Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరణం మధురం-6

[శ్రీ పాణ్యం దత్తశర్మ వ్రాసిన ‘మరణం మధురం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మహాలయ పక్షాలు ముగియడంతో పెళ్ళి సంబంధం గురించి పద్మనాభరావుగారితో మాట్లాడమని భర్తకి సూచిస్తుంది మీనాక్షమ్మ. ఓ పూట ఆలయంలో పూజాదికాలన్నీ పూర్తయ్యాక, పద్మనాభరావు గారింటికి వెళ్తారు కేశవాచార్యులు. మీ తమ్ముడి కూతురు విభావరికి ఏవైనా సంబంధాలు చూస్తున్నారా అని మొదలుపెట్టి, వనమాలికి ఆ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నామని చెప్తారు. పద్మనాభరావు ఆయన భార్య అఖిలాండమ్మ ఎంతో సంతోషిస్తారు. తన తమ్ముడితో, మరదలితో మాట్లాడి చెబుతానంటారు పద్మనాభరావు. విభావరి తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు. పెద్దల మాటలు పూర్తయి, ముహూర్తం నిశ్చయిస్తారు. ఆ మర్నాడు వనమాలి, విభావరికి ఫోన్ చేసి విభావరి గారూ అని పలకరిస్తే ఇంకా గారు ఎందుకు విభా అని పిలవమంటుంది. తాను అతన్ని మాలీ అని పిలుస్తానంటుంది. అలా వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటారు. ఓ రోజు విభావరి ఫోన్ చేసి, ఆ నెల 17వ తేదీన మహబూబ్‍నగర్‌లో ఒక పెళ్ళికి వస్తున్నామనీ, వనమాలిని అక్కడికి రమ్మని అడుగుతుంది. అక్కడి వద్దని, దగ్గరలో ఓ హోటల్లో కలుద్దామని చెప్తాడు వనమాలి. 17వ తేదీకి ఇంకా ఐదు రోజులుంది. ఆ తర్వాత మరో 12 రోజులకి వాళ్ళ వివాహం. – ఇక చదవండి.]

రాత్రి సేమ్యా ఉప్మా చేసుకొని తిన్నాడు. సుగుణాకర్ లేక ఏమీ తోచడం లేదు. పది గంటలకు పడుకుని నిద్రపోయాడు.

***

జిల్లా ప్రజాపరిషత్ హైస్కూలు, అయ్యవారిపల్లె. ‘సంతాప సభ’ అన్న ప్లెక్సీ వేదిక వెనక కట్టి ఉంది. దానిమీద ఒక ఫోటో ఒక మూలకు ముద్రించి ఉంది. అది సరిగ్గా కనపడడం లేదు. క్రింద ‘కీ.శే. కందాళై వనమాలిగారి ఆత్మీయస్మృతిలో’ అని వ్రాసి ఉంది. అది కూడ సరిగ్గా కనపడటం లేదు. ప్రక్కన ఒక కుర్చీలో ఒక ఫోటో ఉంది. దానికి కృత్రిమ గంధపు పూలదండ వేసి ఉంది. ఒక గ్లాసులో బియ్యం పోసి అందులో అగరువత్తులు గుచ్చారు.

‘ఓహో! ఈ మధ్య స్వర్గస్థులైన డ్రిల్లు సారు సాంబమూర్తి గారి సంతాప సభ అన్నమాట!’ అనుకున్నాడు.

ముందుగా సభాధ్యక్షజ్ఞులు షేక్ పీరా గారు మాట్లాడారు. “అతి చిన్నవయసులోనే మరణించారు మన సైన్స్ అసిస్టెంట్ వనమాలిగారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, అందరు లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం”.

అందరూ లేచి నిలబడ్డారు.

‘ఇదేమిటి? ఈ సంతాప సభ తనను గురించా? తానెప్పుడు చనిపోయాడు?’ అనుకుంటున్నాడు. కాని జరుగుతున్నది ఆసక్తిగా చూస్తున్నాడు. స్కూలు పిల్లలందరూ మౌనంగా నిలబడ్డారు. కాని ఉండలేక మధ్యలో కళ్లు తెరిచి చూడడం, పక్కవాడిని చూచి సన్నగా నవ్వడం చేస్తున్నారు. రెండు నిమిషాలు వాళ్లకు రెండు సంవత్సరాలనిపించింది. ‘చిన్నపిల్లలు పాపం! మరణాలు, సంతాపాలు అర్థం చేసుకునే వయసా వాళ్లది’ అనుకున్నాడు. షేక్ పీరా గారు ఇలా ప్రసంగించారు.

“వనమాలి శానామంచి పోరడు. అంతకన్నా మంచి టీచరన్నట్లు. ఒక్కసారైనా అతడు క్లాసుకు పోకుండా ఉండింది లేదు. పిల్లలకు మంచిగ క్రమశిక్షణ నేర్పించేటోడు. వచ్చే నెల లోనే పెళ్లి. పాపం. ఈ లోపట దేవుడాయనకు అన్యాయం చేసిండు. తెలుగు సారు రంగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్న”

రంగారెడ్డి గారు మైక్ దగ్గరకు వెళ్లారు. “మా వనమాలి గురించి ఇట్లా మాట్లాడే సందర్భం వస్తుందనుకోలేదు. యువకుడు, ఉపాధ్యాయ వృత్తి పట్ల అంకితభావం కలవాడు. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములవాడు.” రంగారెడ్డి గారు జేబులోంచి చేతిరుమాలు తీసి కళ్లు తుడుచుకున్నారు. “ఆ పిల్లవాని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.”

“వనమాలిగారి నాన్నగారు శ్రీ కందాళై కేశవాచార్యులు గారిని..” అంటున్నారు అధ్యక్షులవారు.

ప్రేక్షకుల్లో ముందువరుసలో కూర్చున్న తల్లిదండ్రులను చూశాడు. రంగారెడ్డి గారు తనను ‘చిదిమిన పాల్గారు’ అన్న పద్యంతో పొగడటం అతనికి బాగా నచ్చింది. అంత అందమైన వాడా తను?

కేశవాచార్యుల వారు ‘తాను మాట్లాడలేన’ని రెండు చేతులూ ఊపుతూ సైగచేశారు. దుఃఖంతో కుమిలిపోతున్నాడాయన. పక్కన మీనాక్షమ్మగారు శోక దేవతలా కూర్చుని ఉంది. ఏడ్చీ ఏడ్చీ ఆమె కన్నీరు ఇంకిపోయింది. ఎందుకో అతనికి సంతోషంగా అనిపించింది. ‘తననంతగా ప్రేమించిన తల్లిదండ్రులుండటం, తాను చనిపోతే వారి దుఃఖాన్ని స్వయంగా చూడడం, తన అదృష్టం!’ అనుకొన్నాడు

తల్లి పక్కన ఎవరో కూర్చుని ఉన్నారు. ఎవరో అమ్మాయి. ముఖం సరిగ్గా కనపడటం లేదు. మెల్లగా కనపడసాగింది. ఏడ్చి ఏడ్చి ఆమె విశాల నేత్రాలు ఎర్ర కలువలయ్యాయి. ఎవరామె?

‘విభావరి!’ విభావరి కూడా వచ్చిందా తన సంతాప సభకు? ఆమె ముఖం పీక్కుపోయింది.

‘దుఃఖంలో కూడ ఎంత అందంగా ఉంది నా విభా!’ అనుకున్నాడు గర్వంగా, “పిల్లలనుంచి ఎవరైనా వనమాలి సార్ గురించి మాట్లాడతారా?” షేక్ పీరా గారు జనాంతికంగా అడిగారు. పిల్లల నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న ‘డొరొతీ’ అన్న అమ్మాయి చేయి ఎత్తింది.

ఆశ్చర్యపోయాడు. సంతోషించాడు కూడా. డొరొతీ వెళ్లి మైక్ అందుకుంది.

‘‘వనమాలి సార్ మాకు మ్యాథ్స్‌కు వచ్చేవారు. ‘ఆల్‌జీబ్రా మైండ్ గాభ్రా’ అని భయపడే మాకు ఆ భయం పోగొట్టిండు సారు. మేమంటే ఆయనకు శాన యిష్టం. ఒక్కనాడు కూడ తిట్టలే, కొట్టలే (వెక్కివెక్కి ఏడ్చింది). సార్‌ని చూసి ‘విజయ్ దేవరకొండ లెక్క గొడుతుండు’ అనుకునే వాళ్లం. ఐ ప్రే గాడ్ జీసస్ టు గివ్ సొలేస్ టు హిస్ సోల్” అంటూ దిగిపోయింది. ‘చాలు! తన జన్మకిది చాలు!’ అనుకున్నాడు. తన విద్యార్థుల మనసు గెల్చుకున్నాడు తను! అంతకంటే ఒక ఉపాధ్యాయుని జీవితానికి సార్ధకత ఏముంది? అతని హృదయంలో ఒక ప్రశాంత వీచిక! ఎవరో వేదిక వద్దకు వస్తున్నారు. హెడ్‌మాస్టారు గారిని ఏదో అడుగుతున్నారు. ఎవరు? షీక్ పీరా గారు అంగీకారంగా తల ఊపటం, అతడు మైకు ముందుకు రావడం చూశాడు. సుగుణాకర్! తన మిత్రుడు సుగుణాకర్!

“నా ప్రాణమిత్రుడు ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించి, మమ్మల్ని శోకసముద్రంలో ముంచేసి వెళ్లిపోయాడు. మేమిద్దరం బాల్యస్నేహితులం. ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం పెబ్బేరులో. చాలా సున్నితమైన వ్యక్తి. నా దగ్గర ఏదీ దాచేవాడు కాదు. నేనంటే ప్రాణం”. అతని గొంతు గద్గదమైంది, “భౌతికంగా మా వనమాలి దూరమైనా, మన అందరి మనస్సుల్లో నిలిచే ఉంటాడు. మావాడు లేకుండా నేనేలా బ్రతకాలి? మరో ఇరవైరోజుల్లో పెళ్లి. ఇంతలోనే ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు.”

ఆశ్చర్యపోయాడు స్నేహితుని మాటలకు. తాను యాక్సిడెంట్‌లో పోయాడా? అదెప్పుడు జరిగింది? తనను తాను చూసుకున్నాడు. ఒంటిమీద ఒక్క గాయమైనా లేదే? తన ప్రాణాధిక నేస్తం సుగుణాకర్ మాటలు వింటుంటే హాయిగా ఉంది. అటువంటి ఫ్రెండ్ ప్రేమను పొందిన తాను అదృష్టవంతుడు! గుణా! ఐ లవ్ యు!

విభావరి తనను గురించి ఏం చెబుతుందో, ఎంత బాధపడుతుందో, వినాలని, చూడాలని అతని మనసు తపించింది. కాని విభావరి కనిపించలేదు. ఏమయిపోయిందబ్బా!

“విభా! విభా! మాట్లాడు! ప్లీజ్!” అని అరుస్తున్నాడు. సడన్‍గా మెలకువ వచ్చింది. శరీరమంతా చెమటలు నోరెండిపోయింది. లేచి కూర్చున్నాడు. తాను గదిలోనే మంచం మీదే ఉన్నాడు. ఇంకా తెల్లవారలేదు. కిటికీ లోంచి, వేపచెట్టు మీది పులుగుల కలకల వినబడుతూంది. కల! అంతా కల! అలాంటి కలే! పైగా తెల్లవారుఝామున వచ్చింది. తను చనిపోవడం. సంతాప సభ అంతా కళ్లకు కట్టినట్టు! కానీ అదంతా తన మనసుకు హాయిగా ఉందేమిటి? సుగుణాకర్ ఈ రోజు వస్తాడు. అతనికి చెప్పాలి” అనుకున్నాడు. మళ్లీ నిద్ర పట్టలేదు.

***

ఆ రోజు సాయంత్రం సుగుణాకర్ ట్రెయినింగ్ నుంచి వచ్చాడు. ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.

“నీవు లేక, ఈ మూడు రోజులూ పిచ్చిపట్టినట్లయిందిరా నాకు!’’ అన్నాడు వనమాలి.

‘‘కొన్ని రోజులాగురా! విభావరి వస్తుంది! అప్పుడు వీడితో నీకు పనే ఉండదు” అన్నాడు సుగుణాకర్ నవ్వుతూ.

“అదేమిటిరా గుణా! అంత మాటన్నావు? పెళ్ళయినంత మాత్రాన మన స్నేహం ఎక్కడికి పోతుంది? నీవు నా బహిఃప్రాణానివి రా!” అన్నాడు వనమాలి. అతని గొంతు భావోద్వేగంతో వణికింది. కన్నుల్లో సన్నని నీటి తెర! సుగుణాకర్ నొచ్చుకున్నాడు.

“ఏదో జోక్ చేసినా లేరా! దానికే అంత ఎమోషనల్ అవుతావెందుకు?” అన్నాడు.

మిత్రుడి భుజం మీద చేయివేసి, దగ్గరకు తీసుకొని “నిన్న రాత్రి మళ్లీ కల వచ్చిందిరా!” అన్నాడు వనమాలి.

“వస్తే వచ్చిందిలే! అవన్నీ సీరియస్‌గా తీసుకోవద్దని చెప్పానా? దే ఆర్ జస్ట్ డ్రీమ్స్! అంతే!” అన్నాడు మిత్రుడు. అన్నాడు గాని, మనసులో ఆలోచిస్తున్నాడు!

“ఈసారి ఆల్ టుగెదర్ డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చింది. నేను చనిపోయానట. స్కూల్లో నా మృతికి సంతాపం వ్యక్తం చేయటానికి ఒక సభ ఏర్పాటయింది. మా హెడ్మాస్టర్ గారు దానికి అధ్యక్షత వహించారు.”

“ఆయన, మీ ఇతర సార్లు నీ మంచితనాన్ని పొగిడారు. అప్పుడు నీ మనసుకు హాయనిపించింది అంతేనా?”

“అవునురా!” అన్నాడు వనమాలి తలవంచుకొని. “ఒక తొమ్మిదో తరగతి అమ్మాయి కూడా నా గురించి మాట్లాడింది గొప్పగా. ఐ ఫెల్ట్ ఫుల్‌ఫిల్డ్.”

“ఏడ్చినట్లుంది! నీ ఫుల్‌ఫిల్‌మెంటూ నువ్వు!” అన్నాడు మిత్రుడు.

“సభకు అమ్మా, నాన్న, విభావరి కూడా వచ్చారు. విభావరి దుఃఖంతో కుదేలయింది. అమ్మ, నాన్న పరిస్థితి హృదయవిదారకం.”

“మరి నేను రాలేదా నీ సంతాప సభకు?” అనడిగాడు నవ్వుతూ.

“వచ్చావు! నా గురించి ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడావు! నీ మాటల్లోనే తెలిసింది నాకు, నేను ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించానని.”

“యాక్సిడెంటా?” ఆశ్చర్యపోయాడు సుగుణాకర్. “ఇదంతా ఎవరికీ చెప్పలేదు కదా! ముఖ్యంగా విభావరికి!”

“ఎందుకు చెబుతానురా, నీవు వద్దన్నావుగా!”

“గుడ్! పెళ్లి గట్టిగా 20 రోజులు కూడా లేదు. జాగ్రత్త. లేనిపోని ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దు. ఇంతకూ సెలవు ఎప్పట్నించి పెడుతున్నావు?”

“సెలవు పెట్టాల్సిన పని లేదు. ఏప్రిల్ 22 నుంచే వేసవి సెలవులు! నాకు ఫస్ట్ యియర్ ఆఫ్ సర్వీస్ కాబట్టి, స్పాట్ వాల్యుయేషన్‌కు పిలవరు.”

“మంచిదే! ఇటీజ్ ఎ బ్లెస్లింగ్ ఇన్ డిస్‌గైస్. అయితే 23న ఉరికి వెళ్లిపోతావన్నమాట. పెళ్లికొడుకును చేయడం, స్నాతకం, వగైరాలన్నీ మీ ఇంట్లోనేనా?”

“కాదు! అక్కడే కల్యాణమంటపంలో!”

“ఫంక్షన్ హాలు ఏదన్నావ్? రాయచూరులో?”

“శ్రీ శృంగేరి శారదా కల్యాణ మంటపం. జవహర్ నగర్.”

“ఈ ఆదివారం కర్నూలుకు వెళ్లి వెడ్డింగ్ కార్డ్స్ ఆర్డర్ ఇద్దాం..”

“ఈ 17 న నేను సాయంత్రం మహబూబ్‌నగర్‌కు వెళ్లాలి. విభావరి నాన్నగారి కొలీగ్ కుమారుని పెళ్లి అట. నన్ను రమ్మని, కలుసుకొని మాట్లాడుకుందామని ఫోన్ చేసింది విభావరి.”

“నీవే ముద్ద పప్పుగాడివి గాని, ఆ అమ్మాయి చాలా ఫాస్ట్‌గా ఉంది రోయ్!” అన్నాడు సుగుణాకర్, స్నేహితుడి వీపు మిద గట్టిగా చరుస్తూ. “ఎక్కడ కలుసుకుంటారు?”

“పెళ్లి న్యూ టౌన్‌లో. అక్కడికి దగ్గరే ‘శ్రీ వెంకటేశ్వర భవన్’ అనే రెస్టారెంట్‌లో. తన తమ్ముడిని తీసుకొని వస్తానన్నది.”

“ఓహో! తమ్ముడు స్పీడ్ బ్రేకరన్నమాట!” అన్నాడు సుగుణాకర నవ్వుతూ.

“నీవు నోర్ముయ్యి. ఆ పిల్లవాడు అక్కకు తోడుగా వస్తున్నాడంతే. వాడు లేకపోయినా, ఆ రెస్టారెంట్‌లో మేం చేసేదేముంది? పెళ్లి కాకుండానే ప్రొసీడయ్యే వ్యక్తిత్యాలు కావు మావి!”

“తెలుసు లేరా! ఆ అమ్మాయితో మాట్లాడి వచ్చేయి. మీటింగ్ ఫియాన్సీ బిఫోర్ మేరేజ్, ఈజ్ ఎ మెమొరబుల్ థింగ్!”

“నిజమే! నాకూ ఎక్సయిటింగ్ గానే ఉంది.”

“నాకు ఒకటనిపిస్తుంది! ఏమనుకోకు నువ్వు! మనం ఈ సండే కర్నూలుకు వెళతాము కదా! ఈ కలలు ఇలా రావడం గురించి ఎవరైనా సైకియాట్రిస్టు, లేదా కనీసం సైకాలజిస్టును కలుద్దాం. ఆయన దీన్ని ఎలా విశ్లేషిస్తాడో చూద్దాం.”

“అంత అవసరమంటావా?

“ముందు జాగ్రత్త! అంతే! ఇలా, ఇంత వివరంగా కలలు రావడం కొంత విచిత్రంగా ఉంది. ఎ సైకియాట్రిస్ట్ ఈజ్ ది కాంపిటెంట్ పర్సన్ టు ఇంటర్‌ప్రెట్ యువర్ డ్రీమ్స్!”

“అయితే సరే, నీకంటే నాకు ఎక్కువ తెలుసా ఏమిటి? సరేగాని, ఆదివారం కర్నూలులో ప్రింటింగ్ ప్రెస్సులుంటాయా?”

“సిల్లీ ఫూల్! పెళ్లిళ్ల సీజను ఇది. ఆదివారమని మూసుకుని కూర్చోరు.”

“మరి డాక్టరు?”

“ఉంటారు లేరా! నేను కనుక్కుంటాను.”

***

ఈ ఆదివారం తాను రావడం లేదని అమ్మానాన్నలకు ఫోన్ చేశాడు వనమాలి. ఈమధ్యే తండ్రికి ఒక బేసిక్ మోడల్ ఫోన్ కొనిచ్చాడు. వెడ్డింగ్ కార్డు కోసం కర్నూలుకు వెళ్తున్నామని చెప్పాడు. కేశవాచార్యులు కొడుకుతో ఇట్లా అన్నాడు:

“నాయనా, కార్డు మీద మన వేణుగోపాలుని బొమ్మ ముద్రించాలి. మన స్వామి ఉన్న భంగిమలో దొరకదు. వ్యత్యస్త పాదారవిందుడై, మురళీధరుడై, రాధా సమేతుడై ఉంటే చాలు. బొమ్మ క్రింద మంచి శ్లోకం రావాలి”

“ఏ శ్లోకం పెడదాం నాన్నా?”

ఆయన కాసేపు ఆలోచించి, “వసుదేవసుతం దేవమ్ – నీకు వచ్చు కదా!” అన్నాడు.

“వచ్చు. నీవే కదా నేర్పావు!”

“ఏదీ చెప్పు చూద్దాం!”

వనమాలి నవ్వుకున్నాడు. “వసుదేవసుతం దేవం, కంస చాణూర మర్దనమ్, దేవకీ పరమానందమ్, కృష్ణమ్ వందే జగద్గురుమ్.”

తండ్రి సంతోషించాడు. “బాగుంది. ఆ శ్లోకమే ప్రింట్ చేయించు” అన్నాడు.

***

ఆదివారం స్నేహితులిద్దరూ బయలుదేరారు కర్నూలుకు, సుగుణాకర్ బైక్ మీద. హాయిగా బస్‌లో వెళదామన్నాడు వనమాలి. కానీ, సిటీల్లో తిరగడానికి మళ్లీ ఆటోలు పట్టుకోవాలని బైకే ప్రిఫర్ చేశారు.

గద్వాల చౌరస్తాకివతల, హైవేకు అటువైపు ‘పిరమిడ్ ఫుడ్ కోర్ట్’ అని ఉంది. దాంట్లో టిఫిన్ చేద్దామనుకున్నారు. అందులో షాండిలియర్లు, కుషన్ ఛెయిర్లు, రాగి జగ్గులు, గ్లాసులు, అంతా పటాటోపంగా ఉంది. కానీ జనం పల్చగా ఉన్నారు. కొంచెం ఇవతలగా ఒక మొబైల్ టిఫిన్ సెంటర్ రోడ్డు పక్కన ఉంది. నేల మీదే ఏడెనిమిది ప్లాస్టిక్ స్టూల్స్ వేసి ఉంచారు. ఒక వ్యాన్‌ను టిఫిన్ సెంటర్‌కు అనువుగా మలిచారు. హైవే వెంబడి ప్రతి పది కిలోమీటర్లకు ఇవే. వీళ్లు వేడి వేడిగా టిఫిన్స్ మన కళ్లెదుటే చేస్తారు. చట్నీలు రుచిగా ఉంటాయి. ఎ.సి. రెస్టారెంట్ల వాళ్లు, ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందంగా ఉంటారు. చట్నీలు ఫ్రిజ్‌లో పెట్టి చస్తారు. అదేం ఖర్మో!

మొబైల్ టిఫిన్ సెంటర్ చుట్టూ జనమే. కొందరు కార్లు ఆపుకొని, కార్లలోకే టిఫిన్ తెచ్చుకొని తింటున్నారు. మినపవడలు జయంట్ సైజు, లేత బంగారు రంగులో, వేడిగా మూకుడు లోంచి తీస్తున్నారు. పూరీలు కూడా చాలా పెద్దవి.

స్నేహితులిద్దరూ ప్లేట్ వడ, సింగిల్ పూరీ తిన్నారు, ఒక్కొక్కరు. అద్భుతంగా ఉన్నాయి. ధర కూడ బాగా తక్కువ. అక్కడ నుంచి బయలుదేరి, అలంపూరు టోల్ గేట్ దాటి అక్కడ ‘టీ టైమ్’ లో దమ్ చాయ్ తాగినారు. వారు కర్నూలు చేరేసరికి పదకొండయ్యింది. పాత బస్టాండు వద్ద, విక్టరీ టాకీసు సందులో, ఉజ్జ్వల ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ ఉంది. ‘ఇచ్చట పెండ్లి పత్రికలు అందముగా అచ్చువేయబడును’ అని బోర్డు మీద వ్రాసి ఉంది.

ఏడెనిమిది రకాలు చూపించారు పెళ్లి పత్రికలు. ఇద్దరూ కలసి ఒకటి సెలెక్ట్ చేశారు. వేణుగోపాలుని బొమ్మ, వీళ్లు అనుకున్నది ‘అచ్చు’ వాళ్ల దగ్గరుంది. శ్లోకం ఒక పేపర్ మీద రాసి యిచ్చాడు వనమాలి. ఒక గంట ఆగితే ప్రూఫ్ చూసుకోవచ్చని చెప్పారు. ఈ లోపు డాక్టరు దగ్గరకు వెళ్లి వస్తే సరి.

సుగుణాకర్ ముందే విచారించి ఉన్నాడు. డా॥ ఉరుకుందప్ప అని కర్నూల్లో ఫేమస్ సైకియాట్రిస్ట్. ఆయన కర్నూలు మెడికల్ కాలేజీలో సైకియాట్రి, ప్రొఫెసర్‌గా చేసి రిటైరయ్యారట. ఆయన క్లినిక్ బాస్టియన్ రోడ్ లోనే ఉంది. అది ప్రెస్ దగ్గర. బాస్టియన్ రోడ్ అంటే, పాత బస్టాండు నుంచి, వన్ టౌన్‍కు వెళ్లే దారి.

డాక్టరుగారు క్లినిక్‌లో ఉన్నారు. బయట బోర్డు ఉంది. “డా॥ ఉరుకుందప్ప, ఎమ్.డి.(సైకియాట్రి). మానసికరోగ నిపుణులు. కన్సల్టింగ్ అవర్స్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు; సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు”. అప్పుడు టైం పన్నెండు దాటింది. బయట ఒకతను కూర్చుని, కన్సల్టేషన్ ఫీజు 500/-రూపాయలు కట్టించుకుని, రశీదు ఇచ్చాడు.

వీళ్ల కంటే ముందు ఇద్దరు పేషంట్స్ ఉన్నారు. “ఈ లోపల టైం అయిపోతుందేమోరా!” అన్నాడు వనమాలి. రిసెప్షన్లో ఉన్నతను అది విన్నట్లున్నాడు.

“పన్నెండున్నరకు టోకెన్లు ఆపేస్తాము సార్. చివరి టోకెన్ పేషంటును చూసిన తర్వాత డాక్టరుగారు ఇంటికి వెళతారు” అన్నాడు.

వీళ్ల వంతు వచ్చింది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. డాక్టరుగారికి నమస్కరించారు.

“ప్లీజ్ బీ సీటెడ్” అన్నాడాయన చిరునవ్వుతో. సన్నగా, తెల్లగా, పొడుగ్గా ఉన్నాడు. తల, మీసాలు, కనుబొమ్మలతో సహ అన్నీ తెల్లగా నెరిశాయి. గోల్డ్ ఫ్రేమ్ కళ్లజోడు ఆయనకు ఒక హుందాతనాన్ని ఇచ్చింది.

“చెప్పండి! మీ ఇద్దరిలో పేషంట్ ఎవరు?” అనడిగాడాయన.

“నేనేనండి” అన్నాడు వనమాలి. “గత కొన్ని నెలలుగా నాకు విచిత్రమైన కలలు వస్తున్నాయి డాక్టర్.”

“విచిత్రం అంటే.. ఎటువంటి కలలు?”

సుగుణాకర్ కల్పించుకొని, “వీడు చచ్చిపోయినట్లు, వీడి అంత్యక్రియలు జరుగుతున్నట్లు, ఆత్మీయులు విపరీతంగా దుఃఖిస్తున్నట్లు సృష్టంగా తెలుస్తూ ఉంటుందట సార్. మరో రెండు వారాల తర్వాత వీడి పెళ్లి. ఎందుకైనా మంచిదని మీ దగ్గరకు వచ్చాము.”

“ది సైకియాట్రిస్ట్ ఈజ్ ది మోస్ట్ రేర్లీ కన్సల్టెడ్ అన్‌ఫార్చునేట్ బీయింగ్ ఇన్ అవర్ కంట్రీ” అన్నాడాయన నవ్వుతూ. “అదే వెస్టర్న్ కంట్రీస్ అయితే, వాళ్లకే రోరింగ్ ప్రాక్టీసు. దీని బట్టి ఏం తేలింది?”

వనమాలి అన్నాడు “మానసిక రుగ్మతలు మన దేశంతో చాలా తక్కువ అని”

“గుడ్!” అన్నాడు డా॥ ఉరుకుందప్ప. “మీరు చనిపోవడం, మీ అంత్యక్రియలు జరిగినట్లు, కలల్లో కనబడడం చాలామందికి జరిగేదేలెండి. అది అంత ప్రాబ్లం ఏమీ కాదు”

సుగుణాకర్ అన్నాడు “కానీ, ఇందులో యునిక్‌నెస్ ఏమిటంటే, ఆ కల జరుగుతున్నంత సేపూ, వీడు చాలా హ్యాపీగా, రిలాక్స్‌డ్‌గా ఉంటాడట. తన కోసం బాధపడేవారు, తన మంచితనాన్ని పొగిడేవారు, తన ఆత్మీయులున్నారని గర్వంగా ఉంటుందట.”

డాక్టరుగారి కనుబొమలు ముడిపడినాయి.

“ఈజిట్?” అన్నాడు. “అయితే కొంచెం ఆలోచించాల్సిందే!” అన్నాడాయన. టేబుల్ మీద ఉన్న బజర్ నొక్కాడు. రిసెప్షనిస్టు లోపలికి వచ్చాడు. “ఖలీల్! లోపల షెల్ఫ్‌లో పై అరలో ఎడమ నుంచి మూడవ బుక్ తీసుకురా!” అని చెప్పాడు. అతను వెంటనే ఆ పుస్తకాన్ని తెచ్చి యిచ్చాడు. దాన్ని వాళ్ల ముందు పెట్టాడాయన. దాని పేరును చూశారు.

(ఇంకా ఉంది)

Exit mobile version