Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరిచిపోయిన భాష

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘మరిచిపోయిన భాష’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

చిన్నప్పుడు అమాయకంగా చెట్లతో మాట్లాడేవాడిని
ఆకులు రాలిపోతుంటే
అవి చెప్పే వీడ్కోలు మాటలు వినిపించేవి
పువ్వులు వికసిస్తుంటే
వాటి నవ్వు అర్థమయ్యేది.
వాన చినుకులు కిటికీని తట్టినప్పుడు
ఎవరో దూరపు మిత్రుడు
క్షేమం అడుగుతున్నట్టు అనిపించేది
మిఠాయిలకు పట్టే చీమల వరుసలో
క్రమశిక్షణను చదివేవాడిని
సీతాకోకచిలుక రెక్కల్లో
రంగుల రహస్యాలను
దాచుకున్న కవిత కనిపించేది
రాత్రిళ్లు
నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ వెలిగినప్పుడు
ఆకాశం అందంగా రాసే ఉత్తరాన్ని
అక్షరం అక్షరం చదివేవాడిని
ఇప్పుడు..
ఎన్నో భాషలు నేర్చుకున్నాను
కానీ
చెట్టు నిట్టూర్పు అర్థం కావడం లేదు
పువ్వు మౌనాన్ని చదవలేకపోతున్నాను
వాన పిలుపు వినిపించడం లేదు
నక్షత్రాల ఉత్తరాలేమో
చిరునామా దొరకక తిరిగి వెళ్తున్నాయి

ఒకప్పుడు
ప్రపంచమంతా నా బంధువుల్లా
స్నేహితుల్లా మాట్లాడేది
ఇప్పుడు
నా స్వరమే నాకు పరాయిగా అనిపిస్తోంది
ప్రకృతికి తెలిసిన ఆ భాష..
నా బాల్యంతో కలిసి ఎక్కడ పోయిందో!
ఎక్కడికి పోయిందో!

Exit mobile version