Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరిచిపోలేని జర్మనీ యాత్ర

“అనేక సంఘటనలకు, అనేక ప్రత్యేకతలకు, మరెన్నో జ్ఞాపకాలకు కారణమైన ఆ నేలపై కాలుమోపబోతున్నాను అనగానే సహజంగానే ఉద్వేగం, ఆనందం అన్నీ కలగలిసి వచ్చాయి” అంటూ తమ జర్మనీ పర్యటన గురించి వివరిస్తున్నారు నర్మద రెడ్డి

క చారిత్రక సందర్భంలో మా జర్మనీ యాత్ర కొనసాగింది. ఒకవైపు తెలుగు నేల పైన ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో మేము జర్మనీకి బయలుదేరాం. నిజానికి జర్మనీ అంటే బెర్లిన్ నగరం గుర్తుకు వస్తుంది. అక్కడి ప్రజల్ని రెండుగా చీల్చిన గోడ గుర్తుకు వస్తుంది. మా మధ్య ఈ అడ్డుగోడలు ఎందుకు అని ప్రజలంతా తిరగబడి ఆ గోడను కూల్చివేసిన వీరోచిత పోరాటం గుర్తుకు వస్తుంది.

కానీ మేము నివసిస్తున్న తెలుగు నేలలో పాలకులు చేసిన తప్పిదాల వల్ల ‘మమ్మల్ని విడదీయండి’ అంటూ ఒక ప్రాంతం ప్రజలు ఉద్యమిస్తున్న సమయంలో మేము జర్మనీ యాత్రకు బయలుదేరాం. మొదట హైదరాబాద్ నుండి ఫ్రాంక్‌ఫర్ట్ వరకూ, అక్కడి నుండి జర్మనీ రాజధాని బెర్లిన్‌కు బయలుదేరాం. ఆ దేశానికి బయలుదేరుతున్నాం అనగానే దారిపొడుగున అనేక జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా చుట్టుముట్టాయి. ఎన్ని జ్ఞాపకాలని చెప్పనూ. ఒకటా రెండా.. చిన్నప్పుడు స్కూల్ రోజుల నుండి జర్మనీ గురించి పాఠ్యపుస్తకాల్లో చదువుకుంటూ పెరిగిన నాకు ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు. అవన్నీ ఒకదగ్గర కుప్పపోస్తే నాకు తెలిసిన జర్మనీ అవుతుందేమో..

జర్మనీ అనేది మధ్య ఐరోపాలో ఉండే ఒక దేశం. అంతేనా…? అంతే అయితే ఇన్ని జ్ఞాపకాలు ఎందుకూ..!? ప్రపంచానికి ఎంతోమంది తత్వవేత్తల్ని శాస్త్రవేత్తల్ని అందించిన నేల అది. అది మాత్రమే కాదు ప్రపంచానికి ఒక నియంతను చూపించిన నేల కూడా అదే. అంతటితో అయిపోలేదు. రెండో ప్రపంచ యుద్దానికి కారణమైన నేల. లక్షలాదిమంది ఊచకోతకు కారణమైన నేల కూడా అదే. తోడబుట్టిన వారు, బంధువులు మధ్య అడ్డుగోడను నిర్మించుకున్న నేల కూడా అదే. ఇన్ని సంఘటనలకు, ప్రత్యేకతలకు కారణమైన ఆ నేల సహజంగానే అనేక జ్ఞాపకాలకు కారణమవుతుంది. అటువంటి నేలపై కాలుమోపబోతున్నాను అనగానే సహజంగానే ఉద్వేగం, ఆనందం అన్నీ కలగలిసి వచ్చాయి.

మేము ప్రయాణిస్తున్న ఫైట్ బెర్లిన్ విమానాశ్రయంలో వాలిపోగానే అక్కడి నుండి మా ప్రయాణం మొదలైంది. బెర్లిన్ గురించి కొంత చెప్పుకోవాలి. బెర్లిన్ జర్మనీ దేశ రాజధాని నగరం. ఆ దేశంలోని అతి పెద్ద నగరం కూడా ఇదే. అయితే ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో జర్మనీ రెండు భాగాలుగా విభజింపబడి ఉన్నందున పశ్చిమ జర్మనీకి ‘బాన్’ రాజధానిగా ఉంటే, తూర్పు జర్మనీకి ‘తూర్పు బెర్లిన్’ రాజధానిగా ఉండేది. అయితే జర్మనీ ఏకీకరణతో బెర్లిన్ రాజధానిగా మారిపోయింది. ప్రస్తుతం బెర్లిన్ నగర జనాభా సుమారు 35 లక్షలు. ఇక్కడి నుండే ఒక రకంగా మా జర్మనీ యాత్ర మొదలైందని చెప్పవచ్చు. మొదట మేము స్టర్డ్‌గార్డ్‌కు ట్రైన్‌లో వెళ్లాము. మన నిత్యజీవితంలో భాగమైన బట్టలు, బూట్లూ మొదలూ లగ్జరీ కార్ల వరకూ అన్నీంటికి ఈ నగరం ఫేమస్. అడిడాస్, మెర్సిడెజ్ బెంజ్ కార్లు ఇక్కడినుండి వివిద దేశాలకు సప్లయ్ అవుతాయి. ఈ నగరంలో ఒక రాత్రి ఉన్నాము. ఆరోజు మేము అక్కడ మెర్సిడెజ్ బెంజ్ కారు మ్యూజియాన్ని చూసుకొని మధ్యాహ్ననికి సిటీ సెంటర్‌కి వెళ్లాం.

     

మేము వెళ్లిన రోజు అదివారం కావడంతో అక్కడ చాలా మంది చేరి ‘బీయర్ ఫెస్టివల్’ చేసుకుంటున్నారు. సంగీత వాయిద్యాలతో ఆ ప్రాంతం అంతా మారుమ్రోగిపోతుంది. కొంతమంది హిట్లర్ కాలం నాటి యుద్ధంలో వాడిన డాలు, కత్తి, కవచాలను ధరించి, నెత్తిపై టోపీ పెట్టుకొని తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. వాటిని చూస్తుంటే అలనాటి సైనిక యోధుడిని తలపిస్తున్నాయి. కొంతమంది మాత్రం జర్మనీ దేశానికి సంబంధించి ఆ దేశ సంస్కృతికి సంబంధించిన బట్టలు ధరించి వారి దేశ భక్తిని, అలనాటి రోజులను గుర్తుకు తెస్తూ అటూ, ఇటూ తిరుగుతున్నారు. కొంతమంది యువతులు పొడవాటి గౌన్లను ధరించి, పైన స్కార్ఫ్, నడుముకు సన్నని తాడును కట్టుకొని ఒక చిన్న కుచ్చులులాగ వేలాడదీసి హొయలు ప్రదర్శిస్తున్నారు. వారి డ్రెస్సులను, డ్యాన్సులను చూస్తూ, ఆ యుద్ద వీరుల డ్రెస్సులను, వారి విన్యాసాలను చూస్తూ ఆనందించాం. అక్కడే దొరికే ఫుడ్ తిని అక్కడి నుండి మేము విడిది చేసిన రిసార్ట్‌కు వెళ్లాం.

ఉదయాన్నే ‘ఉబర్‌మెర్‌గావ్’ అనే గ్రామానికి వెళ్లాం. ఈ గ్రామం నాలుగు వందల సంవత్సరాల పురాతనమైనది. జర్మనీ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు ఆ గ్రామంలో అణువణువున కనిపిస్తాయి. మేము ఈ గ్రామానికి చేరగానే రాగితో చేసిన బొమ్మలు, ఒక అమ్మాయి బొమ్మ, రెండు జింక బొమ్మలు కనిపించి ఆసక్తిని పెంచాయి. ఒకవైపు ప్రపంచం ఆధునిక పోకడలవైపు పరుగులిడుతున్న జర్మనీ ప్రజలు తమ మూలాలను కాపాడుకుంటున్న విధానం ఈ గ్రామంలో ప్రత్యక్షంగా కనిపించింది మాకు.

అక్కడినుండి మేము జర్మనీలో ‘మ్యూనిక్’ వెళ్లాం. ఈ నగరంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త ‘ఐన్‌స్టీన్’ పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకప్పుడు బవేరియా ప్రాంతానికి రాజధానిగా ఉండేది. పారిశ్రామిక ప్రాంతంగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న కారణంతో ఎక్కువమంది ఈ నగరానికి ఒకప్పుడు వలస వచ్చేవారు. అలా వలస వచ్చినవాళ్లలో ఐన్‌స్టీన్ కుటుంబం కూడా ఒకటి. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు కేంద్రంగా ఉన్న ఈ నగరానికి మన తెలుగువాళ్లు కూడా బాగానే వస్తుంటారట. గత సంవత్సరం ఇక్కడి తెలుగు వాళ్లు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారని తెలిసింది. అయితే మ్యూనిక్ ఎంత అందంగా ఉందంటే ఆ నగరంలోకి దిగగానే నాకు చాలా నచ్చేసింది.

సెప్టెంబర్ ఫెస్ట్..

మ్యూనిక్ వెళ్ళిన వాళ్లు తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి ఈ సెప్టెంబర్ ఫెస్ట్. ఇక్కడ సెప్టెంబర్ వచ్చిందంటే చాలు అక్కడి జనాలకు, ప్రపంచ దేశాల్లోని ఔత్సాహిక పర్యాటకులకు పండగే పండగ. ఎందుకంటే అక్కడో పెద్ద పండగ జరుగుతుంది. దాని పేరే మ్యూనిక్ అక్టోబర్ ఫెస్ట్. 16 రోజుల పాటు జరిగే ఈ పండగను అక్కడి జనం ‘వీనస్’ అని పిలుచుకుంటారు. ఏటా సెప్టెంబర్ మూడో శనివారం ప్రారంభమై అక్టోబర్ మొదటి ఆదివారంతో ముగుస్తుంది. ఈ ఉత్సవాలకు హాజరయ్యేందుకు గతేడాది నుండి భారతీయులు భారీగా వెళుతున్నారని తెలిసింది.

గతేడాది ఈ ఉత్సవాలకు దాదాపు 65 లక్షల మంది ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చారట. అక్కడ జరిగిన అమ్మకాల విలువ బిలియన్ యూరోలు ఉంటుందని అంచనా. ఫెస్టివల్ ప్రారంభానికి ముందు మ్యూనిక్ నగరం మధ్య నుంచి ఈ ఉత్సవం జరిగే ప్రదేశం వరకు గుర్రాల ఊరేగింపు ప్రారంభ సూచకంగా నిర్వహిస్తారు. ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొనడాన్ని స్థానిక బవేరియన్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో వ్యవసాయ ప్రధానమైన జానపద కళారూపాలను ప్రదర్శిస్తారు. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగిన సమయాల్లో ఈ ఉత్సవాలను ఆపేశారు. ఆ తర్వాత 1950 నుండి అక్టోబర్ ఫెస్టివల్ జరుగుతూ వస్తోంది. ఈ వేడుకులను అక్కడి మేయర్‍తో ప్రారంభింపజేయడం ఆనవాయితీ. పెద్ద పెద్ద గుడారాలను నిర్మించి ప్రముఖ మద్యం కంపెనీలు మద్యాన్ని సరఫరా చేస్తాయి. అయితే ఈ మద్యం మాత్రమే కాకుండా అక్కడి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని నిర్వహకుల తాపత్రాయం. అక్కడ మాత్రమే దొరికే బీర్ అంటూ ప్రత్యేకంగా కుళాయి ద్వారా పెద్ద పెద్ద గ్లాసుల్లో నింపుకుని తాగడం అక్కడి ప్రత్యేకత. ఈ బీరు పేరు గోల్డెన్ అంటారు. ఇవి మాత్రమే కాదు రకరకాల సంప్రదాయక వంటకాలతో అక్కడికి వచ్చిన వారి నోరూరిస్తూ కనిపిస్తుంటాయి.

ఈ ఫెస్టివల్‌కు కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. 1810 అక్టోబర్ 12న ఇక్కడి బవేరియా రాజకుమారుడు లుడ్విన్ సమీప రాకుమారి థెరిసెతో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఖదీదైన వినోదాలు మళ్లీ జరపాలనే ఆలోచన నుండి ఆవిర్భవించిందే ఈ ఆక్టోబర్ ఫెస్టివల్. ఈ పెళ్లి మొదటి వార్షికోత్సవం సందర్భంగా జరిగిన గుర్రాల పరుగు పందేలు చాలా కాలం వరకు జరిగాయి. ఇప్పటికీ ఫెస్టివల్ ప్రారంభంలో జరిగే బ్రెవరీ కంపెనీల ఊరేగింపుల్లో గుర్రాలు ముందు నడుస్తూ కనువిందు చేస్తాయి.

మ్యూజికల్ క్లాక్…

మ్యూనిక్‌లో చూడదగ్గ వాటిలో ‘మ్యూనిక్ టవర్’ ఫేమస్. అక్కడికి వెళ్లాం. మేము అక్కడికి వెళ్లే సమయానికే ఒక వెయ్యిమంది వరకూ జనం గుమిగూడి ఉన్నారు. అందరూ ప్రయాణికులే. మేము వారితో చేరిపోయాం. అందరూ పైకి తలఎత్తి దేన్నో చూస్తున్నట్లు అనిపిస్తే మేము అటువైపు చూశాం. ఆ టవర్‌పై ఒక పెద్ద గడియారం ఉంది. ప్రతి గంటకు ఒకసారి ఒక అమ్మాయిలాంటి బొమ్మ వచ్చి గంట కొట్టి వెళుతుందట. దానికోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందరీ ఆతృత్త చూస్తుంటే మాకు కూడా చూడాలనే కోరిక కలగడంతో ఏం జరుగుతుందో చూద్దాం అని వెయిట్ చేశాయి. సరిగ్గా గంట అయ్యిందో లేదో ఆ గడియారంలో ఒక అమ్మాయిలాంటి బొమ్మ వచ్చి ఆ అమ్మాయి చక్కగా వచ్చి టింగ్ టింగ్, టింగ్ టింగ్ అని కొట్టడం చూసి చాలా సంబరపడిపోయాను చిల్లపిల్లలాగ. చాలా బాగా అనిపించింది దాన్ని చూస్తుంటే. అయితే దీన్ని చూసినప్పుడు నాకు మన సాలార్‌జంగ్ మ్యూజియంలో ఉన్న మ్యూజికల్ క్లాక్ గుర్తుకు వచ్చింది. సాలార్‌జంగ్ మ్యూజియం చూడటానికి వచ్చిన వాళ్లు కూడా అక్కడంతా తిరిగి సరిగ్గా గంట కొట్టే సమయానికి ఆ క్లాక్ దగ్గరకు వచ్చి ఇలాగే వేయిట్ చేస్తారు కదా అనిపించింది నాకు. బహుశా ఇటువంటి దాన్ని చూసి ముచ్చటపడి కావచ్చు మూడవ సాలార్‌జంగ్ 200 సంవత్సరాల నాటి ఆ గడియారాన్ని మన దగ్గర కూడా ఉండాలని దాన్ని కొనుగోలు చేసి తీసుకొచ్చి ఉంటాడు అనిపించింది దీన్ని చూస్తే.

ఆ తర్వాత మేము ఆ టవర్ చూట్టూ అన్ని వైపుల ఉన్న వందల షాపులు చూసుకుంటూ తిరిగాము. ఇక్కడ కొన్ని షాపుల్లో అయితే బీరును పీపాల్లో పోషి ఉంచారు. దానికి ఒక పైపు పెట్టి అందరూ ఒక గ్లాసులో పోసుకుని తాగుతూ ఉన్నారు. అలా తాగడం మ్యూనిక్ నగరవాసుల వారసత్వంగా వచ్చిన అలవాటు అని తర్వాత తెలిసింది. అక్కడి నుండి బెర్లిన్ బయలుదేరాం.

చరిత్రకు సాక్షి బెర్లిన్ స్టేషన్…

ఇక్కడ బెర్లిన్ స్టేషన్ గురించి కాస్త చెప్పుకోవాలి. ఇది ఓ పెద్ద బహుళ అంతస్థుల షాపింగ్ మాల్‌లా ఉంది. కిందా పైనా కూడా ట్రైన్లు కనపడ్డాయి. ఒకటి ఇక్కడి లోకల్ ట్రైన్లకూ, మరొకటి బయట ట్రైన్లకూ అనుకుంటా. ఇది యూరప్లోని అతి పెద్ద స్టేషన్లలో ఒకటి అట. అత్యాధునికంగా ఉన్న ఈ భవనం బయట కొస్తే, ఒక వింత ఆకారంలో ఉన్న విగ్రహం ఉంది. అక్కడ రాసి ఉన్నది చదివితే తెలిసింది. దీని చరిత్ర. ప్రస్తుతం ఉన్న బెర్లిన్ స్టేషన్ 2006లో పూర్తయింది. ఇప్పుడీ స్టేషన్ ఉన్న చోట ఒకానొకప్పుడు ల్యేటర్ స్టేషన్ ఉండేది. 1871లో నిర్మితమైన ఈ స్టేషన్ అప్పట్లో చాలా ముఖ్యమైన కూడలి. అయితే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బాగా దెబ్బతింది. తరువాత, కొన్నాళ్లు కాస్త తక్కువ స్థాయిలో నడిచినా, మళ్లీ ఆగిపోయింది. అందులోనూ, తూర్పు పశ్చిమ జర్మనీల విభజన జరిగాక పశ్చిమ జర్మనీ రైల్వే లైన్లు తూర్పు జర్మనీ చేతిలో ఉండటంతో, దీన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఎనభైల్లో కొంత పునర్నిర్మాణం జరిగినా, జర్మనీలు రెండూ కలిసిన కొన్నేళ్లకు, పాతదాని స్థానంలో ఇప్పటి స్టేషన్ రూపు దిద్దుకుంది. ఇక్కడి నుంచి నడిచే దూరంలోనే, జర్మన్ చాన్సెలర్ అధికారిక కార్యాలయమూ, జర్మన్ పార్లమెంటూ ఉన్నాయి. 1894లో కట్టిన ఈ పార్లమెంటు భవనం అప్పట్నుంచీ జర్మన్ చరిత్రలో కలిగిన చాలా మార్పులకు ప్రత్యక్ష సాక్షి.

అయితే ఈ బెర్లిన్‌కి గ్రీన్ సిటీ అని పేరు. బెర్లిన్‌లో ఎంత ఖరీదైన జీవితాన్ని అనుభవించవచ్చో, సామాన్యమైన జీవితం కూడా అంతే సౌకర్యంగా ఉంటుంది. బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్స్ ఉంటాయి. వాటిలో చాలా తక్కువ ఖర్చుతో రోజులు గడపవచ్చు. చదువు, ఉద్యోగం కోసం వచ్చిన వాళ్లు ఆర్థికంగా స్థిరపడే వరకు ఇలా గడిపేయవచ్చు. తక్కువ ఖర్చు కాబట్టి కనీస సౌకర్యాలు, పరిశుభ్రత లోపం వంటివేమీ ఉండవు. సాధారణ వసతులతో శుభ్రంగా, సౌకర్యంగా ఉంటాయి. బెర్లిన్‌లో మంచి ఆహారం దొరుకుతుంది. స్థానిక భోజనం నుంచి కాంటినెంటల్ అన్ని రకాలూ దొరుకుతాయి. ఇండియన్ ఫుడ్‍లో చాలా రకాలుంటాయి. ఇండియన్లు నడుపుతున్న రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.

మేము ‘బ్యాక్ ప్యాకర్స్’ ఎక్కువగా ఉండే ఒక యూత్ హాస్టల్ కు వెళ్లాము. ఒకరోజు కేవలం 500 రూపాయలు మాత్రమే చార్జ్ చేశారు ఒక్కొక్కరికి. ఒక రకంగా చాలా చవక అనుకోవాలి. అందులో వండుకోవటానికి కూడా కింద హాలు లాగా ఉంది. అక్కడ మేము చక్కటి పులిహోర వండుకొని కొంత తిని రెండు బాక్సుల్లో సర్దుకొని బెర్గిన్ నగరాన్ని చూడటానికి బయలుదేరాం.

చారిత్రక బెర్లిన్ గోడ…

బెర్లిన్ నగరం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది అక్కడి ప్రజల్ని రెండుగా చీల్చిన గోడ. చరిత్రలో ఆ గోడకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్న విషయం చాలా మందికి తెలుసు. బెర్లిన్‌లో దిగిన వెంటనే ఆ గోడ ఎలా ఉందో చూద్దామన్న కుతూహలం నన్ను ఒక దగ్గర నిలువనివ్వలేదు. తీరా అక్కడికి వెళ్లి దాన్ని చూసిన వెంటనే మాత్రం మొదట కాస్త నిరాశ కలిగింది. ఈ చిన్న గోడ గురించి ఇంత పెద్ద మారణహోమం జరిగిందా? దీని గురించేనా నేను పుస్తకాల్లో చదువుకుంది అన్న అనుమానం కలిగింది. పొరపాటున వేరే దగ్గరకు వచ్చామా అనే ఆలోచన కూడా కలిగింది. కానీ మాలాగే చాలా మంది దేశ విదేశాల నుండి వచ్చిన యాత్రికులు, సందర్శకులు దీన్ని చూడటానికి రావడంతో ఇదే చరిత్రలో నిలిచిపోయిన ఆ బెర్లిన్ గోడ అనే నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. అయితే ఈ గోడ వెనుక కథలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా అగ్రరాజ్యాలు ఎలాంటి రాజకీయాలను పాల్పడుతాయో, ప్రజల జీవితాలతో చెలగాటమాడతాయో ఈ బెర్లిన్ గోడ ప్రత్యక్ష ఉదాహారణ.

చరిత్ర చెప్పిన కథ…

ప్రపంచదేశాల మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. కానీ, ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. రష్యా వైపు కొన్ని దేశాలు, అమెరికా వైపు కొన్ని దేశాలు నిలిచాయి. అయితే జర్మనీ మాత్రం ప్రచ్ఛన్న యుద్ధంలో వేరుపడి వేదనకు గురయింది. ఒకే దేశ పౌరులు శత్రువుల్లా వేరుపడాల్సి వచ్చింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ పాశ్చాత్యులు ఒకవైపు – రష్యా, సామ్యవాద దేశాలు ఒకవైపు నిలిచి జర్మనీని విభజించి పాలించాయి. దీంతో అది తూర్పు-పశ్చిమ జర్మనీలుగా విడిపోయింది. దీంతో పక్కవీధి వాళ్లే పరదేశీయులయ్యారు.

పశ్చిమ జర్మనీ ప్రజలు ప్రాశ్చాత్య దేశాల పాలనలో కొత్త ధనం వైపు పరుగులిడుతుంటే, తూర్పు జర్మన్లు సోవియట్ సామ్యవాద పాలనలో భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కాని అయోమయంలో పడ్డారు. చూస్తుండగానే పశ్చిమంలో అనూహ్యంగా మార్పులొచ్చాయి. జీవన ప్రమాణాలు బాగా పెరిగాయి. దీంతో తూర్పు జర్మన్లు పశ్చిమ జర్మనీకి తరలివెళ్లడానికి మొగ్గు చూపారు. వలసలు మొదలయ్యాయి. మొదటి ఏడాది 2 లక్షల మంది, రెండో ఏడాది లక్షన్నర మంది వలసవెళితే, 1953లో తొలి ఆరునెలల్లోనే వలసలు రెట్టింపై మూడున్నర లక్షలకు చేరాయి. దీంతో ప్రభుత్వం ఆకస్మిక చర్యలు చేపట్టింది. అది కూడా సెలవు రోజుల్లో నగరం నడిబొడ్డున సరిహద్దు వెంబడి శుక్రవారం అర్థరాత్రి 1961 ఆగస్టు 13న హఠాత్తుగా సరిహద్దులు మూసేసింది. మరుసటి రోజు కంచె వేసింది. దశల వారీగా సరిహద్దు వెంబడి బెర్లిన్ నగరాన్ని విభజిస్తూ 106 కిలోమీటర్ల పొడవైన గోడను, 12 అడుగులు ఎత్తుతో నిర్మించి, 302 వాచ్ టవర్ల ద్వారా నిరంతరం గస్తీ వేసేవారట. ప్రపంచం దీనిని ‘ఐరన్ కర్టెన్ ఆఫ్ కోల్డ్ వార్’ అని పిలుచుకుంది. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా గోడకట్టి వలసలను ఆపడంపై అంతటా వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, 1987లో అసంతృప్తి జ్వాలలు తారస్థాయికి చేరి నిరసనలు మొదలయ్యాయి. క్రమంగా నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. గోడ దాటడానికి ప్రయత్నించిన వారిపై సరిహద్దు బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరపగా 192 మంది చనిపోగా 200 మంది గాయపడ్డారు. ఎలాగైన వెళ్లాలని భావించిన ప్రజలు హంగేరీ, ఆస్టియాల మీదుగా సుమారు 900 మంది తూర్పు జర్మన్లు పశ్చిమ బెర్లిన్‌కు తరలివెళ్లారు. ఈ సంఖ్య మరుసటి నెలలో పదివేలకు చేరింది. ఈ సంఘటన జరిగిన కొద్దినెలలకే తూర్పు జర్మనను పాలిస్తున్న సోవియట్ ప్రభుత్వం మెట్టు దిగింది. పంతం వదిలి 9 నవంబర్ 1989న పశ్చిమానికి వెళ్లడంపై ఉన్న నిషేధం ఎత్తివేసింది. ప్రకటన వెలువడిన కొద్దిగంటల్లో ప్రజలే గోడను కూల్చడం మొదలెట్టారు. ఈ గోడ పతనంతో పశ్చిమ, తూరు జర్మనీలు మళ్లీ ఒకటయ్యాయి. ప్రపంచం దీనిని ‘రీయూనిఫికేషన్’ అని పిలువగా జర్మన్లు మాత్రం ‘టర్నింగ్ పాయింట్’ అన్నారు. అక్టోబర్ 3న అర్థరాత్రి 12 గంటల నుండి రెండూ కలిసి ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీగా అవతరించాయి.

జర్మనీ వాళ్లు ప్రతి యేట ఈ రోజున సంబురాలు చేసుకుంటారు. తర్వాత ఈ గోడను నెమ్మదిగా చిన్న చిన్న భాగాలుగా పగులగొట్టి దాన్ని నేల మట్టం చేశారు. అయితే కొద్ది భాగాన్ని మాత్రం ప్రభుత్వం తొలగించింది. ఈ తొలగింపులోనే అక్టోబర్ 1990లో జర్మనీ ఒక దేశంగా ఐక్యం అయ్యింది. ఈ గోడను ఎప్పుడైతే పగులగొట్టారో జర్మనీ దేశస్తుల తలా ఒక ఇటుకను తెచ్చుకొని ఇండ్లలో పెట్టుకొని వాళ్ల పిల్లలకి, మనువరాండ్లకి, కొత్తగా వచ్చిన టూరిస్టులకి, అథితులకు అందరికి కథగా చెప్పడం మొదలెట్టారట. కథలు కథలుగా చెప్పుకుంటారట. అమెరికాలోని ‘మ్యూజియమ్’లో కూడా గోడ కొంత భాగాన్ని భద్రపరిచారట. సో ఈ గోడకి అంతపెద్ద చరిత్ర ఉంది.

కూల్చిన ప్రజలే అడ్డుకుంటున్నారు…!

అయితే ఈ బెర్లిన్ గోడకు సంబంధించి ఇప్పుడొక విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకనాడు తమ మధ్య అడ్డుగోడగా ఉన్నదని కూల్చిన ప్రజలే ఇవాళ దాని పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. రోజు రోజుకు బెర్లిన్ నగర అవసరాల రీత్యా కొత్త కొత్త కట్టడాలు వెలుస్తున్న సమయంలో 2013లో ఓ లగ్జరీ అపార్టుమెంటు నిర్మాణం కోసం గోడలో సుమారు ఒకటిన్నర కిలోమీటరు పొడవునా గోడను తొలగిస్తే ప్రజలంతా తిరగబడి ఆ కూల్చివేతను అడ్డుకున్నారట. అక్కడి పాలకులు చేసేదేమీ లేక అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో కూల్చివేత కార్యక్రమం మొదలు పెట్టి తెల్లవారేసరికి దాని కూల్చివేతను పూర్తిచేశారట..!

వంద అడుగుల పొడువున్న ఆ గోడ ఇవాళ చిన్న పిట్లగోడగా, శిథిల శకలంగా మిగిలిపోయినప్పటికీ నిత్యం సందర్శకుల తాకిడితో తన చరిత్రను కథలు కథలుగా వినిపిస్తూనే ఉంది.

ఆ గోడను చూస్తూ కిందికి వస్తుంటే ప్రస్తుతం ఉన్న బెర్లిన్ గోడ ఆనవాళ్ల కింద, చెక్ పాయింట్ చార్లీ వద్ద మాత్రం గోడ శిధిలాలతో ఒక ప్రైవేటు మ్యూజియం ఉంది. అక్కడ నాజీ దారుణాల గురించి తెలిపే ప్రదర్శన వంటిది ఏర్పాటు చేశారు అక్కడ. అవన్నీ చదువుతూ ఉంటే, ఆవేశం, అయోమయం, బాధ, ద్వేషం, భయం, దిగ్ర్భాంతి అన్నీ ఒకేసారి కలిగాయి. (చేసినవాళ్లు) వీళ్లూ మనుషులేనా? ఏమిటీ మూర్ఖత్వం? అనిపించింది. అయితే, గోడ చివర నుంచి ఈ చివర వరకూ నడుస్తూ, కింద ఈ ప్రదర్శన చివరికి వచ్చేసరికి, కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాం. అక్కడిదాకా, నేను బెర్లిన్ నగరాన్ని పెద్ద చరిత్ర ఉన్న నగరంగా చూస్తూ వచ్చా కానీ, అప్పటినుండి కొత్త గౌరవం కలగడం మొదలైంది. ఇన్ని దారుణాలు చూసి, సర్వనాశనానికి గురై, ఎన్నో ఊచకోతలను చూస్తూ యుద్దాలకు ముక్కలై, మళ్లీ మరణాలనూ, అశాంతులనూ అనుభవించి, సుఖమన్నదే ఈ దేశ చరిత్రలో లేదేమో అన్నట్లు ఉన్న పరిస్థితుల నుండి, ఇప్పటి బెర్లిన్‌గా మారిన తీరు అద్భుతం అనిపించింది.

అమెరికన్ లేడీ అద్భుత జీవితం..

ఈ జర్మనీ పర్యటనలో మరిచిపోలేని అనుభూతి 85 ఏండ్ల అమెరికన్ మహిళతో కలిగిన పరిచయం. మేము ఉంటున్న యూత్ హాస్టల్లోనే ఆవిడ కూడా ఉండింది. ఆమె ప్రతిరోజు రాత్రి ఒక ట్యాక్సీ డ్రైవర్‌తో బయటకు వెళ్లి వస్తుంది. ఒకరోజు ఆమెను అడిగాను. మీరు రోజు రాత్రి ఎక్కడికి వెళుతున్నారూ అని. అమె ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది. హిట్లర్ బతికున్న కాలంలోనే, ఆయన చనిపోయాక కూడా హిట్లర్ ముఖాలతోటి ఉన్న డూప్లికేట్ వ్యక్తులను సృష్టించాలని ఒక గ్రామాన్ని అంతా దత్తత తీసుకొని, తన లాగా ఉండే మనుషుల్ని పుట్టించాడని అక్కడో ప్రతీతి. అయితే ఒక ట్యాక్సీ డ్రైవర్ అమెకు అవన్నీ చూపిస్తానని తీసుకెళుతున్నాడు. అమె వాటిని చూడటానికి ఆ చీకటిన వెళ్లింది. అయితే ఆమె వాళ్లను చూసిందో లేదో తెలియదు. నేను అక్కడ ఉన్నది రెండు రోజులే కాబట్టి అమెను మళ్ళీ కలిసే అవకాశం లేకపోయింది. అయితే ఆమెను కలిసినప్పుడు. ఆమె గురించి చెప్పిన విషయాలు అద్భుతంగా అనిపించాయి. 85 ఏండ్ల ఆవిడ ఒక పెద్ద అపార్ట్‌మెంట్లో ఒంటరిగా ఉంటూ, ఎవరి సహాయాన్ని ఆశించకుండా ఉండటం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. “మీరు ఒక్కరే ఉంటారు కదా రేపు ముసలితనం వచ్చాక, జబ్బు వచ్చినా చూసుకోవడానికి కష్టమవుతుంది కదా” అంటే ఆవిడ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? “ఏముంది ఒక వీల్ చైర్ పెట్టుకుంటాను, అది బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి దాంట్లో కూర్చొని అది ఆన్ చేసుకొని లిప్ట్‌లో కిందకి దిగుతాను. షాపింగ్‌కు వెళ్లాలన్నా ఇలాగే దిగి, ట్యాక్సీలో వెళ్లి సరుకులన్ని తెచ్చుకొని ఇంట్లో వంట చేసుకుంటా” అని ఈజీగా చెప్పేసింది.

85 ఏండ్ల మనిషి ఇంత కాన్ఫిడెన్స్‌తో దేన్నైగా సులభంగా ఎదుర్కొంటాను అన్న విధానం చాలా బాగా నచ్చింది. నేను ఉండబట్టలేక ఇంకేం చెబుతుందో అని, “మీరు ఒంటరిగా వెళుతున్నప్పుడు ఒకవేళ ఆ డ్రైవర్ మిమ్మల్ని చంపితే” అని అడిగాను. దానికి ఆవిడ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా… “అలా జరగదని నాకు చాలా నమ్మకం ఉంది. ఒకవేళ ఆయన చంపేసినా బాధేమి లేదు. అది చూడాలని కోరిక. చంపేసినా భయం లేదు” అని చెప్పింది. ఆమెలో ఉన్న ధైర్య సాహసాలకు శెల్యూట్ కోట్టాలి అనిపించింది. నిజానికి ప్రతి ఒక్కరికి తన పట్ల తనకు ఇలాంటి కాన్ఫిడెన్స్ ఉండాలి అనిపించింది ఆవిడను చూశాక.

హోలోకాస్ట్

ఇక్కడికి దగ్గర్లోనే ‘హోలోకాస్ట్ మెమోరియల్’ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం, అంతకుముందు కాలంలో మరణించిన యూదు మతస్తుల జ్ఞాపకార్థం గత దశాబ్దంలో నిర్మించిన కట్టడమిది. చూసేందుకు విభిన్నంగా ఉంటుంది. దాదాపు 4 ఎకరాల విస్తీర్ణం ఒక విచిత్రమైన నిర్మాణాలు కలిగిన ప్రదేశం అది. భూమి ఉపరితలానికి సమాన ఎత్తులో ఆ సిమెంటు దిమ్మల్ని సమాధుల తరహాలో నిర్మించారు. వాటి మధ్య మనుషులు నడిచే దారులు ఉన్నాయి. ఆ ప్రాంతం మొత్తం లోతుగా తవ్వి ఒక్కో సమాధి ఒక్కో ఎత్తులో ఉండేట్లు నిర్మించి మనం లోపలి నుండి బయటికి వచ్చేటప్పుడు ఏటవాలుగా ఉంటుంది. ఆ వాలుకి తగ్గ ఎత్తులు భూమి సమానంగా ఈ సిమెంటు దిమ్మలు నిర్మించారు. వాటి మధ్యలోకి వెళితే ఎటు వస్తాయో కూడా తెలియదు. ఒకప్పుడు బెర్లిన్‌లో లక్షా యాభై వేల మంది యూదులు ఉండేవారట. రెండవ ప్రపంచంలో వారందరినీ హిట్లర్ చంపేసాక మిగిలిన వారు ఇజ్రాయిల్‌కి వెళ్ళిపోయారు. ఇప్పుడు 10 వేలమంది కూడా లేరు. యూదులకి సానుభూతిగా ప్రపంచంలో మరికొన్ని దేశాల్లో ఇలాంటి హెూలోకాస్ట్ మెమోరియల్ నిర్మించారట.

ది డైరీ అఫ్ ఎ యంగ్ గర్ల్

ఈ యూదులను చంపిన విధానాన్ని వింటే నాకు అన్నే ఫ్రాంక్ అనే అమ్మాయి కథ గుర్తుకువచ్చింది. 1939-1940 మధ్య కాలంలో ఎంతోమంది యూదులు చనిపోయినప్పుడు చిన్నారుల జీవితాలు తారుమారయ్యాయి. నాజీల దౌష్ట్యం కారణంగా ఎంతోమంది హతులయ్యారు. తల్లిదండ్రులు లేక నిరాశ్రయులైన పిల్లలు చాలామంది ఉన్నారు. అన్నే ఫ్రాంక్ అనే అమ్మాయి యూదుల కుటుంబానికి చెందినది. ఈ అమ్మాయి తండ్రి వ్యాపారి. అయితే 1935లో హిట్లర్ అధికారంలోకి వచ్చినప్పుడు, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు యూదులకు రక్షణ లేదని అర్థమయిపోయి అన్నే ఫ్రాంక్ తండ్రి తన నివాసాన్ని ఆమ్‌స్టర్‌డామ్‌కు మార్చాడు. అక్కడ ఓ చిన్న అపార్టుమెంటులో, అలమారాల్లాంటి గదులలో 25 నెలలు రహస్య జీవితం గడిపారట. అన్నేఫ్రాంక్‌కి పుట్టిన రోజు కానుకగా ఎవరో ఒక డైరీ ఇచ్చారట. ఆ అమ్మాయి డైరీనీ ప్రతీ రోజు రాయడం మొదలుపెట్టింది.

ఈ డైరీలో తమ రహస్య జీవితం గురించి, ఎన్నో విషయాలు రాసిందామ్మాయి. తర్వాత 1944లో వీళ్ళు ఇక్కడ రహస్య స్థావరంలో ఉన్నారని ఎవరో సమాచారమివ్వడంతో.. జర్మన్ సైన్యం వచ్చి కుటుంబం మొత్తాన్ని తీసుకువెళ్ళి  బట్టలు ఊడదీసి వర్షంలో నిలబెడతారు. తర్వాత తండ్రిని ఒక క్యాంప్‌కీ, అన్నే ప్రాంక్‌నీ మరో క్యాంప్‌కీ పంపిస్తారు. అన్నే ఫ్రాంక్ తల్లి, అక్క చనిపోతారు. 1945లో ఈ క్యాంప్‌లోనే టైఫాయిడ్ సోకి అన్నేప్రాంక్ తన 16వ ఏట చనిపోతుంది. ఆమె చనిపోయిన తర్వాత ఆ డైరీ తండ్రికి దొరుకుతుంది.

యుద్ధం ముగిసాకా, తాము ఎదుర్కున్న విపత్కర పరిస్థితుల గురించి ఎవరైనా డైరీలు రాస్తే, వాటిని ప్రచురిస్తామని రేడియోలో ఒక ప్రకటన వస్తుంది. ఆ అమ్మాయి రాసిన డైరీని ఆమె తండ్రి ప్రచురణకి ఇస్తాడు. అప్పట్లో ఇరవైఐదు మిలియన్ జర్మన్ మార్క్‌లకు అమ్ముడైన ఆ డైరీ తర్వాత అరవైకి పైగా భాషలలోకి అనువాదమై సంచలనం సృష్టించింది. ఈ డైరీకి వచ్చినంత ప్రాధాన్యత ఏ డైరీకీ రాలేదు. బైబిల్ తరువాత అంత ప్రాచుర్యం పొందిన అనువాదం ఇదేనంటారు.

నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలోని జైలులో ఉన్నప్పుడు అన్నే ఫ్రాంక్ డైరీ చదివి ప్రభావితుడై, తోటి ఖైదీలకు చదివి వినిపించారట. ఈ పుస్తకం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. నటాలీ పోర్ట్‌మన్ అనే అమెరికన్ నటి 1997లో, ది డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్ పుస్తకం ఆధారంగా నిర్మించిన బ్రాడ్‌వే చిత్రంలో అన్నే ఫ్రాంక్ పాత్ర పోషించింది. నటాలీ పోర్ట్‌మన్ కుటుంబం కూడా రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళి స్థిరపడిన యూదులకు చెందినది. ఈ డైరీకి ప్రెసిడెంట్ రూజ్‌వెల్ట్ భార్య ముందుమాట వ్రాసింది.

అన్నే ఫ్రాంక్ తండ్రి 1980లో తన 81 ఏట చనిపోయాడు. అన్నే పేరు మీద ఒక ట్రస్ట్ కూడా ఏర్పడింది. దీని ద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారు. ఆమె ఇంటిని సంవత్సరానికి కనీసం ఆరు లక్షల మంది సందర్శిస్తారు. ఆమె నివసించిన అరల్లాంటి గదులు, ఆమె వస్తువులను ఆ ఇంట్లో చూడవచ్చు. జర్మనీ వెళ్ళినప్పుడు నాకు ఈ కథ గుర్తుకువచ్చి చాలా బాధపడ్డాను.

ఇక్కడికి దగ్గరలోనే సిటీ స్క్వేర్ ఉంటే అక్కడి వెళ్లాం. దీనినే బ్రాన్దేన్ బర్గ్ గేటు అని కూడా అంటారు. బెర్లిన్ నగరానికి ఇది లాండ్‌మార్క్ వంటిది. పర్యాటకులు అందరూ ఇది చూడకుండా మాత్రం వెళ్ళరు. అక్కడ ఒక పోలీస్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి అందరి పాస్‌పోర్ట్‌ల మీద స్టాంప్ వేస్తున్నాడు. అది అధికారిక ఇమ్మిగ్రేషన్ ముద్ర లాగే ఉంది. నాకు అర్థం అయిందేమిటంటే యూరప్‌లో ఏ దేశంలో ముందుగా అడుగు పెడతామో ఆ దేశపు ఇమ్మిగ్రేషన్ స్టాంప్ మాత్రమే మన పాస్‌పోర్ట్ మీద ఉంటుంది. మిగతా ఎన్ని దేశాలు తిరిగినా ఇమ్మిగ్రేషన్ చెక్ ఉండదు కనుక ఆయా దేశాల స్టాంప్‌లు కూడా మన పాస్‌పోర్ట్‌లో ఉండవు. అందుకే పర్యాటకులంతా జర్మనీని దర్శించిన గుర్తుగా ఆ స్టాంప్ వేయించుకుంటున్నారు. దానికి ఆ వ్యక్తీ 5 యూరోలు (మన లెక్కలో 500 రూపాయలు) తీసుకుంటున్నాడు. నేను వేయించుకుందామని ప్రయత్నిచాను. కానీ మా వారు టైం లేదని చెప్పడంతో అక్కడి నుండి వెనుదిగిరి వచ్చేశాము.

     

అయితే ఈ దేశంలో చాలా ప్రాంతాలు తిరిగిన మాకు బెర్లిన్ నగరంలో పర్యటించటం గొప్ప అనుభూతిగా కలిగించిందని చెప్పవచ్చు.

Exit mobile version