[శ్రీ పాణ్యం దత్తశర్మ వ్రాసిన ‘మరణం మధురం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]
[మర్నాడు వనమాలి నిద్ర లేచే సరికి ఆలస్యమవుతుంది. హెడ్మాస్టర్ గారికి ఫోన్ చేసి హాఫ్-డే లీవ్ ఇవ్వమంటే, పర్వలేదు, వీలయినంత త్వరగా వచ్చేయమని అంటాడాయాన. తల్లి చేసిన ఉప్మా తిని, గుడికి వెళ్ళి తండ్రికి చెప్పి ఊరికి బయల్దేరుతాడు. పెబ్బేరులో దిగి, గదికి వెళ్ళేసరికి మిత్రుడు సుగుణాకర్ ఆప్యాయంగా పలకరిస్తాడు. వనమాలి మధ్యాహ్నం నుంచి స్కూలుకి వెళ్తాడు. ఆ రాత్రి మిత్రుల సంభాషణలో వివాహ ప్రస్తావన వస్తుంది. అమ్మానాన్నలు ఏదో పెళ్ళి సంబంధం తెస్తే, తాను విభావరి గురించి వాళ్ళకి చెప్పినట్టు – మిత్రుడికి చెప్తాడు వనమాలి. తర్వాత తనకొచ్చిన కల గురించి చెప్తాడు. అతని మరణం, అంత్యక్రియలు అతనే చూసుకుంటా ఉంటే.. అంత ‘ఫీల్ గుడ్’ ఎమోషన్స్ ఎందుకు వచ్చాయో అర్థం కావడంలేదని అంటాడు సుగుణాకర్. అయినా కలల్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదంటాడు. మర్నాడు ఉదయం విభావరి ఫోన్ చేస్తుంది. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు వనమాలి. కొన్ని రోజులు గడుస్తాయి. అతని స్కూల్లో పనిచేసే సాంబమూర్తి అనే డ్రిల్ మాస్టార్ చనిపోతారు. ఆయన అంత్యక్రియలు ప్రత్యక్షంగా చూస్తాడు వనమాలి. కలలో తనకు జరిగినదంతా గుర్తొస్తుంది. అందరూ సాంబమూర్తిని పొగుడుతుంటారు. ఇదంతా ఆయనకి తెలిసే అవకాశం లేదే? తెలిస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాడు వనమాలి. తనలో చెలరేగిన ఈ భావాలను రాత్రి మిత్రుడితో పంచుకుంటాడు. మరణానికి సంబంధించిన ఆలోచనల నుంచి దృష్టి మళ్ళించుకోమని సుగుణాకర్ హెచ్చరిస్తాడు. – ఇక చదవండి.]
మహాలయ పక్షాలు పూర్తయ్యాయి. తండ్రికి ‘ఆ’ విషయం గుర్తు చేద్దామని అనుకుని, సిగ్గుపడి మిన్నకున్నాడు వనమాలి. తల్లి ఆ విషయం కనిపెట్టి ఆయనతో ఉన్నది.
“రేపు తదియ, గురువారం మంచిరోజు. వెళ్లి మీ పద్మనాభుడితో మాట్లాడి రారాదూ!”
“అవునవును, వెళతాను. నీవూ రావొచ్చుకదా!” అన్నాడాయన.
“ముందు మీరు వెళ్లిరండి. రాయచూరుకు నేను కూడా వస్తాను లెండి” అన్నదామె.
“సరే! తప్పకుండా సానుకూలం అవుతుందిలే. మనవాడికేం తక్కువ?” అన్నాడాయన.
“వాడికేం? బంగారుకొండ!” అన్నది కణతలకు వేళ్లు నొక్కుకుని పటపటమనిపిస్తూ ఆ తల్లి.
వారి మాటలు అక్షరసత్యాలు! వనరైన వరుడు వనమాలి!
***
మరునాడు ఉదయం గుడిలో పూజలు ముగించుకున్నాడు కేశవాచార్యులు. స్వామివారికి ఆరగింపు సేవ కూడా అయిపోయింది. ఆ రోజు బెల్లం పొంగలి నైవేద్యం. కొంత ఒక విస్తరాకు దొన్నెలో వేసుకుని, పద్మనాభ రావు ఇంటికి బయలుదేరాయన. సమయం పదకొండున్నర.
పద్మనాభ రావుగారు, పదవీవిరమణ తర్వాత గద్వాలలో స్థిరపడదామని, అక్కడ వంద గజాల స్థలం కొని, ఇల్లు కట్టించుకుంటున్నారు. ఆయనకు ఒక్కతే కూతురు యమున. ఆ అమ్మాయికి పదేండ్ల క్రిందట పెళ్లి చేశారు. విభావరి కంటే ఇంచుయించు ఏడేళ్లు పెద్దదామె. ఆమె భర్త వనపర్తిలో రెవెన్యూ డిపార్టుమెంట్లో జానియర్ అసిస్టెంట్. వారికి ఒక బాబు. ప్రద్యుమ్న, పద్మనాభ రావుగారు గద్వాలలో స్థిరపడడానికి కారణం ఉంది. ఆయన శిష్యుడొకడు అక్కడ రియల్ ఎస్టేటు వ్యాపారం చేస్తాడు. అతను రైల్వేస్టేషన్ రోడ్లో ఒక వెంచర్ వేశాడు గద్వాలలో. గురువుగారికి నామినల్ రేటుకు ఆ ఇంటి స్థలం గురుదక్షిణగా ఇచ్చాడతడు. అసలు డబ్బే వద్దన్నాడు గాని, పద్మనాభ రావు గారు ఒప్పుకోలేదు. ‘ఎంతో కొంత తీసుకోవలసిందే’ అని పట్టుపట్టాడాయన. శిష్యుడి పేరు సదానంద గౌడ. అతడు ఇల్లు కూడ కట్టించి ఇస్తాడు. మెటీరియల్ అంతా టోకున తెప్పిస్తాడు. స్థలం, ఇల్లు అంతా కలిసి ముఫైలక్షలతో తేలిపోతుంది. ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాభైలక్షల వరకు వచ్చాయి. వాటిలో నుంచీ ఇంటికి పెడుతున్నాడాయన, బ్యాంకు లోన్ తీసుకోకుండా. పెన్షన్ ఎలాగూ వస్తుంది. ఆయనకు ఆ యిల్లు పూర్తయేంతవరకు ఈ ఊర్లోనే ఉంటారు. కేశవాచార్యులు వాళ్లింటికి వెళ్ళేసరికి వారు ఇద్దరూ భోజనం చేస్తున్నారు. ఆయన ముందుగదిలో కూర్చున్నాడు. భోజనం ముగించుకొని వచ్చాడు పద్మనాభ రావు. ఆయన శ్రీమతి అఖిలాండమ్మ గారు –
“నమస్కారమండీ, అన్నయ్యగారు! ఉండండి, కొంచెం కాఫీ తెస్తాను” అంటూ పలకరించి లోపలికి వెళ్లిందామె.
‘ఏమిరా కేశవా? ఈ రోజు నా మీద దయ కల్గింది?” అన్నాడు ఆయన స్నేహితుడికెదురుగా కుర్చీలో కూర్చుంటూ.
“చెబుతాను. ముఖ్యమైన పని మీదే వచ్చాను రా పద్మనాభా, నీ వద్దకు!”
ఆమె కాఫీ తెచ్చి యిచ్చింది కంచుగ్లాసులో. దాని అడుగు భాగాన్ని తన మీద కప్పుకొన్న ఉత్తరీయంతో పట్టుకుని కేశవాచార్యులు కాఫీ తాగసాగాడు.
“మా చెల్లెలు మీనాక్షమ్మ, నా శిష్యుడు వనమాలి బాగున్నారా?”
“ఆ వేణుగోపాలుని దయతో అందరం బాగున్నాం. సరేగాని, పద్మనాభా! నీ రిటైర్మెంటు ఫంక్షన్‌కు వచ్చారు, నీ తమ్ముడు వాళ్లు, ఆ అమ్మాయి విభావరికి సంబంధాలేవయినా చూస్తున్నారా ఏమిటి?”
“చూస్తున్నారు. మా నాగభూషణానికి, మా మరదలికి, పిల్లకు పెళ్లి చేయాలనే ఉంది. వాడికింకా ఐదారేళ్ళు సర్వీసు ఉంది. కొడుకింకా చిన్నవాడులే. కాని అనుకూలమైన సంబంధాలేవీ ఎక్కిరావడం లేదు” అన్నాడు పద్మనాభ రావు.
“వాళ్ళకు ఎలాంటి అల్లుడు కావాలనుకుంటున్నారు?” అనడిగాడు కేశవాచార్యులు.
“ఏముందిరా, మామూలే. మన మధ్యతరగతి వాళ్లకు గొంతెమ్మ కోర్కెలు ఏముంటాయి చెప్పు? అమ్మాయిని నీవు కూడా చూశావు కదా! పుత్తడిబొమ్మలా ఉంటుంది. దానికి ఈడూజోడయిన పిల్లవాడు కావాలి. అన్నట్లు, గవర్నమెంట్ జాబ్ ఉండాలి. ముఖ్యంగా, అబ్బాయికి తల్లీ తండ్రీ ఉండాలట.”
“ఈ కాలం ఆడపిల్లలు, అత్తమామలు, ఆడపడుచుల పోరు లేకుండా ఉండాలని షరతులు పెడుతున్నారని విన్నాలే. భర్తకు తల్లిదండ్రులు ఉండాలి, వాళ్లు తమ దగ్గర ఉండాలి అనుకుంటుందంటే, మీ విభావరి, సంస్కారవంతురాలే.” అన్నాడు కేశవాచార్యులు.
“మా వనమాలిని ‘ఇంత’ప్పట్నించి చూశావు. గవర్నమెంట్ టీచర్. మన్మథుడని చెప్పలేను గాని, పుట్టు చక్కనిది వాడిది.”
పద్మనాభ రావుకు విషయం చూచాయగా అర్థమైంది. ‘వీడు తన కొడుక్కు మా విభావరిని అడగడానికి వచ్చాడు’ అనుకొన్నాడు.
“వాడికేమి రా కేశవా! బంగారుకొండ!” అన్నాడు.
“వనమాలికీ, విభావరికీ, పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? మావాడు ఆ అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నాడు. ఇక్కడున్న ఆ వారం పది రోజులూ ఆ పిల్ల కూడా వాడితో సన్నిహితంగానే మెలిగింది. గుడికి వచ్చినప్పుడల్లా, వాడున్నాడా లేదా అని చూసేది” అన్నాడు కేశవాచార్యులు. పద్మనాభ రావు ముఖం ప్రసన్నమయింది.
“ఇదిగో, నిన్నే! ఇలా రా ఒకసారి!” అని భార్యను పిలిచాడాయన. ఆమె నవ్వుతూ వచ్చింది.
“అంతా వింటూనే ఉన్నాను లెండి. ఈ రోజు ఎంతో శుభదినం. స్నేహితులిద్దరూ బంధుత్వాలు కలుపుకోబోతున్నారు” అన్నది.
“మావాళ్లకు కూడా ఏ అభ్యంతరం ఉండదు రా! నేను వాడికి ఫోన్ చేస్తాను.”
“చేయి. మనం ఒకసారి రాయచూరుకు వెళ్లి శుభప్రస్తావన చేసి వద్దాము.”
“మనం వెళ్లడం ఎందుకు? వాళ్లనే రమ్మంటాను. ఆడపిల్ల తరపు వారు వచ్చి అడగడమే విధాయకం!”
“మాకలాంటి పట్టింపులు లేవురా పద్మనాభా! మాకున్నది ఒక్కడు రా పద్మా. వాడు సంతోషంగా ఉండడమే మాకు కావలసింది. మనం వెళ్లినా సరే, వాళ్లు వచ్చినా సరే!”
“మీది పెద్దమనసురా కేశవా! మా తమ్ముడితో, మరదలితో మాట్లాడి నీకు చెబుతాను. వాళ్లు సంతోషంగా ఒప్పుకుంటారు. నాది పూచీ!”
“శుభం! అయితే నేను బయలుదేరుతానిక. నీవేమో శుభ్రంగా తిని కూర్చున్నావు. నాకిక్కడ కడుపులో జఠరాగ్ని దహిస్తూన్నది.”
అందరూ నవ్వుకున్నారు!
***
కలిసి వస్తే కల్యాణం ఎంతసేపు? నాగభూషణరావు, మంగళగౌరి, ఈ విషయం విని ఆనందభరితులైనారు.
“అన్నయ్యా! అంతకంటే కావలసిందేముంది? ఆచార సాంప్రదాయాలు గల కుటుంబం. పిల్లవాడిని మేము చూశాము. గవర్నమెంట్ జాబ్ కూడా ఉండెను. ఒక మాట మా విభావరిని కూడ అడిగి..”
“తప్పకుండా. వనమాలికి మన విభావరి అంటే చాలా యిష్టమట. దానికీ ఇష్టమైతే, ఇద్దరికీ ముడిపెడితే సరి!”
విభావరితో ఈ విషయం ప్రస్తావించారు వాళ్లు. ఆ అమ్మాయి బుగ్గల్లో గులాబీలు పూశాయి.
“నాన్నా, అమ్మా! ఆయనంటే నాకూ ఇష్టమే!” అన్నది.
“అప్పుడే ‘ఆయన’ ఐపోయాడేమే విభా!” అన్నది తల్లి నవ్వుతూ.
విభావరి లేచి లేడి పిల్లలా పరిగెత్తింది. వాళ్లవి రైల్వే క్వార్టర్స్. వెనకక పెరడుంది. అక్కడ పూలమొక్కలు, కూరపాదులు పెంచారు తల్లీ కూతురు. తెల్లగన్నేరు చెట్టు విరగపూసి ఉంది. దానిక్రింద వెళ్లి కూర్చుంది విభావరి.
‘ఎంత సంస్కారం? ఎంత పద్ధతిగా తనవాళ్లతో అడిగించాడు వనమాలి? ఈ నాలుగైదు నెలలుగా ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడుకున్నా, ఎప్పుడూ అతడు గాని, తానుగాని, బయటపడలేదు. కానీ ఇద్దరి మనస్సుల్లో ఒక భావం! ప్రేమ! అది స్పష్టంగా తెలుస్తూనే ఉండింది. ఈ రోజు క్లారిటీ వచ్చింది’ అనుకుందా అపరంజి బొమ్మ. ఆమె మనసంతా మధురోహలతో నిండిపోయింది.
పద్మనాభ రావుతో విషయం మాట్లాడానని, ఆయన తమ్ముడు, మరదలితో మాట్లాడతానన్నాడని, కొడుక్కు ఫోన్ చేయించాడు కేశవాచార్యులు.
మరోవారం తర్వాత, నాగభూషణరావు దంపతులు వేణిసోంపురానికి వచ్చారు. పద్మనాభ రావు దంపతులతో కలిసి కేశవాచార్యుల ఇంటికి వెళ్లారు. పళ్లు, పూలు, తీసుకువెళ్లారు.
“ఆచార్యులు గారు! మీ అంతట మీరు మా అమ్మాయిని మీవాడికి అడగడం మా భాగ్యం! మాకు, మా అమ్మాయికీ మీ సంబంధం మహదానందమే!” అన్నాడు నాగభూషణరావు.
“ఇంకా ఆచార్యుల వారేమిటిరా నాగభూషణా! ‘బావగారూ’ అను!” అన్నాడు అన్నయ్య.
“బావగారు! నాకు కూతురు, కొడుకు. నాకున్నది ఇద్దరికీ చెరిసగం. విభావరికి పది తులాలు బంగారం చేయించాను మీరు పిల్లవాడికి ఏమి ఆశిస్తున్నారో చెపితే, మా శక్తిమేరకు..”
“మేం మా కోడల్ని తప్ప ఏమో ఆశించము బావగారు. మీ అమ్మాయికి మీరు ఏం పెట్టుకుంటాలో మీ యిష్టం. మాకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. మా పద్మనాభునికి తెలుసు. ఇల్లు, రెండెకరాల పొలం ఉన్నాయి. నాకు మీవలె పెన్షన్ రాదు. మావాడికి ప్రభుత్వోద్యోగం ఉంది. ఆ వేణుగోపాలుడినే నమ్ముకున్నాము. ఏదో ఇట్లా జరిగిపోతే చాలు!”
‘ఉన్నదానితో తృప్తిపడటం’ కన్న సుగుణం ఏముంటుంది. ఆయన నిరాడంబరతకు మనసులోనే జోతలర్పించాడు నాగభూషణరావు.
“నిశ్చితార్థాలు మాకు అంతగా పద్ధతి లేదండి అన్నయ్యగారు. పెళ్లి ఏకంగా జరుపుకుందాము” అన్నది మీనాక్షమ్మ.
“పెండ్లి ఎక్కడ చేద్దామని?” అని అడిగారు కేశవాచార్యులు.
“రాయచూరులోనేనండి” అన్నాడు నాగభూషణ రావు. “మీరే మంచి ముహూర్తం చూడండి బావగారు” అన్నాడు.
“మరో రెండు నెలల్లో శుక్రమౌఢ్యం వదలిపోతుంది. మా వనమాలికి కూడా స్కూల్లో పరీక్షలు పూర్తయి, ఎండాకాలం సెలవులిస్తారు. కాబట్టి ‘మే’ నెలలో పెట్టుకుందాము.” చెప్పాడు కేశవాచార్యులు.
***
విభావరి ఫోన్ మోగింది. డిస్ప్లే తెర మీద వనమాలి పేరు చూచి ఆమె ముఖం వికసించింది. ఆకుపచ్చ బటన్ నొక్కి “హలో!” అన్నది.
“విభావరి గారు! హౌ ఆర్ యు?” అట్నుంచి వనమాలి గొంతు. దానిలో ఉద్వేగం. ఇద్దరికీ పెళ్లి నిశ్చయమయ్యాక ఇదే మొదటి కాల్.
“ఇంకా ‘గారు’ ఏమిటి మహాశయా! ‘విభా!’ అనండి చాలు!” అన్నది.
“థాంక్యూ! నీతో ఒక మాటయినా చెప్పకుండా, పెద్దవాళ్లతో అడిగించినందుకు నీవేమీ అనుకోలేదు కదా!”
“ఎందుకనుకోలేదు? అనుకున్నాను!”
వనమాలి గొంతులో సంశయం. “ఏమనుకున్నావు విభా?”
“మీరెంతమంచి వారో కదా! అని!”
“అంతేనా! ఇంకా ఏమనుకున్నావో అని అనుకున్నా. సరేగాని నన్ను కూడా ‘గారు’, ‘ఏమండీ’ అని పిలవకు ఇక మీద.”
“మరి ఏమని పిలవాలో శ్రీవారిని?”
“అమ్మా, నాన్న, ఫ్రెండ్స్, నన్ను ‘వనా!’ అంటారు. నీవు ఏదైనా వెరైటీగా ట్రై చేయి.”
“అయితే ‘మాలీ’ అంటాను. ఓ.కె.నా?”
“అదేదో ‘తోటమాలి’లా ఉందే?”
“మీ పేరుకు అర్థం అదే కదా! నా మనసనే తోటకు మీరు మాలి!”
“విభా! యు ఆర్ వెరీ వెరీ స్వీట్! ఏప్రిల్ చివరి వారంలో 29న మన పెళ్లి! ఇంకా రెండు నెలలు!”
‘విరహము కూడా సుఖమే కాదా! పరిపరి చింతన మధురము కాదా!’ అన్న ‘మాయాబజార్’ సినిమా లోని, పింగళివారి పాటను మధురంగా పాడింది విభావరి.
“ఇంతవరకు అనిపించలేదు కాని, పెళ్లి తేదీ నిశ్చయమైనప్పటినుండి, ‘ఎప్పుడెప్పుడా నిన్ను చేరేది’ అని తహతహగా ఉంది విభా!”
“నాకేం అంత తహతహగా ఏం లేదు మాలీ!” అన్నది అతన్ని ఉడికించాలని. కానీ అతడేం ఉడుక్కోలేదు.
“నాకు తెలుసులే. నీవు బైటపడవని” అన్నాడు నవ్వుతూ.
“మొత్తానికి లవ్ మేరీజీని అరేంజడ్ మేరీజిగా మార్చేశారు!”
“పేరు ఏదైనా, ‘లవ్’ ముఖ్యం విభా! ఐ లవ్ యు.”
“ఐ లవ్ యు మాలీ!”
***
పెళ్లి మరో నెల రోజులే ఉంది. స్కూల్లు పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి. రోజూ ఇన్విజిలేషన్ డ్యూటీ చేసి, మధ్యాహ్నం 3 గంటల కల్లా పెబ్బేరుకు వచ్చేస్తున్నాడు వనమాలి.
సుగుణాకర్ ఏదో ట్రయినింగ్కని హైదరాబాదుకు వెళ్లాడు. మూడు రోజుల నుంచీ లేడు. ఆ రోజు సాయంత్రం విభావరికి ఫోన్ చేసి తియ్యని కబుర్లు చెప్పాడు.
విభావరి అన్నది “ఈ 17వ తేదీన మహబూబ్‌నగర్‌లో మా నాన్నగారి కొలీగ్ కూతురి పెళ్లి. న్యూ టౌన్ లోని టి.టి.డి కల్యాణ మంటపంలో. మేమందరం వెళుతున్నాము. మీరు కూడా రాకూడదూ! ఒకసారి కలుసుకున్నట్లుంటుంది!”
కాసేపు ఆలోచించాడు వనమాలి.
“వద్దులే విభా! బాగుండదు. మీరైతే ఆహూతులు. నేనెవర్నని?”
“మీరు కాబోయే మా ఇంటి అల్లుడు!”
“ఒక పని చేద్దాం విభా. నేను మ్యారేజ్ వెన్యూకు రాను. న్యూ టవున్ ‘శ్రీ వెంకటేశ్వర భవన్’ అని రాజేంద్రనగర్‌లో ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉంది. నీవు మీ తమ్ముడిని తీసుకొని అక్కడికి రా. కాసేపు కబుర్లు చెప్పుకుందాం, కాఫీ తాగుతూ.”
“ఈ ఐడియా ఏదో బాగుంది మాలీ! పెళ్లి ఎప్పుడో రాత్రి ముహూర్తానికట. మేం రిసెప్షన్‌కు అటెండ్ అవుతాం. అదీ రాత్రి 8 గంటలకు. మనం సాయంత్రం కలుద్దాం అమ్మావాళ్లను అడుగుతాను. ఇట్లా వెళుతున్నానని, వాళ్ళేమీ వద్దనరులే.”
“గుడ్. ఆ రోజు మధ్యాహ్నం పరీక్ష అయినతర్వాత బయలుదేరతా విభా. పెబ్బేరు నుంచి భూత్పూర్ మీదుగా మహబూబ్నగరుకు బస్సుంది. ఐదున్నర, ఆరు మధ్యలో రెస్టారెంట్లో నీ కోసం వెయిట్ చేస్తా. ఓకే?”
“అలాగే!” అన్నది విభావరి. 17వ తేదీ ఇంకా ఐదు రోజులే ఉంది. పెళ్లి కుదిరిన వధూవరులు ముందే కలుసుకోవడానికి అవకాశం దొరికితే వదులుకుంటారా? తర్వాత 12 రోజులే వారి పెళ్లి!
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
