Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మార్గదర్శి సుమిత్ర

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో పౌరాణిక కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘మార్గదర్శి సుమిత్ర’. రచన డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు.]

ర్మిళ కాపురానికి వచ్చి ఏడాదైంది. ఈ సంవత్సర కాలంలో ఆమె తన భర్త లక్ష్మణుడి కన్నా, అత్తగారు సుమిత్రాదేవికి బాగా దగ్గరైంది. అందుకు కారణాలు లేకపోలేదు. లక్ష్మణుడు తన అధిక సమయాన్ని రాముడితో గడపడం ఒకటైతే, అబ్బురపరిచే సుమిత్ర వ్యక్తిత్వం మరొకటి. ఎవరినీ అంత తేలికగా మెచ్చని ఊర్మిళ, తన అత్తగారి గురించి, ఉత్సాహంగా ఇలా చెబుతుంది.

“ఆమె సార్థకనామధేయురాలు. స్నేహ సౌశీల్యాలు ఆమెకు సహజ గుణాలు. ఋషులు కీర్తించే స్థితప్రజ్ఞత ఆమె సొంతం. ఇటు పట్టమహిషిగా అధికార దర్పంతో వుండే కౌసల్య, అటు మహారాజు హృదయరాణిగా అధికారాన్ని చెలాయించే కైకేయి, ఇద్దరూ ఆమెకు స్నేహితులే. రాజుకి కౌసల్యాదేవి భోజ్యేషు మాత అయితే, కైకేయి శయనేషు రంభ. నా అత్త సుమిత్రాదేవి, కరణేషు మంత్రి. ఆమె ధార్మిక గుణం, రాజ నీతిజ్ఞత గురించి తెలుసుకున్న నా మామ దశరథ మహారాజు ఆమెను తన రెండవ భార్యగా స్వీకరించాడని అంటారు. ఆమె మెచ్చని నిర్ణయం తీసుకోవాలంటే ఆయన సంకోచిస్తాడని విన్నాను.”

రోజూలాగే ఆమె, భర్త రామ మందిరానికి వెళ్ళిన తర్వాత, అత్తగారి వద్దకు వెళ్ళింది. మందిరం నిశ్శబ్దంగా వుంది. రాణీ సుమిత్రాదేవి దశరథుని మందిరానికి వెళ్ళారని, చెలికత్తెలు చెప్పారు. సుమిత్ర ఆంతరంగిక చెలికత్తె, రహస్యంగా ఇలా చెప్పింది.

“నిన్న మహారాజు రామ పట్టాభిషేకం ప్రకటించారు కదా. అది రాణి కైకేయి గారికి నచ్చలేదు. ఆమె మహారాజుని, భరతునికి పట్టాభిషేకం జరిపించమని కోరారని తెలిసింది.”

“అయ్యో, ఎంత ఉపద్రవం వచ్చింది. అత్తగారు వచ్చాక కబురు చెయ్యి” అని ఊర్మిళ ఆందోళన చెందుతూ సీతని కలవడానికి బయలుదేరింది.

***

రత్నమణుల కాంతులతో, వివిధ సుగంధ పుష్ప పరిమళాలతో, శోభాయమానంగా వుండే కైకేయి మందిరం, నిశ్శబ్దంగా వెల వెలబోతోంది.

“అక్కా! స్వాగతం” అనే రాచిలుక సుమిత్రని చూసి, మూగగా తలాడించింది. కైకేయి పిలుపు కోసం మందిర ద్వారంవద్ద నిలబడి నిరీక్షిస్తున్న ప్రధాన పరిచారిక, సుమిత్రకు శిరసు వంచి అభివాదం తెలిపింది. మందిరంలోనికి ప్రవేశించిన సుమిత్రకి, రాముని కోసం విలపిస్తున్న దశరథుడొక వైపు, తన పంతం నెగ్గించుకోవడం కోసం ఆవేశంతో వున్న కైకేయి మరొక వైపు కనిపించారు. సుమిత్రను చూసి, దశరథుడు, “నాకెంత దుర్గతి పట్టిందో చూడు, సుమిత్రా!” అని గద్గద కంఠంతో రోదించాడు.

“దుర్గతి మీది కాదు. నాది. వివాహానికి ముందు నా పుత్రుడిని రాజుని చేస్తానని నా తండ్రి కిచ్చిన మాట మరచింది మీరు. మీ అసత్యవర్తన వల్ల నేను అపరాధినయ్యాను” అంటూ కోపంతో పలికింది కైక.

“సుమిత్రా! మాట ఇచ్చినది నిజమే. కానీ ఆనాడు నాకు పుత్ర సంతానం లేదు. ఆ తర్వాత తనకి కూడా సహజమైన పద్ధతిలో, పుత్ర సంతానం కలగలేదు. నేను పాయసం ఇచ్చి తప్పు చేసాను.”

సుమిత్ర కలగచేసుకుని ఇలా అంది “ప్రభూ! ఆ మాట అనకండి. సాంప్రదాయపరంగా కౌసల్య అక్కకు చెందవలసిన పాయసాన్ని, మీ అసమాన ప్రేమకు చిహ్నంగా చిన్నక్కకు కూడా పంచి యిచ్చారు. అందుకు ఆనాడు నేను మిమ్మల్ని అభినందించాను.”

“నిజమే. కానీ నాకున్న ప్రేమ తనకు లేదు. రఘువంశంలో జ్యేష్ఠ పుత్రునిదే రాజ్యాధికారం. ఆ ఆచారాన్ని నేను పాటించకుండా చేస్తోందంటే, యేమనాలి? అమెకు ప్రేమ కన్నా స్వార్థం యెక్కువైపోయింది?”

“అక్కా! నేను స్వార్థపరురాలినే. కానీ ఇది చెప్పు. ఏ తల్లి తన బిడ్డ ఔన్నత్యం కోసం తన సర్వస్వం త్యాగం చెయ్యదు? నా స్వార్థానికి కారణం ఆయనే. పట్టాభిషేకం గురించి ఎన్నాళ్ళ నుంచో ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆయన ఒక్కసారైనా, నాతో గాని, నీతో గాని ఆ విషయం ఎందుకు చర్చించలేదు? నేను అలనాటి రెండు వరాలు గుర్తుచేస్తానన్న భయం. నీవు ధర్మంగా, న్యాయంగా ఆలోచించి, సలహా ఇస్తావన్న సంకోచం. కోరి ఆయనే తప్పు చేసాడని తెలియడంలా!”

“నిజమే చెల్లీ, కానీ, మీ ప్రేమానుబంధం వల్ల, మిమ్మల్ని చూసిన వారు, మీ శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అని భావించారు. ఆయన నీకు నోరు విప్పి చెప్పకపోయినా ఆయన అంతరంగం నీకు తెలుసు కదా! ఆయనకు ఆరో ప్రాణంగా వున్న నీవు, ఈ రోజు వేరుపడి మాట్లాడుతుంటే చాలా బాధగా వుంది. మీ రిద్దరూ, మీ మీ పంతాలని విడిచిపెట్టి, ఆత్మీయంగా మాట్లాడుకుని ఒక పరిష్కారానికి రండి.”

“ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా? రాముడికి రాజ్యమివ్వండి. సత్యం, ధర్మం అనేవి రఘువంశంలో లేవని ప్రకటించండి. నన్నూ నా కొడుకుని వనవాసం పంపించండి” అంది కైక కటువుగా.

“చూసావుగా సుమిత్రా, ఆమె నీలా పతివ్రత కాదు. ఎన్నో సందర్భాలలో నిన్ను నేను చిన్న చూపు చూసినా నీవు పరిస్థితుల ప్రభావమని సర్దుకుపోయావు. చెరగని చిరునవ్వుతో, నిష్కల్మష మైన ప్రేమతో, నన్ను ఆదరించావు, నా బలహీనతలు నా తప్పులు తెలిసికూడా నన్ను గౌరవించావు. నీ సహచర్యంలో జీవించి వుంటే, నాకు ఈ అకాల మరణం వుండేది కాదు.”

“చావు పేరు చెప్పి నన్ను లొంగదీసుకోవాలనుకోకండి. మీలాంటి వీరపురుషులు చిల్లర మాటలతో స్త్రీలను బెదిరించడం ఉచితం కాదు.”

“లేదు చెల్లీ, ఆయన మాటలలో వాస్తవముంది. మర్చిపోయావా? శ్రవణుడి తల్లిదండ్రులిచ్చిన శాపం. రాముడు అడవులకు వెడితే ఆ శాపం ఫలించి ఆయన మృత్యువాత పడతారు. అందుకే నేను మధ్యే మార్గంగా ఒక పరిష్కారం చెబుతాను. వింటారా?”

కైక, దశరథడు, ఆసక్తిగా సుమిత్ర వైపు చూసి, వింటామని చెప్పారు.

“వంశ నియమం ప్రకారం రాముడు రాజవ్వాలి. ప్రభువు సత్య వాక్పాలన కోసం భరతుడిని రాజు చెయ్యాలి. ఈ రెండూ నెరవేరే మార్గం రాజ్యవిభజన. మీ పిత్రార్జిత రాజ్యం రామునికివ్వండి. మీరు సముపార్జించిన రాజ్యం భరతునికివ్వండి. ఈ రకంగా రాజ ధర్మం, వ్యక్తి ధర్మం రెండూ నెరవేరుతాయి.”

సుమిత్ర సలహా కైకేయికి నచ్చలేదు. రాజ్య విభజన నాకు యిష్టం లేదని ఆమె నిర్ద్వందంగా చెప్పింది.

రాజ్యం విషయంగా వాదనలు అనవసరమని గ్రహించిన సుమిత్ర కైకనిలా అడిగింది.

“రాముడు నీ ముద్దుల కొడుకుగా పెరిగాడు. ఒక్క రోజు వాడు కనబడకపోతే, కబురు మీద కబురు పెట్టి నీ దగ్గరికి రప్పించుకునేదానివి. అలాంటి నీవు రాముడిని వనవాసం వెళ్ళాలని పట్టుబట్టడం, బాధాకరంగా వుంది.”

కైకేయి భారంగా నిట్టూరుస్తూ ఇలా అంది.

“నిజమే! ఇప్పటికీ రాముడు నా ముద్దుల కొడుకే. మన నాథుడు, ముందే నన్ను అడిగి వుంటే, నా మనసు సంశయంలో పడేది. విధి లీల. ఇలా జరగాలని రాసిపెట్టి వుంది. రాముడు కంటి యెదురుగా వుంటే, భరతుడు పట్టాభిషిక్తుడు కాలేడు. నీకు తెలియనిదా! అక్క కౌసల్య ఈ దేశానికి చెందిన రాణి. ఆమెకున్న రాజకీయ బలం నాకు లేదు. ఇక్కడ ఎటువంటి గొడవలు జరగ కూడదననే ఉద్దేశంతో, నా మనసులో బాధ పడుతూనే ఈ వరం కోరాను.”

కైక మాటలు విని సుమిత్ర ఇలా అనుకుంది. ‘కైక అభిప్రాయం సరైనదే. దండ నాయకులు, ప్రముఖ పురజనులు కౌసల్య పక్షం వారే. దశరథుని ఆజ్ఞ లేనిదే భరతుడు పట్టాభిషిక్తుడు కాలేడన్నది కఠోర సత్యం. కానీ వనవాసం ఆలోచన దారుణమైనది’. మరొక్క సారి కైకను అడిగి చూద్దామని సుమిత్ర యిలా అంది.

“చెల్లీ! నీ ఆలోచన సరియైనదే కానీ, సుగుణాభి రాముడైన రాముడు, నీవు కోరితే దగ్గరుండి, భరతునికి పట్టాభిషేకం జరిపిస్తాడు. అతడిని వనవాసం పంపించే ఆలోచన విరమించుకో. ఆ కోరికలో న్యాయం లేదు. ఇది నా ప్రార్థన. దయచేసి మన్నించు.”

“నన్ను మన్నించు అక్కా! రాముడికి రాజ్యార్హత వుంటే, అతడిని ఎలాగైనా రాజును చేయాలని ఆ జిత్తులమారి కౌసల్య బృందం పన్నాగాలు సాగిస్తారు. ఆ నీచనికృష్టులు, చివరికి నా బిడ్డని హత్య చేసినా, దానికి మన ప్రాణేశ్వరులు మద్దతిచ్చినా ఆశ్చర్యపడను.”

ఆమె స్వరంలో ధ్వనించిన కర్కశత్వానికి సుమిత్ర, నిర్ఘాంతపోయింది. ఒక్క క్షణం తర్వాత తేరుకుని ఇలా అనుకుంది.

‘కైక పుట్టింటి వారు ఆమెను బాగా ప్రభావితం చేసారు. లేకుంటే రాముని వ్యక్తిత్వం తెలిసి కూడా అతడిని వనవాసానికి పంపించి రాజ్య పాలనకు అనర్హుడిని చేయాలని కైక అనుకోదు. బహుశా ఇందులో ఒక వర్గం ఋషుల పాత్ర కూడా వుండే వుంటుంది. రాక్షసులను, ముఖ్యంగా రావణుడిని సర్వనాశనం చేయాలంటే రాముడు అడవికి రావాలని వారు ఎప్పటినుంచో కోరుతున్నారు.అంతా విధిలీల’

ఇంక అక్కడ వుండి తను చేయగలిగినదేమీ లేదని గ్రహించిన సుమిత్ర “మీ పట్టుదలలు మీకు ప్రాణాంతకాలుగా మారతాయని నా భయం. ఒక భార్యగా నా పతి దీర్ఘాయుష్కుడై జీవించాలని, ఒక అక్కగా నా చెల్లి, సౌభాగ్యంతో, సుఖ సంతోషాలతో కలకాలం జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.” అని వారి దగ్గర సెలవు తీసుకుని, నిరాశా నిస్పృహలతో ఆ మందిరాన్ని వీడింది.

***

గంభీర వదనంతో వచ్చిన సుమిత్రను చూసిన ఊర్మిళ గుండె జారిపోయింది. ఊర్మిళ దీన వదనాన్ని చూసిన సుమిత్ర, ఇంత చిన్నవయసులో ఎంత కష్టం వచ్చింది, ఈ సౌభాగ్యవతికి అని వేదన చెందింది.

“అత్తయ్యా! భరతుడికి రాజ్యం, రాముడికి వనవాసం అని అంటున్నారు. నిజమేనా?” అని ఊర్మిళ కంపిత స్వరంతో అడిగింది.

“నిజమేనమ్మా! అయోధ్యకు చెడ్డ రోజులు వచ్చాయి.”

“మహారాజు ధర్మాత్ముడని కీర్తిస్తారే? ఈ విపరీతం యెలా జరిగింది?” బాధాతప్త స్వరంతో అడిగింది ఊర్మిళ.

అన్ని విషయాలు ఊర్మిళకు తెలియ చేసి ఆమెను మానసికంగా రాబోయే కష్టానికి సిద్ధం చేయడమే ఉత్తమ మార్గమని సుమిత్ర భావించింది.

“రఘువంశీయులు సత్యవాక్పరిపాలన, ధర్మవర్తన, దాన శీలత, మరియు ఆర్త రక్షణ, వంటి గుణాలతో కీర్తి గడించారు. మన మహారాజు వారి అడుగు జాడలలో నడిచే ప్రయత్నం చేసారు. కానీ ఆయన కాముకత్వం, పక్షపాత వైఖరి ఆయనను కొన్ని విషయాలలో బలహీనుడిని చేసాయి. ఇప్పుడు ఆయనకు పెనుముప్పు తెచ్చిపెట్టింది కూడా ఆ బలహీనతలే.”

“అలాగే అనిపిస్తోంది. కైకేయిని అధికంగా ప్రేమించే మహారాజు, భరతుడిని గాక కౌసల్యానందనుని ఎందుకు అమితంగా ప్రేమించారు? సత్యవాక్పాలకులు గదా, కైకేయి తండ్రికిచ్చిన మాట యెందుకు నిర్లక్ష్యం చేసారు? ఇదంతా కర్మఫలితమని అనుకోవాలా?”

“అంతే. కర్మఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. రాముడు అడవికి వెడితే, నీ అక్క అతని సహధర్మచారిణిగా అతని వెంట నడుస్తుంది. నీ భర్త కూడా వారిని అనుసరిస్తాడు. వాడు రాముడిని విడిచి వుండలేడు.”

ఆ మాటలతో ఊర్మిల గుండె గతుక్కుమంది.

“నేను ఒక వింత అనుబంధం గమనించాను. రామలక్ష్మణులు ఒక జంట, భరత శతృఘ్నులు మరొక జంట. అదెలా? లక్ష్మణ శతృఘ్నులు కవలలు కదా.”

“దానికి ఒక కారణం వుంది. పుత్రకామేష్టి యాగ ఫలితం ఒక గిన్నెడు పాయసం. రాజు గారు సంకల్పం చేసి దానిని కౌసల్యకు, కైకేయికి పంచి ఇచ్చారు.”

“మీకు ఇవ్వలేదా?”

“లేదు. నాకు ప్రాప్తం లేదనుకున్నాను. కానీ వాళ్ళిద్దరూ నా మీద ప్రేమతో తలో భాగం ఇచ్చారు. కౌసల్య భాగం లక్ష్మణుడు. అందుకే వాడు రామునికి దగ్గరయ్యాడు. కైకేయి భాగం శతృఘ్నుడు. వాడు భరతునికి దగ్గరయ్యాడు.”

“నేను నా భర్తతో వనవాసానికి వెళ్ళకూడదా?”

“లక్ష్మణుడు రాముని సేవకుడు. అందువల్ల నిన్నురావద్దని ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ పెద్దల సేవా బాధ్యతని నీకప్పగిస్తాడు. కాదనగలవా?”

“అటువంటి ఆజ్ఞలు ఇక్ష్వాకులకు శోభనివ్వవని నా అభిప్రాయం.”

“పురుషాధిక్యతను గౌరవించే రఘు వంశంలో ఆజ్ఞలే గాని విన్నపాలు వుండవు. భవిష్యత్తులో నీకు యెన్నో సవాళ్ళు యెదురవుతాయి. రాముడు వెళ్ళిన తర్వాత మహారాజు పుత్ర వియోగంతో ఈ లోకాన్ని విడిచి పెడతాడు. భరతుడు తల్లితో విభేదించి వనవాసానికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. అటు కౌసల్య, ఇటు కైకేయి జీవచ్చవాల్లా మిగిలిపోతారు. వారితో పాటే నేను. ఈ పరిస్థితుల్లో నీవే మా ఇంటి దీపానివవుతావు. అంతఃపురాల నిర్వహణ భారం నీ మీద పడుతుంది. భరతుడు, నీ మేధస్సుని రాజ్య పాలనకు ఉపయోగించుకుంటాడు.”

సుమిత్ర భవిష్యద్దర్శనంతో అవిష్కరించిన స్థితిగతులను ఆకళింపు చేసుకుని నిశ్చేష్టురాలైంది ఊర్మిళ.

***

కాలక్రమేణా, సుమిత్ర కాలజ్ఞానం నిజమని నిరూపితమైంది. అయోధ్య చిన్నబోయింది.

“సుమిత్రా! ఆ నాడు నీవు చెప్పావు. నేను వినలేదు. అందరి అసహ్యాన్ని మూటగట్టుకుని, కుమిలిపోతున్నాను” అని కైక, “సుమిత్రా! నీ మాట వినకుండా కైకతో శతృత్వం నెరపాను. నీలా ఆమెతో ప్రేమగా వుంటే నాకీ దుర్గతి పట్టేది కాదు” అని కౌసల్య, వాపోతూంటే సుమిత్ర, మనోధైర్యానికి, చిత్తరువులా నిలిచి. వారికి ఉపశమన వాక్యాలను చెప్పింది. గురువై వేదాంతాన్ని బోధించి వారిని పునరుజ్జీవింప చేసింది.

సుమిత్ర నిస్వార్థపరురాలు. అందుకే ఆమె కొడుకుని పోగొట్టుకోలేదు. వనవాసానికి వెళ్ళడానికి వచ్చి సౌమిత్రి, నమస్కరించినప్పుడు ఆమె “నీ జీవితాన్ని సోదర ప్రేమకు ఆదర్శంగా, తరతరాలు చెప్పుకుంటారు” అని ఆశీర్వదించి పంపింది.

తాను ప్రాణ ప్రదంగా ప్రేమించే అక్క సీత, భర్త లక్ష్మణుడు దూరమయ్యారన్న బాధతో తల్లడిల్లిపోతున్న ఊర్మిళను, స్థితప్రజ్ఞరాలైన సుమిత్ర, ఓదారుస్తూ ఇలా కర్తవ్య బోధ చేసింది.

“విరహం కూడా ఒక రకమైన ప్రేమ. ఆ ప్రేమ భావన నీలో పదిలంగా భద్రపర్చుకో. దానిని ఆలంబనగా చేసుకుని సంతోషంగా వుండు. నీ ప్రజ్ఞా పాటవాలు, నీ అభిరుచులు, నీ ఆశయాలు, నీతోనే వున్నాయి కదా! వాటితో నీ జీవితాన్ని నిర్మించుకో.”

ఒకసారి చెల్లెలు శృతకీర్తితో, అత్తగారి ని ప్రశంసిస్తూ ఊర్మిళ ఇలా చెప్పింది.

“అంధకారం అలముకున్నప్పుడు మనం ఒక చిరుదీపం కోసం వెదుకుతాం. నాకు మన అత్త రూపంలో, సూర్యచంద్రులే లభించారు. ఆమె జ్ఞాని. ఒక తత్వవేత్త. ఆమె ప్రేమ నిధానం. ఒక ప్రియ బాంధవి. ఆమె మనకు గురువు, ఆమె వెంట నడిచి, జీవిత పరమార్థాన్ని గ్రహించి మసలుకుందాం. నిజానికి ఆమె నీకూ నాకే కాదు, స్త్రీలోకానికే మార్గదర్శి.”

Exit mobile version