[శ్రీ పాణ్యం దత్తశర్మ వ్రాసిన ‘మరణం మధురం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]
[వనమాలికి మళ్ళీ తాను చనిపోయినట్టు, అమ్మానాన్నలు రోదించినట్టు, తోటి ఉపాధ్యాయులు, బడి పిల్లలు తనని పొడిగినట్టు, సుగుణాకర్ తన మంచి గుణాలను ప్రస్తావించి, తన మిత్రుడు మరణం తనకి పెద్ద లోటని అనడం, అది చూసి తాను సంతోషించినట్టు కల వస్తుంది. మర్నాడు సుగుణాకర్ ట్రైనింగ్ నుంచి వస్తాడు. సాయంత్రం కాసేపు కబుర్లు చెప్పుకున్నాకా, తనకొచ్చిన ఆ కల గురించి మిత్రునికి చెప్తాడు వనమాలి. ఇవన్నీ ఎవరికీ చెప్పవద్దని హెచ్చరిస్తాడు సుగుణాకర్. పెళ్ళి దగ్గరలోనే ఉంది కాబట్టి, ఆదివారం కర్నూలుకు వెళ్ళి వెడ్దింగ్ కార్డ్స్ ఆర్డర్ ఇద్దామని అంటాడు. పదిహేడవ తేదీ సాయంత్రం విభావరిని, వాళ్ళ తమ్ముడిని మహబూబ్ నగర్ న్యూ టౌన్‌లోని ఓ హోటల్లో కలవాలని చెప్తాడు వనమాలి. ఆదివారం నాడు కర్నూలు వెళ్ళి శుభలేఖలు ప్రింటింగ్‌కి ఆర్డర్ ఇస్తారు. తర్వాత డా. ఉరుకుందప్ప అనే సైకియాట్రిస్ట్ వద్దకు వెళ్తారు. కన్సల్టేషన్ ఫీజ్ కట్టి, తమ వంతు కోసం ఎదురు చూస్తారు. కాసేపయ్యాకా, వీళ్ళని లోపలికి వెళ్ళమంటాడు రిసెప్షనిస్ట్. డాక్టర్ గారికి నమస్కరించి, తమని తాము పరిచయం చేసుకుంటారు. సుగుణాకర్ తన మిత్రుడికి వస్తున్న కల గురించి డాక్టరుకి చెప్తాడు. ఆయన ఆలోచించి, బెల్ కొట్టి, అలమార నుంచి ఒక పుస్తకం తెమ్మని రిసెష్పనిస్ట్కి చెప్తారు. – ఇక చదవండి.]
‘ది ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్’, సిగ్మండ్ ప్రాయిడ్ 1899 అని ఉంది అట్ట మీద.
“ఫ్రాయిడ్ తెలుసుగదా మీకు?” అనడిగాడు ఆయన.
“తెలుసండీ”! అన్నాడు వనమాలి “మనస్తత్వశాస్త్ర పితామహుడంటారుగదా ఆయన్ను.”
“గుడ్! అవును. ఆయనీ ఈ పుస్తకాన్ని కలల గురించి వ్రాశాడు. ఆయన ఆస్ట్రియా దేశస్థుడు. దానిని జర్మన్ భాషలో వ్రాశాడు. దాని పేరు కూడ ఆ భాష లోనే పెట్టాడు. అది పలకడం కష్టం మనకు. దాని స్పెల్లింగ్ DIE TRAUMDEUTUNG. ‘డి ట్రవుమ్ డాయ్టంగ్’ అని పలకాలి. ఇదంతా పేషంట్లకు అవసరం లేదు. కాని మీరు యూత్ అండ్ ఎడ్యుకేటెడ్ కాబట్టి చెబుతున్నాను.”
“చెప్పండి డాక్టర్! చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది!”
“దానర్థం, ‘కలలపై విశ్లేషణ’. కల కనే వాడి అంతరాంతరాల లోని కోరికలు, భయాలు, అనుభవాలను బట్టి, కలలు వస్తాయన్నాడాయన. కలను ఆయన, ‘మనస్సు తనకు తెలియకుండా పాల్పడే చర్యలను తెలుసుకునే రాజమార్గం’ అని నిర్వచించాడు.”
స్నేహితులిద్దరూ శ్రద్ధగా వింటున్నారు.
“కలలు ఏదో ఉన్నట్లుండి వచ్చేవి కాదని, మన మనసులోమనకు తెలియకుండా చెలరేగే ఆలోచనలకు, వాంఛలకు, సంఘర్షణలకు ప్రతిబించాలని ఆయన ప్రధాన సిద్ధాంతం. కలలను విశ్లేషించడం ద్వారా ఒక వ్యక్తి యొక్క మానసిక, భావావేశ స్థితులపై అవగాహన కలుగుతుంది.
కలలను విశ్లేషించడానికి ఆయన కొన్ని పద్ధతులను కనిపెట్టాడు. స్వాప్నికుడి మెలకువ జీవితానికి, గత అనుభవాలకు అతనికి వచ్చే కలలను అనుసంధానించడం. రెండవది గెస్టాల్ట్ థియరీ. దీనిలో, కలలో కనిపించిన వివిధ విషయాలను, నిజజీవితంలో ‘రోల్ ప్లే’ చేసి చూడడం.
‘నైట్‌మేర్స్’ అంటే పీడకలలు. వ్యక్తి కోరికలు నెరవేరకపోతే, లేదా అవి సరిగ్గా తెలియకపోతే వస్తాయి. అప్పుడా వ్యక్తికి సడన్‌గా మెలకువ వస్తుంది. అతనికి ఆ కల ఎంతో ఆందోళనను కలిగిస్తుంది.”
“నాకు వచ్చే కల ‘పీడకల’ క్రిందికి వస్తుందాండి?” అనడిగాడు వనమాలి.
“నో. రాదు. ఎందుకంటే మీరు దాన్ని ‘ఎంజాయ్’ చేస్తున్నారు. మీకు ఆందోళన కలగడం లేదు. మెలకువ కూడా సడన్‌గా రావడం లేదు కద!”
“అవునండి”
“అలా అని మీ కలలను నార్మల్ అండ్ నాట్ టు వర్రీ ఎబౌట్ అనలేము. మీ చావు, అంత్యక్రియలు, ఆత్మీయుల ప్రశంసలు, దుఃఖం, ఇవన్నీ మీకు ఆనందాన్ని కలిగిస్తున్నాయంటున్నారు. అంటే, అంతరాంతరాల్లో, మీ సబ్ కాన్షస్ మైండ్‌లో మీ అంత్యక్రియలు మీరు చూసుకోవాలనే బలీయమైన కోరిక ఉందన్నమాట. యామ్ ఐ రైట్?” అనడిగాడు డా॥ ఉరుకుందప్ప.
“ఉందేమో సార్! మా అమ్మనాన్న, నా కాబోయే భార్య, నా ప్రాణ స్నేహితుడు నా పట్ల చూపించే ప్రేమాభిమానాలను నా మరణం తర్వాత ప్రత్యక్షంగా చూసుకుంటే బాగుంటుందనిపిస్తుంది.”
“దేర్ యు ఆర్!” అన్నాడు డాక్టర్. “కాని అది అసాధ్యం అని మీరు తెలుసుకుని మీ అంతట మీరు రికన్సైల్ అవ్వాలి వనమాలి గారు. లేకపోతే, ఈ టెండెన్సీ అన్టువార్డ్ (అనభిలషణీయ) చర్యలకు దారి తీసే ప్రమాదం ఉంది.”
“ఐన్‌స్టీన్ గారు, మన అబ్దుల్ కలాం గారు ‘కలలు కనండి. వాటిని సాకారం చేసుకోడానికి కృషి చేయండి’ అన్నారు కదా డాక్టర్. మరి, వాటి మాటమిటి?” అనడిగాడు సుగుణాకర్.
“గుడ్ క్వశ్చన్! అవి ఈ కలలు కాదు. ఆశయాలు! అనుకూల దృక్పథాన్ని, వ్యక్తిత్వవికాసంలో జొప్పించడానికి ఆ మహానీయులు వాడిన మాటలవి.”
“బాగా చెప్పారండి”
“దుఃఖాన్ని గురించి ఫ్రాయిడ్ ఏమన్నాడో తెలుసా యంగ్ మెన్? దుఃఖం ఒక రకమైన అంగీకారంతో ముగిసే ప్రక్రియ అట”
“దయచేసి వివరించండి సార్”
“ఎంత దుఃఖానికి లోనైనవాడయినా, చివరికి తనంతట తాను రాజీపడి, ఆ దుఃఖాన్ని పరిత్యజిస్తాడని. దుఃఖించే వ్యక్తి, చివరికి బాహ్య ప్రపంచంలో పాల్గొనడానికి ప్రేరేపించబడతాడు. ఆ ప్రేరణ అతనిని లేదా ఆమెను అమితంగా ప్రేమించే వ్యక్తులు లేదా పరిస్థితులు కావచ్చు, చివరికి దుఃఖకారకుడైన మనిషి అదృశ్యమైనా, దుఃఖం ముగియక తప్పదు. అందుకే ‘గ్రీఫ్ ఈజ్ బ్రీఫ్’ అన్నారు పాశ్చాత్యులు. మనవాళ్ళు దాన్ని ‘ఈ రోజు చస్తే రేపటికి రెండు’ అని చమత్కరించారు. ఎంత ఆత్మీయులైనా రోజుల కొద్దీ రోదించరు. ఆ వరాన్ని భగవంతుడి మానవులకు ప్రసాదించాడు. లేకపోతే ఇంకేమయినా ఉందా!”
ఆ అపర ధన్వంతరికి పాదాభివందనం చేయాలనిపించింది ఇద్దరికీ.
“మీకు ఓపిక ఉందంటే కొన్ని విషయాలు చెబుతాను. అఫ్కోర్సు, ఇదంతా వనమాలిగారికి నేనిచ్చే ట్రీట్మెంట్లో భాగమే”
“అయ్యో! చెప్పండి డాక్టర్. చాలా అద్భుతంగా ఉంది వింటూంటే!”
“దట్ షోస్ యువర్ మెచ్యూరిటీ అండ్ అర్జ్ టు నో అన్నోన్ థింగ్స్. మన మనస్సు మన ఆలోచనలను, జ్ఞాపకాలను, భావావేశాలను నిలువ చేసుకోనే ఒక రిజర్వాయర్. కాని అవన్నీ మన కాన్షన్ మైండ్‌కు తెలియవు.
మన వ్యక్తిత్వంలో 3 ముఖ్యమైన అంశాలున్నాయన్నాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అవి.
1. ది ఇడ్ – ఇది మనకు తెలియని స్థితి (అన్కాన్షస్ స్టేట్) 2. ది ఈగో – ఇది మనకు తెలిసిన స్థితి (కాన్షస్ స్టేట్) 3. ది సూపర్ ఈగో – ఇది ఒక నైతిక విలువల చట్రం. ఇది ఈగోను నియంత్రిస్తుంది.
ఈ మూడు అంశాల మధ్య జరిగే సంఘర్షణలు, ప్రతిచర్యలు మన వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తాయి.”
మిత్రులిద్దరూ ఏకాగ్రతగా వింటున్నారు.
“మానవునిలో రెండు సహజ ప్రవృత్తులున్నాయి (ఇన్స్టింక్ట్స్). అవే, జీవితం, మరణం. మొదటిది లైంగిక ప్రత్యుత్పత్తి అంటే సంతానోత్పత్తి.. ఉనికి, సంతోషం. రెండవది, దూకుడు లేదా దాడి చేసే స్వభావం.. ఆత్మహత్య, ఆత్మహాని, వినాశం. సాంకేతిక పరిభాషలో దీన్ని ‘ఆక్రామకత’ అంటారు.
ఇక వనమాలి గారి సమస్యకు వద్దాం. ఆయన తన అంత్యక్రియలను, తన ఆత్మీయుల దుఃఖాన్ని కలలో చూసి ఆనందిస్తున్నాడు అంటే తన అంత్యక్రియలను తానే చూసుకోవాలనే ఒక అసాధారణ (abnormal) కోరిక అతని సబ్కాన్షస్ మైండ్‌లో ఉంది. తనను, మరణం తర్వాత తనవారు ఎలా గుర్తు పెట్టుకుంటారో తెలుసుకోవాలకునే బలమైన వాంఛ అది.
దానికి సింబాలిక్ ముగింపే కల! తన అంత్యక్రియలను తాను చూసుకోవడం ఒక తనదైన ముగింపును తెలుసుకుని, అంగీకరించడం అన్నమాట.
అలాంటి కలలు నీలోని భావావేశాలను గుర్తించి వాటిని వ్యక్తం చేసే చిహ్నాలు కావొచ్చు. లేదా నీవు మొదటి నుండీ ప్రాతినిధ్యం వహిస్తున్న నీ యొక్క వ్యక్తిత్వ కారణాలు కావచ్చు. మీకు ఒక వినోదకర విషయం చెప్పనా? మీరు వినే ఉంటారు!” అన్నాడు.
“చెప్పండి!” అని ఆసక్తిగా ముందుకు వంగారిద్దరూ.
“పాశ్చాత్య దేశాలలో ఎప్పట్నించో ఉంది ఈ ప్రహసనం. కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. తమ అంత్యక్రియలను ముందుగానే, అంటే తాము చావకముందే, చూచుకోవాలన్న విపరీత మనస్కుల కోసం అవి ఏర్పడ్డాయి. అవి ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాయి. శవపేటిక దగ్గరనుంచి, కాఫిన్ మీద ఉంచే పుష్పగుచ్ఛాలు, శ్వేతవస్త్రాలు, అన్నీ వాళ్లీ సప్లయి చేస్తారు. ‘మౌర్నర్స్’, అంటే దుఃఖించేవాళ్లను కూడా వాళ్ళే తెస్తారు. అన్నిటికీ రేట్ ఉంటుంది.”
“ఇదెక్కడి చోద్యమండీ! డాక్టర్ గారు!” అన్నాడు వనమాలి.
“మీరు మీ పర్సనాలిటీ లోని మూడవ కోణమైన సూపర్ ఇగో ప్రభావంతో, పెరిగిన సంస్కారం వల్ల, కొన్ని నైతికవిలువలకు కట్టుబడి అటువంటి విపరీతాలకు పాల్పడడం లేదు. అఫ్కోర్సు, మన దేశంలో ఆ ‘ప్లానింగ్ ఎ లివింగ్ ప్యూనరల్’ కాన్సెప్ట్ అంత ప్రాచుర్యం పొందలేదనుకోండి.”
సుగుణాకర్ అన్నాడు “రాయలసీమలో, దుర్మార్గులైన ఫాక్షనిస్ట్లు హత్యకు గురి అయితే, ఆ ఊరివాళ్లు రహస్యంగా ఇళ్లల్లో పండుగలు చేసుకునేవారట. ఇప్పుడంత ఫాక్షనిజమ్ లేదటలెండి. అప్పుడు కొందరిని డబ్బిచ్చి తెస్తారట. వారు వచ్చి, ఆ ఫాక్షనిస్ట్ శవం వద్ద కూర్చుని, రాగాలు తీస్తూ, గుండెలు బాదుకుంటూ, ఏడుస్తారట. తర్వాత తమ ‘రెమ్యూనరేషన్’ తీసుకొని వెళ్లి పోతారట. బాగా ‘రక్తి’ కట్టిస్తారట కూడా!”
డాక్టరుగారు బిగ్గరగా నవ్వారు!
“అవును. నాకెందుకు తెలియదు? నేను ఆదోని ప్రాంతంవాణ్ణి. ఇప్పుడంతా బాగా తగ్గిపోయింది లెండి. షాక్షనిస్ట్ పిల్లలందరు బాగా చదువుకొని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా స్థిరపడుతున్నారు. మీరన్న ‘ఈవెంట్’ వేరు లెండి! అది ఫ్రాయిడియన్ ధియరీకి వర్తించదు.”
“సారీ సర్!” అన్నాడు సుగుణాకర్.
“సారీ ఎందుకు? రిలేటెడ్ అని చెప్పారు మీరు. దానిదేముంది?” అన్నాడాయన.
“ఈ ప్లానింగ్ ఎ లివింగ్ ఫ్యూనరల్ లేదా లైవ్ ఫ్యూనరల్ – వెస్ట్‌లో ఒక ప్రామిసింగ్ ఇండస్ట్రీ అయి కూర్చుంది. దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరట. వాళ్లంతా బాగా బలిసిన ‘బ్యాచ్’ అనుకోండి.”
ముగ్గురూ నవ్వుకున్నారు!
“ఆ వ్యక్తి గుణగణాలను హైర్డ్ మౌర్నర్స్కు ముందే బ్రీఫ్ చేసి, రిహార్సల్స్ చేయించి మరీ రోల్ ప్లే చేయిస్తారట.”
మళ్లీ నవ్వులు. సంభాషణను సీరియస్‌నెస్ నుంచి డైవర్ట్ చేస్తున్నారు డాక్టర్ గారని అర్థమైంది మిత్రులిద్దరికీ.
వనమాలి అన్నాడు, “కానీ డాక్టర్, ఎంత ప్లానింగ్ చేసినా, సదరు కస్టమర్ బ్రతికే ఉంటాడు కనుక, అదంతా ఒక ఫార్స్ అని అతనికి తెలుసు గనుక, అందులో అంత థ్రిల్ ఏముంటుంది?”
డాక్టర్ ఉరుకుందప్ప కాసేపు మౌనం దాల్చాడు. “మీరు కాసేపు బయట వెయిట్ చేయండి” అన్నాడు వనమాలితో.
వనమాలి ఆశ్చర్యపోయాడు. కానీ ఆయన మాటకు విలువ ఇచ్చి, వెళ్ళి రిసెప్షనిస్ట్ దగ్గర కూర్చున్నాడు.
డాక్టరు గారు సుగుణాకర్‌తో అన్నాడు “మిస్టర్! మీరు ఇతన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. త్వరలో పెళ్ళి అంటున్నారు. దాని వల్ల కూడా నార్మల్ అవుతాడు. కాని ప్రత్యక్షంగా తన అంత్యక్రియలు చూసుకోవాలని, ఆత్మీయుల ప్రియ వచనాలను వినాలని అతనికి బలమైన కోరిక మాత్రం ఉంది. ఆ కలలను అతడు ‘ఎంజాయ్’ చేస్తున్నాడంటే అదే కారణం. కానీ అది మంచిది కాదు. ప్రస్తుతానికి వచ్చిన ప్రమాదం ఏదీ లేదు. మూడ్ లిఫ్టర్ మందులు కూడా ఇవ్వను. నిద్ర బాగా పడుతుందంటున్నాడు. కాబట్టి సెడెటివ్స్ అసలు వద్దు. ఒక ఫ్రెండ్‌గా మీరు ఎప్పటికప్పుడు అతనికి కౌన్సెలింగ్ ఇస్తుండండి చాలు.”
“తప్పకుండా డాక్టర్!” అన్నాడు సుగుణాకర్. “దాన్ని నా బాధ్యతగా భావిస్తాను.”
“గుడ్” అని బటన్ నొక్కాడాయన. వనమాలిని రమ్మని చెప్పాడు అసిస్టెంటుకు. వనమాలి వచ్చి కూర్చున్నాడు.
“యంగ్ మేన్, నథింగ్ టు వర్రీ. హ్యాపీగా మ్యారేజ్ చేసుకోండి. మీ సమస్య అసలు సమస్య కాదు. అదే మీ ఫ్రెండ్‌కు చెప్పాను. ట్రై టు కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. దట్సాల్!”
ఇద్దరూ ఆయనకు నమస్కరించి వచ్చేశారు. అప్పుడు టైం ఒకటింబావు!
ప్రెస్‌లో వెడ్డింగ్ కార్డ్ ప్రూఫ్ రీడ్ చేశారిద్దరూ. పెద్దగా తప్పులేమీ లేవు.
“ఆకలి వేస్తుందిరా! భోజనం చేద్దాం!” అన్నాడు వనమాలి.
“ఇక్కడ పాత బస్టాండ్ దగ్గరే ‘అజంతా హోటల్’ అని ఉండాలి. పద” అన్నాడు సుగుణాకర్. విచారిస్తే. అది ఎప్పుడో మూసేశారని తెలిసింది. పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద ‘గీతా లంచ్ హోమ్’ అని ఉందని, భోజనం చాలా బాగుంటుందని ఒకాయన చెప్పాడు. అదీ దగ్గరే. నడుచుకుంటూ వెళ్లారు. వీళ్లకిద్దరికీ సీట్లు దొరకడానికి ఇరవై నిమిషాలు పైనే పట్టింది. కరెక్ట్‌గా ఒకే ఒక అరటాకు పట్టి సింగిల్ టేబుల్స్, సింగిల్ కుర్చీలు. భోజనం చాలా బాగుంది. అన్నం పొగలు కక్కుతుంది. మజ్జిగపులుసు ఘుమఘుమలాడుతోంది. పెరుగు, కప్పులతో ఇవ్వకుండా లిబరల్గా వడ్డిస్తున్నారు.
“ఇది పెద్ద గీత! చిన్న గీత రవిప్రకాష్ సెంటరులో, యస్.బి.ఐ ప్రక్కన ఉంది” అంటున్నాడొకాయన. అది వీళ్ల బ్రాంచ్ అని తెలిసి నవ్వుకున్నారు. సమయం 3 గంటలు కావస్తుంది. కొంచెం దూరంలో ‘వెంకటేష్ సినీ కాంప్లెక్స్’ కనపడుతుంది, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ప్రక్కన. దాన్ని పార్క్ రోడ్ అని కూడ అంటారు.
“ఒరేయ్! ఇంటికి వెళ్లి చేసేదేముంది. పనులన్నీ అయిపోయినాయి. ఆ మల్టీప్లెక్స్‌లో ‘మహావతార్ నరసింహ’ చూద్దాం పద” అన్నాడు సుగుణాకర్. “చాలా బాగుందట.”
“పద అయితే!” అన్నాడు వనమాలి.
సినిమా ఇద్దరికీ బాగా నచ్చింది. సాయంత్రం 7 గంటలకల్లా పెబ్బేరు చేరుకున్నారు.
***
ఏప్రిల్ 17వ తేదీ. ఇన్విజిలేషన్ ముగించుకొని, పెబ్బేరుకు వచ్చి భోజనం చేసి, మహబూబ్‌నగర్ బస్సు ఎక్కాడు వనమాలి. ఆర్డినరీ బస్ అది. జడ్జర్లకు ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లి, మళ్లీ అక్కడినుంచి మహబూబ్‌నగర్‌కు మరో ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లవచ్చు. కానీ, భూత్పూర్ మీదుగా పోయే దారి బాగా షార్ట్‌కట్ అవుతుంది.
అతడు మహబూబ్‌నగర్ చేరేసరికి ఐదుంబావు. వేంకటేశ్వరభవన్కు ఆటోలో వెళ్లాడు. జనం పెద్దగా లేరు. విభావరి, ఆమె తమ్ముడు ఇంకా రాలేదు. ఒక టేబుల్ వద్ద కుర్చీలో కూర్చుని వెయిట్ చేయసాగాడు.
పావుతక్కువ ఆరు! ప్రియసఖి కోసం వేచుటలో ఎంత థ్రిల్ ఉందో అనుభవిస్తున్నాడు వనమాలి. ఆరవుతుండగా, అక్క, తమ్ముడు రెస్టారెంట్లో ప్రవేశించారు. విభావరి కళ్ళు వనమాలి కోసం వెతికాయి. అతన్ని చూచి ఆమె వదనం వికసిత కమలమయింది. వనమాలి లేచి వాళ్ళకు ఎదురువెళ్లాడు.
“నమస్తే! బావగారు!” అన్నాడు బావమరిది.
“నమస్తే! ప్లీజ్ కమ్! నీ పేరు?”
“విరించి.”
“గుడ్. బ్రహ్మదేవుని పేరు.”
విభావరి కళ్లల్లో మెరుపు. అతన్నే చూస్తూంది. ఒత్తయిన నల్లని అతని జుట్టు, విశాలమైన ఫాలం, చక్కని మీసకట్టు, అతని హ్యాండ్సమ్నెస్ను ద్విగుణీకృతం చేస్తున్నాయి. కాఫీరంగు ప్యాంటు మీద లేత పసుపురంగు గళ్లు గల టీ షర్ట్ ధరించాడు.
విభావరి లేత పింక్ రంగు చీర, మ్యాచింగ్ జాకెట్ ధరించింది. ఆ చీరరంగు ఆమె శరీరం రంగులో కలిసిపోయింది. పెళ్లి కోసమేమో డిజైనర్ బ్లవుజ్ ధరించిందామె. పెద్దగా నగలేమీ పెట్టుకోలేదు. ఒక సన్నని బంగారు గొలుసు ఆమె మెడలో మెరుస్తూంది. ఒక చేతికి రెండు బంగారు గాజులు, మరో చేతికి బ్రెస్లెట్లా ఉండే వాచ్.
“సింపుల్ అండ్ ఎఫెక్టివ్, విభా!” అన్నాడామెను పరవశంగా చూస్తూ. పరస్పర అనురాగ బద్ధులు, త్వరలో పెళ్లి కాబోతున్న అ జంట అక్కడ రెస్టారెంట్లో ఉన్నవారికి కన్నుల పంటగా ఉంది. విభావరి అతని పక్కన కూర్చుంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా నొక్కాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు కదా, తీయగా నవ్వింది.
బేరర్ వచ్చి ఆర్డర్ చెప్పమని అడిగాడు.
“కాసేపు ఆగు బ్రదర్” అన్నాడు వనమాలి. అతడికి అర్థమైంది. నవ్వి వెళ్లిపోయాడు. విరించి, వీళ్లకు ఏకాంతం కల్పించాలని, “అక్కా, ఇప్పుడే వస్తాను” అని వెళ్లిపోయాడు. తెలివైనవాడు.
వనమాలి “విభా! నిన్ను చూస్తుంటే, ‘రుక్మిణీ కల్యాణం’లో పోతన్నగారు రుక్మిణీ దేవిని గురించి చెప్పిన పద్యం గుర్తొస్తుంది. నాన్నగారు పురాణ ప్రవచనంలో చెప్పారు.” అన్నాడు.
“ఏమిటా పద్యం? చెప్పండి!” అన్నది కుతూహలంగా ముందుకు వంగి. అప్పుడు ఆమె చెవికి పెట్టుకొన్న ఇయర్ రింగ్స్ మనోహరంగా కదిలాయి.
“పద్యమంతా వద్దుగాని, శ్రీకృష్ణ పరమాత్మ తనను తీసుకొనిపోవడానికి ఇంకా రాలేదని, అమ్మవారు బెంగపెట్టుకున్నదట. ఆభరణాలు ఏవీ ధరించదట. గంధం రాసుకోదట. ‘మృగనాభి’ని పూసుకోదట.”
“మృగనాభి అంటే?”
“కస్తూరి. అక్కడ ఒక మాట అంటారు పోతన. ‘తొడవులు తొడగదు తొడవు తొడవు’ అని.”
“మీరు సైన్స్ అసిస్టెంట్ అయినా, తెలుగు సారులా మాట్లాడతారే?”
“అంతా మా నాన్నగారు నేర్పినదే. మ్యాథ్స్, సైన్స్, బ్రతుకు తెరువు. తెలుగు మన జీవితానికి వెలుగు.”
చప్పట్లు కొట్టింది విభావరి, “సూపర్” అంటూ. “మరి అర్థం చెప్పండి”
“విభా, ‘తొడవు’ అన్నది అచ్చ తెనుగు పదం! అంటే సొమ్ము, అలంకారం అని. ఆమె, ఎటువంటి ఆభరణాలు ధరించలేదు. నీలాగా! ఎందుకంటే ఆమె సాక్షాత్ మహాలక్ష్మి. ‘తొడవు తొడవు’ అంటే అలంకారానికే అలంకారం!”
అతని వైపు మురిపెంగా చూసుకుంది విభావరి. ఈలోపు బేరర్, విరించి, ఇద్దరూ ఒకసారి వచ్చేశారు.
“ఏమయినా తిందామా?” అనడిగాడు.
“రాత్రి పెళ్లి భోజనం చేయాలి కదా! ఏమీ వద్దు.”
“ఏం కాదు. ప్లెయిన్ రవ్వదోశ తిందాం. అసలు తిన్నట్లే ఉండదు.”
రవ్వదోశ చాలా బాగుంది. తర్వాత ఫిల్టర్ కాఫీ.
కాసేపు ‘మధురరిక్త భాషణం’ చేశారు. టైం చూసుకొంది విభావరి.
“మాలీ! ఇక బయలుదేరతాం. ఏడు కావస్తూంది’’ అన్నది.
“సరే. తప్పదు కదా!” అన్నాడు అయిష్టంగా.
విభావరి నవ్వింది! విరులు బలజల రాలినట్లు! విరించి తాను బిల్లు చెల్లించడానికని ఉద్యుక్తుడవుతుంటే, వనమాలి
“ఉండవోయి చిన్నబావ! నీకు ఉద్యోగం వచ్చింతర్వాత ఇద్దువుగాని” అన్నాడు.
బయటకు వెళ్లి ఇద్దర్ని ఆటో ఎక్కించాడు. ఆటో లోంచి చేయి ఊపుతున్న విభావరి అందమైన మోము అతని మనస్సులో నిలిచిపోయింది. ఆ గంట సేపు కలుసుకోవడం, వారిరువురి మధ్య గల ‘టుగెదర్‌నెస్’ను మరింత సుసంపన్నం చేసింది.
‘నేనెంత అదృష్టవంతుడిని!’ అనుకొన్నాడు వనమాలి! అతని హృదయం మబ్బుల్లో తేలుతున్నట్లుంది. మనసైన మగువ తన స్వంతమవుతూంటే ఏ మగవానికైనా కలిగే అనుభూతి అది!
***
వనమాలి పెబ్బేరులో తమ రూము చేరేసరికి ఎనిమిదయింది. సుగుణాకర్ ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ వండి, కర్రీ పాయింట్లో దొండకాయ ఫ్రై, టమోటా పప్పు, పెరుగు తెచ్చి ఉంచాడు.
“ఏమిరోయ్, ముఖం మతాబులా వెలిగిపోతోంది! విభావరి మహత్మ్యమా?”
“అవునురా గుణా!” అన్నాడు వనమాలి.
“ఏం మాట్లాడుకున్నారేమిటి?” అని అడిగి. “సారీరా! కాబోయే దంపతుల సంభాషణను వినాలనుకోవడం, ఎంత క్లోజ్ ఫ్రెండ్నైనా, తప్పే” అన్నాడు.
“నీకు చెప్పకూడని విషయాలు ఏవీ లేవు లేరా! బావమరిది ఉన్నాడుగా! ఉన్నా, ఆ పబ్లిక్ రెస్టారెంట్లో ఏం మాట్లాడుకుంటాం?” అన్నాడు వనమాలి. “ఆ అమ్మాయి నా జీవితంలోకి రాబోతుంది అని అనుకుంటుంటేనే ఎంత ఆనందంగా ఉందనుకున్నావ్!” అని, సింపుల్‌గా ఉన్న ఆమె అందాన్ని, పోతన్నగారి రుక్మిణీదేవితో పోల్చి చెప్పినట్లు, విభావరి ఎక్సయిట్ అయినట్లు చెప్పాడు.
“ఓరి యూస్‌లెస్ ఫెలో! తీరా అంత దూరం వెళ్లి తెలుగు పాఠం చెప్పి వచ్చావా కాబోయే భార్యకు!” అన్నాడు సుగుణాకర్ నవ్వుతూ.
“అలా ఆ అమ్మాయిని పొగిడాను కదా!” అన్నాడు వనమాలి, తాను కూడా నవ్వుతూ.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
