[ఈనెల 26న వరంగల్ లో ఆవిష్కృతమవుతున్న ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య నవతి అభినందన సంచిక ‘ప్రతిభాసుప్రసన్నము’ కోసం శ్రీ సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి రచించిన ప్రత్యేక వ్యాసం ఇది. ఈరోజు నుంచీ 26 వరకూ ప్రతిరోజూ ఈ పుస్తకం నుంచి ఒక వ్యాసం సంచిక ప్రచురిస్తున్నది.]
తెలుగు సాహిత్య పరిణామం ఆధునిక యుగంలో వస్త్వాశ్రయ ఆత్మాశ్రయరీతులలో కొనసాగుతున్నది. వస్త్వాశ్రయ కవిత్వ స్వభావాన్ని గుర్తించేందుకు ఎక్కువగా శ్రమ పడవలసిన పనిలేదు. భౌతిక జగత్తులోని మార్పులు వివిధ సంఘటనలు వాటి చలనాలు, పరిణామాలు అందుకు దోహదపడతాయి ఈ రకమైన చలనాలను ఆత్మాశ్రయ రీతిలో వ్యక్తీకరించే సందర్భంలో కూడా ఎక్కువగా శ్రమించవలసిన అవసరం లేదు. ఆయా సంఘటనలు పరిస్థితులు కవిపై వేసిన ముద్రను బట్టి వాటి జాడను స్పష్టంగానో కొంత అస్పష్టంగానో గుర్తించవచ్చు. కవిత్వాన్ని వస్త్వాశ్రయ ఆత్మాశ్రయరీతులలో స్థూలంగా విభజించుకున్నా ఆత్మాశ్రయ రీతిలోనే అంతర్ముఖీనతను తాత్త్వికతను కవిత్వంలో వ్యక్తీకరించినప్పుడు ఆ కవి జీవనతత్త్వం అతని కవితా వ్యవసాయంలో నడిచిన నిర్మించుకున్న రీతి కొంత అర్థం కావాల్సి ఉంటుంది.
“నాకు సాహిత్యం జీవితం కంటే ఎప్పుడూ విడిగా ప్రత్యేకమైన అంశం కాదు. జీవనమార్గంలో యాత్రికుడుగా నేను చేస్తున్న అన్వేషణము, ఆత్యంతికములైన తాత్త్విక మూలాలను కనుగొనాలనే ఆరాటమూ, విలువల వ్యవస్థా, సాహిత్యరంగంలోనూ మార్గదర్శనం చేస్తూ వచ్చాయి. నాకు పదిపన్నెండేళ్ళ వయస్సులో వ్యక్తిగా రూపొందే నాటికి రజాకార్ల దుండగాలూ, వారిని ఎదుర్కొనేందుకు జాతీయవాద, సామ్యవాద, ఆర్య సమాజాలు చేసిన పోరాటాలూ, కాందిశీకులమై బెజవాడలో ఉండటమూ, హైదరాబాదు సంస్థాన విముక్తీ, జీవితాన్ని గురించి నన్ను ప్రశ్నింపజేసిన అంశాలు” (అధ్యయనం ముందుమాట). ఈ మాటలు బాహిర, ఆంతరిక జగత్తులలో సుప్రసన్నపై వేసిన ప్రభావాన్ని, పడిన ముద్రలను చెబుతున్నాయి. ఈ రకమైన భౌతిక ఆత్మిక సంపుటుల నుండి నిర్మితమైన కవి వ్యక్తిత్వం స్పష్టమైన సంపూర్ణమైన దార్శనికతను కవిత్వాభివ్యక్తిలో ప్రదర్శించగలదు.
“పరిమితులు లేకుండా విశ్వాన్ని భౌతిక, ప్రాణిక, మానసిక దశలో క్రమ్ముకోగల చేతస్సు అన్నివైపులా కిటికీలు తెరిచింది. సమష్టి వెలుగులో సాహిత్య సృజన కొనసాగించింది. రూపము, ఛందస్సు, భాష, ఏదీ సృజనపథంలో, వివేచనలో పరిమితులు, హద్దులు విధించలేకపోయింది. వ్యక్తికీ తనలోని అంతర్వ్యక్తికీ, వ్యక్తికీ సమాజానికీ, వ్యక్తికీ ప్రకృతికీ, వ్యక్తికీ ఈ విశ్వానికి నడుమ ఒక సామరస్యం నెలకొల్పే రీతియే ధర్మం. ధర్మం లోకజీవనంలోని అర్థకామాలను నియంత్రిస్తున్నది. ‘విశ్వలయ’ను చెదరిపోకుండా కాపాడుతున్నది. శకలితం కాకుండా స్పష్టమైన ఈ పరిపూర్ణ దర్శనం నా మార్గాన్ని నేను నిర్మించుకునే విధంగా చేసింది” (అధ్యయనం ముందుమాట). ఈ రకమయిన రీతి వారి సాహిత్యమంతా పరుచుకుని ఉంది. సామరస్య రూప మార్గం సృజనలో వ్యక్తమయింది.
సుప్రసన్న కావ్య తత్త్వాన్వేషణలో మూడుస్తరాలు ప్రధానమని చెప్పి సాహిత్య విమర్శలో దానిని అన్వయించి చూపారు.
జీవుడు పరబ్రహ్మ స్వరూపాన్ని చేరేక్రమం ఇది. వేదాంతుల, తత్త్వవేత్తల సంప్రదాయం నుంచి వచ్చిందని మొదటిది చెబుతుంది. రెండవది జీవుని అనుభవ విశ్లేషణను చెబుతుంది. ఈ అనుభవం జీవుడిదీ, సహృదయుడిదీ ఎవరిదైనా కావచ్చు. మూడవ చిత్రంలో కవి, సహృదయుడు ప్రయాణం చేసే క్రమం ఉంది. ఒకరు శబ్దం నుండి రసానికి, మరొకరు అనుభవం నుండి శబ్దానికి ప్రయాణిస్తున్నారు. ఈ మూడు రేఖల్లో చివరిది కావ్యప్రపంచం, రెండవది అనుభవ ప్రపంచం, మొదటిది ఆత్మిక ప్రపంచం. వేదాంతమైనా, కావ్యమైనా తత్త్వంగా చెప్పింది అనుభవ విశేషాన్నే. అదే ఈ రేఖాచిత్రంలోని సారాంశం. ఇది సుప్రసన్న కవితావగాహనకు ఉపయోగపడే సోపానం. ఇదంతా వారి కవిత్వంలో వ్యక్తావ్యక్తంగా లీనమయి ఉంటుంది.
వాస్తవికత, ప్రతీక అంతఃస్ఫురణల రూపంలో యోగ మార్గంలో కవితాసాధన చేయడం సుప్రసన్న కవితా రీతి. సుప్రసన్న వీటిని సాహిత్య విమర్శలో వివిధ దశలుగా వివిధ రీతులలో అన్వయించి చూపారు. ఈ రీతి సుప్రసన్న కవిత్వానికీ వర్తిస్తుంది. వస్తువు, భాష, అభివ్యక్తి, అలంకారం అన్ని కవితా వ్యవసాయ ద్రవ్యాలు అనంతత్వం వైపు ప్రయాణించేట్టుగా చెప్పడం ఆయన కవిత్వంలో కనిపిస్తుంది.
సుప్రసన్నకు కవితా వ్యవసాయం తన ఇంటి వాతావరణంలో అలవోకగా ప్రారంభమయింది. హృద్గీత, ఆనందలహరి అన్న పద్య కావ్యాలు తన పినతండ్రి కోవెల సంపత్కుమారాచార్యతో కలిసి రచించారు. అంతర్గత వేదనను వేదాంత పరంగాను, ఆధ్యాత్మికత వైపు ప్రయాణించేట్టుగాను చెప్పడం ద్వారా తొలినాళ్లలో తన పిన తండ్రితో రచించిన కవితా మార్గం నుంచి వేరుపడి స్వీయ కవితా శిఖరాన్ని నిర్మించుకున్నారు. పద్య కవిగా తేజశ్చక్రము, దుఃఖయోగిని, అధునా, స్తుతి ప్రబంధము, కృష్ణరశ్మి, శ్రీ నిరుక్తి, శ్రీ నృసింహ ప్రపత్తి, ప్రీతి పుష్కరిణి, మణిసేతువు, పరిక్రమ, వనవాసరాఘవము, శ్రీరామకథాసుధ, శ్రీ పాంచాలరాయశతకం రచించారు. కవితా ప్రక్రియ పరంగా రూప పరంగా పద్యమే అయినా వస్తువు, భాష, అభివ్యక్తులలో పూర్వ సాహిత్య సంప్రదాయాలను అనుసరిస్తూనే స్వీయ కవితాభివ్యక్తిలో విశిష్ట మార్గాన్ని నిర్మించుకున్నారు సుప్రసన్న.
“సుప్రసన్న జీవసంపుటిలో అనేక తాత్త్వికధారల సమన్విత స్థితి గమ్యమానమవుతుంది. దేశీయమైన మంత్ర తంత్ర ధారలూ అద్వైత విశిష్టాద్వైత ధారలు, ఆధునికమైన వివేకానంద, శ్రీ అరవిందులు, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, సద్గురు శివానందమూర్తి విచార ధారలు ఒక సమన్వయాన్ని సంపాదించుకున్నది” (మణిసేతువు పీఠిక, కోవెల సంపత్కుమారాచార్య) ఈ మాటలు సుప్రసన్న కవితాభివక్తి లోని తత్త్వాన్ని వివరిస్తున్నాయి. ఇన్ని రకాల ధారలు వారి కవిత్వ జీవితంలో వినూత్న అభివ్యక్తిని సాధించాయి. అదే సందర్భంలో తాత్విక పరంపరల అనుస్యూతి ఇటీవల కాలం వరకు కొనసాగిన రీతి తెలుస్తుంది. దానిని సుప్రసన్న అనుభవంలోకి తెచ్చుకున్న రీతి అవగతం అవుతుంది. ఒకే తత్త్వం అనేక మార్పులలో వ్యక్తమైన గుణము తెలుస్తుంది.
‘తేజశ్చక్రం’ పద్యము వచన కవితా రూపము రెండు కనిపించే శైలి. అది వచన కవితా రూపానికి పూర్వ రూపంగా నాలుగు పాదాలతో, పఠనంలో పద్యపు నడకతో కూడినరీతి ఇందులో ఉంది. Blank verse వచన కవితకు పూర్వరూపం. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. అంత్యప్రాసలు, లయాత్మకత, యతి విరుపు ఉంటుంది. ఒక రకంగా ఛందో నియమాల్ని పూర్తిగా అనుసరించని రీతిలో ఉంటూ అబుద్ధ ఛందో మార్గంగా ఈ రచనలో కనిపిస్తుంది. ఛందో నియమాలను అనుసరించి పద్యంగా కనిపించకపోయినా గతి లయల వలన పద్య నిర్మాణం ఈ రచనలో కన్పిస్తుంది. ఒకరకంగా ఇది ఆత్మాశ్రయ కావ్యం. కవితలలో జీవితంలోని అనుభవాలను, ఆలోచనలను, వేదనలను, దుఃఖాన్ని పరమాత్మకు నివేదించుకుంటూ సాగినది తేజశ్చక్రం. సృష్టిలో జీవునిలో కనిపించే వేదనకు ఆర్తికి అభివ్యక్తి రూపం తేజశ్చక్రం.
‘దుఃఖయోగిని’ వస్త్వాశ్రయమైన రీతిలో నడిచే మూడు సర్గల కావ్యం. అనుభూతి ప్రధానం. ప్రాణేశునకు దూరంగా ఉన్న సీత ఊర్మిళలను నిమిత్త కారణంగా తీసుకొని దుఃఖాన్ని, దాని స్వభావాన్ని చిత్రించిన కావ్యం. సీతా ఊర్మిళలది వియోగ దుఃఖమే అయినా వాటి స్వభావాలు వేరు. ఊర్మిళ దుఃఖం అంతగా సాహిత్య సమాజంలో చర్చనీయాంశము కాలేదు. ఇద్దరినీ జీవులకు సంకేతంగా చేసుకొని పరమాత్మ సాయుజ్యాన్ని పొందే రీతిలో కావ్యాన్ని సుప్రసన్న నిర్వహించారు. ఊర్మిళ 14 ఏళ్ల తర్వాత ప్రాణేశుడు తనను చేరతాడు అన్న ఒక స్థిర దృష్టితో ఉన్నది. విశిష్టాద్వైత మార్గంలో చెప్పాలంటే ఆమె తృప్త ప్రసన్న. నన్ను చేర్చుకోక తప్పదు. నన్ను చేరతాడన్న దృఢ సంకల్పం ఉంది. కానీ చేరే సమయం కోసం పడే వేదన దుఃఖం ఊర్మిళలో చిత్రితమైంది. సీత ఆర్త ప్రసన్న. ఆమె పరమ పురుషుడి సాన్నిధ్యంలోనే ఉండి తన చపలత వలన ఆ సాన్నిధ్యాన్ని దూరం చేసుకున్నది. అందుకని మరల స్వామిని చేరేంతవరకు ఆమె దుఃఖం కొనసాగుతున్నది
మొదట సర్గ తమోవర్ణనతో మొదలై సీతాదేవి అనుభవించిన దుఃఖం, ఆమె సమాధి స్థితితో పూర్తవుతుంది. రెండవ సర్గ సూర్యోదయంతో మొదలై ఊర్మిళ దుఃఖం, ఆమె అనుసరించిన యోగం చిత్రితమైనది. మూడవ సర్గలో జీవుని దుఃఖాన్ని వరించి సీతారాముల సమాగమంతో కావ్యం పూర్తి అయింది. కావ్య పరమార్థమంతా జీవునివేదనగా ప్రపత్తి మార్గంగా కనిపిస్తుంది. అందుకే సుప్రసన్న “ఒక్క యోగమ్మునకు రెండు ప్రక్కలైన వారు సీతోర్మిళలు” అన్నారు. సీత ఊర్మిళల దుఃఖం జగత్తులోని దుఃఖం. అది కావ్య రూపంలో అందించి ఆ వేదనను సార్వజనీనభావంగా మలచి, సాధారణీకరణం చెందేట్లు చేశారు. కె.వి.యన్ రాఘవన్ అన్నట్లు ఇది దేవుని యొక్క సృష్టి ప్రయాణము. సీతారాములు ఊర్మిళాలక్ష్మణుల వ్యాజంగా చిత్రించబడింది (శతాంకుర కావ్యానుశీలన – 17).
భౌతిక జగత్తులోని వెదుకులాట చాలామంది కవులలో కనిపిస్తుంది. ఒక అసలు సిసలైన ప్రేమను భౌతికంగా వెతుకుతూ వెళ్లడం వారి మార్గం అది. ఒక రకంగా సౌందర్యాన్వేషణమే కానీ వాటి కారణాలు కావ్య జగత్తులో వాస్తవాశ్రయంగా ఉంటూ, అవి లౌకిక ఉదాహరణలతో వ్యక్తమవుతుంది. అందుకు భిన్నమైన మార్గము ఆత్మిక జగత్తుది. తెలుగులో వచ్చిన కాల్పనిక కవిత్వంలో ఈ రెండు రకాల స్థితులు కనిపిస్తాయి రెండవ స్థితిని మార్మిక కవిత అని, భక్తి ఉపలంబంగా గల కవిత అని కొందరు భావించారు, సుప్రసన్న ‘అధునా’ కావ్యంలో కాల్పనిక కవిత్వ ప్రభావం ఉంది. 21 ఖండికలున్న ఈ కావ్యంలో మనోలోకాలలోని సౌందర్యాభివ్యక్తిని చూడవచ్చు. తొలి ఖండిక ఆవిష్కృతి అయితే చివరిది సాక్షాత్కారం. మధ్యలో భవిష్యద్దర్శనము, కాలము, ధర్మము, కామము, తమస్సు, స్థాయిభావం, ప్రళయము, నిరీక్షణ, సౌందర్యము, దేశము, భాష, వంటి అంశాల ద్వారా సాహిత్య సామాజిక స్థితులను కవిత్వీకరించారు. ఇందులో వస్తు వైవిధ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. సుప్రసన్న సాహిత్య విమర్శలు అనుసరించిన మూడు స్తరాల పద్ధతి ఈ కావ్య సృజనలో కనిపిస్తుంది. అనుభవం, సౌందర్యం, ఈశ్వరుల అన్వేషణ ఈ కావ్య ఖండికలలో అంతః ప్రవాహినిగా కనిపిస్తుంది.
తొలినాటి నుంచి తన కుటుంబంలో నెలకొని ఉన్న శరణాగతి భావనతో బాటు ఆధునిక తాత్వికుల ఆలోచన ఈ కావ్యంలో కనిపిస్తుంది.
దొంతరలు దొంతరలు కలల్ తోచునడుమ
నేదో తెలియమి మరల నదేదో తెలివి
ఇప్పుడు భాసించి భాసింపదేమి సేతు
ప్రభువని పదముల పైన పడితినిపుడు
అన్న సాక్షాత్కారం ఖండికలోని పద్యం జీవుని వెతుకులాటను అందుకు శరణాగతి తప్ప మరో మార్గం లేదన్న స్పురణను వ్యక్తీకరిస్తున్నాయి.
‘అధునా’ సాహిత్య అభివ్యక్తిలో వచ్చిన మార్పును మరింత స్పష్టంగా తెలియజేస్తుంది. ఆధునిక కవిత్వంలోని అభ్యుదయానంతర ధోరణులను స్థితులను స్పష్టంగా గుర్తించేందుకు, అభివ్యక్తి నవీనతను తెలుసుకునేందుకు ఈ సంపుటి దారి చూపుతుంది. భాష, రూపం, వస్తువు వంటి అంశాలలో కనిపించే ప్రతికూల అంశాలను నవ్యాభివ్యక్తితో ఇందులో కవితారూపంలో కనిపిస్తాయి. భావనలలోని విలక్షణత, భావాభివ్యక్తిలో పూర్వ సాహిత్యపు డొల్లతనం తెలుస్తుంది.
‘పాంచాలరాయ శతకం’ సుప్రసన్న గారే చెప్పుకున్నట్లు విశిష్టాద్వైత సిద్ధాంత భావన స్పష్టంగా వ్యక్తమైన రచన. “ఇంత కాలం నేను విశిష్టాద్వైత సంప్రదాయానికి చెందిన అనుబంధం గల రచన ఏది చేయలేదు. ఈనాటికి శతకం అలా రూపు కట్టింది. ఒక దశలో నాకు అనిపించింది బహిరంగంగా కనిపించే పరివేషాలు తొలగిస్తే ఏ మార్గమైనా పరమార్థం చెప్పే విషయంలో పెద్ద భేదం లేదని మూలతత్త్వం అవగాహన కానంత వరకు అన్ని ఎగుడుదిగుడుగానే గోచరిస్తాయి” అని అన్న మాటలు వారు వివిధ తాత్విక సంప్రదాయాలను సమన్వయించుకొని చూసే రీతిని చెబుతాయి. జీవుని ఆర్తి ఈ శతకం నిండా వ్యాపించి ఉంది. శతకానికి ఉన్న ఆత్మాశ్రయత్వ లక్షణం ఆర్తి రూపంలోనూ, తాదాత్మ్య భావన గాను ఈ శతకంలో వ్యక్తం అయ్యింది.
రొమ్ముపై శ్రీదేవిలోని కృప పొంగి రూపుగొన్నట్లు
చెమ్మలు మారేడు చరణ సీమ మీర్దిగి వచ్చినట్లు
నమ్మిక కల్గించుచుండె నా యీ భయమ్మును స్వామి
క్రుమ్మనేమి సుధా మనోజ్ఞ గోపాల పాంచాలరాయ!
తొలి పాదంలోని ఉత్ప్రేక్ష అభివ్యక్తి నవీనతకు సుప్రసన్న సౌందర్యాత్మక చింతనకు సాక్ష్యంగా నిలిచే పంక్తి.
నే పరాంకుశ నాథయామునేయ లక్ష్మణ యోగి వర వ
దారోపదిష్టము భాగవతకథోపదిష్టముత్రోవనేగుచు
అన్న పద్యపాదపు పంక్తులు దాస భావనను పూర్వాచార్యుల కృపా కటాక్షములుగా ఈ శతక రచన చేశానని చెప్పారు. భాగవత దాస భావన, జన్మ సంస్కారంలో వచ్చిన శ్రీ వైష్ణవ సంప్రదాయ నిష్ఠలు ముప్పిరికొనగా ఒకనాడు తాను దర్శించుకున్న ఆ స్వామి రూపం మనోలోకంలో తిరిగి శతక రూపంలో ఆవిర్భవించింది.
‘స్తుతి ప్రబంధము’ అప్పుడప్పుడు రచిస్తూ వస్తున్న పద్య ఖండికల సంకలనం. అగ్ని సూక్తం, దేవి పూజ, శ్రీ నృసింహోదాహరణం పేరుతో రచించిన పద్యాలు ఇందులో ఉన్నాయి. 23 పద్యాలు ఉన్న అగ్ని సూక్తం తమస్సు, అజ్ఞానం, జడత్వం, పాపం, దుష్టభావం, అఘం వంటి వాటిని అణచివేయమని ప్రార్థిస్తుంది అగ్ని యజ్ఞానికి జ్ఞానానికి తేజస్సుకు అధిపతిగా ఋగ్వేదం చెబుతుంది. సుప్రసన్న అగ్నిసూక్తం మానవ చర్యలు యజ్ఞంగా, చింతనలు జ్ఞానంగా ప్రకాశవంతం కావాలని బోధిస్తుంది. అగ్ని చైతన్యానికి, మనస్సుకు ప్రతీక. ఇది పంచభూతాలన్నిటిలో వ్యాపించి ఉండే తత్త్వం కలది. ఈ అగ్ని భూమిలో ఒక చైతన్యంగా, జలంలో బడబాగ్ని గాలిలో గతిగా, ఆకాశంలో విద్యుత్తుగా తేజోరూపంలో వ్యాపించి ఉండేది. ఆ అగ్నిని ‘తమమ్మణంగజేయవే’ ఈ సృష్టికి అని తమస్సును అణచేందుకు ప్రార్థించారు కవి. తమ సోమా జ్యోతిర్గమయ కోసం అన్వేషించే జీవుని స్థితి అగ్ని సూక్తంలో వ్యక్తం అవుతుంది. దేవీపూజ జగన్మాత స్తుతి గల భక్తి భావ రచన.
‘శ్రీనృసింహోదాహరణము’ను ఉదాహరణ కావ్య ప్రక్రియలో విశేష ప్రయోగంగా విశిష్ట మార్గంగా సుప్రసన్న మలచారు. ఎనిమిది విభక్తులలో ప్రతి విభక్తికి వృత్తం, కలికా ఉత్కలికలతో నడిచే లఘుకావ్యం ఉదాహరణ. సుప్రసన్న ఒక్కొక్క దళంలో తెలుగుదేశంలోని వివిధ నారసింహక్షేత్రాలను అక్కడి అర్చారూపాలను స్తుతించడం ఇందులోని ప్రత్యేకత. ‘కృష్ణరశ్మి’ని భావ కావ్యంగా సుప్రసన్న సంభావించారు. శ్రీకృష్ణానుభవాన్ని కథల జోలికి పోకుండా కృష్ణ తత్త్వ భావనతో సమ్మేళనం చేసి స్వీయ అనుభవాల సంపుటిగాదీన్ని అందించారు. ఈ కావ్యంలో స్వామి అన్నివేళల్లోనూ యోగీశ్వరుడు. తానే శబ్దబ్రహ్మము, పరావాక్ స్వరూపము. కవికి కేవలం శ్రీకృష్ణ లీలా వర్ణనమే ప్రయోజనం కాదు. కవిత్వము పద్యము తనలోకి ఇంకిపోయేందుకు తన మూలాన్ని తెలుసుకునేందుకు చేసే ప్రయత్నం. అందువల్ల ఇది కవి వెతుకులాట. ప్రభువును నిశ్శ్వాసవల్లీ సుమాయితునిగా చేసుకునే సాధన. కావ్యం అష్టదళ పదం. ఒక్కోదళంలో 16 రేఖలు. స్వామి అష్టమగర్భం. అష్టమావతారం. షోడశ సంఖ్య పరిపూర్ణతకు సూచిక. షోడశ సంఖ్య చంద్రుని కళలను సూచిస్తుంది. పరిపూర్ణత కోసం జీవుడు పడే వేదనలను యోగం, ధ్యానం నడుమ బహిరంతర యాగాల మధ్య సమన్వయం చేయటం కోసం చేసిన ప్రయత్నంగా ఈ కావ్యాన్ని నిర్మించినట్లు చెప్పుకున్నారు కవి.
రిక్త నేత్రముల నిరీక్షింతునా స్వామి
కానిపించి మరల కానిపింప
కుండ ఆటలాడుకొనుచుండె నాబ్రతు
కెటుల తెల్లవారునేము ఎరుగ
అంటూ వెతుకులాట ప్రారంభమై,
అచట రసముచిందు అచట నాదము విచ్చు
అచట నీల జలదమచట బర్హ
మచట కృష్ణ భావమచట గోలోకము
అచట నీవు లేవు నేను నందరమును
అని కృష్ణానుభవం దొరికే చోటును ప్రస్తావించారు. ఈ పద్యంలో రసము ముందు చెప్పి దానికి కారణమైన విభావాదులు తర్వాత ప్రస్తావితమయ్యాయి. కావ్యానుభవం రసానందం కొరకు అన్న సూచన ఇక్కడ ఉంది. దానికి కారణమైన శ్రీకృష్ణ జగత్తును పద్యంలో చిత్రించారు. బాహిరజగత్తులో కనిపిస్తున్నవి అంతర్లోకంలో ధ్యానంగా, యోగంగా సమన్వయించుకున్న భావకావ్యం కృష్ణరశ్మి.
ధ్యానము కుదరదు నెంతభి
మానించిన నైన చిత్తమను పాత్రికలో
తేనె చిలుకైన రాలదు
గానమొ, యోగమ్మొ త్రోవ కల్గునొ లేదో
కృష్ణరశ్మి కొరకు కవి వెతుకులాట, దాని మార్గము ఇందులో కనిపిస్తుంది. ‘చిత్తమను పాత్రికలో తేనె చినుకైన రాలదు’ అన్నది మార్మిక కవితాభివ్యక్తికి మచ్చుతునక. గాఢ అనుభూతికి విశిష్ట అభివ్యక్తికి, కవి కృష్ణానుభవ వ్యక్తీకరణకు మౌలికతకు ఉదాహరణగా ఈ పద్యం నిలుస్తుంది.
‘శ్రీ నిరుక్తి’ సుప్రసన్న శ్రీ చక్రోపాసనకు దేవీవ్రతానుష్ఠానానికి శ్రీ తత్త్వానికి చిహ్నంగా నిలిచే రచన. మహాలక్ష్మి అష్టోత్తర శతనామోపాసనకు ఇది సంకేతం. లక్ష్మీ అష్టోత్తరం లోని వివిధ నామాలకు పద్యరూప వ్యాఖ్యానం ఈ కావ్యం. లక్ష్మీ పదాన్ని భావన చేస్తూ మననంలో ఆ పద తత్త్వాన్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో అంతరంగ స్ఫురణల తాత్పర్యంగా ఈ కావ్యాన్ని సుప్రసన్న నిర్మించారు. శబ్దార్థాలు నిమిత్త కారణాలుగా, కవి చిత్తంలోని అనేక సంస్కారాలు ఈ ‘శ్రీ నిరుక్తి’ కావ్యంలో ఉన్నాయి. వేదార్థ, వేద ప్రయోగ శబ్దాల వ్యుత్పత్త్యర్థాన్ని వ్యాఖ్యానించేది అని నిరుక్తానికి ఉన్న అర్థం. శ్రీ నిరుక్తి శబ్దం అదే రకమైన అర్ధాన్ని సూచిస్తుంది. వైష్ణవ సంప్రదాయం చెబుతున్న శ్రీ తత్త్వాన్ని అనేక కోణాలలో భిన్న తాత్విక సంప్రదాయ మూలాల అభివ్యక్తిగా శ్రీ నిరుక్తి నిలిచింది. ఉపనిషత్ వాక్యాలు, అరవిందుల ‘ది మదర్’ భావనలు అక్కడక్కడ కావ్యంలో ద్యోతకమవుతాయి. లక్ష్మీదేవి శతనామాలలో సుప్రసన్న ఒకటి. ఆ పద్యం సుప్రసన్న భావనా జగత్తును మరింత స్పష్టంగా మనకు చెబుతున్నది.
ఆకాశంబు హిరణ్యగర్భరుచిరంబై పృథ్వీ సౌగంధిక
శ్రీకల్పాగమునై రసోన్మదన గీర్నృత్య ప్రియం భావుకం
బై కన్పట్టిన రోదసి కుహరమందానంద వల్ల్యగ్రబిం
ద్వాకారంబున ధ్యాన లక్ష్యమయినావా సుప్రసన్నా కృతీ.
పంచభూతాలైన ఆకాశం పృథ్వీ పదాలు వాచ్యంగా, రసం రోదసి సౌగంధి పదాల ద్వారా జలం తేజస్సు వాయువులు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ తల్లి బిందువు ఆకారంగా ధ్యానలక్ష్మిగా సుప్రసన్నమవడం లక్ష్మీ తత్త్వంగా ఈ పద్యం వ్యాఖ్యానిస్తుంది. యోగమార్గ సూచన ఇందులో కనిపిస్తుంది. ఈ కావ్యంలో ఆవాహన నుంచి నివేదన వరకు 108 నామాలతో లక్ష్మీ అర్చనను షోడశోపచార రూపంలో కవి నిర్వహించారు.
‘శ్రీ నృసింహ ప్రపత్తి’ శ్రీ నృసింహుని యోగ నారసింహునిగా దర్శించిన ఆత్మీయ కావ్యం. మకుటం లేకపోవడం పద్యాలు 150 వరకు ఉండటం వలన శతకం కాదనడానికి అవకాశం ఉన్నా “జీవుడులో నుండి బయటకు బయట నుండి లోనికి చేసే ప్రయాణంలోని ఒడిదుడుకులే ఈ పద్యాలకు మూల ద్రవ్యం” అంటారు సుప్రసన్న. అంతర్లోక జాగృతిని, సుప్త జాగ్రత్ చైతన్యంలోని వెలుగును విశదీకరిస్తుంది ఈ కావ్యం. ప్రపత్తి శబ్దం శరణాగతిని బోధిస్తున్నది. నేను అన్న భావనను తొలగించి ఈ చరాచర జగత్తులోని పరిణామం, ద్వంద్వాలు, ద్వంద్వాతీత స్థితులు, వ్యక్తావ్యక్త సృష్టి అంతా నృసింహ తత్త్వంగా భావించి కవి శరణాగతిని కోరారు. నృసింహుని పర వ్యూహ అంతర్యామి స్థితులుగా చెప్పిన ఈ పద్యం ద్వారా అర్చవతారం కంటే భిన్నంగా యోగమార్గంలో ఆ నృసింహుని దర్శించినట్లు చెప్పవచ్చు. నారసింహుడు విభావవతారమే అయినా పరవాసుదేవునిగా, పరమాత్మకు సంకేతంగా ఈ కావ్యంలో చిత్రించారు.
‘ప్రీతి పుష్కరిణి’ ప్రణయకవిత్వానికి సంకేతమైన కావ్యం. అయితే ఇది కాల్పనిక కవిత్వపు ప్రణయంగా కాక కులపాలికా ప్రణయంగా ఇందులో సాక్షాత్కరిస్తుంది. ఈ కులపాలికా ప్రణయం సంయోగ భావాన్ని చిత్రిస్తుంది. “ఇందులోని ప్రణయం సుకుమారం అనుభవకేంద్రం భావుకతా పారమ్యాన్ని సూచిస్తుంది” అన్న కవి పలుకులు రసభావనిష్ఠంగా కావ్య రచన చేసిన రీతిని చెబుతున్నాయి. ‘ప్రీతి పుష్కరిణి’ లోని స్త్రీ – భౌతిక జగత్తులోని కవిని పాలిస్తున్న కులపాలిక మాత్రమే కాదు, కవి భావనా జగత్తులోని స్త్రీగా కూడా కనిపిస్తుంది. ఆ స్త్రీ కవి దృష్టిలో కావ్యం, రసం, పరదేవతగా భావనాలోకంలో దర్శనమిచ్చింది. కులపాలికా ప్రణయ భావనలకు చింతనలకు, భిన్నంగా గృహస్థాశ్రమ ధర్మమిస్తున్న చైతన్యాన్ని ఈ కావ్యం చిత్రిస్తుంది. కేవలం తన సహచరిగా చిత్రించే పూర్వ కావ్యాలకు, కులపాలిక భావానికి భిన్నంగా తన భావనాలోకంలో తాదాత్మ్యం పొందిన అనుభూతుల కావ్యంగా దీన్ని సుప్రసన్న తీర్చిదిద్దారు.
‘పరిక్రమ’ వివిధ పద్య ఖండికల సంకలనం. వ్యక్తిగతంగా జీవితంలో నెలకొన్న విషాదం, కవిలోని సుఖదుఃఖాలు, విషాద సంతోషాలు కావ్యరచనలో నెలకొని ఉన్నాయి, పరిక్రమ అంటే మనం ఉన్నచోటి నుండి అవ్యక్తమైన తత్త్వం దాకా ప్రయాణించి మళ్లీ బయలుదేరిన చోటికి చేరుకోవటానికి ప్రతీక అన్న సుప్రసన్న మాటలు కావ్య పరమార్థాన్ని వివరిస్తున్నాయి.
వ్యాధులు క్రమ్మెడు వయసు ప్రాణము తడబడు వయసు
వ్యాధుడెవడో వెంటపడిన హరిణమటుల పరుగులాట
బోధము మరుగున పడునొ పొద్దువాలకమున్ను నన్ను
వేధించు కోర్కెల చిక్కు విడిపించి ఏలుకో ప్రభువ.
శరణాగతిని కోరుతున్న స్థితిగతకావ్యాల లాగే కనిపిస్తుంది. అయితే ఈ పద్యంలోని పోలికలు భౌతిక జగత్తు స్థితిని తన మనః స్థితిని కేంద్రంగా చేసుకున్న రీతిని గమనించవచ్చు. కావ్యతత్త్వము అన్న ఖండిక స్వీయ కవితారీతి కథనంతో పాటు కవిత్వం పట్ల సుప్రసన్నగారికున్న అభిప్రాయాలను భావనలను చెబుతుంది. ప్రతి ఖండిక ఆత్మాశ్రయ రీతిలో స్వీయ అనుభవాల కథనంగా నడిచింది.
‘శ్రీ రామకథాసుధ’, ‘వనవాసరాఘవము’ ఇటీవలి పద్యకృతులు. రామకథాసుధలో సీతా కళ్యాణం వరకూ ఉన్న కథ కనిపిస్తుంది. చంపు పద్ధతిలో రచించిన ఈ కావ్యాల్లో రామాయణ కథా వస్తువును ఆశ్రయించినట్లు తోచినా అక్కడక్కడ జీవగత అహం, మాయకు కారణమైన స్థితుల వర్ణన కనిపిస్తుంది.
నేను నేననియెడు భావనియతి వలన
ఈశ్వరుని తోడి బంధము నెరుగరాదు
హృదయమున ప్రవేశించిన నెదిగి నీవు
చిత్తమున భగవంతుని చేర్చగలవు
వంటి పద్యాలలో కథాగతంగా జీవుని వేదనను అతనికి బోధించే రీతిని చిత్రించారు.
‘వనవాసరాఘవము’ జీవితంలోని కలిమిలేములు, జ్ఞాపకాలు, సుఖదు:ఖాలు, భయాలు, కోరికలు, గౌరవాదరాలు సంసార వాంఛలు వంటివన్నీ దుఃఖ కారణాలు అని చెబుతుంది. ఇవన్నీ ఒకవైపు ఉండగా మానవుడు కల్పించుకున్న అబద్దపు సౌఖ్యం, ఏడ్పులకు ముఖద్వారంగా నిలుస్తుంది. వనవాసరాముడు కేంద్రంగా జీవగత సుఖదుఃఖాలను ఈ కావ్యంలో చిత్రించారు.
పలుకనేర్చిన నీ రీతి పద్యములను
నీ పదాబ్జములపైన నిలిపినాను
అంటూ నైచ్యానుసంధానం చేస్తూ శరణాగతిని ప్రకటించారు.
కవిగా సుప్రసన్నలో ప్రాచీన తెలుగు కవుల జాడలు కనిపిస్తాయి. అదే సందర్భంలో ఆధునిక కవులలో తమ మాతామహులైన రంయాల లక్ష్మీనరసింహాచార్యుల వారి పద్య ధారను, పద్యాన్ని తాత్వికంగా మలచే విశ్వనాథ శైలిని, కాల్పనిక కవులు భాష అభివ్యక్తిలో తెచ్చిన మార్పులు వేసిన ముద్రలు అక్కడక్కడ వారి కవిత్వంలో కొత్తరకంగా వ్యక్తమవుతాయి. ఇది సుప్రసన్న కావాలని చేసే స్థితిగా కాక తన వ్యక్తిత్వంలో, జ్ఞాపకంలో, ధ్యానంలో ఉన్న అంశాలు. అందువల్ల కవిత్వావిర్భావ వేళ ఒక సమాధిగత స్థితి తపస్సు నుంచి అజ్ఞాతంగా పద్య రూపాన్ని, కవిత్వ రీతిని పొందింది. కవి చైతన్యము, అతని జీవనదృక్పథము, సౌందర్య, తాత్త్విక దర్శనము, జగత్తును దర్శిస్తున్న తీరు – ఇక్కడ ప్రధానాంశములు. ఆ చైతన్యమే అనేక రూపాలుగా వ్యక్తమవుతుంది. ఒకే చైతన్యము యొక్క సహస్రముఖాలైన అభివ్యక్తి సుప్రసన్న కావ్యపరంపర అన్న కె. వి.యన్ రాఘవన్ మాటలు గమనించదగినవి.
సమకాలీన సాహిత్య సమాజంలో బహుళ తాత్త్వికతల సమన్వయం రచయితకు ఒక ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. అది గౌరవంగా సాహిత్య సమాజం గుర్తిస్తున్నది. సుప్రసన్న గారిలో ఈ రకమైన బహుళ తాత్త్వికతల సమన్వయం తొలినాటి నుంచి ఉంది. అదే సందర్భంలో ఏ తాత్త్వికతల సంప్రదాయం (అద్వైతం, విశిష్టాద్వైతం, ఇతరాలు) జడ పదార్థంగా ఒకే దగ్గర నిలిచిపోలేదని కాల ప్రవాహంలో అవి కొత్త రూపును, జోడింపును కలిగి ఉన్నాయన్న విశ్వాసం వారిలో ఉంది. భిన్న తాత్వికమార్గాల జాడ ఒక పార్శ్వం అయితే ఒక తాత్త్వికమార్గపు విస్తృతి వికాసం నిరంతరం జరుగుతూనే ఉంటుందని అది ఆధునిక తాత్వికులలో ప్రతిఫలిస్తూనే ఉంటుందని గుర్తించిన వారు సుప్రసన్న. అందువల్ల ఆ అన్వేషణ వారి కావ్య ప్రపంచమంతా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఆ అన్వేషణలో భిన్న మార్గాలను తరచి తరచి చూడవలసిన అవసరం ఇంకా కనిపిస్తూ ఉంది.
సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి ఇటీవలి కాలంలో సాహిత్య ప్రపంచంలో సుప్రసిద్ధులైన సాహిత్య విశ్లేషకుడు.
