Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరో దారి

రగా వేసివున్న తలుపును మెల్లగా తోస్తూ గదిలోకి వెళ్ళాడు ధర్మారావు. గదంతా చీకటిగా వుంది. శబ్దం రాకుండా గది తలుపు వేసి గొళ్ళెం పెట్టాడు. మెల్లగా మూడు అడుగులు ముందుకు వేశాడు. మంచం కాళ్ళకు తగిలింది. చేతులతో తడిమాడు. తనూజ అటు తిరిగి పడుకున్నట్లుంది. వీపు చేతికి చల్లగా తగిలింది. పక్కన పడుకుంటుండగా తనూజ మరింత బిగుసుకుందేమో, లేదా సిగ్గుపడుతుందేమో, లేదా మరే భావంతో వుందో తెలుసుకోవాలనివున్నా ఆ చీకటిలో తనకేమీ అర్థం కావడం లేదు. మెల్లగా యిటువేపు తిప్పుకున్నాడు ధర్మారావు తనూజను. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తనవైపుకు తిరిగింది. అది శరీరంలో రగిలే కోర్కా? లేక మనిషిగా ప్రకృతి ధర్మం నెరవేర్చాలన్న నిర్మోహమైన తపననా?  ఇద్దరూ ఒకరి భావాలు ఒకరు చదవాలనుకుంటున్నారు. ఆ చీకటిలో వాళ్ళకి సాధ్యపడడం లేదు.

ధర్మారావు సెల్ ఫోన్‌లో అలారం మ్రోగుతోంది శ్రావ్యమైన సంగీతంతో. ఆ అలారం సవ్వడికి ధర్మారావుకి మెలకువ వచ్చింది. వేకువనే నాలుగున్నరకి రోజూ లేవడం అలవాటు.   బిగి కౌగిలిలో వున్న  తనూజను మరోసారి తనలోకి పొదువుకుంటూ, మరింతగా విజృంభించాడు. ఆ విజృంభణ వెనుక ఉన్నది  కోర్కా ? కర్తవ్యం నిర్వహించాలన్న తపననా?

పెరట్లో కోళ్ళు అరుస్తున్నట్లున్నాయి.

ధర్మారావు తలుపు తీసుకొని బయటకు వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అలారం అప్పటి నుండి అలా వరుసగా మూడోసారి సంగీతాన్ని వినిపిస్తోంది.

***

కోడలు మొహంలోకి తృప్తి నిండిన కళ్ళతో మందహాసంతో చూస్తోంది మాలతి. సిగ్గుతో తల వంచుకొని అత్త వంక చూడలేక వంటగదివైపు వెళ్ళి కాఫీ కలపసాగింది తనూజ. “ఈ రోజు, రేపు కూడా బాబుని త్వరగా రమ్మని చెప్పాను. నువ్వు పనులన్నీ త్వరగా ముగించుకొని మధ్యాహ్నం, హాయిగా నిద్రపో, నిద్రలేకపోతే మొహం పీక్కుపోతుంది.” వెనగ్గా వచ్చిన అత్త మాటలను వింటూ తన పనిలో తను పడిపోయింది తనూజ.

“నెలసరి అయి నిన్నటికి పదకొండు రోజులేగా” మధ్యాహ్నం భోజనాలకు వంట గదిలో కూరలు తరుగుతూ కోడలిని అడిగింది మాలతి. “అవును బాప్పా” (అత్తయ్యను బాప్పా అని పిలుస్తారు) అంది తనూజ. “నీకు తెలుసుగా నెలసరి అయిన పదో రోజు నుండి పద్దెనిమిదో రోజు వరకు శరీరంలో అండం విడుదల అవుతుంది. ఆ సమయంలో కలిస్తే తప్పకుండా గర్భం వస్తుంది. స్త్రీ పురుషుల్లో ఎలాంటి లోపాలు లేనప్పుడు, ఒక్కసారి కలిసినా చాలును. కానీ, అవకాశం వుందిగా, ఈ వారం రోజులు మీరిద్దరూ హాయిగా గడపండి”. తన ధోరణిలో తను చెప్పుకు పోతుంది మాలతి. తనూజకు చాలా సిగ్గుగా వుంది అత్త మొహంలోకి చూడలేకపోతుంది. మనసులోనే అత్తకు వేలవేలు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.

***

పెళ్ళయిన మూడో నెల నుండే “ఏం విశేషమా” అని ఇరుగుపోరుగువాళ్ళు అడగటం. “కోడలికేమైనా విశేషమా” అని అందరూ మాలతిని అడుగుతుంటే సమాధానం చెప్పలేక చచ్చేది మాలతి, తనూజ అయితే మానసికంగా ఎంతలా కుంగిపోయిందో మాలతికి తెలుసు.

ఇరుగు పొరుగులు ఊరకనే వుండరు. పిల్లకు పెళ్ళి అయ్యేవరకు పిల్లకు ఎప్పుడు పెళ్ళి చేస్తారు. ఎప్పుడు పెళ్ళి చేస్తారు అని అడుగుతుంటారు. తీరా పెళ్ళి అయిన తరువాత ఏంటి విశేషమా, అంటూ సాధిస్తారు. వీళ్ళ కెందుకో బాధ అర్థం కాదు. మాలతికి చాలా ఆస్తిని, ముగ్గురు పిల్లలను మిగిల్చి తక్కువ వయసులోనే కాలం చేశాడు భర్త సూర్యం. పిల్లలను పెంచి పెద్ద చేసి, ఆస్తులను ఎంతో చాకచక్యంగా చూసుకుంటూ వచ్చింది మాలతి. పెద్ద కొడుకు ధర్మారావు కాలేజీ చదువు పూర్తయిన వెంటనే, ఇంటి పెద్దరికం ధర్మారావుకి అప్పగించి, హాయిగా వీధిలో వచ్చిపోయే వాళ్ళతోనూ, ఇరుగుపొరుగులతోనూ మాటలతో కాలక్షేపం చేస్తూ, గడిపేస్తుంది మాలతి. భర్త వున్నప్పటి నుండి వార పత్రికలు, మాస పత్రికలు చదవడం అలవాటు మాలతికి. దాంతో చాలా విషయలు తెలుసు మాలతికి.

ఏ కూరలు ఎలా వండాలి, ఏ పళ్ళు ఎందుకు తినాలి, వేసవి కాలం ఎలా వుండాలి. శీతాకాలం వంటికి ఏం ఏం వాడాలి. గర్భం దాల్చడానికి ఏది సరయిన సమయం. దేన్నీ వదలకుండా ఎంతో శ్రద్ధతో చదువుతుంది మాలతి. ముఖ్యంగా డాక్టర్ సందేహాలు- సమాధానాల కాలమ్ వదలకుండా చదువుతుంది. బతుకుని హాయిగా గడపడం తెలుసు మాలతికి. పిల్లలతో కూడా ఎంతో స్నేహంగా వుంటుంది. పిల్లలకు కూడా తల్లిమాట జవదాటరు. ఏది చెప్పినా తమ మంచి కోసం, మన కుటుంబ క్షేమం కోసమేగా అని తలుస్తారు.

మాలతికి మొదటి సంతానం సత్య తరువాత ఇద్దరు అబ్బాయిలు. కూతురు సత్య పదిహేనేళ్ళ వయసుకే ఇరవై ఏళ్ళ అమ్మాయిలా కనిపించేది. మంచి ఆహారం తీసుకోవడం, ఆరోగ్యంగా వుండటంతో మంచి పొడుగు ఒడ్డుతో నవనవ లాడేది. ఎవరైనా ప్రేమ పేరుతో మొగ్గులోకి దింపి, అమ్మాయిని తమకి కాకుండా చేస్తారేమో అని హైస్కూల్ చదువుతోనే ఆపేసి 16 నిండగానే తమ్ముడికి ఇచ్చి పెళ్ళి చేసి తన పుట్టింటికి పంపేసింది. తరువాత ఇద్దరు మగ పిల్లలు. కూతురుకి పెళ్ళి చేసిన కొద్ది నెలలకే మాలతి భర్త గుండెపోటుతో పొలం పనులు చేయిస్తుండగా చనిపోయాడు. అప్పటి నుంచి మాలతి పిల్లలను, ఆస్తిని జాగ్రత్తగా చూసుకునేది. పిల్లలు కూడా తెలివయిన వాళ్ళే. పొలాలు, కూరగాయల హోల్‌సేల్ వ్యాపారం వుంది. మగ పిల్లలు ఇద్దరినీ ఇంటర్ వరకూ చదివించి, వ్యాపారంలోనే స్థిరపడేటట్టు చూసింది మాలతి. మగపిల్లలు ఇద్దరికి కూడా 19 ఏళ్ళు పూర్తి అయి 20లోకి అడుగు పెడుతుండగనే పెళ్ళిళ్ళు చేసేసింది మాలతి. ప్రేమ దోమ అని పక్కదారిపట్టారంటే ఆస్తి, వ్యాపారం పాడయిపోతాయని భయం. పెద్దాడికి పెళ్ళయిన మూడేళ్ళకే ఇద్దరు పిల్లల తండ్రయ్యాడు. చిన్నోడికే పెళ్ళయి ఎనిమిదేళ్ళు కావస్తున్నా పిల్లలు కలగలేదు. ఇరుగుపొరుగువాళ్ళే కాకుండా ఏ ఫంక్షన్లో కెళ్ళినా, ఏ పేరంటానికి వెళ్ళినా, చిన్న కోడలికి పిల్లలు లేరా అన్న దానిమీదే టాపిక్. మనసు చాలా బాధపడేది. చిన్న కోడలి పరిస్థితి మరీ దుర్భరంగా వుండేది. కొన్నిసార్లయితే నేను రాను నువ్వెళ్ళు బాప్పా అనేది. తోటి కోడలికి ఇద్దరు పిల్లలు. ఇల్లంతా కలివిడిగ తిరుగుతూ, కేరింతలతో ఆడుకుంటూ వుంటుంటే తనకు పిల్లలు లేరన్న దిగులు మరింత ఎక్కువయ్యేది. అత్తయ్య మంచిదే. బావగారు, భర్త మంచి వాళ్ళే కానీ, యీ పిల్లలు లేరనే బాధ అందరి మనసుల్లోనూ వుంది. ఎవ్వరూ బయటపడరు. పెద్దవాడి పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకోవడమో లేదా ఏదయినా అనాథ శరణాలయంనుండో, బంధువుల నుండో దత్తత తీసుకోవడంమో చేయ్యొచ్చు కానీ, చిన్న కోడలి పిల్ల కలగలేదన్నది పోదుకదా అని ఆలోచించేది మాలతి. డాక్టర్ల దగ్గరకి తీసుకెళ్ళేది. ఏవేవో మందులు వ్రాసి ఇచ్చేవారు వాడించేది. గొప్ప విషయం ఏమిటంటే మాలతికి దేవుళ్ళ మీద గుడులు గోపురాలు, బాబాల మీద నమ్మకం లేక పోవడం. ఇంట్లో మగ పిల్లలు ఇద్దరూ లేనప్పుడు, పెద్ద కోడలు పిల్లలను స్కూలకి తీసుకెళ్ళి తెచ్చినపుడు లేదా పిల్లలకు వాళ్ళ గదిలో హోంవర్క్ చేయిస్తున్నపుడో, వీలయినపుడంతా చిన్న కోడలుతో ఎన్నో ముచ్చట్లు ఆడేది. పిల్లలు కలగకపోవడమనేది మనసుకి బాధ కలిగించే విషయమే కానీ, బాధ పడాల్సిన విషయం కాదని, సమాజంలో దీని కోసం ఎన్నో ఇతర మార్గాలున్నాయని చెప్పేది. టెస్ట్ ట్యూబ్ బేబి, సరోగసీ వాటిమీద మాలతికే కాదు, ఇంట్లో అందరికి అయిష్టతే. ఓ సామాజిక వర్గంలో అయితే వయసులోవున్న మగపిల్లలు బయట ఇతర స్త్రీలతో సంపర్కం పెట్టుకొంటే లేదా వేశ్యలతో కలిసినా, ఆరోగ్యం పాడు, డబ్బు ఖర్చు కుటుంబ పరువుపోవడం ఇలా అనేక నష్టాలు వుంటాయని ఇంట్లో వదినలతోనే సంపర్కం పెట్టుకోనిస్తారు. అలాగే వయసులో వున్న కొడుకు గానీ ఏ కారణం వలనో చనిపోతే , ఆ కోడలు ఇతర పురుషులతో సంపర్కం పెట్టుకొంటే కుటుంబ పరువు ప్రతిష్ఠలు మంటగలుస్తాయని, ఇంట్లో వున్న మిగతా పిల్లలు అంటే మరుదులుతో లేదా బావలతోనే సంపర్కం పెట్టుకోవచ్చునని అది తప్పు కాదని చెప్తారు. నిజానికి ఈ వ్యవహారమంతా ఆరోగ్యకరమయినదే అని భావిస్తారు. ఇలాంటి అవకాశం మిగతా సమాజంలో లేకపోవడం వలనే ఇతరులతో అక్రమ సంబంధాలు, మాన భంగాలు, హత్యలు, విడాకులు లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, ఇలాంటి విషయాలు చెబుతుండేది మాలతి. వింటూ, వింటూ ‘ఏమిటి బాప్పా ఇవన్నీ నాకు చెపుతున్నావ్’ అని అడక్కుండానే, అత్తయ్య మనస్సులో ఏం వుందో చూచాయగా గ్రహించింది తనూజ. కోడలుకు అర్థమవుతుందని అత్తకు తెలుస్తుంది.

***

మాలతి పెద్ద కోడలు సువర్ణ పుట్టింట్లో మేనల్లుడి పెళ్ళి తేదీ ఖరారయింది. పెళ్ళి పది రోజులుందనగా సువర్ణను పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళారు. పెళ్ళికి అందరూ రావాలని చెప్పి వెళ్ళారు. పెళ్ళి తరువాత మరో పదహారు రోజులుంటుందని చెప్పారు. సేంద్రీయ ఎరువులతో వ్యవసాయాన్ని గిట్టుబాటుగా ఎలా చేసుకోవచ్చో, వ్యవసాయ క్షేత్రాల్లో చేసి చూపి, నేర్పించే తరగతులు కోసం చిన్న కొడుకు 15 రోజులపాటు నెల్లూరు జిల్లాకి వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు. ఇంట్లో తను, చిన్న కోడలు, పెద్ద కొడుకే వున్నారు. మాలతికి కర్తవ్యం బోధపడింది. చిన్న కోడలు తనూజను దగ్గరకు తీసుకొని బోధపరిచింది. “నీ కడుపు పండాలంటే మరోదారి వుంది. నేను పెద్దోడికి నచ్చ చెపుతాను. నీ బాధ చూడలే పోతున్నాను. ఈ వారం రోజులు హాయిగా గడుపు. నే చెపుతున్నాను కదా. మరేం ఫరవాలేదు” అంది. తనూజ మౌనంగానే అంగీకరించింది.

పెద్ద కొడుకు ధర్మారావుని మధ్యాహ్నం భోజనం తరువాత మాలతి తన గదికి పిలిచి పరిస్థితి వివరించింది. తమ్ముడు, మరదలు మానసిక స్థితి, అంతః సంఘర్షణ తెలిపింది. సంఘంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సూదుల్లాంటి మాటలు నీకు తెలిసినవే కదా అని వివరించింది.

మన ముగ్గురి మధ్యే ఈ రహస్యం వుంటుందని బ్రతిమాలింది. దీనివలన తప్పులేదని, ఇది నియోగం అంటారని, మన గ్రంథాలు చెపుతున్నాయని మన పురాణాలు ఇదిహాసాల్లో ఇలాంటి సంఘటనలు వున్నాయని తెలిపింది. మన కుటుంబంలోను, మరదలి పుట్టింటివాళ్ళ కుటుంబంలోనూ ఆనందం వెల్లివిరుస్తుందని నచ్చజెప్పి చివరకు ధర్మారావును ఒప్పించింది మాలతి.

***

మాలతికి పట్టరానంత సంతోషంగా వుంది. చిన్నకోడలు గర్భవతి అని ఊరువాడ దండోరాలా తెలిపింది. ఇల్లంతా పండగ వాతావరణం తలపించింది. తనూజను పురిటి కోసం పుట్టింటివాళ్ళ వచ్చి తీసుకెళ్ళారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పి కోడలిని పంపింది మాలతి. పండంటి కవలలతో పుట్టింటి నుండి వచ్చింది తనూజ.

చివరిగా: ఎనిమిదో నెలలో తనూజ, భర్తకి ఫోన్ చేసింది. చూడాలని వుంది రమ్మని. వెంటనే బయలుదేరి వెళ్ళాడు. ఆరోగ్యం ఎలా వుందని అడిగాడు. కడుపులో బరువుకంటే గుండెలో బరువు ఎక్కువగా వుందని అంతా చెప్పింది తనూజ భర్తతో. తనకి అంతా తెలుసునని, వదిన తనకి అంతా చెప్పిందని, అందుకే నేను అదే సమయంలో సేంద్రీయ వ్యవసాయం అంటూ వెళ్ళానని, వదినను, మా అందరికంటే ముందే అమ్మ ప్రిపేర్ చేసిందని తెలిపాడు. తనూజ గుండె బరువు ఒక్కసారిగా దిగింది. భర్తను కన్నీటితో అభిషేకించింది.

Exit mobile version