Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరణం మధురం-9

[శ్రీ పాణ్యం దత్తశర్మ వ్రాసిన ‘మరణం మధురం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]

[వనమాలి, విభావరుల వివాహం రాయచూరులోని శారదా కల్యాణ మంటపంలో శాస్త్రోక్తంగా, బంధుమిత్రుల సమక్షంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. వివాహానంతరం వారిద్దరూ కర్నాటకలోని కూర్గ్, ఉడిపి, మురుడేశ్వర్ వంటి ప్రాంతాలకు హనీమూన్‌కు వెళ్లి తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు. అయితే, హనీమూన్ ముగిసే తరుణంలో వనమాలికి తాను చనిపోయినట్లు, తన శవంపై విభావరి పడి ఏడుస్తున్నట్లు మళ్లీ ఒక వింత కల వచ్చి కలవరపెడుతుంది. సెలవుల తర్వాత వారిద్దరూ పెబ్బేరులో సుగుణాకర్ సాయంతో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని, ఎంతో అనురాగంతో కొత్త కాపురం ప్రారంభిస్తారు. మూడు నెలల పాటు వారి ప్రణయ జీవితం మధురంగా సాగుతున్న సమయంలో, ఒకరోజు స్కూల్లో స్టాఫ్ మీటింగ్ ఆలస్యం కావడం, ఆపై సహోద్యోగి సుందరాచారి రూమ్‌కు వెళ్లడం వల్ల వనమాలి ఇంటికి రావడానికి రాత్రి అవుతుంది. అయ్యవారిపల్లె నుండి పెబ్బేరుకు షేర్ ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చుని ప్రయాణిస్తుండగా, సుగూరు సమీపంలో ఎదురుగా అతివేగంగా వచ్చిన ఒక మినీ లారీ ఆటోను బలంగా ఢీకొట్టి వెళ్ళిపోతుంది. ఈ ప్రమాదంలో ఆటో రెండు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోగా, వనమాలి దూరంగా మిరపచేని కుప్పపై పడి స్పృహ కోల్పోతాడు; కాసేపటికి స్పృహ వచ్చి చూసుకునేసరికి తనకు ఎలాంటి గాయాలు కాలేదని గ్రహించి దేవుడికి మొక్కుకుంటూ, తనకొచ్చిన ఆ పీడకలని గుర్తుచేసుకుంటాడు. – ఇక చదవండి.]

ఆటో డ్రైవర్, హ్యాండిల్‌కు నొక్కుకుపోయాడు. వెనక ఉన్నవారు ఏమయ్యారో? వెన్నెల వెలుగులో చుట్టూ చూశాడు. డ్రైవరు కుడిపక్క కూర్చున్న యువకుడేడీ? రోడ్డుకు కొంచెం పక్కనే పడిఉన్నాడు. అతడు వేసుకున్న షర్ట్ నీలం రంగుంది. వనమాలికి గుర్తుంది. దగ్గరకు వెళ్లాడు. బోర్లాపడి ఉన్నాడు. వెల్లకిలా తిప్పి చూశాడు. అతనికి కడుపులో దేవినట్లయింది. ఆ యువకుడి ముఖం గుర్తు పట్టలేనంతగా చితికిపోయి ఉంది! షర్ట్ అంతా రక్తం! అతనిలో చలనం లేదు.

“బ్రదర్, ఇలా చూడండి! నా మాటలు వినపడుతున్నాయా” అని చెవి దగ్గర నోరు పెట్టి గట్టిగా అడిగాడు వనమాలి. అతను జవాబు చెప్పలేదు. ముక్కు దగ్గర వేలుపెట్టి చూశాడు. శ్వాస ఆడటం లేదు. గుండె మీద చెవి ఆనించి విన్నాడు. గుండెచప్పుడు వినపడలేదు!

‘పాపం చనిపోయినట్లున్నాడు!’ అనుకున్నాడు. తాను ఎడమ వైపు ఉండటం వల్ల బతికి బయటపడ్డాడు. ఇతడు కుడివైపు ఉండడం వల్ల మినీలారీ డైరెక్ట్‌గా అతన్ని ఢీ కొట్టిందని అర్థమైంది. తాను పడిన చోట తన సెల్ కోసం వెతికాడు . దొరికింది. కలుపు చెత్త పక్కనే పడి ఉంది. పెబ్బేరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేద్దామని ఆన్ చేయబోతే అది స్విచ్ ఆఫ్ అయి ఉంది! ఏవయినా వాహనాలు అటుగా వస్తాయేమో ఆపి సమాచారం ఇద్దామని చూడసాగాడు. ఏవీ రాలేదు. కీచురాళ్లు రొద చేస్తున్నాయి. ఆకాశంలో చంద్రుడు నిర్వికారంగా వెలుగుతున్నాడు. ‘కిం కర్తవ్యం?’ అనుకున్నాడు వనమాలి! సడన్‌గా అతనికి ‘ఆ’ కల గుర్తొచ్చింది.

తళుక్కున అతడి మెదడులో ఒక ఆలోచన మెరిసింది! ‘అవును! తన కల నెరవేరడానికి ఇదే సరైన అవకాశం!’ అనుకున్నాడు. చనిపోయిన యువకుడు తనంత హైట్, వెయిట్ ఉండడం, ముఖం గుర్తుపట్టలేనంతగా చితికిపోవడం తనకి యాడెడ్ అడ్వాంటేజ్! యువకుడి శవాన్ని రోడ్డు వార నుంచి, పొలం దగ్గరికి దొర్లించాడు వనమాలి అతని దుస్తులు తీసేశాడు, లోపల అండర్‌వేర్‍తో సహా! అతనికి తన దుస్తులు తొడిగాడు. అతని గుండె వేగంగా కొట్టుకొంటూంది. ఎవరయినా వస్తే, చూస్తే? ఎవరూ రాలేదు. తన వాచ్ అతని చేతికి పెట్టాడు వనమాలి. ఉంగరం కూడా పెడదామనుకొని ఆ ఆలోచన మానుకున్నాడు. అతని దగ్గర సెల్ లేదు. తన సెల్ అతనికి వేసిన తన షర్ట్ జేబులో పెట్టాడు. తన ఆధార్ కార్డ్ కూడా. అతని చెప్పులు తాను వేసుకొని, తన చెప్పులు అతని కాళ్ల దగ్గర పడేశాడు, అటొకటి ఇటొకటి! జేబు లోంచి బ్లాక్ రీఫిల్ బాల్ పెన్ను తీసి, అతని బొడ్డుకు క్రింద, ఒకటిన్నర అంగుళం ప్రక్కగా, చిన్న పుట్టుమచ్చను కూడా దిద్దాడు. అతని గుర్తింపులన్నీ తీసేసి, తనవి పెట్టినట్లే. అతనిలో ఏదో ఎగ్జై‍ట్‌మెంట్ ! థ్రిల్! అతని దుస్తులు తాను వేసుకున్నాడు. సుగూరు వైపు నడక సాగించాడు!

***

తొమ్మిదిన్నర. విభావరి తలుపు వైపు చూస్తూ కూర్చుంది. మాలి ఇంకా రాలేదు! ఫోన్ సాయంత్రం రీచ్ అవలేదు. ‘స్టాఫ్ మీటింగ్ ఉంది. ఆలస్యంగా వస్తాను’ అన్న మెసేజ్ మాత్రం పెట్టాడు. ఎనిమిదిన్నర నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమె గుండెల్లో ఏదో గుబులు మొదలయింది. సుగుణాకర్‌కు ఫోన్ చేసిందామె. అతడు వెంటనే వచ్చాడు. అతడూ ఆమెను “విభా!” అనే పిలుస్తాడు.

అతన్ని చూడగానే, వెక్కివెక్కి ఏడ్వసాగిందామె. “గుణా! ఆయన ఇంకా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. వెళ్లి కనుక్కోవా? ప్లీజ్” అన్నది.

సుగుణాకర్ కంగారుపడలేదు. తానూ టెన్షన్ పడితే ఆమె తట్టుకోలేదు. “విభా! ఏమి అయ్యుండదులే! స్టాఫ్ మీటింగ్ లేటయి ఉంటుంది. ఆ టైంలో ఆటోలు దొరికి ఉండవు” అని అనునయించాడు. “ఉండు, వాళ్ల కొలీగ్ ఒకతని నంబరు నా దగ్గర ఉన్నట్లుంది” అని, తన సెల్ నుంచి ఒక నంబరుకు ఫోన్ చేశాడు. కాసేపు మాట్లాడాడు.

“వాళ్లంతా ఆరున్నరకే బయలుదేరివచ్చేశారట. ఎవరో సుందరాచారి అట. కొత్తగా చేరాడట. అతడు మన మాలిని వాళ్ళింటికి తీసుకుపోయడట.”

“ఇప్పుడేం చేద్దాం గుణా!” అన్నదామె. దుఃఖంతో ఆమె పెదవులు అదురుతున్నాయి. సుగుణాకర్ ఆమె భుజం మీద చెయ్యివేశాడు. అతని చేతిని ఆమె తన చేతితో గట్టిగా పట్టుకుంది. ఆమె చేయి వణుకుతూ ఉంది.

“బీ బ్రేవ్! విభా! ఇంకొంచెం సేపు చూద్దాం” అన్నాడు. అతడు వెళ్లిపోలేదు. ఆమె తోడుగా తాను లేకపోతే అమె మరింత ప్యానిక్ అవుతుంది. ఇద్దరూ కూర్చుని ఉన్నారు. ఇద్దరి మనస్సుల్లో వేయి ప్రశ్నలు!

రాత్రి పన్నెండున్నర. విభావరి సెల్ మ్రోగింది. ఆమె చటుక్కున ఆన్సర్ చేసింది. “హలో! ఎవరు?” అన్నది. అది అన్-నోన్ నెంబరు.

“అమ్మా! నేను పెబ్బేరు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి, ఎ.ఎస్.ఐ. కనకరాజును మాట్లాడుతున్నాను. కందాళై వనమాలి, స్కూల్ అసిస్టెంట్, జడ్.పి.హెచ్.ఎస్, అయ్యవారిపల్లె. ఈయన మీకేమవుతారు?”

“మావారేనండి! ఏమయింది సార్!” అని ఆమె అంటుండగానే సుగుణాకర్ సెల్‍ను ఆమె చేతినుంచి తీసుకున్నాడు.

“చెప్పండి సార్. నేను వనమాలి ఫ్రెండ్‌ని. నా పేరు సుగుణాకర్. నేను పెబ్బేరు ఎండిఓను. మీరు ఫోన్ చేసింది వనమాలి మిసెస్ గారికి. ఆమె పేరు విభావరి!”

“నమస్తే సార్!” అన్నాడు ఎ.యస్.ఐ. “మీరు నాకు తెలుసు సార్! వెంకటాపురం, సుగూరుకు మధ్య, సుగూరుకు దగ్గరలో, యాక్సిడెంట్ అయింది సార్. హిట్ అండ్ రన్ కేసు. ఆటోను ఏదో పెద్ద వెహికల్ గుద్ది వెళ్లిపోయింది. ఇంచుమించు వాళ్లందరూ చనిపోయారు సార్. బాడీలను పెబ్బేరు గవర్నమెంట్ హాస్పటల్‌కి తరలించాము. ఒకాయన జేబులో సెల్ దొరికింది. దాన్ని ఓపన్ చేయించి చూస్తే, ‘వైఫ్ విభావరి’ అని ఉంది. ఆధార్ కార్డు కూడా ఉందాయనది. వెంటనే ఆమెకు ఫోన్ చేశాను.”

“ఓ మై గాడ్!” అని అరిచాడు సుగుణాకర్! ఆయన పరిస్థితి ఎలాగుంది?”

అటువైపు కాసేపు మౌనం. “సారీ సార్! ఆయన చనిపోయారు. పోస్ట్ మార్టమ్ కోసం మహబూబ్‌నగర్ హాస్పిటల్‌కు పంపాము. మీరు రేపు అక్కడికి వస్తే ఫార్మాలిటీస్ తర్వాత, మీరు శవాన్ని ఐడెంటిఫై చేసి, బాడీని తీసుకెళ్లవచ్చు.”

అలాగే కుప్పకూలిపోయాడు సుగుణాకర్! “వనా! వనా! ఇదేమిటిరా ఇట్లా అయింది!” అని రోదించసాగాడు. విభావరికి అంతా అర్థమైంది. గుండెలవిసేలా ఏడుస్తూ సోఫామీది నుంచి పడిపోయిందామె.

***

గవర్నమెంట్ మెడికల్ కాలేజి, గవర్నమెంట్ హాస్పిటల్, మహబూబ్‌నగర్. రెండూ ఒకే చోట ఉన్నాయి. సుగుణాకర్. విభావరి, కేశవాచార్యులు, రుక్మిణమ్మ, నాగభూషణరావు, మంగళగౌరి ఇంకా కొంతమంది బంధుమిత్రులు మార్చుయరీ బయట వేచి ఉన్నారు.

వార్త తెలిసిన వెంటనే ఉన్న దుఃఖం వారిలో లేదు. వనమాలి చనిపోయాడన్న ‘రియాలిటీ’ని వారి మనసులు రిసీవ్ చేసుకున్నాయి. బాడీని ఐడెంటిఫై చేయడం కోసం భార్య, ఇంకొకరు తోడుగా రావచ్చన్నారు. సుగుణాకర్, విభావరి, వెళ్లారు. శవం మీద తెల్లని గుడ్డ కప్పారు. తల మీద నుంచి తీయకుండా, మిగతాది చూపారు.

“ఆయనే! ఆయనే!” అంటూ ఆక్రందించింది విభావరి. డ్రస్ అతనిదే. వాచ్ అతనిదే. సెల్, ఆధార్ కార్డ్ అన్నీ వనమాలివే!

“ముఖం చూడవచ్చా?” అనడిగాడు సుగుణాకర్.

“వద్దండి! చూసి తట్టుకోలేరు. పూర్తిగా చితికిపోయింది” అన్నాడు మార్చుయరీ ఇన్‌ఛార్జ్. విభావరి అక్కడే స్పృహ తప్పిపడిపోబోతుంటే, సుగుణాకర్ ఆమెను పట్టుకొన్నాడు. ఆమెకు ఏదో ఆలోచన వచ్చింది.

“ఒక్క నిమిషం సార్!” అంటూ సుగుణాకర్‌కు ఏదో చెప్పింది. అతడు, శవం షర్ట్ పైకి లాగి చూశాడు. బొడ్డు క్రింద ఒకటిన్నర అంగుళం దిగువన, కొంచెం ప్రక్కగా, నల్లని పుట్టుమచ్చ!

విభావరి దాన్ని చూసి భోరున ఏడ్చింది. శవాన్ని వారికి అప్పగించారు. బాడీని అంబులెన్స్ ఎక్కిస్తూంటే అందరూ అక్కడ గుమిగూడారు. వారిలో ఒక వ్యక్తి ముఖం కనపడకుండా ఒక షాల్ కప్పుకోని అంతా చూస్తున్నాడు. అతని పెదవుల్లో సన్నని దరహాసం.

సుగుణాకర్ ఎం.డి.వో కాబట్టి, అంబులెన్స్‌ను వేణిసోంపురానికి పంపేలా మేనేజ్ చేయగలిగాడు. కేశవాచార్యులుగారి యింటి వద్ద ఊర్లో జనమంతా గుమిగూడారు. వనమాలి శవాన్ని ఇంటి వరండాలో పడుకోబెట్టారు. విభావరి దుఃఖాన్ని చూడలేకపోతున్నారు జనం.

“బంగారం లాంటి పిల్లవాడు”, “ఆ పూజారి గారికొచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు”, “కృష్ణుడు, రుక్మిణిలా ఎంత చూడముచ్చటగా ఉండేవారో!” అంటున్నారు.

“మాలీ! ఎందుకిలా జరిగింది. భగవంతుడా! మా అన్యోన్యత చూసి ఓర్వలేకపోయావా?” అంటూ శవం మీద పడి ఏడుస్తూంది విభావరి.

కొంచెం దగ్గరగా నిలబడి, ముఖాన్ని శాలువతో కప్పుకొని, భుజాల చుట్టూ వేసుకొని అంతా చూస్తున్నాడొక వ్యక్తి. అతనిలో ఏదో సాధించిన ఎక్సయిట్‌మెంట్. కేశవాచార్యులు గారు స్మశానంలో కొడుక్కు తలకొరివి పెట్టారు. అచ్చం ఆ కలలో అన్నట్లుగానే అంటూ కూలిపోయారు. పాడె కట్టడం, శవానికి స్నానం చేయించడం, అన్నీ ప్రత్యక్షంగా చూశాడా వ్యక్తి.

***

బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానం. కృష్ణానది ఒడ్డునే ఒక చిన్న ఆశ్రమం. అక్కడ ఒక సన్యాసి ఉంటున్నాడు. ఆయన పేరు భక్తవత్సలస్వామి. ఒకటి రెండుసార్లు వనమాలి ఆ ఆశ్రమానికి వచ్చాడు. స్వామివారి వద్ద కాసేపు గడిపాడు. కొన్ని రోజులు తను అజ్ఞాతంలో ఉండి తర్వాత ఇంటికి వెళ్లి భార్యకు, షాక్ యివ్వాలని అతని కోరిక. అజ్ఞాతం గడపడానికి భక్తవత్సలస్వామి గారి ఆశ్రమము అయితే సరైనదని అనిపించింది అతనికి. బీచుపల్లి దేవస్థానంలో రోజూ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రాత్రి హైవే మీద ఏదైనా టిఫిన్ చేస్తే సరి.

“స్వామీ! కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మీ ఆశ్రమంలో కొంతకాలం ఆశ్రయం పొందుదామనుకుంటున్నాను” అని వేడుకున్నాడాయనను.

“అంతా ఈశ్వరేచ్ఛ” అన్నాడాయన చిరునవ్వుతో. తన వివరాలేవీ చెప్పలేదు ఆయనకు.

ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేస్తూ ఉండగా, బండరాయి జారుడుగా ఉండి కాలు జారి పడ్డాడు వనమాలి. తలకు దెబ్బ తగిలింది. స్పృహ తప్పింది. దగ్గరలో స్నానాలు చేస్తున్న భక్తులు అతన్ని చూచి, ఆశ్రమానికి తీసుకొని వెళ్లారు. స్వామీజీకి ఆయుర్వేద వైద్యంలో కూడా చక్కని ప్రవేశముంది. ఆయన వనమాలి నాడి చూసి, “ఏం కాలేదు. మెదడుకు చిన్న దెబ్బ అంతే. కొంత కాలం జ్ఞాపకశక్తి కోల్పోతాడు. ఎలాగూ మన వద్ద అశ్రయం పొందుదామని వచ్చాడు. ఉండనివ్వండి!” అన్నాడాయన. ఏవో మూలికల మందులు ఆయనే ఇస్తున్నాడు. వనమాలిది ఒక విధమైన స్థితి. గతం గుర్తులేదు. కాని నార్మల్ గానే ఉన్నాడు భౌతికంగా. అలా తొమ్మిది పదినెలలు గడిచాయి.

***

దుఃఖానికి కాలపరిమితిని చాలా తక్కువగా నిర్ణయించి మానవులకు నెత్తిన పాలు పోశాడు భగవంతుడు. సుగుణాకర్ ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. కంపాషనేట్ గ్రౌండ్స్ క్రింద విభావరికి ఉద్యోగం వచ్చేలా చేశాడు. ఆమె బి.ఎడ్. చేయలేదు. కాబట్టి ఆమెకు నాన్-టీచింగ్ క్యాడర్‌లో జానియర్ అసిస్టెంట్‌గా ఇచ్చారు. పెబ్బేరు హైస్కూలులోనే పోస్టింగ్. కేశవాచార్యులు, రుక్మిణమ్మ, వేణిసోంపురం వదిలిపెట్టి కోడలికి తోడుగా పెబ్బేరుకు వచ్చేశారు. సుగుణాకర్ రోజూ రెండుసార్లు వచ్చి విభావరిని చూసిపోతాడు. ఆమె దుఃఖాన్ని డైవర్ట్ చేయడం కోసం కబుర్లు చెబుతాడు. అంత దుఃఖం లోనూ ఆమెకు సాంత్వన కలిగిస్తాడు.

“నాయనా! నీవే గనక లేకపోయి ఉంటే, ఆ అభాగ్యురాలి గతి ఏమయి ఉండేదో కదరా!” అంటాడు కేశవాచార్యులు. సుగుణాకర్ ఒక రోజు రాకపోతే ఏదోలా ఉంటుంది విభావరికి. వనమాలి ‘చనిపోయిన’ పది రోజులకు ఆమె గర్భవతి అని తెలిసింది! ఆమెను గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకు వెళ్లడం, రెగ్యులర్ చెకప్ చేయించడం అన్నీ సుగుణాకరే చేస్తున్నాడు. కేశవాచార్యులను, రుక్ష్మిణమ్మనీ జాగ్రత్తగా చూసుకొంటున్నాడు. కొంత కాలం తర్వాత అతని చెల్లెలికి పెళ్లి అయిపోయింది.

***

భక్తవత్సలస్వామి వారిచ్చిన మూలికా వైద్యంతో పూర్తిగా కోలుకున్నాడు వనమాలి. గతం అంతా పూర్తిగా గుర్తుకు వచ్చింది.

‘నేను నిజంగా చనిపోయాననుకొని విభావరి ఎంతగా కుమిలిపోతూందో! బాగా కృశించి ఉంటుంది. నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారో! ఈ వయసులో వారికి కడుపు కోత కల్పించాను నేను. కానీ తప్పలేదు. ఎంతో కాలం నుంచి నా మనస్సులో ఉన్న కోరిక తీరింది. బహుశా ఎవరి జీవితంలో ఇలా జరగదేమో? ఇక నేను వెళ్లి, నిజాన్ని చెప్పి, విభావరిని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు చేయాలి! సుగుణాకర్ ఏమంటాడో! వాడికి ఇది పెద్ద షాక్!’ ఇలా పరిపరివిధాలుగా ఆలోచిస్తున్నాడు వనమాలి.

స్వామిగారి వద్ద సెలవు తీసుకొని పెబ్బేరుకు బయలుదేరాడు. మనసంతా ఉద్వేగంతో నిండి ఉంది. తను బ్రతికే ఉన్నాడన్న నిజాన్ని విభావరి ఎలా ఫేస్ చేస్తుందో?

ముందు తాము అద్దెకున్న యింటికి వెళ్లాడు. ఇల్లు తాళం పెట్టి ఉంది. ఇంటి ముందు చిన్న పచ్చనిపందిరి వేసి ఉంది. అతనికి గడ్డం పెరిగి ఉంది. బాగా సన్నబడ్డాడు. ఎవరూ గుర్తించలేరు అతన్ని. పక్కింటి వాళ్లను విచారిస్తే, ‘అందరూ వేణుగోపాలస్వామి గుడిలో ఉన్నార’ని చెప్పారు. వనమాలికి ఆ గుడి ఎక్కడుందో తెలుసు. అంబేద్కర్ నగర్‌లో జిల్లా పరిషత్ హైస్కూలు దగ్గర ఉందంది.

గుడికి చేరుకున్నాడు. మంగళవాయిద్యాలు వినబడుతున్నాయి. “ఏ రాగమో? ఇది ఏ తాళమో? మన కల్యాణ శుభవేళ మోగించు మేళమో” అని సన్నాయి వాళ్లు పాడుతున్నారు. ఆత్రేయగారి పాట అది. గుడి ముందు ప్లెక్సీల లాంటివి ఏవీ లేవు. లోపలికి వెళ్లాడు. ఒక పక్క చిన్న కల్యాణ మంటపం ఉంది. కొంచెం దగ్గరికి వెళ్లి చూశాడు. అతని నెత్తిన వంద పిడుగులు పడినట్లయింది. వేదిక మీద మధుపర్కాలలో విభావరి, సుగుణాకర్ మెరిసిపోతున్నారు. విభావరి ఒళ్ళో నాలుగు నెలలైనా నిండని పండు వంటి బాబు! అప్పుడే మంగళసూత్రధారణ అవుతూ ఉంది. విభావరి పచ్చటి మెడలో మంగళసూత్రం కడుతున్నాడు సుగుణాకర్.

“నో!” అని అరుద్దామనుకున్నాడు వనమాలి. గొంతు పెగలలేదు. తాను షాక్ ఇద్దామని వచ్చాడు. కానీ తనకే షాక్! వేయి ఓల్టుల షాక్!

విభావరి ముఖంలో ఆనందం తాండవిస్తూ ఉంది! తల పైకెత్తి సుగుణాకర్‌ను చూస్తూంది. సుగుణాకర్ కళ్ల నిండా ఆమె పట్ల అనురాగం.

వనమాలిని ఎవరూ గుర్తుపట్టలేదు!

ఎవరో అంటున్నారు. “ఎం.డి.వో గారు, తన స్నేహితుడు యాక్సిడెంట్‌లో చనిపోతే, ఆమెకు అండగా ఉన్నాడు. విధవ, ఒక పిల్లవాడికి తల్లిని ఎంతో పెద్దమనసుతో మళ్లీ పెళ్లి చేసుకుని, ఆమెకు కొత్త జీవితం ఇచ్చాడు.”

కేశవాచార్యులు, రుక్మిణమ్మ, నాగభూషణరావు, మంగళగౌరి వధూవరులపై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. వారి కళ్లల్లో నిశ్చింత!

పద్మనాభ రావు దంపతులు, షేక్ పీరాగారు, అయ్యవారిపల్లె కొలీగ్స్ కొందరు కనబడ్డారు.

ఒక ముత్తయిదువు అంటుంది సంతోషంగా.. “పాత ఆచారాలను పట్టుకొని కూర్చోకుండా పూజారిగారు. ఆయన భార్య, ఆయన వియ్యంకులు, నిండు మనసుతో వీళ్లను ఒకటి చేశారు. చిన్నపిల్ల పాపం! ఆ చంటి వాటికి తండ్రి కూడా తానై ఆ ఎం.డి.వో. గారు వారి జీవితాలను పండించారు.”

వనమాలికి తల తిరుగుతూ ఉన్నట్లయింది. ఏమిటి ఇలా జరిగింది? ‘మ్యాన్ ప్రొపోజెస్, గాడ్ డిస్పోజెస్’ అంటే ఇదేనా? అసహజమైన తన కోరికను దేవుడు ఇట్లా తిరస్కరించాడా? తనేం చేయాలిప్పుడు?

అతనికి భక్తవత్సలస్వామి గుర్తుకువచ్చాడు. కల్యాణ మంటపంలో విభావరిని, సుగుణాకర్‍ను, విభావరి ఒడి లోని తన బిడ్డనీ, కనులారా చూసుకున్నాడు.

‘వారి జీవితాలను డిస్టర్స్ చేసే హక్కు నాకే మాత్రం లేదు! లెట్ దెమ్ బీ హ్యాపీ!’ అనుకున్నాడు. అతనిలో అలజడి తగ్గింది.

భక్తవత్సలస్వామి గారి పాదాలపైబడి జరిగిందంతా చెప్పాడాయనకు. ఆయన చిరునవ్వుతో ఇలా అన్నాడు:

“నీ అంత్యక్రియలను నీవు చూచుకోవాలని, నీ భార్య, ఆత్మీయులు, నీ కోసం దుఃఖిస్తూంటే ప్రత్యక్షంగా చూసుకోవాలన్న నీ మానసిక రుగ్మతను, నీ అసహజమైన కోరికను తీర్చుకోవడానికి ఇంత నాటకం ఆడావు నాయనా! అది చాలా తప్పు. దానికి ఇట్లా మూల్యం చెల్లించుకున్నావు. నీ స్నేహితుడు ఉత్తమ సంస్కారవంతుడు. దుఃఖంలో ఉన్న నీ భార్యకు తోడుగా నీడగా నిలిచాడు. నీ తల్లిదండ్రులు, అత్తమామలు కూడా ఎంతో పరిపక్వత గలవారు. విభావరి జీవితం మోడువారకుండా, వాళ్ళిద్దరినీ కలిపారు. నీవు ఆ పెళ్లిని చూసి, నిశబ్దంగా వెనక్కి వచ్చేశావు చూడు, అది నీ ఉత్తమ సంస్కారం! అది నీవు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తమైంది. నీవు జీవన్మృతుడవుగానే ఉండు. ఇదంతా ఎవరికీ చెప్పకు. ఈ ప్రాంతాలలో నీవు ఉండడం వాళ్లకు శ్రేయోదాయకం కాదు. కేరళలోని గురువాయూరులో నా స్నేహితుని ఆశ్రమం ఉంది. అక్కడ స్కూలు కూడా నడుపుతున్నారు. నేను ఉత్తరం ఇస్తాను. నీ శేషజీవితాన్ని అక్కడ గడుపు. పిల్లలకు చదువు చెప్పి సార్ధకం చేసుకో. నీ ‘మరణం’ లోని మాధుర్యాన్ని అలా పొందు. సుఖీభవ!” అని ఆశీర్వదించాడు భక్తవత్సలస్వామి.

సికింద్రాబాద్ నుండి తిరువనంతపురం వెళ్ళే శబరి ఎక్స్‌ప్రెస్ లోని జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్నాడు వనమాలి. అతని వదనం ప్రశాంతంగా ఉంది. కాసేపట్లో ‘త్రిశూర్’ స్టేషన్ వస్తుంది. అక్కడ నుంచి గురువాయూరుకు బస్‌లో వెళ్లాలి. అతని మనస్సులో గురువాయూరప్ప వేణుగోపాలుడే ప్రస్తుతం కొలువై ఉన్నాడు.

(సమాప్తం)

Exit mobile version