన్ను తీసుకుని, రాయచూరుకు వెళ్లి, ఆయన తమ్మునితో, మరదలితో మాట్లాడి వస్తామన్నారు నాన్న.”
సుగుణాకర్ ముఖం సంతోషంతో వికసించింది. స్నేహితుడికి షేక్ హ్యాండ్ ఇస్తూ “సూపర్! ఎంత మంచి వార్త చెప్పావురా!” అన్నాడు
“తర్వాత, నీకో ముఖ్య విషయం చెప్పాలి” అంటూ సుగుణాకర్‌తో, నిన్న రాత్రి తనకు వచ్చిన కల మొత్తం వివరంగా చెప్పాడు.
జాగ్రత్తగా విన్నాడు మిత్రుడు. “కానీ, నీ మరణం, అంత్యక్రియలు నీవు చూసుకుంటా ఉంటే.. నీకంత ‘ఫీల్ గుడ్’ ఎమోషన్స్ ఎందుకు వచ్చాయో నాకర్థం కావడం లేదు” అన్నాడు.
“అదేరా నాకూ డౌట్. ‘అయ్యో! నేను చనిపోయానే’ అన్న దుఃఖం రాలేదు. అఫ్ కోర్స్ కల లోనే అనుకో! మా అమ్మా నాన్నా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే, నాకు బాగుంది.”
“బహుశా, అంత ప్రేమించే తల్లిదండ్రులు ఉండడం నీ అదృష్టమని కాబోలు” అన్నాడు సుగుణాకర్.
వనమాలి దిగులుగా అన్నాడు “ఒరెయ్ గుణా! ఒకవేళ నేను నిజంగా చనిపోతే, వాళ్లెంత బాధపడతారో! అలాంటి కలలు రావడం మంచిదేనన్నాడు నాన్న.”
“నీవెందుకు చచ్చిపోతావురా పిచ్చోడా! శుభమాని త్వరలో విభావరితో నీకు పెళ్లవుతుంది. హ్యాపీగా ఉండు!”
“అయితే ఈ కలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదంటావు?”
“ఈ కలనే కాదు, ఏ కలను కూడా! ‘రియాలిటీ’ కి వ్యతిరేక పదమే ‘డ్రీమ్’. అంటే ‘నిజం కానిది’ అని సరి. ఇక పడుకుందాం” ఇద్దరూ లోపలికి వెళ్లి నిద్రపోయారు.
***
మర్నాడు సుగుణాకర్ ఇంకా లేవలేదు. వనమాలి లేచి వేపచెట్టు కొమ్మల క్రింద, డాబా పిట్టగోడని ఆనుకొని నిలబడి ఉన్నాడు. సమయం ఆరున్నర కావస్తూంది. దినకరుడు, దూరంగా, జాతీయ రహదారికవతల, ఆకాశంలో తన లేత బంగారు కిరణాలను పెబ్బేరు పట్టణమంతా ప్రసరింప చేస్తూ ఉన్నాడు. ఊరంతా సూర్యోదయ శోభతో వెలిగిపోతూ ఉంది. దినమణి ఇంకా దుర్నిరీక్ష్యుడు కాలేదు. మానవులు తమ భౌతిక నేత్రాలతో ఆయనను చక్కగా చూడగలిగేలా ఉన్నాడు. మరొక గంట దాటితే కర్మసాక్షిని నేరుగా చూడలేరు. వేపచెట్టు పైన రాత్రి బస చేసిన పక్షులు కువకువలాడుతూ, గూళ్లు వదలి, కూడు కోసం ఎగిరిపోతున్నాయి. ఎదురుగ్గా, ఒక యింటి పెరట్లో, లేగదూడ, అప్పుడే వాళ్లమ్మ దగ్గర బొజ్జ నిండా పాలు తాగి, తోకపై కెత్తుకుని, హుషారుగా గంతులు వేస్తూంది. దూరంగా, పాండురంగస్వామి దేవాలయం గోపురానికి అమర్చిన స్పీకరు నుండి ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మిగారు గానం చేసిన విష్ణు సహస్రనామ స్తోత్రం శ్రావ్యంగా వినవస్తున్నది వనమాలి మనసంతా హాయిగా, ప్రశాంతంగా ఉంది.
లోపల రూములో ఛార్జింగ్ పెట్టి ఉన్న అతని సెల్‌ఫోన్ మ్రోగింది. యస్.పి. బాలు గొంతులో ‘ఎవరికెవరు ఈ లోకంలో, ఎవరికి ఎరుక, ఏ దారెటుపోతుందో, ఎవరినీ అడగక’ అన్న పాట రింగ్ టోన్‌గా వస్తూంది. ‘సిరిసిరిమువ్వ’ సినిమాలోని అద్భుతమైన పాట అది. వేదాంతగర్భితమైనది. వేటూరి గారి రచన. కె.వి.మహదేవన్ గారి సంగీతం. ఆ పాటంటే చాలా యిష్టం వనమాలికి. అందుకే దాన్ని రింగ్ టోన్‌గా పెట్టుకున్నాడు.
గబగబ లోపలికి వెళ్లి ఫోన్ తీసి, ఆన్సర్ బటన్ నొక్కాడు.
“హలో! వనమాలి గారు! శుభ ప్రభాతం!” అంటూ అటు వైపు నుంచి, విభావరి గొంతు; మధుర మధురంగా వినబడింది.
“వాట్ ఎ సర్‌ప్రైజ్ విభావరిగారు! మీకు కూడా శుభోదయం” అన్నాడు.
“నిద్ర లేచారా మహాశయా? లేదా? ‘కులదైవమగు సూర్యుడుదయించు వేళాయె, అరవింద లోచనా మేలుకో.. మేలుకో’ అంటూ మేలుకొలుపు పాడమంటారా?” కిలకిల నవ్వు.
వనమాలి మనస్సు ఆనందంతో గంతులు వేసింది. “లేదు. చాలాసేపయింది లేచి. మావాడింకా నిద్రపోతున్నాడు. ప్రభాతవేళ ప్రకృతిని చూస్తూ పరవశిస్తున్నా. ఇంతలో మీ ఫోన్.” అన్నాడు.
“ఈ వీకెండ్‌కు మీ ఊరికి వెళ్లొచ్చారా? అమ్మగారు, నాన్నగారు బాగున్నారు కదండీ?”
“బాగున్నారు. నిన్న ఉదయమే బయలుదేరి వచ్చాను. మీవాళ్లంతా బాగున్నారు కదా!”
“బాగున్నాం. పదిరోజులయింది కదా; పలకరిద్దామని చేశాను.”
“ధాంక్సండీ! నేనే చేద్దామనుకుంటున్నాను.”
“మళ్లీ మీ ఊరికి రావాలని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆ తుంగభద్రా తీరం, ఆ పెద్ద రావి చెట్టు, ఆ మెత్తని యిసుక తిన్నెలు, అన్నింటినీ మించి, ఆ వేణుగోపాలుడు!”
‘కొంతకాలం ఆగండి, ఏకంగా వచ్చేద్దురుగాని’ అని మనసులో అనుకున్నాడు వనమాలి. పైకి మాత్రం “తప్పకుండా రండి. మీరెప్పుడు వస్తారో చెబితే నేనప్పుడక్కడ ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.”
“మీరెప్పుడు అక్కడ ఉంటారో చెపితే నేనప్పుడు వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను” నవ్వు!
“మీతో మాట్లాడడం కష్టమండి.”
“సరే, అంత కష్టంగా ఉంటే ఫోన్ పెట్టేస్తా లెండి.”
“అయ్యో, నా ఉద్దేశం అది కాదు”
ఇలా సాగిపోతూ ఉంటుంది వారి ఫోన్ సంభాషణ. ప్రత్యేకంగా విషయమేమీ ఉండదు. అతన్ని కవ్విస్తుంది, నవ్విస్తుంది విభావరి. ఆమె ఏం చేసినా అతనికి బాగుంటుంది. మధుర రిక్త భాషణం! దాన్నే ఇంగ్లీషులో ‘స్వీట్ నథింగ్స్’ అంటారు.
“ఉంటానయితే, అమ్మ పిలుస్తున్నట్లుంది” అంటూ ఫోన్ కట్ చేసింది విభావరి.
సెల్‌ను ఒకసారి ముద్దు పెట్టుకున్నాడు.
సుగుణాకర్ లేచి అంతా వింటున్నాడు. “ఏరా, లేచావా? గుడ్ మార్నింగ్” అన్నాడు వనమాలి. “విభావరి రా” అన్నాడు. వారికి ఎటువంటి దాపరికాలు తీవు.
“విన్నాలే. నీ వేదాంతం పాట రింగ్ టోన్ మోగుతూంటే మెలకువ వచ్చింది. అయినా ఎన్నిసార్లు చెప్పాలి రా నీకు. ఆ పాట తీసేసి మంచి పాట ఏదైనా పెట్టుకోమని.”
“ఎందుకో ఆ పాటంటే నాకిష్టంరా గుణా!”
“నీ మొహం! అది వినీ వినీ ఏమో, అలాంటి కలలు వస్తున్నాయి” అన్నాడు సుగుణాకర్ కోపంగా.
“సరే, దాన్ని డిలీట్ చేస్తాలే. ముఖం కడుక్కో పో, టీ పెడతాను” అన్నాడు వనమాలి.
“ఈరోజు టిఫిన్ బయటకు వద్దురా! టమోటా బాత్ చేస్తాను.”
***
కొన్ని రోజులు గడిచాయి. అతని స్కూల్లో పని చేసే డ్రిల్లు సార్ గారు పోయారు. ఆయన పేరు సాంబమూర్తి. ఆయనకింకా రెండేళ్లు సర్వీసుంది. ఆయన కూడా పెబ్బేరు లోనే కాపురం ఉండేది. ముందురోజు రాత్రి గుండెల్లో నొప్పి వచ్చిందట. వెంటనే కారు మాట్లాడుకుని కర్నూలు లోని ఆర్క హాస్పిటల్‍కు తీసుకుని వెళ్లారట. అది దేవీనగర్ లోని గాయత్రీ ఎస్టేట్స్‌లో ఉంటుంది. డాక్టరు బయటికివచ్చి చూసి ‘బ్రాట్ డెడ్’ అని చెప్పారట. వెంటనే ఇంటికి తీసుకుని వచ్చారు. పెబ్బేరులో అద్దె యిల్లు. అక్కడికి ‘బాడీ’ని తీసుకుని రావటానికి ఇంటి ఓనర్లు అంగీకరించలేదు. ఆయన సొంతూరు కొత్తకోట మండలంలోని ‘నాంచారమ్మపేట’ గ్రామం.
డైరెక్ట్‌గా వాళ్ళ ఊరికే తీసుకొని వెళ్లారు ‘బాడీ’ని. చనిపోయిన వెంటనే మనిషిని పేరుతో వ్యవహరించరు, ‘బాడీ’ అంటారు. లేదా ‘శవం’ అంటారు. కొంచెం గౌరవంగా అయితే పార్థివదేహం అంటారు. చావడంలో కూడ స్థాయిలు ఉన్నాయి! చచ్చిపోయాడు, మరణించాడు, స్వర్గస్థుడయ్యాడు, పరమపదించాడు, శివసాయుజ్యం పొందాడు, పరమాత్మలో లీనమయ్యాడు.. ఇలా. అవ్వ పేరే ముసలమ్మ!
స్టాఫ్ అందరూ డ్రిల్లు సారు అంత్యక్రియలకు నాంచారమ్మపేటకు వెళ్లారు. ఆ రోజు హెడ్ మాస్టరు షేక్ పీరా గారు స్కూలుకు సెలవు ప్రకటించారు.
సాంబమూర్తి గారి శవాన్ని వాళ్ల సొంత యింట్లో కూడా లోపల పడుకోపెట్టలేదు. బయట వసారా క్రింద అరుగు మీదనే ఉంచారు. ఆయన అంత్యక్రియలు ప్రత్యక్షంగా చూశాడు వనమాలి. కలలో తనకు జరిగినదంతా గుర్తొచ్చింది.
సాంబమూర్తి గారి భార్య, పిల్లలు ఆయన శవం దగ్గర కూర్చుని రోదిస్తున్నారు ఆయన తమతో పంచుకొన్న ప్రేమానురాగాలను గుర్తు చేసుకున్నారు. ఊరిలో ఆయన చిన్ననాటి స్నేహితులు ఆయన మంచితనాన్ని గుర్తుచేసుకొని బాధపడ్డారు.
“ఏమైనా, ‘అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం’ అన్నట్లుగా డ్రిల్లు సారు సులభ మరణం పొందాడు. ఏనాడూ ఆయన ముఖంలో దైన్యాన్ని చూడలేదు” అన్నాడు తెలుగు సారు రంగారెడ్డి.
“వ్యాయామ ఉపాధ్యాయుడాయన. ఆయన వృత్తి పిల్లలతో రకరకాల ఆటలాడించడం, ఎక్సర్‌సైజులు చేయించడం. పిడికెడు పొట్ట లేదాయనకు, ఫిట్ అండ్ హెల్థీ. అటువంటి ఆయనకు హార్ట్ ఎటాక్ రావటం ఏమిటో?” అంటున్నాడు హిందీ పండిట్ చంద్రమౌళి గారు.
“కూతురుకింకా పెళ్లి కాలేదు. కొడుక్కు ఉద్యోగం లేదు. కారుణ్య నియామకం ప్రకారం ఆ అబ్బాయికి ఉద్యోగం ఇస్తారు.” ఇంకో ఆయన.
వనమాలి అందరి మాటలూ వింటున్నాడు. కాని అతనిలో ఒక విచిత్రమైన భావన! తనను గురించి ఇంతమంది ప్రేమతో ఉన్నారని, తన మంచితనాన్ని పొగడుతున్నారని, తన కష్టసుఖాలు పంచుకుంటున్నారని, డ్రిల్లు సారు సాంబమూర్తి గారికి తెలిసే అవకాశం లేదే? తెలిస్తే ఎంత బాగుంటుంది? తనకు కూడా కలలో కాకుండా, నిజంగా తన మరణం పట్ల తన వాళ్లు ఎలా స్పందిస్తారో తెలుస్తే ఎంత బాగుంటుంది? అప్పుడది, సి.నా.రె. గారు మరణించినపుడు, ఆచార్య ఎన్. గోపీ గారు వ్రాసినట్లు ‘జననమంత సుందరమరణం’ అవుతుంది. గోపీ గారి ఆ భావమే అద్భుతం! తాను చనిపోయాక తన కోసం ఆత్మీయులు దుఃఖంతో కుమిలిపోతూ, తన మంచితనాన్ని గుర్తుచేసుకోవడం చూడగలిగితే? అది ఎలా సాధ్యం? అసాధ్యం!
వనమాలి ఆలోచనలు చిత్ర విచిత్రంగా సాగుతున్నాయి.
రాత్రి పడుకునే ముందు తనకు కలిగిన భావాలన్నీ మిత్రుడితో చెప్పాడు. ప్రతిదీ అతనితో పంచుకుంటే గాని అతనికి మనసు నిమ్మళించదు. దీనినే ప్రఖ్యాత ఆంగ్ల రచయిత, ఫ్రాన్సిస్ బేకన్, తన ‘ఆఫ్ ఫ్రెండ్‌షిప్’ అన్న వ్యాసంలో ఇలా చెప్పాడు
“ఎ ప్రిన్సిపల్ ఫ్రూట్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్, ఈజ్ ది ఈజ్ అండ్ డిశ్ఛార్జ్ ఆఫ్ ది ఫుల్‌నెస్ అండ్ స్వెల్లింగ్స్ ఆఫ్ ది హార్ట్, విచ్ ప్యాషన్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ డు కాజ్ అండ్ ఇండ్యూస్.”
మన హృదయం లోని బరువును తీసేసే ముఖ్యమైన ప్రయోజనం స్నేహం. రకరకాల భావ తీవ్రతలు కలిగించే అనుభూతులను అది సరళీకృతం చేస్తుంది.
సుగుణాకర్ నవ్వలేదు. “ఎందుకురా నీకిలాంటి ఆలోచనలు వస్తున్నాయి? మీ కొలీగ్ చనిపోయినందుకు విచారించాలి. అట్లా కాకుండా, ఆయన గురించి ఆయన ఆత్మీయులు ఎలా దుఃఖిస్తున్నారో, ఆయన మంచితనాన్ని ఎలా తల్చుకుంటున్నారో తెలుసుకునే అవకాశం ఆయనకు లేకపోయింది? అని బాధపడుతున్నావు. నీకు వచ్చిన కలలో కూడా, నీ అంత్యక్రియలను నీవు చూసి, నీ వాళ్ల పొగడ్తలను విని సంతోషించానన్నావు. ఆ కలకూ, ఈ రోజు డ్రిల్లు సారు అంత్యక్రియల్లో నీకు వచ్చిన ఆలోచనలకూ ఏదో లింక్ ఉంది.
నీవు దీన్నుంచి మనస్సు మరల్చుకోవాలి. యోగా, మెడిటేషన్ చెయ్యి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకో, అఫ్ కోర్స్, డెత్ ఈజ్ యాన్ ఇనెవిటబుల్ ఎండ్ టు లైఫ్. అది ఎవరికైనా తప్పదు. కానీ దాని గురించి ఆలోచించాల్సిన వయసు కాదు మనది.”
స్నేహితుని మాటలను శ్రద్ధగా వింటున్నాడు వనమాలి.
“ఇంకో ముఖ్య విషయం రోయ్! పొరపాటున కూడా విభావరికిగాని, మీ అమ్మానాన్నలకుగాని, నీలో కలిగే ఈ వింత ఫీలింగ్స్ గురించి చెప్పొద్దు. సరేనా?”
“సరేరా! నీతో చెబుతాను గాని, వాళ్లతో ఎందుకు చెబుతానురా?” అన్నాడు నవ్వుతూ వనమాలి.
“ఏమో? నీవసలే తిక్కవెధవవు!” అన్నాడు సుగుణాకర్.
ఇద్దరూ నవ్వుకున్నారు.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
