[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన ఘండికోట విశ్వనాధం గారి ‘మరీచిక’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
సాయంత్రం పూట కలకత్తా మహానగరం రోడ్లు చాలా రద్దీగా ఉన్నాయి. ‘హోండా-సిటీ’ నెమ్మదిగా కదులుతోంది. కారు ఎయిర్ కండిషనరు సువాసనలు పంచుతోంది. శరత్కాలం ప్రారంభమైనా కొంచెం వేడిగానే ఉంది. దుర్గోత్సవాలు పూర్తయి రెండు రోజులైనా ఉత్సవశోభ తగ్గలేదు.
కారు ముందుకు సాగిపోతూంటే, నా ఆలోచనలు వెనక్కు వెళ్ళాయి..
కంపెనీ పనిమీద కలకత్తా వచ్చాను. మరునాడు ఉదయం ఫ్లయిట్లో వైజాగ్ వెళ్ళాలి. నిన్న సాయంత్రం ‘సౌత్ సిటీ మాల్’ దగ్గర కనిపించింది వాసవి. ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. సాయంత్రం వాళ్ల ఇంటికి రమ్మని, ఆ పూట తన అతిథిగా ఉండమని అభ్యర్ధించింది. ఆమె అభ్యర్ధనని త్రోసిపుచ్చలేక పోయాను. సాయంకాలం హోటలు నుండి చెక్-అవుట్ చేసి లాబీలో ఉండగా వాసవి పంపిన ‘హోండా సిటీ’ వచ్చింది. అలా వాసవి కారులో కూర్చుని కలకత్తా నగరశోభ చూసే అవకాశం లభించింది..
కారు హారన్ శబ్దానికి నా అలోచనలకి తెరపడింది. చీకట్లు ముసురుకున్నాయి. లేత వెన్నెల అంతటా పరచుకొంది.
ఎదురుగా పెద్ద గేటు సాక్షాత్కరించింది. గేటు ఎడమవైపు ‘డా. వాసవి, ఎం.డి.’ అని ఇంగ్లీషు, బెంగాలీ, హిందీ భాషల్లో వ్రాసి ఉంది. నాకంతా అయోమయంగా తోచింది. బ్రిటిషు వారి కాలంలో కట్టిన బంగళా, వెన్నెలలో వెలతెలా పోతోంది.
బంగళా వసారాలో వాసవి నిలుచుని ఉంది. నేను దిగిన వెంటనే ఆప్యాయంగా పలకరించి లోనికి తీసుకువెళ్ళింది. డ్రైవరు సామాను వెంట తెచ్చాడు. ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు. వాసవి నా భావం గ్రహించినట్లుంది.
“వివరాలు సావకాశంగా మాట్లాడుకోవచ్చు. ముందు వేడి టీ తాగు” అంది.
హాలు చాలా పెద్దది. దాని మధ్యలో విశాలమైన సోఫా సెట్లు ఉన్నాయి. టీపాయ్ మీద ట్రేలో టీ పాట్, మిగతా సరంజామా రెడీగా ఉన్నాయి. డార్జిలింగ్ టీ కాబోలు అద్భుతంగా ఉంది. నాతోబాటే తనూ టీ తాగింది.
“తొందరగా స్నానం చేసి ఫ్రెష్ అయితే భోజనం చేసేద్దాము. పద గెస్ట్ రూమ్ చూపిస్తాను” అంది వాసవి.
ఎత్తైన సీలింగుతో గెస్ట్ రూమ్ చాలా విశాలంగా ఉంది. గది మధ్య పెద్ద టేకు మంచం, మెత్తటి పరుపు. ఒక గోడకి ఆనుకుని డ్రెస్సింగు టేబిలు. అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉన్నాయి.
వెచ్చటి నీళ్ళతో స్నానం చేసిన తరువాత కలకత్తా నగర కాలుష్యం వదిలినట్లనిపించి హాయిగా ఉంది. రాత్రి భోజనం కమ్మగా ఉంది. అన్నీ తనే చేశానంది వాసవి. అప్పటికే రాత్రి పదవుతోంది. పనిమనిషి వెళిపోయినట్లుంది. నేను, వాసవి భోజనం ముగించాము. మృదువైన రసగుల్లాలు, సందేశ్‌లు బాగున్నాయి. భోజనం దగ్గర అట్టే మాటలవలేదు.
“నేను పనులు ముగించుకొని వస్తాను. ఈ లోపుగా వీధి వరండాలో హాయిగా కూర్చో” అంటూ లవంగాలు, ఏలకులు ఉన్న చిన్నప్లేటు అందించింది వాసవి.
వెన్నెల రాత్రులు. ద్వాదశి వెన్నెల వరండా అంతా పరచుకొంది. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాను. వాతావరణం బాగా చల్లబడింది. కొంచెం అలసటగా ఉంటే కళ్ళు మూసుకున్నాను. వాసవి గురించిన ఆలోచనలు నన్ను వదలడం లేదు..
..వాసవి! వేసవిలో మలయానిలంలా నా జీవితంలో ప్రవేశించింది. హైస్కూలులో చేరిన తొలి రోజులలోనే ఆమెతో పరిచయమయింది. మా క్లాసులలో ఇద్దరమూ తెలివైన విద్యార్థులుగా గుర్తింపు పొందడం మా ఇద్దరి మధ్యనున్న స్నేహానికి బలమైన పునాది వేసి దినదిన ప్రవర్ధమానమైంది.
చిన్న వయసునుండే వాసవి, సౌందర్యానికి నిర్వచనంలా ఉండేది. ఆమెది విలక్షణమైన సౌందర్యం. అలవికాని ఆమె సౌందర్యం మాటలకి అందనిదీ, వర్ణనలకి అతీతమైనదీ అనిపించేది ఆ వయసులోనే.
స్కూల్ ఫైనల్ పరీక్షల ఆఖరి రోజున మా స్నేహితులందరూ ఫస్ట్ షో సినీమాకి వెళ్దామన్నారు. ఇష్టంలేక వాళ్ల మాట దాటవేయడానికి ఎన్నో సాకులు చెప్పవల్సి వచ్చింది. సాయంకాలమయ్యాక స్టేషను దగ్గర పెద్దచెరువు ఒడ్డున కట్టిన పార్కులో ఖాళీగా ఉన్నసిమెంటు బెంచీమీద కూర్చున్నాను.
అస్తమిస్తూన్న సూర్యకాంతిలోని అరుణిమ తటాక జలాల్లో ప్రతిఫలిస్తోంది. పడమటి సంధ్యారాగాన్ని చూస్తూ మైమరచిపోయాను. ఇంతలో ఎవరో నా కళ్ళు మూసేరు. మా స్నేహితులలో ఎవరో అనుకున్నాను. తడిమిచూస్తే మృదు కరకమలాలు తోచాయి.
‘ఎవరో పోల్చుకో..’ మధురమైన ఆమె గొంతు గుర్తించాను.
ఒక అద్భుతమైన భావం దృశ్యమానంగా నా ఎదుట నిలిచింది. వాసవి సౌందర్యం ఆమె జడలో విచ్చుకున్న మల్లెచెండులా సౌరభాల్ని పంచింది.
‘ఏమిటి అంత తన్మయత్వంతో చూస్తున్నావు?’
‘ఏమీలేదు.. ఏమిటి ఇలావచ్చేవు. సినిమాకి వెళ్లలేదా..’ నసిగాను.
‘సినిమాకనే బయలుదేరాము. టికెట్లు దొరకలేదు. మావాళ్లంతా ఇళ్ళకి వెళిపోతే నేను కొంచెం పార్కులో గడుపుదామని వస్తే, ప్రకృతిలో ఐక్యమౌతున్న నువ్వు కనిపించావు. సర్ప్రైజ్ ఇద్దామని..’
‘రియల్లీ ఇటీజ్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్..’
తర్వాత కొంతసేపు పరీక్షల గురించి, స్నేహితుల గురించి మాట్లాడుకున్నాము.
‘పరీక్షలెలా అయ్యాయి వాసూ.. క్లాసులో ఫస్టు వచ్చేవాడిని ఈ ప్రశ్న అడగడం హాస్యాస్పదం..’
‘నువ్వు కూడా తక్కువేమీ కాదు కదా. తర్వాత ఏం చేద్దామని?’
‘మెడిసిన్ చేయాలని ఉంది. నన్ను డాక్టరుగా చూడాలని మానాన్నగారు అంటుంటారు. మరి నువ్వో?’
‘నా విషయం వదిలేయ్. మా ఇంటి పరిస్థితులు నీకు తెలుసుగా..’
వాతావరణం గంభీరంగా మారుతోందని ఏదైనా పాట పాడమన్నాను. ఆమె నెమ్మదిగా ఒక లలితగీతం పాడింది. ఆ గీతం నా హృదయాంతరాళాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. తర్వాత చాలాసేపు నాకిష్టమైన పాటలన్నీ పాడింది వాసవి. చెరువుక్రింది పొలాల్లో వెండి కరగించి పోసినట్లు పరుచుకుంది వెన్నెల. అప్పటికే చాలా సమయమైపోయింది.
‘ఇంత ఆలస్యం అయింది. మీ ఇంట్లో ఏమీ అనరా వాసవీ?’ .
‘టికెట్లు దొరకలేదన్న సంగతి ఇంట్లో తెలియదు.’
ఇద్దరమూ నడుస్తూన్నాము. వాసవి పక్కనే నడుస్తుంటే కించిత్ గర్వంగా అనిపించింది. పార్కులో చివరిగా మేమిద్దరమే మిగిలేం. ముందూ, వెనుకా చెట్లు. చెట్ల ఆకుల మధ్యనుండి పడుతూన్న వెన్నెల నేలమీద వింతైన ఆకృతులని చిత్రిస్తున్నది. ప్రక్కనున్న చెరువులోని చంద్రబింబం మాతోపాటే కదులుతోంది. అంతటా నిశ్శబ్దం ఆవరించుకొని ఉంది. ఆమె హృదయపులోతుల్ని అంచనాకట్ట శక్యంకావడంలేదు. మా మధ్య మౌనం రాజ్యమేలింది.
పార్కు చివరకు చేరుకున్నాం. అకస్మాత్తుగా వాసవి ఆగింది. నేను కూడ ఆగాను.
నా ఎదురుగా వచ్చి నిలబడి, రెండు చేతునూ తనచేతులలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది. నాలో విద్యుత్తు ప్రవహించింది.
‘నీతో నాకున్నది కేవలం స్నేహమేనని అనుకున్నాను.. కాని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది ప్రేమ అంటే ఏమిటో.. ఐలవ్యూ..’ అంటూ ఉద్వేగంగా నా చేతులు ఊపేసింది వాసవి.
ఇద్దరమూ ఎప్పటికైనా వివాహం చేసుకోవాలని చేతిలో చేయివేసి చెప్పుకున్నాం. మాకు తెలియకుండానే మైన్ రోడ్డుమీదికి వచ్చాము. అప్పుడే ఫస్ట్ షో సినీమా విడిచినట్లున్నారు. రోడ్డంతా జనం. నాకు ‘బై’ చెప్పి ముందుకు సాగిపోయింది వాసవి..
పక్కనే అలికిడికి ఆలోచనల నుంచి బయటపడ్డాను. వాసవి పనులు ముగించుకొని నా ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. మా మనసులని ఆవరిస్తోన్న జ్ఞాపకాలలా పొగమంచు అంతటా వ్యాపిస్తోంది.
“పాత రోజులు గుర్తుకు వస్తున్నాయా?”
“ఎలా మరచిపోగలను వాసవీ? నువ్వు మరచిపోయే ఉంటావు..”
“అదేం లేదు. నీ కుటుంబం గురించి, నీ భార్య గురించి చెప్పు”
“నా భార్య విషయం అడగకు. ఎందుకంటే నువ్వు కానప్పుడు ఎవరినీ భార్యగా స్వీకరించలేకపోయాను”
“అయ్యో! ఎంత పనయింది.. నువ్వన్నీ మరచి పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటావనుకున్నాను. ఎందుకిలా చేసావు?”
నా మౌనమే ఆమెకు సమాధానమైంది.
“ముందే మావాళ్ళని ఎదిరించి ఉంటే నీతో జీవితం స్వర్గతుల్యం అయ్యేది కదా!” వాసవి గొంతులో నిస్పృహ తొంగి చూచింది.
మావాళ్ళ గురించి క్లుప్తంగా చెప్పానామెకు. అనూహ్యమైన సంఘటనలతో నా జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో చెప్పాను.
“ప్రస్తుతానికి ఒంటరి జీవనం.. బాదర బందీలేవీ లేవు.. సమయం దొరికినపుడు సాహిత్య వ్యాసంగం. మరి నీ విషయం?”
“ఏం చెప్పడం వాసూ! నీదగ్గర నాకు దాపరికం దేనికి! మనమిద్దరం చేరువైన ఆ వెన్నెలరాత్రి నేనెప్పటికీ మరువలేను..” యౌవనం ప్రాదుర్భవిస్తూన్న తరుణంలో అనుభవంలోనికి వచ్చిన మధుర క్షణాలు మననం చేసుకుంటున్నట్లు ఆగింది వాసవి.
“స్కూల్ ఫైనల్ పరీక్షా ఫలితాలు రాకముందే మా నాన్నగారు కాలం చేసారు. ఆయన పోయిన ఏడాది లోపునే నాకు వివాహం చేయడానికి మా అన్నలు నిశ్చయించారు. మెడిసిన్ చేస్తానని, పెళ్ళి చేసుకోనని ఎంత చెప్పినా ఎవరూ నా మాట పడనీయలేదు. మన విషయం ధైర్యంచేసి చెప్పినా ఎవరూ అంగీకరించలేదు. ఆఖరికి దగ్గరి సంబంధం ఒకటి తెచ్చి నా వివాహం కానిచ్చారు..” తరవాత ఆమె చెప్పిన విషయాలు నా మనస్సు కలచివేశాయి.
..వివాహానంతరం కొత్త దంపతులు అమెరికాలో కాపురం పెట్టారు. వాసవి భర్త ముందు బాగానే ఉండేవాడు. కొడుకు కిరణ్ గర్భంలో ఉన్నప్పుడు వాసవి భర్త రంగులు బయటపడ్డాయి. భర్త మారతాడని కొన్నాళ్ళు ఎంతో సహనంగా వేచి చూసింది. కాని ఆశించిన మార్పు భర్తలో రాకపోవడం చూసి ఆఖరికి ధైర్యం చేసి ఇండియాలో అన్నల దగ్గరకి వచ్చేసింది. నిండు గర్భవతిగా ఉన్న చెల్లెలిని చూసి వాసవి అన్నలు, అమ్మగారు ఎంతో దుఃఖించారు.
కిరణ్ పుట్టాక, అన్నలమీద తన జీవితభారాన్ని ఉంచడానికి ఇష్టపడని వాసవి చదువు కొనసాగిస్తానని చెప్పి అన్నలను ఒప్పించింది. కష్టపడి మెడిసిన్‌లో సీటు సంపాదించింది. పట్టుదలతో ఎంతో శ్రధ్ధగా చదివి, ఎం.బీ.బి.ఎస్. తర్వాత పీ.జీ. పూర్తిచేసి తన జీవిత లక్ష్యాన్ని సాధించింది. ఆమె చదువుకొనే రోజులలోనే, భర్త నుండి లీగల్ సెపరేషన్ పొందింది. ఆమె చదువు సాగినంతకాలం, వాసవి అమ్మ, అన్నలు, వదినెలు ఎంతో సహకరించేవారు.
చదువయిన తర్వాత వాసవికి కలకత్తాలో ఉన్న ఒక పబ్లిక్ సెక్టరు కంపెనీలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. తల్లి తోడు రాగా కొడుకుతో కలకత్తాకి మకాం మార్చింది. అన్నలు చెల్లెలి బాగోగులు చూసుకుంటూ ఉండేవారు. ప్రస్తుతం కిరణ్ దుర్గాపూరులోని ఎన్.ఐ.టీ.లో ఇంజనీరింగు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు..
అప్పటికే అర్థరాత్రి దాటింది. బయట పొగమంచు దట్టంగా కమ్ముతోంది. ఆమె దుఃఖం నా హృదయభారాన్ని ఎన్నోరెట్లు పెంచింది.
“చాలా రాత్రయ్యింది! పడుకో వాసూ..!”
వాసవి మేడమీది తనగదికి వెళ్ళిపోయింది. నేను నా గదిలోనికి వెళ్లి మేనువాల్చాను.
మంచం మీద పడుక్కున్నానన్న మాటేగాని నిద్ర పట్టలేదు. అంతటి సౌందర్యరాశి వైవాహిక జీవితం రతీ మన్మథుల దాంపత్యంలా పరిమళించవలసింది. కాని, ఏమయింది. ఒక త్రాష్టుడామె జీవితం నాశనం చేశాడు.
కిటికీలోంచి గదిలో వెన్నెల పడుతోంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. కొంచెంసేపయ్యాక తలుపు దగ్గర అలికిడి వినిపించింది. మసక వెలుగులో ద్వారబంధం దగ్గర వాసవి ఆకారం లీలగా గోచరించింది.
“వాసూ! నాకు నిద్ర రావడం లేదు.. లైటు వెలుగుతుండడం చూసి నువ్వు పడుకుంటే లైటు ఆపేద్దామని వచ్చాను..”
“నాకూ నిద్రరావడంలేదు. రా, కూర్చో..” అన్నాను. డ్రెస్సింగ్ టేబిలు దగ్గర స్టూలుమీద కూర్చుంది వాసవి.
“వాసవీ పాతికేళ్ళ క్రితం చెరువు గట్టు దగ్గర మనం చేసుకున్న బాసలు గుర్తున్నాయా?”
“ఎలా మరిచిపోతాను వాసూ? విధి మనని విడదీయక పోతే ఇద్దరమూ అనందంగా సంసారం సాగించే వాళ్ళమే!”
“నిజమే. మరి, విడాకులు తీసుకున్నాక, జీవితంలో స్థిరపడ్డాక మళ్ళీ వివాహం చేసుకోవాలనిపించలేదా?” అన్నాను.
“విడాకులు వచ్చేసరికి నా చదువులలో పడి వేరే ధ్యాస ఉండేది కాదు.. అయినా మళ్ళా నీలాంటి సరియైన భర్త లభిస్తాడని గ్యారంటీ ఏమిటి?” నవ్వుతూ అంది వాసవి.
“వాసవీ ఒక విషయం చెప్పనా! ‘మనసులు కలిసినదే వివాహ’మని నమ్ముతాను నేను. ఒకసారి నీకు మనసిచ్చాక వేరొకరికి మనసివ్వడం నావల్ల కాలేదు. జీవిత చరమాంకంలో మన ఇద్దరికీ తోడు అవసరం.. ఆ అవసరం నువ్వు తీర్చగలవనే నమ్మకం నాకుంది..”
“నువ్వు చెప్పింది నిజమే. మనసులు కలియకనే మా వివాహం బెడిసికొట్టింది.. నీ ప్రస్తావనకి మనసు ఊగిసలాడుతున్నా, ఇంకా ఎన్నో విషయాలూ ఆలోచించాలి..”
“తొందరలేదు.. ఆలోచించుకో..”
వాసవి ఏదో ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయింది. నేను కూడ ఏమీ మాట్లాడలేదు. జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఆమెకి సమయం కావాలి.
నా కోరిక మీద నాకిష్టమైన లలితా గీతాలు పాడింది వాసవి. జీవితం ధన్యమైనట్లనించింది.
పాడడం అయ్యాక ఆమె లేచింది. కిటికీ పరదాలు లాగింది. గది అంతా చీకిటి అలుముకుంది. నా గుండె చప్పుళ్ళకి లయగా ఆమె పాదాల సవ్వడి వినిపిస్తోంది. పక్కనే ఉన్న బెడ్ లైట్ స్విచ్ వేసాను. గది అంతా లేత నీలం కాంతి వ్యాపించింది. బయటనున్న వెన్నెల తృటిలో గదినిండా పరచుకున్నట్లయింది.
ఎదురుగా వాసవి నిలుచుని ఉంది. ఎప్పుడో నేను చూసిన ‘ఆండ్రొమిడా’ తైల వర్ణ చిత్రం గుర్తుకు వచ్చింది. ‘ఆండ్రొమిడా’ వాసవి రూపంలో సాక్షాత్కరించింది. జలపాతంలా ఆమె కురులు భుజాల మీదుగా అలవోకగా పడుతున్నాయి. ఆమె శరీరం నుండి వెలువడుతున్నసౌందర్య తేజం నన్ను అంధుడిని చేస్తోంది.
“వాసూ! విధి మనని విడదీయక పోతే ఇద్దరమూ అనందంగా సంసారం సాగించే వాళ్ళమే! ఏమో! మనం మళ్ళా కలియడం విధి సంకల్పమే అయి ఉంటుంది..” అంటూ వాసవి రెండు చేతులూ చాచి ఆహ్వానించింది.
ఆమెలోని వివశత్వం నన్ను బలహీనుడిని చేస్తోంది. ‘కాంక్షా మధుర కాశ్మీరాంబరాలు’ నా మనసుని కప్పుతున్నాయి. ఆమెమీద యౌవనారంభంలో పెంచుకున్న మోహం, ప్రేమ తమ ప్రభావాన్ని నా మీద చూపిస్తున్నాయి. మహర్షులే ఓడిపోయారు. మానవమాత్రుడిని నేనెంత!
***
అప్పుడే తెల్లవారినట్లుంది. బద్ధకంగా కళ్ళు తెరిచాను. వెంటిలేటర్లలోంచి వెలుగురేకలు తోచాయి. అదే సమయంలో సెల్ ఫోను మ్రోగింది. వాసవి కాల్ చేస్తోంది.
“సారీ వాసూ. తెల్లవారే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. అర్జెంట్ కేసు.. నిన్ను వదిలి వెళ్ళక తప్పలేదు. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చేసేక మా కారులో డ్రైవరు ఎయిర్ పోర్ట్‌లో దింపుతాడు. ఫ్లైట్ అందుకోవడానికి ఇబ్బంది ఉండదు..”
“ఒకే వాసవీ! నేను చూసుకుంటానులే..”
“మళ్ళా మనం ఎప్పుడు కలుస్తామో! మిగతా వివరాలు డ్రెస్సింగ్ టేబిలు మీది నోట్ ప్యాడ్‌లో వ్రాసాను. చదువుకో.. బై”
ఎదురుగా డ్రెస్సింగ్ టేబిలు మీద నోట్ ప్యాడ్ కనిపించింది. ఆతృతగా తీసి చదివేను.
“ప్రియమైన వాసూ,
ఒకరోజు అనుభవం చాలు, జీవితమంతా ఆనందంగా గడిపేయడానికి. ఆ అనుభవాన్ని, ఆనందాన్ని ప్రసాదించేవు నాకు. అదే చాలు నా జీవితానికి.
కిరణ్ జీవితంలో స్థిరపడేవరకు ఇంకే కమిట్‌మెంట్స్ స్వీకరించే పరిస్థితిలో లేను.. నువ్వొక జీవిత భాగస్వామిని ఎంచుకొని సుఖపడు. ఈ అభాగిని జీవితం ఎలా వెళ్ళాలో భగవంతుడే నిర్ణయించి ఉంటాడు.
మళ్ళీ ఎప్పుడు కలుస్తామో! అంతవరకు సెలవ్!
ఎన్నటికీ నీదానిని కాలేని అభాగిని,
వాసవి”
ఆ సమయంలో శరీరంలో ఆవహించిన నిస్సత్తువ నా జీవితంలో ఇప్పటివరకు అనుభవంలోకి రాలేదు.
ఎడారిలాటి జీవితంలో కొట్టుమిట్టాడుతున్న నన్ను ఒయాసిస్సులా సేద తీరుస్తుందనుకున్నాను. కాని, వాసవి నా జీవితంలో ఆశలు రేపి, మరీచికలా నిరాశ మిగులుస్తుందని ఊహించలేదు!