[బాలబాలికల కోసం ‘మార్గమధ్యంలో తుక్కు’ అనే పద్యకథ అందిస్తున్నారు వి. బి. సౌమ్య.]
(మాఘ మాసం అంటే మనకి దాదాపు జనవరి-ఫిబ్రవరి ప్రాంతంలో ఉంటుంది అనుకుంటే కెనడాలో చాలా ప్రాంతాల్లో అది మంచు బాగా కురిసే కాలం. అలాంటి ఒక ఊరు దేశరాజధాని అటావా. ఈ కథ అక్కడ సాగుతుంది).
~
మాఘపు ఆటవా మంచును చూడగ
ముచ్చట గొల్పుతు ముదము నిచ్చు
నడువగ అడుగేసినప్పుడు మాత్రము
జాగ్రత్త తప్పిన జారిపోవు;
బతుకంత నడిచేటి బాటయిదె కనుక
వెరుపులు జడుపులు విడిచి పెట్టి
కోటుల బూటుల కోటలు కట్టుకు
కదులుట తప్పదు కడకు యిచట (సీసం)
అట్లు కదిలెను ఒకపాప అమ్మతోడ
మంచు ఎండ కూడిన ఒక మంచిరోజు;
నవ్వుల నడుమ సాగెడి నడక లోన
దారిన పడియున్నట్టొక దాన్ని జూసి – (తేటగీతి)
చూడుమా నువ్విటు చూడుమని యనుచు
తల్లిని లాగుతూ తనయ పిలిచె;
ఏమున్నదచ్చట ఏమున్నదనుకుంటు
ఆదిక్కు తిరిగేను అమ్మ కనులు.
మంచుదుప్పటిపైన మచ్చలా ఒకటుంది
మెరుపంటి లోహపు మేను తోడ;
పరికించి చూడగా పచ్చటి జిలుగుతో
కనిపించె సోడాల క్యాను ఒకటి! (సీసం)
అచట వారగా ఉన్నయా క్యాను చూపి
“చెత్త నిట్టుల ఎవ్వరు చేర్చరాదు,
తీసి రీసైకిలుకి నువ్వు తీసుకెళ్ళు”
అంటు అమ్మకి కూతురు ఆర్డరేసె (తేటగీతి)
“మంది వేసిరి చెత్త మనకేల ఆగోల?”
అనుకుంటు గొణిగింది అమ్మ వినుచు.
“అట్లెప్పు డనుకోకు అదితప్పు అదితప్పు!”
కోపంగ చూసెనా కూతురపుడు.
“ఇదితీసి మరినేను ఏచోట వేసేది?
ఇదిరోడ్డు ఓతల్లి, ఇల్లు కాదు”
కోపగించకతల్లి గోముగా చెప్పగా
ఇంతలో అమ్మాయి ఇట్లు పలికె: (సీసం)
“వేస్టు రోడ్డుపై పడవేయు విధము తప్పు,
పుడమి తల్లికి కలిగేను భూరి ముప్పు.
మంది చేసిన చేటును మాపు చేసి
ఇంట పడవేసెదము దీనినిపుడు మనము” (తేటగీతి)
“సరిసరి నీమాట సరియై నదోతల్లి!
తప్పేలె ఈపని తప్పకుండ!
నీ మాట మన్నించి నేతీసి దీనిని
యింటిబిన్నందున యింక వేతుఁ
తల్లికి ఎట్లైన తప్పని పనులివి”
అనుచునా అమ్మడి అమ్మ యింక
నిట్టూర్పు విడుచుచు నిర్లిప్తతనుచేర్చి
ఛీయనకాక్యాను చేతబట్టె. (సీసం)
చిట్టి వేళ్ళను రెండవ చేత బట్టి
మనమిక బడికి పోయెదమనుచు తల్లి
వీరి మాటల మధ్యన వెనుక జూడ
ఒకరు వీరిని బిల్చెచెయ్యూపుతూను (తేటగీతి)
“బహుకాల దర్శనం, బాగేన అందరూ?”
అనుచు వచ్చిరొకరు అచట నుండి
కుశలము లయ్యాక కుదురుగా నిలబడి
“ఏమిటా చేతిలో, ఏమి యుంది?”
అనియడుగంగనే అమ్మ చెప్పె విషయం.
అంతటాయన చూసి అచ్చెరువుగ,
అధరాన చిరునవ్వు అలరారు తుండగా
పాపనే చూస్తూను పలికె నిటుల: (సీసం)
“నువ్వు అన్నది నిజమునే నొప్పుకుంట
నా యిలు బయట కనిపించినదిది కాన
నాదు బిన్నున నేపడవేతు దీని.
నిమ్మళముగ వెళ్ళమ్మలు నీవు యింక!” (తేటగీతి)
ఆమాట విన్నంత అమ్మాయి కన్నుల
ఆనంద మేనిండె అందముగను.
కిలకిల మనుచూను కేరింత లాడుచూ
దల్లి చేతులనున్న దానిలాగి
ఆక్యాను యిచ్చేసె నాపాప యతనికి..
హమ్మయ్య! అనుకునె అమ్మ అపుడు! (సీసం)
మంచి తలపులు ఎప్పుడూ మాను కోకు
అనుచు అమ్మాయికోమాట అతడు చెప్పె
నెమ్మి తోడను అతనికి నెనరు తెల్పి
అంతటిరువురు కదిలిరి అచట నుండి (తేటగీతి)
