[ఫణిహారం వల్లభాచార్యగారి ‘మెరీనా.. ఓ మెరీనా’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
శ్రీ ఫణిహారం వల్లభాచార్య కవి, కథకుడు, సంపాదకుడు. ఆధ్యాత్మిక పథంలో ఉన్న సాధకుడు. వారి కథల్ని చదువుతున్నప్పుడు వారిలోని ఆధ్యాత్మికతని కూడా పాఠకులు దృష్టిలో ఉంచుకోవాలి. పురాణ పాత్రలతో వ్రాసిన కథల్లో భాష ప్రౌఢంగా ఉండడమే కాకుండా మామూలు రచయిత కాకుండా, ఓ ఆధ్యాత్మికవేత్త కథ చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆయా కథల్లో పాత్రోచిత భాష, సందర్భాన్ని బట్టి కఠిన సంస్కృత సమాసాల వినియోగం కథలకి నిండుదనాన్నిచ్చాయి. అదే సమయంలో మామూలు కథల్లో భాష సాధారణంగానే తోచినా, క్లిష్టమైన భావాలను కూడా చాలా సాదాసీదా పదాలతో వెల్లడించినట్టు గమనిస్తాం. భాష మీద రచయితకి ఉన్న పట్టుని ఇది తెలియజేస్తుంది.
‘మెరీనా.. ఓ మెరీనా’ కేవలం ఒక కథా సంకలనం మాత్రమే కాదు, అది మనిషి మనసులోని లోతైన అలజడుల ప్రతిరూపం. రచయిత మధ్యతరగతి మనుషుల ఆశలు, ఆవేదనలు మరియు వారి నిత్య జీవిత పోరాటాలను చాలా సున్నితంగా చిత్రించారు. పాత్రల చిత్రీకరణలో సహజత్వం ఈ పుస్తకానికి పెద్ద బలం. ఆధునిక ప్రపంచంలో మారుతున్న మనుషుల ఆలోచనా ధోరణిని, విడిపోతున్న బంధాలను ఈ కథలు ప్రశ్నిస్తాయి.
కేవలం కథ చెప్పడమే కాకుండా, జీవితం పట్ల తాత్త్వికతతో కూడిన ఒక లోతైన అవగాహనను ఈ పుస్తకం కలిగిస్తుంది.
~
ఈ పుస్తకంలోని కొన్ని కథల గురించి చెప్పుకుందాం.
మెరీనా.. ఓ మెరీనా:
ఈ కథ మద్రాసు సముద్ర తీరం (మెరీనా) నేపథ్యంలో సాగుతుంది. సముద్రం ఇక్కడ కేవలం ఒక ప్రకృతి దృశ్యం మాత్రమే కాదు, కథానాయిక మనసులోని అలజడికి, ఆమె జీవిత ప్రయాణానికి ఒక ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఒక మధ్యతరగతి స్త్రీ తన జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్లు, బాధ్యతలు మరియు ఆమెకు ఉండే చిన్న చిన్న ఆశల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇంటి బాధ్యతల మధ్య తనను తాను కోల్పోతున్న ఒక మహిళ, సముద్ర తీరానికి వచ్చినప్పుడు పొందే ఏకాంతం, అక్కడ ఆమెకు కలిగే ఆలోచనలను రచయిత చాలా సున్నితంగా చిత్రించారు. సముద్రం ఆమెలోని భావోద్వేగాలను ఉప్పొంగేలా చేస్తుంది, అలాగే ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. భావుకురాలైన యువతికి భావుకత ఏ మాత్రం లేని వ్యక్తి భర్తగా వస్తే ఎలా ఉంటుందో ఈ కథ చెబుతుంది.
పార్థసారథీ.. పారి ఫో:
ఈ కథ చెప్తున్న వ్యక్తికి ట్రిప్లికేన్ పార్థసారథి ఆలయంలో చిన్నప్పడు తను చూసిన దేవుని మూర్తి మనసులో నిలిచిపోతుంది. ఎన్నో ఏళ్ళ తరువాత మళ్ళీ ఆ గుడికి వెళ్ళి చూసినప్పుడు.. నాగరికత వృద్ధి చెంది, మనుషుల్లో ఆడంబరాలు ఎక్కువై దేవుని మూర్తినే మార్చేసిన వైనం అతడి మనసుని తీవ్రంగా గాయపరుస్తుంది. ఈ కథకీ మద్రాసు నగరమే నేపథ్యం.
వందే! జగద్గురుమ్!:
మనకు బాగా తెలిసిన పురాణ కథను మరో కోణం నుంచి చెప్పిన కథ ఇది. నరకాసుర వధ తరువాత నరకాసురుని భార్య మనోవైఖరి ఎలా ఉంటుందనే అంశం వినూత్నమైనది, విభిన్నమైనది. భర్త వియోగానికి దుఃఖించినా, ఆమెలో వివేకం నశించదు. శ్రీకృష్ణుడిని ఎన్నో ప్రశ్నలు వేస్తుంది, ఆయన చెప్పిన జవాబులు వింటుంది. చివరకి సమాధానపడుతుంది. ఆమె లోని సందేహాలన్నీ అంతమై, దీర్ఘనిద్రలోకి వెళ్తుంది.
సాక్షాత్కారం:
రామకృష్ణ, కృష్ణమూర్తి గారితో కలిసి, మద్రాసు నుంచి కంచికి చేసిన ప్రయాణంలో జరిగిన కథ. నువ్వు ఎవరు అని ఆయన అడిగిన ప్రశ్నకు రామకృష్ణకు సమాధానం దొరకడంతో కథ ముగుస్తుంది. బహుశా ఏదో ఒక సమయంలో మనమంతా మనకి మనం ఈ ప్రశ్న వేసుకుని, సమాధానం రాబట్టుకోవాలి.
స్నేహ సారే స్థితమ్!:
దాంపత్యాన్ని పండించుకున్న తాతాబామ్మల నుంచి మనవడు నేర్చుకున్న గొప్ప నీతి ఈ కథలో ఉంది. ఒకరినొకరు గౌరవించుకుంటే, భార్యభర్తలు స్నేహితులుగా ఎలా మారగలరో ఈ కథ చెబుతుంది. యువ దంపతులందరూ చదవాల్సిన కథ ఇది.
రామం నవ్వాడు:
తెలిసో తెలియకో పోలీసులంటే, పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఓ విధమైన భయాన్ని కలుగజేస్తాం. ఈ కథలో వినాయక చవితి సందర్భంగా ఓ కాలనీలో వినాయకుడి బొమ్మ పెట్టి పూజలు చేస్తారు. మండపానికి కాపలాగా పోలీసుని నియమిస్తారు. ఆ పోలీసాయన చేతుల మీదుగా ప్రసాదం తీస్కోడానికి పిల్లలు భయపడ్తారు. అప్పుడు ఆయన నవ్వుకుంటాడు. ఆ నవ్వు వెనుక ఉన్న ఆవేదన అందరికీ అర్థం కాదు.
ఛిన్నమస్త:
మనకు బాగా తెలిసిన పరశురాముడు తన తల్లి తల నరకడం కథని ఓ నూతన కోణం నుంచి చెప్పిన కథ. జమదగ్ని భార్య రేణుకాదేవి మామూలు స్త్రీ కాదు, ఆమె సమస్త శక్తులకూ ప్రతీక అని ప్రచండచండిక చెప్పినప్పుడు జమదగ్ని నివ్వెరపోవడం, ఆ పిమ్మట మాత ఛిన్నమస్త రూపంలోని రహస్యాన్ని పరశురాముడికి వివరించడం – ఆధ్యాత్మిక బాటలో లేని సాధారణ పాఠకులకు కొత్తగా ఉంటుంది. తంత్ర సాధనలో ఉన్న యోగులకు మాత్రమే తెలిసిన కథని ఈ పుస్తకంలో చేర్చడం ద్వారా ఒక యోగ రహస్యం మామూలు పాఠకులకు కూడా తెలుస్తుంది.
ఆనందమే అందం:
‘స్నేహ సారే స్థితమ్!’ కథ యాభై ఏళ్ళ వైవాహిక జీవితం చూసిన దంపతులదైతే ఈ కథ – వసంత, వాసూ అనే కొత్త దంపతులది. యూనివర్సిటీలో ఫిలాసఫీ చదివిన ఈ ఇద్దరు ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. వాసుకి తెలియని జీవన తత్త్వాన్ని విడమర్చి చెబుతుంది వసంత. అందం అనేది రూపంలో కాదు, నిజమైన అనుబంధంలో ఉంటుందని వివరిస్తుంది. మంచి కథ.
మంత్రనగరి సరిహద్దులో:
సి. ఎం. కాన్‍బ్లత్ (C.M. Kornbluth) రాసిన The Words of Guru కథకి అనుసరణ ఈ కథ. ఒక అమాయక యువకుడు వాస్తవికతను మార్చగలిగే శక్తి గల ‘మంత్రాల’ను నేర్చుకుంటూ, మాయాజాల ప్రపంచంలోకి అడుగుపెట్టే క్రమాన్ని ఈ కథ వివరిస్తుంది. చివరి మంత్రాన్ని ఉచ్చరించాలో వద్దో అనే సంశయంలో పడతాడా యువకుడు. ఆసక్తిగా సాగుతుందీ కథ.
వాన.. లో.. వాన..:
ఇది జేమ్స్ థర్బర్ వ్రాసిన ‘ది ఈవెనింగ్స్ ఎట్ సెవెన్’ కథకి అనుసరణ. ఇది ముగిసిపోయిన బంధాల పట్ల ఉండే వెలితిని తెలిపే కథ. “ఆమె మౌనం. నేను బయటకి ప్రవహించాను. మళ్ళీ వానలో. ఆటోలో.. లో.. వాన.. లోవానలో..” ఎంత అద్భుతమైన వాక్యాలు!
ధర్మమూర్తి:
వయక్తిక భక్తి కన్నా సామాజిక బాధ్యతే ముఖ్యమని చెప్పిన కథ. రాముడిని మూర్తీభవించిన ధర్మమని ఎందుకంటారో ఈ కథ చదివితే అర్థమవుతుంది. చక్కని కథ.
తండ్రి ఇచ్చిన వరం!:
ఇది భీష్ముడి కథ. చివరి రోజుల్లో తనకు కలిగిన ఎన్నో సందేహాలకు శ్రీకృష్ణుడి ద్వారా తీర్చుకుని అసలైన జ్ఞానాన్ని పొందుతాడు. భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరాన్ని ఆయన తండ్రి శంతన మహారాజు ప్రసాదిస్తాడు. ఈ కథలో భీష్ముడికి జగత్పిత అయిన శ్రీకృష్ణుడు ఓ వరం ఇచ్చాడు. అది ఆయనలోని సమస్త తాపానికి తెర దించుతుంది. శీర్షిక రెండు విధాలుగా జస్టిఫై అయిన చక్కని కథ ఇది.
~
ముగింపు:
‘మెరీనా.. ఓ మెరీనా’ అనేది కేవలం కాలక్షేపం కోసం చదివే పుస్తకం కాదు. ప్రతి కథా ముగిశాక పాఠకుడు కాసేపు ఆగి, తన జీవితం గురించి తాను ఆలోచించుకునేలా చేసే ఒక చక్కని సాహిత్య ప్రయత్నం. తెలుగు కథా జగత్తులో మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన మరో మంచి సంపుటి ఇది. రచయిత ‘మనిషి’ అనే పదాన్ని ఒక జీవిగా కాకుండా, ఒక ‘విలువ’గా చిత్రించినట్లు అనిపిస్తుంది. అందుకే ఈ సంపుటి మనిషే పునాదిగా వెలసిన కథాసౌధం!
***
రచన: ఫణిహారం వల్లభాచార్య
పేజీలు: 176
వెల: ₹ 200/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
ఫణిహారం వల్లభాచార్య,
ప్లాట్ నెంబర్ 32, ఫ్లాట్ 112,
విక్టోరియా మెమోరియల్ స్కూల్ గ్రౌండ్స్ ఎదురుగా,
కొత్తపేట, సరూర్‍నగర్,
హైదరాబాద్ – 500035.
ఫోన్: 9000221269
~
ఆన్‌లైన్‌లో
https://www.amazon.in/Mareena-Vallabhacharya-Phaniharam/dp/9356355290
~
ఫణిహారం వల్లభాచార్యగారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-phaniharam-vallabhacharya/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

