Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరణం మధురం-8

[శ్రీ పాణ్యం దత్తశర్మ వ్రాసిన ‘మరణం మధురం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]

[వనమాలి, అతని స్నేహితుడు సుగుణాకర్ మానసిక నిపుణుడు డాక్టర్ ఉరుకుందప్పను కలుస్తారు. వనమాలికి తన అంత్యక్రియలు తానే చూసుకుంటున్నట్లు వచ్చే వింత కలలపై డాక్టర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన ‘ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్’ పుస్తకం, ఇంకా అతని మనస్తత్వ సిద్ధాంతాల ఆధారంగా విశ్లేషణ చేస్తారు. పాశ్చాత్య దేశాలలో బ్రతికుండగానే తమ అంత్యక్రియలను చూసుకునే ‘ప్లానింగ్ ఎ లివింగ్ ప్యూనరల్’ అనే వ్యాపార సంస్కృతి ఉందని చెప్తూనే, వనమాలికి ఉన్న ఈ వింత ఆలోచనా ధోరణిని అదుపులో ఉంచుకోవాలని, పెళ్లి తర్వాత అంతా నార్మల్ అవుతుందని ధైర్యం చెప్పి పంపిస్తారు. అనంతరం స్నేహితులిద్దరూ కర్నూలులో భోజనం చేసి, సినిమా చూసి పెబ్బేరు చేరుకుంటారు. అనుకున్న రోజున వనమాలి మహబూబ్ నగర్ వెళ్లి తన కాబోయే భార్య విభావరిని, ఆమె తమ్ముడు విరించిని ఒక రెస్టారెంట్‌లో కలుస్తాడు. ఎంతో సరళంగా, అందంగా ఉన్న విభావరిని పోతన రుక్మిణీ కళ్యాణ పద్యంతో పోల్చి ప్రశంసిస్తూ వనమాలి ఆమెతో గడిపిన ఆ మధుర క్షణాలను, తనపై ఆమెకున్న ప్రేమానురాగాలను తలుచుకుంటూ తన్మయుడవుతాడు. – ఇక చదవండి.]

ఏప్రిల్ 29. శృంగేరి శారదా కల్యాణ మంటపం, జవహర్ నగర్, రాయచూరు. ‘విభావరి వెడ్స్ వనమాలి’ అన్న ఫ్లెక్సి మంటపం ముందు మెరిసిపోతుంది. దాని మీద వాళ్ళిద్దరి ఫోటోలున్నాయి. ప్రపంచం లోని ఆనందమంతా వారి ముఖాలలో ప్రతిఫలిస్తూంది.

స్నాతకం, పెళ్ళికొడుకును చేయడం, వధువుచే గౌరీపూజ, ఎదుర్కోలు వేడుక, వరుని కాశీయాత్ర, వివాహం అన్నీ శాస్త్రోక్తంగా వైభవంగా జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల ఎనిమిది నిమిషాలకు ముహూర్తం. సరిగ్గా సమయానికి ఉభయులూ జీలకర్ర బెల్లం తలల మీద పెట్టుకున్నారు. తర్వాత మంగళసూత్రధారణ, తలంబ్రాలు పోసుకోవడం. ఫోటోగ్రాఫర్లనీ, వీడియోగ్రాఫర్‌ను, పెళ్లితంతును డామినేట్ చేయకుండా కట్టడి చేయాలని కేశవాచార్యులు ముందే వియ్యంకుడితో చెప్పారు. అందువలన సాంగ్యములన్నీ సజావుగా జరిగాయి.

భోజనాలు బఫే సిస్టమ్ కాకుండా టేబుళ్ల మీద అరిటాకు పరచి చక్కగా వడ్డించారు. రెండు వైపులా కలిసి నూట యిరవై మందికి మించి లేరు.

‘నాతిచరామి’, ‘నాతిచరితవ్యా’ అని ఇద్దరూ పరస్పరం ప్రమాణాలు చేసుకొన్నారు. ‘బువ్వంబంతి’ ఏర్పాటు చేశారు. వధూవరులకు ప్రత్యేకంగా ఒక టేబుల్. తోటి పెండ్లికొడుకు సుగుణాకరే. వారి అరిటాకుల చుట్టూ దీపాలు వెలిగించి, ముగ్గులు పెట్టారు. ఒకరి ఎంగిలి ఒకరు తినిపించుకున్నారు. అట్లా వారిద్దరికీ అభేదమని వివాహ వ్యవస్థ ఋజువు చేసింది.

నాగభూషణశర్మ గారి వైపు బంధువొకాయన, సఫారీ డ్రస్ వేసుకున్నాడు. బువ్వంబంతిలో నిలబడి “ఇప్పుడు ఒక పద్యం పాడబోతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినాలి” అని ప్రకటించాడు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన కంఠం చాలా శ్రావ్యంగా ఉంది. ‘బిళహరి’ రాగంలో ఆయన ఈ పద్యాన్ని అద్భుతంగా పాడాడు:

మ.:
తగు నీ చక్రి విదర్భరాజసుతకున్; తథ్యంబు వైదర్భియున్
తగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య, మీ యిద్దఱిన్
తగులం గట్టిన బ్రహ్మ నేర్పరి కదా? దర్పాహతారాతియై
మగడౌ గావుత చక్రి ఈ రమణికిన్ మా పుణ్యమూలంబునన్.”

చప్పట్లు మారుమ్రోగాయి!

“అమ్మా! అయ్యా! మా విభావరి ఏమో సాక్షాత్ లక్ష్మీస్వరూపమైన రుక్మిణీ దేవి. ఇక నాగభూషణరావు గారి అల్లుడేమో వనమాలి! పేర్లు చూడండి ఎలా కుదిరాయో! వాళ్ళిద్దరినీ చూసి, ప్రాగ్జోతిషపురములోని ప్రజలంతా, వీళ్లు ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని అనుకుంటున్నారట. వీళ్లను ఇలా జత కూర్చిన బ్రహ్మ చాలా నేర్పు కలవాడని ఆయన్ను పొగిడారట. చల్లగా, పిల్లాపాపలతో కలకాలం వర్ధిల్లండి, పిల్లలూ!” అని ఆశీర్వదించాడాయన. ఆయన వేసుకున్న సఫారీ డ్రెస్, ఆయన చెప్పిన సాహిత్యానికీ పొంతనే లేదని కొందరు ముక్కున వేలు వేసుకోన్నారు.

“అప్పియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్!” అని పెద్దాయన షేక్‌స్పియర్ చెప్పనే చెప్పాడు కద!

***

కల్యాణ మంటపాన్ని వెకేట్ చేశారు సాయంత్రం.

కేశవాచార్యులు, రుక్మిణమ్మ, పద్మనాభరావుగారి కుటుంబం వేణిసోంపురానికి వెళ్లిపోయారు. చాలామటుకు బంధువులంతా తమ తమ నెలవులకు బయలుదేరి వెళ్లారు. వనమాలి, మూడు నిద్రలకని రాయచూరు అత్తవారింట్లో ఉండిపోయాడు. సుగుణాకర్ కూడా పెబ్బేరుకు వెళ్లిపోయాడు.

వధూవరులకు తొలిరాత్రి, నాగభూషణ రావు గారి రైల్వే క్వార్టర్సులోనే ఒక గదిలో ఏర్పాటు చేశారు. వనమాలికి, విభావరికి పరిపూర్ణమైన ఏకాంతం! మూడు నిద్రలన్నారు గాని, వారసలు నిద్రపోతే గద! ముచ్చట్లు, మురిపాలు, ముద్దులు, కౌగిలింతలు, గుసగుసలు, కువకువలు! ఆమె అధరాల మాధుర్యం, ఆమె కౌగిలింతలలోని వెచ్చదనం, ఆమె ఊపిరిలోని పరిమళం వనమాలిని పరవశింపచేస్తున్నాయి. అతని విశాల వక్షం, విశాలమైన బాహువులు, అతని మగసిరి, విభావరిని వివశురాలిని చేస్తూన్నవి.

కవిసమ్రాట్ విశ్వనాథవారు తమ రామాయణ కల్పవృక్షములో అన్నట్లు:

ఉ.:
“ఏపున మంటి నుండి యుదయించిన జానకి; మింటి నుండి, ఆ
వాపముగన్న రాఘవుడు వచ్చి ఋగధ్వజులందు నుండి, ద్యా
వాపృథువుల్ సమాహరణ భావము పొందిన రీతి, సంగమ
వ్యాపృతి పండువెన్నెల మయంబుగ జేసెద రాత్మ రోదసిన్”
– కల్యాణఖండము

శ్రీరామచంద్రుడు ఆకాశం నుంచి వచ్చిన చైతన్యం, సీతమ్మ భూమి నుండి ఉద్భవమందిన మహాశక్తి. భూమ్యాకాశాల సమాహరణమే వారి అవతార పరమార్థం. ఆ సమన్వయమే ‘ఆత్మ రోదసి’ని కాంతివంతం చేస్తుందన్నారు విశ్వనాథ.

వనమాలి, విభావరుల సమాగమం కూడా, శరీరవాంఛా పరిధిని దాటి, ఆత్మల సంయోగంగా రూపుదిద్దుకుంది.

***

ఎలాగూ సెలవులే కాబట్టి హనీమూన్‌కు ప్లాన్ చేశారు. మధ్యతరగతి మందహాసాల బడ్జెట్ ప్రకారం, కర్నాటకలోని కూర్గ్, ఉడిపి శ్రీకృష్ణ, ధర్మస్థల, మురుడేశ్వర్‌లు సందర్శించి వచ్చారు. ఆ ఖర్చు అంతా మామగారు భరిస్తానంటే, అల్లుడు ససేమిరా ఒప్పుకోలేదు. పెబ్బేరు నుంచి అయ్యవారిపల్లెకు తిరగడానికి ఒక ‘యాక్టివా’ కొనిస్తానన్నాడు నాగభూషణరావు. వనమాలి సున్నితంగా తిరస్కరించాడు. ‘ఇలాంటి అల్లుళ్లు కూడా ఉంటారా?’ అని అందరూ ఆశ్చర్యపోయారు.

పద్మనాభ రావుగారు తమ్మునితో అన్నారు – “ఒరేయ్! నా శిష్యుడిని చూస్తే గర్వంగా ఉందిరా! అల్లుని మంచితనంబును అని సుమతీశతకకారుడు నెగెటివ్‌గా చెప్పాడు కాని, మన వనమాలికి అది అసలు వర్తించదు.”

హనీమూన్‌లో ఇద్దరి అనుబంధం మరింత బలపడింది. శృంగారంలో అలసి, కూర్గ్‌లో, హోటల్ రూంలో, తన పక్కన అదమరచి నిద్రిస్తున్న భార్యను తదేకంగా చూస్తూ కూర్చునేవాడు వనమాలి. ‘తాను అకస్మాత్తుగా చనిపోతే, ఈమె ఎలా తట్టుకుంటుంది?’ అన్న ఆలోచన వచ్చింది. దాన్ని ప్రయత్నం మీద మరల్చుకునేవాడు. మురుడేశ్వర్‌లో శివదర్శనం అయింది. సాగరతీరంలో ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఆ రోజు హనీమూన్ చివరిరోజు. మర్నాడు వాళ్ళు బెంగుళూరుకు బయలుదేరాలి. అక్కడనించి వేణిసోంపురానికి.

ఆ రోజు రాత్రి మళ్లీ ‘ఆ’ కల వచ్చింది వనమాలికి. ఈసారి కేవలం విభావరి మాత్రమే తన శవం మీద పడి ఏడుస్తూ ఉంది. తల్లీతండ్రీ కనపడలేదు. సుగుణాకర్, విభావరిని పట్టుకుని ఓదారుస్తున్నాడు. తమ అనురాగాన్ని, అనుబంధాన్ని తల్చుకుంటూ విభావరి విలపిస్తూ ఉంటే, అతనికి బాధ కలుగలేదు. సంతోషంగా అనిపించింది.

“విభా! నిన్ను విడిచి ఎలా వెళ్లను?” అని కలవరిస్తున్నాడు. విభావరికి మెలకువ వచ్చింది. భర్త ఒళ్లంతా చెమటలు. కాని ముఖంలో ఒక విధమైన ఫుల్‌ఫిల్‌మెంట్!

“మాలీ! ఏమయింది! లేవండి! నన్ను విడిచి ఎందుకు వెళతారు?” అంటూ అతన్ని కుదిపి లేపింది.

కళ్ళు తెరిచి అయోమయంగా చూశాడు. ‘కల’ అని అర్థమైంది. “ఏదో కల” అని అన్నాడు. “ఏం లేదులే విభా! ఏదో సిల్లీ కల” అని, నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.

***

వేణిసోంపురంలోనే వేసవి సెలవులన్నీ గడిపారు. రోజూ తుంగభద్రమ్మ ఒడ్డుకు వెళ్లాల్సిందే. ఇసుకలో అమె ఒళ్లో తలపెట్టుకొని పడుకుంటాడు రోజూ. ఆమె అతని జుట్టు సవరిస్తూ, చెంపలు తన మెత్తని చేత్తో రాస్తూ ఉంటుంది. చటుక్కున వంగి అతని పెదవులను ముద్దాడుతుంది. అతడు తన్మయుడౌతాడు. వేణుగోపాలస్వామి వారు వీళ్ళిద్దరినీ చూసి ముచ్చటపడుతున్నారు. రుక్మిణమ్మ కోడలిని అపురూపంగా చూసుకుంటుంది.

జూన్ నెల రాబోతుంది. 12న స్కూళ్ళు తెరుస్తారు. సుగుణాకర్ వేణిసోంపురానికి వచ్చాడు. ముగ్గురూ స్నేహితులు.

“ఒరేయ్! కొత్తకోట రోడ్‌లో, చాకలి ఐలమ్మ నగర్ అని ఉంది. మీకో యిల్లు చూసాను. సింగిల్ బెడ్ రూమ్. హాలు, కిచెన్. మీ ఇద్దరికీ బ్రహ్మాండంగా సరిపోతుంది. బాడుగ ఐదువేలు. మీరు వారం రోజులు ముందుగా వచ్చేస్తే, పాలు పొంగించి, దిగిపోవచ్చు. అన్నీ నిదానంగా సర్దుకోందాం. మై హూఁ నా, యార్.” అన్నాడొక రోజు.

“డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు తీసుకోవాల్సింది. నీకూ ఒక రూం కావాలి కద!” అన్నాడు వనమాలి.

సుగుణాకర్ నవ్వాడు. “నేనెందుకురా మీ మధ్య, పానకంలో పుడకలాగా! నాకు మన రూం ఉంది కదా! పిచ్చి ఆలోచనలు చేయకు. ఎంజాయ్ ది న్యూలీ మేరీడ్ లైఫ్ టుగెదర్. నేను వస్తుంటానులే” అన్నాడు.

“అదేం కుదరదు నీవు మాతో ఉండాల్సిందే!” అన్నాడు వనమాలి.

విభావరికి ఆశ్చర్యంగా ఉంది. తన భర్తకు సుగుణాకర్ అంటే ఎంత ప్రేమ! ‘మా ఏకాంతాన్ని గురించి కూడ అలోచించడంలేదు!’ అనుకుంది. భర్త వైపు ఆరాధనగా చూసింది

“ఫూల్! నోర్ముయ్యి! దీనికైనా ఒక హద్దుండాలి!” అన్నాడు సుగుణకర్. వనమాలి అయిష్టంగానే అంగీకరించాడు.

పెబ్బేరులో విభావరీ వనమాలుల కొత్త కాపురం మధురమధురంగా సాగిపోతుంది. కొన్ని రోజులు నాగభూషణరావు, మంగళగౌరి దంపతులు వచ్చి, ఇల్లంతా సర్దివెళ్లారు. కొన్ని రోజులు కేశవాచార్యులు, రుక్మిణమ్మ వచ్చి ఉన్నారు. తర్వాత ఇద్దరే! ప్రణయ సామ్రాజ్యాన్ని ఏలుకుంటున్నారు. ఆదివారాలు సుగుణాకర్ వస్తాడు. భోజనం అక్కడే. సరదాగా కబుర్లు చెప్పుకుంటారు ముగ్గురూ!

విభావరి తన పట్ల చూపించే ‘కన్సర్న్’ హృదయంగమంగా ఉంటుంది వనమాలికి. ఒకరోజు అతడు అలస్యంగా నిద్రలేచాడు. ఆమె అతని నుదుటిపై చేయి పెట్టి చూసింది. వేడిగా ఉంది.

“జ్వరం వచ్చినట్లుంది మాలీ! ఈ రోజు స్కూలుకు సెలవు పెట్టేయండి. లేచి ముఖం కడుక్కోండి. ఇడ్లీ పెడతాను. వేడిగా నాలుగు పల్లీ చట్నీతో తిని, డోలో 650 వేసుకొందురు గాని” అన్నది. ఆమె గొంతులో ఆదుర్దా!

“ఈ మాత్రం దానికే సెలవెందుకు విభా! ఫీవరిష్‌గా ఉంది అంతే!” అన్నాడు. నవ్వుతూ. ఆమె వినలేదు.

ఒక్కసారి ఇద్దరూ పోట్లాడుకుంటారు. అతడు అలుగుతాడు! ఆమెతో మాట్లాడడు. ఆమె కోపం చల్లారిపోతుంది. “అలిగిన వేళనె చూడాలి, మా వనమాలి అందాలూ” అని పాడుతుంది మధురంగా.

కొసరి కొసరి తినిపిస్తుంది భర్తకు. అతనికేం ఇష్టమో అన్నీ కనుక్కొని పెట్టుకుంది విభావరి.

“అబ్బా! ఇక చాలు విభా! చూడు! కొంచెం బొజ్జ వస్తూన్నట్లుంది నాకు!” అంటాడు.

“మగవాళ్లకు చిరుబొజ్జ అందమే లెండి” అంటుంది నవ్వుతూ.

ఉన్నట్లుంది అతనికి ఆలోచనలు వస్తాయి. తననింతగా ప్రేమించే విభావరి తను అకస్మాత్తుగా దూరమైతే ఏమైపోతుంది? ఇదే ఒక అబ్సెషన్ అయి కూర్చుంది వనమాలికి మళ్లీ ‘ఆ’ కల రాలేదు. ఆ కలల గురించి ఆమెకు చెబుదామనుకున్నాడు. ‘భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు’ అనుకున్నాడు. కానీ సుగుణాకర్, డా॥ ఉరుకొందప్పగారి హెచ్చరికలు గుర్తొచ్చి, ఊరుకున్నాడు.

***

మూడు నెలలు మురిపాలతో సరదాలతో గడిచాయి. ఆ రోజు సాయంత్రం క్లాసులయింతర్వాత, స్టాఫ్ మీటింగ్ పెట్టారు షేక్ పీరాగారు. టెంత్ పిల్లలకు, వారి ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడానికి, ప్రత్యేక క్లాసులు పెట్టాలని పాఠశాల విద్య కమీషనర్ గారి నుంచి జిల్లా విద్యాశాఖాధికార్లకు ప్రొసీడింగ్స్ వచ్చాయని, దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవాలని అన్నారు. దాని టైంటేబుల్ తయారు చేసే బాధ్యతను వనమాలికి అప్పగించారు. టీ అండ్ స్నాక్స్ కూడా తెప్పించమని పీరాగారు ముందే చెప్పారు. ఆ ఊర్లో ఒకే ఒక పాక హొటలుంది. అతనికి చెప్పి, మిర్చి బజ్జీలు, స్పెషల్ టీలు చేయమని ఆర్డరిచ్చారు. స్టాఫ్ మీటింగ్ పూర్తయింది కాని, అవి ఎంతకూ రాలేదు. అవి వచ్చి అందరూ తినేసరికి ఆరున్నరైంది.

అందరూ పెబ్బేరు నుండి తిరిగేవారే కాని, కొత్తగా చేరిన సెకండరీ గ్రేడ్ టీచర్ ఒకాయన (ఆయన పేరు సుందరాచారి) మాత్రం అక్కడే రూం తీసుకొని ఉంటున్నాడు. అతి తక్కువ కాలంలోనే వనమాలికి అతనితో స్నేహం బలపడింది.

“సార్! మా రూమ్‍కు పోదాం రాండి! నేను మన పిల్లల కోసం కొన్ని పాటలు వ్రాసి ట్యూన్ చేశాను. మీరు ఒకసారి విని, ఏమయినా సలహాలు, సూచనలు చేయాలి” అన్నాడు సుందరాచారి.

“ఇంకో రోజు వస్తాలే బ్రదర్. ఈ రోజు ఇప్పటికే లేటయింది” అన్నాడు వనమాలి. సుందరాచారి ఒప్పుకోలేదు. రావలసిందేనని పట్టుపట్టాడు. ఇద్దరూ అతని రూముకు వెళ్లారు. అతడు వ్రాసిన పాటలు బాగున్నాయి. వాటికి కట్టిన ట్యూన్లు కూడా. తనకు తోచిన కొన్ని మార్పులు చేశాడు వనమాలి. చూస్తూండగానే ఎనిమిది కావచ్చింది.

“ఇక బయలుదేరతాను సుందరాచారిగారు! ఇంట్లో మా శ్రీమతి కంగారు పడుతూ ఉంటుంది” అన్నాడు.

“లేటవుతుందని ఫోన్ చేయకపోయారా?” అన్నాడతడు.

“చేశాను. ఈ ఉర్లో సిగ్నల్స్ సరిగ్గా రావు కదా! మెసేజ్ పెట్టాను లెండి.”

“పదండి. మిమ్మల్ని ఆటో ఎక్కించి వస్తాను.”

ఒకే ఒక ఆటో ఉంది స్టాండ్‌లో. షేర్ ఆటో అది. డ్రయివర్‌కు రెండు వైపుల ఇద్దరు కూర్చోడానికి డ్రైవర్ సీటును ఎక్స్‌టెండ్ చేశారు. మెయిన్ సీటు ముందు రాడ్‌కు ఆనుకొని ఒక చెక్కపలక, దాని మీద కుషన్. మొత్తం పది మంది దాకా ప్రయాణిస్తారు.

ఆటో నిండలేదింకా. వనమాలికి డ్రైవర్ పక్కన ఎడమవైపు కూర్చొని ప్రయాణించడం అంటే ఇష్టం. వెనక సీట్లో ఇరుక్కుని కూర్చోవాలి. వెళ్లి కూర్చున్నాడు. కుడివైపున మరో యువకుడున్నాడు. ఇంచుమించు వనమాలి వయసే ఉంటుంది. అదే హైట్, అదే వెయిట్. తెల్లగా ఉన్నాడు. వనమాలిని చూసి నవ్వాడు. అతన్ని ఈ రూట్లో ఎప్పుడూ వనమాలి చూడలేదు.

మరో ముగ్గురు కావాలి ఆటో బయలుదేరడానికి. అయ్యవారిపల్లె నుంచి పెబ్బేరు 10 కిలోమీటర్లు లోపే ఉంటుంది. ఆటో ఛార్జి 30 రూపాయలు. బస్సులు అరకొరగా ఉంటాయి. ప్రజలంతా ఈ షేర్ ఆటోల మీదే ఆధారపడతారు. చాలామంది యువకులు ఈ ఆటోల వల్ల ఉపాధి పొందుతున్నారు.

“ఇంకెంత సేపు చూస్తావు? మాకు ఆలస్యం అవుతూంది” అని ఆటోలోని ప్రయాణీకులు గొడవ పెట్టసాగారు. డ్రైవర్ ఆటోను కదిలించాడు. కాని ఎవరైనా వస్తారేమోనని చూస్తూనే ఉన్నాడు.

“కొడకా! ఉండుర!” అంటూ గబగబ వచ్చి వెనక ఎక్కింది ఒక ముసలామె. ఆటో బయలుదేరింది. మ్యూజిక్ సిస్టం ఆన్ చేశాడు.

‘రబ్బరుగాజులు రబ్చరుగాజులు రబ్చరుగాజులు తెచ్చానే, రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు..’ అంటూ దలేర్ మెహందీ, వచ్చీరాని తెలుగులో పాట లంకించుకున్నాడు. పెద్ద సౌండ్! ప్రయాణీకులెవ్వరు అంత సౌండెందుకు? తగ్గించమని అడగలేదు. పైగా ఆ పాటలోని బీట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. డ్రైవర్ తాను కూడా పాడుతున్నాడు. అతని మోచేతులు పక్కన కూర్చున్నవారికి తగులుతున్నాయి. హ్యాండిల్ తిప్పడం కూడా ఇబ్బందే. కానీ విపరీతమైన వేగంతో తోలుతున్నాడు.

పౌర్ణమి మరో 3, 4 రోజులుందేమో, ఆకాశంలో చందమామ ప్రకాశిస్తున్నాడు. రోడ్డు పక్కపొలాల్లో తీసిన మిరప తోటలు, పండుమిర్చికి వదిలినట్లున్నారు. ఎర్రని కాయలు గుత్తులు గుత్తులుగా వేలాడుతూ, వెన్నెల్లో మెరుస్తున్నాయి.

సింగిల్ రోడ్ అది. పెద్దవాహనం ఏదైనా ఎదురొస్తే, ఆటోనే తప్పుకోవాలి. రోడ్ దిగాలి. పొలాల మీదుగా చల్లని గాలి. ఆటోకున్న హెడ్‍లైట్, వెన్నెల్లో అంత బ్రయిట్‌గా లేదు. పావుగంట తర్వాత గుమ్మడం చౌరస్తా వచ్చింది. ఇద్దరు దిగిపోయారు. ఎవరు ఎక్కలేదు. మరో పది నిమిషాలకు వెంకటాపురం దాటారు. సుగూర్ వస్తే, పెబ్బేరు చేరుకున్నట్లే. ‘మరో ఇరవై నిమిషాల్లో విభా దగ్గరుంటాను’ అనుకున్నాడు వనమాలి. ఎడమ చేత్తో రాడ్ పట్టుకొని, కుడి చేయి డ్రైవర్ సీటు వెనక పెట్టుకొన్నాడు. వెంకటాపురం తర్వాత రోడ్డు మొత్తం గుంతలమయం. ఒక గుంత తప్పిస్తే మరొకదాంట్లో దిగుతుంది ఆటో. అదంతా వనమాలికి అలవాటే! లోన్ పెట్టి బండి కొనుక్కోమని, సుగుణాకర్, విభావరి చెబుతూనే ఉంటారు. కాని వనమాలి వినడు.

సుగూరు మరో కిలోమీటరు ఉంటుంది. ఎదురుగా మినీలారీ ఏదో స్పీడుగా వస్తూంది. డ్రైవర్ హారన్ కొడుతున్నాడు. లారీ హెడ్ లైట్లు బ్లింక్ చేయకుండా వచ్చేస్తున్నాడు. ఆటో డ్రైవర్ కంగారుపడ్డాడు. రోడ్డు దిగుదామంటే, అంచు ఎత్తుగా ఉందక్కడ. ఒక చేయి బయటపెట్టి, స్లో చేయమని మినీలారీ డ్రైవరుకు సిగ్నల్ ఇచ్చాడు. వాడు పట్టించుకోలేదు.

పెద్ద శబ్దంతో మినీలారీ ఆటోను సైడు నించి గుద్దింది. వాడు ఆపకుండా వెళ్లిపోయాడు. ఆటో రెండు పల్టీలు కొట్టి, రోడ్డు పక్కన ఉన్న లోతైన గుంతలో పడింది. వనమాలి ఎగిరి క్రిందకు పడ్డాడు. అక్కడ మిరపచేలో కలుపు తీసినదంతా ఒక పెద్ద కుప్పగా పడి ఉంది. వెళ్లి దాని మీద పడ్డాడు వనమాలి. ప్రయాణీకుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. కాసేపటికి కేకలు ఆగిపోయాయి. వనమాలికి స్పృహ తప్పింది. అతని జేబు లోని సెల్ క్రింద పడిపోయింది.

కాసేపటి తర్వాత అతనికి తెలివి వచ్చింది. మెల్లగా లేచాడు. ఒళ్లంతా పట్టేసినట్లుంది. చేతులు కాళ్లు విదిలించి చూసుకున్నాడు. ఏమీ కాలేదు! “తండ్రీ! వేణుగోపాలా, రక్షించావా స్వామి!” అని మొక్కుకున్నాడు. ఎందుకో అతనికి తనకొచ్చే ‘ఆ’ కల గుర్తొచ్చింది.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version